అలనాటి అపురూపాలు-73

0
2

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

బేబీ నాజ్ విషాద గాథ:

బాలనటులని హాలీవుడ్‍లో ‘గోల్డెన్ గూస్’ అనీ, బాలీవుడ్ పరిభాషలో ‘సోనే కీ చిడియా’ (బంగారు పిచుక అందామా) అని వ్యవహరించడం పరిపాటి. ఇక్కడైనా అక్కడైనా ప్రతీ బాలనటుడు/నటి – అందమైన బాల్యాన్ని పోగొట్టుకున్నవాళ్ళే. గంటల కొద్దీ కెమెరా ముందు పని చేస్తూ, సరైన ఆహారం, నిద్రనీ కోల్పోయిన వాళ్ళే.

1950లలో అందరి అభిమానాన్ని పొందిన బాలతారల్లో బేబీ నాజ్ ఒకరు. ఆమె అసలు పేరు సల్మా బేగ్. బొంబాయిలో జన్మించారు. ఎన్నో చిత్రాలలో ఆమె నటనకు ముగ్ధులైన వారంతా ఆమెను బేబీ నాజ్ గానే గుర్తుంచుకుంటారు. నాలుగేళ్ళ వయసు నుంచే బలవంతంగా నటించాల్సి వచ్చింది. ఆమె వందకు పైగా చిత్రాలలో నటించారు. కానీ చివరికీ – ఆస్తి, నగలు – ఏవీ దక్కకుండా తనని తాను కాపాడుకోవాల్సి వచ్చింది.

ఆమె తండ్రి మీర్జా దావూద్ బేగ్ విఫలమైన స్క్రీన్ రైటర్. దుర్భరమైన పేదరికంలో, తమ కుటుంబానికి తమ ఏకైక కూతురే ఆధారమని ఆమె తల్లి గుర్తించింది. అయితే బేబీ నాజ్ తల్లి, భర్తని కూతురుని వదిలేసి ఓ సినీ కెమెరామాన్‌ని పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయింది. తన సవతి-తండ్రితో బేబీ నాజ్‍కు పొసగలేదు.

సుమారు పదేళ్ళ వయసులోనే ఆమె రెండు సార్లు ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. పొరుగున ఉన్న బావిలో, దూకితే, పనివాళ్ళు కాపాడారు.

బేబీ తబుస్సం, డైసీ, హనీ ఇరానీల వలె నాజ్ కూడా బాలనటి నుంచి విజయవంతమైన హీరోయిన్‍గా ఎదగడంలో విఫలమయ్యారు. అయితే, యువ నటిగా ఆమె దాదాపు 30 సినిమాలలో నటించారు. వాటిల్లో – మహమూద్ సరసన నటించిన ‘లంబే హాత్’, ఫిరోజ్ ఖాన్‍తో ‘చార్ దర్వేష్’, సుదేశ్‌తో నటించిన సైన్స్ ఫిక్షన్ ‘రాకెట్ గర్ల్’ వంటివి ముఖ్యమైనవి. ‘సచ్ఛా ఝూటా’ చిత్రంలో రాజేష్ ఖన్నా వికలాంగురాలైన సోదరిగా; ‘కటీ పతంగ్’ లో ఆశా పరేఖ్ సఖిగా నాజ్ పోషించిన పాత్రలు ఆమెకు గుర్తింపు తెచ్చాయి. 1970లలో సౌత్ సెన్సేషన్ అయిన శ్రీదేవికి డబ్బింగ్ చెప్పి, ఆమె స్వరంగా మారారు. హిమ్మత్‌వాలా, తోఫా, మవాలి మొదలైనవి ఇందుకు ఉదాహరణలు.

బాలనటుల శ్రమను విపరీతంగా దోపిడీ చేయడానికి తల్లిదండ్రుల అత్యాశ, లేమి కారణమవుతాయి. బేబీ నాజ్ విషయానికి వస్తే. అత్యాశ దురాశగా మారింది. బేబీ నాజ్‌ని ఒక ప్రదర్శనలో నర్గిస్ చూసి, ఆ పాప గురించి రాజ్‌ కపూర్‌కి చెప్పారు. ఆమె ప్రదర్శన నచ్చిన రాజ్ కపూర్ 1954లో వచ్చిన ‘బూట్ పాలిష్’లో అవకాశమిచ్చారు. ఇక మిగిలినదంతా చరిత్రే. తన సోదరుడితో (మాస్టర్ రత్తన్) కలిసి వీధుల్లో బతికే అనాథ పాత్ర ఆమెది. ఈ చిత్రాన్ని విట్టోరియో డీ సికా శైలిలో నియో-రియలిస్టిక్‌గా చిత్రీకరించారు. ఈ చిత్రాన్ని కేన్స్ అంతర్జాతీయ ఉత్సవంలో ప్రదర్శించినప్పుడు బేబీ నాజ్‌కీ, మాస్టర్ రత్తన్‌కి ప్రశంసలు లభించాయి. ఈ సినిమాలో ‘నన్నే మున్నే బచ్చే తేరే ముట్ఠీ మే క్యా హై’, ఇంకా ‘రాత్ గయీ ఫిర్ దిన్’ పాటలలో బేబీ బాజ్ అభినయం అపూర్వం. ఆ పాపని స్విట్జర్లాండ్ పంపి ఐదేళ్ళ కోర్సులో చదివించాలనుకున్నారు రాజ్ కపూర్. కానీ వాళ్ళమ్మ అంగీకరించలేదు. ఆమె లేకుండా వాళ్ళు స్వచ్ఛమైన గాలి కూడా పీల్చుకోలేరు, అంతే కదా! అయితే నాజ్‍ని చదువుకోనిస్తే, ఆమె జీవితం మరోలా ఉందేదని భావించడం తప్పేమీ కాదు. బాలనటిగా విజయవంతంగా ఉన్న రోజుల్లో – ఆమెని – కూడూ నీడా లేని చిన్నపిల్ల లాంటి పాత్రల్లో చూపించేందుకు ఎక్కువగా ఇష్టపడేవారు నిర్మాతా, దర్శకులు. అద్భుతమైన జ్ఞాపకశక్తితో డైలాగులను అలవోకగా చెప్తూ, చక్కని అభినయం చేసేవారు నాజ్. హృశీకేశ్ ముఖర్జీ ‘ముసాఫిర్’, బిమల్ రాయ్ ‘దేవ్‌దాస్’ (చిన్నారి పార్వతి), గురుదత్ ‘కాగజ్ కే ఫూల్’, దిలీప్ కుమార్ క్లాసిక్ ‘గంగా జమున’, జిపి సిప్పీ ‘భాయ్ బహెన్’, కిషోర్ సాహు ‘దిల్ అప్నా ప్రీత్ పరాయ్’, సునీల్ దత్ ‘ముఝే జీనే దో’, ఇంకా నరేంద్ర సూరి ‘లాజవంతి’ వంటి చిత్రాలు ఆమె కెరీర్‍కు భరోసా కల్పించాయి. కానీ ఆమె మీదే ఆధారపడ్డ తల్లిదండ్రుల అత్యాశ వల్ల అంతా తారుమారయ్యింది. ఆమె చేత అనేక సినిమాలకు సంతకాలు చేయించి, తల్లిదండ్రులు సొమ్ము చేసుకున్నారు.

వీటన్నింటి నుంచి తప్పించుకోడానికి ఆమె ఎన్నుకున్న మార్గం – పెళ్ళి! రాజ్ కపూర్ కుటుంబానికి చెందిన హీరో-కారెక్టర్ ఆర్టిస్ట్ సుబీరాజ్‍ని పెళ్ళి చేసుకున్నారు. పెళ్ళికి ముందు వాళ్ళ ప్రేమాయణం దాదాపు ఐదేళ్ళు కొనసాగింది. ‘దేఖ్ ప్యార్ తుమ్హారా’ చిత్రం షూటింగ్‌లో ఉండగా వారిద్దరూ స్టూడియోలోనే పెళ్ళి చేసుకున్నారు. ఇరువురి మతాలు వేరు కావడం, పెద్దలకి ఈ పెళ్ళి ఇష్టం లేకపోవడంతో – సుబీరాజ్ ముఖంపై యాసిడ్ పోస్తామనే బెదిరింపులను ఎదుర్కున్నారు. నాటకీయ సంఘటనలు జరిగాయి. ఏ రకంగా చూసినా వారిది ఆదర్శ దాంపత్యం. వాళ్ళకి గౌరి, గిరీష్ అనే పిల్లలు పుట్టారు. వాళ్ళని చిత్ర పరిశ్రమకి దూరంగా పెంచారు. నాజ్‌, సుబీరాజ్ లకు మేఘనా, సాహిల్ అనే మనవరాలు, మనవడు ఉన్నారు. అయితే దురదృష్టవశాత్తు, నాజ్‌కు కాలేయానికి సంబంధించిన ప్రాణాంతకమైన జబ్బు చేసి, ఆమె మరో ఆరు నెలల కంటే ఎక్కువ బ్రతకరని వైద్యులు చెప్పారు. అప్పుడు నాజ్ క్రుంగిపోయారనీ, స్టార్‌డమ్ పోగొట్టుకోడంతో పాటు ఈ జబ్బు బారిన పడేసరికి నిరంతరం పొగాకు, ఖిమామ్ తినడం అలవాటు చేసుకున్నారని సుబీరాజ్ చెప్పారు. ఆశ లేకపోయినప్పటికీ, బరువు తగ్గి తిరిగి సినిమాల్లో నటించాలని నాజ్ ఆశపడ్దారు.

సుబీరాజ్‍ని పెళ్ళి చేసుకునేందుకు గాను నాజ్ హిందూమతంలోకి మారి తన పేరును అనూరాధగా మార్చుకున్నారు. అయినా తెర మీద మాత్రం నాజ్ అనే వేసేవారు. కీర్తి ప్రతిష్ఠలకి అలవాటు పడిన ఆమె, హీరోయిన్‍గా ఓ వెలుగు వెలగలేనందుకు కారణాలను జీర్ణించుకోలేకపోయారు. అదృష్టవశాత్తు ఈ దంపతులకి ‘జానకి’ అనే టీవీ సీరియల్‌లో అవకాశం వచ్చింది. అందులో ఆమె సుబీరాజ్‌కు వదినగా నటించారు. టీవీ ద్వారా ఆదాయం వచ్చినా, యాన్యువల్ హాలీడే లాంటి విలాసాలకు కావల్సినంత డబ్బు మాత్రం లభించేది కాదు. మహా అయితే కుటుంబం అంతా కలిసి కారులో సమీపంలోని లోనావాలాకో లేదా పూనేకో వెళ్ళేవారు. ‘ఆఖరీ రాస్తా’ చిత్రానికి శ్రీదేవికి రేఖ డబ్బింగ్ చెప్పడంతో నాజ్ ఆగ్రహం చెందారు. తనతో పాటు ఇతర దక్షిణాది హీరోయిన్‌లకు కూడా నాజ్ డబ్బింగ్ చెప్పడం శ్రీదేవికి అంగీకారం కాలేదు.  అందుకు బదులుగా, “అయితే సరే, నాకు కాంట్రాక్ట్ ఇవ్వు, నువ్వు రిటైరయ్యే దాకా నీకొక్కదానికే డబ్బింగ్ చెప్తాను” అన్నారట నాజ్.

ఒకరోజు తనకి కడుపు నొప్పిగా ఉందనీ, మింగడంలో ఇబ్బందిగా ఉందనీ చెప్పారు. సోనోగ్రఫీలో కాలేయం చుట్టూ పుండ్లు పడ్డాయని తెలిసింది. సర్జరీ, కీమోథెరపీ ఉపయోగపడవని వైద్యులు చెప్పారు. నొప్పిని తగ్గించుకోడానికి ఆమె జపనీస్ థెరపీ చేయించుకున్నారు. ఆమె 19 అక్టోబర్ 1995 నాడు కన్ను మూశారు.

చనిపోవడానికి సుమారు నెల ముందు, వీల్ చైర్‍లో వెళ్ళి ఢిల్లీలో ఉన్న తన భర్త బంధువులని, గురువు గారిని దర్శించారు. చనిపోవడానికి రెండు రోజుల ముందు కోమాలోకి వెళ్ళారు, ప్రశాంతంగా చనిపోయారు. అప్పటికే సుబీరాజ్ సినీపరిశ్రమకి దూరం కావడంతో, వారి కష్ట కాలంలో సాధన, ఆర్.కె. నయ్యర్ తప్ప మరెవరూ ఎటువంటి సాయమూ చేయలేదు. ముంబయిలో జరిగిన ఆమె అంత్యక్రియలకీ ఏ సెలెబ్రిటీ హాజరు కాలేదు. కేన్స్ ఫెస్టివల్‌లో ప్రశంసలు పొందిన బాల నటి… బొంబాయిలో నిర్మాతలు చాక్లెట్లు, ఐస్‍క్రీమ్‍లతో ముద్దు చేసిన బాలనటి జీవితాన్ని గతావలోకనం చేసుకుంటే చేదే మిగులుతుంది.

~

‘నన్నే మున్నే బచ్చే తేరే ముట్ఠీ మే క్యా హై’ పాట యూట్యూబ్‌లో:

https://www.youtube.com/watch?v=UJvcbkxG20A


సున్నితమైన హాస్యంతో అలరించిన హాస్యనటుడు గోపే:

ప్రస్తుతం పాకిస్థాన్‍లో ఉన్న సింధ్ లోని హైదరాబాద్‍లో గోపే జన్మించారు. తొమ్మిది మంది సంతానంలో ఒకరైన ఈయన పూర్తి పేరు గోపే విష్ణదాస్ కమ్‍లానీ. నిర్మాత కె.ఎస్. దర్యానీ గోపేని నటుడవ్వాల్సిందిగా ప్రోత్సహించి, సినీపరిశ్రమకి ఆహ్వానించారు. వారి సహాయం ఉండడంతో, గోపే తన తండ్రిని ఒప్పించి, నటుడయ్యేందుకు బొంబాయి చేరుకున్నారు.

 

1933లో ఈస్టర్న్ ఆర్ట్ ప్రొడక్షన్స్ వారు మోతీ గిద్వానీ దర్శకత్వంలో నిర్మించిన ‘ఇన్‌సాన్ యా సైతాన్’ చిత్రం గోపేకి తొలి చిత్రం. ఆయన ఈ సినిమాలో జద్దన్‌బాయ్ (తరువాతి కాలంలో నర్గిస్ తల్లి) సరసన నటించారు. ఇంకా ఈ చిత్రంలో ఎర్మెలిన్, అప్పటి ప్రముఖ హాస్యనటుడు దీక్షిత్ (చిన్న పాత్రలో) నటించారు.

గోపేకి క్రమంగా అవకాశాలు పెరిగాయి. 1949లో దీక్షిత్ మరణించగా, 1950లో గోపే మరో నటుడు యాకూబ్‍తో చేతులు కలిపారు. వీరిద్దరూ జోడీగా లారెల్-హార్డీ తరహా హాస్యం అందించేవారు. ఇంతకు ముందు ఈ తరహా పాత్రలు దీక్షిత్, ఘోరీ కలిసి చేసేవారు. అయితే అప్పట్లో హాస్యనటుల పాత్రలకు నిడివి తక్కువగా ఉండడంతో – పూర్తి స్థాయిలో లారెల్-హార్డీల వలె ఎవరూ జోడీ కట్టలేకపోయారు. యాకూబ్ – గోపే కలిసి ‘పతంగ’ (1949),  ‘బేకసూర్’ (1950), ‘సగాయీ’ (1951) వంటి చిత్రాలలో నటించారు.

ఇక వ్యక్తిగత వివరాలకొస్తే, గోపే 5 ఫిబ్రవరి 1949 నాడు నటి లతికని (ఆమె టిబెటన్ పేరు హుంగు-లామౌ) పెళ్ళి చేసుకున్నారు. అప్పటి ఫిల్మ్ ఇండియా మ్యాగజైన్, “కొత్త దంపతులకు శ్రీ సౌండ్ స్టూడియోస్‌లో వైభవమైన రిసెప్షన్ ఏర్పాటు చేశారు. తరువాత జుహూ బీచ్‍లో మూన్ లైట్ పార్టీ జరిగింది” అని వ్రాసింది.

1950లలో గోపే సినీ నిర్మాణం వైపు అడుగులు వేశారు. తన సోదరుడు రామ్ కమ్‌లానీతో కలిసి ‘హంగామా’ (1952), ‘మాలికిన్’ (1953) అనే చిత్రాలు నిర్మించారు. రామ్ తర్వాత కాలంలో దర్శకుడు, గాయకుడిగా పేరుగాంచారు. గోపే విలన్‍గా కూడా ప్రయత్నించినప్పటికీ, కామెడీలోనే విశేషంగా రాణించారు. ‘తరానా’ (1951) చిత్రంలో నటుడు జీవన్‍తో కలిసి దుష్ట పాత్రలో నటించారు గోపే.

1957 గోపే కుందన్ కుమార్ గారి ‘తీసరీ గలీ’ చిత్రం సెట్స్ మీద అకాల మరణం చెందారు. ఆ చిత్రం 1958లో విడుదలయింది. ఆయన భార్య లతిక తన ఇద్దరు కొడుకులతో లండన్‍లో స్థిరపడ్డారు. తర్వాత అక్కడ ఆమె మరో వివాహం చేసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here