అలనాటి అపురూపాలు-48

0
2

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపరూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

బాలీవుడ్‍లో మరో విషాద గాథ – నటి విమీ:

విమీ బి.ఆర్. చోప్రా తీసిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘హమ్‌రాజ్‌’లో హీరోయిన్. మీలో చాలామంది ఆమె గురించి విని వుండకపోవచ్చు. బహుశా ఆమె కథ ఇప్పుడు వినాలనుకోవచ్చు. ఆసక్తిదాయకం ఆమె కథ, పైగా బాలీవుడ్ కథల్లోకెల్లా అతి విచిత్రమైనది కూడా.

1943లో జన్మించిన విమీ గాయని అవుదామని శిక్షణ పొందారు. ఆమెకు నాటకాలలో నటించడమన్నా ఆసక్తి ఉండేది. ఆకాశవాణి బొంబాయి కేంద్రం నుంచి ప్రసారమయ్యే పిల్లల కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ముంబయిలోని సోఫియా కాలేజ్‌ నుండి – సైకాలజీలో పట్టా పొందారు. కలకత్తాకి చెందిన హార్డువేర్ వ్యాపారి శివ్ అగ్రవాల్‍ని వివాహం చేసుకున్నారు.

తన కాలంలోని బాలీవుడ్ హీరోయిన్‍లందరికంటే భిన్నమైనవారు విమీ. సినీరంగంలో అనుకోకుండా ప్రవేశించి, ఎందరినో ఆశ్చర్యపరిచారు. అంతేకాదు, విషాదాన్ని మిగుల్చుకున్నారు. వివాహిత, ఇద్దరు పిల్లల తల్లి – చోప్రాల బ్యానర్‍లో ఇద్దరు అగ్రనటులు రాజ్ కుమార్, సునీల్ దత్‍ల సరసన హీరోయిన్‍గా తొలి సినిమా చేయడం గొప్ప విషయం! విమీ అవన్నీ సాధించారు. ‘హమ్‌రాజ్‌’ బాక్సాఫీసు వద్ద పెద్ద హిట్ అయింది. విమీ హఠాత్తుగా గొప్ప స్టార్ అయిపోయారు. చోప్రాలు ఈనాటికీ సుప్రసిద్ధులుగా ఉన్నారంటే – కారణం వారు తమ స్టార్స్‌కి విధేయులుగా ఉండడమే. అయితే విమీ విషయంలోనే మినహాయింపు! ఆమె ముఖంలో భావోద్వేగాలు సరిగా పలకవని, ఆమెది చెక్క ముఖం అని చాలామంది అనేవారు. 1967నాటి ‘పిక్చర్ పోస్ట్’ మ్యాగజైన్‌తో మాట్లాడుతూ – ‘విమీ మేధావి, విద్యావంతురాలు, విషయాలను తొందరగా నేర్చుకుంటారు’ – అని అన్నారు బి.ఆర్. చోప్రా. తమ సినిమాలో ఆ పాత్రకి విమీ సరిగ్గా సరిపోయారని, పాత్రకి కావల్సిన పరిపక్వత ఆమెలో ఉందని చెప్పారు. అయితే, ఆ సినిమా తర్వాత ఎందుకో, చోప్రాలు విమీని పూర్తిగా విస్మరించారు. చోప్రాల విస్మరింపు వల్ల ఆమెకి పరిశ్రమలో ఉనికి కరువయింది. ఆమె తన విశ్వసనీయత కోల్పోయారు. పెద్ద బడ్జెట్‍తో, ఎన్నో అంచనాలో తీసిన ‘ఆబ్రూ’ చిత్రం పరాజయం అనంతరం విమీ కెరీర పతనమయింది.

1968లో ‘స్టార్ అండ్ స్టైల్’‍తో మాట్లాడుతూ హాలీవుడ్ స్టార్స్ – థెడా బారా, జోన్ క్రాఫోర్డ్ వలె ఒక స్టార్ ఎప్పటికీ స్టార్ లానే ఉండాలి అని చెప్పారు. విమీ ఒక స్టైల్ ఐకాన్‍గా నిలిచారు. మార్చి 1968 నాటి ఫిల్మ్‌ఫేర్ పత్రిక ముఖచిత్రంపైనే కాకుండా ఆమె ఫోటోలు అన్ని మ్యాగజైన్లలోనూ వచ్చాయి. సినిమాల్లోకి రావడానికి కారణం డబ్బు ఏ మాత్రం కాదని విమీ మొదట్లోనే స్పష్టం చేశారు. స్వతహాగా ఆమె ధనవంతురాలు. ఆమె నివసించే పాలి హిల్ అపార్ట్‌‍మెంట్, ఆమె ధరించే డిజైనర్ దుస్తులు, మింక్ కోటు, ప్రయాణించే స్పోర్ట్స్ కారు ఈ విషయం స్పష్టం చేస్తాయి. ఆమెకి గోల్ఫ్ అంటే ఇష్టం, బిలియర్డ్స్ ఆడేవారు. లాంగ్ డ్రైవ్స్‌కి వెళ్ళేవారు. ఆమె సినీ రంగప్రవేశానికి తల్లిదండ్రులు అత్తమామలు వ్యతిరేకించినప్పటికీ, భర్త సంపూర్ణ సహకారం అందించారు. 1968లో ‘స్టార్ అండ్ స్టైల్’‍తో మాట్లాడుతూ తన భర్త తాను హీరోయిన్‍గా సినిమా తీస్తున్నారనీ, రంగీలా, సందేశ్, అపాయింట్‍మెంట్ అనే మూడు చిత్రాలు అంగీకరించానని చెప్పారు. అయితే ఆమె పేర్కొన్న సినిమాలేవీ చిత్రీకరణ జరుపుకోలేదు. ఇతర అవకాశాలు సన్నగిల్లాయి. అయితే విమీ మ్యాగజైన్‍ల నుండి మాత్రం పూర్తిగా కనుమరుగు కాలేదు. ఫిల్మ్ పార్టీలకి హాజరవుతూ, పత్రికలకు ఫోటోలు ఇస్తూ ఉన్నారు. 1970 నాటి ఫిల్మ్‌ఫేర్ పత్రికలో ఆమె బికినీలో కనిపించారు. ఆకర్షణ, హుందాతనం కలిగి ఉన్న ఈ నటి బహిర్గతం చేయని ఆస్తులు – సెక్స్ అప్పీల్, పెద్ద వార్డ్‌రోబ్ – అని ఆ పత్రిక పేర్కొంది. అయితే 1971 తర్వాత ఆమె ఏ సినిమా పత్రికలోనూ కనిపించలేదు. 1974లో శశి కపూర్‍తో నటించిన ‘వచన్’ ఆమె చివరి సినిమా. తను నటించిన పది సినిమాలలోనూ, ఆమె ప్రధాన పాత్రధారిగా, ఆకర్షణీయంగా ఉండి, గొప్ప నటనా కౌశలాన్ని ప్రదర్శించారు. అయితే దురదుష్టవశాత్తు వీటిలో చాలా సినిమాలు పరాజయం పాలయ్యాయి, బాక్సాఫీసు వద్ద విఫలమయ్యాయి. ప్రతీ సినిమా పరాజయం పాలవుతుండడంతో – తాను డబ్బు కోసం నటించడం లేదని ఆమె చెప్పుకొచ్చారు. ఆమెకే ఎంతో డబ్బుంది. ఆమె జీవనశైలి, భారీ వార్డ్‌రోబ్, లగ్జరీ డ్రైవ్స్, ఖరీదైన జాకెట్స్ ఈ విషయాన్ని నిరూపిస్తాయి.

అయితే కంటికి కనిపించేదల్లా నిజం కాదు.

ఆమె వ్యక్తిగత జీవితం సుడిగుండంలో చిక్కుకుంది. బాలీవుడ్ లోని ఇతర హీరోయిన్ల వలె కాకుండా, పెళ్ళయి, ఇద్దరు పిల్లలు పుట్టాక బాలీవుడ్ లోకి వచ్చారు విమీ. పంజాబీ సిఖ్కు కుటుంబానికి చెందిన ఈ అందాల యువతి కలకత్తాకి చెందిన మార్వాడీ కుటుంబపు యువకుడు శివ్ అగ్రవాల్‌ని ప్రేమించి పెళ్ళి చేసుకున్న కారణంగా తల్లిదండ్రులతో మనస్పర్థలు వచ్చాయి. వాళ్ళ ఆశీస్సులు లభించలేదు. ఇక మిగిలింది అత్తమామలే! సినిమాల్లో నటించాలనే నిర్ణయంతో వారూ దూరమయ్యారు. తన భర్త తనని ఎంతగానో ప్రేమిస్తారనీ, తను హీరోయిన్‍గా సినిమాలు నిర్మిస్తున్నారనీ ఆమె చెప్పిన సినిమాలేవీ అసలు వెలుగు చూడలేదు.

ఆమె మరణం తర్వాత అసలు విషయాలు వెల్లడయ్యాయి. ఆమె, ఆమె భర్త విడిపోయారనీ, ఆమె ఓ సినీ బ్రోకరుతో జీవించారని తెలిసింది. అతడు ఆమెని అన్ని విధాలుగా వాడుకున్నాడట. ఆస్తులు కరిగిపోగా, ఒకప్పటి ఘనమైన వార్డ్‌రోబ్, స్పోర్ట్ కార్ల యజమాని, బికారిగా మారి బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టబడ్డారట! కలకత్తాలోని ఆమె వ్యాపారసంస్థ ‘విమీ టెక్స్‌టైల్స్’‍ని అప్పులు తీర్చడం కోసం అమ్ముకోవల్సి వచ్చింది. వీటన్నింటి నుంచి సాంత్వన పొందడానికి ఆమె మద్యాన్ని ఆశ్రయించారు. ఎక్కువ పైకం లేకపోయేసరికి చవక రకం, విషపూరితమైన మద్యం తాగేవారట. నిరంతరం అధికంగా తాగడం వల్ల ఆమె ఆరోగ్యం క్షీణించింది. క్రమంగా కాలేయానికి సంబంధించిన సమస్యలు ఎదురై, 34 సంవత్సరాల వయసులో మృత్యువు బారిన పడ్డారు. అప్పటికే విస్మృతిలోకి వెళ్ళిపోవడంతో, బాలీవుడ్ నుంచి ఎవరూ ఆమె మృతికి సంతాపం తెలపలేదు. ఓ అనాథలా నానావతి ఆసుపత్రిలోని జనరల్ వార్డులో మరణించారామె. ఆమె శవాన్ని లాగుడు బండిలో శ్మశానానికి తీసుకువెళ్లారు. ఒంటరి అయిన ఆమె దిక్కులేని మరణాన్ని పొందారు. ఆ తర్వాతే తెలిసింది, భర్తతో సత్సంబంధాలు నశించి వారు శాశ్వతంగా విడిపోయే నాటికి ఆమె గృహ హింసకి గురయ్యారని.

కృష్ణ అనే ఆమె మిత్రుడొకరు ‘ఆనంద్ బజార్ పత్రిక’లో నివాళి రాసారు. నేను చదివిన క్రూరమైన నివాళులలో అది ఒకటి. మరణం ఆమె పాలిట ఉపశమనం అని పేర్కొన్నారు కృష్ణ. వెంట భర్త లేకుండా, ఎవరో ఒక నిర్మాత/దర్శకులు అవకాశాలు ఇస్తారేమోనన్న ఆశతో బయట తిరిగారు విమీ అని పేర్కొన్నారాయన. మరణించిన వ్యక్తిని ఇంకా అవమానించారాయన…. సినిమాల్లో రావడానికి కుటుంబాన్ని వదిలేసినందుకు ఆమె పడిన బాధలు సమంజసమే అన్నారు.

అయ్యో! షో బిజినెస్ బరువుకింద మరొక పువ్వు నలిగిపోయింది…

***

హమ్‌రాజ్ లోని ‘తుమ్ అగర్ సాథ్ దేనే కా వాదా కరో…’ పాట లింక్

https://www.youtube.com/watch?v=rPIs4BD7_K0

హమ్‌రాజ్ లోని ‘నీల్ గగన్‍ కే తలే ధర్తీ కా ప్యార్…’ పాట లింక్

https://www.youtube.com/watch?v=pSE9QzQ-EKY

శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి గారికి మద్రాసులో తెలుగు చిత్ర పరిశ్రమ సన్మానం:

కొత్తగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నియుక్తులైన శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డిని మద్రాసులోని తెలుగు సినీ నటీనటులు, సాంకేతిక నిపుణులు – మద్రాసులోని విజయగార్డెన్స్‌లో 20 ఏప్రిల్ 1964 నాడు సత్కరించారు. ఆ సన్మానం వివరాలు, ఆనాటి సభలో ప్రముఖుల ప్రసంగాల గురించి ఈవారం తెలుసుకుందాం.

ముఖ్యమంత్రి విజయా గార్డెన్స్‌కి చేరుకోగానే, ప్రవేశద్వారం వద్ద ఎన్.టి.రామారావు, వారి సోదరుడు, నిర్మాత నందమూరి త్రివిక్రమరావు, వాహిని ప్రొడక్షన్స్‌కి చెందిన నిర్మాత దర్శకులు బి.ఎన్.రెడ్డి, విజయ ప్రొడక్షన్స్ వారి నాగిరెడ్డి, చక్రపాణి, దర్శకులు కె. వి. రెడ్డి, రచయిత డి. నరసరాజు, నటులు కాంతారావు, గాయకులు ఘంటసాల, నిర్మాత డి.ఎల్. నారాయణ, రచయిత సముద్రాల, దర్శక నిర్మాత బి.ఆర్. పంతులు ముఖ్యమంత్రికి, ఆయన భార్యకి స్వాగతం పలికారు. సావిత్రి, జమున, రాజసులోచన, గిరిజ, కృష్ణకుమారి, షావుకారు జానకి, సూర్యకాంతం, జి. వరలక్ష్మి, పుష్పవల్లి, లక్ష్మీరాజ్యం వంటి నటీమణులు ప్రవేశ ద్వారం సమీపంలో నిలిచి వారికి పుష్పమాలలు వేశారు. ఎన్.టి.రామారావు ప్రతి ఒక్కరిని పేరు పేరునా ముఖ్యమంత్రికి పరిచయం చేశారు. చక్కని టీ పార్టీ జరిగి, సభ మొదలైంది. సంగీత దర్శకులు టి. చలపతిరావు సభకు అధ్యక్షత వహించవలసిందిగా బి.ఎన్. రెడ్డిని కోరారు. వేదికపై బి.ఎన్.రెడ్డి, ముఖ్యమంత్రి, వారి సతీమణి కూర్చున్నారు. బి.ఆర్. పంతులు, కె.వి.రెడ్డి ముఖ్యమంత్రికి పూలమాలలు వేయగా, వారి సతీమణికి లక్ష్మీరాజ్యం పూదండ వేశారు. ఘంటసాల ప్రార్థనా గీతాన్ని ఆలపించారు. తరువాత – దక్షిణ భారత సినీ పరిశ్రమ అసోసియేషన్ తరఫున ఎల్. శ్రీనివాసన్; నిర్మాతల తరఫున బి. నాగిరెడ్డి, సుందర్‍ లాల్ నహతా; నటీనటుల తరఫున ఎన్.టి.రామారావు, యస్. యస్. రాజేంద్రన్; గాయనీమణుల తరఫున పి. లీల; గాయకుల తరఫున ఘంటసాల; సినీ జర్నలిస్టుల తరఫున ఇంటూరి వెంకటేశ్వరరావు; సాంకేతిక నిపుణుల తరఫున లింగమూర్తి; తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ పరిశ్రమల జూనియర్ ఆర్టిస్టుల తరఫున కె. వినాయకం – వరుసగా వచ్చి ముఖ్యమంత్రికి పూలదండలు వేశారు. గట్టిగా మోగుతున్న చప్పట్ల మధ్య – తామంతా మహా నగరం మద్రాసులో సంతోషంగా బ్రతుకుతున్నట్టు వినాయకం ప్రకటించారు. మద్రాసు నగరం తరఫున వినాయకం ముఖ్యమంత్రికి ఖద్దరు దట్టి అందజేశారు.

బి.ఎన్.రెడ్డి లేచి మాట్లాడుతూ, “మద్రాసులో అందరికీ చిరపరిచితులైన ముఖ్యమంత్రిని ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. కానీ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా వారు మన ఆహ్వానం మీద తొలిసారి మద్రాసు వచ్చారు. తమ గౌరవార్థం ఏర్పాటు చేసిన ఈ సభకి హాజరయ్యేందుకు ఆయన అంగీకరించడం ముదావహం. ఈ సమావేశంలో ఆయనకి మనం ఎదుర్కుంటున్న సమస్యలు చెప్పుకుందాం. అలాగే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం హైదరాబాదులో తెలుగు సినీ పరిశ్రమ కేంద్రం ఏర్పాటుకి సంబంధించి చేసిన ప్రకటనల వల్ల కలిగిన అపోహలను తొలగించుకుందాం. వీటి గురించి వారికి వినతిపత్రాలు ఇద్దాం” అన్నారు. తరువాత ముఖ్యమంత్రికి సన్మాన పత్రం అందజేశారు.

యస్.వి.రంగారావు చేసిన ప్రసంగం సంచలనం సృష్టించింది. గంభీరమైన స్వరంతో, ఏ ఆటంకాలు లేకుండా, మైకు ముందు ఆయన ప్రసంగం కొనసాగింది – “నేను ఎంతో సుదినం, ఎందుకంటే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి మద్రాసు వచ్చారు. మన అందరి తరఫున ఆయనకు హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. సాధారణంగా రాజకీయ నాయకులు సినిమాలపై ఆసక్తి ప్రదర్శించరు (బహుశా ఆ రోజుల్లోనేమో?). కానీ మన ముఖ్యమంత్రికి సినిమాలు ఇష్టం, పైగా మన పరిశ్రమను మెరుగుపర్చాలనుకుంటున్నారు. అందుకు వారికి అభినందనలు. తెలుగు సినీ పరిశ్రమను అభివృద్ధి పరిచేందుకు చర్యలు తీసుకుంటామని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించినప్పుడు మా హృదయాలు సంతోషంతో నిండిపోయాయి. మాలో పెద్దలను ఎంచుకుని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఒక సలహా మండలిని నియమిస్తుందని ఆశించాము. కానీ అలా జరగలేదు. మా అభిప్రాయాలు అడగనందుకు మాకు బాధగా లేదు. అయితే ప్రభుత్వం ప్రతిపాదించిన సహాయం పట్లు మాకు సందేహాలు ఉన్నాయి… అది అర్హులకు దక్కుతుందో లేదో అని! హైదరాబాదులో చిత్రీకరణ జరిపిన సినిమాలకి రూ.50,000/- ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే హైదారాబాదులోని సారథి స్టూడియోస్ ‘మా ఇంటి మహాలక్ష్మి’ సినిమా నిర్మించింది. అయితే నిర్మాతలకి ఈ సాయం అందనేలేదు. మరో నిర్మాత గంగాధరరావు హైదారాబాద్ ఫిల్మ్స్ అనే సంస్థని స్థాపించి, కొన్ని సినిమాలు తీసారు. ప్రభుత్వం ప్రకటించిన సాయం కోసం ఆయన ఎందరో అధికారులను కలిసారు, కానీ ఉపయోగం లేకపోయింది. చేసేదేం లేక, చివరికి ఆయన మద్రాసు వచ్చేసారు – తన కొత్త ప్రాజెక్టుకి. ప్రభుత్వం ప్రకటించిన సాయానికి ఆయన కంటే అర్హులెవరైనా ఉన్నారా? పరిస్థితి ఇలా ఉంటే చిన్న నిర్మాతల మాటేంటి? హైదరాబాదులో చిత్రాలు నిర్మిద్దామనుకున్నవారంతా వెనుకంజ వేస్తున్నారు. ఇటీవల ప్రసిద్ధులైన ఓ తెలుగు హీరో హైదారాబాద్‌కి షిఫ్ట్ అయ్యారు, తరచుగా ఆయనతో సినిమాలు తీసే నిర్మాతలకే ప్రభుత్వ సాయం అందుతోంది. ఇది సమంజసమేనా? (ఆ నటుడెవరో ఊహించినందుకు బహుమతులు ఏవీ లేవు…). అయ్యా ముఖ్యమంత్రి గారు, ఇటువంటి పక్షపాతానికి ముగింపు పలకండి. ప్రభుత్వ పథకాల వల్ల అందరికీ మేలు కలిగేలా చూడండి. తెలుగు సినీ పరిశ్రమ జననం ఇక్కడే మద్రాసులో జరిగింది. ఇక్కడే ఉన్నత స్థానానికి చేరింది, ఇందుకు దేశంలోని అన్ని భాషలకు చెందినవారు చెమటోడ్చారు. ఈ పరిశ్రమని ఉన్నట్టుండి తరలిస్తారా? ఒక చెట్టును మూలాలతో సహా పెకిలిస్తే, అది చనిపోదా? అలాగే ఉన్నట్టుండి రాత్రికి రాత్రే తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాదుకి తరలాలంటే ఎలా, అక్కడ పరిశ్రమ నిలదొక్కుకోవద్దూ? సౌకర్యాల మాటేమిటి? సాంకేతిక నిపుణుల సంగతి ఏంటి? వివిధ స్థాయిల నటీనటుల పరిస్థితి ఏంటి? బి నాగిరెడ్డి లేదా యన్.టి.రామారావు ఉన్నట్టుండి హైదరాబాదు వచ్చేసి సినిమాలు తీయగలరా? తెలుగు నటీనటులు అన్ని దక్షిణాది భాషల చిత్రాలలోనూ, హిందీ సినిమాలలోను నటిస్తున్నారు. వాళ్ళ డేట్లు, ఇతర సౌకర్యాలు ప్రభావితం కావా? మద్రాసులో నివసిస్తూ అన్ని భాషలలోనూ నటించే చిన్న చిన్న సినీ కుటుంబాల మాటేమిటి? అలా జరిగితే ఎంత నష్టం? మీరు అనుభవజ్ఞులైన గౌరవనీయులైన రాజకీయ నాయకులు. మీకు మా ప్రయోజనాలే ముఖ్యమని మాకు తెలియదా? కానీ హఠాత్తుగా ఉన్నట్టుండి హైదరాబాద్ వచ్చేయమంటే ఎలాగ? ఈ విషయాలనీ, మమ్మల్ని మనసులో పెట్టుకుని మా విన్నపాలు ఆలకించండి. ఏవైనా సందేహాలుంటే పరిశ్రమలోని పెద్దలను సంప్రదించండి. హైదారాబాదులో స్థిరపడినవారు స్వీయప్రయోజనాలకు అనుగుణంగా వాస్తవాలను దాచిపెట్టి, అపోహలను ప్రచారం చేస్తున్నారు – తెలుగు చిత్ర పరిశ్రమకు హైదరాబాదుకు రావడం ఇష్టం లేదనీ, ఇక్కడ ఉన్నవారికి తెలుగు ప్రజలంటే అభిమానం లేదని ప్రచారం చేస్తున్నారు. మమ్మల్ని అర్థం చేసుకుని, మద్రాసులో నివసిస్తున్న తెలుగు నటీనటులపైనా, సాంకేతిక నిపుణులపైన ఉన్న అపోహాలను తొలగించాలని కోరుతున్నాను. ఇంకో చేదు నిజం ఏంటంటే – తమిళులు మమ్మల్ని గౌరవంగా చూడడం లేదనీ, కించపరుస్తున్నారనే పుకార్లతో తెలుగువాళ్ళ మనసులు పాడుచేస్తున్నారు. ఇది నిరాధారమైన అపోహ. నేను, కన్నాంబ, భానుమతి, సావిత్రి, అంజలి, జనున, షావుకారు జానకి మొదలైనవారమంతా తమిళంలోనూ నటిస్తాం, మమ్మల్ని ఎంతో గౌరవంతో చూస్తారు. ఆదుర్తి సుబ్బారావు, బి.ఎన్.రెడ్డి, భీంసింగ్, సి. పుల్లయ్య, తాతినేని ప్రకాశరావు వంటి దర్శకులు తమిళంలోనూ సినిమాలు తీస్తారు. పి. సుశీల, ఎస్. జానకి, జిక్కి, జమునారాణి, ఎ.ఎం.రాజా, పి.బి.శ్రీనివాస్, ఘంటసాల వంటి గాయనీగాయకులు తమిళంలోనూ పాడతారు. ఎ.ఎం. రాజా, యస్. రాజేశ్వరరావు, ఘంటసాల, టి. చలపతిరావు వంటి సంగీతదర్శకులు తమిళ సినిమాలకీ సంగీతం అందిస్తారు. ఏనాడూ తమిళులెవ్వరూ మమ్మల్ని అవమానించలేదు. ఎవిఎం, జెమిని, పక్షిరాజా, ఆర్ ఆర్ పిక్చర్స్, మోడరన్ థియేటర్, పద్మిని పిక్చర్స్, వీనస్, విఠలాచార్య వంటి తమిళ, కన్నడ చిత్రనిర్మాణ సంస్థలు తెలుగు సినిమాలు కూడా తీస్తాయి. మాకు పరస్పర గౌరవం, ప్రేమా ఉన్నాయి (యస్.వి.రంగారావు ఈ మాటలు అనగానే పెద్దగా చప్పట్లు మ్రోగాయి). ఇక్కడి ప్రభుత్వం మా పట్ల సానుభూతితో ఉంది, కావలసిన సౌకర్యాలు అన్నీ కల్పించింది. మా పట్ల ఎటువంటి వివక్షా లేదు. నేను ఇందాక చెప్పిన సమస్యలను పరిష్కరించండి. హైదరాబాదులో తెలుసు సినీ పరిశ్రమ స్థిరపడేందుకు అన్ని ఏర్పాట్లు, సౌకర్యాలు కల్పించండి. తెలుగువాళ్ళం ఎక్కడున్నా మీ వాళ్ళమే. మేం ఎక్కువగా తమిళులమని భావించకండి. అవును, మేము తమిళులతో కలిసి ప్రశాంతంగా గౌరవంగా బ్రతుకుతున్న తెలుగువాళ్ళమే! మీ సన్మాన సభలో ఇలా మాట్లాడినందుకు క్షమించండి, కానీ మా బాధలు మీకు తప్ప మరెవరికి చెప్పుకోగలం? మేం తెలుగు కళామతల్లి బిడ్డలం. ఆమె ప్రస్తుతం ఆంధ్రలో ఉంది, అయినప్పటికీ ఇక్కడున్న మేమంతా ఆమెకి, మీకు, ఆంధ్రకు చెందినవారమే. మా ఆలోచనలన్నీ మీతో ఉన్నాయి. మేం ఎంతో భావపూర్ణంగా తెలుగువారి కోసం తెలుగు చిత్రాలు తీస్తాం. మన ఆహ్వానాన్ని మన్నించి, ఇక్కడికి విచ్చేసి మన సమస్యలు ఆలకించిన ప్రియమైన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తూ, నేను నా ప్రసంగాన్ని ముగిస్తాను” అంటూ ఉపన్యాసం ముగించారు.

ముఖ్యమంత్రి తన ప్రసంగంలో ఈ విధంగా ప్రతిస్పందించారు – “ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మద్రాసు రావడం ఇదే మొదటిసారి. నన్ను ఇక్కడికి ఆహ్వానించి, సత్కరించినందుకు నాకెంతో సంతోషంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు. మీ అందరిలాగే, నాక్కూడా మద్రాసేమీ కొత్త కాదు. మీరు ఇక్కడే ఉండడం పట్ల నాకేమీ కోపం లేదు. మద్రాసులో ఉండే తెలుగువారికి గౌరవం లేదనుకోవడం, అక్కడ ఉండే తెలుగువారికి అధిక గౌరవం లభిస్తుందనుకోవడం పొరపాటు. యస్.వి.రంగారావు చెప్పిన – తెలుగు తమిళ సినిమాలలో నటిస్తూ – తెలుగు కళాకారులకు పేరు ప్రఖ్యాతులు తెస్తున్న వారందరికీ నా శుభాకాంక్షలు. హైదరాబాదులోని చక్కని వాతావరణం, సమృద్ధిగా లభించే మంచినీటి కారణంగా తెలుగు సినీ పరిశ్రమను అక్కడికి తరలివచ్చేందుకు మేము ప్రోత్సహిస్తున్నాము (ఇక్కడ గమనించాల్సిన విషయం మరొకటి ఉంది – యన్.టి.రామారావు ముఖ్యమంత్రి అయ్యాకా, తెలుగు గంగ ప్రాజెక్టును అమలు చేసి మొత్తం మద్రాసుకు మంచినీరు అందించే కృషి చేశారు. నేను రాజకీయాలు మాట్లాడడం లేదు, కానీ దీని వల్ల ఆయనకు మద్రాసు పట్ల వున్న అభిమానం స్పష్టమవుతుందని చెప్పడం నా ఉద్దేశం). అవును, ఏదీ తొందరపడి చేపట్టకూడదు. ఈ సమస్యను చర్చించేందుకు రాజకీయ నాయకులమయిన నేను, యం. చెన్నారెడ్డి, పి.వి. నరసింహారావు ఒక బృందంగా ఏర్పడి ఉండకూడదు. ఆ బృందంలో సినీ పరిశ్రమకు చెందిన పెద్దలు ఉండాలన్న మీ ఆలోచన సరైనదే. ఈ ఆలోచనని క్రమక్రమంగా అమలు చేస్తాము. నాకు ఒకరి పట్ల పక్షపాతం ఉందని భావించడం పొరపాటు. నేను బ్రహ్మానంద రెడ్డిని… హైదరాబాదులోని ప్రఖ్యాత నటుడిని గాని లేదా ఇక్కడి బి.ఎన్.రెడ్డిని గాని గుడ్డిగా విశ్వసించను. అన్ని వాస్తవాలను పరిగణనలోకి తీసుకుని ఏం చేస్తే మంచిదో అదే చేస్తాను. హైదరాబాదులో ఉంటున్న వారి సూచనలను ఇక్కడ మీమీద బలవంతంగా రుద్దుతామని భయపడకండి. నా దృష్టిలో అందరూ సమానమే. తెలుగు సినీ పరిశ్రమని అభివృద్ధి చేయడానికి హైదరాబాదు చక్కని నగరం. ఎంతో వైశాల్యం ఉంది, బొంబాయి, బెంగుళూరు, మద్రాసు నగరాలతో సంబంధాలున్నాయి.  అవసరమైన మౌలిక వసతులు కల్పించాలన్నదే మా ఉద్దేశం, తద్వారా ప్రజలు అన్ని నగరాలకు వేగంగా వెళ్ళగలుగుతారు. ఇది జరుగుతుంది. అలాగే మీ ఇబ్బందులను పరిశీలించి ఒక తుది నిర్ణయం ప్రకటిస్తాము. తెలుగు ప్రజలు చీలిపోయారన్న అపార్థాన్ని తొలగించండి. మనం తమిళులని ప్రేమిస్తాం, నాకు తెలుసు వారూ కూడా మనల్ని ప్రేమిస్తారు (తెలుగు సినీ పరిశ్రమకు తెలుగు ముఖ్యమంత్రుల కంటే ముఖ్యమంత్రిగా జయలలిత ఎంతో ఎక్కువ చేశారని నాకు సినీరంగానికి చెందినవారు చెప్పారు). మనందరం కలిసి పని చేద్దాం. ఇందుకు మీ సహకారం కావాలి. అందరికీ ధన్యవాదాలు.”

కొత్త ముఖ్యమంత్రి ఉద్దేశాలను అభినందిస్తూ బి.ఎన్.రెడ్డి వందన సమర్పణ చేశారు. గత ప్రభుత్వానికి ఈ విషయంలో తగినంత అనుభవం లేదనీ ఆయన అన్నారు. పరిశ్రమ హైదరాబాదుకు తరలిరావాలంటే అన్ని సౌకర్యాలు ఉన్న వాహిని వంటి పెద్ద స్టూడియోలను హైదరాబాదులో నిర్మించాలని ఆయన అన్నారు. కేవలం భూములు కేటాయిస్తే సరిపోదని, అక్కడికి వచ్చి పని చేసే దినసరి కార్మికులకు ఇళ్ళు  నిర్మించి ఇవ్వాలని కోరారు. అంతా మంచి జరుగుతుందని ఆశిస్తూ ఆయన తన ఉపన్యాసం ముగించారు. మొత్తం మీద వారు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిని మద్రాసుకు రప్పించి, తమ అభిప్రాయాలను స్పష్టం చేశారు.

***

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here