Site icon Sanchika

అలనాటి అపురూపాలు-85

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

వయసు ఒక అంకె మాత్రమే అని నిరూపించిన భానుమతి రావు:

అది డిసెంబరు నెల, 2015 సంవత్సరం. ఓ 92 ఏళ్ళ నర్తకి తన భరత నాట్య ప్రదర్శనతో ఇంటర్‌నెట్‍లో సంచనలం సృష్టించారు. ఆవిడే భానుమతి రావు.

ఆవిడతో సంభాషించడమంటే, మేకప్, కాస్ట్యూమ్‌ లేకుండా మీరావిడ నృత్య ప్రదర్శనని తిలకిస్తున్నట్టే. తన జీవితం గురించి, తనకి నృత్యం ఎంత ముఖ్యమో ఆవిడ చెబుతూంటే, చేతి వేళ్ళలో ముద్రలు కనబడుతూనే ఉంటాయి. డిసెంబరు, 2015లో, భారతీయ విద్యా భవన్‍లో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో ఈ 92 ఏళ్ళ నర్తకి ‘కృష్ణా నీ బేగనే బారో’ అనే పాటకి చేసిన భరత నాట్యం 45-సెకన్ల క్లిప్ ఇంటర్‌నెట్‌లో బాగా వైరల్ అయింది. ఆవిడకి ఒక్కసారిగా అమిత జనాదరణ దక్కింది.

1923లో కేరళలోని కోళికోడ్‌లో జన్మించిన భానుమతి తొలుత కథకళి లోనూ, ఆ పిమ్మట భరత నాట్యంలోను దాదాపు రెండు దశాబ్దాల పాటు శిక్షణ పొందారు. “కథకళిలో మగవారి ఆధిపత్యం ఎక్కువ అన్నది నిజమే అయినా, మా అమ్మ ఆ నాట్యం నేర్చుకునేందుకు నన్నెంతో ప్రోత్సహించింది. మా గురువు గారు ఇంటికి వచ్చి నేర్పించేవారు. అందులో గొప్పతనం ఏంటంటే శరీరంలో ప్రతీ భాగం కథను ప్రదర్శిస్తుంది. ఆ తరువాత భరత నాట్యం కూడా నేర్చుకున్నాను” అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారావిడ.

24 ఏళ్ళ వయసులో లైబ్రరీ సైన్స్ చదివేందుకు ఆవిడ యు.కె. వెళ్ళారు. అక్కడ తన సంరక్షకుడి మిత్రుడైన రామ్ గోపాల్ నిర్వహించే నాట్య బృందంలో చేరారు. భారతీయ మూలాలు లేని యూరప్ ప్రేక్షకులంతా ఆమె ప్రదర్శనల పట్ల అచ్చెరువొందేవారు.

1950లలో – అంతర్జాతీయ న్యాయ వ్యవహారాల నిపుణుడైన తన భర్త కృష్ణారావుతో న్యూ యార్క్‌కి వెళ్ళేంతవరకు ఆమె రామ్ గోపాల్ బృందంతోనే ఉన్నారు. “ఆయన నా కోసం పాడేవారు” అన్నారావిడ, కానీ ఆ పాటల పేర్లు గుర్తు చేసుకోలేకపోయారు.

అమెరికాలో ఆవిడ సుప్రసిద్ధ నాట్యకారులు భాస్కర్ రాయ్ చౌదరి గారితో కలిసి చాలా ఏళ్ళు ప్రదర్శనలిచ్చారు.

విదేశాలలో ప్రదర్శనలిచ్చే కాలంలో భానుమతి నాట్యంలో ఎన్నో ప్రయోగాలు చేశారు. శరీర కదలికలని మణిపురి నాట్యం మాదిరి చేస్తూ, ముఖంలో కథకళి మాదిరి భావ వ్యక్తీకరణ చేస్తూ, వీలైన చోట్ల భరత నాట్యంలోని అంశాలను ప్రవేశపెడ్తూ తనకంటూ వినూత్న శైలిని ఏర్పర్చుకున్నారు.

రంగస్థలంపై ఓ నర్తకిగా, ఓ నాట్య గురువుగా ఆమె విదేశాలలో ఎంతో మందికి కథకళిని, భరత నాట్యాన్ని పరిచయం చేశారు.

భానుమతి అపరిచితులకు సైతం నాట్యం నేర్పారు, అయితే తాను సాధన చేయడం, ప్రదర్శనలీయడం చూసి తన కుమార్తెలు కూడా నాట్యం నేర్చుకున్నారని చెప్పారావిడ.

“మా అమ్మ పని నుండి వచ్చాకా, మేమంతా హాల్‌ని పూర్తిగా సర్ది, స్థలం ఏర్పరిచేవాళ్ళం. అర్ధరాత్రి దాకా సాధన చేసేవాళ్ళం” చెప్పారు ఆవిడ చిన్న కుమార్తె తారా రావు. తార ఆమ్నెస్టీ ఇండియా సంస్థలో పనిచేస్తారు.

కూతుర్లిద్దరూ భరత నాట్యం నేర్చుకున్నా, పెద్ద కూతురు మాయ కథకళి సైతం నేర్చుకున్నారు.

“అమ్మ నాకు కొన్నేళ్ళ పాటు నాట్యం నేర్పింది. నా తొలి గురువు అమ్మే. నేను చేసిన కొన్ని నృత్యాలకు దర్శకత్వం కూడా వహించింది” చెప్పారు న్యూఢిల్లీలో ఉంటున్న మాయా కృష్ణారావు. తను కథకళి ప్రదర్శకురాలు, గురువు, రంగస్థల సాధకురాలు.

తనకి వయసు నలభైలు రాగానే భానుమతి నాట్యం నుంచి విరమించుకున్నారు. ఆపై ఢిల్లీలో మలయాళ రంగస్థలాన్ని ప్రచారం చేయడంలో కీలక పాత్ర పోషించారు. మలయాళ రంగస్థలం మీద కథకళి అంశాలు ప్రదర్శించడం ద్వారా – న్యూ ఢిల్లీలో దక్షిణాది కళా రూపాలు విస్తృతమయ్యేందుకు ఆవిడ కృషి చేశారు.

“మలయాళం సాహిత్యం నుంచి కథలను ఎన్నుకుని, స్క్రిప్టు రూపొందించి, రూపకాలకు నిర్మాతగా, దర్శకురాలిగా వ్యవహరించి, నటించింది అమ్మ. ఈ విధంగా ఉత్తరాదిలో మలయాళ రంగస్థలానికో గుర్తింపు తెచ్చింది. ఎప్పుడూ మునివేళ్లపైనే ఉండేది అమ్మ” చెప్పారు తార.

అన్ని జానర్‍లలోనూ, హాస్యమంటే ఆవిడకి చాలా ఇష్టం. “ఏ జానర్‌తో పోల్చినా, హాస్యంలో – ముఖంలో ఎన్నో భావాలను పలికించాలి. కథకళి నర్తకిగా అవన్నీ నాకు సహజంగానే అబ్బాయి” చెప్పారు భానుమతి.

బాల్యం మినహయిస్తే, భానుమతి తన జీవితమంతా నాట్యం, రంగస్థలంలతోనే గడిపారు. ఇప్పటికీ నాట్యం కొనసాగిస్తూనే ఉన్నారు. ఓ నేస్తంతో కలిసి వారానికి ఒకసారు నాట్యం చేస్తారు.

“నాట్యాన్ని హాబీ అనడం దాని ప్రాముఖ్యతని తగ్గించివేస్తుంది. ఎందుకంటే ఓ వ్యక్తికి ఎన్నో హాబీలు ఉండచ్చు; అలానే నాట్యాన్ని కెరీర్ అనడం కూడా తప్పే. నాట్యం అనేది నాకొక జీవన విధానం” చెప్పారు భానుమతి.

***

భానుమతి నాట్యం యూ-ట్యూబ్‌లో

https://www.youtube.com/watch?v=Un_AlC2h9Ds&t=45s


దక్షిణాది మూవీ మొఘల్ ఎస్. ఎం. శ్రీరాములు నాయుడు:

మాంచెస్టర్ ఆఫ్ ది సౌత్ అని పేరు పొందిన కోయంబత్తూరు 1935-1972 మధ్య సినీ నిర్మాణానికి కూడా నెలవు అని ఎక్కువ మందికి తెలియదు. ఇందుకు కారణం, దక్షిణాది మూవీ మొఘల్ ఎస్. ఎం. శ్రీరాములు నాయుడు గారు. సినీ స్వర్ణయుగం అనదగ్గ కాలంలో ఆయన మూడు స్టూడియోలు నిర్మించారు. కాలం గడిచిపోయినా, ఆ ఊరి, అక్కడ నిర్మించిన సినిమాల జ్ఞాపకాలు ఇంకా పాత తరం వారి మనసుల్లో నిలిచే ఉన్నాయి. ఎనభైలు నిండిన వృద్ధులు, నగరంలో తొలి న్యూరాలజిస్టు, శ్రీరాములు నాయుడు గారి తనయుడు అయిన డా. ఎస్. శ్రీహరి ఆ పాత రోజుల్ని, కోయంబత్తూరులో సినీ నిర్మాణాన్ని గుర్తు చేసుకున్నారు.

శ్రీరాములు నాయుడు ఎన్నో వృత్తులలో రాణించిన ప్రజ్ఞాశాలి. బేకరీ, ఫర్నిచర్, సినిమాలు ఇలా పలు రంగాలలో ఆయన విజయవంతమయ్యారు. ప్రతీ ఆస్తి – ఆదాయం సంపాదించిపెట్టాలని ఆయన విశ్వసించేవారు. ఆ రోజుల్లోనే ఆదాయార్జాన కోసం ఆయన ఒక వాణిజ్య భవనాన్ని నిర్మించారు. శ్రీహరి తాతగారైన మునుస్వామి నాయుడు ఆస్తిపరులు. ఆయనకి ఎన్నో ఇళ్ళు ఉండేవి.

సెంట్రల్ స్టూడియోస్, పక్షిరాజా స్టూడియోస్, చాముండేశ్వరి స్టూడియోస్ (బెంగుళూరు) వెనుక ఉన్నది దిగ్గజ దర్శక నిర్మాత అయిన శ్రీరాములు నాయుడే. ఆనాటి బంగారు రోజులను గుర్తు చేసుకుంటూ తన తండ్రి గారి గురించి, సినిమాల గురించి ఎన్నో విషయాలు వెల్లడించారు శ్రీహరి.

“మా పక్షిరాజా స్టూడియో పులియకులంలో ఉండేది. అన్ని సౌకర్యాలు ఉన్న 30 గదులు ఉండేవి. వాటికి అటాచెడ్ టాయిలెట్స్ ఉండేవి. ఒక హెయిర్ కటింగ్ సెలూన్, బ్యూటీ పార్లర్, క్యాంటీన్ కూడా స్టూడియోలో ఉండేవి. బ్యూటీ పార్లర్‍లో మేకప్ సామాన్లు తగినన్ని సిద్ధంగా ఉండేవి. ఎందరో స్థానికులకు ఉద్యోగాలిచ్చాము. కార్పెంటర్లు, మేస్త్రీలు ఉండేవారు. వాళ్ళంతా మా బృందంలో సభ్యులే. సినిమాల చిత్రీకరణ ఉదయం మొదలై, సాయంత్రం ఏడింటి వరకు సాగేది. మా నాన్న రోజూ రషెస్ చూసి, ఎడిటింగ్ బృందంతో కూర్చునేవారు. కెమెరామాన్‌కి సలహాలు ఇచ్చేవారు, సంభాషణలను సరిచేసేవారు, సంబంధిత నిపుణులతో సంగీత, సాహిత్యాలని పరిశీలించేవారు. సినీ పరిశ్రమకి చెందిన వందలాది మందితో ఆయన సంబంధాలు కలిగి ఉండేవారు. తన కమ్యూనికేషన్స్ అన్నీ చక్కగా ఫైల్ చేసేవారు. స్టూడియోలో మాకు సొంత రికార్డింగ్ ఫెసిలిటీ ఉంది. లాబ్ కూడా అదే ప్రాంగణంలో ఉంది. సాయంత్రమయ్యాక సిబ్బంది తమ వ్యక్తిగత పనులు చేసుకోవచ్చు. ఒక షెడ్యూలు 20 రోజులు జరిగేది, నాన్న సమయపాలనకి పెట్టింది పేరు. ఆయన ఆరు భాషలలో పని చేశారు, అది అరుదైన విషయం. ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల నుంచి ఉత్తమ ప్రతిభ రాబట్టుకునేవారు నాన్న. నాన్న మంచి పరిపాలనాదక్షుడు, పరిశుభ్రతపై పట్టింపు ఎక్కువ. మాకు ఎన్నో కార్లు ఉండేవి. ప్రతీ కారుకి తప్పనిసరిగా లాగ్ బుక్ నిర్వహించేవారు. అవెంతో చక్కని రోజులు” అన్నారు శ్రీహరి.

తన చిన్నప్పుడు వారాంతాలలో – రాజలక్ష్మి మిల్స్ అధినేత శ్రీ బి. రంగస్వామి నాయుడు (బిఆర్) గుర్రపు బండిపై వచ్చి, తనని వాళ్ళింటికి తీసుకువెళ్ళేవారని గుర్తు చేసుకున్నారు శ్రీహరి. చిన్నప్పుడు బిఆర్ గారింట్లో బాగా ఆడుకునేవాడిననీ జ్ఞాపకం చేసుకున్నారు. ‘మలయ్ కల్లన్’ చిత్రాన్ని ఆరు భాషల్లో తీశారు. దాని హిందీ వెర్షన్ ‘ఆజాద్’ అయిదు లక్షలలో పూర్తయింది. హిందీ వెర్షన్ షూటింగ్ అప్పుడు దిలీప్ కుమార్, మీనా కుమారి, ఇతరులు అంతా పక్షిరాజా స్టూడియోస్ లోనే బస చేశారు. నటీనటుల ఇష్టాలకు అనుగుణంగా ఆహార సదుపాయాన్ని స్టూడియోనే కల్పించింది. తమిళ్, తెలుగు వెర్షన్లు ఏకకాలంలో చిత్రీకరించారు. ఎం.జి. రామచంద్రన్, ఎన్.టి. రామారావు, భానుమతి కలిసి నటించారు. ఆవిడ అప్పటికే పేరు పొందిన నటీమణి. “నాకు గుర్తున్నంతవరకు ఎంజిఆర్‌కి ఇరవై వేలు, భానుమతికి పాతికవేలు ఇచ్చారు. సంభాషణల రచయిత ఎం. కరుణానిధికి పదివేలు ఇచ్చాము. ఆ రోజుల్లో అది చాలా పెద్ద మొత్తం. మొత్తం సినిమా నిర్మాణానికి అయిన వ్యయం రెండున్నర లక్షలకు పైచిలుకే. మిగతా భాషలలో నిర్మాణ వ్యయం కాస్త తక్కువే అయింది. సినిమా సూపర్ హిట్ అవడమే కాకుండా, బాగా లాభాలు తెచ్చి పెట్టింది. ఈ సినిమా అనంతరం ఎంజిఆర్ సూపర్ స్టార్ అయిపోయారు. ఆనాటి సినీతారలందరూ స్టూడియోలోని బస చేసేవారు. ఎంజిఆర్‌కి ‘కరవట్టు కుళంబు’ బాగా ఇష్టం. రాయల్ హిందూ రెస్టారెంట్ (ఆర్. హెచ్. ఆర్)కి చెందిన సుందరవేల్ ఆ వంటకాన్ని తెచ్చేవారు. హోటల్ యజమాని గురుస్వామి నాడార్ భార్య చిన్నతయమ్మాళ్ వంటని ఎంతో అభిమానించేవారు ఎంజిఆర్. రైల్లో ప్రయాణిస్తే అభిమానుల తాకిడిని తట్టుకోవడం కష్టమని… ఆ రోజుల్లో నటీనటులంతా కార్లలో ప్రయాణించేవారు… తమకు తగిన వేగంతో వెళ్ళేవారు” చెప్పారు శ్రీహరి.

ఎం.కె. త్యాగరాజ భాగవతార్ (ఎంకెటి) నటించిన ‘శివకవి’ చిత్రం 1943లో తీశారు. ఈ సినిమాలోని కొంత భాగాన్ని మదురై మీనాక్షి ఆలయంలో చిత్రీకరించారు. నటీనట బృందమంతా ఉడుపి లాడ్జ్‌లో బస చేశారు. నటీనటులు వస్తుండగా – ఈ మార్గంలోని అన్ని రైల్వే స్టేషన్‌లలోనూ మహిళలు గుమిగూడి ఎంకెటిని చూడాలని, ఆయనకి షేక్‌హ్యాండ్ ఇవ్వాలని ప్రయత్నించేవారు. ఆయనది బంగారు ఛాయ, అద్భుతమైన స్వరం, చక్కని రూపం. ‘ఆర్యమాల’ అనే చిత్రం నిర్మాణానికి అయిన మొత్తం వ్యయం ఎనభై వేలు మాత్రమే. ప్రధాన పాత్రలలో నటించిన నటీనటులకు ఐదు వేలు, గీత రచయితలకు వెయ్యి రూపాయలు ఇచ్చారు. ఆ రోజుల్లో అవి చాలా పెద్ద మొత్తాలు.

సినిమాల గురించి, కళాకారుల గురించి శ్రీహరి మరొకొన్ని విషయాలు వెల్లడించారు. “ఎంజిఆర్‌కి తన మేకప్ అంటే ప్రత్యేకమైన శ్రద్ధ. తన ఇమేజ్‌ని కాపాడుకునేవారు. శివాజీ గణేశన్ తన పనేంటో తాను చూసుకుంటూ, రిజర్వ్‌డ్‌గా ఉండేవారు. సిఎస్ హోటల్‌లో చేసే పూరీ, మసాల కూర ఇద్దరికీ బాగా ఇష్టం. ఆహార పదార్థాలని ఒక్కోసారి రంజిత విలాస్ లేదా బాంబే ఆనంద భవన్ నుంచి కూడా తెప్పించేవాళ్ళం. ఎంజిఆర్, శివాజీ ఇద్దరూ మా నాన్నని ఎంతో గౌరవంగా చూసేవారు. ఆ రోజుల్లో దర్శకుడిగా రాజ్యం. ఆయన ఓ చక్రవర్తి లాంటి వాడు. ఎంజిఆర్ దయాళువు. వినయశీలి. ఎందరికో సహాయం చేసిన వ్యక్తి. అందుకే 1984లో ఆయన జబ్బుపడినప్పుడు ఎందరో ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థించారు. రాజకీయాలకు చెందిన ఎందరో స్టూడియోకి వచ్చి ఎంజిఆర్‌ని కలిసేవారు. ఆ రోజుల్లో ఆయన డి.ఎం.కె అభివృద్ధికై ఎంతో ఆలోచిస్తున్నారు. పార్టీలోనూ, బహిరంగ సభల్లోనూ ఎంజిఆర్ అయస్కాంతం లాంటి వారు. ఎన్నోసార్లు ఎంజిఆర్ సమక్షంలో సభలలో సి. అన్నాదురై కూడా ప్రసంగించేవారు.”

శ్రీరాములు నాయుడితో శివాజీ గణేశన్ రెండు సినిమాలు – మరగతం (1959), కళ్యాణియిన్ కనవన్ (1962). ‘మరగతం’ షూటింగ్ రోజులను శ్రీహరి గుర్తు చేసుకున్నారు. “అప్పట్లో నాకు సెలవలు. సినీ బృందంతో కలిసి వల్పరాయ్ వెళ్ళాను. అక్కడ రోప్-వే షాట్ తీశారు. ఈ సినిమాకి కొచ్చిన్ హార్బర్ మరో లొకేషన్. అక్కడ మేం బోల్‍గట్టి పాలెస్‍లో బస చేశాము. నాన్న ఆ పాలెస్‌ని మొత్తాన్ని సినిమా కోసం బుక్ చేశారు. దాదాపు 30 మంది వారం పాటు అక్కడ బస చేశాము. ఎంజిఆర్, శివాజీ నాన్నని ‘నాయుడు సర్’ అనేవారు. ఎం. కరుణానిధి (ఎంకె) మాత్రం ‘నాయన’ అనేవారు. తెర మీద తన ఇమేజ్‍ని కాపాడుకోవడంలో ఎంజిఆర్ ఎంతో శ్రద్ధ కనపరిచేవారు. తన పాత్రలు ఆకర్షణీయంగాను, సృజనాత్మకంగా ఉండేట్టు చూసుకునేవారు. సందేశాలు, నీతులు ఆయనకి ముఖ్యం. ఎంకె గొప్ప వ్యక్త, ప్రజ్ఞాశాలి. ఆయన ముఖ్యమంత్రి అయ్యాకా, 1970-75 మధ్య నాన్న వి.ఎం. కిలాస గౌండర్ గారితో వెళ్ళి ఎంకెని కలిసేవారు. వాళ్ళు పేకాట ఆడడం ద్వారా రిలాక్స్ అయ్యేవారు. సాయంత్రం నాలుగింటికల్లా కబురు వచ్చేది. కిలాస గౌండర్ స్థలంలో అందరూ కలిసేవారు. నాన్నతో కలిసి రామవరం గార్డెన్స్ (ఎంజిఆర్ నివాసం) వెళ్ళినట్టు గుర్తు. ఆయన మమ్మల్ని సాదరంగా ఆహ్వానించారు. శివాజీ గణేశన్‍కి ఆప్తమిత్రులన్నా, మంచి ఆహారమన్నా ఇష్టం. ఆయన మిత్రులు వి.ఎ. ముత్తుమాణిక్యం, డా. కె. వేలుస్వామి తరచూ వచ్చి కలిసి, ఆయనతో సమయం గడిపేవారు. శివాజీ కోసం నాన్-వెజ్ బిర్యానీ వండించేవారు. తన స్నేహితుల సాంగత్యాన్ని శివాజీ ఎంతో ఆస్వాదించేవారు.

‘మలయ్ కల్లన్’ చిత్రంలో కరుణానిధి రాసిన ‘ఎతనాయి కాలం థాన్’ అనే పాట గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు శ్రీహరి. ఈ చిత్రం ఆ రోజుల్లోనే దాదాపు తొంభై లక్షలు ఆర్జించింది. పైగా ఇది తమిళ వెర్షన్ నుంచి వచ్చిన వసూళ్ళు మాత్రమే. అధిక వసూళ్ళతో పాటు ఎంజిఆర్‌కి సూపర్ స్టార్ హోదా తెచ్చిపెట్టిందీ చిత్రం.

నిద్రలో ఉండగా ఏదైనా ఆలోచన తట్టినా, వెంటనే లేచి కూర్చుని కాగితం మీద రాసుకునేవారట శ్రీరాములు నాయుడు. దక్షిణాది మూవీ మొఘల్‌గా పేరుపొందిఅన్ శ్రీరాములు నాయుడికి సమాజంలోని అన్ని వర్గాలలోనూ స్నేహితులు ఉన్నారు. ఆయన పేరు మీద కోయంబత్తూరు లోని ఔత్సాహికులకు -సృజనాత్మకతలో ప్రతిభకు గాను – ఏదైనా పురస్కారం ఇస్తే బాగుంటుంది.

‘S.M.Sriramulu Naidu Citation for Creativity and Innovation’ పురస్కారాన్ని కోయంబత్తూరులో అందరూ స్వాగతిస్తారు.

Exit mobile version