అలనాటి అపురూపాలు-67

1
2

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

హత్యకు గురైన నటి ప్రియా రాజ్‍వంశ్‌ని స్మరిస్తూ:

సినీరంగంలో ఉన్న 22 ఏళ్ళలో కేవలం 7 సినిమాల్లోనే నటించినప్పటికీ గొప్ప పేరు తెచ్చుకున్న నటి ప్రియా రాజ్‌వంశ్. ఆమె జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. తన పరిమితమైన కెరీర్‍లో ప్రియా హిందీ సినిమాలోని దిగ్గజాలతో పని చేశారు. ముఖ్యంగా తన భాగస్వామి, దర్శకనిర్మాత చేతన్ ఆనంద్‌తో. వాటిల్లో యుద్ధ చిత్రం ‘హకీకత్’ (1964), పునర్జన సినిమా ‘కుద్రత్’ (1981) ముఖ్యమైనవి. చేతన్ ఆనంద్‌తో సుదీర్ఘ కాలం కొనసాగిన బంధం అనంతరం… ఆమె 27 మార్చ్ 2000 నాడు హత్యకు గురయ్యారు. వంచనకి గురైన ఆమె జీవితం తాను ‘హీర్ రాంఝా’ చిత్రంలో పోషించిన హీర్ పాత్రకన్నా దారుణంగా సాగింది. వేరా సింగ్‌‌గా జన్మించిన ఆమె పేరును ప్రియా రాజ్‌వంశ్‌గా మార్చి చేతన్ ఆనంద్ సినీరంగంలో ప్రవేశపెట్టారు. ప్రవర్తనలో రాచరికం ఉట్టిపడుతుండడం, ఉచ్చారణ ఆంగ్లేయ ఉచ్చారణ వలె ఉండడంతో ఆప్త మిత్రులు ఆమెను ‘క్వీన్ ఎలిజబెత్’ అని పిలిచేవారు. చేతన్ ఆనంద్ తీసిన ‘హీర్ రాంఝా’ చిత్రంలో ప్రదర్శించిన విషాద నటన ఆమెకు ప్రశంసలు తెచ్చిపెట్టింది. తన తోటి నటీమణులు వస్త్రాలంకరణపైనా, మేకప్‍పైనా దృష్టి సారిస్తే, ప్రియా జార్జ్ బెర్నాడ్ షా గురించి, ఉర్దూ ముషాయిరాల గురించి మాట్లాడేవారు. సత్యజిత్ రే, రాజ్ కపూర్ లాంటి గొప్ప గొప్ప దర్శక నిర్మాతలు ఆమె కోసం చక్కని పాత్రలు సృష్టించి వుండేవారు, కానీ ఆమె తన కలలను – తన మార్గదర్శకుడు, జీవితభాగస్వామి కలలతో మిళితం చేసేశారు, వారి అందమైన పాలరాతి భవనం నుంచి బయటకి రాలేదు. ఆమె స్వల్ప కెరీర్‍‍ని పరిశీలిస్తే, రాజ్‌వంశ్ సినీ చరిత్రలో నిలిచిపోయేటటువంటి పాత్రలు ఏమీ పోషించలేదు. కానీ ఆమె మరణం మాత్రం చర్చనీయాంశం అయింది.

 

ప్రియా రాజ్‌వంశ్ తొలినాటి రోజుల గురించి అందరికీ బహిరంగంగా తెలిసిన వివరాలు చాలా తక్కువ. సినిమాలలో తొలి ఆఫర్ పొందకముందు ఆమె లండన్‌లోని ప్రతిష్ఠాత్మక రాయల్ అకాడమీ ఆఫ్ డ్రమాటిక్ ఆర్ట్స్ (రాడా)లో చదివారు. తన సోదరి చిన్నప్పటి నుంచి నటి కావాలని కోరుకుందని, సిమ్లా లోని పాఠశాల – ఆక్‌లాండ్ హౌస్‍లో చదువుతున్నప్పుడు విద్యలో రాణించేదని ఆమె సోదరుడు కన్వర్ సింగ్ గుర్తు చేసుకున్నారు. ఆమె సిమ్లాలోనే పుట్టి పెరిగారు. ఐక్యరాజ్యసమితి వారి తండ్రిగారిని లండన్‍లో అటవీశాఖాధికారిగా నియమించగా, ఆమె కుటుంబంతో పాటు లండన్ వెళ్లారు. లండన్‍లో ఉండగా కనిపించిన ఓ ఫోటో కారణంగా, ప్రముఖ దర్శక నిర్మాత చేతన్ ఆనంద్ (నటుడు దేవ్ ఆనంద్, దర్శకుడు విజయ్ ఆనంద్‌ల సోదరుడు) ఆమెని గుర్తించి ప్రోత్సహించడంతో, హిందీ చిత్రసీమలో ప్రవేశించి, బొంబాయి (నేటి ముంబయి)లో అడుగుపెట్టాల్సి వచ్చింది. చేతన్ ఆనంద్ తీసిన యుద్ధ చిత్రం ‘హకీకత్’ (1964) ఆమె మొదటి చిత్రం, భారతదేశంలో తీసిన మొదటి యుద్ధ చిత్రం కూడా ఇదే కావడం విశేషం! ప్రియా నటించిన మిగతా ఆరు సినిమాలకి కూడా చేతన్ ఆనంద్ దర్శకుడు కావడం మరో విశేషం. ఆమె ఇతర దర్శకుల చిత్రాలలో నటించేందుకు చేతన్ ఆనంద్ అంగీకరించలేదని ప్రియా సోదరుడు తెలిపారు. ఆమె కెరీర్‌ని సృష్టించినదీ, నాశనం చేసిందీ చేతన్ ఆనందే అంటారు. ఆయనే… ఆమె జీవితంలో ఎదురైన అతి పెద్ద విషాదం అని కూడా అంటారు. పంజాబీ జానపద కథ ఆధారంగా తీసిన ‘హీర్ రాంఝా’ (1970) ప్రియాకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆమె తరువాతి సినిమా ‘హిందూస్తాన్ కీ కసమ్’ (1973) భారత్-పాక్‍ల మధ్య యుద్ధ నేపథ్యంలో తీసినది. ఈ సినిమా వాణిజ్యపరంగా విజయం సాధించకపోయినా, దర్శకుడికి మంచి పేరు వచ్చింది. ఈ చిత్రంలో ప్రియా రెండు పాత్రలు ధరించారు. ఒకటి – సున్నితమైన రహస్యాలను తెలుసుకునేందుకు పాకిస్తాన్‍లో నియమించబడిన భారతీయ గూఢచారిణి పాత్ర. ఈ పాత్ర ఈ మధ్య కాలంలో వచ్చిన మేఘనా గుల్జార్ ‘రాజీ’ చిత్రంలో ఆలియా భట్ పాత్రని పోలి ఉంటుంది. ఆమె తరువాతి నాలుగు సినిమాలు – హస్‌తే జఖ్మ్ (1973), సాహెబ్ బహదూర్ (1977), కుద్రత్ (1981) ఇంకా, హాథోంకీ లకీరేఁ (1986). తాను నటించిన మొత్తం ఏడు సినిమాలలో ప్రియా –  ముగ్గురు ఆనంద్ సోదరులతోనూ కలిసి పనిచేశారు. చేతన్ ఆనంద్ సినిమాల్లో- ప్రియా సేవలు కేవలం నటనకి మాత్రమే పరిమితం కాలేదని, ఆమె సినిమా నిర్మాణ ప్రక్రియలో భాగం పంచుకునేవారని ఆమె సోదరుడు తెలిపారు.

ఆమె జీవితాన్ని మీడియా చిత్రీకరించిన తీరుకి కేంద్రం – చేతన్ ఆనంద్‍తో ఆమె సంబంధం. వాళ్ళిద్దరూ వివాహం చేసుకోకపోయినా, ఆయన జీవితంలో ఆమె ప్రముఖ పాత్ర వహించారు.

చేతన్ ఆనంద్‍తో ప్రియా సంబంధం గురించి మాట్లాడుతూ, ఫిల్మ్ జర్నలిస్ట్ షీలా వెసునా – వాళ్ళది లివ్-ఇన్- రిలేషన్ కాదని, గౌరవప్రదమైన సాహచర్యం అనీ, వారిది నిజమైన ప్రేమ అనీ అన్నారు. వృత్తిగత బాధ్యతల వెనుకకి కీర్తిప్రతిష్ఠలని నెట్టివేసి, జీవితాన్ని గుట్టుగా గడిపిన మనిషి ప్రియా అని చెప్పారు. 1997లో చేతన్ ఆనంద్ చనిపోయినప్పుడు, ముంబయిలోని జుహూలోని తమ బంగ్లాకి వారసులుగా తన ఇద్దరు కొడుకులు – కేతన్, వివేక్‍లతో పాటు – ప్రియా పేరు కూడా వీలునామాలో చేర్చారు.

ప్రియాకి ముంబయిలో మరో సొంత ఫ్లాటు ఉండేది. ఆమె తరచూ చేతన్ ఆనంద్ ఇంటికి వెళ్ళేవారు. ఆయన మరణం అన్నింటినీ మార్చివేసింది. చేతన్ ఆనంద్ భవనాన్ని ఆమె అమ్మాలని అనుకున్నారని అంటారు. చేతన్ ఆనంద్ కుమారులతో విభేదాలు తలెత్తాయి. చేతన్ ఆనంద్ బంగ్లాలోనే ఆమె 27 మార్చ్ 2000 నాడు హత్యకు గురయ్యారు.

రెండేళ్ళ తరువాత 31 జూలై 2002 నాడు మాలా చౌదరీ, అశోక్ చిన్నస్వామి అనే ఇద్దరు పనివాళ్ళకి ప్రియా హత్య కేసులో శిక్ష పడింది. వివేక్, కేతన్‌లపై హత్యని ప్రోత్సహించినట్టు ఆరోపణలున్నాయి. ఈ తీర్పుకి వ్యతిరేకంగా ఈ నలుగురు బాంబే హైకోర్టుకు వెళ్ళారు. 2011లో వాళ్ళకి బెయిల్ దొరికింది. ప్రస్తుతానికి ఆ కేసు పరిస్థితి ఇది.

***

తాను ఆప్యాయంగా ‘క్వీన్స్ మామ్’ అని పిలుచుకునే ప్రియా రాజ్‌వంశ్ గురించి స్క్రిప్ట్ రైటర్ మోయిన్ బేగ్ ఇలా గుర్తు చేసుకున్నారు.

“చేతన్ సాబ్ గారి ‘హాథోంకీ లకీరేఁ’ (1986) చిత్రం తీస్తున్నప్పుడు నేను ఆమెని మొదటిసారి కలిశాను. తర్వాత ఆమెకి ఉన్న మంచి మిత్రులలో నేనూ ఒకడినయ్యాను. ప్రియా బాగా చదువుకున్న వ్యక్తి. ఆమె తండ్రి సుందర్ సింగ్ ఓ ఉన్నతాధికారి. తండ్రితో కలిసి ప్రియా బీరుట్, వెనిస్ వంటి ప్రదేశాలు సందర్శించి తన జ్ఞానాన్ని పెంచుకున్నారు.

వాస్తవానికి ప్రియాని చేతన్ గారి జీవితంలోకి తెచ్చింది ఉమగారే (చేతన్ ఆనంద్ భార్య, 13 నవంబర్ 2009న మరణించారు). చండీఘర్‌లో ప్రియా చేసిన ఓ ప్రదర్శనని చూసిన ఉమ, తన భర్త విజిటింగ్ కార్డ్ ఇచ్చి – వచ్చి కలవమన్నారట. కానీ నటనలో శిక్షణ పొందేందుకు ప్రియా లండన్ వెళ్ళి రాడాలో చేరారు. అక్కడ చేరిన ఒకే ఒక భారతీయ హీరోయిన్ ప్రియా కావడం విశేషం! అక్కడ ఉంచిన ప్రియా ఫోటోలు చేతన్ ఆనంద్ దృష్టిలో పడ్దాయి. ఆయన వెంటనే బొంబాయి రమ్మని ప్రియాకి టెలిగ్రాం పంపారు. ఆయనకి తన హీర్ దొరికింది.

అయితే ‘హీర్ రాంఝా’ ఆలస్యమైంది. దానికన్నా ముందుగా ‘హకీకత్’లో నటించారు. అదే సమయంలో చేతన్ ఆనంద్ తన భార్య నుంచి విడిపోయారు. ‘హీర్ రాంఝా’ పూర్తయ్యేటప్పటికీ, ప్రియా, చేతన్‍ల మధ్య అనుబంధం దృఢమైంది. ఆమె ఆయన్ని మొదటిసారి కలిసినప్పుడు 20లలో ఉండగా, ఆయన ఆమెకంటే 16 ఏళ్ళు పెద్ద. ‘హీర్ రాంఝా’ విడుదలయ్యాకా, రాజ్ కపూర్, సత్యజిత్ రే వంటి గొప్ప గొప్ప దర్శకులు ఆమెకు అవకాశాలిచ్చారు. కానీ ఆమె చేతన్ సాబ్‌ సినిమాలకి మాత్రమే పని చేయాలని నిర్ణయించుకున్నారు. నెమ్మదిగా ఆయన సినిమాల కోసం స్క్రిప్ట్‌లు రాయసాగారు. ‘హస్‌తే జఖ్మ్’, ‘కుద్రత్’ సినిమాలకు స్క్రిప్టు అందించారు. వివాహం అనేది ఆమె మనసులోకి వచ్చినా, పిల్లలు పెద్దవాళ్లవనీ అని చేతన్ గారు అనడంతో – అది జరగలేదు. వాయిదా పడుతూ వచ్చింది. చివరికి ఆమె పరిస్థితిని గ్రహించి, ఇద్దరూ మంచి మిత్రులుగా ఉండిపోయారు. ఆయనను ఆమె తన మార్గదర్శకులుగా భావిస్తారు.

ఆమె తన రొటీన్‍లో బ్రిటీష్ వారిలా ఉంటారు. ప్రతీ మధ్యాహ్నం ‘ది షాక్’ (రుజా పార్క్‌లో సముద్రపు ఒడ్డున ఉన్న చేతన్ ఆనంద్ బంగ్లా)కి వెళ్ళేవారు. ఆ బంగ్లాలో ఇంటీరియర్ డిజైన్లు చేయించి, దాన్ని అందంగా తీర్చిదిద్దారు. చేతన్ ఆనంద్‍తో కలిసి భోం చేసి, పనుల గురించి మాట్లాడుకుని, నాలుగు గంటలకల్లా తిరిగి తన ఇంటికి… (దగ్గర లోని మంగళ్ కిరణ్ అపార్ట్‌మెంట్) వచ్చేవారు. మళ్ళీ రాత్రి ఎనిమిది గంటలకి చేతన్ ఆనంద్ కారు ప్రియాని ఎక్కించుకునేందుకు వాళ్ళ ఇంటికి వెళ్తుంది. 8.05 కల్లా ఆమె కారులో ఉండేవారు. 8.10 కల్లా చేతన్ ఇంట్లో! ఒక్కోసారి ఆమెను ఇంటి దగ్గర దింపేముందు చేతన్ ఐస్‌క్రీమ్ కొనేవారు. ఆమెకి డెసర్ట్స్, ముఖ్యంగా పుడ్డింగ్ అంటే చాలా ఇష్టం. వారిద్దరూ ఎంతో సంతోషంగా ఉండేవారు. వారి మధ్య చక్కని అవగాహన ఉండేది. ఆయన ఆమెపై పూర్తిగా ఆధారపడేవారు – అది డాక్టర్ విషయమైనా, స్క్రిప్ట్ అయినా! వాళ్ళ మధ్య కూడా వాదోపవాదాలు జరిగేవి. కోపం వచ్చినప్పుడు ప్రియా అలిగేవారు. ఆమెని సముదాయించడానికి ముద్దుపేరుతో పిలిచి, ఆమె అలక తీర్చేవారు.

 

ఆమెలో పూర్తిగా రాజసం ఉట్టిపడేది. ఆమె కారులోంచి దిగుతూ, చేయి ఊపే పద్ధతి చూసి నేను ఆమెను క్వీన్స్ మామ్ అని పిలిచేవాడిని. ఒక్కోసారి ఆమె అసలు పేరుతో పిలుస్తూ ఆమెని ఉడికించేవాడిని. ఆంటీ అని పిలిస్తే, ఒప్పుకునేవారు కాదు. ‘నేను ఆంటీని కాదు’ అనేవారు. ఆమె పెట్టే టీ గొప్పగా ఉండేది కాదు, బాగా పలచగా ఉండేది, నాకు నచ్చకపోయినా, బలవంతంగా తాగేవాడిని. ఆమె గొప్ప నర్తకి. పాశ్చాత్య నాట్యాలలోనూ చక్కని ప్రావీణ్యం ఉంది. అందరూ ఊహించినట్టు ఆమె తాగుబోతు కాదు. అప్పుడప్పుడు రెండు పెగ్గులు జిన్ తీసుకునేవారు.

చేతన్ సాబ్ జబ్బు పడినప్పుడు (ఆయనకి ఆస్తమా ఉండేది), ప్రియా గారే దగ్గరుండి సేవలు చేశారు. ఆయన మరణం అనంతరం ఆమె ఒంటరి అయ్యారు. ఆమెకి, ఆయన కుమారులకి (కేతన్, వివేక్ ఆనంద్) మధ్య సంబంధాలు బెడిసికొట్టాయి. ‘ది షాక్’ భవనాన్ని చేతన్ సాబ్ వాళ్ళు ముగ్గురి పేరిట రాశారు. ఆ భవనాన్ని అమ్మే ఉద్దేశం లేకపోతే, తన వాటా సొమ్ము తన కిచ్చేయమని ప్రియా వాళ్ళని అడిగారట. తాను ప్రపంచమంతా తిరగాలనేది ఆమె కోరిక. ఆ ఇంటికి వెళ్ళద్దని మేం చెబుతుండేవాళ్ళం. కానీ ఆమె వినేవారు కాదు. ‘ఆయనకి నా జీవితం ధారపోశాను, నాకు అక్కడికి వెళ్ళే హక్కుంది’ అనేవారు. ముందు రాత్రి నన్ను కలిసినా, మళ్ళీ పొద్దున్నే పదిన్నరకి ఫోన్ చేసి పదకొండున్నర వరకు మాట్లాడేవారు. ‘సాధారణంగా ప్రజలు మాట్లాడడానికి ఇష్టపడతారు, కానీ మోయిన్ నువ్వు మంచి శ్రోతవి’ అనేవారు.

ఆమె చనిపోయే ముందు కూడా నన్ను వాళ్ళింటికి రమ్మని పిలిచారు. మంచం మీద కూర్చోబెట్టి, బ్యాంకు కాయితాలు, లాకర్ కీస్, వీలునామా ఉన్న కప్‍బోర్డ్ తెరిచి చూపించేవారు. గోడ మీద పింగాణీతో చేసిన వినాయకుడి బొమ్మ ఉండేది. దాన్ని తిప్పి చూడమన్నారు. వెనుక ఒక మూత ఉంది. ఆ బొమ్మలో ఆమె తన బంగారునగలను దాచారు. వాటిని తన సోదరుల (కమల్‍జిత్ సింగ్, పదంజీత్ సింగ్‍) పిల్లలకు అందజేయమన్నారు. ఆ దుర్ఘటన జరిగిన రోజున (27 మార్చ్ 2000 నాడు ఆమె హత్యకి గురయ్యారు) ముంబయిలో బంద్ జరిగింది. వార్త తెలిసిన వెంటనే అక్కడికి వెళ్ళలేకపోయాను. ఆమె ఆ సాయంత్రం తన పొరుగున ఉండే మహరాణి (భావ్‍నగర్‌కి చెందిన బ్రిజ్‌రాజ్ నందినీదేవి) ఇంట్లో గడపాలి. కానీ అలవాటుగా, ఒక్కర్తే ‘ది షాక్’‌కి వెళ్ళారు… మిగిలినదంతా చరిత్రే! ఆమె మరణ వార్త తెలియగానే విపరీతమైన ఆందోళనకు లోనయ్యాను. కానీ నన్ను నేను సంబాళించుకుని, ఆమె ఇంట్లోని విలువైన వస్తువులన్నీ ఆమె సోదరులకి అందజేశాను. స్నేహితులతో కలిసి ఆమె అంత్యక్రియలకి ఏర్పాట్లు చేశాము. నాల్గవరోజున మిత్రుడు అనూప్ జలోటా భజనలు పాడారు…”

***

ప్రియా గురించి ఆమె పొరుగింటి నివాసి, మహారాణి సంయుక్త కుమారి ఇలా చెబుతున్నారు:

“మా అత్తమామలు భావ్‍నగర్ మహారాజా, మహారాణిలు – డా. వీర్‍భద్ర సింగ్, బ్రిజ్‌రాజ్ నందినీదేవిలతో ప్రియా స్నేహంగా ఉండేవారు (వారివురు ఇప్పుడు లేరు). జుహులో మా బంగ్లా చేతన్ ఆనంద్ గారి ‘ది షాక్’కి సరిగ్గా ఎదురుగా ఉంటుంది. ఒక రోజు సాయంత్రం ప్రియా మా ఇంటికి వస్తే, మర్నాడు సాయంత్రం మేం వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్లం. సంస్కృతి, కవిత్వం, కళలు మమ్మల్ని దగ్గర చేశాయి.

నాకు పెళ్ళయినప్పుడు 20 ఏళ్ళు. నా భర్త (ఇప్పుడు విడిపోయారు) విజయ్‌రాజ్ సింగ్‌కి 21 ఏళ్ళు. మా అత్తమామలను చూడ్డానికి తరచూ, కవులు, రచయితలు, గాయకులు వచ్చేవారు. అందుకని అత్తమామలతో గడపడం మాకు సరదాగా ఉండేది. అలాగే జగ్జీత్ జీ, అనూప్ జీ, హరిహరన్ గారు చేతన్ గారి బంగ్లాకి వస్తూండేవారు. ఓరోజు సాయంత్రం అనూప్ జీ ‘చౌదవీ కా చాంద్’ పాట పాడడం నాకింకా గుర్తుంది. విజయ్ ఆనంద్, చేతన్ ఆనంద్ తత్వశాస్త్రం గురించి, మతం గురించి, రాజకీయాల మాట్లాడుకునేవారు. రాత్రి ఎంత ఆలస్యమైనా ప్రియాగారు మాత్రం ‘ది షాక్’లో ఉండేవారు కాదు, అర్ధరాత్రి రెండు గంటలయినా, తన ఇంటికి వెళ్ళిపోయేవారు. తనకంటూ పరిధిలు గీసుకుని వాటిలోనే ఉండేవారామె.

ప్రియాకి మా మావయ్యగారి దగ్గర చనువెక్కువ. వాళ్లిద్దరూ తోటలోగాని వరండాలోని కూర్చుని నిశ్శబ్దంగా జిన్ తాగుతూ సముద్రపు అలల్ని ఆస్వాదించేవారు. నా పెళ్ళయిన అయిదేళ్ళకి మావయ్యగారు చనిపోయారు. మావయ్యగారు పోయాకా, ప్రియా అత్తయ్యగారితో సాన్నిహిత్యం పెంచుకున్నారు. ప్రియా పుస్తకాల పురుగు. నాక్కూడా పుస్తకాలంటే ఇష్టం. నా దగ్గర నుంచి ఎన్నో పుస్తకాలు తీసుకునేవారు ప్రియా. వాటిని తిరిగి ఇస్తానన్న సమయానికి అంతే భద్రంగా తిరిగి ఇచ్చేవారు. ఒకవేళ ఒకటి రెండు రోజులు ఆలస్యమైతే, మన్నించమని అడిగేవారు. ఆమె నడత, క్రమశిక్షణ ఎంతో గొప్పవి. మా ఇంటికి డ్రింక్‍కి వస్తానని చెప్పిన సమయానికి తప్పకుండా వచ్చేవారు.

ఆమె జీవితమంతా ‘ది షాక్’ చుట్టూ గడిచింది. ఆమె ఎంతో రొమాంటిక్ వ్యక్తి. తారలు కనబడి మాయమయ్యే ఈ ప్రపంచంలో ఆమె తన మనిషికి (చేతన్ ఆనంద్‌) కట్టుబడ్డారు. ఆయనతో ఉన్న సంబంధం కారణంగా, ఆయన సినిమాలకే పరిమితం అయ్యారు. తన అభిమానుల్లో ఎంతటి గొప్ప గొప్పవారున్నా, ఆమె పట్టించుకోలేదు. వాళ్ళలో మిస్టర్ దిన్‌షా అని ఒక పార్శీ ఉండేవారు. ఓ రోజు ఏదో మాట్లాడుతా “జార్జ్ బెర్నాడ్ షా లాంటి వాళ్ళు ఎందుకు లేరు?” అని ప్రియా అంటే, మోయిన్ చనువుగా “దిన్‍షా ఉన్నారుగా” అన్నారు.

చేతన్ సాబ్ మరణం తర్వాత ఆమె ఒంటరి అయ్యారు. తన ఆస్తులని సంబాళించుకోవాలని అనుకున్నారు, మా మేనేజర్ కాస్త సాయం చేశారు. కొన్ని ఇన్వెస్ట్‌మెంట్‌లలో మా అత్తగారిని నామినీగా ఉంచారు ప్రియా. అత్యంత పొదుపుగా కఠినమైన జీవితం గడిపేవారు. “మీ హ్యాండ్ బ్యాగ్ ఇప్పటికైనా మారుస్తారా?” అని మోయిన్ హాస్యమాడేవారు. తనకంటూ ఎంత ఉన్నా, పొదుపు చేయాలని చూసేవారు. తగినంత లిక్విడిటీ లేకపోవడంతో ఆమె అభద్రతాభావానికి గురయ్యేవారు. ఆమె చనిపోయిన రోజున సాయంత్రం డ్రింక్‌కి మా ఇంటికి రావలసి ఉంది. ఆమె చెప్పిన సమయానికి రాలేదు. ఆశ్చర్యమనిపించి, ఏమైందో చూడమని మా వాచ్‍మన్‌ని పంపించాం. వచ్చేస్తారని పనిమనిషి చెప్పి పంపించింది. కానీ ఆమె రాలేదు. కాసేపాగి మళ్ళీ వాచ్‌మన్‍ని పంపిస్తే, మేడం స్పృహ కోల్పోయారని చెప్పింది. నేనూ, నా భర్త, అత్తగారు వాళ్ళింటికి పరిగెత్తాం…. మిగిలినదంతా… విషాదమే.

 

నేను ఆమె కాళ్ళూ చేతులు రుద్దాను, కానీ అప్పటికే ప్రియా మరణించారు. చాలా కాలం వరకు నేను ఆమె మరణాన్ని తట్టుకోలేకపోయాను. ఆ సమయంలో నేను రాత్రిళ్ళు బెడ్ లైట్ వేసుకుని పడుకునేదాన్ని. మనశ్శాంతి కోసం ఎన్నో సాయంత్రాలు హరే రామ హరే కృష్ణ మందిరంలో కూర్చునేదాన్ని. ప్రియా పర్వత ప్రాంతాలకి చెందినవారు. నేను కూడా అంతే. మా తల్లిదండ్రులు హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో కాంగ్రా లోయలో ఉంటారు. ఉత్తర భారతదేశంలో పెరిగిన ప్రియా, తరచూ పర్వతాల గురించి మాట్లాడేవారు. అప్పర్ ధర్మశాలలోని సెయింట్ జాన్స్ చర్చ్ తనకి ఎంత ఇష్టమో చెప్పేవారు. అక్కడ ఒక స్మారక చిహ్నం నిర్మిస్తే, ఆమెకు చక్కని నివాళి అవుతుందని భావించాము. ఆమె పుట్టినరోజు (డిసెంబరు 30) నాటికి, నాన్న (మేజర్ వీర్ సింగ్) సహకారంతో మేము ఆమె స్మారక చిహ్మం నిర్మించగలిగాం. ఆమె ఆత్మకి శాంతి లభిస్తుందని ఆశిస్తున్నాం…”


హాలీవు‍డ్‌లో తొలి మహిళా దర్శకులురాలు – ఇడా లుపినో

ఇడా లుపినో (జననం: 4 ఫిబ్రవరి 1918, లండన్, ఇంగ్లాండ్. మరణం 3 ఆగస్టు 1995, కాలిఫోర్నియా, యు.ఎస్.ఎ) బహుముఖ ప్రజ్ఞాశాలి. ఇంగ్లండ్‍లో జన్మించిన అమెరికన్ ఫిల్మ్, టెలివిజన్ నటి, దర్శకురాలు, స్క్రీన్ రైటర్. తెరపై బలమైన, తెలివైన పాత్రలను పోషించారు. హాలీవుడ్‌లో తొలి దర్శకురాలు అయ్యారు.

ఇడా ఇంగ్లాండ్‍లోని సుప్రసిద్ధమైన రంగస్థల కళాకారుల కుటుంబంలో జన్మించారు. బాలనటిగా తన తండ్రి నిర్మించిన మోడల్ థియేటర్‍లో వేదికపై నటించారు. 13 ఏళ్ళ వయసులో రాయల్ అకాడమీ ఆఫ్ డ్రమాటిక్ ఆర్ట్‌లో ప్రవేశించారు. తొలి చిత్రం Her First Affaire (1932) తరువాత, ఎన్నో చిత్రాలలో చిన్నా చితకా పాత్రలలో నటించారు. The Light That Failed (1939) లో వేసిన వేశ్య పాత్ర ఆమెకి గుర్తింపు తెచ్చింది. అలాగే They Drive by Night (1940) చిత్రంలో ధరించిన పాత్రలో ఆమె ఉత్తమ నటన కనబరిచారు. తరువాత High Sierra (1941) అనే క్రైమ్ డ్రామా హంఫ్రే బోగార్ట్‌ సరసన నటించారు. జాక్ లండన్ నవల ఆధారంగా తీసిన The Sea Wolf (1941) చిత్రంలో నేరస్థురాలిగా నటించారు. Ladies in Retirement (1941) అనే చిత్రంలో హత్యలు చేసే పనిమనిషిగా నటించారు. The Hard Way (1943) చిత్రంలో తన సోదరిని బలవంతంగా వినోదరంగంలో ప్రవేశపెట్టే పాత్రలో ఇడా రాణించారు.

దర్శకత్వం వైపు:

ఆమె తన రెండవ భర్త (మొదటి భర్త లూయిస్ హేవార్డ్) కోలియర్ యంగ్‌తో కలిసి 1949లో ఒక ప్రొడక్షన్ కంపెనీ స్థాపించారు. రేప్, అక్రమ సంబంధాలు, మారుమనువులు వంటి వివాదాస్పద అంశాలతో స్క్రిప్ట్‌లు రూపొందించారు. వారి మొదటి ప్రాజెక్టు పెళ్ళి కాని ఓ తల్లి కథ. Not Wanted (1949) అనే ఈ చిత్రానికి ఇడా నిర్మాతగా వ్యవహరించగా, పౌల్ జారికో స్క్రిప్టులో సాయం చేశారు. చిత్రీకరణ సగంలో ఉండగా, దర్శకుడు ఎల్మర్ క్లిఫ్టన్ జబ్బు పడగా, ఇడా చిత్రీకరణ పూర్తి చేశారు. కాని క్రెడిట్ తీసుకోలేదు. Never Fear (1949; The Young Lovers అనే పేరు కూడా ఉంది) అనే చిత్రం ద్వారా అధికారికంగా దర్శకురాలు అయ్యారు ఇడా. Not Wanted లో నటించిన శాలీ ఫారెస్ట్ ఈ చిత్రంలో పోలియో బారిన పడిన నర్తకిగా నటించారు. 1943లో Dorothy Arzner రిటైర్ కాగా, ఇడా అధికారికంగా హాలీవుడ్‍లో తొలి దర్శకురాలయ్యారు. 1950లో ఆమె డైరక్టర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికాలో సభ్యత్వం లభించిన రెండవ మహిళ అయ్యారు.

RKO సంస్థ తమ చిత్రాలను పంపిణీ చేసేట్టుగా ఇడా వారి నిర్మాణ సంస్థ ఒప్పుందం చేసుకుంది. ఈ రెండు సంస్థలు కలిసి తీసిన మొదటి సినిమా Outrage (1950). రేప్‌కి గురైన ఓ యువతి కథ ఇది, ఆ పాత్రలో మాలా పవర్స్ నటించారు. ఈ చిత్రానికి ఇడా, యంగ్, మాల్విన్ వాల్డ్ స్క్రిప్టు నందించారు. 1951లో రెండవ భర్త యంగ్‌తో విడాకులు తీసుకున్నా, వారి మధ్య వృత్తిపరమైన సంబంధం కొనసాగింది. వీళ్ళ తరువాతి చిత్రం Hard, Fast and Beautiful (1951). టెన్నిస్ ఆడే కూతురిని (ఫారెస్ట్) విపరీతమైన ఒత్తిడికి గురిచేసే తల్లి (క్లెయిర్ ట్రెవర్) కథ ఇది. ఇడా దర్శకత్వం బాగున్నా, బలహీనమైన స్క్రిప్ట్ కారణంగా ఈ సినిమా పరాజయం పాలయ్యింది. అప్పటికి ఇంకా నటిస్తున్న ఇడా ఓ పోలీస్ డిటెక్టివ్ (రాబర్ట్ ర్యాన్) మానసిక గాయాలను మాన్పే అంధురాలి పాత్రలో On Dangerous Ground (1951) అనే చిత్రంలో నటించారు. కానీ ఈ చిత్ర దర్శకుడు నికోలస్ రే నరాల వ్యాధికి లోనవడంతో, ఇడా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

ఆమె దర్శకత్వం వహించిన మాస్టర్ పీస్ The Hitch-Hiker 1953లో విడుదలై ఘన విజయం సాధించింది. 71 నిమిషాల ఈ సినిమా ప్రేక్షకులకు టెన్షన్ కలిగించింది. ఇద్దరు స్నేహితులు (ఫ్రాంక్ లవ్‌జాయ్, ఎడ్మండ్ ఓ బ్రియాన్) చేపలు పట్టడానికి వెళ్తే అక్కడ వారికి హత్యానేరంపై పోలీసులు వెతుకుతున్న ఓ సైకోపాత్ (విలియం టాల్‌మన్) తారసపడతాడు. ఓ మహిళ దర్శకత్వం వహించిన తొలి క్రైమ్ సినిమాని దీనిని భావిస్తారు. RKO సంస్థలో ఇడా, యంగ్ విడిపోయాక, ఆమె The Bigamist (1953) చిత్రంలో నటించి దర్శకత్వం వహించారు. అప్పుడప్పుడు తాగి మత్తుగా ఉండే – ఇద్దరు భార్యల (ఇడా, జోన్ ఫాన్‌టైన్)- వ్యాపారస్థుడి (ఓ బ్రియన్) కథ ఇది.

తదుపరి కృషి:

ఆ తర్వాత మరో 13 ఏళ్ళ వరకూ మరో చిత్రానికి దర్శకత్వం వహించకపోయినా, ఆమె తీరిక లేకుండా గడిపారు. 1956లో ఆమె టివి ఎపిసోడ్లకు దర్శకత్వం వహించడం ప్రారంభించి 40కి పైగా ప్రోగ్రామ్స్ చేశారు. వీటిలో The Donna Reed Show, Alfred Hitchcock Presents, Have Gun—Will Travel, The Fugitive, Dr. Kildare, The Twilight Zone, Bewitched, and Gilligan’s Island వంటివి ముఖ్యమైనవి. ఇవేకాకుండా టీవీ కోసం తీసిన అనేక పలు సినిమాలకు దర్శకత్వం వహించారు.

ఆ సమయంలో ఇడా నటిస్తునే ఉన్నారు. ఆమె గొప్పగా నటించిన చిత్రాల్లో Women’s Prison (1955) ఒకటి. ఇందులో ఆమె శాడిస్టిక్ వార్డెన్‍గా నటించారు. Clifford Odets నాటకం ఆధారంగా తీసిన The Big Knife (1955) చిత్రంలో ఆమె మోసగాడైన నటుడి భార్యగా నటించారు. Fritz Lang దర్శకత్వంలో వచ్చిన While the City Sleeps అనే క్రైమ్ సినిమాలో నటించారు. Four Star Playhouse (1953–56) అనే టీవీ సీరియల్ నటించారు. Mr. Adams and Eve (1957–58) అనే టీవీ సీరియల్‍లో తన మూడవ భర్త Howard Duff తో కలిసి నటించారు. ఇంకా, గెస్ట్ స్టార్‌గా ఎన్నో టీవీ కార్యక్రమాలలో నటించారు. 1966లో ఆమె తన చివరి సినిమాగా The Trouble with Angels అనే హాస్య చిత్రానికి దర్శకత్వం వహించారు. పెన్‌సిల్వేనియాలోని ఓ కాన్వెంట్ స్కూల్‌లో మదర్ సుపీరియర్ (రోజాలిండ్ రసెల్) ని ఇబ్బందిపెట్టే టీనేజ్ బాలిక (హేలీ మిల్స్) కథ ఇది. 1968లో దర్శకత్వం నుంచి విరమించుకున్నాకా, ఆమె పలు టీవీ షోలలో ముఖ్యపాత్రలలో నటించారు.

తరువాత నటన పై దృష్టి సారించి, ఎన్నో టీవీ షోలలో నటించారు. వాటిల్లో The Streets of San Francisco, Columbo, Ellery Queen, and Charlie’s Angels వంటివి ముఖ్యమైనవి. 1972లో Sam Peckinpah దర్శకత్వంలో వచ్చిన Junior Bonner చిత్రంలో ఇడాకి చక్కని తల్లి పాత్ర లభించింది. 1975 పలు ఆరోగ్య సమస్యలు వెంటాడాయి. My Boys Are Good Boys (1978) చిత్రంలో నటించాకా, ఆమె నటన నుంచి పూర్తిగా విరమించుకున్నారు. 2011లో ఆమె మరణాంతరం ఆమె జీవిత చరిత్ర Ida Lupino: Beyond the Camera వెలువడింది (మేరీ యాన్ అండర్సన్ సహరచయిత్రి).

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here