Site icon Sanchika

అలనాటి అపురూపాలు-58

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

బహుముఖ ప్రజ్ఞాశాలి పంకజ్ మల్లిక్:

పంకజ్ మల్లిక్ స్వరకర్త, సంగీత విద్వాంసులు, గాయకులు, సంగీత దర్శకులు, ఉపాధ్యాయులు ఇంకా పార్ట్-టైమ్ నటులు. బెంగాలీ చిత్రసీమకే కాకుండా మొత్తం బెంగాల్ సంస్కృతికే వన్నె తెచ్చిన కళాకారుడు. ఆయన 10 మే 1905 న జన్మించారు. వారి తల్లిదండ్రులు మోనోమోహిని, మోనిమోహన్‌లు పరమ వైష్ణవ భక్తులు. కుటుంబంలో జరిగే మతపరమైన కార్యక్రమాలలో చిన్నారి పంకజ్ తరచూ శ్లోకాలు, భక్తి గీతాలు ఆలపించేవారు. శ్రీ దుర్గాదాస్ బందోపాధ్యాయ వద్ద భారతీయ శాస్త్రీయ సంగీతంలోని – ఖాయల్, ద్రుపద్, తప్పా వంటి వాటిలో శిక్షణ పొందారు. రవీంద్రుని దగ్గరి బంధువు, రవీంద్రుని గీతాలకు స్వరకర్త, గాయకులూ అయిన దీనేంద్రనాథ్ టాగూర్ వద్ద రబీంద్ర సంగీత్‍తో శిక్షణ పొందారు. ఈ యువకుడంటే, దీనేంద్రనాథ్ గారికి కూడా అభిమానం కలిగి అన్నీ చక్కగా నేర్పించారు. ఫలితంగా కొద్ది రోజులలోనే పంకజ్ – రబీంద్ర సంగీత్‍తో నిష్ణాతులయ్యారు. రబీంద్ర సంగీత్ పాడుతుండగా, మొదటిసారి తబలా వాయించినది పంకజే.

18 ఏళ్ళ వయసులో మొదటి రికార్డింగ్ చేశారు. 1926లో వీలోఫోన్ కంపెనీకి చేసిన వాణిజ్యపరమైన రికార్డింగులలో అది మొదటిది. ఆ పాట – ‘నెమిచే ఆజ్ ప్రొథోమ్ బాదల్’. రబీంద్ర సంగీత్‍లో పంకజ్ పాడిన పాటలు నేటికీ జనాదరణ పొందుతూనే ఉన్నాయి. పంకజ్ తండ్రి ఓ గుమాస్తా. తన కొడుకుని అతి కష్టం మీద బడిలో చదివించారు. పాఠశాల చదువు పూర్తయ్యాకా, కలకత్తా యూనివర్సిటీ పరిధిలోని ఒక వ్యవసాయ కళాశాలలో చేర్పించారు. అయితే పంకజ్‍కి చదువు మీద కన్నా సంగీతం మీదే ఆసక్తి ఎక్కువ ఉండడంతో ఆయన కాలేజీ చదువులో ఫెయిలయ్యారు. నిరాశ చెందిన వారి తండ్రి పంకజ్‍ని ఈస్టర్న్ రైల్వేలో గుమాస్తాగా చేర్పించారట. అయితే పంకజ్‍కి ఉద్యోగమంటే ఆసక్తి లేదు, ముడి ఇనుము వ్యాపారం చేస్తానంటూ ఆ ఉద్యోగాన్ని వదిలేశారు. ఇక ఉన్న సమయమంతా సంగీతం నేర్చుకోవడానికే కేటాయించారు. సంగీతం పైనే దృష్టి నిలపడంతో, వ్యాపారమూ దెబ్బతింది.

1927లో ఇండియా బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ ఏర్పడింది, తరువాతి కాలంలో అది ఆల్ ఇండియా రేడియోగా రూపాంతరం చెందినప్పుడు అందులో ప్రఖ్యాత బెంగాలీ సంగీత దర్శకుడు రాయ్ చంద్ బోరల్ తో కలిసి పంకజ్ తొలి ఉద్యోగులలో ఒకరిగా చేరారు. ఆకాశవాణితో వారి అనుబంధం నాలుగు దశాబ్దాలకు (1944 మినహాయించి 1929-75 వరకు) పైగా కొనసాగింది. ఈ కాలంలో ఆయన ‘సంగీత్ శిఖర్ అషర్’ అనే సంగీతం నేర్పించే కార్యక్రమాన్ని ప్రసారం చేయించారు. అనేక తరాల పాటు బెంగాల్లో మధ్యతరగతి వర్గాలకి రబీంద్ర సంగీత్‍ని చేర్చడంలో ఈ కార్యక్రమం దోహదపడింది. 1932లో ప్రసారమైన ‘మహిషాసుర మర్దని’ కార్యక్రమం – పంకజ్ మల్లిక్, బానీ కుమార్, బీరేంద్ర కృష్ణ భద్ర ల ఉమ్మడి సృష్టి. దుర్గాదేవిని స్తుతించే ఈ కార్యక్రమాన్ని – దుర్గా పూజ ఉత్సవాల సందర్భంగా ప్రత్యక్ష ప్రసారం చేసేవారు. సుప్రసిద్ధ గాయనీగాయకులు అంగుర్ బాల, సుప్రభా ఘోష్, సుప్రీతి ఘోష్, ఆరతీ ముఖర్జీ, సుమిత్రా సేన్, సంధ్యా ముఖర్జీ, హేమంత్ ముఖర్జీ, పన్నాలాల్ భట్టాచార్య, ద్విజేన్ ముఖర్జీ, మానబేంద్ర ముఖర్జీ వంటివారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం గొప్ప గౌరవంగా భావించేవారు. ఈ ‘మహిషాసుర మర్దని’ కార్యక్రమం బెంగాల్ సంస్కృతికి ఓ చిహ్నంగా మారింది. నేటికీ లక్షలాది మంది వింటారు.

పంకజ్ మల్లిక్ సినీ ప్రస్థానం ‘చిత్ర’ సినిమా హాల్‍లోని ఆర్కెస్ట్రా బృందంలో కండక్టర్‍గా, మ్యూజిక్ అరేంజర్‍గా వ్యవహరించడంతో మొదలయింది. అప్పట్లో ఆ బృందం మూకీ సినిమాలకు తగిన ‘లైవ్ మూడ్’ మ్యూజిక్‍ని అందిస్తూండేది. బీరేంద్ర నాథ సర్కార్ స్థాపించిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ క్రాఫ్ట్ అనే సంస్థ 1931లో నిర్మించిన ‘చషర్ మెయే’, ‘చొర్ కంట’ అనే బెంగాలీ మూకీ చిత్రాలకు పంకజ్ మ్యూజిక్ కండక్టర్‍గా వ్యవహరించారు. ఈ రెండు సినిమాల ద్వారా సినీ రంగంలో వ్యాపార అవకాశాలు ఎలా ఉంటాయో పరిశీలించానుకున్నారు సర్కార్. లాభదాయకమేనని భావించి అదే సంవత్సరంలో న్యూ థియేటర్స్ అనే సంస్థని స్థాపించగా, ఎందరో ప్రతిభావంతులైన కళాకారులతో పాటు పంకజ్ అందులో చేరారు. ఆ సంస్థ నిర్మించిన తొలి చిత్రం (ఇది తొలి బెంగాలీ టాకీ సినిమా కావడం విశేషం) ‘దేనా పవోనా’ (1932) కు పంకజ్ రాయ్, రాయ్ చంద్ బోరల్ సంయుక్తంగా సంగీతం అందించారు. 1933లో న్యూ థియేటర్స్ సంస్థ నిర్మించిన బెంగాలీ, హిందీ ద్విభాషా చిత్రం ‘యాహుది కా లడ్కీ’ చిత్రానికి పంకజ్ మల్లిక్ స్వతంత్రంగా సంగీతం అందించారు. ఈ చిత్రానికి ప్రేమాంకుర్ అతోర్థి దర్శకత్వం వహించారు. భారతీయ చిత్రాలలో – పియానో, అకోర్డియన్ వంటి పాశ్చాత్య వాయిద్యాలను, పాశ్చాత్య సంగీత రీతులను విరివిగా వాడిన తొలి మ్యూజిక్-అరేంజర్, ఆర్కెస్ట్రా కంపోజర్‍లలో పంకజ్ మల్లిక్ ఒకరు. సన్నివేశాలలో యాక్షన్‌ని, మూడ్‍ని, టెంపోని పెంపొందించేలా నేపథ్య సంగీతం అందించాలనే ఆలోచన పంకజ్ మల్లిక్‌దే. భారతీయ చిత్రరంగానికి ఆయన అందించిన సేవ ఇది.

1935లో పంకజ్ ఆర్.సి. బోరల్ తో కలిసి న్యూ థియేటర్స్ వారు నిర్మించిన ‘భాగ్యచక్ర’ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ఈ చిత్రాన్ని హిందీలో ‘ధూప్ చావోం’ పేరుతో నిర్మించారు. నితిన్ బోస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని – మన దేశంలో ప్లే-బాక్ సింగింగ్ (నేపథ్య గానాన్ని) వినియోగించిన తొలి చిత్రంగా అందరూ చెప్పుకుంటారు. అయితే ఈ సంస్థకి ప్రత్యర్థి బాంబే టాకీస్ కూడా తామే ప్లేబాక్ పద్ధతిని కనిపెట్టినట్టు ప్రకటించుకుంది. దీనికి ముందు భారతీయ చిత్రాలలో పాటలన్నీ నటీనటులే కెమెరా ముందు ప్రత్యక్షంగా పాడేవారు. ‘భాగ్యచక్ర’/’ధూప్ చావోం’ చిత్రం చిత్రీకరణ జరుపుకుంటున్నప్పుడు గ్రూప్ డాన్సర్ల బృందగానం చిత్రీకరించడంలో ఇబ్బందులు తలెత్తాయట. రిహార్సల్స్‌లో బాగా పాడినవారు, అసలైన షూటింగ్‌లో కెమెరా ముందు కొచ్చే సరికి సరిగా పాడలేకపోయారట. ఈ సమస్యను పరిష్కరించేందుకు – సౌండ్ రికార్డిస్టులు నితిన్ బోస్, మధు బోస్; పంకజ్ మల్లిక్, ఆర్. సి. బోరల్ గారు పర్యాటక హాలీవుడి ఆడియో ఇంజనీరు అయిన శ్రీ డెమ్మింగ్ సహాయం తీసుకున్నారట. ఆయన సూచనల ప్రకారం పాటను ముందే రికార్డు చేసి, నటీనటులను గానానికి అనుగుణంగా షూటింగ్‍లో పెదాలు కదపమని చెప్పారు. ఈ విధంగా చరిత్ర సృష్టించబడింది. బెంగాలీలో ఈ పాట ‘మేరా పులక్ జాచ్చీ’. హిందీలో ‘మై ఖుష్ హోనా చాహూం’. సుప్రభ సర్కార్, పరుల్ ఘోష్, ఉమా సాక్షి ఈ పాటకి స్త్రీ స్వరాలను ఇచ్చారు. వీరే రెండు వెర్షన్లూ పాడారు. పంకజ్ బాబు, ఆర్.సి.బోరల్‍ల జోడీ ఆ తరువాత అనేక బెంగాలీ/హిందీ/ఉర్దూ చిత్రాలకు సంగీతం అందించింది. వీరు సంగీతం అందిచిన చిత్రాలలో హేమచంద్రగారి – క్రోర్‍పతి/ది మిలియనీర్ (1936), నితిన్ బోస్ గారి – దీదీ/ప్రెసిడెంట్ (1937), పిసి బారువా గారి – గృహదహ/మంజిల్ (1936), మాయా (1936) (బెంగాలీ, హిందీ రెండు భాషలలోనూ ఒకే పేరు), ఇక క్లాసిక్ దేవ్‌దాస్ (1935) మొదలైనవి పేర్కొనదగ్గ చిత్రాలు. దేవ్‌దాస్ (1935) చిత్రంలో సైగల్ పాడిన ‘బాలమ్ ఆయే బసో మేరే మన్ మే’ గొప్ప హిట్. ఇదే చిత్రంలో ‘దుఃఖ్ కే దిన్ అభీ బీతే నహీ’ పాటని సైగల్ పాడగా, బెంగాలీ మూలం ‘గోలప్ హోయే ఉఠుక్ ఫుటే’ అనే పాటని పంకజ్ పాడారు. సైగల్ పాడే ఉచ్చస్థాయిని తగ్గించి, వారి చేత హిందీ చిత్రం జిందగీ (1940) లో ‘సో జా రాజకుమారి సో జా’ వంటి గొప్ప హిట్ పాటలు పాడించిన ఘనత పంకజ్ గారిదే.

పిసి బారువా గారి – ముక్తి/ముక్తి (1937) చిత్రంతో పంకజ్ బాబు స్వతంత్ర సంగీతదర్శకుడిగా మారడమే కాకుండా నటుడయ్యారు. ఈ చిత్రంలో ఓ పేద గాయకుడి వేషం వేశారు. రబీంద్ర సంగీత్‌ని ట్రాక్‍లో ఉపయోగించిన తొలి చిత్రంగా ఈ సినిమా పేరుగాంచింది. ఈ విధంగా, రబీంద్రనాథ్ టాగూర్ గీతాలకు, తొలిసారిగా ఆయన కుటుంబ సభ్యులు కాకుండా, బయటి వ్యక్తి – పంకజ్ మల్లిక్ – సంగీతం వహించారు. రవీంద్రుని ‘శేష్ ఖేయ’ గీతానికి సంగీతం కూర్చేందుకు ఆయన రవీంద్రుని అనుమతి కూడా తీసుకున్నారు. ఫలితంగా ఉద్భవించిన పాట ‘దీనెర్ శేషె ఘుమెర్ దేశే’! ఈ పాట ఈనాటికి అక్కడి జనాల నోట్లో నానుతూంటుంది. ఈ సినిమాకి టైటిల్ రవీంద్రులే అందించారని అంటారు. ఈ సినిమా హిందీ/ఉర్దూ వెర్షన్‍లో పంకజ్ పాడిన ‘షరాబీ సోచా నా కర్’ దేశవ్యాప్తంగా జనాదరణ పొందింది.

ముక్తి/ముక్తి చిత్రం హిట్ కావడంతో, పంకజ్ బాబు సినిమాల్లో తరచూ నటించడం మొదలుపెట్టారు. కపాల కుండల (1939) చిత్రం హిందీ వెర్షన్‍లో ముసలి గాయకుడిగా నటించారు. ఈ చిత్రానికి బంకించంద్ర ఛటోపాధ్యాయ నవల ఆధారం. ఫణి మజుందార్ దర్శకులు. పంకజ్ బాణీ కట్టి, అద్భుతంగా పాడిన పాట ‘పియా మిలన్ కో జానా’. ఇది నిస్సందేహంగా హిందీలో ఆయన పాడిన గొప్ప పాటల్లో ఒకటి. దేబకీ బోస్ గారి ‘నర్తకి’ (1940) మరో మలుపు. ఈ చిత్రంలో ఆయన పాడిన ‘యే కౌన్ ఆజ్ ఆయా సవేరే సవేరే ‘, ‘మద్భరీ రుత్ జవాన్ హై’, ‘ప్రేమ్ కా నాతా ఛూటా’ వంటివి ఎవర్ గ్రీన్ హిట్స్. 1941 పంకజ్ నటుడిగా-గాయకుడిగా ఉచ్చస్థాయికి చేరారు. సుబోధ్ మిత్ర దర్శకత్వం వహించిన సంస్కరాణత్మక చిత్రం ‘దాక్తర్/డాక్టర్’లో పంకజ్ – అమర్‍నాథ్ అనే పాత్ర పోషించారు. బాగా ధనవంతుల కుటుంబానికి చెందిన ఈ యువ వైద్యుడు కలరా రోగంతో పోరాడుతున్న ఓ గ్రామాన్ని తన కార్యరంగంగా ఎంచుకుంటాడు. ఆదర్శవాది అమర్‌నాథ్‌గా పంకజ్ గొప్ప నటనను ప్రదర్శించారు. ‘చైత్ర దినేర్ ఝరా పతార్ పోథే’, ‘ఒరె చంచల్’ వంటి పాటలను పాడారు. హిందీ వెర్షన్ ‘డాక్టర్’లో ఆయన ‘మహక్ రహీ ఫుల్వారీ’, ‘కబ్ తక్ నిరాశ్ కీ’, ‘ఆజ్ అప్నీ మెహనతోంకా’, ‘గుజర్ గయా ఓ జమానా’ పాటలు పాడారు.

రెండో ప్రపంచ యుద్ధ కాలంలోనూ, దాని అనంతరం న్యూ థియేటర్స్ వారి ప్రభ క్షీణించింది. ఆ సంస్థకు చెందిన చాలామంది అవకాశాల కోసం బొంబాయి వెళ్ళిపోయారు. కానీ పంకజ్ బాబు మాత్రం కొల్‍కతా లోనే ఉండిపోయారు. నేపథ్య గానం అవకాశాలు పెరగడంతో, నటనను విరమించుకుని – రబీంద్ర్ సంగీత్ పైనా, ఆధునిక గానం మీదే ఎక్కువ దృష్టి నిలిపారు. సంగీత దర్శకుడిగా ఎక్కువ అవకాశాలకై కృషి చేశారు. 1944లో పంకజ్ ‘మేరీ బహన్’ అనే హిందీ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రంలో సైగల్‌చే కొన్ని అద్భుతమైన పాటలు పాడించారు. ‘యే ఖాతిబ్ ఎ తఖ్దీర్ ముఝే ఇత్నా బతా దే’, ‘దో నైనా మత్‍వారే’, ‘చుప్పో న చుప్పో న’ మొదలైనవి. పంకజ్ కొన్ని బొంబాయి చిత్ర నిర్మా సంస్థలకి పని చేశారు. దేవ్ ఆనంద్, గీతా బాలి నటించిన ‘జల్‍జలా’ (1952, దీనికి రవీంద్రుని నవల చర్ అధాయ – ఆధారం), ‘కస్తూరి’ (1954) ఇందుకు ఉదాహరణ. కొల్‍కతాలో పంకజ్ బాబు మీనాక్షి (1942), కాశీనాథ్ (1943), దుయ్ పురుష్ (1945), నర్స్ దీదీ/నర్స్ సిస్సీ (1947), రామేర్ సుమతి (1947), ప్రతిబాద్ (1948), రూప్‍కథ/రూప్‍కహానీ (1950), మహాప్రస్థానేతర్ పాథే (1952), బాణహస్తి (1953), నబీన్ యాత్ర/యాత్రిక్ (1952), రాయ్‍ కమల్ (1955), చిత్రాంగద (1955), లౌహాకాపత్ (1957), ఆహ్వాన్ (1961) తదితర చిత్రాలకు సంగీతం అందించారు. Janhabi Jamuna Bigolito Karuna (1972) సంగీత దర్శకుడిగా ఆయన చివరి చిత్రం. దుయ్ పురుష్ (1945) చిత్రం ఆయనకు ఉత్తమ సంగీత దర్శకుడిగా బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ అవార్డు అందించింది.

పంకజ్ మల్లిక్ గొప్ప సంగీత విద్వాంసులు, సిద్ధాంతకర్త కూడా. భారతీయ శాస్త్రీయ సంగీతంపై ఎన్నెన్నో పుస్తకాలు వ్రాశారు. అప్పటి ప్రధాని నెహ్రూ అభీష్టానికి విరుద్ధంగా భారత జాతీయ గీతం ‘జనగణమన’కి నిర్వచనాత్మక బాణీ కట్టారు. బెంగాల్ ప్రభుత్వం వారి ‘ఫోక్ ఎంటర్టెయిన్మెంట్ ‘విభాగానికి గౌరవ సలహాదారుగా వ్యవహరించారు పంకజ్. ఈ విభాగం ద్వారా సత్యజిత్ రాయ్ నిర్మించిన ‘పథేర్ పాంచాలి’ (1955) చిత్రానికి ఆర్ధిక సహాయాన్ని అందించారని చెబుతారు. పంకజ్ మల్లిక్ ‘యాత్రిక్’, ‘రాయ్ కమల్’ చిత్రాలకు జాతీయ స్థాయిలో ఉత్తమ సంగీత దర్శకునిగా రాష్ట్రపతి అవార్డు గెలుచుకున్నారు. 1970లో పంకజ్ మల్లిక్‌కు భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని ఇచ్చి గౌరవించింది. సినీరంగానికి అందించిన అద్భుతమైన సేవలకు గాను 1973లో ప్రతిష్ఠాత్మక ‘దాదాసాహేబ్ ఫాల్కే’ అవార్డు ఆయనకి లభించింది. వారి శతజయంతి సందర్భంగా భారత తపాలా శాఖ స్మారక పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేసింది.

వీరి ఆత్మకథ ‘అమర్ యుగ్ అమర్ గాన్’ పేరుతో పుస్తకంగా వెలువడింది. కలకత్తా నగరంలో 19 ఫిబ్రవరి 1978 న పంకజ్ మల్లిక్ మరణించినప్పుడు, “ఓ అద్భుతమైన సృజనాత్మక సంగీత విద్వాంసుడిని… ఓ అద్భుతమైన మనిషిని కోల్పోయాం” అన్నారు పండిట్ రవి శంకర్ విచారం వ్యక్తం చేస్తూ.

ఆయన అన్ని పాటలు నాకు ఇష్టమే అయినా, యాత్రిక్ లోని పాటలు నాకు బాగా ఇష్టం.

https://www.youtube.com/watch?v=j_ebJxrNkn8
Exit mobile version