అలనాటి అపురూపాలు-72

1
2

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

తన జీవితం గురించి, తన భర్త సోహ్రాబ్ మోడీ గురించి నటి మెహతాబ్ మాటల్లో:

గతించిన ఒక తరానికి సోహ్రాబ్ మోడీ ఒక ఆరాధన, ప్రేరణ! వైభవానికి, హుందాతనానికి ఆయన పేరు ఓ ప్రతీక! భారత చలనచిత్ర పరిశ్రమ అగ్రగాములలో ఆయన ఒకరు. ప్రస్తుతం కనుమరుగయిన – నిజాయితీగా చిత్రాలు తీసే ఒక శకానికి చెందినవారు. సోహ్రాబ్ మోడీ సినిమాలకు వాటికంటూ ఓ ప్రత్యేకమైన ఆకర్షణ ఉంది. వాటిని తలచుకున్నప్పుడు ఎన్నో జ్ఞాపకాలు ముసురుతాయి.

1986లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో – సోహ్రాబ్ మోడీ భార్యగా ఉండడం వల్ల జీవితం ఎంత సౌఖ్యంగా ఉంటుందో, ఆయన భార్య కావడం వల్ల ప్రజలు తననెంత గౌరవిస్తారో, ఎలా సాయం చేస్తారో – నటి మెహతాబ్ చెప్పుకొచ్చారు.

ఆమె ఇంకా ఏం చెప్పారో ఆమె మాటల్లోనే చదువుదాం:

“మా నాన్నగారు సెదీ ఇబ్రహీం ఖాన్ సూరత్ సమీపంలోని సచిన్ రాజసంస్థానం నవాబు. నేను చిన్న పిల్లగా ఉండగా, ‘అమ్మాయి ముక్కు చూడండి, పార్శీల ముక్కులా ఎంత పొడుగ్గా ఉందో, అమ్మాయిని మాకిచ్చేయండి’ అనేవారు ఇరుగుపొరుగువారు. తర్వాత నేను నటినయ్యాకా, నా చేతి రుమాళ్ళ మీద ‘ME’ (Mehtab Ebrahim) అని ముద్రించుకునేదాన్ని. ఒకసారి అది పొరపాటున ‘MM’ అని ముద్రితమై వచ్చింది. వాటిని తెచ్చినతనితో కోపంగా, “వీటిని తీసుకెళ్ళి ‘మినర్వా మూవీటోన్’ వాళ్ళకి ఇవ్వండి” అన్నాను. కానీ అప్పట్లో నాకు తెలీదు, నేనో పార్శీని వివాహం చేసుకుంటానని… మెహతాబ్ మోడీ నవుతానని… మినర్వా మూవీటోన్ అధిపతి భార్యనవుతానని!

‘పరఖ్’ సినిమా కోసం సోహ్రాబ్ గారితో పని చేయసాగాను. సినిమాకి సంతకం చేసేటప్పుడు ‘మీరు సినిమాల్లో  మీ క్లోజప్స్ మాత్రమే తీసుకుని మిగతావారిని నిర్లక్ష్యం చేస్తారని విన్నాను’ అన్నాను. ‘కానీ నేను ఈ సినిమాలో నటించడం లేదు’ అన్నారాయన. నెమ్మదిగా ఆయన నా పట్ల ఆసక్తి పెంచుకుంటాన్నారని నాకర్థమైంది. ‘నువ్వు అదృష్టవంతురాలివి. ఆయన సినిమా రంగపు సూదంటురాయి’ అని కొందరన్నారు. కానీ ఆయన విషయంలో వెంటనే స్పందించనందుకు నేను గర్వపడ్డాను. నాకు, నా మొదటి భర్త, సహనటుడు అష్రాఫ్ ఖాన్‌కి పుట్టిన నా బిడ్డ ఇస్మాయిల్ పట్ల ఆపేక్ష పెంచుకున్నారు సోహ్రాబ్. అప్పట్లో ఆయన వయసు 46 సంవత్సరాలు, నాకన్నా 20 ఏళ్ళు పెద్ద. అప్పట్లోనే ఆయన తన మొదటి భార్య నశీమ్ బానుతో విడిపోయారు.

కొద్ది కాలానికే నా బిడ్డ సోహ్రాబ్ గారికి బాగా మాలిమి అయ్యాడు. ఆయన లేకపోతే అన్నం తినేవాడు కాదు. నాక్కూడా ఆయనంటే ఇష్టం కలిగింది. సోహ్రాబ్ గారు పెళ్ళి చేసుకుందాం అని ప్రతిపాదించినప్పుడు, ఈ పెళ్ళి వల్ల నేను నా బిడ్దని కోల్పోవడానికి ఇష్టపడను అని చెప్పాను. అప్పుడు సోహ్రాబ్ నా మాజీ భర్తతో మాట్లాడి, అన్నీ సాధ్యపడేలా చేశారు.

మేం చడీ చప్పుడు కాకుండా 28 ఏప్రిల్ 1946 నాడు ‘సివిల్ మ్యారేజ్’ చేసుకున్నాం. ఆ రోజు నా పుట్టినరోజు. మేము ఎవరికీ చెప్పలేదు. నేను పార్శీని కానందున ఆయన తరఫు వాళ్ళు అంగీకరించలేదు. కానీ ఎలా తెలసిందో ఏమో, 1 మే నాడు మా పెళ్ళి వార్త టైమ్స్ ఆఫ్ ఇండియా దినపత్రికలో మొదటిపేజీలో వచ్చింది. అదే రోజు సాయంత్రం, మేం కాశ్మీరుకు వెళ్ళిపోయాం.

సోహ్రాబ్ ఇతరుల మంచియందు దృష్టిగలవారు. నాకు పూర్తి స్వాతంత్ర్యం ఇచ్చారు. మౌలికంగా ఆయన స్త్రీలందరినీ గౌరవించేవారు. సినిమాలు మానేయమని ఆయన ఒక్కసారి కూడా నాతో అనలేదు. నిజానికి, సినీరంగంలో కొనసాగాలని నేనే తహతహలాడిపోయాను. కానీ సోహ్రాబ్ గారితో పెళ్ళయ్యాకా, ఆయన మీద గౌరవంతో నాకు సినిమాలు ఇవ్వడం ఆపేసారు నిర్మాతలు. మావారు తీసిన ‘ఝాన్సీ కీ రాణీ’ నా చివరి చిత్రం.

ఆయన పార్శీ, నేను ముస్లిం అయినా మా మధ్య ఎటువంటి సమస్యలూ రాలేదు. ఆయన ఇతర మతాలను గౌరవించారు. మా అబ్బాయి ‘మెహెల్లీ’ని పార్శీలానే పెంచాము. నా మొదటి అబ్బాయితోనూ సోహ్రాబ్ ఎంతో ప్రేమగా ఉండేవారు. సొంత కొడుకులా చూసుకున్నారు. చక్కగా చదివించారు. మిగతా పిల్లల చదువుకూ సహాయం చేశారు. వాళ్ళల్లో చాలామంది డాక్టర్లయ్యారు. ఆయన ఎంతో దయగలవారు. వేళ కాని వేళ సహాయం కోసం మా ఇంటికి ఎంతోమంది వచ్చేవారు. ఒకరోజు మేమంతా భోం చేస్తున్నాం. ఇంతలో సాయం కావాలంటూ ఎవరో వచ్చారు. సోహ్రాబ్ తింటున్న వారల్లా లేచి వెళ్ళి అతనికి కొంత డబ్బిచ్చివచ్చారు. ‘ఏంటండీ, మనల్ని ప్రశాంతంగా తిననివ్వరా’ అని అడిగాను. ‘లోకంలో ఎందరో కోటీశ్వరులున్నారు. వాళ్ళెవరూ సాయం చేయలేదు. అందుకని మన దగ్గరకి వచ్చారు. సాయం చేసే అదృష్టం మనకి దక్కింది’ అన్నారు.

ఆయనకి సినిమా నిర్మాణం అంటే ప్రాణం. నిజానికి ఆయనకి వేరే ఆసక్తులు లేవు. ‘ఝాన్సీ కీ రాణీ’ విడుదల సందర్భంగా ఎంత ఉత్సాహంగా ఉన్నారో నేనేప్పటికీ మర్చిపోలేను. ఆ సినిమా కోసం ఆయన ఎన్నో త్యాగాలు చేశారు. అది ఏప్రిల్ నెల. మేము బికనేర్ లోని ఎడారిలో పొద్దున్నుంచీ షూటింగ్ చేసేవాళ్ళం. ఆయన బాగా కష్టపడేవారు. ఆయన చేతులు శ్రామికుల చేతుల్లా ఉండేవి. తరచూ గోళ్ళు తీసుకునేవారు, కాళ్ళవి కూడా. ఒక్కోసారి రక్తం వచ్చేది. నేనెంత చెప్పినా వినేవారు కాదు.

తన సినిమాల్లో ‘పుకార్’ సినిమా అంటే ఎంతో ఇష్టం ఆయనకి. ఆయన డైలాగులని జనాలు ఇష్టపడేవారు. విదేశీ యాత్రలు ముగించుకుని వచ్చాకా, కస్టమ్ అధికారులు ఎప్పుడూ మా లగేజీని చెక్ చేసేవారు కాదు. మమ్మల్ని కూర్చోబెట్టి సోహ్రాబ్ సినిమాల్లోని డైలాగులు చెప్పేవారు.

‘అశోకా ది గ్రేట్’ సినిమా తీయలేకపోయాననే బాధ మాత్రం ఉండేదాయనకి. ఆ సినిమా కోసం ఎంతో శ్రధ్ధగా, చిన్న చిన్న వివరాలతో కూడా ప్రణాళికలు రూపొందించారు. కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ సినిమా తీయలేకపోయారు. ఆయన దగ్గరి బంధువులే ఆయన్ని మోసం చేయడం విచారకరం. వాళ్ళకి పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తే, ఆయన లేని సమయంలో ఆస్తుల్ని తాకట్టు పెట్టేశారు…  మాకేమీ మిగలలేదు. విలువైన యాంటిక్స్ వంటి వ్యక్తిగత వస్తువులని కూడా పోగొట్టుకున్నాం. మా అమ్మ నాకిచ్చిన చర్చ్‌గేట్ భవంతి కూడా పోయింది. అప్పుడే ఆయన చాలా బాధపడ్డారు. సొంత మనుషులే దగా చేశారు. నన్నూ, సోహ్రాబ్‍ని నాశనం చేసింది వాళ్ళే.

సినిమాలు తీయడం ఆపేసిన తర్వాత కూడా మరో సినిమా తీయాలని ఆలోచించేవారు. కథల గురించి ఆలోచించేవారు. 1982 చివర్లో ‘గురు దక్షిణ’ చిత్రానికి ముహూర్తం పెట్టించారు. అప్పుడు ఆయన అస్సలు కదలలేని పరిస్థితి. ఇదంతా నేను విదేశాలకి వెళ్ళినప్పుడు జరిగింది. సినీ నిర్మాణం అంటే ఆయనకున్న బలహీనతని అడ్డం పెట్టుకుని ఆయనతో ఆడుకున్నారు. అడ్వాన్సుల రూపంలో కొన్ని లక్షల రూపాయలు పోగొట్టుకున్నాం. ముహూర్తం తర్వాత రెండు రోజులకే ఆయన జబ్బుపడ్డారు, ఇక తిరిగి కోలుకోలేదు.

అయితే సోహ్రాబ్ రొమాంటిక్ వ్యక్తి కాదు. ఆ విషయంలో కాస్త మోటు మనిషి. ఆయనకి డాన్స్ ఇష్టం ఉండేది కాదు. నాకేమో బాల్‌రూమ్ డాన్స్ అంటే అమితమైన ఇష్టం. న్యూ యియర్ రోజున జంటలు అందరూ సన్నిహితంగా నాట్యం చేస్తుంటే, నేను ఆయన్ని ప్లోర్ మీదకి తీసుకువెళ్ళాను. ఆయనకి డాన్స్ సరిగా రాక నా కాలివేళ్ళను తొక్కేసారు. అయితే ఆయన చింతనాశీలురు. క్లబ్‍లో రాత్రంతా నేను కార్డ్స్ ఆడుతున్నా, ఓపికగా, నిద్రలో తూలుతూ, నా కోసం వేచి చూసేవారు. వెళ్ళిపోదాం అంటే, ఆడుకోమనేవారు.

ఆయనకి సిగరెట్, మద్యం అలవాటు లేవు. పార్టీలలో ‘జిన్’ (ఆయనకవి కొబ్బరినీళ్ల వంటివి) మాత్రం తాగేవారు. ఆయనకి టీ ఇష్టమే. కానీ బాగా చల్లారాకా తాగేవారు.

ఆయన వివేకానంద అభిమాని. ఈ లంకె కారణంగానే, ఆయన తన కేటరాక్ట్ ఆపరేషన్ బొంబాయి శివార్ల లోని ఒక ఆశ్రమంలో చేయించుకున్నారు. బొంబాయిలోని ఇద్దరు పెద్ద సర్జన్‌లలో ఒకరితో చేయించుకోమని ఎంత బతిమాలినా వినలేదు. ఫలితంగా ఆ కన్ను పోయింది. ఒక్కోసారి మొండిగా ఉంటారాయాన.

మా అబ్బాయి మెహెల్లీ పుట్టినప్పుడు ఆయన ఎంతో సంతోషించారు. మోడీల కుటుంబంలో మావారు పెద్ద కొడుకు. మెహెల్లీ సినీ పరిశ్రమకి వచ్చి ఉంటే ఆయన ఎంతో సంతోషించేవారు. కానీ మావాడిని పైచదువుల కోసం విదేశాలకి పంపారు, విదేశాలకి వెళ్ళిన పిల్లలు తిరిగి వచ్చేది బాగా అరుదని తెలిసినా కూడా. బహుశా మెహెల్లీ ఇక్కడే సినిమాలలో పని చేయాలని సోహ్రాబ్ పట్టుపట్టి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేది.

ఆయన మనసంతా సినీ నిర్మాణంపైనే ఉన్నా, తాను తీయలేని పరిస్థితిలో ఉండగా, ఇతరులు మంచి సినిమాలు తీస్తున్నారని ఆయన ఎన్నడూ అసూయపడలేదు, చిరాకు పడలేదు. పేపర్లలో వచ్చే అన్ని సినీ సమీక్షలు చదివేవారు, ఎవరినీ విమర్శించేవారు కాదు. ఏదైనా సినిమా బాగోలేకపోతే, ‘ఈ సమీక్ష పూర్తిగా నిజం కాదు’ అనేవారు. కాని దిగులు పడేవారు. ఏదైనా చెడు జరిగితే, ‘దేవుడు ఒక దారి మూసేస్తే, పది దారులు తెరుస్తాడు’ అనేవారు.

ఆయన స్వరంలో ఎంతో బలం ఉండేది. ఆయన గొంతు నాకింకా స్పష్టంగా గుర్తుంది. కాని ఆయనని ఆసుపత్రిలో చేర్చినప్పుడు ఆయన మౌనంగా ఉండిపోయారు. ఎంతో నొప్పిగా ఉన్నా ఫిర్యాదు చేయలేదు. ఆయనకి బోన్ మారో కేన్సర్ వచ్చింది… శరీరమంతా వ్యాపించింది. ఇక్కడ నేనొక్కదాన్నే ఉన్నాను. అబ్బాయిలిద్దరూ విదేశాల్లో ఉన్నారు. ఏదైనా చేయండని వైద్యులను వేడుకొన్నాను. ‘వైద్యం చేసి ఆయన శరీరాన్ని హింసించి బాధపెట్టలేం. హుందాగా లోకం వీడనీయండి. ఎలా ఉన్నారో అలానే ఉండనీయండి’ అన్నారు వైద్యులు. ఆయనకి వాంతులు లేవు, జుట్టు రాలిపోలేదు. చనిపోయినప్పుడు – ప్రశాంతంగా నిద్ర పోతున్నట్టు ఉన్నారు.

ఆయన నన్నెంతో బాగా చూసుకున్నారు. ఇప్పుడన్నీ నేనే చేసుకోవాల్సి వస్తోంది. ఆయనని బాగా మిస్ అవుతున్నాను. నన్ను చూసుకునే వాళ్లెవరూ లేరు ఇప్పుడు.”

***

సోహ్రాబ్ మోడీ 28 జనవరి 1984 తేదీన, 85 ఏళ్ళ వయసులో మృతిచెందారు. మెహతాబ్ 10 ఏప్రిల్ 1997 తేదీన చనిపోయారు. ఆమె విగతశరీరాన్ని ముంబయిలోని మెరెన్ లైన్స్ లోని బడా ఖబరస్థాన్‌లో పూడ్చిపెట్టారు.


16-ఏళ్ళ యువ ఎలిజబెత్ టేలర్ ఫోటో తీసిన గొప్ప ఫోటోగ్రాఫర్:

సుప్రసిద్ధ నటి ఎలిజబెత్ టేలర్ 16-ఏళ్ళ వయసులో దిగిన ఒక పోర్ట్రెయిట్ ఫోటో ప్రపంచ ప్రసిద్ధి పొందినది. ఆ ఫోటో తీసిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ ఫిలిప్ హాల్స్‌మన్ గురించి తెలుసుకుందాం.

20వ శతాబ్దపు గొప్ప పోర్ట్రెయిట్ ఫోటోగ్రాఫర్లలో ఫిలిఫ్ ఒకరు. ఒక ప్రొఫైల్ స్టోరీ కోసం ఎలిజబెత్ టేలర్ పోర్ట్రెయిట్ ఫోటో తీయవలసిందిగా లైఫ్ మ్యాగజైన్ ఆయనను కోరింది. ఆయన గతంలో మార్లిన్ మన్రో, ఆల్ఫ్రెడ్ హిచ్‍కాక్, విన్‍స్టన్ చర్చిల్ వంటి ప్రముఖుల ఫోటోలు తీశారు.

నటన అనేది ఎలిజబెత్ టేలర్ రక్తంలోనే ఉంది. వాళ్ళమ్మ గారు పెళ్ళయ్యేవరకు నటిగా కొనసాగారు. ఎలిజబెత్ టేలర్ మూడేళ్ళ వయసులో నాట్యం చేసి, యువరాణులు ఎలిజబెత్, మార్గరెట్‍ల ముందు ప్రదర్శన ఇచ్చారు. కాలిఫోర్నియాకి మారిన తరువాత వారి కుటుంబ స్నేహితులొకరు టేలర్‍కి స్క్రీన్ టెస్ట్ చేయించవలసిందిగా సూచించారు.

కొద్ది రోజులకే యూనివర్సల్ స్టూడియోస్ వారితో ఒప్పందం కుదిరింది. తనకి పదేళ్ళ వయసులో టేలర్ సినీ రంగ ప్రవేశం చేశారు. 1942 నాటి There’s One Born Every Minute ఆమె తొలి చిత్రం. అయితే ఆమెకి మరిన్ని అవకాశాలు మాత్రం 1944లో వచ్చిన National Velvet విజయవంతమవడంతో లభించాయి. ఆ సినిమా కోసం ఆమె నాలుగు నెలలు పనిచేశారు. ఈ సినిమా అప్పట్లో నాలుగు మిలియన్ డాలర్ల కన్నా అధికంగా వసూళ్ళు రాబట్టి, 12 బాల ఎలిజబెత్‌ని పెద్ద తారని చేసింది.

1948 అక్టోబరులో, తనకి 16-ఏళ్ళ వయసులో ఎలిజబెత్ టేలర్ లో-కట్ డ్రెస్‌లో న్యూయార్క్ లోని ఫిలిఫ్ పోర్ట్రెయిట్ స్టూడియోకి వచ్చారు. ఈ స్టూడియో ఇప్పటికీ ఉంది. ఇప్పుడది హాల్స్‌మన్ ఆర్చీవ్‍లో భాగం. “నా స్టూడియోలో ఎలిజబెత్ మౌనంగా, సిగ్గుగా ఉన్నారు. సాధారణ టీనేజర్‍లా అనిపించారు. కాకపోతే గొప్ప అందగత్తె” అని తన పుస్తకం ‘హాల్స్‌మన్: సైట్ అండ్ ఇన్‍సైట్’ అనే పుస్తకంలో పేర్కొన్నారు ఫిలిప్.

ఆయన దగ్గరో ఓ విశిష్టమైన హాండ్-బిల్ట్ 4×5 వ్యూ కెమెరా ఉండేది. దాంతో బ్లాక్ అండ్ వైట్, కలర్ ఫోటోలు తీసే వీలుంది.

ఫోటో తీసే ముందు ఆమెకి “నీకు హృదయం ఉంది, అది వ్యక్తం కావాలి” అనే ఒక సూచన ఇచ్చారట ఫిలిప్.

“నన్ను ఓ స్త్రీగా గుర్తించిన మొదటి వ్యక్తి ఆయనే… ఆయనతో నా సెషన్ పూర్తయ్యాకా, నా స్క్రీన్ ఇమేజ్‍ని చాలా నియంత్రించుకోవాలని నాకర్థమైంది” చెప్పారు టేలర్. ఆ సెషన్ ప్రభావాన్ని వివరించారు.

ఆమె కలర్ పోర్ట్రెయిట్‌ని…. టేలర్ కుడి వైపుకి కనబడేలా వైడర్ ఫ్రేమ్‍లో 21 ఫిబ్రవరి 1949 నాటి సంచికలో ప్రచురించింది లైఫ్ మ్యాగజైన్.

ఆ ఫోటో కోసం ఆమె చెవులకు మెరిస్తున్న లోలాకులు ధరించారు, కానీ నెక్లెస్ పెట్టుకోలేదు. సిట్టింగ్ జరుగుతూండగా, ఫిలిఫ్ తన భార్యకి చెందిన నీలిరంగు ట్రయాంగిల్ పెండెంట్ నెక్లెస్ తెచ్చి టేలర్‌కి ధరింపజేశారు. ఈ నిర్ణయం ఆ పోర్ట్రెయిట్ ఫోటోకి గొప్ప అందాన్ని తెచ్చింది. అమ్మ నుంచి ఆ నెక్లెస్ ఫిలిఫ్ కూతురు ఇరినే కి లభించింది. అది ఇప్పటికీ ఆమె వద్ద భద్రంగా ఉంది.

“సాంకేతిక స్థాయిలో చెప్పాలంటే – ఆయన తీసిన ఫోటోలోని నా ముఖంలో రెండు పార్శ్వాలున్నాయని ఆయన తెలిపారు. ఒకటి యవ్వనాన్ని ప్రతిబింబిస్తే, మరొకటి పరిపక్వతని సూచించింది. ఆయన ఫోటో కోసం భంగిమ ఇస్తున్నప్పుడు నా శరీరం గురించి నాకు బాగా తెలిసింది” తరువాతి కాలంలో చెప్పారు టేలర్.

మరికొన్ని వారాలకి, హాలీవుడ్‌లో ఫిలిప్‌కి టేలర్ తారసపడ్డారట. ఆయన వెళ్ళి కలిస్తే, ఆమె గుర్తుపట్టలేదట. ‘ఆ సంఘటన నన్ను బాగా గాయపరిచింది’ తర్వాత చెప్పారాయన. “ఫోటోగ్రాఫ్ ఎంతో ముఖ్యం కావచ్చు, కానీ ఫోటోగ్రాఫర్ ఏ మాత్రం ముఖ్యం కాదు” అని ఆమె మాటలు తెలిపాయని ఆయన అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here