అలనాటి అపురూపాలు-42

0
3

సినిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపరూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

నాన్న జ్ఞాపకాలు పదిలం:

సుప్రసిధ్ధ హిందీ నటులు రాజ్ కుమార్ గురించి వారి కుమారుడు పురు రాజ్ కుమార్ మాటల్లో విందాం.

“నాన్నతో నా మొదటి జ్ఞాపకం – నాకు సుమారు రెండేళ్ళ వయసులో అమ్మ ఒళ్ళోంచి నాన్న ఒళ్ళోకి దూకటం! మా చిన్నప్పుడు అమ్మ (గాయత్రి), నాన్న, తమ్ముడు పాణిని, సోదరి వాస్తవికత తో కలిసి ప్రతీ ఏటా, 1987 వరకూ కాశ్మీరులో గడిపిన రెండున్నర నెలల వేసవి సెలవలు నాకెంతో గుర్తు! ముందు శ్రీనగర్‍లో ఆగేవాళ్ళం, తర్వాత అక్కడ్నించి గుల్‌మార్గ్, పహల్‍గాం వెళ్ళేవాళ్ళం, అక్కడ మేం ఓ చెక్క ఇంట్లో ఉండేవాళ్ళం. పగటి పూట గోల్ఫ్ ఆడేవాళ్ళం, గుర్రపు స్వారీ చేసేవాళ్ళం లేదా టేబుల్ టెన్నిస్ ఆడేవాళ్ళం. నాన్న అమ్మతో కలిసి ట్రెక్కింగ్‍కి వెళ్ళేవారు. సాయంత్రాలు బార్బెక్యూ తినేవాళ్లం. నాకు 14 ఏళ్ళు ఉన్నప్పుడు అమ్మ పుట్టిన రోజు సందర్భంగా నాన్న పార్టీ ఏర్పాటు చేశారు. కొలకతా, ఢిల్లీ, ముంబాయి, గుల్‍మార్గ్ నుంచి దాదాపు 200 మంది మిత్రులు వచ్చారు. పాటలు పాడారు, నృత్యాలు చేశారు. నాన్నకి శాస్త్రీయ సంగీతమన్నా, ఘజల్స్ అన్నా ఇష్టం. ‘అయే దిల్-ఎ-నాదాన్’ (రజియా సుల్తాన్) పెడితే, లోయ అంతా మాధుర్యం ప్రతిధ్వనించేది. నాన్న దృష్టిలో ప్రపంచంలోకెల్లా గొప్ప అందగత్తె అమ్మే. పెళ్ళికి ముందు అమ్మ ఎయిర్‍హోస్టెస్‍గా పనిచేసేది. నాన్న అమ్మని ఓ ప్రయాణంలో విమానంలో కలిసారుట. వారి మధ్య ప్రేమ అంకురించి, (60లలో) పెళ్ళి చేసుకున్నారు. అమ్మ ఆంగ్లో-ఇండియన్. అమ్మ అసలు పేరు జెన్నీఫర్. తర్వాత అమ్మ జాతకం ప్రకారం ‘గాయత్రి’ అని పేరు మార్చుకుంది. మాకు అన్ని మతాల పట్ల విశ్వాసం ఉండేట్టు పెంచారు. మేం చర్చిలకి, దర్గాలకి, గుళ్ళకి, సైనాగోగ్‍కి వెళ్ళేవాళ్ళం. చిన్నప్పుడు మేం వర్లి సీఫేస్‍ భవంతిలో ఉండేవాళ్ళం. మేం గ్రీన్ లాన్స్ స్కూల్‍లో చదివాం. మా ఇంటికి రంగులు వేస్తున్నప్పుడు, మేం తాత్కాలికంగా మా జుహూ బంగ్లాకి మారాం. నాన్న తన చెవర్లెట్ కార్లో మమ్మల్ని సూల్లో దింపేవారు. మా అమ్మానాన్నలు మమ్మల్ని గారాబం చేసేవారు కానీ ఎన్నడూ చెడగొట్టలేదు. బొమ్మల కొట్లోంచి ఏమడిగినా దొరికేది కాదు. నాన్నకి మమ్మల్ని క్రమశిక్షణలో ఉంచడం ఇష్టం, అలా అని క్లాసులో ఫస్ట్ వచ్చేయాలని మా మీద ఒత్తిడి పెట్టలేదు. పైగా, అవుట్ డోర్ యాక్టివిటీస్‍లో పాల్గొనేలా, పుస్తకాలు చదివేలా, లలిత కళలలోనూ ప్రోత్సాహించారు. నేషనల్ జియోగ్రఫిక్, రీడర్స్ డైజెస్ట్ వంటి మ్యాగజైన్స్ ఇంటికి తెప్పించేవారు. మమ్మల్నేదో మేధావులుగా తీర్చిదిద్దాలని కాదు, అన్నిటి గురించి తెలుసుకోవాలని ఆయన ఉద్దేశం!

ఆయన స్టార్‌డమ్ ప్రభావం మాపై పడనిచ్చేవారు కాదు. చెయ్యెత్తితే, నౌకర్లు ‘అయ్యగారూ’ అంటూ పరిగెత్తుకొచ్చేలా పెంచలేదు మమ్మల్ని. యువకుడిగా ఉన్నప్పుడు నాన్నతో వాదించేవాడిని. అప్పట్లో దూకుడుగా ఉండేవాడిని. “గోల్ఫ్ ఆడతావా?” అని నాన్న అడిగితే, “ఆడను” అనేవాణ్ణి. “ఎందుకు?” అని అడిగితే “ఆడాలని లేదు” అనేవాణ్ణి. “నాన్నతో ఇలాగేనా మాట్లాడేది?” అనేవారు కోపంగా. కానీ నాన్న మనసు వెన్న. అమెరికాలో నన్ను కాలేజీలో దింపడానికి వచ్చినప్పుడు, వెళ్తూ ఏడ్చేశారు. ‘అయ్యో, ఏంటిది’ అనుకున్నా. సినిమాల్లో లార్జర్-దాన్-లైఫ్‍గా కనిపించే ఆ మనిషిని అలా ఏడవడం చూడలేకపోయాను.

నాన్న రొమాంటిక్ వ్యక్తి. అమ్మతో కలిసి జీప్‌లో వెళ్తూ, పెద్దార్ రోడ్‍లో పాన్ కోసం ఆగడం వంటి చిన్న చిన్న విషయాలలో కూడా రొమాంటిక్‍గా ఉండేవారు. కలిసి టీవీ చూడడాన్ని లేదా కలిసి పుస్తకం చదువుకోడాన్ని వాళ్ళు బాగా ఆస్వాదించేవారు. మధ్యాహ్న భోజనానికి ఏం వండుకోవాలో చాలా సేపు మాట్లాడుకునేవారు. అమ్మ అన్నీ రుచికరంగా తయారు చేసి, చిన్న ప్రశంస కోసం ఎదురుచూసేది. నాన్నేమో పట్టించుకోనట్టుగా తినేసేవారు. కొన్ని గంటలయ్యాకా, శూన్యం లోకి చూస్తూ “ఇవాళ నువ్వు చేసిన పదార్థాలు అద్భుతంగా ఉన్నాయ్” అనేవారు. వాళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు ఉండేవి, కానీ మా ముందు బయటపడేవారు కాదు. అమ్మ ఓ గదిలో కూర్చుని గోడ కేసి చూస్తూ ఉండేది, నాన్న సముద్రం కేసి చూస్తూండేవారు. వాళ్ళిద్దరి మధ్య రాయబారం నాది! “అమ్మకి చెప్పు, నేను తనతో మాట్లాడడం లేదని” అనేవారు. “నాకది తెలుసు… కొత్త విషయం చెప్పమను” అనేది. నేను నాన్న దగ్గరకి వెళ్ళి ఆ మాటలు చెప్పేవాడిని… చివరికి వాళ్ళే రాజీపడేవారు. నాన్న ఓ స్టార్ కావడంతో అమ్మలో కాస్త అభద్రతాభావం ఉండడం సహజమే. కానీ అమ్మ తన భావాలనెప్పుడూ మాతో పంచుకోలేదు. బహిరంగ కార్యక్రమాలలో నాన్నతో బాటు ఎందుకు పాలు పంచుకోలేదో నాకు తెలియదు. బహుశా అమ్మకి అవి అంత సౌకర్యవంతంగా ఉండేవి కావేమో. ఏవైనా సందర్భాలలో నాన్న అమ్మకి ఏవీ కానుకలు కూడా ఇచ్చినట్టులేదు. అయితే ‘హాలీడే’ విషయంలో మాత్రం మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసేవారు.

నాన్న తన రోజుని – కాశ్మీరీ పానీయం – కహ్వాతో ప్రారంభించేవారు తర్వాత బ్లాక్ టీ, తేనె, బాదంపప్పులు, తులసి ఆకులు! షూటింగ్ లేని రోజుల్లో పగలు, రాత్రి కుటుంబంతోనే భోంచేసేవారు. కాశ్మీరీ పండిట్ కావడంతో, ఆయన రోగాజ్ జోష్, బైంగన్ చమన్ (పనీర్), కసూరీ మేథీ ఇష్టపడేవారు. కాంటినెంటల్ ఫుడ్‍ని కూడా ఆస్వాదించేవారు. ఒక్కోసారి ఆయన వంట చేసేవారు. అప్పుడప్పుడూ వంటగదిలో పాయసం చేస్తూ కనిపించేవారు. ఎనిమిది గంటలకి రాత్రి భోజనం మేథీ పరోటాలను ఇష్టంగా తినేవారు. ఆయన మితాహారి, కానీ గోల్ఫ్ ఆడడం వల్ల ఫిట్‍గా ఉండేవారు. వర్లి లోని ఓల్డ్ అమెచ్యూర్స్ రైడర్స్ క్లబ్ వద్ద గుర్రపు స్వారీ చేసేవారు. అమ్మకి కూడా గుర్రపు స్వారీ వచ్చు. గుల్‌మార్గ్‌లో వాళ్ళిద్దరూ కలిసి చాలాసార్లు గుర్రపు స్వారీ చేసేవారు. నాన్నకి ఫాషన్స్ అంటే ఆసక్తి ఉంది గానీ, వెర్రి లేదు. కుర్తా పైజమా, ప్యాంట్ షర్ట్స్ వేసుకుని కాళ్ళకి చెక్క శాండల్స్ వేసుకోడానికి ఇష్టపడేవారు. స్విట్జర్లాండ్, లండన్ వంటి చోట్లకి వెళ్ళినప్పుడల్లా ఏవో ఒకటి నేర్చుకుని వచ్చి ఇక్కడ పాటించేవారు. ఒకసారి ఇంట్లో కర్టెన్ల కోసమని గుడ్డ ముక్క తెప్పించగా, ఒక వారం తర్వాత ఆ గుడ్డ ముక్క నుంచి ఓ చొక్కా కుట్టించుకుని తిరిగారాయన. అలా వుంటుందీ ఆయన వ్యవహారం! నాన్న పైప్ తాగేవారు, ఆయన దగ్గర ఎన్నో పైప్‍లు ఉన్నాయి. ‘కాట్ ఐ’ సన్ గ్లాసులంటే నాన్నకి ఇష్టం. అలాగే కార్లన్నా చాలా ఇష్టం. చెవర్లెట్, మెర్సీడెస్, వోక్స్‌వాగన్, ఇంకా విల్లీస్ జీప్ ఉండేవి.

1940లలో నాన్న పోలీస్ శాఖలో పనిచేసేవారు. ఓసారి మెట్రో థియేటర్‍లో సినిమా చూడ్డానికి వెళ్ళినప్పుడు ప్రసిద్ధ నిర్మాత సోహ్రాబ్ మోడి నాన్నని చూసి, సినిమాల్లో నటించేందుకు అవకాశమిచ్చారట. అప్పుడు నాన్న తిరస్కరించారట. కాని తర్వాత ఆయనతో ‘నౌషేర్‌వాన్-ఏ-ఆదిల్’ (1957) అనే సినిమాకి పనిచేశారు. తర్వాత 1957-1963 మధ్యలో ‘మదర్ ఇండియా’, ‘దిల్ అపనా ప్రీత్ పరాయి’, ‘దిల్ ఏక్ మందిర్’ తదితర చిత్రాలకు పనిచేశారు. ‘వక్త్’ (1965) సినిమా నుంచి తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పాటు చేసుకున్నారు. 60వ దశకం చివర్లో ‘కాజల్’, ‘హమ్‌రాజ్’, ‘నీల్ కమల్’ వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేకతని కల్పించుకున్నారు. ఆయనకి రొమాంటిక్ పాత్రలు అంతగా నప్పవని కొందరు అనేవారు.. మరి ‘హీర్ రాంఝా’, ‘లాల్ పత్థర్’, ‘పాకీజా’ (70వ దశకం తొలినాళ్ళు) సినిమాల సంగతేంటి? అంతకంటే రొమాంటిక్‌గా చేయగలరా? వ్యక్తిగతంగా నాకు నాన్న సినిమాలలో ‘కర్మయోగి’, ‘బులంది’, ‘పోలీస్ పబ్లిక్’, ‘సౌదాగర్’ (1978-1991 మధ్య వచ్చినవి) అంటే ఇష్టం. నాన్న సినిమాల షూటింగ్‍లు సెట్‌లో జరుగుతున్నప్పుడు ఎప్పుడూ మేం వెళ్ళలేదు. అయితే ఒకసారి మేం సెలవల్లో మనాలి వెళ్ళినప్పుడు అక్కడ ‘సౌదాగర్’ చిత్రం కోసం నాన్న దిలీప్ సాబ్‍తో కలిసి షూటింగ్‍లో ఉన్నారు. ‘ఇమ్లీ కా బూటా’ అనే పాటని చిత్రీకరిస్తున్నారు. దిలీప్ సాబ్, నాన్న డాన్స్ స్టెప్స్ రిహార్సల్స్ చేయడం చూశాం. నాన్న గొప్ప డాన్సర్ కాదు, డాన్స్ చేయాలంటే ఆయనకి చాలా అసౌకర్యంగా ఉండేది. ‘దిల్ కా రాజా’ (1972) చూస్తున్నప్పుడు, నా మొహం దాచుకున్నాను. ఆయన కన్నా నేను బాగా డాన్స్ చేస్తాను.

అనారోగ్యంతో బాధపడిన కాలంలో తప్ప, ఆయన నిరుత్సాహంగా ఉండడం నేనెప్పుడూ చూడలేదు. అది కష్టకాలం. అవి చేదు జ్ఞాపకాలు. ఆయనకి బ్లడ్ కాన్సర్ సోకింది. గ్రంధులలో గడ్డలు వచ్చేవి. కీమోథెరపీ చేయించుకున్నారు. వైద్యం చేయించుకుంటూనే ‘పోలీస్ పబ్లిక్’ చిత్రంలో నటించారు. అయితే గడ్డలు పెరిగి, చివరికి ఊపిరితిత్తుల వరకూ, పక్కటెముకల వరకూ వ్యాపించాయి. నాన్న ఆసుపత్రిలో ఉండడానికి ఇష్టపడలేదు. ఇంట్లోనే ప్రశాంతంగా చనిపోవాలనుకున్నారు. నేను అమెరికాలో కాలేజ్ చదువు ఆపేసి, నాన్నతో ఉండడానికి ఇండియా తిరిగొచ్చేసాను. నాన్న 3 జూలై 1996న చనిపోయారు. ఆయనతో నా చివరి సంభాషణ పూర్తిగా వ్యక్తిగతమైనది. ఇక్కడ వివరించలేను. నాన్న లేకుండా ఆయన సినిమాలు చూడడం కష్టం. తెర మీద ఆయన్ని చూసినా, ఆయన గొంతు విన్నా బాధగా ఉంటుంది. ఆ శూన్యం పూడ్చలేనిది. ఆయన ఇంకొంత కాలం జీవించి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఆయన ఇవాళ ఉంటే, ముఖాముఖీ మాట్లాడేవాణ్ణి.”

Raaj kumar with his sister


దురదృష్టం వెంటాడిన నటి పుష్పలత:

కొందరు నటీనటులకు ప్రతిభకు లోటు లేకపోయినా, అదృష్టం తోడవ్వదు. దురదృష్టం వెంటాడి కొన్ని సినిమాలకే తెరమరుగవుతారు. అలాంటి వారిలో నటి పుష్పలత ఒకరు.

‘సంసారం’ (1950) సినిమాలో రెండవ కథానాయికగానూ, ‘పెళ్ళి చేసి చూడు’ (1952)లో తృతీయ స్థాయి పాత్రలోనూ నటించారు. తర్వాత మరో రెండు సినిమాలు చేసి తెరమరుగయ్యారు. చనిపోయే ముందుగా ఆవిడ నాకు చెప్పిన ఆవిడ జీవిత గాథ ఇది. ఆవిడకి సినిమాలంటే బాగా ఇష్టం. ‘సంసారం’ సినిమాలో అవకాశమెలా వచ్చిందో ఆవిడ ఎవరికీ ఎప్పుడూ చెప్పలేదు. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే తగినంత అనుభవం లేకపోవడం వల్ల సావిత్రిని తొలగించి, ఆ పాత్రని పుష్పలతకి ఇచ్చారని. ఆ సినిమాలో అక్కినేని సరసన రెండో కథానాయికగా నటించారు. ఆ సినిమా హిట్ కావడంతో, విజయ ప్రొడక్షన్స్ చక్రపాణి ఆవిడతో కాంట్రాక్టు కుదుర్చుకున్నారు. ఈ కాంట్రాక్టే తన జీవితంతో పాటు, నటుడు జగ్గారావు జీవితం నాశనమవడానికి కారణమైందని ఆమె భావించేవారు. ప్రధాన నాయికగా చేయాలనుకునేవారు ఆమె, కానీ కాంట్రాక్టు కారణంగా విజయ బ్యానర్‍ వాళ్ళు ఏ పాత్ర ఇచ్చినా చేయాల్సి వచ్చేది. ఆవిడది ఉల్లాసభరితమైన స్వభావం, రోడ్డు మీద నడుస్తూ కూడా త్రుళ్ళుతూ, గెంతుతూ నడిచేవారు. ఈ మ్యానరిజంనే ‘పెళ్ళి చేసి చూడు’లో పెట్టారు. నిజజీవితంలో ఎలా ఉండేవారో, ఆ సినిమాలోనూ అలానే నటించారు.

ఒకసారి రోడ్డు మీద నడుస్తుండగా సంపన్నుడిలా కనిపించిన వ్యక్తి ఆమెను అనుసరించి, తనని తాను పరిచయం చేసుకున్నారట. వారి మధ్య స్నేహం చిగురించగా, ఆయన పెళ్ళి చేసుకుందామనే ప్రతిపాదన చేశారట. ఆవిడ తన ఆశయం గురించి చెప్పగా, తనని పెళ్ళి చేసుకుంటే – ఆమెనే కథానాయికగా పెట్టి సినిమా తీస్తానని ఆయన అన్నారట. అతన్ని నమ్మిన ఆమె కేవలం నలుగురి సాక్షుల మధ్య ఓ హోటల్ గదిలో అతన్ని పెళ్ళి చేసుకున్నారట. అయితే అప్పుడు ‘చంద్రహారం’ సినిమాలో వ్యాంప్ పాత్రకి ఆమె ఎంపికయ్యారు. కానీ ఆ సమయంలో ఆమె గర్భవతి కావడం, మార్నింగ్ సిక్‍నెస్‍తో బలహీనంగా మారడంతో, భర్త ఆ సినిమాలో నటించవద్దని చెప్పారట. దాంతో ఆమె కాస్ట్యూమ్స్ అన్నీ మార్చవలసి వచ్చింది. ఆ పాత్రని సావిత్రి పోషించారు. విధి లీల – ‘సంసారం’ సినిమాలో సావిత్రి పాత్ర పుష్పలతని వరిస్తే, ‘చంద్రహారం’ సినిమాలో పుష్పలత పాత్ర సావిత్రిని వరించింది.

పిల్లలు పుట్టాకా, మళ్ళీ నటించడానికి ప్రయత్నించారు పుష్పలత. 1955 నాటి ‘చెడపకురా చెడేవు’లో కనబడ్డారు. కానీ అప్పటికి ఆమె అందమంతా పోయింది. కస్తూరి శివరావు గారి ‘పరమానందయ్య’ చిత్రంలో హీరోయిన్ గిరిజ వెంట ఉండే బృందంలో ఒకరిగా కనిపించానని ఆమె నాతో చెప్పారు. 1955లో ‘ఆడపడుచు’ అనే చిత్రంలో నటించినా, ఆ సినిమా ఫ్లాప్ కావడంతో – పిల్లల్ని చూసుకునేందుకు గాను చిత్రాల నుంచి విరమించుకున్నారు.

అంతలో ఆమెకో చేదు నిజం తెలిసింది. తన భర్తకి అప్పటికే ఓ పెళ్ళి అయిందనీ, తాను ఆయనకి రెండో భార్యనని తెలిసింది. భర్త తనని, పిల్లల్ని ఎంతో ప్రేమగా చూసుకున్నప్పటికీ ఈ నిజం ఆమెని బాధించింది. పిల్లల కోసం ఈ నిజాన్ని తట్టుకుని, ఎంతో జాగ్రత్తగా వారిని పెంచారు. భర్త చనిపోగా, ఈ కుటుంబానికి ధనం, ఆస్తులు లభించాయి. జీవితంలో బాగా స్థిరపడి, పిల్లలకి మంచి భవిష్యత్తు కల్పించారు. ఒక బంధువు సంరక్షణలో విశ్రాంత జీవితం గడిపారు. ఆ వయసులో తనకేమీ బాధలు లేవని నాతో చెప్పారు, అయితే ‘సంసారం’ ఫిల్మ్ సంపాదించి తాను అందంగా ఉన్నప్పటి రోజులని మళ్ళీ చూసుకోవాలని ఉందని అన్నారు. వీలైతే అలనాటి గొప్ప ఫోటోగ్రాఫర్ బౌనా తీసిన తన ఫోటో షూట్ ఫోటోలను సంపాదించాలని కోరుకున్నారు. అయితే అది సాధ్యం కాకపోవడం తీవ్ర నిరాశకి లోనయ్యారు. ‘సంసారం’ ఫిల్మ్‌కి సంబంధించి, ఆ నిర్మాత 1950లోనే – సినిమా విడుదలయిన కొద్ది రోజులకే చనిపోయారని, ఆయన కుటుంబం ఆ సినిమా హక్కులని జెమినీ ఎస్.ఎస్. వాసన్ గారికి అమ్మేశారని తెలిసింది. వాసన్ ఆ సినిమాని హిందీలో ‘సంసార్’ పేరుతో 1951లో తీశారు. ఎల్.వి. ప్రసాద్ గారి అబ్బాయి రమేష్ ప్రసాద్ జెమినీ వారిని సంప్రదించవలసిందిగా కోరారు. అది వీలు పడలేదు. చిత్ర పరిశ్రమలో వారితో సంబంధాలున్నాయా అని అడిగితే, లేవన్నారు. ఆ తర్వాత ఓ విచారకరమైన సంఘటన గురించి చెప్పారు. ఓ రోజు ఏదో కొనడానికి గాను ఒక బంగారం కొట్టుకు వెళ్ళారట పుష్పలత. సన్నగా, పుల్లలా ఉన్న ఒక స్త్రీ అప్పుడే ఆ కొట్లోకి అడుగుపెట్టారట… ఆమె ఎవరో కాదు నటి సావిత్రి! వెంటనే పుష్పలత కొట్టు యజమానికి చెప్పి మరో గదిలో దాక్కుని, సావిత్రిని గమనిస్తూ ఉండిపోయారట. సావిత్రి తన సంచీ లోంచి ఒక పలచని బంగారపు గొలుసు బయటకి తీసి, దాన్ని వాళ్ళకి అమ్మి, వారిచ్చిన డబ్బు తీసుకుని మౌనంగా, హుందాగా అక్కడ్నించి వెళ్ళిపోయారట. కొందరి జీవితాలతో విధి ఎలా ఆడుకుంటుందో తలచుకుని మేమిద్దం కాసేపు బాధపడ్డాం. వైజాగ్‌లో టి. సుబ్బరామిరెడ్డి ఏర్పాటు చేసిన ఓ వేడుకకి హాజరయిన సంగతి గుర్తు చేసుకున్నారు. అది నాగేశ్వరరావు గారి సినిమా వేడుక. రిటైరయిన తర్వాత పుష్పలత హాజరయిన సినీ వేడుక అదొకటేనని చెప్పారు. పుష్పలత నన్ను తరచూ చూడాలనుకునేవారు, నేను వాట్సప్‍లో నా ప్రొఫైల్ పిక్ చూడమని చెప్పాను. వాళ్ళ అల్లుడి మొబైల్‌లో నా వాట్సప్ పిక్ చూశారు. అప్పటి నుంచి తరచూ నాతో మాట్లాడేవారు. వచ్చి కలవమని అనేవారు. నాకేమో ఎక్కువగా ప్రయాణాలు చేయబుద్ధి కాదు. ఓసారి ఆవిడా ప్రతి ఏడాది ఏప్రిల్ నెలలో నిర్వహించే పూజకి తప్పనిసరిగా రావల్సిందిగా అడిగారు. వేసవికాలమా… నా వల్ల కాదు అని చెప్పాను. ఒక చిన్న భేదభిప్రాయంవల్ల నేను ఆవిడపై కోపం తెచ్చుకున్నాను. నాకు కోపం తగ్గక, ఆవిడ ఫోన్ చేస్తే ఎత్తడం మానేసాను. కొన్ని రోజుల తర్వాత నేను బజారులో ఉండగా ఆవిడ ఫోన్ చేశారు. నెమ్మదిగా ఫోన్ తీసి మాట్లాడాను. ఆమె గందరగోళంగా, బాధతో మాట్లాడుతూ, తన కేర్ టేకర్ చనిపోయారని చెప్పారు. నేను సంతాపం తెలియజేసి, బయట ఉన్నాననీ, తర్వాత మాట్లాడతాననీ చెప్పాను. కానీ ఆ విషయమే మరిచిపోయాను. కొన్ని రోజుల తర్వాత ఆమె చనిపోయారని తెలిసింది.ఫోను చేస్తానని ఫోనుచేయటం మరచిపోయాను. ఆవిషయమే ఈనాతికీ నన్ను బాధిస్తుంది. ఆమె నాతో ఎంతో ప్రేమగా వుండేవారు. ఆమె లాగా నేనూ ఉండలేకపోయాననే బాధ ఈనాటికీ నాలో ఉంది… ఎందుకో ఆమెకి నేను బాగా నచ్చేశాను… కానీ చివరికి మిగిలింది విషాదమే…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here