[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపరూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.
ఆర్. ఎస్. ప్రకాశ్
సినిమా అనగానే ప్రపంచం ఎంతసేపూ నటీనటులను తలుస్తుంది. దర్శకుడిని గుర్తిస్తుంది. సంగీత దర్శకులను, గాయనీ గాయకులను ఆరాధిస్తుంది. కానీ, వీరంతా తెరపై సక్రమంగా కనబడటం ఎడిటర్ సాంకేతిక ప్రతిభపై ఆధారపడువుంటుంది. ప్రపంచం, ముఖ్యంగా తెలుగువారు తప్పనిసరిగా , గర్వంగా గుర్తుంచుకోవాల్సిన సినీఎడిటర్లు ఆ ర్. ఎస్. ప్రకాశ్/రఘుపతి సూర్యప్రకాశ్ రావు. వీరి గురించి దర్శకుడు సి. ఎస్. రావు గారు మాట్లాడుతూ… “ఈ ఆర్.ఎస్. ప్రకాశ్ ఎవరో అసలు నిజంగా మనలో ఎంతమందికి తెలుసు?ఈ ప్రతిభాశాలిని ‘టెన్ కమాండ్‌మెంట్స్’ తీసిన హాలీవుడ్ దర్శకుడు సిసిల్ బి డిమిల్లీ ప్రశంసించాడని ఎవరికైనా తెలుసా?” అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే, వారి మాటల్లోనే… “నేను ఉపాధ్యాయుడిని అవ్వాలని మా అమ్మ కోరిక; మా నాన్నగారు, గొప్ప దర్శకుడు సి. పుల్లయ్యలా సినిమా రంగంలోకి వెళ్ళకూడదనేది. కానీ నేను మా అమ్మ ఆశలని తోసిపుచ్చి మా నాన్నగారితోనే పని చేశాను. ఆ సమయంలో ఆయన మీర్జాపురం జమీందారుకి చెందిన శోభనాచల స్టూడియోలో దర్శకుడిగా పని చేస్తున్నారు. అప్పటికే అక్కడ ఎడిటర్‌గా పని చేస్తున్న ఆర్. ఎస్. ప్రకాశ్ గారి దగ్గర నన్ను పనిలో పెట్టారు నాన్నగారు. నేను ఆయన్ని కలిసిన మొదటిరోజే… ‘బోడి నాయానా! నీకు మెదడులో సొంతంగా సృజనాత్మకత ఉన్నప్పుడు, సాంకేతికతపై ఎన్నడూ ఆధారపడకు’ అన్నారు. శోభనాచల స్టూడియోలో నిరంతరం విద్యుత్ కోత ఉండేది. ఆయన ఎడిటింగ్ పనులకు ఆటకం కలిగేదని అనుకుంటున్నారా? నన్ను టార్చ్‌లైట్ పట్టుకుని నేల మీద కూర్చోమనేవారు, ఆయన కుర్చీలో కూర్చునేవారు. టార్చ్‌లైట్ వెలుగు ఒక అద్దం మీద ప్రసరింపజేసి, ఫిల్మ్ ఫ్రేమ్ నుంచి ప్రతీ 1 / 25 వంతు సెకన్ తీసుకుని కత్తిరించి, అత్యున్నత సాంకేతిక నాణ్యతతో, సీన్స్ అన్నింటిని కలిపి అతికించేవారు. అద్భుతమైన ఎడిటింగ్. గొప్ప బ్రహ్మ విద్య! అమెరికాలో మూవియోలా కనుక్కోబడని ఆ రోజుల్లోనే, ఈ ఘనత జర్మన్ ఎడిటింగ్ టేబుల్ మీద మాత్రమే సాధ్యమైంది, అందునా ఓ తెలుగు ‘మేధావి’ దీనిని సునాయాసంగా చేసి చూపించారు. ‘అటువంటి ఎడిటర్ ప్రపంచంలో ఎక్కడా మునుపు లేరు, భవిష్యత్తులో రారు’. కాని మనం తెలుగు ప్రజలం ఈ ఘనతని గుర్తించామా? పాశ్చాత్య శైలిలో, చేతులతో ఎవరైనా ఆయన చేసినట్టు ఎడిటింగ్ చేస్తే, వారికి చేతులు వణకక తప్పదు. అలా చీకటిలో అ అద్భుతమైన ఘనతని ఎటువంటి సాంకేతిక సహాయం లేకుండా సాధించడం చూసిన ఈ ఏకలవ్యుడు – ‘ఆ ద్రోణాచార్యుడేమైనా పిచ్చివాడా???’ అని తరచూ అనుకునేవాడు. మా నాన్నగారికి ఈ విషయం చెప్పి, ఆ మేధావి ఎవరని అడిగాను. అప్పుడు నాన్నగారు ‘రఘుపతి వెంకయ్య నాయుడు’ అనే గొప్ప వ్యక్తి గురించి చెప్పారు. ఆ రోజుల్లో జమీందారులు విలాసవంతమైన జీవన విధానంతో, భోగప్రియత్వంతో ఉండేవారు. రఘుపతి వెంకయ్య వారి ఫోటోలు తీసి, పెద్దవిగా చేసి, వాటిని చూడడానికి ఆయిల్ పెయింటింగ్స్ వలె మార్చేవారు. తరువాత ఇలా ఆయిల్ పెయింటింగ్స్‌లా ఉన్న ఫోటోలను జమీందారులకు కానుకలుగా ఇచ్చేవారు. ఇలా చేయడం వల్ల ఆయన ధనవంతుడయ్యారు. 1909లో ఆయన జాన్ డికిన్‌సన్ అండ్ కంపెనీ నుంచి చిత్రాలకు శబ్దాన్ని జోడించగలిగే క్రోనో మెగా ఫోన్ అనే పరికారాన్ని ఆర్డర్ చేశారు. రూ.30,000/- విలువైన ఆ క్రోనో మెగా ఫోన్‌ని కొనేందుకు డబ్బుకై తన ఫోటో స్టూడియోని తాకట్టు పెట్టారు. 12 లఘు చిత్రాలు తీసి వాటిని విక్టోరియా పబ్లిక్ హాల్‌లో ప్రదర్శించారు. బెంగుళూరు, విజయవాడ, శ్రీలంక, రంగూన్, పెగూ లకు ప్రయాణించి తన చిత్రాలు ప్రదర్శించారు. తన సినిమాలను ప్రదర్శించేందుకు ఆయన 1910లో ఎస్‌ప్లనేడ్ టెన్ హౌస్ స్థాపించారు. 1912లో ఆయన మౌంట్ రోడ్‌లో గెయిటీ టాకీస్ నిర్మించారు, మద్రాసులో భారతీయుడి యాజమాన్యంలోని తొలి సినీ థియేటర్ అది. ఆ తరువాత ఆయన మద్రాసులోని మింట్ రోడ్‌లో క్రౌన్ థియేటర్, పరశువాక్కంలో గ్లోబ్ థియేటర్ నిర్మించారు. ఆయన అమెరికన్, బ్రిటీష్ సినిమాలు కూడా ప్రదర్శించారు. ఆయన థియేటర్లలో ప్రదర్శించిన తొలి చిత్రాలలో – మిలియన్ డాలర్ మిస్టరీ, మిస్టరీస్ ఆఫ్ మీరా, క్లచింగ్ హ్యాండ్, బ్రోకెన్ కాయిన్, రాజాస్ కాస్కెట్, పెరల్ ఫిష్, ఇంకా గ్రేట్ బార్డ్ – వంటివి ఉన్నాయి. 1919లో ఆయన స్టార్ ఆఫ్ ద ఈస్ట్ అనే ప్రొడక్షన్ కంపెనీ స్థాపించి, గ్లాస్ స్టూడియో అనే స్టూడియోని నిర్మించారు. తన కుమారుడు రఘుపతి సూర్య ప్రకాశ్ నాయుడుని లండన్‌లో సినెమాటోగ్రఫీ అధ్యయనం చేయడానికి పంపారు. తండ్రీకొడుకులు తమ మొదటి సినిమా – మీనాక్షీ కల్యాణం – చిత్రీకరణను మదురై మీనాక్షి ఆలయ పరిసరాలలో జరిపారు. తరువాత వారు గజేంద్ర మోక్షం, మత్స్యావతరణం, నందనార్, ఇంకా భీష్మ ప్రతిజ్ఞ… తొలి తెలుగు మూకీ సినిమా (నేపథ్య ధ్వనులు ఉండని సినిమా) తీసారు. 1929 నాటికి పరిస్థితులు తారుమారయి, అప్పులు తీర్చేందుకు ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది. వారి అబ్బాయి విషయానికొస్తే, లండన్‌లో కోర్స్ పూర్తి చేశారు. అక్కడ్నించి జర్మనీకి వెళ్ళగా అక్కడ తొలినాటి సినిమా మాస్టర్ ఎఫ్. డబ్ల్యూ. ముర్నౌని పనిలో ఉండగా చూసే అవకాశం కలిగింది. ఆయన హాలీవుడ్‌ని కూడా సందర్శించి, ఆయా దేశాల పర్యటనలో కొన్న 35 ఎంఎం కెమెరాతో మద్రాసుకి తిరిగివచ్చారు. హాలీవుడ్‌లో ఆయన వీధుల్లో నిద్రించి, ఎలాగొలా హాలీవుడ్ స్టూడియో వ్యవస్థలోకి ప్రవేశించగలిగారు. ఒకనాడు ఒక స్టూడియోలో సిసిల్ బి డి మిల్లీ దర్శకత్వంలో మూకీ సినిమా కింగ్ ఆఫ్ కింగ్స్ చిత్రీకరణ జరుగుతోంది, జాన్ ద బాప్టిస్ట్ షూటింగ్‌లో ఉన్నారు. బాప్టిజం స్వీకరించేందుకు గాను వరుసలో నిలబడాల్సిందిగా ఆయన యూదులకు చెబుతున్న దృశ్యం. ఆ వరుసలో క్రీస్తు కూడా ఉన్నారు. క్రీస్తు వంతు వచ్చేసరికి, జాన్ ద బాప్టిస్ట్ తన చేతుల్లోకి కొంత నీరు తీసుకోబోతుండగా, క్రీస్తు ముఖంలో ప్రకాశాన్ని చూసి ఆగిపోతారు. ఇద్దరు ఒకరినొకరు చూస్తూ నిలబడతారు. కెమెరా వారి ముఖాలపై కదలాడుతుండగా, జనాల్లోంచి ఎవరో ‘కట్’ అని అరిచారు. మొత్తం యూనిట్ అంతా విస్మయానికి లోనయ్యింది. సినిమా చిత్రీకరణకి సంబంధించి ఆ రోజుల్లో దర్శకుడే దైవం… దేవుడే వచ్చినా ‘కట్’ చెప్పడానికి వీల్లేదు. అలా ‘కట్’ చెప్పింది ఎవరో కాదు, ఆర్. ఎస్. ప్రకాశ్, తెలుగువాడు. ఆయనని కోపంతో ఊగిపోతున్న దర్శకుడి ముందుకు తెచ్చారు. చొక్కా కాలర్ పట్టుకుని, వివరణ అడిగారా దర్శకుడు. ఆర్. ఎస్. ప్రకాశ్ నిర్భయంగా – క్రీస్తు కాలం నాటికి టీకాలు లేవనీ, జాన్ ద బాప్టిస్ట్ భుజాలకి రెండు టీకా మచ్చలు ఉన్నాయని దర్శకుడు సిసిల్ బి డిమిల్లీకి వివరించారు. ఆ గొప్ప దర్శకుడు ఆనందంతో ప్రకాశ్‌ని హత్తుకుని, గొప్ప భవిష్యత్తు ఉంటుందని దీవించారు. ఆర్. ఎస్. ప్రకాశ్ భారతదేశానికి తిరిగివచ్చి తండ్రితో కలసి తమ స్టార్ ఆఫ్ ద ఈస్ట్ బేనర్‌పై సినిమాలు తీశారు. తర్వాతది అంతా విషాద గాథ. బారిస్టర్ పార్వతీశం వంటి టాకీ సినిమా తీశారు. నేను తనకు ఆదర్శవంతమైన శిష్యుడనని ఆయన నన్ను దీవించారు, 1951లో తృప్తిగా కన్నుమూశారు…”
ఆర్. ఎస్. ప్రకాశ్ గారి గురించి పరిశోధిస్తున్నప్పుడు… నాకు కన్నీళ్ళొచ్చాయి. తెలుగు వాళ్ళు గొప్ప గర్వంతో గుర్తుంచుకోవాల్సిన వ్యక్తి కదా ఆయన? ఆయన గురించి కొంత అదనపు సమాచారం…. ప్రారంభం నుంచే ఆర్. ఎస్. ప్రకాశ్ అస్వాభావికమైన ప్రజ్ఞ కలిగిన సాంకేతిక నిపుణులు. ‘గజేంద్ర మోక్షం’, ‘భక్త నందన్’, ‘సముద్ర మథనం’ (అన్నీ 1923లోవి); ‘మోహినీ అవతార్’ (1926), ‘దశావతార్’, ‘స్టేజ్ గర్ల్’ వంటి సినిమాల షూటింగ్ చేసి, ఫిల్మ్ డెవెలప్ చేసి, ఎడిటింగ్ చేశారు. 1930 నాటి రీమేక్ ‘గజేంద్ర మోక్షం’ సినిమాలో అప్పటి సుప్రసిద్ధ దర్శకుడు యువ వై.వి.రావు నటించారు. తన దర్శకత్వ కృషిలో ప్రకాశ్ గారి ప్రభావం చాలా ఉందని వై.వి.రావు చెప్పారు. ‘ద్రౌపది వస్త్రాపహరణం’ (1935) అనే తన సినిమాలో ఒక నటుడిని ఒకే ప్రతిబింబంలో అయిదుసార్లు కనబడేలా చేశారు ప్రకాశ్ గారు, ఆప్టికల్ లెగెర్‌డెమైన్ సాంకేతికతని ఉపయోగించకుండా (లెగెర్‌డెమైన్ అంటే ఇంద్రజాల ప్రదర్శనలలో నైపుణ్యంతో చేతులను ఉపయోగించడం – హస్తలాఘవం).
శబ్ద చిత్రాల కాలంలో ఫ్రీలాన్సర్‌గా మారి ప్రకాశ్ గారు తన విశేష కృషిని కొనసాగించారు, ముఖ్యంగా 30ల నాటి పౌరాణిక సినిమాలలో. వీటిల్లో తమిళ చిత్రాలు – ‘లంకా దహనం’, ‘కృష్ణ అర్జున’ (రెండూ 1935లోవి), ‘కృష్ణ నారది’, ‘ఇంద్ర సభ’ (రెండూ 1936లోవి), ‘ఆండాల్ తిరుకల్యాణం’, ‘రాజశేఖరన్’ (1937) ఉన్నాయి. ఈ ధోరణి నుంచి ప్రకాశ్ గారు చేపట్టిన గుర్తించదగ్గ మార్పు – ఆయన సాంఘిక చిత్రం ‘ఆనంధాయ్ పెన్’ (1938), దీనిని రెండవ ప్రపంచ యుద్ధపు ముందు కాలం నాటి జాతీయవాద ప్రచారానికి ఉదాహారణగా భావిస్తారు. ఆయన 1940లో తీసిన తెలుగు సినిమా ‘చండిక’… అనామక రాజ్యపు కథగా… సాంఘికంగా చైతన్యపరిచిన మరో సామాజిక చిత్రం ‘ది త్రీ మస్కటీర్స్’ నుంచి ప్రేరణ పొందినది; ఇది అసాంప్రదాయక, ఒక వ్యక్తి గుర్తుగా పేరుపెట్టగలిగే కథానాయిక పాత్ర కోసం – అప్పటి సామాజిక వ్యవస్థలను… ముఖ్యంగా స్త్రీజనోద్ధారణ కోసం… సమన్వయం చేసుకుంది.
ద మేన్స్‌ఫీల్డ్ బార్
కలలు నిండిన కళ్ళతో సినీ ప్రపంచంలో అడుగుపెట్టిందామె. మర్లిన్ మన్రో ఖాళీ చేసిన శృంగార దేవత స్థానాన్ని తనదిగా చేసుకోవాలని ఉవ్విళ్ళూరింది. కానీ, కేరీర్ ఎదుగుదలలో చేసిన చిన్న చిన్న పొరపాట్లవల్ల కలలు కల్లలయ్యాయి..నింగికి ఎగురుతుందనుకున్న తార, నెత్తురుకక్కుకుంటూ నేలకు వాలిపోయింది. మార్లిన్ మన్రో హఠాన్మరణం తర్వాత, హాలీవుడ్‌లో సొగసైన శృంగార తారగా జేన్ మేన్స్‌ఫీల్డ్ నిలదొక్కుకుంటుందని భావించారు. ఆమె 1933లో పెన్‌సిల్వేనియాలో జన్మించింది. అప్పుడు ఆమె పేరు వెరా జేన్ పాల్మర్. ఆమె తల్లి పేరు వెరా. న్యాయవాదైన తండ్రి హెర్బర్ట్ ఆమెకి మూడేళ్ళ వయసులో చనిపోయాడు. జేన్, ఆమె తల్లితో కలసి కారులో వెడుతూ గుండెపోటుకి గురై మరణించాడాయన. జేన్, ఆమె తల్లి వెంట్రుకవాసిలో ఆ ప్రమాదం నుంచి బయటపడ్డారు. బాల్యం నుంచే తానొక పెర్‌ఫార్మర్, ముఖ్యంగా సినీనటి అవ్వాలని కోరుకుంది జేన్. అందుకని నృత్యంలో శిక్షణ పొందింది, పియానో, వయొలిన్ వాయించడం నేర్చుకుంది. ఆమెకి పలు భాషలలో ప్రావీణ్యం ఉండేది. ఆమె ఐ.క్యూ. 163 ఉండేదని అనేవారు. 17 ఏళ్ళ వయసులో గర్భవతి కావడంతో, 1950 మే నెలలో పాల్ మేన్స్‌ఫీల్డ్‌ని తప్పనిసరై వివాహం చేసుకుని యాక్టింగ్ కెరీర్‌కి తాత్కాలిక విరామం ప్రకటించాల్సి వచ్చింది. ఆ నవంబరులో వారి కుమార్తె జేన్ మేరీ జన్మించింది. పాల్, జేన్ ఇద్దరూ నటనలో శిక్షణ తీసుకునేవారు, కాగా జేన్ తన వ్యక్తిత్వాన్ని పెంచుకునే క్రమంలో… మోడలింగ్ చేయడం, ప్లే బోయ్ పత్రికకి పోజ్ లివ్వడం, అందాలపోటీలలో నెగ్గడం వంటి ఇతర కార్యక్రమాలలోను నిమగ్మమైంది. పైగా పబ్లిసిటీ కోసం కావాలనే దుస్తులు జారేట్టు చేసే ‘వార్డ్‌రోబ్ మాల్‌ఫంక్షన్’ విషయంలో ఆమెకి సాటి లేదు. ఇటువంటి జిమ్మిక్కులు వల్లా, ఆమెకి తనకన్నా ఎక్కువ కీర్తిప్రతిష్ఠలుండడం వల్లా, తనకన్నా ఎక్కువ సంపాదిస్తుండడం వల్లా ఆమె భర్త ఆందోళన చెందాడు. వారి వివాహం విఫలమైంది, 1958లో వారు విడాకులు తీసుకున్నారు. అదే సంవత్సరం ఆమె మాజీ మిస్టర్ యూనివర్స్, హంగేరీలో జన్మించిన మిక్కీ హార్గిటేని పెళ్ళి చేసుకుంది. వాళ్ళిద్దరూ ముగ్గురు పిల్లలకి జన్మనిచ్చారు. అప్పటికే ఆమె సినిమా కెరీర్ పుంజుకుంది, ఎందుకంటే మార్లిన్ మన్రో ప్రభావంతో అందాల సుందరాంగులంటే మోజు పెరిగింది. కాని ఆమె కెరీర్ అంతా చిరాకుగానే ఉండేది. ఆమెకి చక్కని మేధస్సు ఉన్నప్పటికీ, నాటక రంగంలో తన నటనా వైదుష్యాన్ని నిరూపించుకున్నప్పటికీ, ఆమెకి సినిమాల్లో గౌరవప్రదమైన పాత్రలు రాలేదు, వచ్చినవన్నీ మూసకట్టు శృంగార తార పాత్రలే. ఆమె పబ్లిసిటీ స్టంట్లు కూడా ఆమెకి అపఖ్యాతి తెచ్చిపెట్టాయి. పత్రికలు కూడా ఆమె చేష్టలను తట్టుకోలేక ఓ నటిగా ఆమెను పరిగణించడం మానేసాయి. 1962లో ట్వెంటీయత్ సెంచురీ ఫాక్స్ ఆమెను తొలగించింది. తర్వాత ఆమె పొట్టగడుపుకోడానికి బి-గ్రేడ్ సినిమాలు చేస్తూ, టీవీలలో అతిథి వేషాలు వేస్తూ, నైట్ క్లబ్‌లలో ఆడిపాడే స్థితికి చేరింది. ఆమె వ్యక్తిగత జీవితమూ గొప్పగా లేదు. హార్టిగేతో వివాహం విఫలమై 1963లో విడాకులు పొందారు. అయినా తాను తిరిగి రాణించగలనని ఆమె విశ్వసించింది, కానీ ఆ ఆశ కూడా 1967లో హైవే 90పై చెదిరిపోయింది.
లూసియానాలో గంటకి 120 కిలోమీటర్ల కన్నా అధిక వేగంతో వెళ్తున్న ఆమె కారు సిల్వర్ బ్యూయిక్ ఎలెక్ట్రా హైవే 90పై ప్రమాదానికి గురైంది. కారుని కాలేజ్ విద్యార్థి రాన్ హారిసన్ నడుపుతున్నాడు. అతను అప్పట్లో మిస్సిస్సిప్పీలోని బిలోక్సీలోని గస్ స్టీవెన్స్ సూపర్ క్లబ్ కోసం పనిచేస్తున్నాడు. అప్పుడు సమయం తెల్లవారు జామున రెండున్నర దాటింది, అది 29 జూన్ 1967. అక్కడ క్లబ్‌లో జేన్ మేన్స్‌ఫీల్డ్ ప్రదర్శన పూర్తయ్యాక, ఆమెని హారిసన్ బిలోక్సీ నుంచి న్యూ ఆర్లీన్స్‌కి తీసుకువెడుతున్నాడు. దురదృష్టవశాత్తు, అప్పుడే సిటీ కౌన్సిల్ వారి వాహనం ఒకటి దోమలను తరిమేందుకు స్ప్రే వెదజల్లడంతో, నిలిచి ఉన్న ట్రక్ కనిపించలేదు. బ్యూయిక్ కారు ఆ ట్రక్ వెనుకభాగంలోకి దూసుకుపోయింది, దాని పై భాగమంతా చీరుకుపోయింది, ముందు సీటులో ఉన్న ముగ్గురు – హారిసన్, మేన్స్‌ఫీల్డ్, ఆమె ప్రియుడు/లాయర్ శామ్యూల్ ఎస్. బ్రోడీ – అక్కడికక్కడే మృతి చెందారు. మేన్స్‌ఫీల్డ్ చిహుఆహువా కుక్కలు నాలుగు, ఆమె ముగ్గురు పిల్లలు – మిక్లోస్, జోల్టాన్, మారిస్కా – చిన్న చిన్న గాయలతో బయటపడ్దారు. తల్లి మరణం తర్వాత ఆ ముగ్గురు పిల్లలనీ వాళ్ళ నాన్న తన మూడో భార్య ఎల్లెన్ సియానోతో కలిసి పెంచాడు. ఈ ఘోరమైన రోడ్డు ప్రమాదం – అతి సుదీర్ఘ కాలం పాటు నడిచిన సెలెబ్రిటీ గాథలకు నెలవైంది; కార్ విండ్‌షీల్డ్‌లో చిక్కుకుపోయిన ఆమె సొగసైన కేశాల ఫోటోలు చూసి మేన్స్‌ఫీల్డ్ తల తెగిపోయిందని ఇప్పటికీ ఎన్నో పుకార్లు వినబడుతూంటాయి. కాని అన్ని నివేదికలూ ఆమె తల తెగిపోలేదనే వెల్లడించాయి. కపాలం చితికిపోవడమే ఆమె మరణానికి కారణమని డెత్ సర్టిఫికెట్ పేర్కొంది. అయితే జేన్ మేన్స్‌ఫీల్డ్, శామ్ బ్రోడీ, రాన్నీ హారిసన్‌ల మరణం వృథా కాలేదు. వీరి మరణం కారణంగా – నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ – రహదారి నిబంధనలలో మార్పు చేసి అన్ని సెమీ-ట్రక్ ట్రయిలర్లకూ డాట్ బార్ అమర్చాల్సిందిగా ఆదేశించింది. దాన్నే మేన్స్‌ఫీల్డ్ బార్ అంటారు (మొదటి బొమ్మ చూడండి). ఈ నటి జీవితానికి అది విచారకరమైన, అవమానకరమైన ముగింపు. చనిపోయినప్పటికి ఆమె వయసు 34 ఏళ్ళే, కాగా మృత్యువు ఆమె హాలీవుడ్ కెరీర్‌కి ముగింపు పలకగా, రహదారి భద్రతలో మార్పులకి సంబంధించి ఒక ఉద్యమానికి కారణమై, ఎందరో జీవితాలను కాపాడింది. ఆమె సమాధిపై “We LIVE to love you more each day” అని రాసి ఉంటుంది. నిజమే! ఆమె వల్ల వేలాది మంది జీవించగల్గారు.