Site icon Sanchika

అలనాటి అపురూపాలు-45

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపరూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

అందాల పోటీ గెలిచి నటిగా – పీస్ కన్వల్:

ఈ వారం మరో ప్రసిద్ధ నటి గురించి తెలుసుకుందాం. ఆమె 1953లో ఒక అందాల పోటీ గెలవడం ద్వారా సినీ రంగంలో ప్రవేశించారు. ఆమే పీస్ కన్వల్. 1953లో జరిగిన కె-కె-టి కాంటెస్ట్ (Kardar-Kolynos-“Teresa”) ‍లో గెలవడం ద్వారా నటిగా మారారు.

పీస్ కన్వల్ తండ్రి జోధ్‍పూర్‍కి రాజపుత్ర కుటుంబానికి చెందినవారు. రాజా మాన్‍సింగ్ వారసుడు, కాబట్టి జోధ్‌పూర్, జైపూర్ రాజకుటుంబీకులు బాగా సన్నిహితులు. ఆయన ఒక వైద్యుడు. ఆగ్రాలోని మిషనరీ ఆసుపత్రిలో పనిచేసేవారు. ఆయనకి అమృత్‍సర్‍లో సొంత క్లినిక్ ఉండేది. పీస్ కన్వల్ అమ్మగారు జబల్‍పూర్‍కి చెందిన రాజపుత్ర కుటుంబానికి చెందినవారు. పీస్ కన్వల్ తండ్రి ఉద్యోగ రీత్యా ఎక్కువగా టెక్స్‌లా, లాహోర్, రావల్పిండి వంటి ప్రాంతాలలో గడిపేవారట. మిషనరీలతో సంబంధం కారణంగా ఆయన క్రైస్తవంలోకి మారి తన పేరును ఆండ్రూగా మార్చుకున్నారట. 1943లో ఆయన హఠాన్మరణం వల్ల, పీస్ కన్వల్, ఆమె తల్లి ఢిల్లీలో నివాసం ఏర్పరుచుకున్నారు.

పీస్ కన్వల్ 16 డిసెంబరు నాడు అమృత్‌సర్‍లో జన్మించారు. అమృత్‍సర్, లాహోర్, రావల్పిండి, ఢిల్లీ లలో చదువుకున్నారు. లుధియానా మెడికల్ కాలేజీ ఆమెకి వైద్య విద్య చదివేందుకు సీటు వచ్చింది. మెడిసిన్ ఒక సంవత్సరం చదివాక, బంధువుల ఇంటికి బొంబాయి వెళ్ళే అవకాశం వచ్చింది. బొంబాయిలోని సుప్రసిద్ధ కాలా ఘోడా ప్రాంతంలో ఒక యువతిని కలిసారట, ఆ తర్వాత ఆమె అత్యంత ఇష్టురాలైన స్నేహితురాలైపోయింది. అదే సమయంలో, ప్రఖ్యాత నిర్మాత ఎ.ఆర్. కర్దార్ తన కొత్త సినిమాలో – సుప్రసిద్ధ గాయకుడు, నటుడు అయిన తలత్ మహమూద్ సరసన నటించేందుకు – హీరోయిన్ కోసం ఒక ‘ఆలిండియా బ్యూటీ కాంటెస్ట్’ నిర్వహిస్తున్నారు. ఆ పోటీలను అప్పటి అగ్రగామి టూత్‍పేస్ట్ బ్రాండ్ ‘Kolynos’ స్పాన్సర్ చేసింది. తన నేస్తం ప్రోత్సహించడంతో, పీస్ కన్వల్ ఈ పోటీలో ప్రవేశించి, విజేతగా నిలిచారు. తన అందమైన రూపం, చలాకీతనంతో  – నిర్మాత కర్దార్ నిర్వహించిన స్క్రీన్‍ టెస్టులోనూ నెగ్గారు. విజేత బహుమతిలో భాగంగా ఇటలీలో పర్యటించారు. అనంతరం కర్దార్ ప్రొడక్షన్స్‌తో ఉన్న రెండేళ్ళ కాంట్రాక్టును అమలు చేశారు. తలత్ మహమూద్ సరసన నటించిన తన తొలి చిత్రం ‘దిల్-ఎ-నాదాన్’ తోనే పీస్ కన్వల్ ప్రాచుర్యం పొందారు, అభిమానులను, విమర్శకులను ఆకట్టుకున్నారు. కొత్తనటిని అభినందిస్తూ, కర్దార్ స్టూడియోకి ఉత్తరాలు వచ్చేవి, ఆమె ఫోటోలు మరికొన్ని విడుదల చేయమని కోరేవారు అభిమానులు. సినిమాల్లో నటించేందుకుగాను మెడిసిన్ చదువును మధ్యలో వదిలేశారు. అప్పటివరకూ ఆమె కుటుంబానికి దూరంగా ఎన్నడూ ఉండలేదు. పైగా ఒకే స్టూడియోతో కాంట్రాక్టులో ఉండడమంటే, మరో కుటుంబ పెద్ద సంరక్షణలో ఉంటున్నట్టే.  షాట్ అయిపోగానే, ఆమె మేకప్ రూమ్‍కి వెళ్ళిపోయేవారు, పొగరుతో కాదు… సిగ్గు వల్ల. పైగా ఆమె మితభాషి.

ఇంకా అప్పటికి టీనేజ్‍లోనే ఉన్నారు.  పైగా బాగా క్రమశిక్షణతో పెరిగారు. చిన్నతనంలోనే సినీరంగంలోకి ప్రవేశించడం వల్ల – వంట, కుట్టుపని, ఇంటి పనులు నేర్చుకునే అవకాశం గానీ, పని మనుషులని నిభాయించే సామర్థ్యం కాని అలవడలేదు. ఈ పనులు ప్రతీ ఆడపిల్లా నేర్చుకోవాలని ఆమె భావించారు. ఆమెకి సంగీతమన్నా, బొమ్మలు గీయడమన్నా, క్రీడలన్నా గొప్ప ఆసక్తి ఉండేది. కానీ సినిమాల్లో ఉండడం వల్ల వాటిని అయిష్టంగానే వదులుకున్నారు. ‘దిల్-ఎ-నాదాన్’ తర్వాత ఆమె 1954లో ‘బారాతీ’లో నటించారు.ఈ సినిమాలోనూ ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి, అభిమానుల నుంచి వందలాది ఉత్తరాలు వచ్చాయి. కర్దార్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమాకి రోషన్ సంగీతం అందించగా, జె.కె. నందా దర్శకత్వం వహించారు. ఆఘా హీరో. ‘దిల్-ఎ-నాదాన్’ షూటింగ్ జరుగుతుండగా, పీస్ కన్వల్ – సుశీల్ రూజాని కలిసారు. ఆయన ప్రసిద్ధ రూజా కుటుంబానికి చెందినవారు. తన స్నేహితులలో కలిసి ఆయన సెట్‍కి వచ్చేవారు. పీస్ కన్వల్‍ని ఇష్టపడి, ప్రేమించి, 1955లో పెళ్ళి చేసుకున్నారు. పెళ్ళి తరువాత, సినిమాల్లో నటించేందుకు ఆయన అభ్యంతరం చెప్పారు. ఐతే ఇంకా కాంట్రాక్ట్ వ్యవధి ఉన్నందున కర్దార్ ప్రొడక్షన్స్ వారు ఆమెని మరో స్టూడియో వారికి 1956లో ‘కిస్మత్’‍లో నటించేందుకు అప్పగించారు. ఈ సినిమాలో రంజన్ హీరో కాగా, చిత్రగుప్త సంగీత దర్శకులు. ఈ చిత్రం షూటింగ్ సమయంలోనే – ఆమె – కేవలం విజయవంతమైన హీరోయిన్‍గా ఉంటే సరిపోదని, సమర్థురాలైన భార్యగా కూడా ఉండాలని గ్రహించారు. చక్కగా కాపురాలు చేసుకునే మహిళలను చూసి కాస్త అసూయపడి తాను కూడా వాళ్ళలా నైపుణ్యం సాధించాలని అనుకునేవారు. ‘కిస్మత్’ తరువాత విరామం తీసుకుని, కొద్ది కాలం – కనీసం మరో మంచి కథ దొరికేవరకు అయినా – తన అభిరుచులను మెరుగుపరుచుకోవాలనుకున్నారు. అయితే ఈ చర్య వల్ల మొత్తం నాలుగేళ్ళు చిత్రపరిశ్రమకి దూరమవుతానని అప్పట్లో ఆమె అనుకోలేదు! మొదట్లో సంతోషంగా, తృప్తిగా ఉండేవారు. అందరూ తనని గమనిస్తూ ఉండడంతో ఆమె రకరకాల హాబీలను ఎంచుకున్నారు- శాస్త్రీయ సంగీతం, కుట్లు అల్లికలు, భారతీయ, పాశ్చాత్య వంటలు నేర్చుకోసాగారు. ఎన్నో చిత్రాలు గీసి, పెయింటింగ్‍లో నైపుణ్యం సంపాదించారు. టెన్నిస్, బాడ్మింటన్‍లో ప్రావీణ్యం సాధించారు. 1957లో వారికో కొడుకు పుట్టాడు. ఇన్ని రకాల పనులతో అసలు కాలం ఎలా గడుస్తోందో తెలియనే లేదు. ఒక్కోసారి తానేదో కోల్పోయినట్టు అనిపించేది. ఓ మంచి సినిమా చూసినప్పుడల్లా – ఆ హీరోయిన్‍తో తనని పోల్చుకుని అటువంటి పాత్ర తాను ధరిస్తే ఎంత బాగుండేదో అనుకునేవారు. నటన అనేది ఒకసారి మొదలైతే, ఆపడం చాలా కష్టం. సినిమాలను, సినీ స్నేహితులను బాగా కోల్పోతున్నానని ఆమెకి అనిపించేది. ఇక తట్టుకోలేక మళ్ళీ సినిమాల్లో నటించేందుకు ప్రయత్నించారు. కొన్ని లోటుపాట్లు ఉన్నా సినీపరిశ్రమ ఔదార్యం ఆమెకు తెలుసు. ఆమెకు రెండు సినిమాలకి అవకాశాలు వచ్చాయి – ఒకటి మద్రాస్ మూవీటోన్ వారి ‘చోటీ బహూ’. దీనికి జబీన్ నిర్మాత. రెండోది పి.ఎన్. అరోరా గారి సినిమా. మొదట ఆమె కాస్త సంశయించినా, అందరూ సగౌరవంగా ఆహ్వానించడంతో, నాలుగేళ్ళ విరామం తర్వాత కూడా సౌకర్యంగా నటించగలిగారు. ఆ తరువాత ఆమె 1960లో బర్సాత్, నాయ్ మా, మా బాప్ వంటి సినిమాలలో కారెక్టర్ రోల్స్ పోషించారు. 1962లో ‘ఆరతి’లో నటించారు. సినిమాల్లో మళ్ళీ నటించడం మొదలుపెట్టాకా, ఆమెకీ, ఆమె భర్తకీ అభిప్రాయ భేదాలు తలెత్తాయి. రాజీ పడలేక, 1968లో వాళ్ళు చట్టబద్ధంగా విడిపోయారు.

ఒకప్పుడు సిగ్గరిగా, అంతర్ముఖిగా ఉన్న ఆమె నేడు న్యూయార్క్ లోని వాల్డార్ఫ్ ఆస్టోరియా లోనూ, ముంబయిలో తాజ్ మహల్ హోటల్‌ లోనూ ఒక్కర్తే పెయింటింగ్ ఎగ్జిబిషన్ నిర్వహించే స్థాయికి చేరారు. 1977లో నిర్వహించిన అటువంటి ఒక ఎగ్జిబిషన్‍లో ఆమె భారత మాజీ రాష్ట్రపతి వి.వి.గిరి మనుమడు వి. మహేష్‌ని కలిసారు. అప్పట్లో ఆయన ఎగ్జిబిషన్ అయ్యాకా ఆమెని కలిసారట. త్వరలో వాళ్ళిద్దరూ తరచూ కలుసుకొని, మాట్లాడుకునేవారు. తర్వాత ఆయన ప్రతిపాదించడంతో, వాళ్ళిద్దరూ 1977లో పెళ్ళి చేసుకున్నారు. వాళ్ళిద్దరూ బొంబాయిలో విలె పార్లె (వెస్ట్) లో జూహూ బీచ్ సమీపంలో సంపన్నుల నివాస ప్రాంతంలో ఉంటున్నారు. ఆమె మొదటి భర్త వల్ల జన్మించన కుమారుడు కూడా బొంబాయిలోనే ఉంటాడు. ఆమె 1979లో ‘చంబల్ కీ కసమ్’ లోనూ, 1984లో ‘ఆస్మాన్’ లోనూ నటించారు. ఆమె చివరి చిత్రం 1991లో వచ్చిన ‘వో సుబాహ్ కబీ తో ఆయేగీ’. ప్రస్తుతం ఆవిడ సంఘ సేవ లోనూ, చిత్రకళలోనూ నిమగ్నమై ఉన్నారు.

***

1953 నాటి ‘దిల్ -ఎ – నాదాన్’ చిత్రంలోని పాటని ఈ లింక్‍లో చూడవచ్చు:

https://www.youtube.com/watch?v=qHEz6myFtpw

1954 నాటి ‘బారాతీ’ చిత్రంలోని పాటని ఈ లింక్‍లో చూడవచ్చు:

https://www.youtube.com/watch?v=oWB03qgAP5s

***


తొలి భారతీయ మహిళా ఇంజనీర్ – ఎ. లలిత:

ఆయా రంగాలలో దేశంలోని ప్రథమ మహిళల గురించి తెలుసుకోవడం ఉత్తేజకరంగా ఉంటుంది. పురుషుల ఆధిపత్యంలోని ఇంజనీరింగ్ రంగంలో ప్రవేశించిన తొలి మహిళ గురించి ఈ వారం తెలుసుకుందాం.

దేశంలో తొలి మహిళా ఇంజనీరు అయిన ఎ. లలిత 27 ఆగస్టు 1919 నాడు మద్రాసులో జన్మించారు. వారిది మధ్య తరగతి తెలుగు కుటుంబం. ఆమె కన్నా ముందు నలుగురు, తర్వాత ఇద్దరు తోబుట్టువులున్నారు. 1934లో ఆమెకి 15 సంవత్సరాల వయసులో పెళ్ళి చేశారు. పెళ్ళి తరువాత కూడా ఆమె చదువు కొనసాగించి ఎస్.ఎస్.ఎల్.సి (పదవ తరగతి) పూర్తి చేశారు. 1937లో ఆమెకి కూతురు జన్మించగా, శ్యామల అని పేరు పెట్టారు. అయితే పాపకి నాలుగు నెలలు వయసుండగా, లలిత భర్త చనిపోయారు. నెలల పాప, దానికి తోడు వైధవ్యం – దిగులు నుంచి బయటపడేందుకు లలిత చదువుకోవాలనుకున్నారు, తనను తన కూతురుని పోషించుకోగలిగే ప్రొఫెషనల్ డిగ్రీ చదవాలనుకున్నారు. కుటుంబం మద్దతుతో తనకీ, తన పాపకీ ఓ జీవితం ఏర్పరుచుకోవాలనుకున్నారు. చెన్నైలోని క్వీన్ మేరీస్ కాలేజీలో చేరి ఇంటర్మీడియట్ చదివి ఫస్ట్ క్లాసులో పాసయ్యారు లలిత. తన తండ్రి, సోదరుల అడుగుజాడలలో నడిచి తానూ కూడా ఇంజనీర్ అవ్వాలని అనుకున్నారు లలిత. అయితే లలిత తెలివైన విద్యార్థిని అయినప్పటికీ, సిఇజి (College of Engineering, Guindy)లో ప్రవేశించడం అంత తేలిక కాదు. పైగా ఇంజనీరింగ్ పూర్తిగా మగవాళ్ళ రంగమని భావించబడే కాలమది.

అదృష్టవశాత్తు, ఆమె తండ్రి పప్పు సుబ్బారావు సిఇజిలో ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫ్రొఫెసర్. తన కూతురు తరఫున, అప్పటి ప్రిన్సిపల్ డా. కె. సి. చాకోతో మాట్లాడారు. అంతే కాకుండా మద్రాసు ప్రెసిడెన్సీలో అప్పటి బ్రిటీష్ ప్రభుత్వాధికారి, డైరక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్‌స్ట్రక్షన్ – Sir R.M. Statham గారి అనుమతి కూడా తీసుకున్నారట.

1940లో లలిత నాలుగేళ్ళ ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ విద్యార్థినిగా సిఇజిలో ప్రవేశించారు. మొదట్లో క్లాసులో ఏకైక మహిళ కావడం వల్ల క్యాంపస్ జీవితం సవాళ్ళతో కూడి ఉండేది. కానీ 40లలో ఆమె ఒక్కర్తే ఎలా చదువుకునేవారో అనిపిస్తుంది. అయితే ప్రొఫెసర్ కూతురు అవడం కొంత మేలు చేసి ఉంటుంది. ఆ ఏడాది మరో ఇద్దరు యువతులను సిఇజిలో చేర్చుకున్నారు. లీలమ్మ జార్జ్, థ్రెస్సియా అనే ఇద్దరు యువతులు 1940లో సివిల్ ఇంజనీరింగ్ కోర్సులో చేరారు. సిఇజి నుండి గ్రాడ్యుయేట్ అయిన తొలి మహిళా బ్యాచ్ వీరిదే. ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్‍లో లలిత ఆనర్స్ డిగ్రీ 1944లో లభించింది. సర్టిఫికెట్‍లో He అనేది కొట్టేసి She అని రాశారు.

1944లో లలిత కలకత్తాలోని సెంట్రల్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియాలో ఇంజనీరింగ్ అసిస్టెంట్‍గా చేరారు. ఆరేళ్ళ పాపతో, భర్త గతించిన స్త్రీగా – తన సోదరుడితో కలిసి ఉండవచ్చని ఆ ఉద్యోగం ఎంచుకున్నారామె. తన కూతురుని వదినగారి సంరక్షణలో ఉంచవచ్చని ఆశించారు. ఈ ఉద్యోగంలో ఆమె 1946 డిసెంబరు వరకు ఉన్నారు. లండన్ లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలెక్ట్రికల్ ఇంజనీర్స్ వారి ‘గ్రాడ్యుయేట్‍షిప్ ఎగ్జామ్’ కూడా రాశారు. తన తండ్రి ప్రోత్సాహంతో ఉద్యోగాన్ని వదిలి – తండ్రి పరిశోధననలో సాయం చేశారు. ఆయనకి – జెలెక్ట్రోమోనియమ్ (ఎలెక్ట్రికల్ మ్యూజికల్ ఇన్‍స్ట్రుమెంట్), స్మోక్‍లెస్ ఓవెన్, ఎలెక్ట్రిక్ ఫ్లేమ్ ప్రొడ్యూసర్ వంటి ఉపకరణాలతో సహా ఇతర ఉపకరణాలపై ఎన్నో పేటెంట్లు ఉండేవి. 1948 తర్వాత ఆర్థిక కారణాల వల్ల ఈ పని మానుకున్నారామె. అసోసియెటెడ్ ఎలెక్ట్రికల్ ఇండస్ట్రీస్ (ఎఇఐ)లో చేరారు. ఆ ఉద్యోగం కలకత్తాలో. అయితే ఆమె సోదరుడు అక్కడ నివసిస్తుండంతో, ఆమెకి ఇబ్బంది లేకపోయింది. అదే సోదరుడి అండ లేకపోయుంటే – విధవరాలిగా అలా ఆ రోజుల్లో జీవించడం ఆమెకి కష్టమయ్యేది. ఎఇఐలో కలకత్తా బ్రాంచిలో లలిత ఇంజనీరింగ్ విభాగంలోనూ, సేల్స్ విభాగంలోనూ పని చేశారు.

అక్కడ ఆమెకు అప్పగించిన ‘ట్రాన్స్‌మిషన్ లైన్స్’ డిజైన్ చేయడమనే బాధ్యత ఆమెకెంతో సంతృప్తినిచ్చింది. ప్రొటెక్టివ్ గేర్, సబ్ స్టేషన్ లే-అవుట్స్, కాంట్రాక్టుల అమలులో వచ్చే సమస్యల పరిష్కారం కూడా ఆమె విధులలో భాగమే. ఆమె చేపట్టిన గొప్ప పనులలో ఒకటి – దేశంలో కెల్లా పెద్ద జలవిద్యుత్ ప్రాజెక్టు అయిన భాక్రా నంగల్ డ్యామ్‍కు జనరేటర్లు అమర్చటం. కాంట్రాక్ట్స్ ఇంజనీరుగా – ఎఇఐ ఇంజనీర్లు తరచూ సైటుకి, దిగుమతి చేసుకున్న పరికరాలు ఉండే కార్యాలయాలకి వెళ్ళేవారు. అయితే విధవరాలు కావడం, చిన్న కూతురు ఉండడం కారణాల వల్ల ఆమె పనంతా నైపుణ్యంతో కూడిన సలహాలు ఇవ్వడం, తనపై వారికి సహాయం చేయడం గానే ఉండేది. ఎలాంటి పని అప్పగించినా పూర్తి నిబద్ధతతో, సామర్థ్యంతో చేశారు. 1953లో ఆమెకు లండన్ లోని కౌన్సిల్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఎలెక్ట్రికల్ ఇంజనీర్స్ (ఐఇఇ) అసోసియేటెడ్ మెంబర్‍గా సభ్యత్వం కల్పించింది. ఇదే సంస్థ 1966లో పూర్తి స్థాయి సభ్యత్వం కల్పించింది.

లలిత కెరీర్‍లో విశేష సంఘటన – 1964లో న్యూ యార్క్‌లో జరిగిన తొలి ‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వుమెన్ ఇంజనీర్స్ అండ్ సైంటిస్ట్స్’ (ICWES) సమావేశంలో పాల్గొనేందుకు ఆహ్వానం పొందడమే. అయితే ఆ సమయంలో ఆ సంస్థకు భారతదేశంలో శాఖలు లేకపోవడం వల్ల – లలిత ఈ సమావేశానికి తన వ్యక్తిగత హోదాలో హాజరయ్యారు. అక్కడ మాట్లాడుతూ, “ఇదే 150 ఏళ్ళ క్రితం అయితే, నా భర్త చితిపై నన్ను కూడా ఉంచి సహగమనం చేయించేవారు” అని అన్నారట!

కష్టాల కోర్చి, జీవితాన్ని పురోగమనం బాటలో నడిపిన ధీర వనిత లలిత.

Lalitha is on extreme right

 

Exit mobile version