Site icon Sanchika

అలనాటి అపురూపాలు-38

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపరూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

నటి రాఖీ గుల్జార్ జీవితం:

కొందరు నటీనటులు ఎంత పేరు తెచ్చుకున్నా, వ్యక్తిగత జీవితానికొచ్చేసరికి, గోప్యతకి ప్రాముఖ్యతనిచ్చి, జన సందోహాలకు దూరంగా తమ జీవితం తాము గడుపుతారు. అలాంటివారిలో నటి రాఖీ ఒకరు.

మన దేశానికి స్వతంత్ర్యం వచ్చిన రోజునే అంటే 15 ఆగస్టు 1947 నాడు రాఖీ జన్మించారు. అందమైన కళ్ళున్న ఈ నటి పశ్చిమ బెంగాల్ లోని రానాఘాట్ అనే గ్రామంలో పుట్టారు. టీనేజ్‍లో ఉండగానే రాఖీకి జర్నలిస్ట్, బెంగాలీ సినీ నిర్మాత అయిన అజోయ్ బిస్వాస్‌తో పెళ్ళి చేశారు పెద్దలు. అయితే ఆ వైవాహిక బంధం ఎక్కువ కాలం నిలవలేదు. అదలా ఉండగా, ఆమె కొల్‌కతాలో ‘బధు బరన్’ (1967) అనే చిత్రంతో బెంగాలీ చిత్రసీమలో ప్రవేశించారు. తరువాత సునీల్ దత్ తన సినిమా ‘రేష్మా ఔర్ షీరా’ (1972)లో ఆమెకు అవకాశమిచ్చారు. కుటుంబ రాజకీయాలకు బలైన వ్యక్తికి నూతన వధువుగా ఆ సినిమాలో నటించారామె. ‘లాల్ పత్థర్’ (1971)లో ఆమె జమీందార్ రాజ్ కుమార్ చిన్న భార్యగా నటించారు. పెద్ద భార్య హేమమాలినికి కోపం తెప్పిస్తారు. రాజశ్రీ వారి ‘జీవన్ మృత్యు’ (1970) ఆమె కెరీర్‍కి ఊపిరి పోసింది. ధర్మేంద్రతో ఆమెపై తీసిన ‘ఝిల్ మిల్ సితారోం కా ఆంగన్ హోగా’ అనే యుగళగీతం ఈనాటికీ చాలామందిని ఆకట్టుకునే పాటగా మిగిలింది. చీర ధరించి ‘ఆదర్శ భారతీయ భార్య’లా కనబడతారామె. శశికపూర్ సరసన ఆమె ద్విపాత్రాభినయం చేసిన సుబోధ్ ముఖర్జీ ‘షర్మీలీ’ (1971) చిత్రం ఆమెను ప్రముఖ హీరోయిన్‌లలో ఒకరిగా చేసింది.

ఆ తరువాత ఆమె ధర్మేంద్ర, శత్రుఘ్న సిన్హాలతో ‘బ్లాక్‍మెయిల్’ (1973) చిత్రంలో నటించారు. ఆ చిత్రంలో ఆమె నటన అద్భుతం. ఆ చిత్రంలోని ‘పల్ పల్ దిల్ కే పాస్’ అనే పాట ఇప్పటికీ గొప్ప రొమాంటిక్ పాటలలో ఒకటిగా నిలుస్తుంది. (ఆ పాటని యూట్యూబ్‌లో ఈ లింక్‌లో చూడవచ్చు – https://www.youtube.com/watch?v=viKdF7sp_cY).

వెండితెరపై రాఖీ ఎందరీ హీరోలతో జతకట్టారు.  రాజేష్ ఖన్నాతో షెహ్‌జాదా (1972), దాగ్ (1973), ఎ పోయెమ్ ఆఫ్ లవ్, ఆంచల్ (1980) అనే చిత్రాలలో నటించారు. ఆంచల్ చిత్రంలో – తన మరిదితో సంబంధం పెట్టుకున్నారని ఆరోపణలు ఎదుర్కునే మహిళగా – ఆమె నటించారు. ఆమె దేవ్ ఆనంద్‌తో హీరా పన్నా, బనారసీ బాబు, లూట్‌మార్, జోషిలా (అన్నీ 1973 లోవే) చిత్రాలలో నటించారు. పరీక్షిత్ సహానీతో ఆమె తపస్యా (1976), హమ్‍కదమ్ (1980) అనే రెండు సినిమాలో నటించారు. రెండూ గొప్ప హిట్‌లే. సంజీవ్ కుమార్‍తో ఆమె పరాస్ (1971), హమారే తుమ్హారే (1979), శ్రీమాన్ శ్రీమతి (1982) అనే చిత్రాలలో నటించారు. రాఖీ శశికపూర్‌తో – షర్మీలీ (1971), జాన్వర్ ఔర్ ఇన్సాన్ (1972), కభీ కభీ (1976), త్రిష్ణ (1978), పిగల్‌తా ఆస్మాన్ (1985), దూస్రా ఆద్మీ (1977) వంటి పది చిత్రాలలో నటించారు. రాఖీ, అమితాబ్ బచ్చన్‌ల జోడీ తెరపై అద్భుతంగా ఉండేది. తెరపై వారిద్దరి మధ్య చక్కని కెమిస్ట్రీ పండేది. వెండితెర మీదే కాకుండా, బయట కూడా వారి బంధం బలపడింది. వారిద్దరూ కభీ కభీ (1976), ముకద్దర్ కా సికిందర్ (1977), త్రిశూల్ (1978), కాలా పత్థర్ (1979), బర్సాత్ కీ ఏక్ రాత్ (1979), జుర్మానా (1979), బేమిసాల్ (1982) వంటి చిత్రాలలో ప్రేక్షకులని అలరించారు. వాణిజ్య పరిమితులోనే స్త్రీ-ప్రధాన పాత్రలు పోషించగలగడం రాఖీ అదృష్టం. 

రమేష్ తల్వార్ గారి దూస్రా ఆద్మీ (1977) లో ఆమె తనకన్నా వయసులో చిన్నవాడైన తన జూనియర్ ఉద్యోగి పట్ల ఆకర్షితులయ్యే ఆర్కిటెక్ట్‌గా నటించారు, ఆ యువకుడు చనిపోయిన ఆమె ప్రియుడిగా ఉండడం అందుకు కారణం. ‘శ్రద్ధాంజలి’ చిత్రంలో ప్రతీకారం తీర్చుకునే పాత్ర కాగా, ‘బసేరా’ చిత్రంలో (రెండూ 1982లోవే) మానసిక సమతౌల్యం కోల్పోయి జీవితాన్ని అల్లకల్లోలం చేసుకున్న తన సోదరి రేఖ కుటుంబాన్ని నిలబెట్టే పాత్ర. అయితే ఆమెలోని గొప్ప నటిని బయటకి తీసింది మాత్రం అపర్ణా సేన్ తీసిన ‘పరోమా’ (1984). ఈ సినిమాలో ఆమె నలభై ఏళ్ళు దాటిన గృహిణిగా నటించారు, అక్రమ సంబంధం ద్వారా కోరికలు తీర్చుకునే పాత్ర అది. తల్లి పాత్రలు పోషించడానికి ఇతర నటీమణులు వెనుకాడుతుంటే, రాఖీ మాత్రం వెరవకుండా తల్లి పాత్రలు ధరించారు. నిజానికి, అమితాబ్ పక్కన ఎన్నో సినిమాలలో ప్రేయసిగా నటించిన రాఖీ, ‘శక్తి’ (1982) సినిమాలో ఆయనకు తల్లిగా నటించారు. తండ్రీ కొడుకులుగా నటించిన దిలీప్ కుమార్, అమితాబ్‌ల మధ్య గొడవలను ఆమె చక్కదిద్దుతారు. ఆపై ఎన్నో సినిమాలో – అనిల్ కపూర్ (రామ్ లఖన్, 1989), సంజయ్ దత్ (ఖల్ నాయక్ 1993), అక్షయ్ కుమార్ ( సౌగంధ్ 1991), షారూక్ ఖాన్ (బాజీగర్ 1993, కరణ్ అర్జున్ 1995, బాద్‌షా 1999) వంటి ఎందరో హీరోలకు తల్లిగా నటించారు. కల్పనా లాజ్మీ తీసిన ‘రుదాలి’ (1993) సినిమా తప్పక ప్రస్తావించాలి, ఇందులో రాఖీ ‘వృత్తిపరం’గా రోదించే మహిళ పాత్ర పోషించారు. సహస్రాబ్దిలో నటన నుంచి విరమించుకున్నారు. రీతూపర్ణా ఘోష్ తీసిన ‘శుభో ముహూరత్’ (2003) ఆమె చివరి సినిమా. ఈ సినిమా అలనాటి తన పోటీదారు షర్మీలా టాగోర్‍తో కలిసి నటించారు. జర్నలిస్ట్ అయిన తన మేనకోడలికి ఒక హత్య రహస్యాన్ని ఛేదించడంలో సాయం చేసే అత్త పాత్ర పోషించారు. ఈ సినిమాకి గాను ఆమెకి జాతీయ ఉత్తమ సహాయనటి పురస్కారం లభించింది.

రాఖీ గీత రచయితా, దర్శకుడు అయిన గుల్జార్‌ని 15 మే 1973న వివాహం చేసుకున్నారు. బెంగాల్ అన్నా, ఆ సంస్కృతి అన్నా ఉన్న యిష్టంతో ఈ పెళ్ళి చేసుకున్నారు గుల్జార్. కూతురు మేఘన పుట్టిన ఏడాదికి వాళ్ళు విడిపోయారు. రాఖీ మళ్ళీ సినిమాలలో నటించాలని అనుకోవడమే ఇందుకు కారణమని అంటారు. యష్ చోప్రా గారి ‘కభీ కభీ’ అంగీకరించంతో వారి దారులు వేరయ్యాయి. అది ఓ కఠినమైన నిర్ణయం. “నా జీవితంలో అతి పెద్ద ‘చిన్న కథ’ ” అంటూ రాఖీ గురించి అన్నారట గుల్జార్. టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… “ఆయన (యష్ చోప్రా) ‘కభీ కభీ’ సినిమా ఆఫర్ మా పెళ్ళయ్యాక ఇచ్చారు. నన్ను దృష్టిలో ఉంచుకునే ఆ సినిమా కథని రూపొందించారు అనుకుంటాను” అన్నారు. 2012లో టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన మరో ఇంటర్వ్యూలో “ఎందుకు మీరు ఏకాంతాన్ని ఇష్టపడతారు?” అనే ప్రశ్నకు జవాబుగా, “నేను ఎందుకు ప్రజల దృష్టిలో ఉండాలి? నాకు ఎక్కువ డబ్బు అవసరం లేదు. నాకికపై ఏ బాధ్యతలు లేవు. నాకు నా స్వేచ్ఛ అంటే ఇష్టం. ప్రశ్నించడానికి నాకెవ్వరూ లేరు. సుదీర్ఘ కాలంగా నాకున్నవంతా పన్వేల్ సమీపంలోని నా ఫార్మ్ హౌస్, నా పెంపుడు జంతువులే. బహుశా నా గత జన్మలో నేను జంతుప్రపంచానికి చెందినదాన్నై ఉంటాను. ఇక, పుస్తకాలు ఉన్నాయి. నేనెంతో సంతోషంగా, తృప్తిగా ఉన్నాను” అన్నారు రాఖీ.


‘కెమెరామేన్ అన్నయ్య’ సినీమాటోగ్రాఫర్ డి.ఎల్. నారాయణ:

ప్రముఖ సినీమాటోగ్రాఫర్ శ్రీ డి.ఎల్. నారాయణ ‘కెమెరామేన్ అన్నయ్య’గా చిత్ర పరిశ్రమలో ప్రసిద్ధులు. చాలామంది ఈయనను వినోదా బ్యానర్‌పై 1953నాటి ‘దేవదాసు’ చిత్రాన్ని నిర్మించిన డి.ఎల్. నారాయణగా పొరపడతారు. ఈయన కర్నాటక లోని అప్పటి మైసూరు జిల్లా చిత్రదుర్గలో 12 జనవరి 1924న జన్మించారు. ఈయన ప్రముఖ దర్శకనిర్మాత హెచ్.ఎం.రెడ్డి గారి మనవడు. 1941లో 17 ఏళ్ళ వయసులో ప్రాగ్జ్యోతి స్టూడియోలో పని చేసే గొప్ప సినీమాటోగ్రాఫర్ కె. రామ్‌నోథ్ వద్ద సహాయకుడిగా పనిచేసేందుకు మద్రాసు వెళ్ళారు. ఆయనకు రోజుకు నాలుగు అణాల జీతంతో పని దొరికింది. ఆ డబ్బుకు ఆ రోజుల్లో రోజంతా సరిపోయేలా ఫుల్ మీల్స్ వచ్చేది. ఆ రోజుల్లో కెమెరామెన్‌లకు సాంకేతిక సౌలభ్యాలు ఉండేవి కావు. ఉన్నవాటితోనే సర్దుకోవాల్సి వచ్చేది. అవుట్‌డోర్ షూటింగ్‌లలో రిఫ్లెక్టర్లు వాడేవారు.

డి.ఎల్. నారాయణకి పూర్తిస్థాయి కెమెరామెన్‌గా మొదటి అవకాశం ఎల్.వి. ప్రసాద్ స్వయంగా హీరోగా నటిస్తూ నిర్మించిన ‘సత్యమే జయం’ సినిమాలో అవకాశం వచ్చింది (ఈ చిత్రం గురించి నాకు ఎక్కువగా వివరాలు తెలియవు). రెండో ప్రపంచ యుద్ధం ఉధృతంగా ఉన్న ఆ సమయంలో డి.ఎల్. గారి తాతగారు మద్రాసు విడిచి మైసూరుకు వెళ్ళిపోయారు. మద్రాసు తన కెరీర్‍కు అనుకూలంగా లేదని ఆయన భావించారు. అందుకని పూనా వెళ్ళి షాలిమార్‍ స్టూడియోలో చేరారు. అక్కడ ఆయన డబ్ల్యూ.జెడ్. అహ్మద్ వద్ద పని చేశారు. కొన్ని సినిమాలకు కోట్నీస్ వద్ద పని చేశారు. మీర్జాపురం జమీందారుకి వీరి పనితనం నచ్చి, 1949 నాటి ‘కీలుగుర్రం’ సినిమాకి కెమెరామెన్‌గా అవకాశం ఇచ్చారు. ఆ సినిమా గొప్ప హిట్ అయింది. ఆ తరువాత ఆయన ‘తిలోత్తమ’ (1951), ‘ప్రియురాలు’ (1951), ‘లక్ష్మమ్మ’ (1950) వంటి సినిమాలకు పని చేశారు. 1951లో ఆయన స్టూడియోలను విడిచిపెట్టి స్వతంత్ర్యంగా పనిచేయడం ఆరంభించారు. అలా 1953లో ‘ఆదర్శం’ చిత్రానికి పనిచేశారు. వాళ్ళ తాతగారు ఆయనను పిలిపించి తాను కాంతారావు, సావిత్రి, రాజనాల, గిరిజ గార్లతో తీస్తున్న ‘ప్రతిజ్ఞ’ సినిమాకి పనిచేయవలసిందిగా కోరారు.

ఆ తరువాత ఆయన ఫ్రీలాన్సర్‌గా – ‘వద్దంటే డబ్బు’, ‘పెంకి పెళ్ళాం’, ‘శోభ’, ‘బండరాముడు’, దాని తమిళ వెర్షన్ ‘అతిశయ తిరుడన్’, ‘మహా కవి కాళిదాసు’, ‘మహామంత్రి తిమ్మరుసు’, ‘రాముడు భీముడు’, ‘శ్రీ కృష్ణావతారం’ వంటి సినిమాలకు పనిచేశారు. ప్రపంచంలోని ఏ డిప్లొమాలూ ఎవరికీ సినిమాటోగ్రఫీ నేర్పలేవని ఆయన అనేవారు. ఆ డిప్లోమాలు సాంకేతిక అంశాలు బోధించగలవేమో గాని, కళ అనేది స్వతఃసిద్ధంగా, అనుభవంతో అలవడేది అనేవారు.

Exit mobile version