అలనాటి అపురూపాలు-52

0
2

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపరూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

తెలుగు, హిందీ చిత్రాలపై తనదైన ముద్ర వేసిన ప్రత్యగాత్మ:

తెలుగు సినీరంగంలో సుప్రసిద్ధులైన దర్శలకులలో కె. ప్రత్యగాత్మ ఒకరు. బాల్యం నుంచే సినిమాలపై ఆసక్తి పెంచుకున్న ఆయన సినీ ప్రస్థానం గురించి తెలుసుకుందాం.

ఆంధ్ర ప్రదేశ్ లోని గుడివాడలో 31 అక్టోబరు 1925 నాడు జన్మించిన పత్యగాత్మ పూర్తి పేరు కొల్లి కోటయ్య ప్రత్యగాత్మ. కోటయ్య అనేది వారి తండ్రి పేరు. పత్యగాత్మది చిన్నతనం నుంచే తిరుగుబాటు స్వభావం. ఐదేళ్ళ వయసులోనే ఇంట్లో చెప్పకుండా గుడివాడలో సినిమాలు చూసేవారు. ఆనాటి పోరాటాల నటి ‘ఫియర్‍లెస్ నాడియా’ నటించిన హిందీ సినిమాలు చూడడానికి తెగ ఇష్టపడేవారు. హిందీ అర్థం కాకపోయినా, సినిమాలు చూసేందుకు ఇబ్బంది పడలేదు. బడిలో చేరి, హిందీ నేర్చుకున్నాకా, హిందీ సినిమాలు మరింతగా అర్థమయ్యాయి ఆయనకి. హైస్కూల్ స్థాయికి వచ్చేసరికి ఎన్నో పుస్తకాలు చదివి వి. శాంతారామ్ సినిమాల గురించి, న్యూ థియేటర్ బ్యానర్ ఫిల్మ్స్ గురించి అవగాహన పెంచుకున్నారు. ఇక తెలుగు విషయానికొస్తే, బి.ఎన్.రెడ్డి గారి సినిమాలు అనేకమార్లు చూశారు. ఫిల్మ్ ఇండియా, టాకీ హెరాల్డ్ వంటి ఇంగ్లీష్ పుస్తకాలు చదివి, తన సినీ జ్ఞానాన్ని మరింత పెంచుకుని, తనదైన శైలిలో విమర్శలు రాయడం ప్రారంభించారు.

హైస్కూలు చదువు తర్వాత ప్రత్యగాత్మ కాలేజీలో చేరలేదు. సహజంగా తిరుగుబాటు ధోరణి గల వ్యక్తి కావడంతో, ఆంధ్రా యూత్ ఫెడరేషన్ అనే విప్లవ పార్టీలో చేరారు. బాగా క్రియాశీలకంగా వ్యవహరించి ఆ పార్టీకి సెక్రటరీ అయ్యారు. పార్టీ కార్యకలాపాలను బెజవాడ, గుంటూరులకు విస్తరించారు. గుంటూరు నుంచి ప్రచురితమయ్యే ‘నవయుగ’ పత్రికకు సంపాదకులుగా వ్యవహరించారు. అది జీవితంలో నేర్చుకునే దశ, సామాన్య ప్రజల సుఖదుఃఖాలను అవగాహన చేసుకున్నారు. కొద్ది రోజులకే వారి పార్టీని నిషేధించగా, పత్యగాత్మ అజ్ఞాతంలోకి వెళ్ళారు. అయినా సినిమాల పట్ల ఉన్న పిచ్చి కారణంగా, ఎలాగొలా సినిమాలు చూసేవారు. 1942లో మంగళాపురం లోని చెల్లపల్లిలో 144 సెక్షన్ నిషేధాజ్ఞల్ని ఉల్లంఘించినందుకు ప్రత్యగాత్మను అరెస్టు చేశారు. ఒక నెలపాటు రాజమండ్రిలో జైలు శిక్ష అనుభవించారు. 1951లో ప్రభుత్వం వారి పార్టీపై నిషేధం ఎత్తివేసింది. కానీ అప్పటికే పార్టీ నేతల మధ్య విభేదాలు తీవ్రమవడంతో ప్రత్యగాత్మ పార్టీని వీడారు.

మద్రాసు వెళ్ళి ‘జ్వాల’ అనే పత్రికని ప్రారంభించారు. ఈ పత్రికలో, కథలు, సినీ సమీక్షలు వ్రాశారు. పార్టీలో ఉండగా తాతినేని ప్రకాశరావుతో స్నేహం చేశారు. తాతినేని ప్రకాశరావు సినిమాల్లోకి ప్రవేశించి 1952లో ‘పల్లెటూరు’ అనే సినిమా తీశారు. ప్రత్యగాత్మ రచనలను ఇష్టపడిన ప్రకాశరావు పేద ప్రజల మీద ఒక కథ వ్రాయమని అడిగారు. ఈ కథ కోసం జరిగిన చర్చలు – అక్కినేని నాగేశ్వరరావు, జమున నటించిన ‘నిరుపేదలు’ చిత్రంగా రూపొందాయి. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందినప్పటికీ, ఆర్థికంగా విజయవంతం కాలేదు. ఆ సినిమా హిట్ కాకపోవడంతో, ప్రత్యగాత్మకి అవకాశాలు రాలేదు. వివిధ సినిమా సెట్‍లలో తిరుగుతూ, అనేక విషయాలను నేర్చుకుంటూ కాలం గడిపారు. అలా మూడేళ్ళు గడిచేసరికి ఆర్థికపరమైన చికాకులు ఎదురయ్యాయి, సృజనాత్మకత వెనుబడింది. అయినా కథలు వ్రాస్తూనే ఉండేవారు. ఆ సమయంలోనే తనకు సహాయ దర్శకుడిగా ఉండమని తాతినేని ప్రకాశరావు ప్రత్యగాత్మని అడిగారు. ‘ఇల్లరికం’, ‘జయం మనదే’ సినిమాలకు అసిస్టెంట్ డైరక్టరుగా పని చేశారు ప్రత్యగాత్మ. ‘ఇల్లరికం’ స్క్రిప్టు పై దాదాపు ఒక సంవత్సరం పని చేశారు. ఆ తర్వాత ‘మా ఇంటి మహాలక్ష్మి’ సినిమాకి కథ, సంభాషణలు అందించే అవకాశం లభించింది. గతంలో వ్రాసి ఉంచుకున్న కథకి సినిమాకి నప్పేలా స్క్రీన్‍ప్లే అందిచారు. అందుకే ఆ కథని సినిమాగా వేగంగా తీయగలిగారు.

ప్రత్యగాత్మ ‘ఇల్లరికం’ చిత్రానికి సహాయ దర్శకుడిగా పని చేస్తుండగా, నిర్మాత ఎ.వి. సుబ్బారావు ఆయన కృషిని, పనితనాన్ని గుర్తించారు. ప్రసాద్ ఆర్ట్స్ బ్యానర్ పై తదుపరి సినిమా దర్శకత్వం చేసే అవకాశం కల్పించారు. అదే ‘భార్యాభర్తలు’ చిత్రం. గొప్ప హిట్ అయింది. ఈ చిత్రానికి మూలం ఒక తమిళ నవల అయినా – తన స్వంత కథలా మలిచి ప్రత్యగాత్మ హిట్ అందించారు. ఈ సినిమా తమిళంలోకి, హిందీలోకి రీమేక్ అయింది. ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డు కూడా గెలుచుకుంది. తదుపరి ప్రత్యగాత్మ మరో కథ వ్రాసి ‘కులగోత్రాలు’ సినిమా తీశారు. అది కూడా సూపర్ హిట్ అయింది. దీంతో ఉత్తమ స్థాయి దర్శకుల జాబితాలోకి చేరిపోయారు ప్రత్యగాత్మ. ఇదే కథతో హిందీలో ‘తమన్నా’ సినిమా తీసారు, కానీ హిందీలో బాగా ఆడలేదు. తరువాత ప్రత్యగాత్మ హిందీలో గుల్షన్ నందా వ్రాసిన కథ ఆధారంగా ‘పునర్జన్మ’ చిత్రం తీశారు. గొప్ప పాటలున్న సాధారణ చిత్రంగా ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందింది. అదో క్లాస్ సినిమానీ, అందరినీ అలరించే మాస్ చిత్రాన్ని తీయాలని సూచించారు. తరువాత ఆయన ‘మంచి మనిషి’, ‘మనుషులు మమతలు’ అనే సినిమాలు తీశారు. అయితే ఈ రెండు కూడా నిరాశపరిచాయి. ఎలాగైనా హిట్ కొట్టాలని, కొత్తదనంతో తీస్తే ప్రేక్షుకులు ఆదరిస్తారేమోననుకుని వయసుమళ్ళిన పాత్రని నాయకుడిగా మలిచి… యస్. వి. రంగారావు చే ఆ పాత్ర పోషింపజేసి ‘చిలకా గోరింక’ తీసారు. ఈ చిత్రంలో కృష్ణంరాజుకి నటుడిగా తొలి అవకాశం లభించినా, ఆయన పాత్ర చిన్నదే. యస్.వి.ఆర్ బాగా నటించినప్పటికీ, ఈ చిత్రం విఫలమైంది.

పత్యగాత్మ మొదటి హిందీ చిత్రం ‘ఛోటా భాయ్’ హిట్ అయింది. ప్రిన్స్ అండ్ పాపర్ ఆధారంగా తీసిన తెలుగు చిత్రం ‘రాజు పేద’ ఆధారంగా ఆయన ‘రాజా అవుర్ రంక్’ తీశారు. ఇందులో ఆయన దర్శకత్వ ముద్ర కనబడుతుంది. తన సోదరుడు, ప్రముఖ దర్శకుడు కె. హేమాంబరధర రావుతో కలిసి ‘బచ్‍పన్’ అనే చిత్రం తీశారు.

సాధించిన పురస్కారాలు:

  • 1961: రాష్ట్రపతి రజత పతకం – ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ తెలుగు – భార్యాభర్తలు
  • 1962: ప్రతిభా ప్రశంసా పత్రం – ద్వితీయ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ తెలుగు – కులగోత్రాలు
  • 1965: ప్రతిభా ప్రశంసా పత్రం – తృతీయ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ తెలుగు – మనుషులు మమతలు

దర్శకత్వం వహించిన తెలుగు సినిమాలు:

  • నాయకుడు – వినాయకుడు (1980)
  • కమలమ్మ కమతం (1979)
  • కన్నవారి ఇల్లు (1978)
  • మంచి మనసు (1978)
  • గడుసు అమ్మాయి (1977)
  • అల్లుడొచ్చాడు (1976)
  • అత్తవారిల్లు (1976)
  • దీక్ష (1974)
  • ముగ్గురమ్మాయిలు (1974)
  • పల్లెటూరి బావ (1973)
  • స్త్రీ (1973)
  • శ్రీమంతుడు (1971)
  • మనసు మాంగల్యం (1970)
  • అమ్మకోసం (1970)
  • ఆదర్శ కుటుంబం (1969)
  • మా వదిన (1967)
  • చిలకా గోరింక (1966)
  • మనుషులు మమతలు (1965)
  • మంచి మనిషి (1964)
  • పునర్జన్మ (1963)
  • కులగోత్రాలు (1962)
  • భార్యాభర్తలు (1961)

దర్శకత్వం వహించిన హిందీ సినిమాలు:

  • దో లడ్‌కియా (1976)
  • మెహమాన్ (1973)
  • ఏక్ నారీ ఏక్ బ్రహ్మచారీ (1971)
  • బచ్‌పన్ (1970)
  • తమన్నా (1969)
  • రాజా ఔర్ రంక్ (1968)
  • ఛోటాభాయి (1966)

కథా రచయితగా:

  • అల్లుడొచ్చాడు (1976)
  • బచ్‌పన్ (1970)
  • రాజా ఔర్ రంక్ (1968)
  • పునర్జన్మ (1963)
  • ఇల్లరికం (1959)
  • జయం మనదే (1956)
  • నిరుపేదలు (1954)

నిర్మాతగా:

  • బచ్‌పన్ (1970)
  • చిలకా గోరింక (1966)

ప్రత్యగాత్మ 8 జూన్ 2001న హైదరాబాద్ లో మృతి చెందారు. ఆయనకి భార్య సత్యవతి, తేజోలత అనే కూతురు (బెంగుళూరు నివాసి), కె. వాసు, కాళిదాస్ అనే కుమారులు (అమెరికా నివాసి) ఉన్నారు.

***


పౌరాణిక చిత్రాల బ్రహ్మ – శ్రీ కమలాకర కామేశ్వరరావు:

పౌరాణిక చిత్రాలకు కొత్త అర్థం చెప్పి, వాటి ప్రశస్తిని పెంచిన దర్శకులలో అగ్రగణ్యులు కమలాకర కామేశ్వరరావు. పౌరాణిక చిత్రాల బ్రహ్మగా పేరొందిన వీరి జీవితం, చిత్రరంగానికి చేసిన సేవల గురించి తెలుసుకుందాం.

కమలాకర కామేశ్వరరావు 1911లో బందరులో జన్మించారు. బందరు నోబుల్ కాలేజీ నుంచి బి.ఎ. పట్టా పొందారు. సినీ నిర్మాణ కళలో ఆయనకి ఆసక్తి మెండు. అందుకని థియేటర్‍లలో అన్ని భాషల సినిమాలూ చూసేవారు, వాటి మంచి చెడులని విశ్లేషించేవారు. పలు రకాల పుస్తకాలు కొని, సినీ నిర్మాణ ప్రక్రియపై అవగాహన పెంచుకునేవారు. ఈ అనుభవంతో, కృష్ణా పత్రికలో విలేఖరిగా చేరి, 1934 నుంచి 1937 వరకు పని చేశారు. ‘సినీ ఫాన్’ అనే పేరుతో పత్రికలో ఒక కాలమ్ వ్రాస్తూ, అందులో కొత్త సినిమాల గురించి సవిమర్శనాత్మకంగా, నిష్పాక్షికంగా విశ్లేషిస్తూ రాసేవారు. ఆయన కేవలం తెలుగు సినిమాలనే కాకుండా, హిందీ సినిమాలూ చూసేవారు. ఏదైనా సినిమా బందరులో విడుదల కాకపోతే బెజవాడ వెళ్ళి మరీ చూసేవారు. ‘గుడ్ ఎర్త్’ అనే సినిమా గొప్పతనం గురించి కృష్ణా పత్రికలో వరసగా నాలుగు సంచికల్లో వ్రాసిన విశ్లేషణ వారికి గొప్ప పేరు తెచ్చి పెట్టింది.  కృష్ణా పత్రిక వ్యవస్థాపకులు ముట్నూరు కృష్ణారావు – కామేశ్వరరావుని ప్రశంసిస్తూ, ‘మా సినీఫాన్’ అని చెప్పేవారు.

ఆ రోజుల్లో సినిమాల మధ్య చక్కని పోటీ ఉండేది. ఒకే కథతో ‘ద్రౌపదీ వస్త్రాపహరణం’, ‘ద్రౌపదీ మానసంరక్షణం’ అనే రెండు చిత్రాలు ఒకేసారి విడుదలయ్యాయి. ఆయన ఈ రెండు సినిమాలనూ పోలుస్తూ, తేడాలను వివరిస్తూ కృష్ణా పత్రికలో వరసగా నాలుగు సంచికలలో విమర్శలులో రాయడం సినీ పరిశ్రమలో సంచలనానికి కారణమైంది. ‘ద్రౌపదీ వస్త్రాపహరణం’ ఆర్థికంగా విజయవంతం కాగా, ‘ద్రౌపదీ మానసంరక్షణం’ పరాజయం పాలయ్యింది. అయితే కామేశ్వరరావు మాత్రం ‘మానసంరక్షణం’ చిత్రం ‘వస్త్రాపహరణం’ కంటే మంచి చిత్రమని ప్రశంసించారు. ‘వస్త్రాపహరణం’ లోని లోటుపాట్లను వివరించారు. వస్త్రాపహరణంలో అనుభవజ్ఞులైన నటులు నటించారు. అప్పటికే ప్రచారంలో ఉన్న పద్యాలనే ఆ సినిమాలో వాడారు. హెచ్.ఎం.రెడ్డి గారి పర్యవేక్షణలో హెచ్.వి.బాబు దర్శకత్వంలో ఆ చిత్ర నిర్మాణం జరిగింది.

ఈ విమర్శలను నార్ల వెంకటేశ్వరరావు, గూడవల్లి రామబ్రహ్మం లాంటి పెద్దలు మెచ్చుకున్నారు. బి.ఏ. పాసయి నాలుగేళ్ళయినా, కామేశ్వరరావు ఏ ఉద్యోగమూ చేయలేదు. “నీకు చేయాలనిపించినప్పుడే, ఉద్యోగం చేయి” అని కుటుంబసభ్యులు స్వేచ్ఛనిచ్చారు. ఆ కాలంలో ఆయన గ్రంథాలయంలో ఎన్నెన్నో పుస్తకాలు చదివారు. ఆ తరువాత ఆయన మద్రాసు వెళ్ళారు. అప్పట్లో హెచ్.ఎం.రెడ్డి ‘కనకతార’ అనే సినిమా తీస్తున్నారు. కామేశ్వరరావు నేరుగా ఆయన వద్దకి వెళ్ళి – ఆయన సినిమాని విమర్శించి, పోటీ సినిమాని మెచ్చుకున్న ‘సినీఫాన్’ తానేనంటూ పరిచయం చేసుకున్నారు. హెచ్.ఎం.రెడ్డి ఆయన్ను మెచ్చుకుని, అటువంటి సద్విమర్శకుల అవసరం ఎంతైనా ఉందని అంటూ, కామేశ్వరరావుకు ఉద్యోగమిచ్చారు. జనాలు ఆశ్చర్యపోయారు, ‘అవి మంచి రోజులు’ అని అన్నారు.

వచ్చే ఏడాది తాను ‘గృహలక్ష్మి’ అనే సినిమా తీస్తున్నాననీ, తనకు సహాయకుడిగా ఉండమని కామేశ్వరరావుని హెచ్.ఎం.రెడ్డి కోరారు. ఈ విధంగా కామేశ్వరరావు 1937లో హెచ్.ఎం.రెడ్డిగారి రోహిణి ఫిల్మ్స్ ఆఫీసులో అడుగుపెట్టారు. ఉద్యోగానికి కొత్త కావడంతో ఆయనకు జీతం ఉండేది కాదు. ఏ ఖర్చు లేకుండా, భోజనం, బస ఏర్పాట్లు ఆఫీసులోనే ఏర్పాటు చేశారు. అక్కడ క్యాషియర్‍గా పనిచేస్తున్న కె.వి. రెడ్దితో, బి.ఎన్. రెడ్డి, మూలా నారాయణ స్వామి గార్లతో కామేశ్వరరావుకి స్నేహం కలిసింది. హెచ్.ఎం.రెడ్డితో సృజనాత్మక విభేదాలు రావడంతో వీరంతా రోహిణి ఫిల్మ్స్‌ని వీడి మరో ఆఫీసు పెట్టుకున్నారు. అక్కడ పని చేస్తుండగా, వీరంతా ఒకే కారులో ఆఫీసుకు వెళ్ళివచ్చేవారు. కామేశ్వరరావుకి పనంటూ ఉండేది కాదు. జరుగుతున్నవాటిని శ్రద్ధగా గమనించడం, అడిగినప్పుడు సలహాలివ్వడం మాత్రమే ఆయన బాధ్యత. షూటింగ్ ముగిసాక రషెస్ ప్రదర్శించి అందరినీ సలహాలు అడగడం కె.వి.రెడ్డికి అలవాటు. షూటింగ్ ముగిసాక, ప్రతీ రాత్రి ఓ సినిమాకి వెళ్ళడం కామేశ్వరరావుకి అలవాటు. సినిమా చూసి బసకి వెళ్ళాకా, ఆ సినిమా బాగోగుల గురించి కె.వి.రెడ్డితో చర్చించేవారు. ఈ ప్రక్రియలో వారిద్దరూ సన్నిహితులయ్యారు. బొమ్మిరెడ్డి నరసింహా రెడ్డి గారి వద్ద ‘వందేమాతరం’, ‘సుమంగళి’, ‘దేవత’, ‘స్వర్గసీమ’ చిత్రాలకు అసిస్టెంట్ డైరక్టరుగా పనిచేశారు కామేశ్వరరావు. కదిరి వెంకట రెడ్డిగారి వద్ద ‘భక్త పోతన’, ‘యోగి వేమన’ చిత్రాలకు పని చేశారు. గృహలక్ష్మి చిత్రం పూర్తయ్యేసరికి, కామేశ్వరరావుకి పని లేక పోయింది. స్వస్థలానికి వెళ్ళేందుకు ఆయన అంగీకరించలేదు. బదులుగా, గృహలక్ష్మి చిత్రానికి ప్రజా సంబంధాల అధికారిగా వ్యవహరిస్తూ, మద్రాసు, గుంటూరు, విజయవాడ, ఏలూరు తదితర ప్రాంతాలు పర్యటించారు.

ఈలోపు బి.ఎన్.రెడ్డి, కెమెరామన్ రామ్‌నాథ్, శేఖర్, వ్యాపారవేత్త మూలా నారాయణ మున్నగువారు కలిసి వాహినీ సంస్థని స్థాపించారు. కామేశ్వరరావు ఈ సంస్థలో సహాయ దర్శకుడిగా చేరారు. మిత్రులంతా ఒకరి భుజాలపై ఒకరు చేతులు వేసినట్టుగా ఉంటుందీ బ్యానర్ పతాకం. ‘సుమంగళి’ చిత్రంలో కెమెరామన్ రామ్‌నాథ్ ఎన్నో సినిమాటిక్ టెక్నిక్‌లతో అద్భుతమైన దృశ్యాలను చిత్రీకరించారు. రైల్వే ట్రయిన్ షాట్స్ ముఖ్యమైనవి. ఈ సంగతులన్నీ ఆయన ఒక లెక్చర్ హాల్‍తో అందరితోనూ చర్చించేవారట. ఆ రోజుల్లో సినీ నిర్మాణం అలా సాగేది. కామేశ్వరరావు ఏనాడూ జీతం కోసం అడగలేదు. 1942లో ‘భక్త పోతన’ తీస్తున్నప్పుడు కె.వి. రెడ్డి గారే స్వయంగా తన పేరు పక్కన అసోసియేట్ డైరక్టరుగా కామేశ్వరరావు పేరు వ్రాశారు. అయితే వాహినీ సంస్థ ఎన్నడూ ఆయన కష్టాన్ని ఉంచుకోలేదు. ఆయనకు ఇవ్వాల్సిన జీతం ఇచ్చి గౌరవించారు. ‘యోగి వేమన’ విడుదలయ్యాక, వాహినీ స్టూడియోకు శంకుస్థాపన జరగగా, కామేశ్వరరావు గారు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని మట్టి వేశారు. ఈ ఘటన ఆయనకు జీవితాంతం ఎంతో తృప్తిని కలిగించింది.

బందరులో ఉండగా కామేశ్వరరావుకు పింగళి నాగేంద్ర రావుతో పరిచయం కలిగింది. వారిని మద్రాసుకు పిలిపించగా, పుష్పవల్లి నటించే ‘వింధ్యారాణి’ సినిమాలో ఆయనకి అవకాశం లభించింది. పింగళి నాగేంద్ర రావును కామేశ్వర రావు – కె.వి. రెడ్డిగారికి, బి.ఎన్.రెడ్డిగారికి పరిచయం చేశారు. వారంతా కలిసి కూర్చుని తాము తీయబోతున్న ‘గుణసుందరి కథ’ చిత్రం గురించి మాట్లాడుకునేవారు.

ఇదిలా ఉండగా, వాహినీ స్టూడియో యాజమాన్యం మరొకరి చేతికి వెళ్ళింది. బి.ఎన్.రెడ్డి గారి సోదరుడు, చక్రపాణి కలిసి ఆ సంస్థని దక్కించుకున్నారు. స్టూడియో పేరును విజయ-వాహిని స్టూడియోస్ అని మార్చారు, కాని చివరికి ‘విజయ స్టూడియో’గా మిగిలింది. ఇదంతా ఎందుకు జరిగిందంటే వ్యాపార లావాదేవీలలో మూలా నారాయణ మోసపోయారు…. వాహినీ స్టూడియోతో సహా అన్ని ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది. హృదయం బద్దలైన ఆయన కొద్ది కాలానికే మరణించారు. మిత్రుని మరణంలో విచలితులైన బి.ఎన్.రెడ్డి, మిత్రుని మరువలేకపోయారు. తన అన్ని భవిష్యత్తు కార్యక్రమాలలో… అవి అవార్డులు లేదా రివార్డులు కావచ్చు… మిత్రుని ప్రస్తావించేవారు.

విజయ ప్రొడక్షన్స్ అధినేతలు బి.ఎన్.రెడ్డి, చక్రపాణి కామేశ్వరరావు పనితనం ప్రత్యక్షంగా చూసాక, 1954లో ‘చంద్రహారం’ సినిమాకి స్వతంత్ర్య దర్శకత్వ బాధ్యతలు అప్పజెప్పారు. ఈ చిత్రానికి ఎటువంటి రివార్డులు రానప్పటికీ, చక్రపాణి కథలోని సాంకేతిక విలువలకు గుర్తింపు లభించింది. ఈ పరాజయం తర్వాత 1955లో కామేశ్వర రావు విజయ పిక్చర్స్‌ని వీడారు. తర్వాత ఆయన తమిళంలో జెమినీ గణేశన్, సావిత్రిలతో ‘గుణసుందరి కథ’ తీశారు. అది కూడా ఫ్లాప్ అయింది. తర్వాత ఆయన తీసిన తెలుగు సినిమా ‘పెంకి పెళ్ళాం’ అటూ ఇటుగా ఆడింది.

మూడు దశాబ్దాలలో – నేషనల్ ఆర్ట్స్ థియేటర్, రాజ్యం పిక్చర్స్, పొన్నలూరి బ్రదర్స్, పద్మాలయా పిక్చర్స్, మహిజ పిక్చర్స్, సురేష్ ప్రొడక్షన్స్ వంటి సంస్థలకు ఆయన సుమారు 30 సినిమాలు తీశారు. 1963లో తన దర్శకత్వంలో వెలువడిన ‘నర్తనశాల’ చిత్రమంటే తనకెంతో ఇష్టమని ఆయన చెబుతూండేవారు. ఆ సినిమా ఆయనకెన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను తెచ్చిపెట్టింది.

దర్శకత్వం వహించిన సినిమాలు:

  • చంద్రహారం (తెలుగు, తమిళం) (1954)
  • గుణసుందరి కథ (తమిళం) (1955)
  • పెంకి పెళ్ళాం (1956)
  • పాండురంగ మహత్యం (1957)
  • శోభ (1958)
  • రాజ సేవై (తమిళం) నర్తనశాల (1963)
  • రేచుక్క పగటిచుక్క (1959)
  • మహాకవి కాళిదాసు (తెలుగు, తమిళం) (1960)
  • మహామంత్రి తిమ్మరుసు (1962)
  • గుండమ్మకథ (1962)
  • నర్తనశాల (1963)
  • పాండవ వనవాసం (1965)
  • శకుంతల (1966)
  • శ్రీకృష్ణ తులాభారం (తెలుగు, తమిళం) (1966)
  • కాంభోజరాజు కథ (1967)
  • శ్రీకృష్ణావతారం (1967)
  • వీరాంజనేయ (1968)
  • కలసిన మనసులు (1968)
  • మాయని మమత (1970)
  • శ్రీకృష్ణ విజయం (1970)
  • బాల భారతం (1972)
  • జీవితాశయం (1974)
  • కురుక్షేత్రం (1977)
  • సీతారామ వనవాసం (1977)
  • జ్ఞాన కుళన్‍ధాయ్ (1979)
  • శ్రీ వినాయక విజయము (1980)
  • శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి మహత్యం (1980)
  • దైవ తిరుమంగళ్ (తమిళం) (1981) (వల్లీ తిరుమానం – పాక్షికంగా)
  • ఏకలవ్య (1982)
  • సంతోషీమాత్ర వ్రత మహత్యం (1983)
  • భద్రీనాథ దర్శనం (1985)
  • శ్రీ దత్త దర్శనం (1985)
  • అష్టలక్ష్మి వైభవం (1986)
  • దేవి నవగ్రహ నాయకి (1986)
  • ఏడు కొండల స్వామి (1991)

సహాయ దర్శకుడిగా:

  • గృహలక్ష్మి (1938)
  • వందేమాతరం (1939)
  • సుమంగళి (1940)
  • దేవత (1941)
  • భక్త పోతన (1942)
  • స్వర్గసీమ (1945)
  • యోగి వేమన (1947)
  • గుణసుందరి కథ (1949)
  • పాతాళభైరవి (1951)
  • గుణ సుందరి (1955)

పురస్కారాలు:

  • 1964: జాతీయ ద్వితీయ ఉత్తమ చలన చిత్రం – నర్తనశాల
  • 1962: తెలుగులో ఉత్తమ చిత్రానికి గాను రాష్ట్రపతి రజత పతకం – మహామంత్రి తిమ్మరసు
  • 1960: తెలుగులో ఉత్తమ చిత్రానికి గాను రాష్ట్రపతి రజత పతకం – మహాకవి కాళిదాసు

***

ఈ దిగ్దర్శకులు తన 88వ ఏట జూన్ 29, 1998 న గుండెపోటుతో మరణించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here