Site icon Sanchika

అలనాటి అపురూపాలు-69

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

గాయని హెలెన్ కేన్, బెట్టీ బూప్ వివాదం:

హెలెన్ క్లేర్ ష్రోడర్ అనే పేరుతో జన్మించిన హెలెన్ కేన్ – బ్రాంక్స్ లోని సెయింట్ అన్‌సెల్మ్స్ పారోచియల్ స్కూల్‍లో చదివారు. ముగ్గురు పిల్లలో ఆమె అందరికంటే చిన్న. జర్మనీ వలసవాది కొడుకైన ఆమె తండ్రి లూయిస్ ష్రోడర్‍కి నిలకడైన ఉద్యోగం ఉండేది కాదు. తల్లి ఎల్లెన్ (డిక్సన్) ష్రోడర్ ఐర్లాండ్ నుంచి వలస వచ్చారు. ఆమె ఒక లాండ్రీ షాప్‍లో పనిచేసేవారు. స్కూల్‌లో కేన్ తొలిసారిగా రంగస్థలంపై ఒక రాణి పాత్ర వేస్తున్నప్పుడు, ఆమె దుస్తుల కోసం తల్లి అయిష్టంగానే మూడు డాలర్లు ఇచ్చారు. తనకి 15 ఏళ్ళు వచ్చేసరికి కేన్ ప్రొఫెషనల్ స్టేజ్ ఆర్టిస్ట్ అయ్యారు. Orpheum Circuit థియేటర్‌లలో మార్క్స్ బ్రదర్స్‌తో ‘ఆన్ ది బాల్కనీ’ ప్రదర్శించారు. 1920 తొలినాళ్ళలో వాడెవిల్లే బృందంతో పర్యటిస్తూ ‘All Jazz Revue’ అన్న ప్రదర్శనలో గాయనిగా, కిక్‍లైన్ డాన్సర్‌గా వ్యవహరించారు. 1921లో తొలిసారిగా న్యూ యార్క్ పాలెస్ థియేటర్‍లో నటించారు. అక్కడే ఆమె ప్రసిద్ధి చెందారు, ‘స్టార్స్ ఆఫ్ ది ప్యూచర్’తో కలిసి పనిచేశారు (1922-24, తిరిగి 1927 తొలినాళ్ళు). హామిల్టన్ సిస్టర్స్, ఫోర్డిస్‌లతో కలిసి తొలినాళ్ళలో పాడారు. తరువాతి కాలంలో వీరు ‘త్రీ ఎక్స్ సిస్టర్స్’గా పేరుగాంచారు.

1920 తొలినాళ్ళలో కేన్ రూమ్‌మేట్‌గా జెస్సీ ఫోర్డిస్ ఉండేవారు. నిజానికి ‘సింగింగ్ ట్రియో’గా ఉండాల్సింది హామిల్టన్ సిస్టర్స్, కేన్. కానీ థియేటర్ సీజన్ ముగిసాకా, పర్యటనకి పంపిస్తూ… చివర్లో ఏం జరుగుతుందో చూద్దాం అని పెరల్ హామిల్టన్ – ఫోర్డిస్‍ని ఎంచుకున్నారు.  కేన్ కెరీర్‍లో మంచి బ్రేక్ 1927లో వచ్చింది. ‘ఎ నైట్ ఇన్ స్పెయిన్’ అనే మ్యూజికల్‌లో ఆమె పాల్గొన్నారు. ఆ కార్యక్రమం 3 మే 1927 నుంచి 12 నవంబర్ 1927 వరకు సాగింది, న్యూయార్క్ లోని 44 స్ట్రీట్ థియేటర్‍లో మొత్తం 174 ప్రదర్శనలు. అనంతరం, పాల్ యాష్ అనే మ్యూజిక్ కండక్టర్, న్యూ యార్క్ లోని పారమౌంట్ థియేటర్‍లో ప్రదర్శననిచ్చేందుకు కేన్‍ పేరు ప్రతిపాదించారు. టైమ్ స్క్వేర్ సమీపంలోని పారమౌంట్ థియేటర్‍లో ఇచ్చిన తొలి ప్రదర్శన కేన్ కెరీర్‍ని మలుపు తిప్పింది. అప్పుడామె ‘That’s My Weakness Now’ అనే పాట పాడుతున్నారు, అప్పుడే ఆమె స్కాట్ లిరిక్స్ లోని ‘బూప్-బూప్-ఎ-డూప్’ అనే పదబంధాన్ని మధ్యలో చేర్చి పాడారు. ఇది flapper culture కి బాగా నప్పడంతో, నాలుగు రోజుల తర్వాత కేన్ పేరు మారుమ్రోగిపోయింది.

1928 నాటి ఆస్కార్ హామ్మర్‌స్టీన్ వారి ‘గుడ్ బాయ్’ ప్రదర్శనలో ఆమె తొలిసారిగా ‘I Wanna Be Loved by You’ అనే పాట పాడారు. అది జనాదరణ పొందింది. తరువాత పాలెస్‍లో అది ముఖ్య ప్రదర్శనగా నిలిచి వారానికి 5000 డాలర్లు వసూలు చేసింది. ఒక రాత్రి జరిగిన ప్రదర్శనలో ఆమె తన నేస్తాలు ‘త్రీ ఎక్స్ సిస్టర్స్’తో (హామిల్టన్ సిస్టర్స్, ఫోర్డిస్‌) పాడారు. 1935లో ఓ రంగస్థల ప్రదర్శనలో తమ విశిష్టమైన చమత్కారాన్ని కొత్త బాణీగా మార్చి ‘The Preacher and the Bear’ పాడారు. వాడెవిల్లే బృందంతో కేన్ అలవర్చుకున్న పదసరళి, తానం, టైమింగ్ అద్భుతంగా ఉండేవి. ఆమె పాటల్లో పదాలు స్పష్టంగా ఉండేవి, ఆకర్షించే స్వరం ఆమెది. 1920ల నాటి పలు సొగసైన శైలులను మిళితం చేసేవారామె. ఇందులో స్కాట్ సింగింగ్ ఒకటి… దీనిలో గాత్రాన్ని మెరుగుపరుస్తూంటారు; మరొకటి మాటలని, పాటని మిళితం చేయడం. Sprechgesang (“speech-song”) అనేది అప్పటి జర్మనీలోని వీమర్ రిపబ్లిక్ లోని నైట్ క్లబ్బుల పాటలోనూ, సాధారణ సంగీతంలోనూ ప్రజాదరణ పొందిన పద్ధతి.

1928-1930 నడుమ ఆమె 22 పాటలు రికార్డు చేశారు. 1930 నుంచి 1951 వరకు ఆమె కొలంబియా రికార్డ్స్ వారికి నాలుగు సింగిల్స్ రికార్డ్ చేశారు. ‘Three Little Words’ అనే పాట మాత్రమే కాకుండా, ‘I Wanna Be Loved by You’ సౌండ్ ట్రాక్ సింగిల్ కూడా రికార్డ్ చేశారు. 1954 MGM 45 Ep కోసం ‘ది బూప్-బూప్-ఎ-డూప్ గర్ల్’ పేరిట నాలుగు పాటలు పాడారు.

1930లో ఫ్లీషర్ స్టూడియోస్ యానిమేటర్ గ్రిమ్ నాట్విక్ మొదట హెలెన్ కేన్‍ని దృష్టిలో ఉంచుకుని టాకార్టూన్స్ వారి ‘డిజ్జి డిషెస్’ కోసం ‘బెట్టీ బూప్’ పాత్రను వేలాడే చెవులతో, కీచుమని పాడే చిన్న కుక్కగా గీసారు. ఈ పాత్ర సుప్రసిద్ధమయింది. 1932లో ‘బెట్టీ బూప్’ పాత్రను స్త్రీ పాత్రగా మార్చారు. పొడవాటి వేలాడే చెవులు గుండ్రటి చెవిరింగులుగా మారాయి. 1932 మే లో ‘బెట్టీ బూప్’ కార్టూన్‌ని తప్పుడు పద్ధతులలో వాడుతున్నారనీ, తనకి అనుచిత పోటీగా మారుస్తున్నారనీ, హెలెన్ కేన్ పారమౌంట్ పైనా, మాక్స్ ఫ్లీషర్ పైనా 2,50,000 డాలర్లకి కేస్ వేశారు. ఆ కేసులో వాదోపవాదాలు అదే ఏడాది మొదలయ్యాయి. న్యాయమూర్తి ఒక్కరే హెలెన్ కేన్ చిత్రాలను, బెట్టీ బూప్ కార్టూన్‌లను వీక్షించారు. వేరే జ్యూరీని పిలవలేదు. బోనీ పో, కేట్ రైట్, మార్గీ హైన్స్, ముఖ్యంగా మే క్వెస్టల్‍లను సాక్ష్యానికై పిలిచారు. ఈ కేసు రెండేళ్ళకు పైగా సాగింది, తీర్పు కేన్‍కు వ్యతిరేకంగా వచ్చింది. తను పాడే శైలి విశిష్టమైనదనీ, అనుకరణ కాదనే వాదనని కేన్ నిరూపించలేకపోయారు. డిఫెన్స్ న్యాయవాది పాటలలో ‘బూపింగ్’ అనేది ‘బేబీ ఎస్తర్’ అనే ఆఫ్రికన్-అమెరికన్ గాయని ప్రవేశపెట్టిందని నిరూపించారు. డిఫెన్స్ వారి ముందు థియేటర్ మేనేజర్ లూ వాల్టన్ తాను 1925లో ‘ఎస్తర్’ అనే ఒక నీగ్రీ బాలికకి – తన పాటలో స్కాట్ సింగింగ్ జోడిస్తూ వేరే పదాలు చేర్చి ఎలా పాడాలో నేర్పించానని సాక్ష్యం చెప్పారు. అదే తరువాతి కాలంలో ‘బూప్-ఊప్-ఎ-డూప్’ గా మారిందని చెప్పారు. జోన్ మేనేజర్ – తాను, కేన్ ఆ ప్రదర్శనని 1928 ఏప్రిల్‍లో స్వయంగా తిలకించామని సాక్ష్యం చెప్పారు. ఆ తరువాత కొన్ని వారాలకే కేన్ పాటలలో ‘బూపింగ్’ చేయడం ప్రారంభించారని అన్నారు. ఈ విధంగా ఈ వివాదానికి ముగింపు లభించింది.

మరిన్ని వివరాల కోసం ఈ క్రింది యూ-ట్యూబ్ లింక్‍లు చూడండి.

https://www.youtube.com/watch?v=JS3Jpe2TGxI

https://www.youtube.com/watch?v=Rz_7Gvej8h4

https://www.youtube.com/watch?v=OuZy1zAfsU8


జంట సంగీత దర్శకులు సోనిక్ ఓమీ:

సినిమా రంగంలో పలు శాఖలలో స్నేహితులు, బంధువులు కలిసి పనిచేయడం కొత్త కాదు. ఆ కోవకే చెందుతారు జంట సంగీత దర్శకులు సోనిక్ ఓమీ. వీరిద్దరూ రక్త సంబంధీకులు. మాస్టర్ మనోహర్ లాల్ సోనిక్ మామ కాగా, ఓం ప్రకాశ్ సోనిక్ మేనల్లుడు. స్వరకర్తలుగా వారి తొలి చిత్రం ‘దిల్‍ నే ఫిర్ యాద్ కియా’.

సోనిక్ (24 నవంబర్ 1923 – 9 జూలై 1993) పాకిస్తాన్ లోని సియాల్‍కోట్‍లో జన్మించారు. మూడేళ్ళ వయసులో కంటికి ఇన్‌ఫెక్షన్ సోకగా, వైద్యులు సరైన చికిత్స చేయకపోవడంతో కన్ను పోయింది. తర్వాత మరో కంటి చూపు సైతం పోయింది. పూర్తిగా అంధులయ్యారు. 1943నాటికి బ్రెయిలీ స్కూల్‍లో మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. విష్ణు దిగంబర్ గాంధర్వ మహా విద్యాలయలో సంగీతం నేర్చుకున్నారు. బడే గులామ్ ఆలీ ఖాన్ వద్ద శిష్యరికం చేశారు. వారిని సినీ సంగీతం బాగా ఆకర్షించింది. 1942 నాటి పంజాబీ చిత్రం ‘మంగ్తీ’కి అమర్‍నాథ్ సంగీతం సమకూర్చారు (అమర్‍నాథ్ అంటే హుస్న్‌లాల్ భగత్రమ్ అన్నయ్య). సోనిక్ అమర్‍నాథ్ వద్ద సహాయకుడిగా చేరి ‘ధాత్రి’, ‘షెహర్ సే దూర్’ వంటి చిత్రాలకు పని చేశారు. దేశ విభజన తర్వాత ఆయన ఢిల్లీకి వచ్చేసారు. హెచ్.ఎం.వి.లో చేరి కన్వర్ మనోహర్ పేరిట ఆల్బమ్స్ రూపొందించారు. తాను స్వరపరిచిన గీతాలను ఆలపించారు. 1949లో ఆయన బొంబాయికి మారారు. అక్కడ గాయకుడిగా విజయవంతమయ్యారు. కిశోర్ సాహు గారి ‘సావన్ ఆయా రే’లో ఒక పాట, ‘మీనా బజార్’ చిత్రంలో లతా మంగేష్కర్‍తో ఓ యుగళ గీతం పాడారు. 1951లో ‘భక్తి’ చిత్రంతో స్వరకర్త అయ్యారు, 1952 నాటి ‘మాత’ చిత్రానికి సంగీతం అందించారు. కానీ ఈ సినిమాలు విజయవంతం కాలేదు. నిరాశ చెందిన సోనిక్ హార్మోనియం వాయిద్యగాడిలా స్థిరపడాలనుకున్నారు. ఆయన ప్రతిభ ఎలాంటిదంటే – ఒకానొక సమయంలో మొత్తం చిత్రసీమలోని 80% సినిమాలకు ఆయనే హార్మోనియం వాయించారు. అతి త్వరలోనే ఆయన ‘అరేంజర్’‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. సంగీత దర్శకులు అందించిన మౌలిక బాణీని మరింత అందంగా చేసి విస్తృత పరచడం ఆయన బాధ్యత. ‘అజీ బస్ షుక్రియా’ చిత్రానికి ఆయన మొదటిసారిగా కౌంటర్ మెలడీ అందించారు, ఈ చిత్రానికి రోషన్ సంగీత దర్శకులు.

వీరి మేనల్లుడు ఓమ్ (13 జనవరి 1939 – 7 జూలై 2016) కూడా సియాల్‍కోట్‍లోనే జన్మించారు. ఆయన కుటుంబంతో సహా ఢిల్లీ వచ్చేసి, లజ్‍పత్‍నగర్ ప్రాంతంలో నివసించసాగారు. ఈ కుటుంబమంతా పాకిస్తాన్ లోని సియాల్‌కోట్ నుంచి ఢిల్లీ వలస వచ్చారు. తర్వాతి కాలంలో బొంబాయికి మారారు.

ఈ ద్వయంలో సోనిక్ సృజనాత్మక పనుల బాధ్యతలు చూసుకుంటే, ఓమీ వ్యాపార లావాదేవీలు చూసుకునేవారు. మాస్టర్ సోనిక్‌కి 1959లో సంతోష్ గారితో వివాహమైంది. వారికి నలుగురు సంతానం – సీమా సోనిక్ అలిమ్‍చంద్, సంగీతా సోనిక్, సంధ్యా సోనిక్ మామిక్, సుష్మా సోనిక్ కన్సారా. వీరి మనవడు అమ్మన్ అద్వైత కూడా దర్శకనిర్మాత. స్వరకర్త హితేష్ సోనిక్ మరో సమీప బంధువు, ఇతని భార్య ప్రముఖ గాయని సునిధి చౌహాన్.

ఓం ప్రకాష్ సోనిక్ దంపతులకు నలుగురు పిల్లలు జన్మించినా, ఇద్దరే బ్రతికారు. సోమ్ సోనిక్ (నమ్రతా సోనిక్ ఇతని భార్య), సుధా చడ్డా (ఈమె భర్త రాజేంద్ర చడ్డా). సోమ్, నమ్రతలకు ఇద్దరు పిల్లలు (నిఖిల్ సోనిక్, కరణ్ సోనిక్); రాజేంద్ర, సుధ లకు ఇద్దరు పిల్లు (రిషబ్ చడ్డా, శివాని చడ్డా).

ఓం ప్రకాశ్ సోనిక్ కుటుంబం నుంచి మరో బంధువు కూడా సినీరంగంలో ఉన్నారు. అతని పేరు మాన్ సింగ్, తరువాతి కాలంలో రానా ప్రతాప్ సింగ్‍ అని పేరు మార్చుకున్నారు. ఈయన మోహన్ సిన్హా‍కి అల్లుడు, విద్యా సిన్హా‍కి తండ్రి.

Exit mobile version