Site icon Sanchika

అలనాటి అపురూపాలు-64

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

మద్రాసులో ఆదాయపు పన్ను కట్టిన తొలి కళాకారిణి:

మదరాసు రాష్ట్రంలో ఆదాయపు పన్ను చెల్లించిన తొలి కళాకారిణి బెంగుళూరు నాగరత్నమ్మ. ఈమె 1878లో పుట్టు లక్ష్మి, వకీల్ సుబ్బారావు గార్లకు నంజనగూడులో జన్మించారు. పుట్టు లక్ష్మి పూర్వీకులు మైసూరు సంస్థానంలో గాయకులుగా, సంగీతజ్ఞులుగా వ్యవహరించారు. సుబ్బారావు విడిచిపెట్టగా, ఆమె మైసూర్ మహారాజా వారి వద్ద సంస్కృత, సంగీత పండితునిగా ఉన్న శాస్త్రి గారి ఆశ్రయం పొందారు. నాగరత్నమ్మ ఐదేళ్ళ వయసులో దేవదాసి వ్యవస్థలో ప్రవేశపెట్టబడ్డారు. శాస్త్రి మైసూరు విడిచిపెడుతూ, నాగరత్నమ్మని కూడా వదిలి వెళ్ళారు. అప్పుడు నాగరత్నమ్మ తమ బంధువు, వయొలనిస్ట్ అయిన వెంకటస్వామి అప్పా వద్ద ఆశ్రయం పొందారు.

నాగరత్నమ్మ చదువు కొనసాగించి కన్నడ, ఇంగ్లీషు, తెలుగు భాషలలో పట్టు సాధించారు. సంగీతం లోనూ, నాట్యం లోనూ ప్రావీణ్యం సాధించారు. త్యాగరాజ స్వామి నెలకొల్పిన ‘శిష్య పరంపర’లో భాగంగా ఆమె మునుస్వామప్ప వద్ద శాస్త్రీయ సంగీతం అభ్యసించారు. 15 ఏట రసజ్ఞులైన ప్రేక్షకుల ముందు ఆమె తన తొలి నాట్య, వయొలిన్ ప్రదర్శన ఇచ్చారు. తొలి రాజుల్లో సంగీతానికి ప్రాధాన్యతనిచ్చి, గాయనిగా కొనసాగారు. కన్నడ, సంస్కృతం, తెలుగులో పాడేవారు. హరికథలు చెప్పడం ఆమె ప్రత్యేకత.

నాట్యంలోని ఆమె ప్రావీణ్యం చూసి అచ్చెరువొందిన మైసూరు మహారాజు జయచామరాజేంద్ర ఒడెయరు, ఆమెని తన ఆస్థాన నర్తకిని చేశారు. ఆయన మరణాంతరం, ఆమె బెంగుళూరుకు తరళి వెళ్ళారు. బెంగుళూరులో సంగీతంలోనే కాక, నాట్యంలోనూ పేరు పొందారు. ఆమెకు ట్రావెన్‍కోర్, బొబ్బిలి, విజయనగరం రాజాస్థానాల ఆదరణ కూడా లభించింది. నాగరత్నమ్మ శ్రేయోభిలాషి, మైసూరు హైకోర్టులో న్యాయమూర్తి అయిన నరహరి రావు, ఆమె మద్రాసులో స్థిరపడితే, సంగీతంలోనూ, నాట్యంలోనూ వృద్ధి బాగుంటుందని సూచించారు. ‘కర్నాటక శాస్త్రీయ సంగీతపు మక్కా’గా భావించబడే మద్రాసులో నాగరత్నమ్మ తన ప్రజ్ఞను మరింత మెరుగుపరుచుకున్నారు. జస్టిస్ నరహరి రావు గారి ఆదరణ కారణంగా మద్రాసులో ‘కచేరీ కళాకారిణి’గా పేరుపొందారు. త్యాగరాజ ఆరాధనను ప్రోత్సాహించిన, నాగరత్నమ్మ – మదరాసులో ఆదాయపు పన్ను చెల్లించిన తొలి కళాకారిణిగా చరిత్ర సృష్టించారు.

త్యాగరాజస్వామి వారి స్మారకమందిరం నిర్మించమని, కర్నాటక శాస్త్రీయ సంగీతానికి ఒక వేదిక కల్పించమని నాగరత్నమ్మగారికి స్వప్నంలో ఆదేశమయిందట! అనంతరం ఆమె సన్యాస జీవనంలోకి మారి, తన సంపాదనంతా దీనికోసమే ఖర్చు చేశారు.

మద్రాసులో ఉండగా ఆమె గురువు బిడారం కృష్ణప్ప – శిథిలమైన త్యాగరాజ స్వామి సమాధి గురించి తెలిపారు. బిడారం కృష్ణప్ప శిష్యులు – కృష్ణ భాగవతార్, సుందర భాగవతార్‍లు 1903లో త్యాగరాజ స్వామి సమాధి వద్ద పాలరాతితో చిన్న స్మారక చిహ్నాన్ని నెలకొల్పి, ఆరాధనోత్సవాలు జరిపారు. అప్పటి నుండి అది ఒక ఆచారం అయింది. కొన్నేళ్ళకి స్వామిని ఆరాధించేవారిలో అభిప్రాయ భేదాలు నెలకొని రెండు వర్గాలుగా చీలిపోయి సమాధి వద్ద వేరు వేరుగా ఉత్సవాలు నిర్వహించసాగారు. ఎవరూ సరిగా పట్టించుకోకపోవడంతో సమాధి శిథిలమైంది. అప్పుడు నాగరత్నమ్మ రంగంలోకి దిగి సమాధిని పునరుద్ధరించారు. ఆ స్థలాన్ని కొనుగోలు చేసి, త్యాగరాజ స్వామి స్మారక స్థలంగా మార్చారు. అక్కడ స్వామికి ఒక మందిరం నిర్మించి, ఆయన విగ్రహం ప్రతిష్ఠింపజేసి, బ్రాహ్మణులచే రోజూ పూజలు నిర్వహింపజేశారు. ఈ ఆలయం 1921లో పవిత్రం చేయబడింది. ఆ కాలంలో సంగీత ఉత్సవాలలో మగవారే పాల్గొనేవారు. సాంప్రదాయక కుటుంబాలలోని మహిళలు బహిరంగంగా ఇలాంటి ఉత్సవాలలో పాల్గొనేవారు కాదు. ఇవన్నీ దేవుని ఉత్సవాలకు పేరుమోసిన దేవదాసీలకు మాత్రమే పరిమితం. అప్పట్లో దక్షిణ భారతదేశంలో రెండు రకాల దేవదాసీలు ఉండేవారు. ఒకరు లేక అంతకన్నా ఎక్కువమంది దేవదాసీలు ఆలయ వార్షిక వేడుకల్లో పాడినా, నృత్యం చేసినా సమాజానికి చేటు అని భావించే వైరి వర్గం – ఈ ఉత్సవాలలో పాల్గొనకుండా నాగరత్నమ్మ‍ గారిని అడ్డుకుంది. సమాధి స్థలాన్ని పునరుద్ధరించినది ఆమే అయినప్పటికీ, అడ్డుకోవడంతో ఆస్థాన నర్తకి వలె ఆడి పాడకుండా, విగ్రహం ముందు హరికథలా చెబుతానని ఆమె అన్నారు. అయినప్పటికీ ఆమెకి అనుమతి లభించలేదు. దీనిని ఒక సవాలుగా తీసుకుని ఆమె ఆలయం వెనుక మరొక ఉత్సవం నిర్వహించారు. ఆమె బృందానికి ‘Pengal Katchi’ (మహిళా బృందం) అనీ, ఆమెకి పోటీగా మగవారు నిర్వహించే ఉత్సవ బృందానికి ‘Periya Katchi’ (పెద్ద బృందం) అనీ గుర్తింపు లభించింది. చివరికి 1941 నాటికి ఆమె పోరాటం ఫలించి, రెండు వర్గాల మధ్య రాజీ కుదిరి, అంతా కలిసి ఒకే బృందంగా – స్త్రీ పురుషులు – కలిసి ఉత్సవం నిర్వహించేలా ఒప్పందం జరిగింది. దీన్నే త్యాగరాజ ఆరాధనోత్సవాలు అంటున్నారు. చాలా ఏళ్ళ నుండీ దక్షిణ భారతదేశంలో ఈ ఉత్సవాలు చాలా వేడుకగా జరుగుతున్నాయి.

1927లో నాగరత్నమ్మ, ఇతర దేవదాసీలు కలిసి ‘అసోసియేషన్ ఆఫ్ దేవదాసీస్ ఆఫ్ మద్రాస్ ప్రెసిడెన్సీ’ అనే సంస్థను స్థాపించారు. ఈ సంస్థకు తొలి అధ్యక్షురాలిగా నాగరత్నమ్మ ఎన్నికయ్యారు. ఈ విధంగా మద్రాసులోని సాంప్రదాయక సమాజాన్ని నాగరత్నమ్మ ఒక కుదుపు కుదిపారు.

18వ శతాబ్దంలో తంజావూరు మహారాజు ప్రతాపసింహుని ఆస్థానంలో రాజనర్తకిగా ఉన్న ముద్దుపళని రచించిన ‘రాధికా సాంత్వనం’ అనే కావ్యాన్ని నాగరత్నమ్మ చదవడం తటస్థించింది. ఒక వివాహిత స్త్రీ (రాధ), ఒక బాలుడి (కృష్ణ) ప్రేమలో పడడం ఇతివృత్తం. ఈ కావ్యం చదివి ప్రేరణ పొందిన నాగరత్నమ్మ దానిని అనువదించి ప్రచురించాలనుకున్నారు. ఇది ఆ కాలంలో ఓ సాహసోపేతమైన చర్య… ఎందుకంటే ముద్దుపళని ‘రాధ’ సాధారణ పాత్ర కాదు. కృష్ణ పట్ల ప్రేమ, శృంగారవాంఛ అధికం. ఓ రాజనర్తకి రచించిన ఈ పుస్తకం అమితాసక్తి పెంచుకున్న నాగరత్నమ్మ నిర్ణయాన్ని మద్రాసులోని సాహిత్య, సాంస్కృతిక వర్గాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దినపత్రికలలో తీవ్రమైన విమర్శలతో కూడిన సంపాదకీయాలు వెలువడ్దాయి. ఒక వేశ్య రాసిన ముతక కావ్యాన్ని మరో వేశ్య ప్రాచుర్యంలోకి తెస్తోందంటూ అభాండాలు వేశారు. నాగరత్నమ్మ బెదరకుండా పత్రికలలో సవరణ ప్రకటనలు వేయించారు. కానీ వివాదం తీవ్రతరమై, అప్పటి ప్రభుత్వం ప్రచురణకర్త కార్యాలయంపై పోలీసులతో దాడి చేయించి పుస్తకం ప్రతులను స్వాధీనం చేసుకుంది. ఈ పుస్తకం అశ్లీలమైనదని, తక్షణమే నిషేధించవలసిందిగా ప్రభుత్వ అనువాదకుడు సలహా ఇచ్చారు. ఈ పుస్తకం చదువరులను నైతికంగా పతనం చేస్తుందని భావించిన ప్రభుత్వం ఈ పుస్తకాన్ని చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించింది. దీని ప్రచురణ నేరమని ప్రకటించింది. నాగరత్నమ్మ కోర్టుకి వెళ్ళి న్యాయపోరాటం జరిపారు. అయితే ప్రభుత్వం వారి సమాధానం కోసం ప్రచురణకర్త వేచివుండక, 1927 వరకు నాగరత్నమ్మ కూర్చిన ‘రాధికా సాంత్వనం’ ప్రతులు ముద్రించి పంపిణీ చేయసాగారు. ఈ ప్రతులపై తీవ్రమైన విమర్శలు ఎదురయ్యాయి. ఒక తెలుగు పత్రిక “ఒక వేశ్య రచించిన పుస్తకానికి మరో వేశ్య సంపాదకీయం వహించింది” అంటూ వ్యాఖ్యానించింది. దీనిపై దుష్ప్రచారం జరగడంతో పుస్తకాన్ని నిషేధించారు. వెంకటగిరి రాజా జోక్యం చేసుకోవడంతో వివాదం కాస్త సర్దుమణిగింది. కానీ వీరేశలింగం బృందం ఆ పుస్తకం నిషేధానికై గట్టిగా పోరాడారు. దాంతో సంపూర్ణ నిషేధం విధించడమైంది.

ఇరవై ఏళ్ళ అనంతరం, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 1947లో అప్పటి మద్రాసు ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు ఈ పుస్తకంపై నిషేధం తొలగించారు. మొత్తం ఈ వృత్తాంతమంతా – దేశంలో గ్రామఫోన్ కొత్తగా ప్రవేశించినప్పుడు – దేశ సాంస్కృతిక రంగంలో రేగిన దుమారాన్ని పోలి ఉంది. సామాజిక అభ్యంతరాలున్నప్పటికీ, ది గ్రామఫోన్ కంపెనీ, ఇతర యూరోపియన్ రికార్డింగ్ కంపెనీలు బెంగుళూరు నాగరత్నమ్మ వంటి దేవదాసీల గానాన్ని రికార్డు చేయాలనుకోవడం – సమాజం వారిని హేళనగా చూసినా – అదొక ఘన విజయంగా భావించాలి. అయితే నాగరత్నమ్మ ఎక్కువగా రికార్డు చేయలేదు, సెన్సార్‌షిప్ దుమారం ఆమెను బాధించింది. ఆమె తొలుత రికార్డు చేసిన వాటిల్లో – దేవదాసీలు పాడే కొన్ని శృంగారపరమైన పదం, జావళీలు ఉన్నాయి. అయితే ఆవిడ వాటిని క్రమంగా విడిచి ఆధ్యాత్మిక చింతనతో కూడిన పాటలు… హరికథల వైపు మొగ్గారు. ఆమెకు సంస్కృతంలో ప్రావీణ్యం ఉండడంతో చక్కటి ఉచ్చారణ ఉండేది.

74 సంవత్సరాల వయసులో 1952లో నాగరత్నమ్మ పరమపదించారు. ఆమె జ్ఞాపకార్థం త్యాగరాజస్వామి వారి సమాధి పక్కనే ఆమె స్మారకచిహ్నాన్ని నిర్మించారు.

నాగరత్నమ్మ గారి గురించి తెలిపే కొన్ని వీడియోలు:

‘రాధికా సాంత్వనం’ కథని సాంఘీకరించి, ఆధునిక కాలానికి అనువుగా మార్చి దాసరి నారాయణరావు 1980లలో సినిమాగా తీశారు. అదే ‘మేఘ సందేశం’. అక్కినేని నాగేశ్వరరావు గారి 200వ చిత్రం. జయప్రద రాధికగా, కృష్ణగా అక్కినేని నటించిన ఈ చిత్రంలోని పాటలు అద్భుతంగా వచ్చాయి. సినిమా పరాజయం పాలయినా, జేసుదాసు పాడిన పాటలు సుప్రసిద్ధమయ్యాయి.


హేమ మాలిని ‘డ్రీమ్‍ గర్ల్’గా మారిన వైనం:

హేమ మాలిని శ్రీరంగంలోని ఓ తమిళ అయ్యంగార్ల కుటుంబంలో- జయలక్ష్మి, విఎస్‌ఆర్ చక్రవర్తి ఆయ్యంగార్ దంపతులకు జన్మించారు. ఆమె మద్రాసులోని ఆంధ్రా మహిళా సభలో చదువుకున్నప్పుడు ‘చరిత్ర’ ఆమెకు ఇష్టమైన పాఠ్యాంశం. తరువాత ఆమె డిటిఇఎ మందిర్ మార్గ్‌లో 11వ తరగతి వరకు చదివారు. ఆ పై నటిగా కొనసాగారు. ‘ఇదు సతియం'(1963) అనే సినిమాలో ‘శింగారి’ అనే పాటకు నృత్యం చేసే నాట్యగత్తెగా సినీరంగ ప్రవేశం చేశారు. ఆదుర్తి సుబ్బారావు గారు నిర్మించి దర్శకత్వం వహించిన ‘తేనె మనసులు’ చిత్రం కోసం స్క్రీన్ టెస్ట్‌కి హేమ మాలిని, జయలలిత ఇద్దరూ హజరయ్యారు. ఆ చిత్రానికి నేటి ప్రముఖ దర్శకులు కె. విశ్వనాథ్ సహాయదర్శకులు. ఈ ఇద్దరికీ, వారిద్దరూ నచ్చలేదనుకుంటా, చిత్రానికి ఎంపిక కాలేదు!

దర్శకుడు శ్రీధర్ కూడా హేమ మాలినిని తిరస్కరించారు. నటిగా అవకాశాలు రాకపోయినప్పటికీ, హేమ తల్లి జయలక్ష్మి తన కూతురుచే నాట్య ప్రదర్శనలు ఇప్పించడం మానలేదు. వారి దృష్టి అంతా నాట్యం పైకి మళ్ళింది. సమయం కోసం వేచి చూశారు. మంచి అవకాశం కోసం ఎదురు చూశారు [ఇలా మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నా, రెండు తెలుగు సినిమాలు – పాండవ వనవాసం (1965), శ్రీ కృష్ణ విజయం (1971) చిత్రాలలో నాట్య ప్రధానమైన పాటలలో నర్తించారు. ఆ పాటలు గొప్ప హిట్ అయ్యాయి].

ఈ అందమైన నర్తకిని బి. అనంతస్వామి అనే తమిళ నిర్మాత గుర్తించారు. అప్పట్లో ఆయన రాజ్ కపూర్‍తో ఒక హిందీ సినిమా తీస్తున్నారు. షెడ్యూల్ అంతా సిద్ధంగా ఉంది, షోమాన్ సరసన కొత్త హీరోయిన్ కోసం అన్వేషిస్తున్నారు. హేమకి ఎవరైనా గాడ్‌ఫాదర్ అవసరమయి ఉంటే అది అనంతస్వామి గారే. “ఈ చిత్రానికి సంబంధించిన అన్ని నిర్ణయాలు రాజ్ కపూర్ తీసుకుంటారని అనంతస్వామి గారు మాకు ముందే చెప్పారు. ‘సంగం’ తర్వాత రాజ్ కపూర్ గారి బల్క్ డేట్స్ ఉన్న ఈ దక్షిణాది నిర్మాతతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రానికి కొత్తగా దక్షిణాది అమ్మాయిని పరిచయం చేయాలని అనుకున్నారు. నాట్యం వచ్చి, వైజయంతిమాల స్థాయి ఉండాలని భావించారు” అంటూ ఆనాటి విషయాలను గుర్తు చేసుకున్నారు హేమ. అనంతస్వామి గారి ఈ అవకాశం ఇవ్వగానే, ‘తాను సిద్ధం’ అంటూ 16 ఏళ్ళ హేమ దాన్ని అందిపుచ్చుకున్నారు. మద్రాసులో సి. వి. శ్రీధర్ తిరస్కరించారన్న బాధలో ఉన్న జయ ఈ చిత్రాన్ని పరిగణించలేదు.

సినిమాలో కథానాయికగా హేమ ఎంపికయ్యారన్న వార్తతో ఆమె తండ్రి ఆగ్రహోదగ్రులయ్యారు. ఇంట్లో అన్నం తినడం మానేసారు, భార్య జయతో వాదోపవాదాలు జరిగాయి. “నాకూ, మా సోదరులకి వివరాలు తెలియవు… ఎందుకంటే పెద్దవాళ్ళ మధ్యలో జోక్యం చేసుకుని ప్రశ్నలు అడగకూడదని మాకు చెప్పారు. మాకు భయంగాను, అసౌకర్యంగాను ఉండేది. మొత్తానికి నాలుగవ రోజున నాన్న శాంతించి, అన్నం తినడానికి అంగీకరించారు, కనీసం రాజీ కుదిరేవరకు అయినా! సమస్యని ఎలా పరిష్కరించుకున్నారో నాకిప్పటికీ తెలియదు, కానీ నాకు అనుమతి దొరికింది. అయితే ఒక విషయంలో నాకు స్పష్టత ఉంది. నేను సభలలోనూ, ఉత్సవాలలోను నాట్యం చేయడంలో నాన్నగారికి ఎటువంటి అభ్యంతరం లేదు… కాని సినిమాల్లో నటించడంలోనే ఆయనకి అభ్యంతరం… తన కొలీగ్స్ ఏమంటారో అని ఆయన సంశయం కావచ్చు” చెప్పారు హేమ.

రాజ్ కపూర్ సరసన కథానాయికగా ప్రవేశించడం అంటే చాలా గొప్ప విషయం! మొదట హేమ పాత్రను వైజయంతిమాలకు ఇవ్వచూపగా, ఆమె పెద్దగా ఆసక్తి చూపలేదని చాలామంది అనుకున్నారు. కానీ వాస్తవం ఏంటంటే రాజ్ కపూరే స్వయంగా కొత్త నటితో నటించేందుకు ఆసక్తి చూపారు. ఏది ఏమైనా హేమకి ఇది గొప్ప ఆరంభం. జీవితంలో రెండోసారి కూడా మొదటి సారి సినీరంగ ప్రవేశం మాదిరి అన్నీ పరీక్షలు జరిగాయి… దుస్తుల నుంచి సంభాషణలు పలికే తీరు వరకూ అన్నింటా పరీక్షలు జరిగాయి. హేమ తమిళ ఉచ్చారణ బలంగా ఉండడంతో, దాన్ని సవరించేందుకు – బొంబాయి ఆకాశవాణి కేంద్రంలో న్యూస్ రీడర్ అయిన లక్ష్మీ శర్మ సహాయం తీసుకున్నారట ఆ చిత్ర దర్శకులు మహేష్ కౌల్. హిందీ స్వచ్ఛంగా మాట్లాడే లక్ష్మీ శర్మ హేమ మాలినికి తగు శిక్షణనిచ్చారు.

‘సప్నోం కా సౌదాగర్’ చిత్రం షూటింగ్ జరిగిన కాలంలో మొదటి ఎనిమిది నెలలు హేమ, వాళ్ళమ్మ జయ – నిర్మాత అనంతస్వామి గారి ఇంట్లో బస చేశారు. యువనటికి మార్గదర్శకుడిగా వ్యవహరించిన ఆయన, ఆమెని అన్ని రకాలుగా సౌకర్యంగా ఉండేట్టు చూశారు. ఆ చిత్రం విడుదలై, హేమకి మరిన్ని అవకాశాలు రావడం మొదలయ్యాకా, వాళ్ళు వేరే అద్దె ఇంటికి మారారు. “స్వల్పకాలం పాటు నేను అమ్మతో కలిసి మాతుంగలో షణ్ముఖానంద గెస్ట్ హౌస్‍లో ఉన్నాను. అది చిన్న గది. రోజంతా స్టూడియోలో షూటింగ్ చేసి గదికి వచ్చేసరికి అది చాల ఇరుకుగా, భయంగా అనిపించేది. మేం ఉండడానికి సరైన చోటు లేదని నాన్నగారికి తెలియడంతో ఆయన ఖర్‍లో ఒక అపార్ట్‌మెంట్ అద్దెకు తీసుకున్నారు” గుర్తు చేసుకున్నారు హేమ.

హేమకి మార్గదర్శకుడిగా వ్యవహరించడమే కాకుండా, ఆమె అందాన్ని శాశ్వతం చేసేలా, దేవకన్యలా అనిపించేలా – ఫేమస్ ట్యాగ్ లైన్ జోడించారు అనంతస్వామి.

అప్పట్లో పోస్టర్ల డిజైన్లు నిర్మాతలే చూసుకునేవారు. అందుకని హేమ ముఖం క్రింద వచ్చేలా ‘Raj Kapoor’s Dream Girl’ అని వ్రాయించారు. సినిమా విడుదలయి, నెలలు గడిచినా కూడా ఈ సినిమాకి పోస్టర్లు, పెద్ద పెద్ద హోర్డింగులు నగరమంతా ఉండేవి. ఒక కొత్త నటికి ఇదంతా ఊహించని అనుభవం!

“అది అనంతస్వామి గారి ఆలోచన. అది పబ్లిసిటీ స్టంట్ అనీ, సినిమా విడుదలయ్యాక, జనాలు దాన్ని మర్చిపోతారని అనుకున్నాం. కొన్ని పోస్టర్లు నిజంగా భలే తమాషా ఉండేవి. ’44 ఏళ్ళ రాజ్ కపూర్, 16 ఏళ్ళ హేమతో ప్రేమాయణం’ అంటూ తమాషా రాతలు ఉండేవి. ఈ పబ్లిసిట్ గిమ్మిక్‌ని నేను ఆస్వాదించాను. ‘సప్నోం కా సౌదాగర్’ విడుదలయ్యాక జనాలు నన్ను ‘డ్రీమ్ గర్ల్’ అని పిలవసాగారు. పేరు ఎలా వస్తుందో నాకు అప్పుడు అర్థమైంది. ఆ పేరు తగ్గట్టు నడుచుకునేందుకు నేనెప్పుడయినా ప్రయత్నించానా అని జనాలు నన్ను అడుగుతుంటారు. నేను అలాంటి ప్రయత్నాలు ఎప్పుడూ చేయలేదు. అసలా ట్యాగ్ నాకో ఆశ్చర్యం! నా మొహం, రూపం సగటు భారతీయ స్త్రీ వలె ఉండడం కలిసొచ్చింది. నా ముఖం – విలక్షణమైన భారతీయ ముఖం. అయితే, నేను నా కుటుంబానికి, నా అభిమానులకు చెడ్డ పేరు తెచ్చే పాత్రలు ఎన్నడూ పోషించలేదు. అందుకని ఆ పేరు అలా ఉండిపోయింది. పంపిణీదారులు, నిర్మాతలు దానిని కొనసాగించారు” చెప్పుకొచ్చారు హేమ.

కిడ్నాప్‍ గురయిన యువరాణి జిప్సీ యువతిగా పెరగడం ‘సప్నోం కా సౌదాగర్’ కథాంశం. ఈ సినిమాలో హేమ పోషించిన పాత్ర – ప్రేమాస్పదుడు, ప్రపంచాన్ని పరిశుద్ధం చేసే రాజ్ కపూర్ పాత్రతో ప్రేమలో పడుతుంది. పాటలు హిట్ అయినప్పటికీ, వాణిజ్యపరంగా ఈ చిత్రం పరాజయం పాలయింది. ఈ చిత్రం ద్వారా హేమకి నటిగా గొప్ప పేరు రానప్పటికీ, పూర్తిగా తీసేపారేయలేకపోయారు. తెరపైన ఆమె కనబడిన విధానం, నాట్య కౌశలం ప్రేక్షకులకి, నిర్మాతలకి నచ్చాయి. అంతే! కొన్ని సంవత్సరాల పాటు ఆమె అందరినీ అలరించారు.

Exit mobile version