Site icon Sanchika

అలనాటి అపురూపాలు-77

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

ది వీనస్ ఆఫ్ బాలీవుడ్ నసీమ్ బాను:

ఓ చలాకీ అయిన, ఉత్సావంతురాలైన 18 యువతి వేసవి సెలవలు గడుపుదామని ఢిల్లీ నుండి తన తల్లితో కలిసి బొంబాయి వచ్చింది. ఒక స్టూడియోలో ‘సిల్వర్ కింగ్’ చిత్రం షూటింగ్ జరుపుకుంటుండంగా చూసే అవకాశం ఆ యువతికి లభించింది. ఈ కొత్త ప్రపంచాన్ని అత్యంత సమీపంగా చూసిన ఆ యువతిని, నటన అనే పురుగు కుట్టింది. ఆ తరువాత ఆమె స్టూడియోలలో తచ్చాడసాగింది. సహజంగా అందగత్తె కావడంతో ప్రముఖ నిర్మాత షోరబ్ మోడి దృష్టిలో పడింది. అప్పుడు తాను (షేక్‌స్పియర్ నాటకం హామ్లెట్ ఆధారంగా) తీస్తున్న ‘ఖూన్ ఖా ఖూన్’ చిత్రంలో ఆ యువతికి అవకాశం ఇచ్చారాయన. అనుమతి కోసం ఆమె తల్లిని అడిగితే, తన కూతురుని ఓ డాక్టరుగా చూడాలనుకుంటున్నాను కానీ, నటిగా కాదంటూ వీలు కాదన్నారట. అంతే మొండి పట్టుదల కలిగిన ఆ కూతురు తల్లి మాటని త్రోసిపుచ్చింది, తాను నటించాల్సిందే అని పట్టు పట్టింది. ఒప్పుకోకపోతే, అప్పట్లో బ్రిటీషు వారి నుంచి స్వాతంత్రం కోసం గాంధీజీ చేసినట్టు నిరాహార దీక్ష చేస్తానంది. చివరికి చేసేదేం లేక, కూతురు సినిమాల్లో నటించేందుకు ఆ తల్లి అంగీకరించారు. అలా నసీమ్ బాను సినీరంగ ప్రవేశం జరిగింది.

తర్వాత ఆమె ఢిల్లీ వచ్చేసి క్వీన్ మేరీ హైస్కూలులో తన చదువు కొనసాగించలనుకుంది. కానీ విధి మరోలా తలచింది. అప్పట్లో సినిమాలో పని చేయడమంటే, తక్కువ రకం పనిగా భావించబడేది. అందుకుని ఆ స్కూలు ప్రిన్సిపాల్, ఆ యువతిని స్కూలు నుంచి తొలగించారు. దాంతో హమ్మయ్య అనుకున్న ఆ యువతి పూర్తిస్థాయిలో నటనకి మళ్ళింది.

***

నసీమ్ 4 జూలై 1916న ఢిల్లీలో శంషాద్ బేగమ్, అబ్దుల్ వహీద్ ఖాన్ దంపతులకు జన్మించారు. ఆమె అసలు పేరు రోషనార. తల్లి రాజాస్థానంలో గాయని. తండ్రి  హసన్‌పూర్ సంస్థానపు నవాబు. అప్పటికే సినిమాల్లో నేపథ్యగాయనిగా పేరు పొందిన శంషాద్ బేగమ్ ఈమె కాదు. నసీమ్‌ది సహజమైన అందం. ఆమె అందమైన ముఖారవిందాన్ని చూసినవారు ‘పరీ చెహ్రా’ (దేవదూత వదనం) అనేవారు.

సినీరంగంలో ప్రవేశించి వరుసగా సినిమాలు చేస్తున్న క్రమంలో ఆమె సరసన నటించిన హీరోలంతా ఆమె కంటే కనీసం పదేళ్ళు చిన్నవారు. అయినా వాళ్ళ జోడీలో ఆ తేడా కనిపించేది కాదు. అంత అందంగా ఉండేదామె రూపం. షోరబ్ మోడి యొక్క మినర్వా మూవీ టోన్ వారి కాంట్రాక్టు నటిగా ప్రారంభించి ఎన్నో సినిమాల్లో నటించారు.

1939లో వచ్చిన ‘పుకార్’లో రాణీ నూర్జహాన్‌గా నటించారు. చక్కని రూపంతో బాటు, అద్భుతమైన నటనను ప్రదర్శించడంతో… ఎందరో నిర్మాతల దృష్టిలో పడ్దారామె. తొలుత షోరాబ్ మోడితో ఉన్న ఒప్పందం ఆటంకమైనప్పటికీ, దాన్ని సవరించుకోగలిగారు. 1944లో ఆమె అశోక్ కుమార్ సరసన నటించిన ‘చల్ చల్ రే నౌజవాన్’ అద్భుత విజయం సాధించింది. ఆ తరువాత వచ్చిన ‘అనౌఖీ అదా’ (1948), ‘శీష్ మహల్’ (1950), ‘శబిస్తాన్’ (1951) సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.

ఆమె తన చిన్ననాటి స్నేహితుడు, వృత్తిరీత్యా ఆర్కిటెక్ట్ అయిన ఇన్షాన్ ఉల్ హక్‌ను వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ కలిసి – ఉజాలా, బేగమ్, ములాఖాత్, అజీబ్ లడ్‍కీ, చాందినీ రాత్ – అనే ఐదు సినిమాలు నిర్మించారు. వీరికి ఒక కుమార్తె, ఒక కుమారుడు. కుమార్తై సైరా బాను కూడా సినీ నటియై రాణించారు. కుమారుడు స్వర్గీయ సుల్తాన్ అహ్మద్. దేశ విభజన తర్వాత ఆమె భర్త పాకిస్థాన్‌కి వెళ్ళిపోతే, నసీమ్ పిల్లలతో ఇండియాలో ఉండిపోయారు. తర్వాత పిల్లల చదువుల కోసం కొన్నాళ్ళ పాటు ఆమె ఇంగ్లండ్ వెళ్లారు. కాని తరువాత స్వదేశానికి వచ్చేశారు. ఈ విధంగా వారి వైవాహిక బంధం చెదిరిపోయింది. ఆమె సినిమాల నెగటివ్‍లు భర్త దగ్గర ఉండిపోవడంతో, ఆయన ఆ సినిమాలను పాకిస్థాన్‍లో విడుదల చేసుకున్నారు. అక్కడ కూడ నసీమ్ బానుకు మంచి పేరు వచ్చింది.

దాదాపు ఇరవై ఏళ్ళలో (1935-57) ఆమె నటించినవి 22 సినిమాలే కావడం ఆశ్చర్యకరం. చక్కని పాత్రలు చేయాలనుకున్నారే తప్ప, వచ్చిన సినిమానల్లా అంగీకరించలేదని భావించాలి. 1957 తర్వాత తనకు తానుగా విరమించుకున్నారు, ఎన్ని అవకాశాలు వచ్చినా కాదనుకున్నారు. డ్రైస్ డిజైనింగ్ ఎంచుకుని, తన కుమార్తె కాస్ట్యూమ్స్ చూడసాగారు.

సినిమాల్లోంచి విరమించుకున్నాకా, నసీమ్, కూతురు సైరాతో ఉన్నారు. ఆమె కెరీర్‌కి సహాయంగా ఉన్నారు. ఆమె పోషించే పాత్రలు యోగ్యమైన దుస్తులు ఎంచారు. అప్పట్లో దిలీప్ కుమార్ వీరి పొరుగున ఉండేవారు. తన కూతురి వివాహం ఆయనతో జరిపించడానికి ఆమె అంగీకరించారు. దిలీప్, సైరా బానులు 50 ఏళ్ళకి పైగా కలిసున్నారంటేనే తెలుస్తుంది, ఆ జంట వైవాహిక జీవితం విజయవంతమైందని.

నసీమ్ బాను నటించిన సినిమాల జాబితా (వికీపీడియా నుంచి సేకరణ):

నసీమ్ 85 ఏళ్ళ ముదిమి వయసులో 18 జూన్ 2002 నాడు ముంబయిలో మరణించారు.


మూకీ శకపు సంచలనం – ‘సులోచన’:

1920లు… మూకీ సినిమాలు మొదలయిన కాలం… ముందెన్నడూ లేని విధంగా కదిలే బొమ్మల ద్వారా ప్రేక్షకులను మనస్సులను ఆకట్టుకుంటున్న సమయం! అయితే, అలనాటి అన్ని వ్యవస్థలో లానే సినిమాల్లోనూ తొలి రోజులలో మహిళల పట్ల వివక్ష ఉంది. ఈ రంగంలో స్త్రీల ప్రవేశం – చాలా తక్కువగా – అరుదుగా ఉండేది. అయినప్పటికి కొందరు మహిళలు అప్పట్లో సినిమాల్లో ప్రవేశించి, విశేషంగా రాణించారు. వారిలో ఒకరు, రూబీ మేయర్స్. నటి సులోచనగా ప్రసిద్ధులు.

రూబీ మేయర్స్ 1907లో పూణె నగరంలో జన్మించారు. చిన్నప్పుడు ఉబ్బిన మొహం, సన్నని ఆకారం, గోధుమ రంగు కళ్ళతో – అసలు అందంగా కనిపించేవారు కాదామె. సినిమాలలోకి ప్రవేశించి, గొప్ప తారగా ఎదగక ముందు ఆవిడ టెలిఫోన్ ఆపరేటర్‌గా పని చేసేవారు. బాగ్దాద్ యూదు కుటుంబానికి చెందిన వారామె… ఆ వర్గం ప్రజలు ఇప్పుడు భారతదేశంలో దాదాపుగా లేరనే చెప్పవచ్చు. వీరి మూలాలు ఇరాక్ నుండి మధ్యధరా, హిందూ మహసముద్రాల మీదుగా 18వ శతాబ్దంలో ఇతర దేశాలకు వలసపోయిన యూదులకు చెందినవి.

వీరు భారతదేశంలో ప్రధానంగా బొంబాయి, కలకత్తా వంటి నగరాల స్థిరపడి వివిధ వ్యాపారాలు చేశారు. కొంతమంది బాగ్దాది యూదులు – బాగ్దాద్‍లో ముస్లిం టర్కీ పాలకుల నుండి ఇబ్బందులు ఎదుర్కుని భారతదేశానికి తరలివచ్చారు. భారతదేశంలో తమకంటూ పేరు సంపాదించుకోవడమే కాకుండా, భారతదేశ ఆర్థికరంగం వృద్ధికి, సమాజాభివృద్ధికి దోహదం చేశారు.

ఆమె తన ఉద్యోగంలో ఉండగా, ఒకసారి కోహినూర్ ఫిలిం కంపెనీకి చెందిన మోహన్ భావనాని ఆమెని చూడడం తటస్థించింది. అయితే తొలుత నటించడానికి పెద్దగా ఆసక్తి చూపలేదావిడ. ఎందుకంటే అప్పటి పితృస్వామ్య సమాజంలో మహిళలు కొన్ని రంగాలలో పాల్గొనడం అనైతికమని, కూడదని ఆంక్షలుండేవి. కానీ ఆమెలో భావనాని మరేదో చూశారు, పట్టుపట్టి ఒప్పించారు. ఆయన నమ్మకాన్ని రూబీ నిలబెట్టారు.

నటనలో గాని, సినీ రంగంలోని ఏ పూర్వానుభవమూ, పరిజ్ఞానమూ లేని రూబీ కెరీర్ – ఆమె ద్విపాత్రాభినయం చేసిన ‘వీర్ బాలా’ (1925) చిత్రంతో ప్రారంభయింది. వివిధ జానర్లలో పలు సినిమాల్లో నటించారామె. టైపిస్ట్ గరల్ (1926), బలిదాన్ (1927), సినిమా క్వీన్ (1926), వైల్డ్ కాట్ ఆఫ్ బాంబే (1927) వంటివి ముఖ్యమైనవి. సినీ పరిశ్రమలోకి వచ్చాకా ‘సులోచన’గా పేరు మార్చుకున్న రూబీ ‘వైల్డ్ కాట్ ఆఫ్ బాంబే’ చిత్రంలో 8 విభిన్నమైన పాత్రలు పోషించారు. తోటమాలి, పోలీసు, హైదరాబాదీ మర్యాదస్థుడు, తిరుగుబోతు, అరటి పళ్ళ వ్యాపారి, యూరోపియన్‌గా నటించారీ చిత్రంలో. ఆమె ప్రతిభ నిదర్శనానికి ఈ ఒక్క చిత్రం చాలు.

రొమాంటిక్ సినిమాలకు కొంతకాలం ఆమె కేంద్రంగా ఉన్నారు. 1920ల నాటి సూపర్ హిట్ రొమాంటిక్ సినిమాలలో నటించారు. మాధురి (1928), అనార్కలి (1928), ఇందిర బి.ఎ. (1929) ముఖ్యమైనవి. ఈ మూడు సినిమాలకీ ఆర్.ఎస్. చౌదరి దర్శకత్వం వహించారు. ఈ కాలంలో ఆమె తన కెరీర్‌లో ఉన్నత స్థాయిలో ఉన్నారు, పరిశ్రమని ఏలారు. ఇంపీరియల్ ఫిల్మ్ కంపెనీకి మారారు. ఒక బాగ్దాదీ యూదు టెలిఫోన్ ఆపరేటర్ – తన కాలంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా ఎదగడం విశేషం!

అలా అని ఆమె జీవితంలో ఇబ్బందులేవీ లేవనుకోకూడదు. 1930ల నాటికి వచ్చేసరికి మూకీల శకం దాదాపుగా ముగిసింది. సాంకేతిక అభివృద్ధి సాధించడంతో ధ్వనిని చేర్చి, సంభాషణలు, స్క్రిప్టులతో టాకీలు ప్రారంభమయ్యాయి. హిందూస్థానీ భాషలో నటీనటులకు గట్టి పట్టుండడం అవసరమైంది. ఇది యూదు మూలాలున్న రూబీకి కొంత కష్టమైంది. ఇక్కడే ఆమె దృఢనిశ్చయం, పట్టుదల కనబరిచారు. ఒక ఏడాది పాటు విరామం తీసుకుని హిందీలో పట్టు సాధించారు. మళ్ళీ చిత్రసీమలోకి ప్రవేశించి ‘మాధురి’ అనే టాకీ చిత్రంతో ప్రేక్షకులని అలరించారు.

ఆ కాలంలో ఎంతో ప్రఖ్యాతి చెందిన డి. బిల్లిమోరియాతో ప్రణయం నెరపారు. ఆయనతో మాత్రమే కొన్ని సినిమాలు చేశారు. తన శ్రమ, పట్టుదల కారణంగా – రూబీ ఆనాటి మహిళలకి లభించని అత్యంత వైభవోపేతమైన జీవితాన్ని గడిపారు.

అయితే క్రమంగా ఆమె కెరీర్ పతనమవసాగింది. అదే సమయంలో ఆమె వ్యక్తిగత సంబంధాలు దిగజారాయి. ఆమె ఇంపీరియల్ కంపెనీని వీడారు. కానీ కొత్త సినిమాలలో అవకాశాలు రాలేదు. పరిశ్రమలో ఎప్పటినుండో పాతుకుపోయి ఉన్న పితృస్వామ్య భావన – పాత తరం నటీమణులను కొనసాగనీయలేదు. కొత్త తరానికి చెందిన మరింత ఆకర్షణీయమైన యువతులను కోరుకుంది. ఇదే కాక, 1947లో విడుదలైన దిలీప్ కుమార్ చిత్రం ‘జుగ్ను’ నిషేధానికి గురి కావడం కూడా ఆమె కెరీర్ ముగిసిపోవడానికి ఒక కారణం. ఎందుకంటే ఈ సినిమాలో ఒక ముసలి ప్రొఫెసర్‌కి, రూబీకి మధ్య రోమాన్స్ నడుస్తుంది. అది సమాజపు నైతికత పునాదులను కదిలించింది.

సులోచన పేరుతో కీర్తి ప్రతిష్ఠలు సాధించి, ఆ పేరుతోనే మృతి చెందిన రూబీ మేయర్స్ వినోద పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. 1930లలో తన పేరుతో రూబీ పిక్స్ అనే స్టూడియో కూడా నిర్మించారు. 1973లో ఆమెకు భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది. భారతీయ యూదులు సినీరంగ పరిశ్రమకి చేసిన సేవలను ప్రస్తుతిస్తూ రూపొందించిన డాక్యుమెంటరీ ‘షాలోమ్ బాలీవుడ్’ (2017)లో రూబీకి స్థానం దక్కింది. రూబీ 10 అక్టోబర్ 1983 తేదీన ముంబాయిలో మరణించారు.

Exit mobile version