Site icon Sanchika

అలనాటి అపురూపాలు-62

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

తొలితరం నటి జుబైదా బేగం ధనరాజ్‌గిర్:

గతంలో తల్లితండ్రుల కెరీర్‍నే పిల్లలు కూడా ఎంచుకోవడం ఆనవాయితీగా ఉండేది. వైద్యుల పిల్లలు వైద్యం, నటుల వారసులు నటన ఎంచుకోవడం సాధారణమే! ఈ కోవలోనే, నటి, దేశపు తొలి ఉత్తమ మహిళా దర్శకురాలైన ఫాతిమా బేగం కుమార్తె జుబైదా బేగం కూడా వెండితెరపై రాణించారు. వీరు సూరత్‍కి చెందినవారు. జుబైదాకు షహజాదీ, సుల్తానా అనే ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. వీరిద్దరూ కూడా నటీమణులే. జుబైదా నటించిన సినిమాలలో కలకాలం నిలిచి ఉండేవి ‘ఆలమ్ ఆరా’ (1931), ‘దేవ్‌దాస్’ (1937) చిత్రాలు. ‘ఆలమ్ ఆరా’ భారతదేశపు తొలి టాకీ చిత్రం కావడం విశేషం. ఆర్దేషిర్ ఇరాని ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

సుప్రసిద్ధులైన పృథ్వీరాజ్ కపూర్, మాస్టర్ విఠల్ వంటి గొప్ప నటులతో నటిస్తూ జుబైదా ఎదిగారు. తన గానం, నాట్యం, డైలాగ్స్‌తో అందరినీ అలరించారు. సాగర్ మూవీ టోన్ వారి తొలి టాకీ ‘మేరీ జాన్’‌లో ఈవిడే కథానాయిక.

జుబైదా భారతీయ చలనచిత్ర రంగపు తొలి సూపర్ స్టార్స్‌లో ఒకరు. రాచకుటుంబాల స్త్రీలే కాకుండా, మర్యాదస్తుల కుటుంబాలకు చెందిన మహిళలు సినిమాల్లో నటించడం నేరంగా భావించేటి రోజులలో జుబైదా సినీరంగ ప్రవేశం చేశారు. సూరత్‌తో జన్మించిన ఈ అందాల యువరాణి ఫాతిమా బేగం, నవాబ్ ఆఫ్ సచిన్ దంపతుల కుమార్తె. తల్లి బాటలోనే నడిచి జుబైదా, ఆమె సోదరీమణులు సినిమాల్లో ప్రవేశించి రాణించారు.

‘కోహినూర్’ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసినప్పుడు జుబైదా వయసు 12 ఏళ్ళే. 1920 దశకంలో ఎక్కువగా తన సోదరి సుల్తానాతో కలిసి నటించారు. ఇద్దరూ ప్రముఖ కథానాయికలయ్యారు. వీరిద్దరూ కలిసి నటించిన చిత్రాలలో ‘కళ్యాణ్ ఖజినా’ (1924) ముఖ్యమైనది. అంతే కాదు, జుబైదా తొలి బ్లాక్ బస్టర్, రెండేళ్ళ తరువాత వచ్చిన ‘వీరాభిమన్యు’లో ఈ ఇద్దరూ కలిసి నటించారు. ఈ చిత్రంలో వారి తల్లి ఫాతిమా బేగం కూడా ఓ ముఖ్య పాత్ర పోషించారు.

1925లో జుబైదా నటించిన 9 చిత్రాలు విడుదలయ్యాయి. వాటిల్లో ‘కాలా చోర్’, ‘దేవదాసి’, ‘దేశ్ కా దుష్మన్’ ముఖ్యమైనవి. మరుసటి సంవత్సరం జుబైదా – తన తల్లి దర్శకత్వంలో ‘బుల్‍బుల్ ఏ ఫరిస్తా’ చిత్రంలో నటించారు. లైలామజ్నూ, ననంద్ భోజాయ్, ఇంకా నావల్ గాంధీ గారి ‘శాక్రిఫైజ్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద హిట్ కావడంతో 1927 ఆమెకో గొప్ప ఏడాదిగా మిగిలింది. ‘శాక్రిఫైజ్’ చిత్రం రవీంద్రుని ‘బలిదాన్’ ఆధారంగా రూపొందించబడింది. ఇందులో జుబైదా, సులోచన, మాస్టర్ విఠల్, జై కంబట్టా నటించారు. బెంగాల్ లోని కొన్ని కాళీమాత ఆలయాలలో సాగుతున్న జంతుబలులను ఖండించిన సినిమా ఇది. ‘ఇది అద్భుతమైన, నిజమైన భారతీయ చిత్రం’ అని ఇండియన్ సినిమాటోగ్రాఫ్ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ కమిటీలోని యూరోపియన్ సభ్యులు – ఈ చిత్రాన్ని విదేశాలలోనూ ప్రదర్శించాలని అన్నారు.

భారతదేశపు తొలి టాకీ చిత్రం ‘ఆలమ్ ఆరా’లో నటించి ఘన విజయం సాధించడానికి ముందు జుబైదా ఎన్నో మూకీ సినిమాలలో నటించారు. కానీ ‘ఆలమ్ ఆరా’ పెద్ద హిట్ అయి, ఆమె కెరీర్‍ని మలుపుతిప్పింది. ‘ఆలమ్ ఆరా’, ‘మేరీ జాన్’, ‘వీరాభిమన్యు’ వంటి చిత్రాలు హిట్ కావడంతో ఆమె తారాపథంలోకి దూసుకుపోయారు. అప్పటి కథానాయికలలో అత్యధిక పారితోషికం తీసుకునే నటి అయ్యారు.

30, 40 దశకాల్లో ఆమె జల్ మర్చంట్‌తో జోడీగా ఎన్నో విజయవంతమైన పౌరాణిక చిత్రాలలో నటించారు. సుభద్ర, ఉత్తర, ద్రౌపది వంటి పాత్రలు పోషించారు. అదే సమయంలో ఎజ్రా మీర్ గారి ‘జరీనా’ చిత్రంలో సర్కస్ అమ్మాయిగా, ముద్దులు పెట్టే బోల్డ్ పాత్రలో నటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. మూకీ చిత్రాల నుండి టాకీ చిత్రాలలో విజయవంతంగా మారగలిగిన కొద్దిమంది నటీమణుల్లో జుబైదా ఒకరు.

1934లో ఆమె నానూభాయ్ వకీల్‍తో కలిసి మహాలక్ష్మీ మూవీటోన్ స్థాపించి, ‘గుల్ ఎ సోనోబార్’, ‘రసిక్ ఏ లైలా’ వంటి బాక్సాఫీస్ హిట్ చిత్రాలను అందించారు. 1949 వరకూ ఆమె ఒకటో రెండో సినిమాలలో నటిస్తూనే ఉన్నారు.

జుబైదా హైదరాబాద్ సంస్థానానికి చెందిన మహారాజ నరసింగిర్ ధనరాజ్‌గిర్ జ్ఞాన్ బహాదూర్‍ని వివాహం చేసుకున్నారు. కార్పోరేట్ రంగంలో రాణించిన హుమయున్ ధనరాజ్‌గీర్, ఇంకా దుర్-ఏ-షాహవార్ ధనరాజ్‌గీర్‍ల తల్లి జుబైదా. ప్రముఖ మోడల్ రియా పిళ్లై తల్లి దుర్-ఏ-షాహవార్. జుబైదా తన చివరి రోజులలో పిల్లలు, మనుమలతో బొంబాయిలోని ధన్‌రాజ్ మహల్ ప్యాలెస్‍లో గడిపారు. ఆమె 1988లో మరణించారు. అప్పటికి ఆమెకు కొడుకు కూతురుతో పాటు నిఖిల్ ధనరాజ్‌గిర్, అశోక్ ధనరాజ్‌గిర్, రియా పిళ్లై దత్, కరేన్ నైనా అనే మనమలు, మనవరాళ్ళు ఉన్నారు.


చిన్న వయసులో గతించిన ప్రతిభాశాలి ఘంటసాల బలరామయ్య:

అలనాటి తెలుగు సినీ నిర్మాత, దర్శకులు ఘంటసాల బలరామయ్య 1906లో (నెల్లూరు జిల్లా లోని పొట్టెపాలెంలో) ఓ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. నలుగురు సోదరులలో ఆయన మూడవవారు. మొదటివారు సూర్యనారాయణ, ఈయన నెల్లూరు లోని మైకా కింగ్స్ వద్ద పని చేసేవారు. రెండవవారు రాధాకృష్ణయ్య, నాటకాలలో కబీరు వేషానికి ప్రసిద్ధి చెందారు. బలరామయ్యగారి తమ్ముడు శేషాచలం నాల్గవవారు.

తన తండ్రిగారు మరణించాక, బలరామయ్య నెల్లూరు వెళ్ళి పెద్దన్నయ్య వద్ద ఉండి స్కూలు ఫైనల్ వరకు చదువుకున్నారు. తరువాత కార్పోరేటివ్ ఇన్‍స్పెక్టర్‌గా శిక్షణ కూడా పొందారు. అయినప్పటికీ ఆయనకి ఉద్యోగం రాలేదు. బలరామయ్య రెండో అన్నయ్య బాటలో నడిచి నాటకాలలో నటించసాగారు. శేషాచలం కూడా నాటకాలలో నటించసాగారు. ఈ విధంగా నటన అనేది ఘంటసాల సోదరుల రక్తంలోనే ఉందని నిరూపితమైంది.

నాటకాలలో బలరామయ్య కూడా కబీరు, రామదాసుల వేషాలు వేశారు. అలా రెండేళ్ళ పాటు నాటకాలు వేశారు. ఆ సమయంలోనే ఆయనకి వివాహం అయింది. ఆయన వేసిన నాటకాలు చూసి, ఆయనకు సినిమాలో అవకాశం ఇచ్చారు. 1933లో ‘రామదాసు’ అనే చిత్రంలో వేషం దొరికింది. ఆ రోజుల్లో సినిమాల చిత్రీకరణ కలకత్తాలో జరిగేది. ఆర్టిస్టులకు కాంట్రాక్టులు ఇచ్చేవారు… మొత్తం వ్యవహారమంతా కలకత్తా కేంద్రంగా నడిచేది. బలరామయ్యతో పాటు ఆయన సోదరులు కూడా నటించేందుకు కలకత్తా వెళ్లారు.

అయితే ఆ సినిమాలో బలరామయ్య నటించలేదు. నటీనటులతోనూ, సిబ్బందితోనూ ఉండి సినీ నిర్మాణ ప్రక్రియని అవగతం చేసుకున్నారు. తరువాత నెల్లూరు వచ్చేసి శ్రీరామా ఫిల్మ్స్ అనే సంస్థని స్థాపించారు. 1936లో ఈ బ్యానర్ క్రింద ‘సతీ తులసి’ చిత్రాన్ని నిర్మించరు. సీనియర్ శ్రీరంజని, వేమూరి గగ్గయ్య ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమా తర్వాత ఆయన – శ్రీరామా ఫిల్మ్స్ బ్యానర్‌ని వీడి, వెంకురెడ్డి అనే భాగస్వామితో కలిసి కుబేరా ఫిల్మ్స్‌ బ్యానర్ స్థాపించారు. ఈ బ్యానర్ క్రింద ఆయన ‘మైరావణ’, ‘మార్కండేయ’ అనే సినిమాలు తీశారు. ‘మార్కండేయ’ చిత్రంలో కాంచనమాల నటించారు. ఈ రెండు సినిమాలు పెద్ద హిట్ అయ్యాయి. కానీ భాగస్వాముల మధ్య గొడవలు వచ్చి బలరామయ్య కుబేరా ఫిల్మ్స్ నుంచి బయటకి వచ్చేసారు. ఆయన బయటికి వచ్చాకా, ఈ రెండు సంస్థలు మూతపడ్డాయి. తరువాత ఆయన సొంతంగా ప్రతిభా ప్రొడక్షన్స్ స్థాపించి, ‘పార్వతీ పరిణయం’ అనే సినిమా తీశారు. శాంతకుమారి కథానాయిక. ఆయన సోదరులిద్దరూ ఈ చిత్రంలో నటించారు. ఈ సినిమాని వేల్ పిక్చర్స్ స్టూడియోలో చిత్రీకరించారు. ఆ సమయంలో రెండో ప్రపంచ యుద్ధ భయం మద్రాసు నగరాన్ని కమ్ముకుంది. ఆ భయం సర్దుకున్నాకా, 1944లో బలరామయ్య ‘గరుడ గర్వ భంగం’ అనే చిత్రం ప్రారంభించారు. భానుమతి ఈ చిత్రంలో నటించారు. చిత్రరంగంలో తిరిగి ప్రవేశించేందుకు వేదాంతం రాఘవయ్యకి ఈ సినిమా ద్వారా మరో అవకాశం లభించింది. ఈ సినిమాకు ముందు ఆయనకి సినీరంగంలో కాస్త పరిచయం ఉంది, కానీ ఆయన ఈ అవకాశాన్ని వదులుకున్నారు.

బలరామయ్యతో పూర్ణ పిక్చర్స్ మంగరాజు చేతులు కలిపారు. ‘శ్రీ లక్ష్మమ్మ కథ’ చిత్రం వరకూ వారిద్దరూ కలిసే ఉన్నారు. 1945లో బలరామయ్య ‘సీతా రామ జననం’ అనే చిత్రాన్ని తీసి, అక్కినేని నాగేశ్వర రావుని తెలుగు చిత్రసీమకి పరిచయం చేశారు (బలరామయ్య గారంటే ప్రస్తుత తరం వారికి – నేటి సంగీత దర్శకుడు థమన్ తాతగారని, అక్కినేనిని తొలిసారి పరిచయం చేశారని మాత్రమే తెలియడం దురదృష్టకరం. ఈ గొప్ప వ్యక్తి గురించి అంతకంటే ఎక్కువ ఎవరికీ తెలియకపోవడం విచారకరం). 1946 నుంచి ఆయన పౌరాణిక చిత్రాలను ఆపేసి, జానపదాలు తీయడం ప్రారంభించారు.

ఆయన తీసిన తొలి జానపద చిత్రం ‘ముగ్గురు మరాఠీలు’. డా. గోవిందరాజుల వెంకట సుబ్బారావు, అక్కినేని నాగేశ్వర రావు, సి.హెచ్. నారాయణ రావు, కన్నాంబ, కుమారి, కస్తూరి శివరావు తదితరులు నటించారు. ఈ సినిమా తర్వాత శివరావు గొప్ప స్టార్ అయిపోయారు. ఈ చిత్రానికి ఓగిరాల రామచంద్రరావు సంగీతం అందించారు. ఈ చిత్రం సూపర్ హిట్ అయి, హీరోగా అక్కినేని స్థానాన్ని స్థిరపరిచింది. ఈ చిత్రం వంద రోజుల వేడుక విజయవాడలో జరిగింది.

తర్వాతి చిత్రం ‘బాలరాజు’ (1948). అక్కినేని, అంజలీదేవి, ఎస్. వరలక్ష్మి ప్రధాన తారాగణం. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను నెలకొల్పింది. జెమినీ వారి ‘చంద్రలేఖ’తో పోటీ పడి, ఈ చిత్రం ఎన్నో థియేటర్లలో 30 వారాలు నడిచింది. బాలరాజు చిత్రం ఘనవిజయంలో పాలు పంచుకునేందుకు ఎన్నో కొత్త సినిమా హాళ్ళని తెరిచారట! ఇవన్నీ అబ్బురంగా చెప్పుకునేవారు. జై ఘంటసాల బలరామయ్య!

ఈ చిత్రం తర్వాత ఆయన అక్కినేని, అంజలీ దేవితో ‘స్వప్న సుందరి’ చిత్రం నిర్మించాలని తలచారు. ఈ చిత్రం సగం చిత్రీకరణ జరుపుకున్నాక, ఆపేసి, ‘శ్రీ లక్ష్మమ్మ కథ’ చిత్రం ప్రారంభించారు. ఈ చిత్రానికి పోటోగా, నటి కృష్ణవేణి మరో ‘లక్ష్మమ్మ కథ’ ప్రారంభించారు. బలరామయ్య తన చిత్రాన్ని 12 జనవరి 1950 నాడు మొదలుపెట్టి 19 ఫిబ్రవరి నాటికి పూర్తి చేసి, 26 ఫిబ్రవరి న విడుదల చేశారని చెప్పుకుంటారు.

ప్రతిభా ఫిల్మ్స్ కార్యాలయంలో అక్కినేని దంపతులు

ఆ తరువాత మధ్యలో ఆపిన ‘స్వప్న సుందరి’ తిరిగి ప్రారంభించారు. అత్యున్నత నిర్మాణ విలువలతో చిత్రీకరించి నవంబర్ 1950లో విడుదల చేశారు. అయితే ఈ రెండు సినిమాలు బాక్సాఫీసు వద్ద నిరాశపరిచాయి. ‘స్వప్న సుందరి’లో అక్కినేని, అంజలీదేవి, జి. వరలక్ష్మి, శివరావు తదితరులున్నా, ఆ సినిమా ఆడలేదు. అందుకని ఆయన 1951లో ‘చిన్న కోడలు’ అనే సాంఘిక చిత్రం ప్రారంభించారు. అందులో డా. గోవిందరాజుల సుబ్బారావు, కృష్ణకుమారి, జి.ఎన్. స్వామి, జి. నారాయణ రావు తదితరులు నటించారు. ఆ చిత్రం 1952లో విడుదలయింది.

రేచుక్క చిత్రంలో బలరామయ్య గారి కూతురు అమ్ములు

ఈ చిత్రం తరువాత ఆయన ‘రేచుక్క’ అనే జానపద చిత్రం ప్రారంభించారు. అక్టోబరు 9 న ఈ చిత్రం ప్రారంభమైంది, మూడు రీల్స్ నిర్మాణం జరిగింది, రెండు పాటల రికార్డింగ్ పూర్తయి, ఒక పాట చిత్రీకరణ కూడా జరిగింది. ఈ చిత్రంలో ఎన్.టి.ఆర్., అంజలి, ప్రమీల/దేవిక, జోగారావు తదితరులు నటించారు.

29 అక్టోబరు 1952 అర్ధరాత్రి తీవ్రమైన గుండెపోటుతో ఘంటసాల బలరామయ్య మృతి చెందారు. సినీ ప్రముఖులు, అభిమానులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. బలరామయ్యకి మొత్తం ఏడుగురు పిల్లలు. నలుగురు కొడుకులు, ముగ్గురు కూతుళ్ళు. ఆయన చనిపోయే నాటికి పెద్ద కొడుకు ఘంటసాల కృష్ణమూర్తి ఆయనకి సహాయకుడిగా పనిచేస్తున్నారు. ‘రేచుక్క’ చిత్రాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత ఆయన మీద పడింది. అప్పుడు ప్రతిభా ఫిల్మ్స్ వారు ఆ చిత్రాన్ని సి. పుల్లయ్య పూర్తి చేస్తారని అధికారికంగా ప్రకటన ఇచ్చారు.

శ్రీ బలరామయ్య మృతదేహం
బలరామయ్య మృతి చెందినప్పుడు వారి కార్యాలయం వద్ద ఎన్.టి.ఆర్., ఏ.ఎన్.ఆర్. తో పాటు ఇతర ప్రజలు

అత్యంత ప్రతిభావంతులు, హుందా వ్యక్తిత్వం గల ఘంటసాల బలరామయ్య అనే మనిషి జీవితం ఎంత విషాదాంతంగా ముగిసింది? 46 ఏళ్ళ వయసు చనిపోయే వయసా? ఆయన నేపథ్యం గురించి ఆలోచిస్తే – ఎక్కడి నుంచి బయల్దేరి ఎక్కడికి చేరారో అని ఆశ్చర్యం కలగక మానదు. ఆయనని ఆయన చేసిన మొత్తం కృషికి జ్ఞాపకం ఉంచుకోవాలి గాని, థమన్ తాతయ్యగానో, అక్కినేనిని పరిచయం చేసిన వ్యక్తి గానో కాదు.

Exit mobile version