Site icon Sanchika

అలనాటి అపురూపాలు-63

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

భారతీయ చిత్రాలలో తొలిసారి స్విమ్ సూట్ ధరించిన సాహసి:

ఫిల్మ్‌ఫేర్ ఫోటో షూట్ కోసం షర్మిలా టాగోర్ టు-పీస్ బికిని ధరించినప్పుడు; ‘ఏన్ ఈవినింగ్ ఇన్ పారిస్’ (1967), ‘ఆమ్నే సామ్నే’ (1967) చిత్రాలలో స్విమ్ సూట్ ధరించినప్పుడు గొప్ప సంచలనం రేగింది.

వెండితెర పై స్విమ్‍ సూట్ ధరించిన తొలి హీరోయిన్‌గా ఆమెకు చాలామంది పొరపాటుగా గుర్తింపు నిచ్చేశారు. కాని అది నిజం కాదు. అప్పటికి 30 సంవత్సరాల ముందే 1938లో ‘బ్రహ్మచారి’ అనే మరాఠీ సినిమాలో నాయికగా నటించిన మీనాక్షీ శిరోద్కర్ స్విమ్ సూట్ ధరించి, భారతీయ తెరపై తొలిసారిగా స్విమ్ సూట్ ధరించిన హీరోయిన్‍గా రికార్డు సాధించారు. నటీమణులు శిల్పా శిరోద్కర్, నమ్రతా శిరోద్కర్‍లు ఆవిడకి మనుమరాళ్ళు. బ్రహ్మచర్య భావనపై ఈ చిత్రం ఓ అధిక్షేపం! తన పక్కన హీరోగా నటించిన ఈ చిత్ర దర్శకుడు మాస్టర్ వినాయక్‌ను ఆటపట్టించే ‘యమునా జలి ఖేలు ఖేల్’ అనే పాటలో స్విమ్ సూట్ ధరించారు మీనాక్షి.

ఈ పాటలో మీనాక్షి స్విమ్ సూట్ ధరించడం చూసిన ఆనాటి ప్రేక్షకులు ఆ సినిమాని మళ్ళీ మళ్ళీ చూశారట. ఆ చిత్రం హిందీలోకి డబ్ కూడా అయింది. అది మీనాక్షి తొలి చిత్రం. దానితోనే ఆవిడకు గొప్ప పేరు వచ్చేసింది. నటి నందా తండ్రి అయిన మాస్టర్ వినాయక్‍తో జత కట్టడం కూడా ప్రేక్షకులకి నచ్చేసింది. వారిద్దరూ కలిసి ఎన్నో సినిమాలు చేశారు. Brandichi Batli (1939), Ardhangi / Ghar Ki Rani (1940), Amrut (1941), Mazhe Bal (1943) తదితర చిత్రాలు ముఖ్యమైనవి.

~ ~

అయితే, మరి హిందీ చిత్రాలలో మొదటిసారి స్విమ్ సూట్ ధరించిన కథానాయిక ఎవరు? నివేదికల ప్రకారం ఆ ఘనత కూడా మరో మరాఠీ నటి నళిని జయవంత్‌కు దక్కుతుంది. నళిని శోభనా సమర్థ్‌కు సమీప బంధువు. ఎన్నో పురోగామి భావాలు కల్గిన వ్యక్తి. బట్టలకూ, వాటి తయారీకి సంబంధించిన విషయాలకొస్తే, నళిని తన కాలం కన్నా ఎంతో ముందున్న మనిషి. ఫోటో‌షూట్‌ల కోసం ‘బీచ్‌వేర్’ ధరించడానికి ఆమె సిగ్గుపడలేదు. 50వ దశకంలో వీటిని ఎంతో సాహసోపేత చర్యలుగా భావించేవారు.

‘సంగ్రామ్’ (1950) చిత్రంలో స్విమ్ సూట్ ధరించి, ‘ఉల్ఫత్ కా జాదూ దిల్ మే అసర్ హై’ అనే పాటలో అశోక్ కుమార్‌తో ఆడి పాడారు. ఈ చిత్రం ఎత్తుగడ అప్పటి కాలాని కంటే చాలా ముందరిది. అశోక్ కుమార్ పూర్తి స్థాయి విలన్‌గా కనబడతారు.

నర్గిస్ కూడా ‘ఆవారా’ (1951) చిత్రంలో స్విమ్ సూట్ ధరించారు. బీచ్‍లో రాజ్ కపూర్‌తో కలిసి కనిపించే దృశ్యాలు ఆ సినిమాకే హైలైట్ అని చెప్తారు. అప్పటి వరకు చీరల్లోనే కనపడిన నర్గిస్ – ఈ చిత్రంతో – ప్రేక్షకులని విస్తుపోయేట్టు చేశారు.

ఇప్పటివరకు సినిమాల్లో వచ్చిన స్విమ్ సూట్ దృశ్యాలలో కెల్ల అది అత్యంత అందంగా చిత్రీకరించినదని అందరూ అంగీకరిస్తారు. కాలాలు మారినా ఆ దృశ్యంలోని కళాత్మకత మారలేదు.

పక్కింటి అమ్మాయిలా కనిపించే మరో హీరోయిన్ నూతన్. హాస్య చిత్రం ‘దిల్లీ కా థగ్’ (1958)లో నూతన్ స్విమ్ సూట్ ధరించడం సంచలనం సృష్టించింది. ఆమె ఇమేజ్‍కి సంబంధించి, అది ఓ ఖచ్చితమైన మార్గాంతరం! శ్రేష్ఠమైన భారతీయ యువతి ధరించే సాంప్రదాయిక దుస్తులే కాకుండా, పాశ్చాత్య దుస్తులు కూడా తనకి నప్పుతాయని నిరూపించారు. ఆ సినిమాలో నూతన్ గొప్ప ఈతగత్తెగా నటించారు.

కాబట్టి, షర్మిలా స్విమ్ సూట్ ధరించడమనేది చాలా కాలానికి జరిగినట్లు గమనించాలి. కానీ ఆమె ఎందరి దృష్టినో ఆకర్షించింది. దాని గురించి చాలా ఎక్కువగా పత్రికల్లో రాయడంతో బాగా ప్రఖ్యాతి గాంచింది.


నటిగా కన్నా దేవ్ ఆనంద్ భార్యగా గుర్తుండిపోయిన కల్పనా కార్తీక్:

మాజీ నటి కల్పనా కార్తీక్ అసలు మోనా సింఘా. 1950లో ఒక అందాల పోటీలో ఆమెని గుర్తించిన దర్శకనిర్మాత చేతన్ ఆనంద్ ఆమెకి కల్పనా కార్తీక్ అని వెండితెర పేరు పెట్టారు. గురుదత్ దర్శకత్వం వహించిన ‘బాజీ’ ఆమె మొదటి సినిమా. ఈ చిత్రంలో, దేవ్ ఆనంద్ సరసన ఒక నాయికగా నటించారు. ఆమె ‘ఆంధియా’, ‘టాక్సీ డ్రైవర్’, ‘హౌస్ నెంబర్ 44’, ‘నయా దౌర్’ వంటి హిట్ చిత్రాలలో నటించారు. ‘టాక్సీ డ్రైవర్’ చిత్రం సెట్‌లో అర్ధరాత్రి పూట దేవ్ ఆనంద్‍ని వివాహం చేసుకోవడం అప్పట్లో గొప్ప సంచలనం సృష్టించింది.

‘బాజీ’ చిత్రం గురించి, గురుదత్ గురించి మాట్లాడుతూ, “అదో మర్చిపోలేని అనుభూతి. ఓ గొప్ప నాయకుడిలా గురుదత్ గారు మమ్మల్ని నడిపించారు. ప్రతీ చిన్న విషయాన్ని పట్టించుకునేవారు. దేవ్ ఆనంద్‌కి మిత్రుడయినా, తన పనిలో ఎన్నడూ రాజీ పడేవారు కాదు. మా మధ్య చక్కని అనుబంధం ఏర్పడింది. ఆయన ఉదయ్ శంకర్ స్కూల్ ఆఫ్ పెర్‌ఫార్మింగ్ ఆర్ట్స్‌కి చెందినవారు, కాబట్టి కోరియోగ్రఫీపై గొప్ప పట్టు ఉంది. ‘యే కౌన్ ఆయా’ గీతాన్ని అద్భుతంగా చిత్రీకరించారు. గీతా బాలీ మంచి సహనటి… మేం అరమరికలు లేకుండా నటించాం” అని చెప్పారు.

భర్త దేవ్ ఆనంద్‍తో కలిసి వెండి తెరని పంచుకోడంలోని అనుభవాలను వివరిస్తూ… ‘టాక్సీ డ్రైవర్’ చిత్రంలో నేనో మగ రాజపుత్ డ్రైవర్‍లా కనిపించాలి. ‘మేరే బాల్’ అనే దృశ్యంలో నిజంగానే టూల్ కిట్ లోని పరికరంతో నా జుత్తు కత్తిరించేసారు. తర్వాత ప్యాంట్ షర్ట్‌తో మగ డ్రైవర్‍లానే కనిపిస్తాను.

అరేబియా సముద్రంలో పడవ మీద మా ఇద్దరి పైనా చిత్రీకరించిన ‘దేఖో మానే నహీ రూఠీ హసీనా’ పాటని నేనెలా మరిపోగలను?” అన్నారు.

తన భర్తతో కలిసి నటించిన సినిమాల గురించి చెబుతూ, “‘టాక్సీ డ్రైవర్’ తరువాత, నేనూ, దేవ్ ఆనంద్ – హిందీ చిత్రరంగంలో హీరో హీరోయిన్‌లుగా నటించిన తొలి భార్యాభర్తలం అయ్యాం. ‘హౌస్ నెంబర్ 44’, ‘నౌ దో గ్యారహ్’ గొప్ప హిట్‍లయి, మాకు మంచి పేరు వచ్చింది. 1954లో ‘టాక్సీ డ్రైవర్’ సెట్‍లో అర్ధరాత్రి మా పెళ్ళి జరిగినప్పుడు దేవ్ ఎంతో సిగ్గరిగా ఉండేవారు. ఆ రోజు నాకింకా గుర్తుంది. దేవ్ సిగ్గుగా, ఉత్సహంగా, అత్యంత సహాయకారిగా, సున్నిత మనస్కుడిగా ఉన్నారు. అందరి దంపతులలానే మేమూ గొడవలు పడేవాళ్ళం… అయినా ఆరు దశాబ్దాలకి పైగా కలిసున్నాం. ఆయన నన్ను వదిలేశారానే పుకారు విన్నప్పుడల్లా, మనస్ఫూర్తిగా నవ్వుకునేదాన్ని. ఆ సంచారి దేవ్ ఎప్పటికీ నావాడేనని నాకు తెలుసు” అని చెప్పారు.

సగం బెంగాలీ అయిన కల్పన, కోలకతా జ్ఞాపకాల గురించి మాట్లాడుతూ… “చౌరంఘీ రోడ్‌లో దేవ్ ఆనంద్‍తో కలిసి నడవడం నాకింగా గుర్తుంది. 1957లో ‘నౌ దో గ్యారహ్’ ప్రీమియర్ షో కోసం వచ్చినప్పుడు ఒబెరాయ్ గ్రాండ్‍లో దిగాము.  మేమిద్దరం రోడ్ ఈ చివరి నుండి ఆ చివరి దాకా నడిచాం. దారి పక్కనే ఉన్న ఓ రెస్టారెంట్‌లో ఆహారం తీసుకున్నాం… కొల్‍కతా ప్రేక్షకులకు సినిమా అంటే నిజమైన అవగాహన ఉందని గ్రహించాను” అన్నారు.

దేఖో మానే నహీ రూఠీ హసీనా – పాట యూట్యూబ్‌లో:

Exit mobile version