Site icon Sanchika

అలనాటి అపురూపాలు-57

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

మధుర గీతాల స్వరకర్త సత్యం:

‘సత్యం’గా ప్రసిద్ధులైన ప్రముఖ సంగీత దర్శకులు చెళ్ళపిళ్ళ సత్యనారాయణ ఆంధ్ర ప్రదేశ్‍లోని విజయనగరం జిల్లాలోని పార్వతీపురం సమీపంలోని గునానుపురం అగ్రహారంలో జన్మించారు. చెళ్ళపిళ్ళ అప్పల నర్సింహులు వీరి తండ్రిగారు. వీరి తాతగారు చెళ్ళపిళ్ళ సత్యనారాయణ గొప్ప హరికథా భాగవతార్. ఐదేళ్ళ వయసున్న సత్యాన్ని ఆయన సంగీతపు తరగతులలో చేర్చారు. అక్కడ సత్యం ప్రాథమికాంశాలు నేర్చుకున్నారు. తరువాత సత్యం సాలూరులో తన తాతగారి స్నేహితులైన శ్రీ పట్రాయని సీతారామశాస్త్రి వారి వద్ద సంగీత శిక్షణకై చేరారు (వీరు ప్రముఖ నేపథ్యగాయకులు శ్రీ ఘంటసాల గురువుగారు, పి. సంగీతరావుకి తండ్రి). సత్యం ఐదో తరగతి వరకే చదివారు. తరువాత పట్రాయని సీతారామశాస్త్రి గారి శిష్యుడైన శ్రీ తంపెల్ల సత్యనారాయణ గారి వద్ద సంగీతం నేర్చుకున్నారు. సరళీ స్వరాలు, జంట స్వరాలు, కృతులు, వర్ణాలు అభ్యసించారు. చదువు మీద కన్నా సంగీతం పైనే ఆసక్తి ఎక్కువ ఉన్న సత్యం తమ ఊరి లోనే చిన్న చిన్న ప్రదర్శనలివ్వసాగారు.

ఒకరోజు సాలూరులో కాకినాడకి చెందిన యంగ్ మెన్స్ కల్చరల్ అసోసియేషన్ (వై.ఎం.సి.ఎ) వారి ప్రదర్శన జరిగింది. స్వరకర్త ఆదినారాయణరావుని, అంజలీదేవిని చూసేందుకు సత్యం ఆ ప్రదర్శనకి వెళ్ళారు. ప్రదర్శన పూర్తయ్యాక, సత్యం స్నేహితులు ఆయనను శ్రీ పెనుపాత్రుని కృష్ణయ్యకి (స్వరకర్త ఆదినారాయణరావు తండ్రి) – తమ ఊరికి చెందిన వర్ధమాన కళాకారుడని పరిచయం చేశారు. ఆయన సత్యంని ఒక పాట పాడమన్నారు. ఆ పాట, సత్యం ప్రవర్తన ఆయనకి నచ్చాయి. సంగీతమంటే సత్యంకి ఉన్న ఆసక్తిని గమనించి, కాకినాడ వచ్చి యంగ్ మెన్స్ కల్చరల్ అసోసియేషన్‍లో చేరమన్నారు. అప్పట్లో ఆ సంస్థ తరపున యస్.వి. రంగారావు, రేలంగి కూడా యుద్ధ నిధుల ప్రదర్శనలతో సహా, పలు ప్రదర్శనలలో పాల్గొనేవారు. ఈ ప్రదర్శనలలో సత్యం ప్రార్థనాగీతాలు పాడేవారు. ఆదినారాయణరావుకి (అందరూ ఆప్యాయంగా ‘అబ్బాయి’ అనేవారు) యువ సత్యం ఈ విధంగా చదువుకోకుండా సమయం వృథా చేయడం నచ్చలేదు. కాకినాడ పి.ఆర్. కాలేజ్ అండ్ హైస్కూల్‍లో చేరమని సూచించారు. వారి ప్రోత్సాహంతో, సత్యం థర్డ్ ఫార్మ్ బాగా చదివారు. ఆదినారాయణరావు, అంజలీదేవి వివాహం చేసుకున్నాక, సత్యం వారితో కలసి వారింట్లో ఉండసాగారు. ఆ సమయంలోనే అంజలీదేవికి సినిమాలలో నటించే అవకాశం వచ్చి, ఆ దంపతులు మద్రాసుకు వెళ్ళిపోయారు. తన సంరక్షకులు దూరం కావడంతో, సత్యం చదువు మీద ఆసక్తి కోల్పోయారు, తన ఊరికి వెళ్ళిపోయారు. ఆ సమయంలో సత్యం – ఇందుకూరి రామకృష్ణం రాజుని (తరువాత ‘రాజశ్రీ’గా ప్రసిద్ధులు) కలిసి కొన్నాళ్ళు నాటకాలలో పని చేశారు. అయినా తృప్తి కలగని సత్యం ‘మున్సిఫ్’ అయ్యేందుకు అవసరమైన పరీక్ష రాశారు. కానీ తాను మున్సిఫ్ పనికి తగనని భావించి – తన గ్రామంలో ఉండలేననీ, మద్రాసు వచ్చి కలుస్తాననీ – ఆదినారాయణరావుకి ఉత్తరం రాశారు. ఆ సమయంలో అంటే 1949లో ఆదినారాయణరావు – అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి అశ్విని పిక్చర్స్ అనే సంస్థని స్థాపించారు. ఈ బ్యానర్‍పై ‘మాయాలమారి’ అనే చిత్రాన్ని నిర్మించదలచారు. వెంటనే మద్రాసు వచ్చి ఆ సినిమా నిర్మాణ వ్యవహారాలు చూసుకోమని సత్యంకి కబురు చేశారు. మద్రాసు చేరిన సత్యం అళ్వార్‌పేట్‍లోని అశ్విన్ పిక్చర్స్ వారి ఆఫీసులో ఉండేవారు. తన ఖాళీ సమయంలో సత్యం – అశ్విన్ పిక్చర్స్ వారి ఆర్కెస్ట్రాలో సభ్యుడైన పెద్ద అంజయ్య వద్ద ‘ఢోలక్’ నేర్చుకునేవారు. ఒకరోజు రిహార్సల్‍కి అంజయ్య రాలేకపోయారు. సత్యం ఢోలక్ బాగా వాయిస్తారని ఆఫీసు సిబ్బంది ఆదినారాయణరావుకి చెప్పారు. పెద్ద అంజయ్య కూడా పెద్ద మనసుతో సత్యం రిహార్సల్‍లో వాయిస్తారని, తాను మెయిన్ రికార్డింగ్‍కి కలుస్తానని ఆమోదం తెలిపారు. ఈ విధంగా ప్రారంభయి, సత్యం ‘ఢోలక్ సత్యం’గా ప్రసిద్ధి చెంది, కుదురుకున్నారు. ఈ చిత్రం 1951లో విడులయింది, ఈ సినిమాలో సత్యం ఓ బృందగానంలో పాడారు కూడా. అప్పట్లో సహాయ సంగీత దర్శకుడిగా ఉన్న టి.వి. రాజుకి, వీణ రంగారావుకి సత్యం పరిచయమయ్యారు. వారు ముగ్గురు మిత్రులయ్యారు. ఎన్.టి.ఆర్. సొంత సంస్థ ఎన్.ఏ.టి సంస్థలో సంగీతం చేసే అవకాశం టి.వి. రాజుకి లభించింది. తనతో రిథమిస్ట్‌గా సత్యంని తీసుకోవలసిందిగా ఆయన సూచించారు. రిహార్సల్‍లో ఈ కుర్రాడి ఉత్సాహం చూసిన ఎన్.టి.ఆర్ సోదరుడు సత్యంని పర్మనెంట్ రిథమిస్ట్‌గా ఎంచుకున్నారు. త్వరలోనే సత్యం టి.వి.రాజుకి క్రింద సహాయ సంగీత దర్శకుడయ్యారు. ఎన్.టి.ఆర్. సొంత సంస్థ ఎన్.ఏ.టి సంస్థలో టివి రాజుతో కల్సి ఎనిమిదేళ్ళు పని చేశారు. ‘జయసింహ’ (ఈ సినిమా అప్పుడే సత్యం ఒక పాటకి ఎలా బాణీ కట్టాలో నేర్చుకున్నారు), ‘పాండురంగ మహత్యం’ వంటి చిత్రాలకు పని చేశారు. తన గురు సమానులు ఆదినారాయణరావు వద్ద – ‘సువర్ణ సుందరి’, ‘స్వర్ణ మంజరి’, ‘సతీ సక్కుబాయి’, ‘సుమతి’, ‘పక్కింటి అమ్మాయి’ తమిళ వెర్షన్, ‘ఋణానుబంధం’, హిందీ చిత్రం ‘ఫూలోం కీ సేజ్’, ఇంకా చిన్ని బ్రదర్స్ వారి ‘కుంకుమ భరిణె’ – వంటి చిత్రాలకి సహాయ సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. ‘ఫూలోం కీ సేజ్’ నిర్మాణ కాలంలోనే ఎమ్. ఎస్. నాయక్ (నటి చంద్రకళ తండ్రి, పెద్ద పంపిణీదారు) కన్నడంలో ‘శ్రీరామాంజనేయ యుద్ధ’ నిర్మాణం ప్రారంభించారు. స్వతంత్ర సంగీత దర్శకుడిగా సత్యంకి ఆయన ఈ సినిమాకి అవకాశం ఇచ్చారు. ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో, సత్యం గురించి కన్నడ ప్రజలకు తెలిసింది. ఆ కాలంలో చాలా కన్నడ సినిమాలు మహా అయితే నాలుగు నుంచి ఆరు వారాలు ఆడేవి, కానీ నాయక్ తీసిన ‘ఒందే బళ్ళియ హూగళు’ 26 జనవరి 1967 నాడు విడుదలై సూపర్ హిట్ అయింది. ఈ సినిమాని ‘ఆడపడుచు’ పేరిట తెలుగులో రీమేక్ చేశారు (‘ఒందే బళ్ళియ హూగళు’ చిత్రంలో మహమ్మద్ రఫీ తొలిసారిగా కన్నడంలో పాడారు). ఈ సినిమా విజయంతో సత్యం కీర్తి ప్రతిష్ఠలు పెరిగాయి. ఫలితంగా, తరువాతి రెండేళ్ళలో సత్యం 40 కన్నడ సినిమాలకు సంగీతం అందించారు! ‘భలే భాస్కర’, ‘గాంధీనగర’, ‘కాసిద్రె కైలాస’, ‘లక్షాధీశ్వర’, ‘ఒందే బళ్ళియ హూగళు’, ‘ముయ్యిగె ముయ్యి’, ‘శ్రీ రామాంజనేయ యుద్ధ’, ‘సర్వమంగళ’, ‘సతీ సక్కుబాయి’ వంటి కన్నడ చిత్రాలకు సంగీతం అందించారు. ఆ కాలంలో చాలా పాటలు మదరాసులోని గోల్డెన్ స్టూడియోస్‍లో రికార్డింగ్ జరుపుకునేవి. ఒకసారి ఓ సినిమాకి రికార్డింగ్ జరుగుతుండగా – గౌరీ ప్రొడక్షన్స్‌కి చెందిన ఎస్. భావనారాయణ సత్యంగారిని కలిసి జుమున, హరనాథ్ నాయికానాయకులుగా తాము నిర్మిస్తున్న ‘పాల మనసులు’ (1967) చిత్రానికి సంగీతం అందించవలసిందిగా కోరారు. ఈ సినిమాతో సత్యంకి తెలుగులో కాస్త గుర్తింపు వచ్చింది (అంతకు ముందు 1963లో ‘సవతి కొడుకు’ చిత్రానికి సంగీతం సమకూర్చినా, ఆ సినిమా పరాజయం పాలవడంతో ఆయనకు తగిన గుర్తింపు రాలేదు). తరువాత ‘రాజయోగం’ చిత్రానికి పనిచేశారు. ఈ రెండు సినిమాలు యావరేజ్‍గా ఆడినా, సత్యంకి తెలుగులో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. కొద్ది కాలంలోనే ఆయన యాక్షన్-క్రైమ్ చిత్రాలకు ప్రసిద్ధి చెందారు. ఎల్. ఆర్. ఈశ్వరి పాడిన ‘ఏస్కో కొక్కోకోలా’ వంటివి ఎవరు మరువగలరు? ఎల్.ఆర్. ఈశ్వరి ఎక్కువగా సత్యం సంగీత దర్శకత్వంలోనే పాడారు. సత్యం ‘మసాలా’ పాటలనే కాదు, ‘కురిసిందీ వానా’, ‘అమ్మ అన్నది ఒక కమ్మని మాట…’ వంటి మెలోడీలను అందించారు. ‘ఏ దివిలో విరిసిన పారిజాతమో’ వీరి బాణీయే (ఇదే బాణీని కన్నడ చిత్రం గాంధీనగరలో ‘నీ ముడిదా మల్లిగ’ అనే పాటకి ఉపయోగించారు. కన్నడంలో పి. బి. శ్రీనివాస్, పి. సుశీల ఆలపించారు).

కొంతమంది ఆరోపించినట్టుగా తాను సంగీతం కాపీ చేస్తానని సత్యం అంగీకరించలేదు. ప్రతీ పాటకి ఆధారం ఏదో ఒకటి ఉంటుందనీ, ఒక్కోసారి దాన్ని తెలుగు పాటలకు నప్పేలా ఉపయోగించుకుంటానని ఆయన చెప్పారు. కృష్ణ నటించిన ‘గౌరి’ చిత్రంలోని ‘గలగల పారుతున్న గోదారిలా’… (ఈ పాటని మహేష్ బాబు ‘పోకిరి’లో రీమిక్స్ చేశారు) పాటని జోస్ ఫెలిసియానో పాట ‘లిజన్ టు ది ఫాలింగ్ రైన్’ నుంచి గ్రహించారు. సుప్రసిద్ధమైన ‘కురిసింది వానా’ ( ఈ పాట బాణీని ఇటీవలి ‘వాన’ చిత్రంలో, ‘సిరిమల్లె వాన పడుతోంది లోనా’ పాటకి ఉపయోగించుకున్నారు) పాటకి ఆధారం… 1969లో వచ్చిన హిందీ చిత్రం ‘తలాష్’ లోని ‘ఖాయీ హై రె హమ్ నె కసమ్’ పాట.  ఇలాంటిదే మరో పాట… సంగీత దర్శకుడిగా ఆయన తొలి చిత్రం ‘సవతి కొడుకు’ లోని ఘంటసాల, ఎస్. జానకి పాడిన యుగళగీతం … ‘స స స సరే’కి ఆధారం ‘నాటీ బోయ్’ అనే హిందీ చిత్రానికి కిషోర్ కుమార్, ఆశా భోస్లే పాడిన ‘స స స సారే’ అనే పాట. ఇదే సినిమాలో ఘంటసాల పాడిన సోలో ‘ఈ దేశం ఆంధ్రుల దేశమురా’ అనే పాటకి ‘నయా దౌర్’ అనే హిందీ చిత్రానికి రఫీ-బల్బీర్‍ల గీతం ‘యహ్ దేశ్ హై వీర్’ అనే పాట ఆధారం. ఇక ఆయన సంగీతం అందిన కొన్ని పాటలలో – ‘ఏ దివిలో విరిసిన పారిజాతమో’, ‘గున్న మామిడి కొమ్మ మీద’, ‘ఓ బంగరు రంగుల చిలకా’, ‘కలిసే కళ్ళ లోనా’, ‘తొలి వలపే తీయనిది’, ‘మధుమాస వేళలో’, ‘కురిసింది వాన…’ వంటివి బాగా ప్రసిద్ధి చెందాయి.

సత్యం ‘ఆంధ్రా ఆర్.డి. బర్మన్’ అని పేరుగాంచారు. ఆయన కొన్ని బెంగాలి, భోజ్‌పురి, హిందీ సినిమాలకు కూడా సంగీతం అందించారు. లతా మంగేష్కర్ తోనూ, ఆశా భోస్లే తోనూ పని చేసిన అతి తక్కువ మంది సంగీత దర్శకులలో ఆయన ఒకరు. ఆదినారాయణరావు గారి దగ్గర పని చేస్తున్నప్పుడు లత మంగేష్కర్‍ని కలిసిన సత్యంకి ‘సువర్ణ సుందరి’ హిందీ వెర్షన్‍కి ఆమె పాడబోయే ‘కుహు కుహు బోలే కోయలియాఁ’ (హాయి హాయిగా ఆమని సాగె – పాటకి హిందీ వెర్షన్) పాట రిహార్సల్స్ పర్యవేక్షించే అవకాశం లభించింది. ఈ విషయం తెలిసిన ఆశా భోస్లే – ‘పాలు నీళ్ళు’ చిత్రానికి పాడమని సత్యం తనని అడగగానే, వెంటనే ఆమోదం తెలిపారు. పైగా సత్యం పట్ల ఉన్న గౌరవంతో ఆ పాటకి పారితోషికం కూడా తీసుకోలేదు. మద్రాసు వచ్చినప్పుడల్లా సత్యం గారింటికి వచ్చేవారామె!

తెలుగు సినీరంగంలోకి చక్రవర్తి ప్రవేశించడంతో, సత్యం ప్రభ క్షీణించింది. రాజశేఖర్ నటించిన ‘అంకుశం’ (1989) ఆయన చివరి సినిమాలలో ఒకటి. 1970లలో తెలుగు లోనే కాక, కన్నడంలో పెద్ద సంగీత దర్శకుడిగా కొనసాగారు సత్యం. 11 జనవరి 1989 నాడు ఈ భౌతిక ప్రపంచాన్ని వీడినా, ఆయన సంగీతం కలకాలం నిలిచి ఉంటుంది. వారి ఆత్మకు శాంతి కలుగుగాక! ‘సుడిగాడు’ చిత్రానికి సంగీతం అందించిన వసంత్, ఈయన మనవడే.

సత్యం సంగీతం సమకూర్చిన చిత్రాల జాబితా కోసం ఈ లింక్ చూడండి:

https://en.wikipedia.org/wiki/Chellapilla_Satyam

ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం జ్ఞాపకాలలో సత్యం:

ఔత్సాహిక గాయకుడిగా ఉన్నప్పటి జ్ఞాపకాలను ఎస్.పి.బాలు గుర్తు చేసుకున్నారు. ఆయన గాయకుడిగా ఎదగడంలో – గురువు గారు కోదండపాణి; మిత్రుడు, సంగీతదర్శకుడు చక్రవర్తితో పాటు ప్రసిద్ధ స్వరకర్త సత్యం గారి పాత్ర కూడా ఎంతో ఉంది. ‘శంకరాభరణం’ (1980) చిత్రానికి అర్ధ-శాస్త్రీయ గీతాలు పాడి జాతీయ అవార్డు గెలుచుకోడానికి చాలా ఏళ్ళ ముందే బాలు చేత ‘ప్రతీకారం’ (1969) చిత్రంలో ‘నారీ రసమాధురీ’ అనే పూర్తిస్థాయి శాస్త్రీయ గీతాన్ని పాడించారు సత్యం. బాలు అత్యంత గొప్పగా పాడిన పాటలలో అది ఒకటని విమర్శకులు అంటారు. “అది నాక్కూడా ఇష్టమైన పాటల్లో ఒకటి. సత్యంగారితో నా ప్రయాణం ‘పాల మనసులు’ (1968) చిత్రంతో మొదలైంది. ఆయనకి పాడిన మొదటి పాటే – శ్రీమతి ఎల్.ఆర్. ఈశ్వరితో ‘ఆపలేని తాపమాయే’ అనే యుగళగీతం. గోల్డెన్ స్టూడియోస్ రికార్డింగ్ థియేటర్‍లో పాడాం. అప్పట్లో ఈశ్వరి గారు బాగా ప్రఖ్యాతి చెందారు. నేను సత్యం గారి అంచనాలను అందుకోలేకపోయాను. ‘సగం సగం నేర్చుకున్నవాళ్ళంతా పరిశ్రమకి వచ్చేస్తున్నారు’ అంటూ ఆయన నామీద అరిచారు. ఆ స్టూడియో మామిడి తోట మధ్యలో ఉండేది. అవమానం భరించలేక, నేను బయటకి వచ్చి ఓ మామిడి చెట్టు కింద కూర్చుని ఏడ్చాను. ఆ సినిమా ప్రొడక్షన్ మేనేజర్ అట్లూరి పూర్ణచంద్రరావు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ వై.వి. రావు (ఇద్దరూ తర్వాతి రోజుల్లో నిర్మాతలయ్యారు) నన్ను ఓదార్చి, సత్యంగారి దగ్గరికి తీసుకెళ్ళి, ‘అబ్బాయి కుర్రవాడు. ఆర్కెస్ట్రా అందరి ముందు అంత కోపంగా మాట్లాడితే ఎలా? బాగా పాడేందుకు కాస్త సమయం ఇవ్వండి’ అని నచ్చజెప్పారు. ‘ఎవరెవరినో తీసుకొచ్చి పాడిస్తారాండీ? ఎలా… ఎప్పటికి తేలాలి?’ అన్నారు సత్యం. అయితే తర్వాత ఆ పాటని నాతోనే మళ్ళీ పాడించారు. ఇది ఆయనతో నా మొదటి అనుభవం.”

“సత్యంగారికి పిల్లలు లేరు. నన్ను ఎప్పుడూ ‘కొడుకు’ అని పిలిచేవారు. తరువాతి కాలంలో నేను లేకుండా ఒక్క పాటనీ రికార్డు చేయలేదు. ‘నా కొడుకు, నా గాత్రం నాకు కావాలి’ అనేవారు. ఆయన దర్శకత్వంలో ఎన్నో మెలొడీలు పాడాను. నిజానికి ఆయన స్వరపరిచిన ‘ఏ దివిలో విరిసిన పారిజాతమో’ (కన్నవయసు – 1973) పాట నా కెరీర్‍లో ఓ మేలి మలుపు” వివరించారు ఎస్.పి.బి.

“ఆయన స్వరపరిచిన గీతాల్లో నేను పాడిన వాటిల్లో నాకు  బాగా ఇష్టమైనది ‘నారీ రసమాధురీ లహరి అనురాగ వల్లరి ఆనంద ఝరి’ అనేది. ఈ పాటని అత్యంత నెమ్మదస్తుడు, గొప్ప రచయిత చెరువు ఆంజనేయ శాస్త్రి రాశారు. ఒకసారి నెటిజన్స్‌లో ఈ పాటకి గొప్ప డిమాండు వచ్చింది, అదృష్టవశాత్తు ఎవరో అప్‍లోడ్ చేశారు. ఎంతో జలుబుతో ఈ పాట పాడాను తెలుసా? కొన్ని పాటలకి అటువంటి స్వరం బాగా నప్పుతుంది.” (నవ్వారు).

అలా జలుబుతో బాధపడుతూనే ఆయనకి పాడిన పాటలలో – ‘మామా చందమామ’ (సంబరాల రాంబాబు), ‘కలువకు చంద్రుడు ఎంతో దూరం’ (చిల్లర దేవుళ్ళు), ఇంకా ఎంజిఆర్ -జయలలిత నటించిన తమిళ చిత్రం Thedi vantha Mappillai లోని ‘వెట్రి మీతు వెట్రి వంతు’ అనే పాట.”

“సత్యం గారు నాకు తండ్రి వంటి వారు మాత్రమే కాదు, ఫ్రెండ్, గైడ్ కూడా. గొప్పగా పాడడంలోని మెలకువలను నాకు నేర్పారు. హిందూస్థానీ సంగీతానికి నన్ను పరిచయం చేశారు” అంటూ ‘ది హిందూ’ దినపత్రికకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూని ముగించారు ఎస్.పి.బి.

***                    


ట్రావెన్‍కోర్ సోదరీమణుల విదేశీయాత్రలోని కొన్ని జ్ఞాపకాలు:

లలిత, పద్మిని, రాగిణి – ఈ ముగ్గురు ‘ట్రావెన్‍కోర్ సిస్టర్స్’గా ప్రసిద్ధి. ట్రావెన్‌కోర్ రాజసంస్థానం (నేటి కేరళ రాష్ట్రం) లోని తిరువనంతపురంలో (త్రివేండ్రం) పుట్టి, పెరిగిన ఈ ముగ్గురు తంగప్పన్ పిళ్ళయ్, సరస్వతి అమ్మ దంపతుల కుమార్తెలు. వీరు సుప్రసిద్ధ గురువు వళువూరు రామయ్య పిళ్ళయ్ గారి వద్ద శిష్యరికం చేసి భరతనాట్యం నేర్చుకున్నారు. గురు గోపీనాథ్ వద్ద కేరళ సంప్రదాయ నృత్యం అభ్యసించారు. ట్రావెన్‍కోర్ సిస్టర్స్ సినీరంగ ప్రవేశం యాదృచ్ఛికంగా జరిగింది. ఈ సోదరీమణులు ముంబై వెళ్ళినప్పుడు వారి మావయ్య ఒకరు సుప్రసిద్ధ నృత్యకళాకారుడు ఉదయ్ శంకర్‍గారిని విందుకు ఆహ్వానించారు. తాను రూపొందించబోయే నృత్యప్రధాన చిత్రం నటించేందుకు మద్రాసు రావల్సిందిగా ఉదయ్ శంకర్ వీరిని ఆహ్వానించారు. ఆ విధంగా, లలిత, పద్మినిలు 1948లో విడుదలయిన ‘కల్పన’ చిత్రం ద్వారా సినీరంగంలోకి ప్రవేశించారు. “ఒకే వృత్తిలో ఉన్న కారణంగా మేం అక్కా చెల్లెళ్ళం సమయం సరదాగా గడిపేవాళ్ళం. సినిమాలో నటించేవాళ్ళం, నృత్య ప్రదర్శనలిచ్చేవాళ్లం. మేం ‘డాన్సర్స్ ఆఫ్ ఇండియా’ అనే ట్రూప్ ఏర్పాటుచేసుకున్నాం. రాగిణి పొడుగ్గా ఉండడంతో మగ వేషాలు వేసేది. నేను పొట్టిగా ఉంటాను కాబట్టి, ఎప్పుడూ కథానాయిక పాత్రలు వేసేదాన్ని. నేను ఎక్కువగా – ఏడ్చే పాత్రలనే పోషించాను. రాగిణి హాస్యపాత్రలు బాగా వేసేది. లలిత వ్యాంప్ తరహా పాత్రలు వేసేది” చెప్పారు పద్మిని. వీరి ట్రూప్‍లో ఈ ముగ్గురు సోదరీమణులే కాకుండా వారి కజిన్స్ సుకుమారి, అంబిక కూడా ఉండేవారు. వీళ్ళిద్దరూ మళయాలం చిత్రసీమలో ఎన్నదగిన నటీమణులు (నిజానికి సుకుమారి చిత్రాలలో నటించినా, నృత్యమే వారికి ప్రథమ ప్రాధాన్యత. రంగస్థలంపై ప్రదర్శించే పాములాట, కృష్ణలీల, రాధాకృష్ణుల కథ, వంటి వాటినే సినిమాల్లో పెట్టేవారు). వీళ్ళంతా తమ ట్రూప్‍తో ప్రపంచమంతా పర్యటించేవారు. వారు ఒకచోట రామాయాణాన్ని నృత్యరూపకంగా ప్రదర్శించగా, పద్మిని సీతగాను, రాగిణి రాముడిగాను, లలిత రావణుడిగాను, అంబిక హనుమాన్ గాను, భరతుడిగాను నటించారు.

వారి విదేశీయాత్రలోని కొన్ని జ్ఞాపకాలను గురించి పద్మిని మాటల్లోనే విందాం. “నేనూ, అక్క లలిత, చెల్లెలు రాగిణి ఎన్నోసార్లు విదేశాలలో ప్రదర్శనలిచ్చాం. వాటిల్లో కొన్ని గుర్తుంచుకోదగ్గ జ్ఞాపకాలున్నాయి. 1952లో మేం ముగ్గురం మలయా, సింగపూర్ వెళ్ళాం. మేం మొదటగా సింహళం వెళ్లి, అక్కడ్నించి నౌకలో మలయా బయల్దేరాము. అది వారం రోజుల ప్రయాణం. అతి కష్టం మీద నాలుగు రోజులు గడిచాయి. మాకు విసుగ్గా ఉంది. అదే రైలు ప్రయాణమైతే, పట్టాలకి రెండు వైపులా కనిపించే దృశ్యాలను చూస్తూ ఆనందించేవాళ్ళం. అదే విమాన ప్రయానమైతే తొందరగా ముగిసిపోయేది. కానీ ఇలా నౌకలో ప్రయాణించడం మాకు బోర్ కొట్టింది. అయిదో రోజు నౌక పై భాగం చూద్దామనుకుని, పైకి వెళ్ళేందుకు ఉన్న లిఫ్ట్ ఉపయోగించాం. లిఫ్ట్ ఎక్కి, తలుపు వేశాం. ఉన్నట్టుండి లిఫ్ట్ మధ్యలో ఆగిపోయింది. మేం భయపడిపోయి, అక్కడ ఉన్న స్విచ్‌లన్నీ గబాగబా నొక్కేసాం. ఏదీ పని చేయలేదు. గట్టిగా అరిచాం, కానీ మా అరుపులు ఎవరికీ వినబడలేదు. అప్పుడు పైన మరో స్విచ్ ఉన్నట్టు లలిత గమనించి, దాన్ని నొక్కింది. అది అలారం. గట్టిగా మోగింది. చాలామంది తమ పనులు మానుకుని లిఫ్ట్ కేసి పరిగెత్తుకొచ్చారు. వాళ్ళ భాషలో అడిగిన ఏ ప్రశ్నకూ కూడా మేం జవాబు చెప్పలేకపోయాం. మా భాష తెలీక, మేం చెప్పేది వాళ్ళకి అర్థం కావడం లేదు. ఈ సంఘటన గుర్తొస్తే, ఇప్పటికీ నేను వణికిపోతాను. అంతలా భయపెట్టింది. సింగపూర్ చేరాక గాని కుదుటపడలేదు. మేం మా డాన్స్ ప్రోగ్రామ్‍కి సిద్ధమవుతుండగా ఒకతను వచ్చాడు. మా ప్రదర్శన ఎప్పుడు అని అడిగాడు. రాత్రికి అని చెప్పాము. రాగిణిని చూపిస్తూ, ఆమె వయసు ఎంత అని అడిగాడు. అప్పుడు తన వయసు తొమ్మిదేళ్ళు. అదే చెప్పాం. అప్పుడతను – అక్కడో నియమం ఉందని, రాత్రి తొమ్మిది గంటల తర్వాత ప్రదర్శన ఇచ్చే కళాకారుల వయసు కనీసం పదేళ్లకి పైన ఉండాలని చెప్పాడు. కానీ తను లేకుండా మేం ఎలా ప్రదర్శన ఇవ్వగలం? మాది బృంద రూపకం. మీ నియమం మాకు తెలియదు అంది లలిత. నేనేం చేయలేను అన్నాడతను. చివరికి, నేను, లలితా – రాగిణి లేకుండానే ఆ ప్రదర్శన పూర్తి చేశాం. బహుశా ప్రేక్షకులకి ఈ విషయం తెలియకపోవచ్చు, కాని రాగిణి లేని లోటు మాకు తెలిసింది. ఈ విధంగా ఈ ప్రయాణాన్ని ముగించాం.

మా తరువాతి పర్యటన 1957లో రష్యా. ఈసారి మేం రాగిణిని తీసుకువెళ్లలేదు. నేనూ లలితా బృందంలోని మిగతా సభ్యులతో కలిసి వెళ్ళాం. రష్యన్ ప్రభుత్వం మా పోస్ట్ కార్డ్ ‍లను విడుదల చేయడం మాకెంతో ఆనందాన్నిచ్చింది. మమ్మల్ని గౌరవించినట్లుగా భావించాము. మేం ఎక్కడికి వెడితే అక్కడికి రష్యన్‍లు ఆ పోస్ట్ కార్డులను పట్టుకుని మమ్మల్ని అనుసరించారు. ఆ పోస్ట్ కార్డుల మీద మా సంతకాలు అడిగేవారు. వారు నిజమైన నృత్య ప్రేమికులు. మేము మొదటి ప్రదర్శన ఇచ్చిన రాత్రి, వారి స్పందన అద్భుతం. మొదటి అంశాన్నే మళ్ళీ మళ్ళీ అడుగుతూండడంతో దాన్నే 18 సార్లు చేశాం. సమయం పూర్తయింది మేం ప్రాంగణాన్ని వీడాల్సి వచ్చింది. ప్రేక్షకులు మాకు మాస్కో నగరాన్ని సందర్శించే అవకాశమే ఇవ్వలేదు. మా వెంటే వస్తూ పూలదండలూ, పూలగుత్తులు అందించారు. మరికొందరు ఐస్ క్రీమ్ ఇచ్చారు. మరి కొంతమంది అభిమానులు మమ్మల్ని చుట్టుముట్టి వింత కోరిక కోరారు. మా టూర్ ప్రోగ్రామ్ టికెట్లన్నీ ముందే బుక్ అయిపోయాయి. మా చుట్టూ మూగినవాళ్ళల్లో టికెట్ దొరకని వాళ్ళే ఎక్కువ. వాళ్ళ తృప్తి కోసం ఆ పేవ్‌మెంట్ మీదే మమ్మల్ని కాస్త డాన్స్ చేయమని బ్రతిమాలారు. వేదిక, ఇతర సరంజామా లేకుండా నృత్యం సాధ్యం కాదని నచ్చజెప్పాము. అయినా వినలేదు. చివరికి ఏవో చిన్న చిన్న భంగిమలు చేసి వాళ్ళ కోరిక తీర్చాము. ఎంతో తృప్తిగా మాకు వీడ్కోలు చెప్పారు.

మళ్ళీ 1957లో ‘పర్‌దేశీ’ అనే ఇండో-రష్యన్ సినిమా షూటింగ్ కోసం నేనొక్కదాన్నే రష్యా వెళ్ళాను. ఆ సినిమాలో రష్యన్ హీరో ఒలెగ్ సరసన నర్గిస్ హీరోయిన్‍గా నటించారు. నాది ఓ నర్తకి పాత్ర. నాతో పాటు రాగిణిని, అమ్మని తీసుకువెళ్లాను. నా పాటలకు కోరియోగ్రఫీ క్రెడిట్ రాగిణికి ఇచ్చి, టైటిల్స్‌లో కూడా వేశారు. అంతే కాదు, రాగిణికి జీతం కూడా ఇచ్చారు. మాకు రక్షణగా మా వెంట ఉన్నందుకు అమ్మకు కూడా జీతం ఇచ్చారు. కాఫీ అయినా, టీ అయినా, ఆహారం అయినా మేమంతా క్యూలో నిలుచుని తీసుకున్నాం. అక్కడ ఎవరిపట్ల భేదభావాలు లేవు. ఎవరైనా సరే వరుసలో నిలబడాల్సిందే. ముందు వచ్చిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.

1964లో లండన్‍లో ప్రదర్శనలిచ్చేందుకు ఆసియన్ ఫిల్మ్ సొసైటీ మమ్మల్ని ఆహ్వానించింది. మేమంతా సిద్ధమయ్యాం, కానీ చివరి క్షణంలో రాగిణి అనారోగ్యం పాలయింది. అన్ని రకాల మందులు ప్రయత్నించాం కానీ, తన ఆరోగ్యం కుదుటపడలేదు. నన్నొక్కదాన్నే ప్రదర్శన ఇవ్వమన్నారు. కానీ నాకు భయం వేసింది. అందుకని మినూ ముంతాజ్‌కి (నటుడు మహమూద్ సోదరి, ఈవిడ మంచి నర్తకి) విషయం తెలియజేసి వీలైనంత త్వరగా వచ్చి మా ట్రిప్‍లో కలవమన్నాను. తనకి కథక్, భరతనాట్యం రావంటూ సందేహించింది. “వచ్చేయ్, ఏం చేయాలో, ఎలా చేయాలో నేను నేర్పిస్తాను” అన్నాను. తను వచ్చింది. మేమిద్దరం కలిసి చక్కని నృత్యాలు చేసి కార్యక్రమాలని రక్తి కట్టించాం. ఆ పర్యటనలో మేం ఎక్కడికి వెళ్ళినా, చక్కని ప్రశంసలు దక్కాయి.

1968లో మేం మలేసియా వెళ్ళాం. అక్కడ ప్రదర్శనలను విజయవంతంగా పూర్తి చేశాం. తిరిగి స్వదేశానికి వచ్చేద్దామనుకుంటుంటే – అక్కడి ఇన్‍కమ్‍ టాక్స్ గొడవలలో చిక్కుకున్నాం. అధికారులు మమ్మల్ని 15 రోజులు పాటు వెళ్లనీయలేదు. మాకిచ్చిన బసలో ఉన్నాం. భారతీయ వంటలు చేసేవాళ్ళు లేకపోవడంతో, మేమే వండుకుని తిన్నాం. సమయం గడపడం కూడా కష్టమయింది. ఇన్‍కమ్ టాక్స్ ఒత్తిళ్ళు, మద్రాసులో ఆగిపోయిన షూటింగులు మాలో ఉద్విగ్నతలు రేపాయి. ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. ఆ 15 రోజులు భారంగా గడిపాం. కాలక్షేపం కోసం, ఆర్కెస్ట్రా లేకుండా పాటలు పాడుకుంటూ, నాట్యం చేశాం. మా విదేశీ యాత్రలో ఇదో మర్చిపోలేని సంఘటనగా మిగిలింది.”

ఇవీ ట్రావెన్‍కోర్ సోదరీమణుల విదేశీయాత్రలలో కొన్ని జ్ఞాపకాలు!

Exit mobile version