Site icon Sanchika

అలనాటి అపురూపాలు-59

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

మెలొడీ గీతాల సృష్టికర్త హన్స్‌రాజ్ బెహల్:

హిందీ సినీ ప్రపంచంలో ‘మాస్టర్‌జీ’ అని పిలిపించుకునే అరుదైన గౌరవం కేవలం ఇద్దరికే దక్కింది. ఒకరు ది గ్రేట్ ఘులామ్ హైదర్ అయితే, రెండవ వారు హన్స్‌రాజ్ బెహల్. ఒక వాక్యంలో ఆయనను పరిచయం చేయాలంటే – మెలొడీ గీతాల సృష్టికర్త అని చెప్పవచ్చు. 50వ దశకం తొలినాళ్ళలో నూతన గాయనీగాయకులు గంటలకొద్దీ/రోజుల తరబడి ఆయన ఇంటి ముందు ఎదురుచూసేవారనీ, తమ ప్రతిభని కొద్దిగానైనా ఆయన గుర్తించాలనీ ఎదురుచూసేవారంటే ఎక్కువ మంది నమ్మకపోవచ్చు. 40వ దశకం మధ్య కాలం నుంచి 80వ దశకం తొలినాళ్ళ వరకు మాస్టర్జీ ఓ సృజనాత్మక, ప్రతిభావంతులైన సంగీతదర్శకులు. అయినప్పటికీ, ఆయనకి రావల్సినంత గుర్తింపు రాలేదనే అంటారు. ఎన్నో ఆల్-టైమ్ గ్రేట్ హిట్స్‌ని అందించారు. ఆయన గాయనీగాయకులు ఆయనంటే గౌరవమూ, ఆదరమూ కలిగి ఉండేవారు. అయితే దురదృష్టవశాత్తు ఆయన విస్మృతిలోకి జారిపోయారు.

హన్స్‌రాజ్ బెహల్ 19 నవంబరు 1916 నాడు పంజాబ్‌లోని షేక్‌పుర (నేటి పాకిస్తాన్‌)లో జన్మించారు. ఆయన తండ్రి నిహాల్ చంద్ బెహల్ ఓ భూస్వామి. వారి ఇంటిలో సంగీతానికి స్థానం లేదు. హన్స్‌రాజ్‌కి బాల్యం నుంచే సంగీతమంటే ఆసక్తి కలిగింది. టీనేజ్‍లోనే పాటలకు బాణీలు కట్టసాగారు. అంతేకాదు, స్థానిక రామ్‍లీలా వేడుకలకు నేపథ్య సంగీతం అందించసాగారు. ఐతే అందరూ భావించేడట్టు ఆయన గురువు పండిట్ చున్నీలాల్ కాదు, హన్స్‌రాజ్ బెహల్ తొలినాళ్ళలో పండిట్ చిరంజిలాల్ ‘జిజ్ఞాసు’ గారి వద్ద శిష్యరికం చేశారు. అయితే సంగీతంలో ఇంకా సాధించాలనే తపన ఆయనను 30వ దశకంలో భారత సాంస్కృతిక రాజధాని అయిన లాహోర్‍కు తీసుకువెళ్ళింది. 40వ దశకం తొలినాళ్ళలో హెచ్.ఎమ్.వి. కంపెనీ సంవత్సరానికి సుమారు 15-16 వరకు సినిమాయేతర 78 ఆర్.పి.ఎమ్. రికార్డులను తయారుచేసే లాహోర్ లోని అనార్కలి మార్కెట్‍లో హన్స్‌రాజ్ ఒక సంగీత పాఠశాలను స్థాపించారు. హెచ్.ఎమ్.వి. కంపెనీ కోసం కొన్ని సినిమాయేతర పాటలు రికార్డు చేశారు. సినీ పరిశ్రమవైపు ఆకర్షితులైన హన్స్‌రాజ్, తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు 1943-44 మధ్య బొంబాయి చేరారు. తొలుత అవరోధాలు ఎదురయినప్పటికీ వాటిని అధిగమించడంతో, 1944-45 మధ్య నవ్-యుగ్ సంస్థలో తొలి అవకాశం లభించింది. అయితే ఆ పని 15-20లకు మాత్రమే దొరికింది, ఎందుకంటే ఆ సమయంలో వారి రెగ్యులర్ కంపోజర్ రషీద్ ఆత్రే లాహోర్‍కి వెళ్ళారు. రషీద్ పూనెకి తిరిగి రావడంతో హన్స్‌రాజ్ స్టూడియోని వీడాల్సి వచ్చింది.

తరువాత 1944-45 మధ్య కాలంలో రంజిత్ మూవీటోన్ మూవీస్ వారు కొన్ని చిన్న చిన్న అవకాశాలిచ్చారు, కానీ అవి ఆయనకు పెద్దగా కలిసిరాలేదు. బాంబే టాకీస్‍లో మొదటి ట్రయల్ టెస్ట్ ఇచ్చారు. త్వరలోనే ప్రకాశ్ పిక్చర్స్ వారి సినిమాలో పండిట్ గోబింద్ రామ్ వద్ద సహాయకుడిగా పని చేసే అవకాశం వచ్చింది. అలాగే నవ్‍యుగ్ చిత్రపట్ వారితో అతి కొద్ది కాలం పనిచేశారు. ఐతే ఆయనకు అసలైన బ్రేక్ 1945-46 మధ్యలో పృథ్వీరాజ్ కపూర్ సిఫార్సులతో లభించింది. 1946 నాటి ‘పూజారి’ చిత్రానికి ఆయన పూర్తిస్థాయి సంగీత దర్శకులయ్యారు. ఈ చిత్రంలో శాంతా ఆప్టే, మసూద్, బేబీ ముంతాజ్ నటించారు. ఈ చిత్రంలో బేబీ ముంతాజ్/మధుబాల పాడిన ‘భగవాన్ మేరే జ్ఞాన్ కే దీపక్ కో జలా దే’ పాట ఎందరికీ గుర్తుండిపోయింది. ఈ సినిమాకి హైలైట్ హన్స్‌రాజ్ బాణీ కట్టిన భజన గీతం, బేబీ ముంతాజ్ పాడిన గీతం (తదుపరి కాలంలో నటి మధుబాల) ‘భగవాన్ మేరే జ్ఞాన్ కే దీపక్ కో జలా దే’ పాట! 1946 నాటి ‘గ్వాలన్’ ఆయన రెండో చిత్రం. ఈ చిత్రంలో ముకేష్‍చే పాడించారు. ముకేష్, సుశీలా రాణి పాడిన యుగళగీతం ‘నజర్ లగాత్ తోరీ ఛలైయ్యా మోరె గోరే బదన్’ బాగా జనాదరణ పొందింది. సర్దార్ చందూలాల్ షా – హన్స్‌రాజ్ తో – ఛీన్ లే ఆజాదీ, ఫుల్‌వారీ, లాఖోం మే ఏక్, దునియా ఏక్ సరాయి – అనే నాలుగు చిత్రాలకు సంగీతం చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ చిత్రాలలో హన్స్‌రాజ్ గొప్ప సోలో గీతాలు, యుగళగీతాలు అందించారు. ఛీన్ లే ఆజాదీ (1947) చిత్రంలో – మోతీ చుగ్నే గయె రే హన్సానీ మానసరోవర్ తీర్ (ముకేష్/షంషాద్), చంపా కలీ హై ఉదాస్ (హమీదా); దునియా ఏక్ సరాయి చిత్రంలో – దేఖ్ హమే ముస్కాయే క్యూ బాలమ్‍వా సజన్‍వా (ముకేష్/హమీదా); లాఖోం మే ఏక్ చిత్రంలో – ఆగ్రే సే ఓధిని మంగ్వా దే బల్మా, తుమ్హే చందా కహూం యా చకోరి – గొప్ప హిట్ పాటలు. దునియా ఏక్ సరాయి చిత్రంలోని రెండు పాటలను హన్స్‌రాజ్ విడిగా మళ్ళీ రికార్డు చేశారు. ఆ సినిమాలో సైడ్ హీరోయిన్‍గా చేసిన దిగ్గజ నటి మీనాకుమారి వాటిని ఆలపించారు.

తొలి రోజుల్లో లతా మంగేష్కర్‍తో పాడించడానికి ఎందుకో హన్స్‌రాజ్ సంకోంచించారు. తన తొలి చిత్రాలలో హమీదా, షంషాద్‍లతో పాడించడానికే మొగ్గు చూపారు. తరువాతి కాలంలో ఆశా, మధుబాల జావేరితో పాడించారు. మెలొడీ క్వీన్ లత చేత తొలి పాటని ‘లచ్చి’ అనే పంజాబీ సినిమాకి ఆయన పాడించడం ఆశ్చర్యకరం. ‘నాలే లంబీ వే నాలే కాలీ హై’ అనేది ఆ పాట. ఈ పాట తరువాత ఆయన లతని ఆధునిక యుగపు సరస్వతిగా సంబోధించడం ప్రారంభించారు. ఆయన సంగీత దర్శకత్వంలో లత ‘చునారియా’ (1948) అనే చిత్రం కోసం ‘దిల్ ఏ నాషాద్ కో జినె హస్రత్ హో గయి తుమ్సే’, ‘ఆంఖ్ మేరీ లడ్ గయీ రే హై రే హై రే’ అనే హిట్ పాటలు పాడారు. ఆయన సంగీత దర్శకత్వంలో ఆశా పాడిన తొలి పాట ‘సావన్ ఆయా రే జగే మేరే బాగ్ సఖీ రే’.

‘చునారియా’ చిత్రంలో లతా మంగేష్కర్, ఇందర్ గోయల్ పాడిన యుగళగీతం ‘ఆంఖ్ మేరీ లడ్ గయీ రే హై రే హై రే’ సూపర్ హిట్. ఈ పాట వెనుక ఓ కథ ఉంది. ఈ పాట పాడే అవకాశం లతకి ఇచ్చే ముందు మాస్టర్జీ ఒక షరతు పెట్టారట. తనతో పాటు కశ్మీరు రావాలని! కశ్మీరులో వారంతపు సంతలో ఈ బాణీలో పాడే ఓ గిరిజన తెగ ఒకటి ఉంది. గిరిజనుల మూల బాణీని విని, ఆ శైలిలో పాడాలి. సరే, సాయంత్రానికి ఈ అందమైన పాట నొటేషన్స్ సిద్ధమై, హార్మోనియంపై వాయించబడ్డాయి (హన్స్‌రాజ్ మేనల్లుడైన ఇందర్ గోయల్ తర్వాతి కాలంలో జమ్మూకి వెళ్ళి, ఓ కాలేజీలో ప్రొఫెసర్ అయ్యారు). మంచి పాటలు ఉన్నప్పటికీ, ‘చునారియా’ బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం పాలవడంతో, హన్స్‌రాజ్ కెరీర్‍కి కాస్త అడ్డంకులు ఎదురయ్యాయి. కొద్ది కాలం పాటు ఇతర దర్శకులతో క్రెడిట్ పంచుకోవాల్సి వచ్చింది. కొన్ని సినిమాలకు ఇతర సంగీత దర్శకులతో కలిసి సంగీతం అందివాల్సి వచ్చింది. బులో సి రాని తో పహ్లీ పెహచాన్, గుణ సుందరి, మిట్టీ కే ఖిలోనే చిత్రాలు ఇందుకు ఉదాహరణలు. గుణసుందరిలో హన్స్‌రాజ్ – హోటల్ కా కినారా హో నజరా ప్యారా ప్యారా హో (లీలా మెహతా/ఎ.ఆర్. ఓఝా), ఆనా నా థా జో దిల్ మే (అమీరీఎబీ కర్నాటకీ/ఎ.ఆర్. ఓఝా) వంటి హిట్ పాటలనిచ్చారు.

పరదేశీ మెహమాన్ చిత్రంతో హన్స్‌రాజ్ మళ్ళో తానొక్కరే సంగీత దర్శకత్వం చేయసాగారు. ఆ సినిమాలో – ‘పరవానే హో హరవానే’ (ముకేష్/హుస్న్ బానో), ‘హోషియార్ నౌజవాన్'(ముకేష్) వంటి హిట్ పాటలున్నాయి. కాని సినిమా ఫ్లాప్ అయింది. ఆయన తదుపరి సినిమా ‘సత్యనారాయణ’ కూడా పరాజయం పాలయ్యింది. దిగ్గజ దర్శకనిర్మాత బి.ఆర్. చోప్రా – ప్రకాశ్ అనే మారుపేరుతో – తన మొదటి సినిమా ‘కరవట్’ (1949) తీశారు. ఈ చిత్రంలో లతా మంగేష్కర్ పాటలు లేవు గానీ, షంషాద్ బేగం ఓ అద్భుతమైన సోలో గీతాన్ని – ‘దీవానా గయా దామన్ సే లిపట్’ – పాడారు. ఆహా! ఏం మెలొడీ అది! షంషాద్ బేగం పాడిన ఉత్తమమైన పాటల్లో ఇది ఒకటని చెప్పాలి. హన్స్‌రాజ్ గారి సంగీతం అద్భుతం. ఈ చిత్రంలో గీతా దత్ పాడిన మరో కొన్ని చక్కని పాటలున్నాయి. ‘గయా అంధేరా హువా సవేరా’ (రఫీ/గీతా/కోరస్), ‘బాదల్ గిర్ ఆయే రిమ్‍ఝిమ్ పానీ బరసే'(ఆశా/గీతా), ‘గా – ఏ దిల్ మతవాలే ఝూమ్ కర్’ (గీతా), ‘ఛల్ దియే ముహ్ ఫేర్ కర్’ (గీతా) వంటి ఇందుకు ఉదాహరణలు. ఇన్ని చక్కని పాటలున్నప్పటికీ, ఈ సినిమా ఆడలేదు. అలాగే హన్స్‌రాజ్ తదుపరి సినిమా ‘భికారి’ కూడా ఆడలేదు.

దేశ విభజన తర్వాత ఘులామ్ హైదర్ పాకిస్తాన్‍కి వెళ్ళిపోవాలని నిర్ణయించుకోవడంతో – శ్యామ్, మున్నావర్ సుల్తానా నటిస్తున్న సినిమా ‘కనీజ్’కి పూర్తిగా సంగీతం అందించలేకపోయారు. ఈ సినిమాకి హన్స్‌రాజ్ రెండు పాటలు, నేపథ్య సంగీతం అందించి పూర్తి చేశారు. ‘కనీజ్’ తర్వాతి సినిమా ‘రూమాల్’ (1949). ఈ సినిమాలో హన్స్‌రాజ్ గొప్ప హిట్ పాటలని అందించారు. ‘దిల్ టూటా ఔర్ అర్మాన్ లుటే’ సూపర్ హిట్ అయింది. అలాగే – ‘ఓ ఆంఖియా మిలాకర్, మేరీ యాద్ తు అప్నే దిల్ సే మిటా దే’ (మీనా కపూర్), ‘ఆగే ఆగే చలే జవానీ మన్ పీఛే ఖో గయారే’ (షంషాద్) హిట్ అయ్యాయి. వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతున్నా, హన్స్‌రాజ్ బాధపడలేదు. భరత్ భూషణ్ నటించిన ‘చకొరీ’ (1949)కి సంగీతం అందించారు. ఈ సినిమాని హన్స్‌రాజ్ సన్నిహిత మిత్రుడు ముల్క్‌రాజ్ భక్రి నిర్మించారు. నళిని జయవంత్ పాక్షికంగా ఆర్థిక సహాయం అందించారు. ఈ చిత్రంలో లతాజీ పాడిన ‘హాయె చందా గయే పరదేశ్ చకోరీ యహాఁ రో రో మరే’ సూపర్ హిట్. ఈ సినిమాకి సంగీతం సమకూరుస్తుండగా, ఈ గొప్ప సంఘటన జరిగింది. బాణీలకు గానానికి మైమరిచిన రికార్డిస్ట్ – వెక్కి వెక్కి ఏడ్చారట. ఈ సంగతిని హన్స్‌రాజ్ గారే స్వయంగా బిశ్వనాథ్ ఛటర్జీకి చెప్పారు. ‘క్యూం గరమ్ శరద్ హోతే హో’, ‘చిట్టియాం దర్ద్ భరీ’ (గీతా), ‘తు హమ్సే జుదాయ్ కర్’ (లతా) – వంటి పాటలు కూడా బాగా హిట్ అయ్యాయి.

సీనియర్ నటులు జగదీష్ సేథీ ‘రాత్ కీ రాణీ’ (1949) చిత్రంతో దర్శక నిర్మాతగా మారారు. ఈ సినిమా నుంచి హన్స్‌రాజ్ గారు ముకేష్‍తో కాకుండా, మహమ్మద్ రఫీతో ఎక్కువగా పాడించారు. ఈ సినిమాలోని ‘ఉస్ చందా సే ప్యారా చందా తుమ్’ యుగళగీత్తాన్ని మొదట ముకేష్, లతా రిహార్సల్స్ చేశారు. కానీ హన్స్‌రాజ్ ఎందుకో మనసు మార్చుకుని పాటని రఫీతో పాడించారు. అలాగే లతా మంగేష్కర్‍తో కలిసి ‘సున్‍లో తో మెరా అఫ్సానా’ అనే యుగళ గీతాన్ని రఫీతో పాడించారు. లతా-రఫీల 10 ఉత్తమ యుగళగీతాలలో ఈ రెండు పాటలు ఇప్పటికీ ఉంటాయి. ‘జిన్ రాతోం మే ఉడ్ జాతీ హై’ అన్న మెలొడీని రఫీ అభిమానులు మర్చిపోగలరా? ‘రాత్ కీ రాణీ’ చిత్రం సూపర్ హిట్ అయింది. సంగీత దర్శకుడిగా హన్స్‌రాజ్ స్థానాన్ని సుస్థిరం చేసింది. విలక్షణమైన పంజాబీ యాసతో లా… లల లా… అనిపించడం ఈయనకే చెల్లింది. అవును… నేను ‘జేవ్‌రాత్’ (1949) సినిమాలోని ‘సాజన్ కీ ఓటే లేకె హాథోం మే’ పాట గురించి చెబుతున్నాను. తదుపరి సంవత్సరాలలో ఎన్నోసార్లు ఈ పదాలను ఆయన ఉపయోగించారు, అయినా ఈ సినిమాలో అది విశేషం! 1950లో వచ్చిన ‘బేకసూర్’ చిత్రానికి మేస్ట్రో అనిల్ బిస్వాస్‍తో కలిసి పని చేశారు. జేవ్‌రాత్ సినిమాలో ‘సాజన్ కీ ఓటే లేకె హాథోం మే’ (రఫీ/లత) పాటకి మరో విశేషం కూడా ఉంది. పాటలో లయకి అనుగుణంగా పాదాల తాటింపు ఉంటుంది. గుల్‍నార్ (1950) చిత్రంలో జీనత్ బేగమ్ చేత మూడు పాటలు పాడించారు. ఖామోష్ సిపాహీ చిత్రానికి కూడా ఆయనే సంగీతం అందించారు. మదన్ మోహన్, చిత్రగుప్త్ వంటి వారి స్థాయి హన్స్‌రాజ్ గారిది. మదన్ మోహన్ గారి చిత్రాలు బాక్సాఫీసు వద్ద విఫలమైనా, పాటలు సూపర్ హిట్ అయ్యాయి. చిత్రగుప్త్ గారికి మల్లే హన్స్‌రాజ్ గారికి కూడా బి/సి గ్రేడ్ సినిమాలు వచ్చినా, పాటలు మాత్రం చిరస్థాయిగా నిలిచాయి. ఒక విషయంలో మాత్రం హన్స్‌రాజ్ గారిని మెచ్చుకోవాలి. తన కాలంలోని అందరు గాయనీగాయకుల చేతా పాడించారు. లతా, రఫీలు ఆయనకు అభిమాన గాయకులైనప్పటికీ… ముకేష్, తలత్, మన్నాడే, మహేంద్ర కపూర్, సురయ్యా, ఆశా భోస్లే, గీతా దత్, షంషాద్, మధువాలా జావేరి వంటి వారితో పాటలు పాడించారు.

1950-51 మధ్యలో మధుబాల బొంబాయిలో ఓ కార్యక్రమంలో పాడుతుండగా మొదటిసారి చూశారట. వెంటనే తన తదుపరి చిత్రం ‘రాజ్‌పుత్’ (1951)లో అవకాశం ఇచ్చారు. హన్స్‌రాజ్ సంగీత దర్శకత్వంలో ఆమె – అప్నీ ఇజ్జత్-1952, అంధకార్-1954, పెన్షనర్-1954, దోస్త్-1954, ఖైబర్-1954 వంటి చిత్రాలలో రఫీతో కలిసి అద్భుతమైన పాటలు పాడారు. సురయ్యా కూడా హన్స్‌రాజ్ సంగీత దర్శకత్వంలో – ఖిలాడీ-1950, షాన్-1950, రాజ్‌పుత్-1951, రేషమ్-1952, మోతీ మహల్-1952 వంటి చిత్రాలలో చక్కని పాటలు పాడారు. అవి ఆణిముత్యాలు. తలత్ మహమూద్‍తో పాడించిన ‘ఆయే భీ అకేలా’ అనే పాటని మరిచిపోయే తలత్ అభిమాని ఉంటాడా? అలాగే తలత్-గీతా దత్‍ల యుగళగీతాలు – లాల్ పరీ-1954, దర్బార్-1955 చిత్రాలలో అద్భుతమైనవి. మిలన్ (1958) చిత్రంలోని ‘హాయే జియా రోయే’ పాటని ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ద్రుత్ లయలో రాగ్-దర్బారీ రాగంలో కూర్చిన ఈ పాట శ్రోతలని మరోలోకాలకి తీసుకువెళ్తుంది. లత స్వరానికి నప్పే సంగీత వాయిద్యాలు, బాంసురీ, సారంగి… వాహ్! అనిపిస్తాయి. ఈ పాటతో పాటు ‘మిస్ బాంబే’ (1957) చిత్రంలోని ‘జిందగీ భర్ ఘుమ్ జుదాయ్ కా’ పాటని హన్స్‌రాజ్ గారి గొప్ప పాటలుగా పరిగణించవచ్చు.

1954-55 మధ్యలో ఆయన తన సోదరుడు గుల్షన్ బెహల్‌తో కలిసి తమ తండ్రి నిహల్ చంద్ గారి పేరిట ఎన్.సి. ఫిల్మ్స్ అనే నిర్మాణ సంస్థని స్థాపించారు. కానీ వారికి వాణిజ్య పరమైన హిట్స్ లభించలేదు. తన సొంత సంస్థలో హన్స్‌రాజ్ 1968-69లో ధర్మేంద్ర, హేమమాలినిలతో ‘చెంగీజ్ ఖాన్’ చిత్రాన్ని పునర్నిర్మించారు. ఈ చిత్రానికిగాను మహమ్మద్ రఫీ సవరించిన ‘మొహబ్బత్ జిందా రహతా హై’ అనే పాత పాటని మళ్ళీ పాడారు. తన సొంత సంస్థలో హన్స్‌రాజ్ గొప్ప హిట్ పాటలు అందించారు. మిస్ బాంబే, చెంగీజ్ ఖాన్, మిలన్, సావన్, సికందర్-ఏ-అజామ్ వంటివి ఇందుకు ఉదాహరణ. నలభై ఏళ్ళ కెరీర్‌లో ఆయన 55 చిత్రాలకు సంగీతం అందించారు. పంజాబీ శైలిలో అధికంగా సంగీతం సమకూర్చినందుకు ఆయన గుర్తుండిపోతారు.

జీవితంలో ఎన్నడూ మద్యం ముట్టని ఆయన, 20 మే 1984 నాడు లివర్ క్యాన్సర్‍తో మరణించారు. ఎన్నో అద్భుతమైన మెలొడీలను మనకి వదిలి వెళ్ళారు. చెంగీజ్ ఖాన్ చిత్రంలో ఈ పాటలానే, ఆయన సంగీతం కూడా అమరమైనది!

‘మొహబ్బత్ జిందా రహతా హై, మొహబ్బత్ మరీ నహీ సక్తీ’.


గురుదత్ గురించి వహీదా రెహమాన్:

దిగ్గజ దర్శకులు/నటులు గురుదత్ గురించి వహీదా రెహమాన్ ఏమంటున్నారో ఆమె మాటల్లోనే చదవండి.

“గురుదత్ గారి గురించి రాయడం అనే కష్టమైన, సున్నితమైన బాధ్యత కంటే మరొకటి ఉండదు. కష్టం ఎందుకంటే…. ఆయన్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారు, సున్నితం ఎందుకంటే…

***

అతి సున్నిత మనస్కుడు, మౌని, జటిలమైన వ్యక్తి అయిన గురుదత్ గారిని తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఆయన ఎంత మౌనంగా ఉంటారంటే – సిగ్గు కన్నా ఆయన వినయాన్నే – జనాలు పొగరుగా భావించేవారు. 1955లో తొలిసారి నేను ఆయనని కలిసినప్పుడు అతి కష్టం మీద ఒకటి రెండు మాటలు మాట్లాడారు. ఆ కలయిక కూడా కేవలం యాదృచ్ఛికం, కాని విధికి బహుశా తెలుసేమో… నా రోజులు మారాయని! ‘రోజులు మారాయి’ తెలుగులో నా మొదటి చిత్రం. ఆ చిత్రం హైదరాబాదులో వంద రోజులు ఆడింది. ఆ సినిమా వందవ రోజున గురుదత్ హైదరాబాద్ వచ్చారు. థియేటర్ బయట అసంఖ్యాకంగా ఉన్న జనాలని చూశారు. ఆ సినిమాకి పని చేసినవాళ్ళలో నేనూ ఒకర్తెనని, ఓ పాటకి నృత్యం చేశానని ఆయనకి చెప్పారేమో. ఆయన జనాలతో ఉర్దూలో మాట్లాడారు. సాయంత్రం డిస్ట్రిబ్యూటర్ ఇచ్చిన పార్టీలో నన్ను ఆయనకు పరిచయం చేశారు. అప్పటి వరకూ నేను ఆయన పేరు వినలేదు, ఆయన సినిమాలు చూడలేదు, అసలాయన ఎవరో కూడా నాకు తెలియదు. అయితే ఆ సమావేశానికి నేను పెద్దగా ప్రాధ్యాన్యత నీయలేదు, త్వరలోనే మర్చిపోయాను కూడా. రెండు మూడు నెలల తర్వాత, మధ్యాహ్నం మున్నాభాయ్ పటేల్ అనే లావుపాటి వ్యక్తి మా ఇంటికి వచ్చి నన్ను కలిశారు. గురుదత్ నన్ను చూడాలంటున్నారనీ, రెండు మూడు రోజుల కోసం బొంబాయి రావాలని చెప్పారు

రెండవ సమావేశం:

ఫేమస్ సినీ బిల్డింగ్‍లోని వారి ఆఫీసులో జూన్ 1955లో ఆయనను కలిశాను. దర్శకులు రాజ్ ఖోస్లా, ప్రొడక్షన్ కంట్రోలర్ గురుస్వామి, రచయిత అబ్రార్ అల్వి నాతో మాట్లాడుతూండగా గురుదత్ ప్రశాంతంగా కూర్చుని, నన్ను గమనించసాగారు. ఇది ఆయనతో నా రెండవ సమావేశం. ఈ సమావేశం ఫలితం మూడేళ్ళ పాటు వారితో ఒప్పందం! దీని ప్రకారం మొదటి సంవత్సరం నాకు నెలకి 1200 రూపాయలు చెల్లిస్తారు. కాంట్రాక్ట్‌పై సంతకం చేస్తుండగా – “నీకు సంతోషంగా లేదా?” అని ఆయన అడిగారు. “నేను నా కాస్ట్యూమ్స్‌తో తృప్తి చెందితే సంతోషంగా ఉంటాను” అన్నాను. “కంగారు పడద్దు. నీ దుస్తులు నీకు నచ్చేలానే ఉంటాయి. నీకు నచ్చని దుస్తులు వేసుకోమని ఒత్తిడి చేయం. సరేనా” అన్నారాయన. “ఈ విషయం ఒప్పందంలో చేరిస్తే బావుంటేదేమో” అన్నాను. “నన్ను నమ్మవా?” అన్నారాయన. “నమ్మకం గురించి కాదు, ఒప్పందంలో దీన్ని చేరిస్తే బాగుంటుంది” అన్నాను. వెంటనే ఆయన – కాస్ట్యూమ్స్ నటికి అనుకూలంగా ఉంటేనే ఆమోదమని కాంట్రాక్టులో ఒక క్లాజు జోడించారు. “మంచి వాళ్ళు అమ్మా…” అని మా అమ్మకి చెప్పాను. రాజ్ ఖోస్లా, గురుస్వామి, అబ్రార్ అల్వి – ఓ పెద్ద దర్శకనిర్మాతతో, అంతకు మించి ఓ మంచి మనిషితో ఒప్పందం కుదుర్చుకున్నందుకు అభినందించారు. అయితే, ఆయన ఒక్కోసారి తన టెంపర్ కోల్పోతారనీ, అప్పుడు కంగారు పడవద్దని హెచ్చరించారు.

“ఆయన తన టెంపర్ కోల్పోతారా?” అడిగాను.

“అవును” అన్నారు వాళ్ళు.

“ఏ కారణం లేకుండానే?”

“ఒక్కోసారి! అయితే ఆయనకి దురుద్దేశాలు ఏవీ ఉండవు. చాలా మంచి మనిషి”

“ఆయన నాలో అలా ప్రవర్తిస్తే, నేను ఆయనతో పని చేయను, హైదరాబాదు వెళ్ళిపోతాను” నేనూ వాళ్ళని హెచ్చరించాను.

కొంతమంది దుడుకుగా ఉంటారు; వాళ్ళెప్పుడు తాము ఏం చేస్తామో లేదా ఏం చేయాలనుకుంటున్నారో దాని గురించే మాత్లాడుతారు. అటువంటి వాళ్లను అర్థం చేసుకోవడం, వర్ణించడం సులువు. కాని గురుదత్ అలాంటి వారు కాదు. ఆయన అంతర్ముఖులు. ఆయన లోపల బడబాగ్ని రగులుతున్నా, బయటకి ఏమీ వెల్లడించరు. ఆయన ఎంత ఎక్కువ పని చేస్తే, ఎంత ఎక్కువ ఆలోచిస్తే, అంత తక్కువ మాట్లాడుతారు. ఫలితంగా, ఆయన గురించి జనాలకి చాలా తక్కువ తెలుసు. ఆయన మనసులో ఏం జరుగుతోందో – కొన్ని పరిస్థితులకు ఆయన ఎలా ప్రతిస్పందిస్తారనేదాన్ని బట్టి తెలుసుకోవచ్చు; అసలంటూ ఆయన ప్రతిస్పందనలను గమనించగలిగితే! అందుకే ఈ రచనలో ఆయన గురించి రాయాలంటే, కొన్ని పరిస్థితుల పట్ల ఆయన ప్రతిస్పందన గురించి రాయాలంటే – నా గురించే ఎక్కువగా రాసుకోవాల్సి వస్తుంది, నేను ఆయనకు సృష్టించిన సమస్యల గురించి రాయాలి. అవును, నేను ఆయనకి సమస్యలు సృష్టించాను, బహుశా ఇతర నిర్మాతలైతే నన్ను భరించేవారు కాదు. కానీ ఆయన భిన్నమైన వ్యక్తి, అటువంటి మనిషిని నేనెప్పుడూ కలవలేదు. గురుదత్ ఫిల్మ్స్‌‌లో నా మొదటి సినిమా ‘సి.ఐ.డి’ చిత్రీకరణ సందర్భంగా ఓ డ్రెస్ ధరించడానికి తిరస్కరించాను. షాట్ రెడీ. ఆర్టిస్టులంతా సిద్ధంగా ఉన్నారు. గురుస్వామి, రాజ్ ఖోస్లా – ఆ డ్రెస్‍లో ఇబ్బందేం లేదని నాకు నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తున్నారు, నేను ఎవరి మాటా వినలేదు. “ఈ డ్రెస్ నాకు నచ్చలేదు” అన్నాను. “చూడమ్మా… ఇలాంటి చిన్న చిన్న విషయాలకు అభ్యంతరపెడితే, వేరే నిర్మాతలు ఎవరూ నీకు అవకాశాలు ఇవ్వరు” అన్నారొకరు. “పోతే పోనివ్వండి… ఈ డ్రెస్ మాత్రం వేసుకోను. మరొకటి తెప్పించండి” అన్నాను.

రెండు మూడు రోజుల తర్వాత గురుదత్ బొంబాయి తిరిగొచ్చాకా, ఆయన ఓ మొండిపిల్లతో ఒప్పందం కుదుర్చుకున్నారని ఆయనకి చెప్పారట! “డ్రెస్ గురించి ఇబ్బంది పెట్టావట?” అని నన్నడిగారు. “అవును. ఆ డ్రెస్ డీసెంట్‍గా లేదు” అన్నాను. అంతే, దాని గురించి మా సంభాషణ అక్కడితో ముగిసింది. దేని గురించైనా, అనసవసరంగా వాదించడం ఆయనకు నచ్చదు. అయితే ఒక్కోసారి ఆయన తన ప్రశాంతతని కోల్పోయి అరవడం చూశాను. కర్దార్ స్టూడియోస్‌లో – ‘సి.ఐ.డి.’, ‘ప్యాసా’ చిత్రాలు ఏకకాలంలో చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. నాకు వేరే పని లేనప్పుడు వచ్చి షూటింగ్ చూడమని ఆయన చెప్పారు. ఓ రోజు ఓ సీనియర్ ఆర్టిస్ట్ పై ఆయన కోపగించుకోవడం చూసి విస్తుపోయాను. ఆ రోజు ఆయనతో అన్నాను – “మీరిలా నా మీద కోప్పడితే, నేను భరించలేను, నేను మానేస్తాను” అని. “భయపడకు… నీ మీద అలా అరవను…” అని హామీ ఇచ్చారాయన. “అవును అదే మంచిది” అంటూ, “నాకు నటన సరిగా రాదు, బాగా చేయడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను.. నా మీద కోపగించుకోకండి” అన్నాను. ఆయన నన్ను ఎన్నడూ కోపగించుకోలేదు, ఎంత విసిగించినా కూడా.

ప్యాసాలో ఒక సీన్ ఉంది. మెట్ల మీద నుంచి నేను పరిగెత్తుతూ వచ్చి ఒక డైలాగ్ చెప్పాలి. ఈ షాట్‌ని అప్పటికి ఇరవై సార్లు ప్రయత్నించారు… ప్రతీ సారీ నేను విఫలమయ్యాను. మెట్ల మీద నుంచి పరిగెత్తుకొచ్చేసరికి అలసిపోయి, డైలాగ్ చెప్పలేకపోయేదాన్ని. ఆయన అది గమనించారు. కాసేపు విశ్రాంతి తీసుకోమన్నారు. నేను అలసిపోయానని ఒప్పుకోడానికి నేను సిద్ధంగా లేను. లంచ్ బ్రేక్ దాకా షాట్ ఓకే అవలేదు. అయినా ఆయన కోపగించుకోలేదు. లంచ్ విరామం తర్వాత మరో 14 టేకులు చేశాం, మొత్తానికి 34వ టేక్‌కి ఆ షాట్ ఓకే అయింది. బహుశా నాకిది ఓ రికార్డు కావచ్చు; గురుదత్ గారి ఓపికకి కూడా రికార్డే! ఆయన ఓ జటిలమైన, విరుద్ధమైన వ్యక్తి. సెట్స్ మీద తప్పు జరిగితే, తరచూ కోపగించుకుంటారు. కానీ నా వల్ల ఏదైనా తప్పు జరిగినా, నా మీద ఎప్పుడూ విరుచుకుపడలేదు. ఆయనకి సహనం బాగా తక్కువ, అయినా చాలా విషయాలో అసాధారణ ఓర్పు ప్రదర్శించారు. సృజనాత్మక పనిని ప్రతి నిమిషం ఆస్వాదించిన మనిషాయన. అదే సమయంలో మృత్యువుని దగ్గర తీశారు, ప్రేమించారు, ఆదర్శం చేశారు, తనని తాను నాశనం చేసుకోవాలనుకున్నారు… అదే గురుదత్ గారి ప్రకృతి!

అందరు ఇతర దర్శకుల లాగానే గురుదత్‌కి కూడా గ్రాహ్యపు శక్తి బాగా ఉంది. తన నటీనటులను బాగా గ్రహిస్తారు, వాళ్ళ నుండి ఉత్తమమైన ప్రదర్శన ఎలా రాబట్టుకోవాలో కూడా ఆయనకు బాగా తెలుసు. ‘సి.ఐ.డి.’ లో నా నటన బాలేదు, ‘ప్యాసా’లో మొదటి సెట్‌లో షూటింగ్‌లోనూ అంతే! నా ఎంపిక పొరపాటనీ, నాకు భవిష్యత్తు లేదని చాలామంది అన్నారు. పైగా నేనో జటిలమైన వ్యక్తిననీ, మొండిఘటాన్ననీ, డ్రెస్సుల విషయంలో పేచీ పెడతాననీ అనేవారు. కానీ నా సామర్థ్యంపై గురుదత్ గారు విశ్వాసం ఉంచారు. ఆయన లేకపోతే, నేనీ రోజున ఇలా ఉండేదాన్నే కాదు. నా గురించి అందరి అభిప్రాయాలు విన్న ఆయన, “మరోసారి ప్రయత్నిద్దాం” అన్నారు. ‘ప్యాసా’ తదుపరి షెడ్యూల్ ఇరవై రోజుల పాటు కలకత్తాలో అవుట్ డోర్ షూటింగ్! ‘జానే క్యా తు నే కహీ, జానే క్యా మైనే సునీ’ అనే పాటని అక్కడ చిత్రీకరించారు. ఆ షూటింగ్ రషెస్ చూసినప్పుడు ఆయనెంతో సంతోషించారు. అందరూ నా నటనని మెచ్చుకున్నారు. నా గురించి తమ తమ అభిప్రాయాలను మార్చుకున్నారు. గురుదత్ గారి లానే, ఆయన చుట్టూ ఉండే చాలామంది వ్యక్తులది నిక్కచ్చి స్వభావమే! ఓ మంచి షాట్ తీసినా లేదా ఓ చక్కని దృశ్యాన్ని చిత్రీకరించినా ఆయనని ఎవరూ మెచ్చుకోవాల్సిన పని లేదు. కానీ అలా చేయడం కొన్ని యూనిట్లలో అతి సహజంగా ఉండేది. వాళ్ళకి ఏదైనా నచ్చకపోతే, నిస్సంకోచంగా గురుదత్ గారికి చెప్పే స్వేచ్ఛ ఉంది. ఆయన కూడా వాళ్ళ మాటలు జాగ్రత్తగా వినేవారు. వారి సలహాలను పాటించాలా వద్ద అనేది ఆయన ఇష్టం! చాలాసార్లు ఆయన అభీష్టమే నెగ్గేది – తాను చేయాలనుకున్నది చేసేవారు. తనకి నచ్చినది చేసేవారు. ఒక సీన్ కానీ పాట కాని ఆయనకి నచ్చకపోతే, అప్పటిదాక తీసినదంతా తీసేసి రీ-షూట్ చేసేవారు. ఒక్కసారి తనకి తానే నచ్చేవారు కాదు. చనిపోయి, ఈ జీవితాన్ని ముగించాలనుకునేవారు. “జీవితంలో విజయం/పరాజయం కాక, ఇంకేం ఉన్నాయి? ఈ రెండిటిలో ఏదో ఒకటి ఎదురవుతుంది. నేను రెండిటినీ చూశాను… బ్రతకడంలో నాకు ఇంకో ఆకర్షణ లేదు” అనేవారు. ‘ప్యాసా’ లోని ఓ పాట (‘యే దునియా అగర్ మిల్ భీ జాయె ఓ క్యా హై’) ఆయన స్వభావానికి అతి సన్నిహితంగా ఉంటుంది. సాధారణంగా జీవితం పట్ల విసిగిపోయిన వారు, పని పట్ల కూడా విసిగి ఉంటారు. కానీ గురుదత్ అలా కాదు. అత్యంత నిష్ఠగా చివరి వరకూ సినిమాలపై పనిచేస్తూనే ఉన్నారు. ఏదైనా కొత్తగా సృజనాత్మకంగా చేయడం లేదా, అలా చేస్తున్న వారి గురించి మాట్లాడడం చేసే వారు. లేకపోతే మృత్యువు గురించి ఆలోచించేవారు. ఆయన మృత్యువుని ఆస్వాదించారేమో! ఆయన గురించి తెలిసింది అతి తక్కువ, ఆయన మనసులో ఏం ఉందో, బయటకి తెలిసింది అతి తక్కువ శాతమే!

‘కానూన్’ చిత్రం కోసం ప్రార్థన:

ఆయనకి భగవంతుడిపై విశ్వాసం ఉంది. దేవుడిని నమ్మేవారు. అయితే ఏదైనా గుడికి కాని మందిరానికి ఆయన వెళ్ళిన గుర్తు నాకు లేదు. ఒకే ఒకసారి ఒక చిత్రం విజయం కోసం ప్రార్థించమని ఆయన నన్ను అడిగారు. అది ‘ప్యాసా’ కాదు, ‘కాగజ్ కే ఫూల్’ కూడా కాదు; అసలు ఆయన సొంత సినిమానే కాదు. అది బి.ఆర్. ఫిల్మ్స్‌ వారి ‘కానూన్’. “ఈ సినిమా విజయం గురించి నేనేందుకు ప్రార్థించాలి? దీనితో మీకేం సంబంధం లేదు కదా” అని అడిగాను. “కనీసం ఎవరో ఒకరు పాటలు లేకుండా సినిమా తీయడానికి ప్రయత్నిస్తున్నారు. నేను అలా తీయలేను. అది విజయవంతమైతే, అలాంటి సినిమాలు తీయడానికి మరికొందరు ముందుకొస్తారు… పాటలు లేని ఈ సినిమా విజయవంతం కావాలని నువ్వు ప్రార్థించాలి” అన్నారు – సినిమాల్లో పాటలని అత్యద్భుతంగా చిత్రీకరించే దర్శకులలో ఒకరని పేరున్న గురుదత్. ఇతరుల విజయాలకీ, సంపదకీ అసూయపడే వ్యక్తి కాదాయన. బదులుగా వాళ్ళ విజయాన్ని ఆయన ఆస్వాదించేవారు. ఆయన తన తోటివారిని ప్రేమించేవారు. వారికి మంచి చేయాలని అనుకునేవారు. ఆయనో గొప్ప ప్రేమికుడు – తన పనిని ఆస్వాదించేవారు, తోటివారిని అభిమానించేవారు, తన సృజనని ఇష్టపడేవారు, మరణాన్ని కూడా ప్రేమించారు. కాని ఆయన మరణాన్ని ఎందుకు ప్రేమించారో? ఎందుకు శ్లాఘించారో? దాన్ని ప్రపంచంలో కెల్లా అత్యంత మధురమైనదిగా ఎందుకు భావించారో? దేవుడు ఆయనకి అన్నీ ఇచ్చాడు, సంతృప్తి తప్ప! ఆయన ఓ పట్టాన తృప్తి చెందేవారు కాదు, తనకి ఎన్నటికీ సంతృప్తి ఉండదని ఆయనకి తెలుసు. ఆయన దృష్టిలో జీవితమంటే జయాపజాయల పరంపర. బహుశా అందుకేనేమో జీవితంలో తాను పొందలేని ముగింపు, ఒక పరిపూర్ణత, ఒక సంతృప్తి – మరణంలో ఆయన చూశారేమో… అసంతృప్తి బాధ లేని స్థితి అదేమో! ఆయన మరణం ప్రమాదమో, మరేదైనా అనేది నాకు తెలియదు. కానీ ఆయనని ఏదీ మనకి దక్కించేది కాదు అని నా అభిప్రాయం. జీవితంలో కావాలనుకున్నవన్నీ పొందడం సాధ్యం కాదనీ, మరణం ఒక పరిష్కారం కాదని నేను కూడా ఆయనకి చెప్పి చూశాను. కానీ ఆయన పరిపూర్ణతావాది, ఓ పట్టానా సంతృప్తి చెందరు. జీవితంలో పరిపూర్ణత అసాధ్యమని ఆయన గ్రహించినట్టు లేరు. అన్నీ కావాలనుకునేవారు. కొన్నిసార్లు వేరొకరి కోసం ఏదైనా కోరుకుంటాం; కానీ ఉద్దేశం మంచిదయినా, నిజాయితీగా ప్రయత్నించినా, వారికి అది దక్కదు… అలాంటప్పుడు మనం చేయగలిగింది ఏమీ లేదు. అది విధి… మనం మార్చలేం… జీవితంలో కొన్ని నమూనాలుంటాయి, వాటిని విడగొట్టలేం, మార్చలేం. వాటిని అంగీకరించి సాగిపోవాల్సిందే… లేదా మనల్ని మనం నాశనం చేసుకోవాలి. విధి గీసినా ఆ నమూనాలను అంగీకరించేందుకు ఆయన తిరస్కరించారు, తనని తాను నశింపజేసుకున్నారు.

ఆయన మరణం కేవలం ప్రమాదం కావచ్చు, కానీ ఆయన దాన్ని బలంగా కోరుకున్నారు…. పొందారు.

ఆయన మరణంలో సినీ పరిశ్రమ ఓ గొప్ప దర్శకుడిని, మానవత్వం ఓ గొప్ప దయాళువుని, నేను ఆప్త మిత్రుడుని కోల్పోయాము. సినీ నటిగా నేను సాధించినదంతా ఆయన వల్లే. నేనెప్పుడూ ఆయనకి కృతజ్ఞతగా ఉంటాను. నేను ఆయనని కాపాడలేకపోయాను… కానీ కాపాడాలనీ నిజాయితీగా కోరుకున్నాను… నేను కాకపోయినా వేరే ఎవరైనా కాపాడాలని కోరుకున్నాను.

కానీ ఆయన బతికినా, ఆయన జీవితం మరణం కన్నా బాధాకరంగా ఉంటుందని ఎవరికైనా తెలుసా? భగవంతుడు ఏం చేసినా, అది మన మంచికే. మనకి ఏది మంచో ఆయనకి బాగా తెలుసు.

రవీంద్రులు చెప్పినట్టు ‘అత్యుత్తమాన్ని మనం ఎంచుకోలేం/ అత్యుత్తమమే మనల్ని ఎంచుకుంటుంది’.

ఆయన మరణం మనకి గొప్ప ఖేదం కావచ్చు, కానీ జరిగినది ఆయన మంచికే! అదే మనకి మిగిలిన ఓదార్పు…”

***

గమనిక: వహీదా ఈ రచన చేసింది 1967లో. తెలుగులో ఆమె మొదటి సినిమా 1954లో వచ్చిన ‘కన్యాదానం’. ఆ సినిమా ఘోర పరాజయం పాలయిందంటే, ఆమె అంగీకరించరు. 1955లో వచ్చిన ‘రోజులు మారాయి’ తర్వాతే ఆమె పెద్ద స్టార్ అయ్యారు.

Exit mobile version