అలనాటి అపురూపాలు-51

0
3

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపరూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

గజల్ రారాజు జగ్‌జీత్ సింగ్:

గజల్ రారాజుగా ప్రసిద్ధులైన సుప్రసిద్ధ గాయకులు శ్రీ జగ్‌జీత్ సింగ్ వ్యక్తిగత జీవితం, కెరీర్ గురించి ఈ వారం తెలుసుకుందాం.

జగ్‌జీత్ సింగ్ 8 ఫిబ్రవరి 1941 నాడు సర్దార్ అమర్ సింగ్ ధిమాన్, సర్దార్ణి బచ్చన్ కౌర్ దంపతులకు రాజస్థాన్ లోని శ్రీ గంగానగర్‍లో జన్మించారు. తండ్రి అమర్ సింగ్ ప్రభుత్వం వారి ప్రజా పనుల విభాగంలో సర్వేయర్ కాగా, తల్లి గృహిణి. ఆయనకు మొత్తం ఆరుగురు తోబుట్టువులు – ఇద్దరు సోదరులు, నలుగురు సోదరీమణులు. ఆయన అసలు పేరు జగ్‍మోహన్ సింగ్ ధిమాన్. ఖల్సా హైస్కూలులోనూ, ప్రభుత్వ కాలేజీలోనూ చదువుకున్నాక, జలంధర్ లోని డి.ఎ.వి కాలేజ్ నుంచి ఆర్ట్స్‌లో డిగ్రీ చేశారు. తన కుమారుడు ఇంజనీరింగ్ చదివి, బ్యూరోక్రాట్ కావాలని వారి తండ్రి కోరుకున్నారు. అదే సమయంలో సంగీతం పట్ల కొడుకు ఆసక్తికి అంగీకరించారు, సంగీతం నేర్పించారు. జలంధర్ ఆకాశవాణి కేంద్రంలో పాడడం, సంగీతం సమకూర్చడం ద్వారా జగ్‌జీత్ సింగ్ తన కెరీర్ ప్రారంభించారు. తన కలలను సాకారం చేసుకునేందుకుగాను 1965లో, ఇంట్లో ఎవరికీ చెప్పకుండా, ఇల్లు విడిచి బొంబాయి చేరుకున్నారు. ఉదర పోషణార్థం ప్రకటనల జింగిల్స్ పాడడం, పెళ్ళిళ్ళలో పాటలు పాడడం వంటివి చేశారు. వర్లిలో మరో నలుగురితో కలిసి ఒకే గదిలో ఉండేవారు. ఎవరో ఒక హోటల్ యజమాని ఉచితంగా భోజనం పెడతానంటే, ప్రతి రోజూ వర్లి నుండి దాదర్ వెళ్ళి తిని వచ్చేవారు.

గానంలో జగ్‌జీత్ సింగ్‍కి మహ్మద్ రఫీ గారే ఆదర్శం. రఫీ గారి పాటలని ఆయన ఆకాశవాణి కేంద్రాలలో సైతం పాడేవారట. రోజులు కష్టంగా గడుస్తుండగా, ఒక గుజరాతీ సినిమాలో కథానాయకుడిగా అవకాశం వచ్చిందట, కానీ గానం, సంగీతం పైనే దృష్టి నిలిపిన ఆయన, ఆ అవకాశాన్ని వద్దనుకున్నారట. అయితే తర్వాత ఆ సినిమాలో ఒక భజన గీతాన్ని పాడారుట.

జగ్‌జీత్ సింగ్ తన భార్య చిత్రను మొదటిసారిగా 1967లో ఒక రికార్డింగ్ స్టూడియోలో కలిసారు. మొదట్లో ఆయన గొంతు కరకుగా ఉందని ఆయనతో ప్రకటన జింగిల్స్ పాడేందుకు తిరస్కరించారట చిత్ర. ఆ తరువాత ఇద్దరూ కలిసి ఎన్నో పాటలు పాడారు. వీరిని ‘గజల్ దంపతులు’ అని కూడా పిలిచేవారు. 1969 డిసెంబరులో వీళ్ళిద్దరూ పెళ్ళి చేసుకున్నారు. వారిద్దరి వివాహం తంతు అత్యంత నిరాడంబరంగా, రెండు నిమిషాల వ్యవధిలో 30 రూపాయలతో పూర్తయిందట. తదుపరి కాలంలో వాళ్ళిద్దరూ గొప్ప గాయనీగాయకులయ్యారు, హిల్ ఆల్బమ్స్ అందించారు. 1976లో విడుదలైన ‘అన్‍ఫర్గెటబుల్’ అనే ఆల్బమ్ వారికి తక్షణ కీర్తిని, విజయాన్ని తెచ్చిపెట్టింది. సినిమాయేతర ఆల్బమ్స్‌కి మార్కెట్ లేని ఆ కాలంలో ఆ ఆల్బమ్ అత్యధికంగా అమ్ముడుపోయింది.

క్రమంగా జగ్‌జీత్ సింగ్‍కి ఆదరణ పెరిగింది. 1982లో ‘లైవ్ ఎట్ రాయల్ ఆల్బర్ట్ హాల్’లో వారి కచేరీ కోసం టికెట్లు మూడు గంటలలో అమ్ముడుపోయాయంటే, వారి ప్రజాదరణ ఎంతటిదో అర్థమవుతుంది.

అంతగా ప్రసిద్ధులు కాని కవులెందరో, వారి కవితలను జగ్‌జీత్ సింగ్ గానం చేయడం వల్ల వెలుగులోకి వచ్చారు. 1987లో జగ్‌జీత్ సింగ్ ఒక బార్‌లో ఓ గాయకుని స్వరం విన్నారు. అతడిని కళ్యాణ్‍జీ – ఆనంద్‍జీలకి పరిచయం చేయగా, వారు కేదార్‌నాథ్ భట్టాచార్య అనే ఆ యువకుడికి ‘ఆంధియా’ (1990)లో పాడే అవకాశం కల్పించారు. అతడి పేరును ‘కుమార్ సాను’గా మార్చారు.

జగ్‌జీత్ సింగ్ గారి 20 ఏళ్ళ కుమారుడు వివేక్ 27 జూలై 1990 నాడు ఒక రోడ్డు ప్రమాదంలో మరణించాడు. దాంతో ఆ దంపతులు క్రుంగిపోయారు. జగ్‌జీత్ సింగ్ ఒక ఆరు నెలల పాటు పాడలేదు; చిత్ర మాత్రం శాశ్వతంగా పాడడం ఆపేశారు. దాంతో వాళ్ళిద్దరూ కలిసి పాడవలసిన ప్రాజెక్టులన్నీ ఆగిపోయాయి. జగ్‌జీత్ సింగ్ గారి కొన్ని అద్భుతమైన ఆల్బమ్స్, వారి కుమారుడి మరణం తర్వాతే వెలువడ్డాయి. ఆయన గుండె లోని బాధ గానంలో వ్యక్తమయ్యేది. లతా మంగేష్కర్ తో పాడిన ‘సజ్దా’; అలీ సర్దార్ జాఫ్రీతో చేసిన ‘సమ్‌వన్ సమ్‌వేర్, హోప్’, ‘కహాకషా’; జావేద్ అఖ్తర్‍తో ‘సిల్‌సిలేఁ’; గుల్జార్‍తో ‘మరాసిమ్’; ఇంకా ‘సంవేదనా’ వంటి ఆల్బమ్స్‌తో ఆయన బాధ స్పష్టమవుతుంది.

జగ్‌జీత్ సింగ్‌కి రాజకీయాలకి ఓ విశిష్ట సంబంధం ఉంది. మాజీ ప్రధాని శ్రీ వాజ్‍పేయి రాసిన గీతాలను స్వరపరిచి, గానం చేసింది జగ్‌జీత్ సింగే. ఈ ఆల్బమ్స్ – నయా దిశా (1999), సంవేదనా (2002). ఈ రెండు ఆల్బమ్స్ లోనూ కొన్ని గీతాలకు సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ అభినయించడం విశేషం. 2003లో జగ్‌జీత్ సింగ్‍కు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును ప్రదానం చేసింది.

ఎన్నో గజల్స్ వ్రాసిన నిదా ఫాజ్లీ గజళ్ళను జగ్‌జీత్ ఆలపించారు.

“దునియా జిసే కహతే హైఁ జాదూ కా ఖిలోనా హై; మిల్ జాయే తో మిట్టీ హై, ఖో జాయే తో సోనా హై” అనే నిదా ఫాజ్లీ గజల్‍ని జగ్‍జీత్ గొప్పగా పాడారు. జగ్‌జీత్ సింగ్ జన్మించిన 8 ఫిబ్రవరి 1941 తేదీకి సరిగ్గా 75 ఏళ్ళకు 8 ఫిబ్రవరి 2016 నాడు నిదా ఫాజ్లీ మరణించారు.

జగ్‌జీత్ సింగ్‍కి సైక్లింగ్ అంటే సరదా. గుర్రపు పందాలు, స్టాక్ మార్కెట్ అంటే ఆసక్తి.

23 సెప్టెంబరు 2011 నాడు ఆయనకి బ్రెయిన్ హెమర్రేజ్‍కి గురయి, రెండు వారాల పాటు కోమాలో ఉన్నారు. 10 అక్టోబరు తేదీన ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో మరణించారు. గజల్ రారాజు జగ్‍జీత్ సింగ్ మరణాంతరం, 2014లో, ఆయన గౌరవార్థం భారత ప్రభుత్వం ఒక పోస్టేజ్ స్టాంపుని విడుదల చేసింది.

***

 


తెర వెనుక ప్రతిభామూర్తి సినిమాటోగ్రాఫర్ ఎస్. మారుతీరావు:

వెండి తెర మీద ఎందరో ప్రతిభావంతులైన నటీనటులు ప్రేక్షకులని అలరిస్తారు. అయితే వారి ప్రతిభని ప్రేక్షకులకు చేర్చేది తెర వెనుకే ఉండే సినిమాటోగ్రాఫర్. అలాంటి నిపుణుడైన ఓ సినిమాటోగ్రాఫర్ గురించి తెలుసుకుందాం. ఆయనే ఎస్. మారుతీరావు.

తంజావూరులో 25-04-1921 న జన్మించిన మారుతీరావుకి చిన్నప్పటి నుంచే ఫోటోగ్రఫీలో ఆసక్తి ఎక్కువ. బడికి తన కెమెరా తీసుకువెళ్ళి నచ్చిన దృశ్యాలను ఫోటోలు తీసేవారు. ఇది ఫోటోగ్రఫీలో ఆయన ఆసక్తిని తెలియజేస్తుంది (సావిత్రి, వహీదా రెహమాన్ వంటి వారికి స్క్రీన్ టెస్ట్ షాట్స్ తీసిన సుప్రసిద్ధ స్టిల్ ఫొటోగ్రాఫర్ ఆర్. ఎన్. నాగరాజారావు వీరి సోదరులు). ఫోటోగ్రఫీలో మారుతీరావు ఆసక్తిని గుర్తించిన వారింటి పొరుగున ఉండే ఎన్.సి. పిళ్ళయ్ (ఫ్లాష్ మ్యాగజైన్ ఎడిటర్) సినిమాల్లో చేరుతావా అని అడిగారు. తల్లిదండ్రుల అనుమతి తీసుకుని మారుతీరావు 1940లో ప్రాగజోతి ఫిల్మ్స్‌లో అప్రెంటీస్‌గా చేరి పుష్పవల్లి, సి.ఎస్.ఆర్. ఆంజనేయులు, కస్తూరి శివరావు నటించిన తెలుగు చిత్రం ‘చూడామణి’కి పని చేశారు. ఈ సినిమాకి రాజా శాండో నిర్మాత, మామా షిండే సినిమాటోగ్రాఫర్. మారుతీరావు తరువాతి సినిమా నాదస్వరం విద్వాన్ రాజారత్నం పిళ్ళయ్ హీరోగా నటించిన ‘కవి కాలమేఘం’. దీనికి ఎల్లిస్ ఆర్ దుంగన్, డబ్ల్యూ జె మోయ్‌లామ్ దర్శకులు. శ్రీ. ఎం.ఎ. రహమాన్ సినిమాటోగ్రాఫర్ కాగా, మారుతీరావు ఆయన సహాయకుడిగా చేశారు. సుప్రసిద్ధ సినిమాటోగ్రాఫర్ మార్కస్ బార్ట్‌లే వద్ద కూడా మారుతీరావు సహాయకుడిగా పని చేశారు.

ఆ తరువాత ఆయన గిండీలోని వేల్ పిక్చర్స్ స్టూడియోలో చేరి ‘భక్తి మాల’ చిత్రానికి పని చేశారు. ఇందులో భానుమతి కథానాయిక. బొంబాయికి నుంచి వచ్చిన సినిమాటోగ్రాఫర్ రావు పనితనాన్ని మెచ్చుకుని ఫస్ట్ అసిస్టెంట్‍గా పెట్టుకుని మిచెల్ కెమెరా ఆపరేట్ చేసే బాధ్యతలు అప్పగించారు. ఇంతలో ప్రపంచ యుద్ధం రావడంతో, రావు స్వస్థలానికి తిరిగి వచ్చేశారు.

తరువాత కొన్నాళ్ళకి రావు ప్రగతి స్టూడియోలో చేరారు. ఎవిఎం బ్యానర్ నిర్మించిన ‘శ్రీవల్లి’ అనే సినిమా మారుతీరావు, ఆయన సోదరుడు స్టిల్ ఫోటోగ్రాఫర్లుగా వ్యవహరించారు. ఎవిఎం కారైకూడికి తరలడంతో, రావుకి ‘మహాత్మా కబీర్’ చిత్రానికి స్టిల్ ఫోటోగ్రాఫరుగా, ఫస్టు ఫోటోగ్రాఫరుగా అవకాశం లభించింది. జర్మన్ ఫోటోగ్రాఫర్ స్వదేశానికి వెళ్ళిపోవడంతో ఆ సినిమాని పూర్తి చేసే అవకాశం మారుతీరావుకి లభించింది. కారైకూడి నుంచి ఎవిఎం తిరిగి వచ్చాక, మారుతీరావు సెకండ్ ఫోటోగ్రాఫరు, ఇంకా స్టిల్ డిపార్ట్‌మెంట్ ఇన్-ఛార్జిగాను పని చేశారు. తరువాత ‘ఒర్ ఇరవు’ చిత్రానికి తొలిసారిగా సినిమాటోగ్రాఫర్‍గా పనిచేశారు. పి. నీలకందన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మారుతీరావు కనబరిచిన ప్రతిభని అందరూ కొనియాడారు. ఈ సినిమాతో ఆయన కెరీర్ ఊపందుకుంది. మొత్తం 60 చిత్రాలకు సినిమాటోగ్రాఫరుగా పని చేశారు.  34 తమిళ, 13 హిందీ, 8 కన్నడ, 5 తెలుగు చిత్రాలకు పని చేశారు. ‘ఒర్ ఇరవు’, ‘అంధ నాల్’, ‘పరాశక్తి’, ‘మేజర్ చంద్రకాంత్’ వంటి బ్లాక్ అండ్ వైట్ చిత్రాలలోనూ; ‘అంబే వా’, ‘అంధే కన్‌గళ్’, ‘రంగనాయకి’ (కన్నడ) వంటి కలర్ చిత్రాలలోనూ ఆయన ప్రతిభ గోచరిస్తుంది. యం. కరుణానిధి, ఎంజిఆర్, జె. జయలలితలతో పని చేసి ముగ్గురు తమిళనాడు ముఖ్యమంత్రులతో పని చేసిన ఘనత దక్కించుకున్నారు. అంతేకాదు, శివాజీ గణేశన్, ఎస్.వి. సుబ్బయ్య, వైజయంతిమాల, హేమమాలిని తదితరులు సినీరంగంలో ప్రవేశించక ముందు వారికి తొలి మేకప్ టెస్ట్ ఫోటోగ్రాఫర్ ఆయనే. 1937 నుంచి ఆయన మద్రాస్ అమెచ్యూర్ ఫోటోగ్రఫీ సొసైటీలో సభ్యులు. స్టిల్ ఫోటోగ్రఫీకి ఎన్నో అవార్డులు పొందారు.

వారి సినిమాల జాబితా:

  • 1952 : “పరాశక్తి,” తమిళ, తెలుగు వెర్షన్లు, సిల్వర్ జుబ్లీ హిట్స్, శివాజీ గణేశన్ తొలి చిత్రం.
  • 1953 : “బేదార కన్నప్ప,” కన్నడ, రాజ్ కుమార్ తొలి చిత్రం; “కాళహస్తి మహత్యం” తెలుగు.
  • 1954 : “శివభక్త,” హిందీ; “అంధ నాల్,” తమిళం. కేంద్ర ప్రభుత్వ అవార్డు విజేత.
  • 1956 : “కులదైవం,” తమిళం, సిల్వర్ జుబ్లీ హిట్. “హమ్ పాంచ్ ఏక్ దళ్ కే,” హిందీ, రాష్ట్రపతి అవార్డు విజేత.
  • 1957 : “బాభీ,” హిందీ, గోల్డెన్ జుబ్లీ హిట్, “భర్ఖా,” హిందీ.
  • 1958 : “ఉంగళ్ నంబన్,” తమిళ్, “పోలీస్,” – డాక్యుమెంటరీ
  • 1959 : “మామియార్ మెచియ మరుమగల్,” తమిళం.
  • 1960 : “దైవ పిరవి,” తమిళం, కేంద్ర ప్రభుత్వ అవార్డు.
  • 1961 : “షాదీ,” “సుహాగ్ సిందూర్,” బొంబాయి.
  • 1962 : “అన్నయ్,” తమిళం, కేంద్ర ప్రభుత్వ అవార్డు.
  • 1963 : “కుంకుమం,” తమిళం.
  • 1964 : “వాళ్కై వాళవాతర్కె,” “సర్వర్ సుందరం,” తమిళం
  • 1965 : “కుళంధయుమ్ దైవమమ్,” తమిళం, కేంద్ర ప్రభుత్వ అవార్డు, “మేజర్ చంద్రకాంత్,” తమిళ సూపర్ హిట్.
  • 1966 : “అంబే వా,” తమిళం, ఎవిఎం వారి తొలి రంగుల చిత్రం, సిల్వర్ జుబ్లీ, “మై సుందర్ హుఁ,” “మన్ మౌజ్,” హిందీ.
  • 1967 : “అంధే కన్‍గళ్,” తమిళ్, కలర్; “అవే కళ్ళు,” తెలుగు, కలర్.
  • 1968 : “దో కలియాఁ,” హిందీ; “అనాధై ఆనందన్,” తమిళ్.
  • 1970 : “ఎంగ మామ,” “ఎంగల్ తంగం”
  • 1971 : “పుదియ వాళ్‌కాయ్,” “ఇరులం ఒలియుమ్,” “రంగరాత్తినం,” తమిళ్; “ఇద్దరు అమ్మాయిలు,” తెలుగు.
  • 1972 : “తంగ దురై,” తమిళ్, “పుట్టినిల్లు మెట్టినిల్లు,” తెలుగు.
  • 1973 : “పొన్నూంజల్,” తమిళ్.
  • 1974 : “పత్తు మాద బంధం,” “కలియుగ కన్నన్,” తమిళ్.
  • 1975 : “కారోత్తి కన్నన్,” తమిళ్, “నోము,” తెలుగు, సిల్వర్ జుబ్లీ, “పూజ,” తెలుగు.
  • 1976 : “జైసా కో తైసా,” “షాన్‌దార్,” హిందీ; “వాళన్తు కాట్టుకిరే,” “వాళ్‍వు ఎన్ పక్కం,” తమిళ్.
  • 1977 :: “పేర్ సొల్ల ఒరు పిళ్ళయ్,” “ఇళయ తలైమురై,” “ఎన్న తవమ్ సెయ్‌దేనో,” తమిళ్.
  • 1978 : “చక్రవర్తి,” “పదువారహళ్ళి పాండవరు,” కన్నడ.
  • 1979 : “ధర్మ సేరే,” కన్నడ.
  • 1980 : “వడమాలై,” ఫోటోగ్రఫీ, దర్శకత్వం. తమిళనాడు ఉత్తమ చిత్రం అవార్డు.
  • 1982 : “రంగనాయకి” కన్నడ సినిమాస్కోప్.
  • 1983 : “ఋణ ముక్తలు,” కన్నడ.
  • 1986 : “బాల్ ఒందు వియాలి,” కన్నడ.
  • 1987 : “తాయే నీయే తూనై,” “కాదల్ ఎన్‍బత్తు ఎదువరై”, తమిళ్.
  • 1989 : “మసణద హూవు,” కన్నడ, ఉత్తమ ఫోటోగ్రఫీకి రాష్ట్ర అవార్డు.
  • 1990 : “సిరాయిల్ పూత చిన్న మలర్,” తమిళ్.
  • 1995 : “నీలం పారుక్కుమ్ నిల,” “పారట్టు వీళ,” తమిళ్, సినిమాస్కోప్.

టెలివిజన్ రంగం:

మారుతీరావు తమిళ టెలివిజన్ రంగంలోనూ పని చేశారు. ప్రముఖ చారిత్రక సీరియల్ ‘అంతఃపురం’, ‘మర్యాద రామన్న’, ‘అంబుల్ల అమ్మ’ వంటి వాటికి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా ఉన్నారు. దూరదర్శన్ కోసం ‘అరుంబుగళ్’, ‘విండోస్’ అనే టెలీఫిల్మ్స్ తీశారు. వర్కింగ్ ఉమన్ (Sumaithangigal) కోసం పని చేశారు. చిన్న శంబు, నిజమానా ఉయరంగల్ వంటి సీరియల్స్ కోసం పనిచేశారు. సోషల్ ఫారెస్ట్రీ అంశం మీద ‘కాడు సొల్లుమ్ కధైగళ్’ అనే డాక్యుమెంటరీ నిర్మించి, ఫోటోగ్రఫీ, దర్శకత్వం వహించారు. Central Institute of Brackish Water వారి కోసం ‘అక్వాకల్చర్’ అనే 50 నిమిషాల డాక్యుమెంటరీ తీశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here