[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.
హాలీవుడ్ శాపగ్రస్త నటి జీన్ టియర్నీ:
హాలీవుడ్‍లో శాపగ్రస్తురాలని పేరు పొందిన నటి జీన్ టియర్నీ. ఆమె దురదృష్టవంతమైన జీవితం – అగాథా క్రిస్టీ ఒక నవలకి ప్రేరణ అయిందని అంటారు.
ట్వెంటియెత్ సెంచురీ ఫాక్స్ స్టూడియో యజమాని డారిల్ ఎఫ్. జనుక్ ఎందరో హాలీవుడ్ అందాల నటీమణులకు కాంట్రాక్టులిచ్చి తమ సంస్థ కోసం పని చేయించుకున్నారు.
అలాంటి ఆయన మెచ్చిన హాలీవుడ్ సుందరాంగి జీన్ టియర్నీ.
ఆమె గురించి ఇలాంటి ప్రశంసలు అసాధారణమేమీ కావు. ఆకుపచ్చని కళ్ళు, అందంగా చెక్కినట్టు ఉండే దవడ యెముకలు, ఆమెకి మరింత అందాన్నిచ్చేవి. అందమైన రూపంతో పాటు అభినయంలోని ప్రజ్ఞ ద్వారా 1940లలో ఆమె ఎన్నో హిట్ చిత్రాలను ఇచ్చారు. వీటిల్లో Leave Her to Heaven, The Razor’s Edge, Laura, The Ghost and Mrs. Muir వంటివి ముఖ్యమైనవి.
ఆమె తెర వెనుక జీవితంలో కూడా ఆమె పోషించిన పాత్రల వలె ఎంతో నాటకీయత ఉండేది. ఒక అపరిచితుడిని కలిస్తే చాలు, ఎన్నో విపరీత ఫలితాలనిచ్చే పరిణామాలు గొలుసుకట్టులా వరుసగా సంభవించేవి.
దిగ్గజ డిజైనర్ ఒలేగ్ కాసినిని వివాహం చేసుకున్నారామె. హాలీవుడ్ క్యాంటిన్ వద్ద World War II USO ప్రదర్శన జరుగుతుండగా, రూబెల్లా తో బాధపడుతున్న మహిళా మెరైన్ ఒకామె, క్వారంటైన్‌ని వీడి, తన అభిమాన నటి అయిన టియర్నీని దర్శించడంతో, ఆమె ద్వారా నటికి కూడా ఆ జబ్బు సోకింది. ఫలితంగా, ఆమె 1943లో తమ కూతురు దారియాకు నెలలు నిండకుండానే జన్మనివ్వాల్సి వచ్చింది. రూబెల్లా ఆమె గర్భంలోని శిశువుకు ప్రమాదకారి అయ్యింది, పాప కేవలం మూడు పౌండ్ల బరువుతో పుట్టింది. జన్మతః పాక్షికంగా అంధురాలు, బధిరురాలు, మానసిక రోగి అయింది. తన పాపకి ఇలా అవడానికి అసలు కారణం – చాలా ఏళ్ళ తరువాత మళ్ళీ ఆ అభిమానిని కలిసినప్పుడు టియర్నీకి తెలిసిందట. మొదటిసారి టియర్నీని కలిసినప్పుడు తాను జబ్బుతో ఉన్నానని ఆ అభిమాని అంగీకరించిందట.
ఇదంతా ఎక్కడో చదివినట్టు అనిపిస్తోందా? మీరు అగాథా క్రిస్టీ అభిమానులయితే మీకు స్ఫురిస్తుంది. ఈ వ్యథాభరితమైన కథతో క్రిస్టీ 1962లో The Mirror Crack’d అనే పుస్తకం రాశారు. ఇదే పుస్తకం ఆధారంగా 1980లో ఎలిజబెత్ టేలర్ ప్రధాన పాత్రలో టియర్నీ జీవిత కథని సినిమాగా తీశారు.
అయితే క్రిస్టీ నవలలో ముగింపు మరోలా ఉంటుంది (చేదు వాస్తవాన్ని తెలుసుకున్న టేలర్ పాత్రధారి – నటి టియర్నీ వలె హతాశురాలై – ఆ అభిమానికిచ్చే కాక్‌టైల్‌లో విషం కలుపుతుంది). అయితే సినిమాకి ఏ మాత్రం తక్కువ కాదు నిజజీవిత సంఘటన… టియర్నీ జీవితాన్ని క్రుంగదీసింది.
ఈ విషాదం టియర్నీని జీవితాంతం వెంటాడింది. 1946లో భార్యాభర్తలిద్దరూ విడిపోయారు. అయితే 1948లో విడాకులు మంజూరు అయ్యేముందు ఇద్దరూ రాజీపడ్డారు. తరువాత వారికి టీనా అనే మరో కూతురు జన్మించింది. ఈ సమయంలోనే టియర్నీకి ఏకాగ్రత లోపించడం ప్రారభమయి, సినీ కెరీర్‍ని ప్రభావితం చేసింది.
అప్పట్లో ఆమె క్లార్ గేబుల్ సరసన మొగాంబో చిత్రంలో నాయికగా నటించాల్సి ఉంది, కాని టియర్నీ చేయలేకపోవడంతో ఆ పాత్రని గ్రేస్ కెల్లీ పోషించారు. రెండేళ్ళ తరువాత హంఫ్రీ బోగార్ట్ సరసన The Left Hand of God చిత్రంలో నటిస్తున్నప్పుడు మళ్ళీ జబ్బు పడ్డారు టియర్నీ. ఈ చిత్రం షూటింగ్ సందర్భంగా తన సహనటికి బోగార్డ్ ఎంతో మద్దతునిచ్చి, నిపుణుల సాయం తీసుకోవాల్సిందిగా కోరారు.
ఆమె ఒక సైకియాట్రిస్ట్ వద్దకు వెళ్లారు. తరువాత న్యూ యార్క్ లోని హార్క్‌నెస్ పెవిలియన్‍లో చేరారు. ఆ తరువాత కనెక్టికట్ లోని హార్ట్‌ఫోర్డ్ లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివింగ్‍లో చేరారు. తీవ్రమైన క్రుంగుబాటును నయం చేసేందుకు, అక్కడ ఆమెకు 27సార్లు ఎలెక్ట్రిక్ షాక్ లిచ్చారు (చాలా ఏళ్ల తరువాత ఆ షాక్ ట్రీట్‌మెంట్‌ను గుర్తు చేసుకుంటూ – అవి తనలో కొన్ని జ్ఞాపకాలను చెరిపేసాయని టియర్నీ చెప్పారు).
ఆ తరువాత సినిమాల్లోనూ, టివీలోనూ చిన్న చిన్న పాత్రలు పోషించారు. ఆమె చివరి ఫీచర్ ఫిల్మ్ -హాస్యంగా సాగే – ది ప్లెజర్ సీకర్స్ (1964). ఆమె చివరిసారిగా తెర మీద కనబడినది Judith Krantz రచన ఆధారంగా తీసిన మినీ సిరీస్ – Scruples- లో.
తన 71వ పుట్టినరోజుకి కొన్ని రోజుల ముందు టియర్నీ ఎంఫీసెమా వ్యాధితో 1991లో హ్యూస్టన్‌లో మరణించారు.
అలనాటి అందాల నటి రెహానా:
1940వ దశకం మధ్యలో రెహానా సినీరంగ ప్రవేశం ఒక తుఫానులా సినీ ప్రపంచాన్ని తాకింది. కొన్ని మరిచిపోదగ్గ సహాయక పాత్రలలో నటించాకా, కథానాయికగా జాతీయ సమైకత్యని చాటే ‘హమ్ ఏక్ హైఁ’ (1946) చిత్రంలో అవకాశం వచ్చింది. ఈ సినిమా దేవ్ ఆనంద్ తొలి చిత్రం కావడం యాదృచ్చికం.
1947లో ఫిల్మిస్థాన్ వారి రెండు సినిమాలు ‘షెహనాయి’, ‘సాజన్’ విజయవంతం కావడంతో రెహానా రాత్రికి రాత్రి సూపర్ స్టార్ అయిపోయారు.’షెహనాయి’ చిత్రంలో దిలీప్ కుమార్ తమ్ముడు నాసిర్ ఖాన్‌తో జోడీ కట్టారు. ఆ చిత్రం విజయవంతం కావడానికి ప్రధాన కారణం సి. రామచంద్ర అందించిన సంగీతం! ఈ చిత్రంలో అమీర్‌బాయ్ కర్నాటకీ గానం చేసిన ‘మార్ కటారీ మార్ జానా’ అనే పాట, సి. రామచంద్ర, శంషాద్ బేగం, మీనా కపూర్ పాడిన ‘ఆనా మేరీ జాన్ మేరీ జాన్ సండే కే సండే’ అత్యంత జనాదరణ పొందాయి. 40వ దశకం చివరి రోజులు, 50వ దశకం తొలినాళ్ళు ఆమె ప్రభ వెలిగిపోయింది. దిలీప్ కుమార్‍ని మినహాయించి ఆ నాటి టాప్ హీరోలందరితోనూ నటించారు. దేవ్ ఆనంద్‍తో ‘దిల్‌రుబా’; రాజ్ కపూర్‌తో ‘సున్‌హరే దిన్’, ‘సర్గమ్’; కిశోర్ కుమార్‌తో ‘ఛమ్ ఛమా ఛమ్’; ప్రేమ్‌నాథ్‌తో ‘సగాయి’, వంటి చిత్రాలలో నాయిక గాను, ప్రేమ్ అదీబ్ సినిమాలో ఓ నటిగాను నటించారు.
అయితే సినిమాలు హిట్ అయినప్పటికీ, ఆమె కెరీర్ మొత్తం – ఏ ప్రత్యేకతలేని నటనాశైలి, కృత్రిమం అనిపించే నటన తోనే కొనసాగారు. అయితే మరులు కొలిపే నృత్యాలు, వివాదాలు – 40వ దశకం చివరి రోజులు, 50వ దశకం తొలినాళ్ళలో – ఆమెను వార్తాల్లో ఉంచాయి. ‘సున్‌హరే దిన్’ చిత్రంలో నిగర్ సుల్తానాతో చేసిన ‘లెస్బియన్’ సన్నివేశం అయినా, ‘దిల్‌రుబా’ (1950) చిత్రంలో బాత్ రూమ్ సన్నివేశం అయినా – ఆమె మరో రకంగా వార్తల్లో నిలవడానికి కారణమయ్యాయి. నీతిరహితంగా ఉందని, అశ్లీలంగా ఉందని – ఆమె నటించిన ‘షిన్ షినాకి బూబ్ల బూ’ (1952) – సినిమాని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నిషేధించింది. ‘అతి రొమాన్స్, నేరస్థులను హీరోలుగా చిత్రీకరించడం, పవిత్ర వస్తువులను అపవిత్రంగా చూపించడం, వీటన్నింటి కారణంగా ప్రజా మర్యాదలకు, నైతికతకు విరుద్ధంగా ఉండడం’ వంటి కారణాలను చూపింది మంత్రిత్వ శాఖ.
1952 తర్వాత ఆమె కెరీర్ అతివేగంగా పతనమయింది. రంగీలీ (1952), ఛమ్ ఛమా ఛమ్, హజార్ రాతేం (1953), సామ్రాట్ (1954) ఇంకా ఢిల్లీ దర్బార్ (1956) వంటి చిత్రాలు బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయం పాలయ్యాయి. దీంతో విసుగుచెందిన ఆమె పాకిస్తాన్‌కి వెళ్ళిపోయారు. పాకిస్తాన్‌లో ఆమె తొలి చిత్రం సుధీర్‍తో జోడీగా నటించిన ‘షాలిమార్’ (1956). ఇది ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత మరికొన్ని చిత్రాలలో నటించినప్పటికీ, ఆమె పాకిస్తానీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయారు. బహుశా ‘రాత్ కే రాహి’ (1960) చిత్రం షూటింగ్ సమయంలో అనుకుంటా, ఆమె ఆ చిత్ర నిర్మాత ఇక్బాల్ షెహ్‌జాద్‌ని వివాహం చేసుకున్నారు. క్రమంగా సినిమాలను తగ్గించుకుని, కుటుంబ బాధ్యతలలో లీనమయ్యారు. కాని తరువాతి కాలంలో వారిద్దరూ విడిపోయారు. రెహానా సాబిర్ అహ్మద్ అనే వ్యాపారవేత్తని పెళ్ళి చేసుకున్నారు. ఆ తరువాత ఆమె మర్చిపోదగ్గ చిన్న పాత్రలలో జెబా కమల్ నటించిన ‘దిల్ నే తుఝే మాన్ లియా’, నయ్యర్ సుల్తాన దర్పణ్ నటించిన ‘దుల్హన్’ చిత్రంలోనూ కనిపించారు. ఈ రెండూ 1963లో విడుదలయ్యాయి.
ఆమె జనాల్లో చివరిసారిగా కనబడింది 1995లో ‘ది నిగర్ ఫిల్మ్ అవార్డ్స్’ పానెల్‌లో ఒక న్యాయనిర్ణేతగా.
23 ఏప్రిల్ 2013 నాడు రెహానా మృతి చెందారు.