[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.
మీనా కుమారి, కమల్ అమ్రోహిల విషాదాంత ప్రేమ కథ:
దర్శకనిర్మాత, రచయిత కమల్ అమ్రోహి మీనాకుమారిని తొలిసారిగా 1938లో కలిసారు. అప్పుడాయన సోహ్రాబ్ మోడీ సినిమాకి రచన చేస్తున్నారు. ఆ సినిమా కోసం ఏడేళ్ళ పాప అవసరమయింది. కమల్ దాదర్‍లోని మాస్టర్ ఆలీ బక్ష్ గారింటికి వెళ్ళారు, వాళ్ళ పాప బాల నటి. తింటున్న అరటిపండుని గబగబా నోట్లో కుక్కుకుని ఆ చిన్నారి గబగబా ఆ పాప గదిలోకి వచ్చింది. తనే మాహెజభీన్ (మీనా కుమారి అసలు పేరు). ఆలీ బక్ష్ ఆమెని కోప్పడి పూర్తిగా తిని చేతులు కడుక్కుని రమ్మన్నారు. ఆ మాహెజభీన్ తరువాతి కాలంలో మీనా కుమారి అయ్యారు. అమ్రోహికి తను బాగా నచ్చారు, కానీ ఆ పాత్ర మరొక బాలనటికి దక్కింది. దాదర్ మీదుగా వెళ్ళినప్పుడల్లా, తన మిత్రుడి ఇంటి కేసి చూపిస్తూ… భవిష్యత్తు హీరోయిన్ ఇక్కడ ఉంది అని మిత్రులతో చెప్పేవారట.
చాలా ఏళ్ల తర్వాత, అమ్రోహి – బాంబే టాకీస్ వారి కోసం తాను దర్శకత్వం వహిస్తున్న ‘మహల్’ చిత్రం కోసం కథానాయిక కోసం అన్వేషిస్తూండగా, ఎవరో మీనా కుమారి పేరు సూచించారట. ఆమెని గుర్తించలేక, వద్దనేసారట. ఆ పాత్ర చివరికి మధుబాలకి దక్కింది. మరికొన్ని సంవత్సరాల తర్వాత ఆయనే ఫిల్మిస్థాన్ వారి ‘తమాషా’ (1952) చిత్రంతో మీనా కుమారిని పరిచయం చేశారు. అప్పటికీ ఆమే మాహెజభీన్ అని ఆయన గుర్తించలేదు. అప్పటికి ఆమె వయసు 19 ఏళ్ళు కాగా, ఆయనకి 34 ఏళ్ళు. అప్పటికే ఆయనకి రెండు పెళ్ళిళ్ళు అయ్యాయి (రెండో భార్య మెహమూదీ ద్వారా ముగ్గురు పిల్లలు – షాన్‌దార్, తాజ్‌దార్, రుఖ్సార్ – కలిగారు).
తర్వాతి కాలంలో కమల్ – మధుబాలతో అనార్కలి తీయాలనుకున్నారు. అయితే నిర్మాతకీ, మధుబాల తండ్రి అతాఉల్లా ఖాన్‌కు మధ్య విభేదాలు రావడంతో, మధుబాల ఆ చిత్రంలో నటించేందుకు తిరస్కరించారు. అప్పుడు కమల్ మీనా కుమారి పేరు సూచించారు. కానీ షూటింగ్ మొదలవక ముందే మీనా కుమారికి యాక్సిడెంట్ జరిగి, పూణె లోని ఆసుపత్రిలో ఐదు నెలలు ఉండాల్సి వచ్చింది. ఆ పాత్రని తన కోసం ఇంకా ఉంచుతారని మీనా కుమారి అనుకోలేదు. కానీ కమల్ మాత్రం వారాంతాలలో వెళ్ళి ఆమెని కలిసేవారు.
ఆమెకి భరోసా ఇచ్చేందుకు గాను ఆమె చేతి మీద ‘నా అనార్కలి’ అని రాసి సంతకం పెట్టారట. ఆ సినిమా ఆగిపోయింది కానీ, వారి మధ్య ప్రేమ అంకురించింది. కుటుంబ సభ్యులు అభ్యంతరం చెబుతారేమోనని, రాత్రంతా దుప్పటి కప్పుకుని కమల్‍తో నెమ్మదిగా ఫోన్‌లో మాట్లాడేవారుట మీనా.
ఓ రోజు కుటుంబ సభ్యులతో గొడవ జరగడంతో ఇంట్లోంచి శాశ్వతంగా బయటకి వచ్చేసి, కమల్ దగ్గరకి వెళ్ళిపోయారు. రాత్రికి రాత్రే ఓ ఖాజీ వారిద్దరికి నిఖా జరిపించారు. అది 15 ఫిబ్రవరి 1952.
అయితే కమల్ కొన్ని షరతులు పెట్టారు. అవి – ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలు అయిపోయాక, కొత్త సినిమాలు ఒప్పుకోకూడదు; అర్ధనగ్నంగా నటించకూడదు; సాయంత్రం ఆరు గంటల తర్వాత ఇంటికి వచ్చేయాలి; సహనటుల నుంచి ఎప్పుడూ లిఫ్ట్ తీసుకోరాదు. “చిన్నమ్మ వీటన్నింటికి ఒప్పుకుంది” అన్నాడామె సవతి కొడుకు తాజ్‌దార్ అమ్రోహి.
అయితే త్వరలోనే ఆమె – సుమారు నాలుగేళ్ల వయసు నుంచి అనుభవిస్తున్న ఆర్చ్‌లైట్ల కాంతి లోపించడం గుర్తించారు. ఆమె కెరీర్ మందగించింది. ‘పరిణీత’ (1953), ‘శారద’ (1957) – ఆమెకి ఓ ‘దేవి’ ఇమేజ్‌ని కల్పించాయి. ప్రజలు ఆమె ఫోటోని పూజించేవారు. కొందరు ఆమె కేశాలను సంపాదించి తాయొత్తులలో ఉంచుకున్నారు. అయితే ఆమె ఆదాయంలో వాటా కోసం ఆశపడిన కొందరు స్వార్థపరులు – ఆమె భర్త ఆమెని నియంత్రిస్తున్నారనీ; ఆమె పంజరంలో పక్షి అని ప్రచారం చేశారు.
“సినిమాల్లో విజయవంతమయ్యాకా, ఆమె మా నాన్నకిచ్చిన వాగ్దానాలను పాటించలేదు. గృహిణిగా లేదా పిల్లల్ని కనే యంత్రంగా ఉండలేనని నాన్నతో అన్నారు.” చెప్పారు కవయిత్రి, మీనా కుమారి సవతి కూతురు రుఖ్సార్ అమ్రోహి. “అయినా పిన్ని అంటే నాకెంతో ఇష్టం” అన్నారు.
భర్త నియంత్రణ, గృహహింస, ఇంకా తాగుడుకి బానిసయ్యారనీ, సహనటులతో సన్నిహితంగా ఉంటున్నారనే పుకార్లు ఉండేవి. బాత్‌రూమ్‌లో ఉంచిన డెటాల్ సీసాలలో మద్యం దాచేవారని ఆరోపణలు వచ్చాయి. “ఒకసారి చిన్నమ్మ బాత్‌రూమ్‍లో పడిపోయింది. వైద్యం చేయిస్తే కుట్లు పడ్డాయి. కానీ ఆ మర్నాడే ఆమె షూటింగ్‌కి వెళ్ళారు. ఏమయిందని అడిగితే ఆమె మౌనంగా ఉండిపోయరు. ఆమెని కొట్టారని అందరూ అనుకున్నారు” చెప్పారు తాజ్‌దార్ తన తండ్రిని సమర్థిస్తూ.
“తనకి పేరు ప్రతిష్ఠలు తెచ్చిపెట్టిన ట్రాజెడీ క్వీన్ పాత్రలతో మమేకం అయ్యేవారు. తాను నిజ జీవితంలో కూడా ఓ ట్రాజెడీ క్వీన్ అని జనాలు అనుకోవాలని ఆమె కోరుకున్నారు. ఆమె వదనం కూడా బాధల్లో ఉన్న స్త్రీలా, విచారంగా ఉన్న స్త్రీగా ఉండేవారు” చెప్పారు రుఖ్సార్. “వారిద్దరూ కలిసి ఉండలేకపోయారు. జనాలు నాన్న పిన్నిల మధ్య అగాధాలు సృష్టించారు. నాన్న గురించి లేనిపోనివి కల్పించి చెప్పారు. దాంతో వారి మధ్య దూరం మరింత పెరిగింది.” అన్నారు రుఖ్సార్.
1958లో రేడియో సిలోన్‌కిచ్చిన ఒక స్పాన్సర్డ్ ప్రోగ్రామ్‌లో మీనాకుమారి – 1956లో తన భర్త సొంత ఊరు అమ్రోహా వెళ్ళినప్పటి వివరాలను ఎంతో ఆసక్తికరంగా వివరించారు. ఆయన కుటుంబ సభ్యుల గురించి ఎంతో అభిమానంతో మాట్లాడారు. అక్కడి అక్కడి షా షరీఫుద్దీన్ షా వలాయత్ గురించి ఘనంగా చెప్పారు. తన మరణం తర్వాత అక్కడ తనకు చోటు దక్కితే అది తన అదృష్టం అన్నారు. కమల్ అమ్రోహి గురించి ఎంతో ప్రేమగా, గౌరవంగా మాట్లాడారు. అలాంటి వాళ్ళిద్దరూ తమ జీవితంలో విడిపోతారని ఎవరూ ఊహించలేదు. ఇది జరిగిన ఆరేళ్ళకి ఆమె ఆ బంధం నుంచి బయటకు వచ్చేశారు. ఈ తీవ్రమైన నిర్ణయానికి దారి తీసిన పరిస్థితులేమిటి? అందరూ అనుకుంటున్నట్లుగా అమ్రోహీతో ఆమె వివాహం విఫలమయిందా? కొందరన్నట్లు ఆయన ఆమెతో ఏ సమయంలోనైనా సరిగా ప్రవర్తించలేదా?
1964 మార్చి నెలలో మీనాకుమారి భర్తని విడిచి తన సోదరి మధు (నటుడు మహమూద్ భార్య) ఇంటికి వచ్చేసారు. ఆమెని తీసుకురావడానికి కమల్ వెళ్ళారు కానీ, ఆమె తలుపు తీయలేదు. “నువ్వు వచ్చేసిన ఇంటి తలుపులు నీకోసం ఇంకా తెరిచే వున్నాయి. నీకెప్పుడు కావలనిపిస్తే అప్పుడు తిరిగి రావచ్చు” అన్నారట ఆయన.
తమ మధ్య బంధాన్ని నాశనం చేసేందుకు కొందరు కుట్ర పన్నారనీ, మీనాని తమకి అనువుగా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. 12 ఏళ్ళ తమ కాపురంలో ఇబ్బందులు గాని, విభేదాలు గాని లేవని చెప్పారు. కానీ ఒకసారి మీనాకుమారి అత్యధిక పారితోషికం అందుకునే తారగా ఎదిగాక, కొందరు అసూయ పడడం ప్రారంభించారని ఆయన అన్నారు. ఆమె ఆదాయంలో వాళ్ళు వాటా కోరుకున్నారని చెప్పారు. తమ సినిమాలలో మీనాకుమారి మాత్రమే హీరోయిన్‍గా నటించాలని కోరుకునే నిర్మాతలు ఉన్నారు, అయితే మీనాకుమారి అమ్రోహీతో ఉన్నంత కాలం తమ ఆటలు సాగవని వారికి తెలుసు. వారే, మీనాకుమారి బంధువులతో కలిసి, తమ మధ్య విభేదాలు సృష్టించడానికి కుట్ర చేశారని అన్నారు.
రెండేళ్ళ పాటు ఆమె ‘సానుభూతిపరులు’ (నటుడు మహమూద్, ఆయన భార్య అని అంటారు) తన భార్యకి బ్రెయిన్ వాష్ చేసారని, అందుకే ఆమె ఎదుగుదలకు తనను ఆటకంగా భావించిందని ఆయన చెప్పారు. తాను ఆమెను సరిగా చూసుకోవడం లేదని పుకార్లు పుట్టించారని అన్నారు. అయితే ఆమె కీర్తిప్రతిష్ఠలని దెబ్బతీసే సినిమాలను ఒప్పుకోవద్దని ఆమెకి తాను చెప్పిన మాట నిజమేనని ఆయన అంగీకరించారు. ఆమె మేలు కోసమే కొన్నిసార్లు కఠినంగా వున్న మాట వాస్తవమేనన్నారు.
అయితే కొద్ది నెలల్లోనే, మీనాకుమారి తనని తప్పుదోవ పట్టించారని తెలుసుకున్నారని చెప్పారాయన. ఆ రోజుల్లో ఆమె తన సోదరి ఇంట్లో ఉండేవారు. తాను మోసపోయానని గ్రహించిన ఆమె ఫోన్‍లో అమ్రోహిని సంప్రదించడానికి ప్రయత్నించారట. ఆ ఫోన్ తీసిన ఆయన స్నేహితుడు – అమ్రోహీ ఊర్లో లేరని చెప్పారట… అప్పుడు మీనా వెక్కిళ్ళు పెడుతూ, బాగా క్రుంగిపోయి ఉన్నారని ఆయన గ్రహించాడట. ఆమె ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడానికి ప్రయత్నించి విఫలయ్యారట. మీనాకుమారి సోదరి ఇంట్లోంచి కూడా వెళ్ళిపోయారు. తర్వాత, జుహులోని జానకి కుటీర్‍లో ఒక ఇంట్లో నివాసం ఉండసాగారు. తనతో విడిపోయినా కూడా – ఏ అనారోగ్యం వచ్చినా, ఏ సాయం కావల్సినా – తననే తలచుకునేవారని అమ్రోహీ అన్నారు. 1967లో ఆమె ఆయనని తన ఇంటికి పిలిచి – ఆపేసిన ‘పాకీజా’ చిత్రాన్ని మళ్ళీ ప్రారంభించమని బ్రతిమాలారట. “మూడేళ్ళ తర్వాత మళ్ళీ కలిసారు. ఇద్దరూ కలిసి భోం చేశారు. ఆమె తన డైరీని చదవమని ఆయనికిచ్చారు. ఆ తరువాతి రెండేళ్ళూ వాళ్ళిద్దరూ తరచూగా కలుసుకున్నారు. కానీ బాధాకరమైన ఆ గతం గురించి మాత్రం మాట్లాడుకునేవారు కాదు. అయితే తన సన్నిహితులయిన సంగీత దర్శకుడు ఖయ్యాం, ఢిల్లీ డిస్ట్రిబ్యూటర్ సయీద్ భాయ్, ఆయన భార్యలతో – తన సంసారాన్ని కొందరు నాశనం చేశారని, వారిని భగవంతుడు క్షమించడని మీనాకుమారి వాపోయారట.
పరువుకి భంగం కలగడంతో పాటు, తాను తీయాలనుకున్న భారీ చిత్రం ‘పాకీజా’ (1964లో షూటింగ్ ప్రారంభమైంది) ఆగిపోవడంతో కమల్ క్రుంగిపోయారు. అదే సమయంలో, చెదిరిన సంబంధ బాంధవ్యాలు, మద్యం, పట్టించుకోని బంధువులు, అనారోగ్యం, వంటి కారణాలతో మీనాకుమారి ఒంటరి అయ్యారు.
ఖయ్యాం, సునీల్ దత్, నర్గిస్ వంటి శ్రేయోభిలాషులు ‘పాకీజా’ చిత్రాన్ని పూర్తి చేయవలసిందిగా కమల్‍ని కోరారు. కానీ కాలమూ, వేదన తన ప్రభావం చూపాయి. “మీరు నన్ను పాత మీనాకుమారిలా చూపించగలరా?” అని కమల్‍ని అడిగారు. చూపిస్తానని ఆయన భరోసా ఇచ్చారట.
కమల్ వ్రాసిన మౌసమ్ హై ఆశిఖానా అనే పాటతో 1968లో షూటింగ్ తిరిగి ప్రారంభించారు. ఫిల్మాలయాలో సెట్స్ వేశారు. ఆ తరువాత మరికొన్ని సీన్లు అవుట్‌డోర్‍లో తీశారు. లివర్ సిరోసిస్ వల్ల మీనాకుమారి పొట్ట ఉబ్బిపోయింది. దాన్ని దాచేందుకు గాను, ఆమెకు పొడవాటి లుంగీ కుర్తా ధరింపజేశారు. అలసిపోయినా, షాట్ రెడీ అనగానే లొకేషన్‌కి వచ్చి ఆమె నటించారు. ప్రతీ షాట్ అయిన వెంటనే యూనిట్ సభ్యులు ఆమెకి కుర్చీ చూపించేవారట. పద్మ ఖన్నా ఆకృతి, రూపం సరిపోలడంతో, ఆమెను మీనాకుమారి డూప్‌గా ఉపయోగించుకున్నారు. ‘చల్తే చల్తే’ పాటలో నర్తించిన ఒక బ్యాక్‌గ్రౌండ్ డాన్సర్‌ని కూడా – సాహిబ్‌జాన్ (మీనాకుమారి) పెళ్ళి నుంచి తప్పించుకుని సలీంతో (రాజ్ కుమార్) పారిపోయే సీన్‌లో వినియోగించారు. ‘చలో దిల్‌దార్ చలో’ పాటలో ఒక్కసారి కూడా మీనాకుమారి ముఖాన్ని చూపించరు, ఠేకేదార్ నుంచి తప్పించుకుని రైలు పట్టాలపై పరిగెత్తే సీన్‍లో కూడా డూప్‌ని ఉపయోగించారు. చివరి పాట – ‘ఆజ్ హమ్ అప్నీ దువావోం కా అసర్ దేఖేంగే’లో మీనాకుమారి గుండ్రంగా తిరిగి, వీణా గారి చేతుల్లో వాలిపోవాలి. ఇది చేయడం ఆమెనెంతో ఇబ్బంది పెట్టింది. కూర్చున్న భంగిమలోనే క్లోజ్-అప్స్ తీసుకున్నారట. విభేదాలు తలెత్తన ఆ జంటని తిరిగి కలిపిన చిత్రం ‘పాకీజా’. ఈ చిత్రం షూటింగ్ సందర్భంగా భార్యాభర్తలిద్దరూ ఒకే లంచ్ బాక్స్ నుంచి భోజనం చేసేవారు. కాని విడి విడి గదుల్లో ఉండి తగినంత దూరంగా ఉన్నారు. తొలుత బ్లాక్ అండ్ వైట్ లోనూ, తర్వాత కలర్ లోనూ, చివరికి సినిమాస్కోప్ లోనూ చిత్రీకరించిన ‘పాకీజా’ ప్రీమియర్ షోను మరాఠా మందిర్‍లో 4 ఫిబ్రవరి 1972 నాడు ప్రదర్శించారు. తెల్లటి ఘరారా దుస్తుల్లో హాజరైన మీనాకుమారికి పూవులు, ప్రశంసలు దక్కాయి.
“ఆ ప్రీమియర్‌కి మీనాకుమారి మా నాన్న చేయి పట్టుకుని హాజరయ్యారు. ‘మీరు నన్ను ఎంతో అందంగా చూపించారు, నమ్మలేకపోతున్నాను’ అని నాన్నతో అంటూ, సినిమా చూస్తున్నంత సేపూ ఏడుస్తూనే ఉన్నారు.” . సినిమా చూడడం పూర్తయ్యాకా, “ఈ సినిమా తర్వాత ఇక సినిమాలు చేయనని నాకు మాట ఇవ్వండి” అని భర్తని అడిగారట మీనాకుమారి.
సినిమా విడుదలయ్యాకా, కొందరు ఉమ్మడి స్నేహితులు – మీనాకుమారిని ఇంటికి తీసుకురమ్మని కమల్‍కి చెప్పారట. అయితే అలా చేయడం ఆమెకి గతాన్ని గుర్తు చేసి బాధపెడుతుందని, ఆమె ఆరోగ్యం దెబ్బతినవచ్చని, వద్దని అన్నారట ఆయన. అయినా రోజులో ఎక్కువ సేపు వాళ్ళిద్దరూ కలిసే ఉండేవారు. ఈ ఏర్పాటు ఆమెకి సంతృప్తిగానే ఉండేదమో.
అయితే సినిమాకి పెద్దగా స్పందన రాలేదు. ఆమె ఆరోగ్యం క్షీణిస్తుండడంతో మార్చి నెలలో ఆమెను ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింది. “నా సంసారాన్ని నాశనం చేసినవాళ్ళని నేనెన్నటికీ క్షమించను” అనేవారు చివరి రోజుల్లో. రోజూ సూర్యాస్తమయాన్ని చూసేవారు. మరణించాలని లేదనేవారు.
“నేనిక ఎక్కువ కాలం బతకను. మీ చేతుల్లో మరణించాలనేదే నా కోరిక” అని మార్చి 29న నర్సింగ్ హోమ్‍లో కోమాలోకి వెళ్ళేముందు చివరిసారిగా మీనాకుమారి తనతో అన్నారని కమల్ గుర్తు చేసుకున్నారు.
కోమాలోకి వెళ్ళిపోయాకా, చికిత్సకి స్పందించకపోవడంతో – వైద్యం ఆపేయడానికి వైద్యులు కమల్ అనుమతి కోరారట. వైద్యుల ఆశలన్నీ వమ్ము అయ్యాయి. సమయం గడిచిపోతోంది, కానీ ఫలితం లేదు. వెక్కి వెక్కి ఏడుస్తూ, ఆమె మంచం పక్కనే కూర్చున్నారట కమల్. 31 మార్చ్ 1972 నాడు మధ్యాహ్నం సుమారు 3.20 నిమిషాలకు, కమల్ నెమ్మదిగా ఆమె నుదురుని తాకి, ముంగురులను సవరించారు. ఆ మరుక్షణమే ఆమె హృదయస్పందన నిలిచిపోయింది.
ఆ రోజు గుడ్ ఫ్రెడే. మీనాకుమారికి అప్పుడు 40 ఏళ్ళు.
అప్పటికి కమల్ భార్యగానే ఉండడంతో, వారి కుటుంబంలోని మృతులకు అంత్యక్రియలు చేసిన చోటనే – మాజగావ్ లోని రహ్మతాబాద్‌లో పూడ్చిపెట్టారు. అప్పుడు ‘పాకీజా’ చిత్రం తొమ్మిదవ వారంలో ఉంది. ఆమె మరణం తర్వాత ఆ సినిమా కలెక్షన్లు పెరిగాయి. కమల్ మరో రెండు దశాబ్దాలు జీవించి 11 ఫిబ్రవరి 1993న మృతి చెందారు. ఆయనను మీనాకుమారి సమాధి పక్కనే పూడ్చిపెట్టారు.
అద్భుతమైన ఫోటోగ్రాఫర్ జితేంద్ర ఆర్య:
కాలంలోని ఓ క్షణాన్ని కెమెరాలో బంధించి, దానికి శాశ్వతత్వం కల్పించడం ఫోటోగ్రఫీలోని సౌందర్యం. కాలంలో కరిగిపోయే క్షణాలకు అందమైన రూపం కలిగించే కళాకారుడు ఫోటోగ్రాఫర్. తన కళ ద్వారా మాయ చేసి ఎన్నో జ్ఞాపకాలను రేకెత్తించగలడు ఓ అద్భుతమైన ఫోటోగ్రాఫర్. అటువంటి గొప్ప ఛాయాగ్రాహకులలో జితేంద్ర ఆర్య ఒకరు.
జితేంద్ర ఆర్య కేవలం సెలబ్రిటీల ఫోటోలు తీయలేదు, తానూ స్వయంగా ఓ సెలెబ్రిటీ! 2011లో తాను చనిపోయేవరకు, ఆయన తీసిన సినీ నటీనటుల ఫోటోలు దేశవ్యాప్తంగా ఎన్నో పత్రికలలో ప్రచురితమయ్యాయి. ఆయన జీవితంపై అర్వా మామాజీ తీసిన లఘుచిత్రం ‘కీ-ఫుల్-కట్’లో రచయిత్రి శోభా డే మాట్లాడుతూ ఆర్య తీసిన జీనత్ అమన్ ఫోటోని గుర్తు చేసుకున్నారు. “అప్పట్లో నాకు 17-18 ఏళ్ళుంటాయి. ఆ ఫోటో చూసి అబ్బురంగా ఉండిపోయాను. ఎందరో యువ మోడల్స్ ఉండేవారు, జితేంద్ర ఆర్య ఫోటో తీసినవాళ్ళు ఉన్నత స్థానాని కెగసేవారు.” అన్నారు. ఫోన్‍లో మాట్లాడిన ఆర్య కుమారుడు, ఐఐటి బాంబేలో ప్రొఫెసర్ అయిన కవి – కూడా ఇలాంటి మాటలే అన్నారు. “ఈనాటి జనాలకు నాన్న కున్న స్టార్ స్టేటస్ తెలియకపోవచ్చు. కానీ మా చిన్నప్పుడు మేమేదైనా ట్రిప్ నుంచి తిరిగి వస్తే, కస్టమ్స్ అధికారులందరూ నాన్న అభిమానులయిపోయేవారు” అన్నారు.
నైరోబీలో పెరిగిన ఆర్య, చిన్నతనంలోనే ఫోటోగ్రాఫీ పట్ల ఆసక్తి పెంచుకున్నారు. పదేళ్ళ వయసులోనే మొదటి కెమరా పొందారు. 16 ఏళ్ళకి లండన్ వెళ్ళి హంగేరియన్-బ్రిటీష్ ఫోటోజర్నలిస్ట్ మైఖేల్ పెటో వద్ద సహాయకుడిగా చేరారు. కాలక్రమంతో తన సొంత స్టూడియోని తెరిచారు. ఒక పోర్ట్రెయిటిస్ట్‌గా ఆయన గొప్పదనం ఎన్నో ఫోటోలలో చూడవచ్చు – మాటనీ ఐడల్‌లా కనిపించే నాటక రచయిత హరోల్డ్ పింటర్, నోటిలో పువ్వు పెట్టుకుని చిరునవ్వు చిందించే నటి అంజు మహేంద్రు, న్యాయమూర్తి, రాయబారి ఎం.సి. చాగ్లా…. ఇలా ఎందరివో గొప్ప ఫోటోలు తీశారు ఆర్య. లండన్ లో ఉన్నప్పుడే పరిచయం అయిన్ వి.ఎస్. నయ్‍పాల్, కృష్ణమీనన్, ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్, మహరాణి గాయత్రి దేవి… తదితరులందరూ ఆయనతో ఫోటోలు తీయించుకున్నవారే.
1960 అక్టోబరులో ఆర్య కుటుంబంతో సహా ఇండియాకి వచ్చేసారు, ఎందుకంటే ఆయన భార్య ఛాయకి ‘సాహిబ్ బీబీ ఔర్ గులామ్’ చిత్రంలో చిన్న కోడలు పాత్ర లభించింది (కానీ చివరికి ఈ పాత్రని మీనాకుమారి పోషించారు). టైమ్స్ గ్రూప్‌కి ఆర్య ఛీఫ్ ఫోటో ఎడిటర్ అయ్యారు. తన వృత్తికి గౌరవాన్ని పెంచారు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో చేరాకా, పత్రికలో ఫోటోగ్రాఫర్ బైలైన్స్ ఉండాలని పట్టుబట్టారు. ఫెమినా, ఫిల్మ్‌పేర్ పత్రికలకు తీసిన ఫోటోల ద్వారా ఆయన కొత్త విప్లవానికి తెర తీశారు. ప్రాథమికంగా ఆయన ఫోటో జర్నలిస్టే అయినప్పటికీ, ఒక రకమైన గ్లామర్ ఫోటోగ్రఫీకి మార్గం సుగమం చేశారు.
లైట్ వర్క్స్ విషయంలో ఆయన ప్రతిభ స్పష్టంగా తెలుస్తుంది.
నెహ్రూ గాంధీ కుటుంబాలతో ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉండేవి. డెహ్రాడూన్‍లో సెక్యూరిటీ గార్డులు లేకుండా – నెహ్రూ, ఇందిర – నిలుచుని ఉండగా తీసిన ఫోటో అద్భుతం! అలాగే దేవ్ ఆనంద్ తన కొడుకుని ఎత్తుకుని ఉండగా తీసిన మరో ఫోటో కూడా! లండన్‌లో రాజ్ కపూర్, నర్గిస్‌లు విశ్రాంతిగా ఉండగా తీసిన ఫోటో చక్కనిది. ఫోటో తీయించుకునేవారికి సౌకర్యంగా ఉంచడం ఆర్య ప్రత్యేకత. ఫోటీ తీయించుకునేవారు, తీసేవారి మధ్య సమన్విత చర్య గోచరిస్తుంది. కొంత మంది తన పోర్ట్రెయిట్‌లని చూసి తాము ఏమనుకున్నది తరచూ ఆర్యతో చెప్పేవారు. ఎడ్వినా మౌంట్‌బాటెన్ తన ఫోటోని ఒకదాన్ని పంపుతూ – “ముక్కు మరీ వెడల్పుగా ఉంది, సరిచేయండి” అని రాశారట.
ఆర్య నెహ్రూ గారిని కేవలం నాలుగు సార్లే ఫోటో తీశారు. తనకి నెహ్రూ అంటే ఏమిటో తెలిపే ఒక ఫోటో కోసం ఆర్య ఎదురుచూశారు. అయితే నెహ్రూగారు చనిపోవడానికి కొద్ది రోజుల ముందు ఆర్య తీసిన ఫోటో ఆయనకు సంతృప్తి నిచ్చిందట. ఆర్య నెహ్రూ గారిని తొలిసారిగా 1956లో తన గురువు మైఖేల్ పెటోతో కలిసారు, అప్పట్లో నెహ్రూ గారిపై ఒక డాక్యుమెంటరీ తీయాలనేది వారి ఉద్దేశం. ఆ సమయంలో ఆర్య నెహ్రూ కుటుంబానికి సన్నిహితులయ్యారు. వారిని ఎన్నోసార్లు కలిసారు. ఆ తొలి రోజుల్లోనే శ్రీమతి విజయలక్ష్మి పండిట్ లండన్‌లో ఆర్యకి తన మేనకోడలు ఇందిరను పరిచయం చేశారు.
ఇతర ఫోటోగ్రాఫర్లు ఒక్క ఫోటో తీయడానికే బోలెడు సమయం తీసుకుంటారు, కానీ ఆర్య మాత్రం చాలా వేగంగా, నాణ్యమైన ఫోటోలు తీసేవారు. ఈ విషయంలో ఆయన – వీలైనంత తక్కువ సమయంలో ప్రత్యర్థిని చిత్తు చేసే మాస్టర్ సమురాయ్ వంటి వారు. ‘సింపుల్‍గా ఉంచాలి, సరైన యాంగిల్ చూసుకోవాలి, ఫోటో తీయించుకునేవారి నుంచి సరైన దూరం ఉండాలి, కాంతిని సరి చూసుకోవాలి, ఫ్లాష్ వాడవద్దు’ అని ఫోటోగ్రఫీలోని చిట్కాలను ఆర్య తన కుమారులకు వివరించారు.
శ్రీ కుష్వంత్ సింగ్ తన ‘Truth, Love And A Little Malice’ పుస్తకంలో – ఆయన ఆర్యని సీరియల్ కిల్లర్ రామన్ రాఘవ్ నేరవిచారణకి తీసుకువెళ్ళినట్టు రాశారు. రామన్ నల్లగా, పొట్టిగా, దృఢంగా ఉందేవారు, వయసు నలభైలలో ఉండేదేమో అప్పట్లో. ఫోటోగ్రాఫర్‍ని చూడగానే రామన్ కేకలు వేస్తూ, గదంతా పరుగులు తీస్తూ, అందరినీ తిట్టసాగాడు. ఆర్యని పంపించేయమని కుష్వంత్ సింగ్ అన్నారుట. ‘అతన్ని నెమ్మదించనీయండి’ అన్నారుట ఆర్య. ‘ఆర్య ఎన్నటికీ క్రైమ్ ఫోటోగ్రాఫర్ కాలేడు అని అనుకున్నాను’ చెప్పారు కుష్వంత్ సింగ్.