అలనాటి అపురూపాలు-50

0
2

సినిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపరూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

వెండితెరపై మెరిసిన కుమ్‍కుమ్:

బీహార్ లోని హుస్సేనాబాద్‌లో జన్మించిన కుమ్‍కుమ్ అసలు పేరు జేబున్నీసా. ఆమె తండ్రి నవాబ్ మంజూర్ హసన్ ఖాన్ పాట్నా సమీపంలోని హుస్సేనాబాద్‍లో ఒక భూస్వామి. ఆర్థిక పరిస్థితి క్షీణించడంతో ఆ కుటుంబం కలకత్తాకి తరలి వెళ్ళింది. అయితే హసన్ ఖాన్ బీహార్ లోనే ఉండిపోయారనీ, తరువాత పాకిస్తాన్‍కి వెళ్ళిపోయారని చెబుతారు. లక్నోలో శంభూ మహరాజ్ శిష్యరికంలో కథక్ నేర్చుకున్నారు కుమ్‍కుమ్. 1952లో కుటుంబంతో కలిసి బొంబాయి చేరుకున్నారు. ఆమెకి నౌషాద్ పరిచయం ఉండడంతో, తొలి రోజుల్లో ఆయన సినీ అవకాశాలు ఇప్పించారని అంటారు. నిర్మాత షహీద్ లతీఫ్ గారితో నౌషాద్ ఓ మాట చెప్పడంతో, 1952లో ‘సీషా’ అనే చిత్రంలో కుమ్‍కుమ్‍కు అవకాశం దొరికింది. అప్పడామె వయసు కేవలం 16 ఏళ్ళే. ఆ సినిమాలో గులామ్ మహమ్మద్ సంగీతం సమకూర్చగా షంషాద్ బేగం పాడిన ‘ఆంగనా బజే షహనాయి రే’ పాటకి నృత్యం చేశారు. ఈ సినిమాలో నర్గిస్, సజ్జన్‍లు నాయికా నాయకులు. తెర మీద కొద్ది సేపే కనబడినప్పటికీ, ప్రేక్షకులపై చక్కని ప్రభావం చూపారు కుమ్‍కుమ్. త్వరలో మరిన్ని అవకాశాలు వచ్చాయామెకు.

గురుదత్ ‘ఆర్ పార్’తో ఆమెకి కీర్తి ప్రతిష్ఠలు లభించాయి. తొలుత ‘కభీ ఆర్ కభీ పార్’ అనే పాటను జగదీప్‍పై చిత్రించగా, ఆ పాటని మహిళపై చిత్రీకరిస్తే బాగుంటుందని సెన్సార్ నుంచి సూచన రాగా, అప్పుడు కుమ్‍కుమ్‍పై చిత్రీకరించారట! సినిమాని త్వరగా పూర్తి చేయాలనే హడావిడిలో ఉన్న గురుదత్ ఆ పాటకి నృత్యరీతులు తానే సమకూర్చారు. ఆ పాట బాగా హిట్ అయి, కుమ్‍కుమ్‍కి మంచి పేరు, అవకాశాలు వచ్చాయి. గురుదత్ ఆమెకి నటిగా కూడా అవకాశాలు ఇచ్చారు. ‘మిస్టర్ అండ్ మిసెస్ 55’ చిత్రంలో గురుదత్‍కి వదినగా నటించారు. ఆ సమయంలో తనది చిన్న వయసే అయినప్పటికీ, ఐదుగురు పిల్లల తల్లిగా నటించారు. మదర్ ఇండియా (1957), ప్యాసా (1957), కోహినూర్ (1960), సన్ ఆఫ్ ఇండియా (1962), ఉజాలా (1959), మిస్టర్ ఎక్స్ ఇన్ బాంబే (1964), ఆంఖేఁ (1968), లల్‌కార్ (1972), గీత్ (1970), ఏక్ కున్వారీ ఏక్ కున్వారా (1973) వంటివి ఆమెకు పేరు తెచ్చిన సినిమాలు. ఆమె భోజ్‍పురి సినిమాల వైపు మళ్ళి ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలలో నటించారు. తొలి భోజ్‌పురి సినిమాగా చెప్పబడే ‘Ganga maiya tohe piyari chadhaibo’ (1963)లో నటించారు. ఇంకా, ‘గంగా’, ‘భౌజీ’ అనే భోజ్‍పురీ చిత్రాలలో హీరోయిన్‍గా నటించారు.

ఎన్నో సినిమాలలోని పాటలకు ముఖ్యంగా… సిఐడి (1956) చిత్రంలో ‘ఏ దిల్ హై ముష్‍కిల్ జీనా యహాఁ’ అనే పాటకి; బసంత్ బహార్ (1956) చిత్రంలోని ‘జా, జా రె జా బలమా’ అనే పాటకి; నయా దౌర్ (1957) సినిమాలో ‘రేష్మీ సల్వార్ కుర్తా జలీ కా’ అనే పాటకి; ఉజాలా (1959) చిత్రంలోని ‘తేరా జల్వా జిస్నే దేఖా’ అనే పాటకి; కోహినూర్ (1960) సినిమాలో ‘మధుబన్‍ మె రాధికా నాచే రే’ అనే పాటకి; కాలీ టోపీ లాల్ రుమాల్ (1959) చిత్రంలో ‘దగా దగా వై వై వై’ అనే పాటకి; రాజా అవు రంక్ (1968) చిత్రంలో ‘మేరా నామ్ హై చమేలీ’ అనే పాటకి ఆమె చేసిన నృత్యాలు అపూర్వం.

1973 వరకు ఆమె హిందీ చిత్రసీమలో క్రియాశీలకంగా ఉన్నారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా రూపొందించిన ‘జల్తే బదన్’ (1973) నిజానికి ఆమె చివరి సినిమా. ఇందులో కిరణ్ కుమార్ హీరో. అయితే పదేళ్ల పాటు నిర్మాణం కొనసాగించుకుని 1979లో విడుదలైన ‘బాంబే బై నైట్’ చిత్రంలోనూ నటించారు కుమ్‌కుమ్. ఈ సినిమాలో సంజీవ్ కుమార్ కథానాయకుడు. కానీ బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం విఫలమైంది. 1975లో కుమ్‍కుమ్ వివాహం చేసుకున్నారు. ఆమె భర్త సజ్జద్ అక్బర్ ఖాన్ సౌదీ అరేబియాలో పని చేసేవారు. పెళ్ళి తరువాత, కుమ్‍కుమ్ కూడా అక్కడే స్థిరపడ్డారు. ఈ దంపతులకు అందాలీబ్ అనే కూతురు పుట్టింది. దాదాపు 20 ఏళ్ళ పాటు గల్ఫ్ లోనే ఉన్న కుమ్‍కుమ్ ఇండియాకి వచ్చిన తరువాత చిత్రపరిశ్రమకి దూరంగా ఏకాంతంలో ఉండిపోయారు. 86 ఏళ్ళ వయసులో 28 జూలై 2020 నాడు కుమ్‍కుమ్ మరణించారు.

***

1957లో టి.ఎం. రామచంద్రన్ కుమ్‍కుమ్‍తో జరిపిన ఇంటర్వ్యూ:

టాప్ స్టార్స్ శాసించే పరిశ్రమలో – ఈ పోటీ ప్రపంచంలో – యువ కళకారులు స్వశక్తితో రాణించి ఉన్నత స్థానానికి చేరటం ఎంతో కష్టం. ఈ మధ్యనే నాట్యగత్తె పాత్రల నుంచి ప్రాధాన్యత గల పాత్రలకు మారిన కుమ్‍కుమ్ అలాంటి వర్ధమాన కళాకారిణి… విమర్శకులు, ప్రేక్షకులు మెచ్చిన నటి. ప్రతిభామూర్తి, చురుకైన మనిషి, పట్టుదల గలిగిన వ్యక్తి అయిన కుమ్‍కుమ్ సినీరంగంలో ప్రవేశించి ఐదేళ్ళవుతోంది.

బాంద్రాలోని వాళ్ళ ఇంట్లో కుమ్‍కుమ్‍తో కలిసి భోం చేస్తుండగా, నాతో కుమ్‍కుమ్ అన్నారు – “ఐదేళ్ళ పాటు కష్టపడిన తర్వాత… నేను నిచ్చెన అట్టడుగు మెట్టుపై పాదం మోపగలిగాను. ఇంకా నేను ఎన్నో మెట్లు ఎక్కాలి. ఉన్నత స్థానం చేరేలోపు ఎన్నో గుంతలుంటాయని నాకు తెలుసు. నేనో వర్ధమాన నటిని. సదా అప్రమత్తంగా ఉండాలి. పోటీ, ఇంకా వృత్తి లోని అనిశ్చితి మరింత కష్టపడేలా చేస్తాయి, అది నాకెంతో సంతోషాన్ని కలిగిస్తుంది. నా నిజాయితీ పట్ల, నాకు నమ్మకం ఉంది. నేను ఆశావాదంతో జీవిస్తాను.”

నటన అంటే ఉన్న ప్రేమ మొదట ఆమెను నాట్యగత్తె గాను, తరువాత నటిగానూ మార్చింది. మధ్యతరగతి ముస్లిం కుటుంబంలో ‘జేబున్నిసా’గా జన్మించిన కుమ్‍కుమ్ పదేళ్ళ వయసు నుంచి సినీ నటి అవ్వాలని కోరుకున్నారు.

కళ్ళలో గతకాలపు జ్ఞాపకాలు మెదులుతుండగా, “నేనో సాధారణమైన ఆడపిల్లననీ, నాలో ఏ ప్రత్యేకతా లేదని మా అమ్మ అనేది. కాబట్టి సినీ నటిని అవ్వాలనే కలలు కనడం ఆపమంది. అయితే అమ్మ అభిప్రాయం సరైనదేనని నేనెన్నడూ విశ్వసించలేదు. ఆమె నన్ను ఎంతగా నిరుత్సాహపరిస్తే, నేను అంతగా – ఏనాటికైనా వెండి తెర మీదా రాణిస్తాననేనా మీద నా నమ్మకం పెంచుకునేదాన్ని. తన స్థాయిలో తానొక నటి అయిన మా పెద్దక్క రాధిక నన్ను ప్రోత్సహించిది, నాకు శిక్షణనిప్పించమని మా అమ్మని ఒత్తిడి చేసింది” చెప్పారు కుమ్‍కుమ్.

కుమ్‍కుమ్ లక్నోలో శంభూ మహరాజ్ శిష్యరికంలో కథక్ నేర్చుకున్నారు. 1952లో కుటుంబంతో కలిసి బొంబాయి చేరుకున్నారు. అక్కడ ఆమె దగ్గరి బంధువు నటి నిర్మల ఆమెకి అవకాశాల కోసం ప్రయత్నించారు. నిర్మాత షహీద్ లతీఫ్ గారితో ఆమె ఓ మాట చెప్పడంతో, 1952లో ‘సీషా’ అనే చిత్రంలో కుమ్‍కుమ్‍కు అవకాశం దొరికింది. అప్పటికి కుమ్‍కుమ్ టీనేజ్‍లో ఉన్నారు. ఈ సినిమాలో ఆమెది కేవలం కొద్ది సేపు నర్తించే పాత్ర. అయితే ఆ కొద్ది సమయంలోనే ఆమె అందరినీ ఆకట్టుకోగలిగారు. ఆమె నృత్యం లోని తాజాదనం నిర్మాతలకు నచ్చింది. మరిన్ని అవకాశాలు లభించాయి.

“ఇప్పటి వరకు, నేను వేషాలు కోసం ఎవరినీ యాచించలేదు. దేవుడి దయ వలన నాకు పలు అవకాశాలు ఒకదాని తర్వాత ఒకటి లభించాయి. అయినా నాకు తృప్తిగా లేదు. నా ప్రమాణాలను పెంచుకోవాలని చూస్తున్నాను. నాట్యంలోనూ, నటనలోను ఇంకా మెరుగవ్వాలి. ఇందులో నాకు మార్గదర్శకులు ఎవరూ లేరు. అయితే ఈ సందర్భంగా దర్శకులు మహబూబ్ గారి గురించి చెప్పుకోవాలి. ఆయన నాకెంతో మేలు చేశారు. వారి మదర్ ఇండియా (1957) చిత్రం నాకో గుర్తింపునిచ్చింది. అది మంచి పాత్ర. సినిమా విజయవంతమయితే, పాత్రధారులకూ పేరొస్తుంది” అన్నారు.

అదృష్టవశాత్తు కుమ్‍కుమ్ సినిమాలు – ఇప్పటి వరకు ఆమె సుమారు 20 చిత్రాలలో నటించారు – చాలా వరకు విజయవంతమయ్యాయి. వాటిల్లో – ఆర్ పార్, మిస్టర్ అండ్ మిసెస్ 55, నయా అందాజ్, బఢా భాయ్, ఏక్ హీ రాస్తా, నయా దౌర్, సిఐడి, ప్యాసా, మదర్ ఇండియా, బసంత్ బహార్, దుష్మన్,  సతీ మదాలస, ఘర్ సంసార్ – ప్రస్తావించదగ్గవి. వీటిల్లో చాలా సినిమాల్లో ఆమెకు నటనకు అవకాశమున్న పాత్రలు లభించాయి, తద్వారా ప్రేక్షకులను ఆకట్టుకోగలిగారు. కుమ్‍కుమ్ ప్రస్తుతం కథానాయికగా ‘సుబా కా భూలా’, ‘సచ్చే కా బోల్ బాలా’ రెండు సినిమాలలో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలకు ప్రముఖ కమెడియన్ భగవాన్ దర్శకనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కుమ్‍కుమ్ – కోహినూర్, మిస్టర్ కార్టూన్ ఎంఎ, స్వర్ణ సుందరి, దునియా ఘుంక్తా హై, కాలీ టోపీ లాల్ రుమాల్, ఉజాలా, షాన్-ఎ-హింద్ అనే సినిమాల్లోనే కాకుండా ఇంకా పేరు పెట్టని గురుదత్ సినిమాలో కూడా నటిస్తున్నారు.

చివరగా, ఈ అనుభవం తనకేం నేర్పిందని ఆమెని ప్రశ్నించాను. బదులుగా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, “ఈ అనుభవం – వినయంగా ఉండడం నేర్పింది. ప్రతి ఒక్కరినీ గౌరవంగా చూడడం నేర్పింది. ఈ ప్రపంచంలో ప్రతీ జీవికి… అదెంత చిన్నదైనా.. చీమ కావచ్చు లేదా వానపాము కావచ్చు, దానికంటూ పాటించాల్సిన ప్రత్యేకమైన కర్తవ్యం ఉంటుంది, దాన్ని పాటించాలి. ఏ ఒక్కరినీ హేళన చేయకుండా, అందరినీ ప్రేమించాలని నేర్పింది. ఇదే మిత్రులని, ప్రేమని సంపాదించుకునే ఖచ్చితమైన మార్గం” అన్నారామె.

ప్రకృతి అంటే బాగా ఇష్టపడే కుమ్‍కుమ్ ఖాళీ సమయాలను ఇంటి పనులు చేసుకుంటూ తన ఇంట్లోనే ఆస్వాదిస్తారు. ప్రస్తుతానికి పెళ్ళి చేసుకునే ఆలోచన లేదన్నారు.

ఇంటర్వ్యూని ముగిస్తూ, “ప్రస్తుతానికి రొమాన్స్‌కీ, పెళ్ళికి నాకు తీరిక లేదు. నా పనిలో ఎంతో బిజీగా ఉన్నాను, తృప్తిగా ఉన్నాను. అది చాలు నాకు” అన్నారు కుమ్‍కుమ్.

***

***

కుమ్‍కుమ్ గారివి నాకిష్టమైన నృత్యాలు రెండు:

~

కోహినూర్ (1960) సినిమాలో ‘మధుబన్‍ మె రాధికా నాచే రే’

https://www.youtube.com/watch?v=8NzSyyOX0yo

~

కాలీ టోపీ లాల్ రుమాల్ (1959) చిత్రంలో ‘దగా దగా వై వై వై’

https://www.youtube.com/watch?v=p6x-BdCW1mk

చిన్న వయసులోనే గతించిన హాలీవుడ్ నటి జీన్ హార్లో:

అది 7 జూన్ 1937. అప్పటి ప్రముఖ నటి జీన్ హార్లో 26 ఏళ్ళకే యురెమిక్ పాయిజనింగ్ (అక్యుట్ రీనల్ ఫెయిల్యూర్ లేదా అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అని ఇప్పుడు అంటున్నారు) కారణంగా హఠాత్తుగా మరణించిదని తెలుసుకుని హాలీవుడ్ విస్మయానికి లోనయ్యింది.

జీన్ హార్లో 3 మార్చి 1911న మిస్సోరిలోని కన్సాస్ నగరంలో జన్మించారు. ఆమె అసలు పేరు Harlean Carpenter. నిజానికి వాళ్ళ అమ్మ పేరు జీన్ హార్లో. అయితే కూతురు తన పేరుని తెర పేరుగా ఉపయోగించుకోడం మొదలుపెట్టగానే, ఆవిడని అందరూ ‘మదర్ జీన్’ అని పిలవసాగారు. Harlean చిన్నగా ఉన్నప్పుడు ‘మదర్ జీన్’ సినిమా నటి అవ్వాలని గట్టిగా కోరుకున్నారు. అందుకు దంతవైద్యుడైన తన భర్తకు విడాకులిచ్చి, కూతురుని తీసుకుని హాలీవుడ్‍ చేరుకున్నారు, కాని లక్ష్య సాధనలో విజయం పొందలేకపోయారు. అందువల్ల తల్లీకూతుర్లు తిరిగి మిడ్‌వెస్ట్ చేరుకున్నారు. అక్కడ ‘మదర్ జీన్’ – మరినో బెల్లో అనే అతనిని మళ్ళీ పెళ్ళి చేసుకున్నారు. 15 ఏళ్ళ వయసులో Harlean కి ఎర్రమచ్చల జ్వరము సోకింది (చిన్న వయసులోనే ఆమె చనిపోవడానికి ఈ జ్వరమే కారణమైంది). అయితే త్వరలోనే కోలుకుని, ఆరోగ్యం మెరుగుపర్చుకుని తన మూడు పెళ్ళిళ్ళలో మొదటి పెళ్ళి చేసుకున్నారు. 20 ఏళ్ళ ఛార్లెస్ మెక్‌గ్రూని వివాహం చేసుకున్నప్పుడు ఆమె వయసు 16 ఏళ్ళే.

ఆ మరుసటి సంవత్సరం ఛార్లెస్‌కి వారసత్వంగా కొంత సంపద కలిసొచ్చింది. భార్యతో కలిసి బెవెర్లీ హిల్స్‌కి వెళ్ళిపోయాడు. అక్కడ ఈ జంట అత్యంత విలాసవంతంగా జీవించారు. ఓ నేస్తంతో కలిసి సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు ఫాక్స్ ఎగ్జిక్యూటివ్‍లు హార్లియన్‌ని చూశారు. తన తల్లి పేరును తెర పేరుగా పెట్టుకున్నప్పటికీ, నిజానికి ఓ స్టార్ అవ్వాలని ఆమెకెన్నడూ లేదు. కాకపోతే, సినిమాలంటే ఆమెకి ఆసక్తి ఉంది; ప్రేక్షకులని ఆకట్టుకునే అందమూ ఉంది. ‘మదర్ జీన్’ ఒత్తిడితో, Harlean ఆడిషన్స్‌లో పాల్లొంటూ, లారెల్ అండ్ హార్డీ షార్ట్ ఫిలిమ్స్‌లో నటించసాగారు. సినిమాల్లో నటించేందుకు భర్త అంగీకరించకపోవడంతో అతనికి విడాకులిచ్చారు. 1929లో వచ్చిన The Saturday Night Kid చిత్రంలో చిన్న పాత్రే పోషించినప్పటికీ, ప్రధాన నటి ‘క్లారా బో’ కన్నా ఎక్కువగా ప్రేక్షకులని ఆకట్టుకున్నారు.

1930లో వచ్చిన Howard Hughes తీసిన Hell’s Angels అనే సినిమాలో తొలుత అనుకున్న సైలెంట్ ఫిల్మ్ స్టార్ గ్రేటా నిస్సెన్ స్థానంలో ప్రధాన నాయికగా ఎంపికడంతో హార్లోకి తొలి పెద్ద అవకాశం దొరికింది. గ్రేటా నిస్సెన్ గట్టి  నార్వేజియన్ యాస మాట్లాడడం వల్ల, టాకీ సినిమాలకి నప్పరని దర్శకులు భావించారు. Hughes పబ్లిసిటీ డైరక్టర్ ‘Platinum Blonde’ అనే పదబంధాన్ని తొలిసారిగా ఉపయోగించారు. అదో గొప్ప నిక్ నేమ్‍గా మారి 1931నాటి ఫ్రాంక్ కాప్రా సినిమా పేరుగా మారింది. ఆ సినిమాలో సహాయ పాత్రలో నటించిన శ్వేత కేశాల హార్లోకి ఆ పేరు సరిగ్గా నప్పింది. జీన్ హార్లో హెయిర్ స్టైలిస్ట్ ప్రతీ వారం ఆమె కేశాలకు – ప్రమాదకరమైన మేళవింపులలో పెరాక్సైడ్, అమ్మోనియా, క్లోరాక్స్, లక్స్ ఫ్లేక్స్ – లతో రంగులద్ది అలంకరణ చేసేవారట. ఈ అలంకరణ ఎంతోమంది మహిళలకు నచ్చి ఆయా పదార్థాలను కొనుగోలు చేసి కేశాలంకరణకు ప్రయత్నించి విఫలమయ్యారుట. భవిష్యత్తులో మార్లిన్ మన్రో కూడా ఈ కేశాలంకరణని అనుకరించారట! హార్లో హెయిర్ స్టైలిస్ట్‌ని మార్లిన్ మన్రో కూడా నియమించుకుని తన కేశాలను అలంకరించుకున్నారట!

తరువాత హార్లో వరుస హిట్‍లని అందించారు – Bombshell (1933), Dinner At Eight (1933), Reckless (1935), ఇంకా Suzy (1936) వంటివి బాగా ఆడాయి. 1932 నాటి Red Dust సినిమాతో సహా, ఎన్నో చిత్రాలలో అలనాటి మహిళా మానస చోరుడు అయిన క్లార్క్ గేబుల్‌తో కలిసి నటించారు. అచిరకాలంలోనే హార్లో సెక్స్ సింబల్ గానూ, డైలాగులు చక్కగా చెప్పే నటిగానూ పేరుపొందారు. అయితే ఆమెకి ఎక్కువగా అంగాంగ ప్రదర్శన చేసే పాత్రలే వచ్చేవి.

నటనతో పోలిస్తే, ఆమె వ్యక్తిగత జీవితం కొంత అస్థిరంగా ఉండేది. 1932లో ఆమె ఎం.జి.ఎం. ఎగ్జిక్యూటివ్ పాల్ బెర్న్‌ని పెళ్ళి చేసుకున్నారు. కానీ పెళ్ళయిన రెండు నెలలకే తుపాకీ తూటా గాయంతో పాల్ తమ ఇంట్లోనే చనిపోయారు. మాజీ ప్రేయసి చేతిలో హత్యకి గురయ్యారని పుకార్లు వినిపించినప్పటికీ (పాల్ అప్పటికే వేరే మహిళతో వైవాహిక బంధంలో ఉన్నారని తర్వాత తేలింది), ఎం.జి.ఎం. జోక్యం వల్ల అతనిది ఆత్మహత్య అని ప్రకటించారు. సూసైడ్ నోట్ లాంటిది ఒకటి దొరికింది. “ప్రియాతిప్రియమైన ప్రియా! నీ పట్ల నేను చేసిన భయంకరమైన తప్పుని సరిదిద్దేందుకు, నికృష్టమైన నా అవమానాన్ని తొలిగించుకునేందుకు ఇదే మంచి మార్గం! ఐ లవ్ యూ. పాల్” అని ఉంది. అటువంటి నోట్ గురించి తనకేమీ తెలియదని హార్లో చెప్పారు.

పాల్ మరణం తర్వాత హార్లో సంతోషాన్ని వెతుక్కోసాగారు. పెళ్ళయి విడిపోయిన బాక్సర్ – మాక్స్ బేర్‍తో కొంతకాలం డేటింగ్ చేశారు. కానీ మాక్స్ భార్య – రంకుతనాన్ని కారణంగా పేర్కొంటూ భర్తతో విడాకులు కోరి, కేసులో హార్లోని చేర్చడంతో – ఎం.జి.ఎం వారు మరో వివాదాన్ని తప్పించడం కోసం సినిమాటోగ్రాఫర్ Harold Rosson తో హార్లో వివాహం జరిపించారు. ఇదే సమయంలో హార్లో అనారోగ్యానికి గురయి, అత్యవసరంగా ఎపెండెక్టెమీ ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది. మూడో పెళ్ళి ఎనిమిది నెలలకే ముగిసింది.

అయితే 1935 నాటికి జీన్ హార్లో – తన సహనటుడు ‘Reckless’, ‘Libeled Lady’ వంటి సినిమాల్లో నటించిన విలియమ్ పావెల్‍తో ప్రేమలో పడ్డారు. వీరిద్దరూ రెండేళ్ళపాటు డేటింగ్ చేశారు. పావెల్‍తో ఎంత సంతోషంగా ఉన్నప్పటికీ, హార్లో అతిగా మద్యం తాగసాగారు. ఫలితంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయి. తల నొప్పులు వస్తుంటే హాంగోవర్ గానూ, పొట్ట పెరిగిపోతుంటే – ఆల్కహాలు కారణంగా బరువు పెరుగుతున్నానని భావించారు హార్లో. పదేళ్ళ స్వల్పకాలిక కెరీర్‍లో త్వరలోనే ఆమె సౌందర్యం హరించుకుపోయి, వికారంగా మారారు. గతంలో కేశాలంకరణకి వాడిన రసాయనాలు ప్రభావం చూపించాయి. నాలుగు జ్ఞాన దంతాలను తొలగించే ఆపరేషన్ సందర్భంగా ఆమె గుండె స్వల్పకాలం పాటు కొట్టుకోవడం ఆగిపోయింది.

రెండు నెలల తర్వాత క్లార్క్ గేబుల్‌తో Saratoga అనే చిత్రంలో – ఆపరేషన్ కారణంగా నోరు వాచినప్పటికీ నటించారు. ఈ చిత్రంలో షూటింగ్‍లో జీన్ హార్లోకి కడుపు నొప్పి వచ్చింది, వాంతులయ్యాయి. దాంతో ఇంటికే పరిమితమయ్యారు. కొన్ని రోజుల తర్వాత పిత్తాశయపు వాపు అనే తప్పుడు రోగనిర్ధారణతో వైద్యం చేయించుకున్నారు. దీంతో ఆమె ఆరోగ్యం గురించి దిగులు చెందిన క్లార్క్ వచ్చి ఆమెను చూసి వెళ్ళారు. అప్పుడామె శరీరం విపరీతంగా వాచి పోయి, దుర్వాసన వస్తోందట. చివరగా మరో వైద్యులు సరైన రోగ నిర్ధారణ చేసి కిడ్నీ సంబంధిత వ్యాధిగా తేల్చారు, ఈ వ్యాధికి మూలం చిన్నతనంలో వచ్చిన మచ్చల జ్వరమని చెప్పారు. అయితే అప్పట్లో ఈ వ్యాధికి తగిన చికిత్స లేని కారణంగా ఎవరూ ఏమీ చేయలేకపోయారు (విజయవంతమైన కిడ్నీ డయాలసిస్‍ను తొలిసారిగా 1945 నాటికి, తొలి విజయవంతమైన కిడ్నీ మార్పిడిని 1954కి గాని చేయలేకపోయారు). రోగ నిర్ధారణ అయిన రెండు రోజులకు 7 జూన్ 1937న 26 ఏళ్ళకే హార్లో మరణించారు.

Saratoga సినిమాని ఆమె బాడీ డబుల్‌తో పూర్తి చేయాల్సి వచ్చింది. ఆ అనుభవాన్ని విషాదంగా చెబుతూ “దెయ్యం కౌగిలిలో నటించినట్లుంది” అన్నారు క్లార్క్. ఆమె శవాన్ని అత్యంత భారీ, తళతళమని మెరిసే, అప్పట్లో 5000 డాలర్ల విలువైన రాగి శవపేటికలో ఉంచారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here