అలనాటి అపురూపాలు-89

0
2

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

మిస్ యూనివర్స్ పోటీలలో పాల్గొన్న తొలి మిస్ ఇండియా ఇంద్రాణి రెహమాన్:

మిస్ యూనివర్స్ పోటీలు 1952లో మొదలయ్యాయి. ఆ ఏడాది మిస్ ఇండియా టైటిల్ గెల్చుకున్న ఇంద్రాణి రెహమాన్ – మిస్ యూనివర్స్ పోటీలలో పాల్గొన్న తొలి భారతీయ మహిళ అయ్యారు. ఒక అంతర్జాతీయ అందాల పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన తొలి మహిళ అయ్యారు.

ఇంద్రాణి 1930, సెప్టెంబరు 19న ఇప్పుడు చెన్నై అని పిలవబడుతున్న మద్రాసులో జన్మించారు. ఆమె అసలు పేరు ఇంద్రాణి బాజ్‌పేయి. ఆమె తల్లిదండ్రుల గురించి తెలుసుకోవడం ఆసక్తికరం. ఆమె తండ్రి రామలాల్ బలరాం బాజ్‌పాయ్ 1860లో, మొట్టమొదటి స్వతంత్ర్య పోరాటం జరిగిన మూడేళ్ళకు జన్మించారు, ఆయన 84 ఏళ్ళ వరకు జీవించి 1962లో కన్నుమూశారు. ఆయన ఇండో-అమెరికన్ లీగ్‌కు కొన్నేళ్ళ పాటు అధ్యక్షుడిగా వ్యహరించారు. అందుకు కారణం ఆయన భార్య రాగిణీ దేవి. ఆవిడ అసలు పేరు ఎస్తేర్ ల్యూలా షెర్మన్‌, జన్మరీత్యా అమెరికన్. రామలాల్ బలరాం బాజ్‌పాయ్ ఉత్తర భారతీయులు. రసాయన శాస్త్రం చదివారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ ఎస్తేర్ పరిచయం అయ్యారు. ఆవిడ 1893లో అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రంలోని పెటోస్కీలో జన్మించారు. వాళ్ళిద్దరూ పెళ్ళి చేసుకున్నాకా, ఎస్తేర్ హిందూ మతం స్వీకరించి, తన పేరును రాగిణీదేవి అని మార్చుకున్నారు. ఆమె 90 ఏళ్ళ వరకు జీవించి 1982లో మరణించారు. రామలాల్ సుప్రసిద్ధ మేగజైన ‘యంగ్ ఇండియా’కు అసిస్టెంట్ ఎడిటర్ అయ్యారు. ఈ పత్రికని ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు శ్రీ లాలా లజపత్ రాయ్ స్థాపించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాకా, రామలాల్ అమెరికాకి కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా అయ్యారు, న్యూ యార్క్‌లో పోస్టింగ్స్ ఇచ్చారు. ఆ సమయంలోనే ఆయన ఇండో-అమెరికన్ లీగ్‌కు అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. రామలాల్‍తో స్నేహం కలవక ముందు కొన్ని మూకీ సినిమాలలో నటించి, ప్రాచ్య నాట్య రీతులలో ప్రావీణ్యం సాధించిన రాగిణీదేవికి తాను పూర్వజన్మలో ఒక హిందువునని, తాను పూర్తి చేయవలసిన కార్యక్రమాలు ఇంకా చాలా ఉన్నాయన్న విశ్వాసం కలిగింది. అప్పుడే రామ్‌లాల్‌తో పారిపోయి న్యూయార్క్ వచ్చేసారు. అక్కడ కొంతకాలం రామలాల్‌తో ఉన్నాకా, ఆయన్ని విడిచిపెట్టి, మార్క్సిస్ట్ కవి, సరోజినీ నాయుడు సోదరుడుడైన హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయతో జీవించారు. 1926లో అమెరికాలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తనని తాను ఒక ఉన్నత కులీనురాలైన కశ్మీరీననీ, అదృశ్య నృత్యాలను, వినబడని సంగీతాన్ని నేర్చుకున్నాననీ వెల్లడించారు. కానీ వాస్తవం ఏంటంటే – పారిస్‍లో ఛటోపాధ్యాయతో కలిసి తిరిగాకా, 1930లో చేతిలో డబ్బు లేక, గర్భవతిగా ఆమె పాండిచ్చేరిలో అడుగుపెట్టారు. కొన్నేళ్ళు గడిచాకా తన తండ్రి – రామలాలా లేక ఛటోపాధ్యాయా అన్న సంశయం ఇంద్రాణికి కలిగింది. రాగిణీదేవి ఆ పై భారతదేశంలోనూ, అమెరికాలోనూ, యూరప్ లోనూ ఎన్నో సాహసాలు చేశారు. నాట్య గురువుల వెంట శ్రమించారు. ఎందరినో ఆకర్షించారు.

ఈవిధంగా భారతీయ శాస్త్రీయ నృత్యాల పట్ల ఆసక్తి పెంచుకున్న రాగిణీదేవి – వివిధ నృత్యరీతుల పట్ల ఆదరణ పెంచి, పునరుజ్జీవం చెందింపజేయడానికి ప్రయత్నించారు. సుప్రసిద్ధ రాజనర్తకి జెట్టి తాయమ్మని కలిసి ఆమె వద్ద భరతనాట్యం నేర్చుకున్నారు. తరువాత మద్రాసులోని రాజనర్తకి గౌరి అమ్మ వద్ద తన నాట్య కౌశలాన్ని మెరుగు పరచుకున్నారు. ఈ విధంగా రాగిణి 1930లలో పేరున్న భరతనాట్య నర్తకీమణులలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అదే సమయంలో ఆంధ్ర నాట్య సంప్రదాయం కూచిపూడిని, కేరళ నృత్యరీతి కథాకళి నేర్చుకుని వాటి పునరుద్ధరణకు కృషి చేశారు. కథకళిని కేరళేతరులకు పరిచయం చేసింది రాగిణేనని అంటారు. భారతీయ నృత్యాలపై – Dance Dialects of India తో సహా రెండు పుస్తకాలను ఇంగ్లీషులో రచించారు.

రామలాల్, రాగిణి దంపతులు మద్రాసులో ఉండగా ఇంద్రాణి జన్మించారు. ఇండో-అమెరికన్ సంస్కృతి మిశ్రితమై ఉన్న కుటుంబంలో జన్మించారు. ముఖ్యంగా ఇంద్రాణి తన తల్లి వల్ల అమితంగా ప్రభావితం చెందారు. ఇతర భారతీయ యువతుల వలే కాకుండా, ఏ సంకోచాలు లేకుండా స్వతంత్ర్యంగా వ్యవహరించడం అలవర్చుకున్నారు. అందాల పోటీలలో పాల్గొనేలా ఆమె తల్లిని ఇంద్రాణిని ప్రోత్సహించారు. తొమ్మిదేళ్ళ ప్రాయంలో ఇంద్రాణి తన తల్లి వద్ద నృత్యం అభ్యసించారు. తల్లి వెంట అమెరికా, యూరప్‍లలో పర్యటించారు. వాస్తవానికి ఇంద్రాణిని కెనడా గుండా అమెరికాలోకి కారు డిక్కీలో దాచి రహస్యంగా ప్రవేశపెట్టారట.

ఇంద్రాణి తన డాన్సింగ్ కెరీర్‍ని భరతనాట్యం అభ్యసించడం ద్వారా ప్రారంభించారు. ఆమె 1940లలో పి.చొక్కలింగం పిళ్ళై వద్ద భరతనాట్యం నేర్చుకున్నారు. తరువాత ఈమె విజయవాడకి వచ్చి అక్కడి సుప్రసిద్ధ నాట్య గురువు కోరాడ నరసింహారావు వద్ద కూచిపూడి అభ్యసించారు. కోరాడ నరసింహారావుతో కలిసి ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో కూచిపూడి నృత్యప్రదర్శనలు ఇచ్చారు.

చదువుకునే బాలికగా ఉండగా, 15 ఏళ్ల వయసులోనే టీనేజర్ ఇంద్రాణి పారిపోయి – ఎం.ఐ.టి.లో శిక్షణ పొందిన ఆర్కిటెక్ట్, బెంగాలీ ముస్లిం అయిన హబీబ్ రెహమాన్‌ని పెళ్ళి చేసుకున్నారు. మహాత్మా గాంధీ సమాధికి రూపకల్పన చేసినది ఈయనే. 18 ఏళ్ళు కూడా నిండని కారణంగా భారతీయ చట్టాల ప్రకారం చట్టపరంగా వాళ్ళు పెళ్ళి చేసుకోలేకపోయారు. ఆయనకేమో ఆమె కంటే రెట్టింపు వయసు, 30 ఏళ్ళు. వీళ్ళు మొదట కలకత్తాలోను, ఆపై ఢిల్లీ లోనూ నివసించారు. 1946లో ఈ దంపతులకు రామ్ రెహమాన్ అనే కుమారుడు జన్మించాడు. తరువాతి కాలంలో రామ్ ఆర్టిస్ట్ అయ్యాడు. వీరికి రామ్ తరువాత కూతురు పుట్టింది. సుకన్య అని పేరు పెట్టారు.

సుకన్య పెరిగి పెద్దయ్యాక, తన తల్లి అమెరికన్ టూర్ మేనేజర్ అయిన విక్స్‌ని వివాహం చేసుకుంది. సుకన్య కూడా నృత్యం నేర్చుకుని అమ్మ తోనూ, అమ్మమ్మ తోనూ కలిసి ప్రదర్శనలిచ్చింది. సుకన్యకు వాడ్రేత్ విక్స్, హబీబ్ విక్స్ అని ఇద్దరు పిల్లలు.

ఇంద్రాణి తొలుత నేర్చుకున్నవి కథక్, మణిపురి నృత్యాలు. ఐదేళ్ళ వయసులో తన తల్లి రాగిణీదేవితో కల్సి చేసిన కథకళి ఆమె తొలి ప్రదర్శన. కానీ బయటి గురువుల వద్ద నృత్యం అభ్యసించింది, తన కూతురు సుకన్య జన్మించిన తరువాతే. తొలుత, రామ్‍గోపాల్ గారి సలహాపై ఇంద్రాణి బెంగుళూరు వెళ్ళి యు.ఎస్. కృష్ణారావు, చంద్రభాగా దేవిల వద్ద భరతనాట్యం అభ్యసించారు. ఆపై బెంగుళూరులోనే అరంగేట్రం చేశారు. ఆపై పి.చొక్కలింగం పిళ్ళై గారి వద్ద మద్రాసులో శిష్యరికం చేశారు. నాట్యంలో తన తల్లికి ఏకాగ్రత లోపిస్తే, గురువుగారు పి.చొక్కలింగం పిళ్ళై బెత్తంతో అదిలించడం సుకన్యకు గుర్తుందట. ఆమె రెండవ ‘అరంగేట్రం’ మద్రాసులోని ఎగ్మూరు మ్యూజియం థియేటర్‍లో జరిగింది. ఈ ప్రదర్శనకి టి. బాలసరస్వతి, తారా చౌదరి, వైజయంతీ మాల బాలి, యామినీ కృష్ణమూర్తి, హరేన్ ఘోష్ వంటి ప్రముఖులు, నృత్య విమర్శకులు వెంకటాచలం హాజరయ్యారు.

తరువాత ఇంద్రాణి ఒరిస్సా వెళ్ళి ఒడిస్సీ నేర్చుకుని, ప్రపంచవ్యాప్తంగా ఒడిస్సీకి ఆదరణ కల్పించడంలో కృషి చేశారు. ఒకటి కంటే ఎక్కువ నృత్యరీతుల్లో ప్రవేశం కలిగి ఉండి, వాటికి ప్రజాదరణ కల్పించిన అతికొద్దిమంది నర్తకీమణుల్లో ఇంద్రాణి ఒకరు. ఆమె క్రేజ్ ఎలా ఉండేదంటే తన దుస్తులకు కుట్టించుకునేందుకు దర్జీకి బట్టలు పంపాలంటే పోలీసులకు తోడుగా పంపాల్సివచ్చేదట! ఆమె భారతదేశంలోనూ, న్యూ యార్క్ ప్రాంతంలోనూ ఎందరో వర్ధమాన కళాకారులను ప్రోత్సహించారు. పండిట్ దుర్గా లాల్, రాజా మరియు రాధా రెడ్డి, సోనాల్ మాన్‌సింగ్ ఇందుకు ఉదాహరణ. తన కెరీర్ మొత్తంలో సుమరు 25 మందిని ఇలా వెలుగులోకి తెచ్చారు. ఎవరిని ఎలా ప్రోత్సాహించాలో గుర్తించేందుకు ఆమె మాచ్-స్టిక్ డ్రాయింగ్ రూపొందించారు. న్యూ యార్క్ పబ్లిక్ లైబ్రరీలో భద్రపరచబడిన ఈ చిత్రంలో ఆమె ఎంతో జాగ్రత్తగా నోట్స్ రాశారు.

1952లో మిస్ ఇండియా టైటిల్ గెల్చుకున్నారు ఇంద్రాణి. ఆ కాలంలో మన దేశం నుంచి అందాల పోటీలలో పాల్గొనేవారి సంఖ్య బాగా తక్కువ. పైగా ఇంద్రాణి అప్పటికే వివాహిత అవడం, తల్లి కూడా అవడం విశేషం. అప్పుడామె వయసు 22 సంవత్సరాలు. ఈ పోటీలలో ఆమె మిస్ కలకత్తాగా పోటీ చేసి, మిస్ మద్రాస్ టంగుటూరి సూర్యకుమారిని ఓడించారు. 28 జూన్ 1952 నాడు కాలిఫోర్నియాలోని లాంగ్ బీచ్‌లో జరిగిన మిస్ యూనివర్స్ పోటీలలో పాల్గొన్న తొలి భారతీయురాలు ఇంద్రాణి. అప్పట్లో ఈ గొప్ప నర్తకి స్విమ్ సూట్ కూడా ధరించారు. స్విమ్ స్యూట్‌తో పాటు పూలదండ, బిందీ ధరించి ఆమె ఈ పోటీలో పాల్గొనడం అందరినీ ఆకర్షించింది.

ముస్లిం మతానికి చెందినదై, అందునా వివాహిత అయి ఉండి అలాంటి పోటీలలో పాల్గొనడం పట్ల వ్యతిరేకత వ్యక్తమైంది. పేపర్లలో విమర్శలు వచ్చాయి. ఈ ఘన విజయం తరువాత ఆమె తిరిగి నాట్యంపై దృష్టి సారించారు. ప్రపంచమంతా తిరిగి ప్రదర్శనలిచ్చారు. తల్లితో కలిసి ప్రయాణిస్తూ, ఆమె బృందంలో నాట్యం చేశారు. 1961లో దేశమంతా పర్యటించడానికి ఆమెకు ఆసియా సొసైటీ స్పాన్సర్ చేసింది. ఈ ఘనత సాధించిన తొలి మహిళ ఆమే. ఆమెతో పాటు ఈ బృందంలో చార్లెస్ ఫాబ్రి, మాయాధర్ మాన్‌సింగ్, దేవప్రసాద్ దాస్ ఉన్నారు. శాస్త్రీయ ఒడిస్సీని ప్రస్తుత రూపుకు తెచ్చింది దాస్ గారే! అంతర్జాతీయంగా ప్రదర్శనలివ్వడం ద్వారా, ఆంగ్లం ధారాళంగా మాట్లాడడం వల్ల, కాంచీపురం రాజలాంఛనాలు పొందడం వల్లా ఆమెకు రాజకీయ పలుకుబడి కూడా లభించింది. జవహర్‌లాల్ నెహ్రూ, చౌ ఎన్ లై, హైలే సెలాస్సీ, జాన్ ఎఫ్ కెనడీల ముందు నర్తించారు. ఇథియోపియా సింహంగా ప్రసిద్ధికెక్కిన హైలే సెలాస్సీ భారత పర్యటన సందర్భంగా ఇంద్రాణి చేసిన నృత్య ప్రదర్శన ఆయనకెంతో నచ్చి బంగారు నాణేలు ఇవ్వడమే కాకుండా, తన కూతురు ధరించిన వెండి బెల్టును విప్పించి ఇంద్రాణికిప్పించారు. క్వీన్ ఎలిజబెత్ II, హైలే సెలాస్సీ, మావో జెడాంగ్, నికిత కృశ్చేవ్, ఫిడేల్ కాస్ట్రో వంటి ఎందరో దేశాధినేతల ముందు ప్రదర్శనలిచ్చారు. 1976లో ఆమె న్యూ యార్క్ లోని జుల్లియర్డ్ స్కూల్, లింకన్ సెంటర్ ఫర్ ది పెర్‌ఫార్మింగ్ ఆర్ట్స్ వారి నాట్య విభాగంలో ఫాకల్టీగా అవకాశం వచ్చింది. ఎన్నో అమెరికన్ యూనివర్శీటీలలో నాట్యం బోధించారు. ఆ తరువాత తన జీవితమంతా అమెరికాలోని వివిధ ప్రాంతాలు తిరుగుతూ గడిపారు. జీవితంలోని లక్ష్యం, గ్లామర్, వ్యక్తిగత సమస్యలు, భ్రమలు అన్నీ పక్కన పెట్టినా, నృత్యంపై ఆమె అభిమానాన్ని తక్కువ చేయలేము.

అద్భుతమైన నర్తకి అయిన ఇంద్రాణి 1999, ఫిబ్రవరి 5వ తేదీన న్యూయార్కులోని మన్‌హట్టన్‌లో మరణించారు. ఎందరీ అభిమానులు, శిష్యులు, ఆరాధకులు ఆమెకు నివాళులు అర్పించారు.

~

తన అమ్మ, అమ్మమ్మ జీవితగాథలను సుకన్య ప్రచురించారు. ఇంద్రాణి గురించి, ఆమె నృత్యాల గురించి మరింత సమాచారం తెలుగుకోవాలనుకునేవారికి ‘Dancing in the family’ పుస్తకం ఎంతో ఉపకరిస్తుంది. నాట్య గురువుల కోసం మారుమూల గ్రామాలలో అన్వేషణ, ఆపై కఠిన సాధన… ఈ పుస్తకంలో వెల్లడయ్యాయి.

ఆ పుస్తకం లోంచి కొన్ని వివరాలు:

“నాట్య ప్రపంచంలో మా అమ్మకి పేరు రావడం వల్ల కల్గిన నష్టం – ఆమె ఇంట్లో ఉండకపోవడం; లాభం – మా నిత్య జీవితంలో ప్రపంచ స్థాయి వాతవారణం ఏర్పడడం. ఉలాన్ బేటర్, సింకియాంగ్, బుఖారెస్ట్, యెరెవాన్… ఇవన్నీ అట్లాసులోని పేర్లు కావు, మాకీ ప్రాంతల నుండి పోస్ట్ కార్డులు, ఉత్తరాలు, కానుకలు వచ్చేవి. నాట్యంతో ప్రపంచాన్ని జయించడం అంటే ప్రదర్శన పట్ల అమ్మకున్న మమకారమే అనుకోవాలి. ఒకరోజు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నుంచి అమ్మకి ఫోన్ వచ్చింది, చైనా పర్యటనలో పాల్గొనమని! అమ్మకెంతో ఉత్సాహం కలిగింది. ఆ ఆనందాన్ని వేడుక చేసుకునేందుకు మాకు కన్నాట్ ప్లేస్ లోని నిరులాస్‌లో చైనీస్ ఫుడ్ తినిపించాలనుకుంది చింది. ఆ రెస్టారెంట్‌కి వెళ్ళేందుకు కర్జన్ రోడ్ మీద ఫైవ్ సీటర్ ఆటోలో ప్రయాణిస్తుండంగా – రోడ్డుకి వ్యతిరేక దిశలో తన మిత్రుడు, రచయిత, నాట్య విమర్శకుడు అయిన వి.వి. ప్రసాద్ స్కూటర్‍పై వస్తూ కనిపించారు. ఆయన దృష్టిని ఆకర్షించేందుకు కొంగును ఊపుతూ, “వివి, నేను చైనాకి వెళ్తున్నాను… చైనాలో నాట్యం చేయబోతున్నాను” అంటూ అరిచింది అమ్మ. కొంగు అంచు ఆటోరిక్షా చక్రంలో ఇరుక్కునేదే, సమయానికి ఓ ప్రయాణీకుడు అమ్మని వెనక్కి లాగాడు. అమ్మ ఉత్సాహం సరైనదే, చైనాలో అమ్మకి, ఇతర కళాకారులకి ఘన స్వాగతం, చక్కని ఆతిథ్యం లభించింది. తొలి ప్రదర్శనకి మావో, చౌ ఇన్‍లై, వియత్నాం నుంచి హో చి మిన్ హాజరయ్యారు. ఆ తరువాత కళాకారులందరికి చౌ ఇన్‍లై సాంప్రదాయక చైనీస్ విందునిచ్చారు. రెండు నెలల ఈ పర్యటన ముగించుకు వచ్చాకా, మా డ్రాయింగ్ రూమ్ అంతా చైనీస్ వస్తువులతో ఒక చైనీస్ క్యూరియో షాప్‍లా మారింది. మనదేశపు తెరలు, దుప్పట్ల స్థానంలో చైనీస్ ఎంబ్రాయిడరీవి వచ్చి చేరాయి. ఒక అందమైన చెక్క దీపం, ఇంకా అందమైన వస్తువులు రోజ్‍వుడ్ టేబుల్‍పైకి చేరాయి. గోడలపై చైనీస్ ఇంక్‍తో చిత్రించిన గుర్రాల బొమ్మలు, వాటర్ కలర్స్‌తో చిత్రించిన చెట్లు, పర్వతాలు వచ్చాయి. ఇంకా మావో, చౌ ఇన్‍లై చిత్రపటాలు వచ్చాయి. ‘హిందీ చీనీ భాయీ భాయీ’ నినాదం వర్ధిల్లుతున్న రోజులవి.

ఈ నినాదం ‘హరీన్ ఛటోపాధ్యాయ’ రాసిన ఓ పాట నుంచి స్వీకరించారు.

భారత్-చైనా మైత్రికి ఢిల్లీ జింఖానా క్లబ్ వేదికైంది. అక్కడ ఎక్కువగా పాశ్చాత్య నృత్యాలు జరిగేవి. ఆ రోజున మెయిన్ హాల్‍లో ప్రధాని నెహ్రూ చైనా, టిబెట్‌ల నుంచి వచ్చిన ముగ్గురు అతిథులతో ఉన్నారు. పట్టుచీర కట్టుకుని, చైనీస్ ఫైనరీ ధరించి, నాతో పాటు వచ్చిన అమ్మని నెహ్రూ పలకరించి చేయి పట్టుకుని తీసుకువెళ్ళి అతిథులకు పరిచయం చేశారు. అందులో ఒకరి ఫోటో మా డ్రాయింగ్ రూమ్‍లో ఉన్నదే! ముఖ్య అతిథి, ఆ పొడవాటి చైనీయుడు చౌ ఇన్‍లై! అమ్మ తనకి జ్ఞాపకం ఉందని, గతంలో ఆమె నృత్యం చూసానని ఆయన చెప్పారు. ఆయనకి అటు ఇటూ ఉన్న టిబెటన్ సాధువులు – దలైలామా, పంచన్‌లామా అని అమ్మ నాతో చెప్పింది. వారు తక్కువగా మాట్లాడుతూ, ఎక్కువగా చిరునవ్వు చిందిస్తూ ఉండిపోయారు. చైనా భారత్ పై యుద్ధానికి కాలు దువ్వుతోందని గానీ, దలైలామా టిబెట్ నుంచి పారిపోయి వచ్చి భారత్‍లో ఆశ్రయం పొందుతారని గానీ అప్పుడు ఎవరూ ఊహించలేకపోయారు.

ఒక మర్చిపోలేని రాత్రి, బెనారస్‍లో ఒక సంగీత ప్రదర్శనలో అమ్మ నృత్య ప్రదర్శన ఇచ్చేందుకు రాత్రి, వేదిక వెనుక సహాయంగా ఉండేందుకు నన్ను రమ్మంది. ప్రదర్శన కోసం సిద్ధమవుతుండగా అమ్మ సన్నద్ధతని ఎవరూ భంగపరకుండా చూడడం నా బాధ్యత.

రోజూవారి ముఖం నుంచి కళాకారిణి వదనానికి మారడం కొంచెం కష్టం. అమ్మ కళ్ళకి మేకప్ వేసుకుంటుండగా – ఎవరైనా గ్రీన్ రూమ్ తలుపు తడితే – తనకు చిరాకు కలిగుతుంది. ఇక ఆ సాయంత్రమంతా అలాగే చిరాకు కొనసాగుతుంది. ప్రదర్శనకి సన్నద్ధమయ్యేందుకు అమ్మ కొన్ని పద్ధతులు పెట్టుకుంది, వాటిని ఎన్నడూ మార్చదు. పద్ధతి ప్రకారం కాస్ట్యూమ్స్ మార్చుకోవడం నేను చూశాను. డ్రెస్సర్‌పై ఉంచిన కాస్మోటిక్స్ వేసుకుని, నగలు ధరిస్తుంది. ఆ తరువాత గజ్జెలు పెట్టుకుంటుంది. మేకప్ మొదలవడానికి ముందు – వినాయకుడి విగ్రహం ముందు – ఒక ఖాళీ రెమీ మార్టిన్ సీసాలో మైసూర్ సాండల్‌వుడ్ అగరబత్తీలు – అగ్గిపుల్లలతో వెలిగించి ఉంచుతుంది.  ఆ సీసా, ఆ అగ్గిపుల్లలు, విదేశాల నుంచి లభించిన మెమెంటోలంటే అమ్మకి ఎంతో సెంటిమెంటు. ఆ అగరబత్తీల నుంచి వచ్చే పొగని అమ్మ కాస్ట్యూమ్స్ పైకి, నగల పైకి, గజ్జెల పైకి మళ్ళించేది. వినాయకుడి ఆశీస్సులతో విఘ్నాలు తొలగి ప్రదర్శన ఏ ఆటంకాలు లేకుండా సాగుతుందనేది…”

~

అవార్డులు

ఇంద్రాణి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అవార్డులు పొందారు. మన దేశంలో ఆమెకి లభించిన ప్రముఖ పురస్కారాలు:

  • ఫెమినా మిస్ ఇండియా (1952)
  • పద్మశ్రీ (1969)
  • సంగీత నాటక అకాడమీ అవార్డు (1981)

చరిత్రలో నిలిచిపోయే కవి, గీతరచయిత కైఫీ ఆజ్మీ:

సయ్యద్ ఫతే హుస్సేన్ రిజ్వీకి ఉర్దూ కవిత్వమంటే ఆసక్తి మెండు. అందుకే తరచూ వారి ఇంట కవుల సమావేశాలు జరిగేవి. అటువంటి ఓ సందర్భంలో ఫతే హుస్సేన్ గారి 11 ఏళ్ళ కుమారుడు అథర్ అక్కడికి వచ్చి ఓ షేర్ చదివాడు. దాన్ని స్వయంగా తానే రాశాడంటే ఎవరూ నమ్మలేదు. అందుకని అతనికి పరీక్ష పెట్టాలనుకున్నారు. సుప్రసిద్ధ కవి షౌక్ బహ్రెయిచి రచించిన ‘ఇత్నా హసో కీ ఆంఖ్ సే ఆంశూ నికల్ పడే’ అనే ఘజల్ పాదాలు చెప్పి, అదే ఛందస్సులో రాయమని అడిగారు. ఆ బాలుడు సవాలుని స్వీకరించి ఈ క్రింది విధంగా రాసి చూపించాడు.

‘ఇత్నా తో జిందగి మే కిసికి ఖలాల్‌ పడే
హన్స్‌నే సే హో సుకూన్‌ నా రోనే సే కల్‌ పడే
ముద్దత్ కే బాద్ ఉస్నే జో కీ లుట్ఫ్ కీ నిగాహ్
జీ ఖూష్ తో హో గయా మగర్ ఆంశూ నికల్ పడే
జిస్ తరహ్ హస్ రహా హు మై పీ పీ కే అష్క్ ఎ ఘమ్
యూం దూస్రా హసే తో ఖలేజా నికల్ పడే’

11 ఏళ్ళ లేత వయసు అథర్ హుస్సేన్ రిజ్వీ – ‘కైఫీ ఆజ్మీ’గా మారి ఎన్నో గొప్ప కవితలు వెలువరించేందుకు ఈ ఘజల్ పునాది వేసింది. ఈ ఘజల్‍ని సుప్రసిద్ధ గాయని బేగమ్ అఖ్తర్ ఆలపించడంతో దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.

కైఫీ ఆజ్మీ – ఉత్తర ప్రదేశ్ లోని అజమ్‌ఘర్‌ జిల్లాలోని మిజ్వాన్ అనే చిన్న గ్రామంలో ‘అథర్ హుస్సేన్ రిజ్వీ’ పేరుతో జన్మించారు. వారిది భూస్వాముల కుటుంబం. తాను స్వయంగా భూస్వామి అయినప్పటికీ, సయ్యద్ ఫతే హుస్సేన్ రిజ్వీ తొలుత తన సొంత ప్రాంతంలో తహసీల్దారుగా, ఆపై ఉత్తర ప్రదేశ్‍లోని ఇతర ప్రాంతాలలోనూ ఉద్యోగాలు చేశారు. కైఫీ తండ్రి ఆధునికడు, విశాల హృదయుడు. ఇంగ్లీషు నేర్చుకుని మాట్లాడేవారు. అయితే కైఫీ ఇంగ్లీషు పాఠశాలలో చేరే సమయానికి, దురదృష్టవశాత్తు అతని సోదరీమణులు ముగ్గురికీ క్షయవ్యాధి సోకింది. కైఫీ సోదరులు ఆంగ్లంలో చదువుకోడం వల్ల, దైవం కోపించినందుకే ఇలా జరిగిందని పెద్దలు భావించారు. అందుకని కైఫీని మతశాస్త్రం చదువుకోడానికి మదరసాకి పంపాలని నిర్ణయించారు. కుటుంబం ఒత్తిడిని తట్టుకోలేక సయ్యద్ ఫతే హుస్సేన్ రిజ్వీ కైఫీని లక్నోలోని ఓ మదరసాలో చేర్పించారు.

చిన్నతనం నుంచే కైఫీ నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. దాంతో ఆయన సమాజంలోని తప్పొప్పులను ప్రశ్నించేవారు. అందుకే మదరాసాలోని పెద్దలతో ఇబ్బందులనెదుర్కున్నారు.  ఆయన విద్యార్థి సంఘాన్ని ఏర్పాటు చేసి, తమ కోరికలు నెరవేర్చుకునేందుకు విద్యార్థులందరినీ సమ్మె చేయవలసిందిగా కోరారు. ఈ సమ్మె ఏడాదిన్నర కాలం సాగింది. సమ్మె ముగిసాకా, ఆయనని మదరసా నుంచి బహిష్కరించారు. ప్రోగ్రెసివ్ రైటర్స్ మూవ్మెంట్‌కి చెందిన అయేషా సిద్ధికీ – “కైఫీ సమాధుల మీద రాసి ఫాతిహాని చదవగలుగుతారని ఆయన పెద్దలు మదరసాకి పంపితే, ఆయనేమో మతం మీదే ఫాతిహా చదివి, వెళ్ళిపోయారు” అని వ్యాఖ్యానించారు.

దీంతో ఆయన ఆధునిక విద్య ముగిసింది. కానీ ఆయన లక్నో, అలహాబాద్ యూనివర్శిటీల నుంచి ఎన్నో పరీక్షలు పాయ్సి అరబిక్, పర్షియన్, ఉర్దూ భాషలను అభ్యసించారు.

తమది సాహిత్య కుటుంబం కావడంతో కైఫీకి భాషలు సులువుగా పట్టుపడ్డాయి. కైఫీ ప్రోగ్రెసివ్ రైటర్స్ మూవ్మెంట్ వైపు ఆకర్షితులయ్యారు. ఈ ఉద్యమానికి ఎందరో మేధావులు నాయకత్వం వహించేవారు. సామాజిక న్యాయం, హింస నుంచి స్వేచ్ఛ, వాక్స్వాతంత్రం కోసం పరితపించేవారు. కైఫీ లోని కవితాకౌశలాన్ని, నాయకత్వ లక్షణాలని గమనించిన ప్రగతిశీల రచయితలు ఆయనను బాగా ప్రోత్సహించి, మార్గదర్శనం చేశారు. ఫలితంగా కైఫీ మరింతగా రాణించసాగారు.

దేశంలో పౌర, రాజకీయ పోరాటాలు జరుగుతున్న కాలం అది. బ్రిటీషు వారి పాలన నుండి దేశం స్వాతంత్ర్యం కోరుకుంటోంది. అప్పుడే తలెత్తున్న మతోన్మాదం, హింసల మధ్య, మహాత్మా గాంధి అహింసా విధానం – మధ్య దేశం నలుగుతోంది.  ఇదంతా ఎందరో ధైర్య, ఆదర్శ యువతీయువకుల దృష్టిని ఆకర్షించింది. వారిలో కైఫీ ఆజ్మీ ఒకరు. క్విట్ ఇండియా ఉద్యమ నేపథ్యంలో ఆయన తన చదువుని మానుకుని స్వాతంత్ర పోరాటం లోకి దూకారు. యువ కైఫీలో రాజకీయ ప్రామాణ్యవాదం తలెత్తడానికి ఈ ఉద్యమం దోహదం చేసింది. బ్రిటీషు వారికి వ్యతిరేకంగా పోరాడడమే కాకుండా, భారతీయ సమాజంలో వేళ్ళూనుకున్న భూస్వామ్య వ్యవస్థతోనూ పోరాడి, భారతీయ పౌరుల పేదరికాన్ని ప్రస్తావించారు.

19 ఏళ్ళ వయసులో ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో చేరారు. కమ్యూనిస్ట్ పార్టీ ప్రచురించే ‘క్వామి జంగ్’ (ప్రజాపోరాటం) అనే ఉర్దూ వార్తాపత్రికలో చేరవలసిందిగా కామ్రేడ్ సజ్జద్ జహీర్ ఇచ్చిన పిలుపునందుకుని ఆయన బొంబాయి వెళ్ళారు. కైఫీ రచనలకి ఒక ప్రయోజనం సిద్ధించింది.

బొంబాయిలో కైఫీ తొలుత అంధేరీ, నాగ్‌పాడా కమ్యూన్‌లలో ఉండేవారు. ఆ తర్వాత జుహు శివార్లలోని జానకీ కుటీర్‌కి మారారు. అక్కడ కవులు, కళాకారులు, రంగస్థల, సినీ నటులు నివాసం ఉండేవారు. శ్రామికులకు అవసరమైన మేధోబలాన్ని అందిస్తూ, కైఫీ అతని మిత్రులు – ర్యాలీలలో ఎక్కువగా పాల్గొనేవారు. దేశానికి స్వాతంత్ర్యంచి వెళ్ళిపోతూ – బ్రిటీషు వారు మతోన్మాదాన్ని సృష్టించి వెళ్ళారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారందరికీ దేశ విభజన ఒక గాయమైంది. దేశం రెండుగా విడిపోవడం, ఆ తరువాత జరిగిన అల్లర్లు, ఘటనలు అందరినీ కలవరపరిచాయి. అదే సమయంలో నగరంలోని రాజకీయ నాయకులు, వారి మతతత్వ అనుచరులు క్రమపద్ధతిలో బొంబాయి కమ్యూనిస్టు శ్రామిక ఉద్యమాన్ని నాశనం చేశారు. ప్రగతిశీల రచయితలెందరో నిరాశలో కూరుకుపోయారు. అయితే కైఫీ లాంటి కొందరు మాత్రం తమ ఆశని కోల్పోక, ఎంచుకున్న మార్గంలో ముందుకు సాగారు.

ప్రజాకవిగా కొనసాగారు. అలనాటి యునైటెడ్ ప్రావిన్స్ నుంచి శరణార్థులుగా వచ్చిన వారు, కరువు, పేదరికం, బ్రిటీషు వారి అణచివేత తట్టుకోలేక బొంబాయి చేరిన వారు కైఫీకి ప్రేక్షకులయ్యారు. వారి ఎదుట ఆయన వారి సొంత భాష అయిన ఉర్దూలో తన కవితలు వినిపించేవారు. అన్యాయాల పట్ల, దోపిడి పట్ల గళమెత్తేవారు. ఆయన రచనలు- ఝంకార్‌, ఆఖిర్‌-ఓ-షాబ్‌, ఆవారా సజ్దే, సర్మాయా సమాజంలోని అసమానతలను ప్రశ్నించాయి. ఆయన కవిత్వం ఉద్వేగంతోనూ, పేదల పట్ల సానుభూతి తోనూ నిండి ఉండేది.

ఆయన జీవనోపాధి కోసం హిందీ చిత్రసీమలోకి ప్రవేశించి ఉండవచ్చు, కానీ సినీ పరిశ్రమకి ఆయన చేసిన సేవలను వెల కట్టలేం. అత్యంత ప్రతిభాశాలి అయిన గీత రచయితగా, కథా రచయితగా, స్క్రిప్ట్ రైటర్‍గా, సంభాషణల రచయితగా ఆయన పేరు తెచ్చుకున్నారు. అప్పట్లో హిందీ సినిమాలో ఉర్దూ వాడకం అధికంగా ఉండేది. ప్రగతిశీల రచయితల ఉద్యమంలో సభ్యులైన ఆయన సమకాలీనులలో సాహిర్ లుథియాన్వీ, మజ్రూహ్ సుల్తాన్‌పురీ, జాన్ నిసార్ అక్తర్, అలీ సర్దార్ జాఫ్రి వంటి వారు సినిమాలకి వ్రాస్తున్నారు. ఉర్దూ భాష రాచరిక శైలి నుంచి రూపాంతరం చెంది ఆధునిక సమకాలీన శైలికి మారింది. గీత రచయితగా కైఫీ ఎందరికో చేరువయ్యారు.

సినీజనాలు ‘కైఫీ సాహబ్’ అని సగౌరవంగా పిలుచుకునే కైఫీ నానూభాయ్ వకీల్ గారి ‘యాహుదీ కీ బేటీ’ (1956), ‘మిస్ పంజాబ్ మెయిల్’ (1958), ‘ఈద్ కా చాంద్’ (1958) సినిమాలకు కథారచయితగా పని చేశారు. ఆల్ టైమ్ క్లాసిక్, గురుదత్ తీసిన ‘కాగజ్ కే ఫూల్’ (1959) సినిమాకి పని చేస్తున్న గీత రచయిత సాహిర్ లుధియాన్వీ – సంగీత దర్శకులు ఎస్.డి. బర్మన్‍తో విభేదాలు వచ్చి వెళ్ళిపోతే, ఆ స్థానంలో కైఫీ చేరి ‘వక్త్ నే కియా క్యా హసీన్ సితమ్’ వంటి అద్భుతమైన పాటలను అందించారు. కైఫీ గారి అన్ని పాటలలోకి ఎక్కువగా గుర్తుండే పాట ఇది.

భారతదేశపు గొప్ప యుద్ధ చిత్రం ‘హకీకత్’ని చేతన్ ఆనంద్ నిర్మించినప్పుడు, ఆ సినిమాకి కైఫీ గొప్ప పాటలు రాశారు. ‘కర్ చలే హమ్ ఫిదా’ పాట దేశాన్ని ఉర్రూతలూగించింది. ‘హోకే మజ్‌బూర్ ముఝే ఉస్నే భులాయా హోగా’, ‘జరాసీ ఆహాత్ హోతీ హై’ పాటలను మదన్ మోహన్ సంగీత దర్శకత్వంలో రఫీ, లతా శ్రవణానందం కలిగేలా ఆలపించారు.

జీవిక కోసం సినిమా పాటలు రాసినా, వాటిలో సాహితీ విలువలు ఉండేలా చూశారు కైఫీ. ఆయన వాడిన పదాలే అందుకు సాక్ష్యం. హృశీకేశ్ ముఖర్జీ తీసిన ‘అనుపమ’ చిత్రంలో లత పాడిన ‘కుచ్ దిల్ నే కహా’, హేమంత్ కుమార్ పాడిన ‘యా దిల్ కీ సునో దునియావాలోం’ పాటలు ఇందుకు ఉదాహరణలు. హేమంత్ కుమార్, కైఫీల కలయికలో వచ్చిన పాటలు అజరామరాలు. వీటిల్లో లత ఆలపించిన ‘ఓ బేగార్ దిల్’, హేమంత్ పాడిన ‘యె నయన్ డరే డరే’ పాటలు బాగా ప్రాచుర్యం పొందాయి. కైఫీ ఆజ్మీ, హేమంత్ కుమార్, హృశీకేశ్ ముఖర్జీ, గురు దత్, చేతన్ ఆనంద్ లకు సాహిత్యం విలువ బాగా తెలుసు. అందుకే వారి సృజన కాలాతీతంగా నిలిచింది.

కైఫీ సాహబ్ కృషిలో మరో కోణం – జనబాహుళ్యం మనస్తత్వాన్ని బాగా అర్థం చేసుకోవడం. వాళ్లకి ఏది ఉపయోగపడుతోందో ఆయనకి బాగా తెలుసు.  ఆయన గీతాలు ఎన్నడూ నాణ్యతతో రాజీ పడలేదు, అదే సమయంలో సామాన్య జనానికి సైతం చేరువ అయ్యాయి. ‘షోలా అవుర్ షబ్నమ్’ చిత్రంలో లతా, రఫీ అద్భుత స్వరాలతో పాడిన ‘జీత్ హీ లేంగే బాజ్ హమ్ తుమ్’ లేదా ‘జానే క్యా డూండ్తీ రెహ్తీ హైం’ పాటలను ఎవరైనా మరువగలరా? ఖయ్యాం ఎంత గొప్ప సంగీతం అందించారు? ‘ఆఖ్రీ ఖత్’ చిత్రంలోని ‘బహారో మేరా జీవన్ భీ’ పాట తనకి బాగా నచ్చిన పాటల్లో ఒకటని లత ఒకసారి బహిరంగంగానే చెప్పారు.

తన గీతాలలో ఎన్నో భావోద్వేగాలను పలికించేవారు కైఫీ, ఆయన అభిమానులు కూడా దీనిని మెచ్చుకున్నారు. 1964 మే నెలలో జవహార్‌లాల్ నెహ్రూ మరణించినప్పుడు – దేశపు దుఃఖాన్ని వినిపిస్తూ – మదన్ మోహన్ సంగీతంలో – ‘నౌనిహల్’ చిత్రానికి ‘మేరీ ఆవాజ్ సునో ప్యార్ కా రాజ్ సునో’ అనే పాటని రాయగా, రఫీ గొంతులో విషాదం పలికిస్తూ అద్భుతంగా పాడారు. ఇదే సినిమాలో మరో అద్భుతమైన గీతం ‘తుమ్హారీ జుల్ఫ్ కే సాయే మే’ రఫీ స్వరంలో విని తీరాల్సిందే.

కైఫీ-మదన్‍మోహన్‌లు మనకు లతా, రఫీల స్వరంలో ఎన్నో అద్భుతమైన పాటలు ఇచ్చారు. ‘హస్తే జఖ్మ్’ చిత్రంలోని ‘తుమ్ జో మిల్ గయే హో’ పాట ఇందుకు గొప్ప ఉదాహరణ. ఈ సినిమాలో ‘ఆజ్ సోచా తో ఆంశూ భర్ ఆయే’ అనే లత సోలో పాట మంత్రముగ్ధుల్ని చేస్తుంది.

అయితే, కైఫీ ఆజ్మీ రచనలన్నింటిలోనూ ఆయనకి మరింత పేరు తెచ్చింది మాత్రం 1970లో విడుదలైన ‘హీర్ రాంజా’ అని చెప్పాలి. హిందీ చిత్ర రచనలలో ఇదొక అద్భుతమని చెప్తారు. మొత్తం సినిమాలలోని సంభాషణలన్నీ పద్యరూపంలో ఉంటాయి. ఈ సినిమాలో లత పాడిన ‘దో దిల్ టూటే దో దిల్ హారే’ అనే పాటా, రఫీ పాడిన ‘యే దునియా యే మెహ్‍ఫిల్ మేరే కామ్ కా నహీ’ అనే పాటా ఇప్పటికీ శ్రోతలను అలరిస్తూనే ఉంటాయి. బాణీ గొప్పదనాన్ని నిరూపిస్తూ, పాత్రల ఉద్వేగాల సారాన్ని గ్రహిస్తూ, కథని ముందుకు తీసుకువెళ్ళేలా ఉంటాయి కైఫీ గీతాలు. అది మదన్ మోహన్ స్వరపరిచిన ‘బావర్చీ’ లోని ‘తుమ్ బిన్ జీవన్ కైసా జీవన్’ కావచ్చు లేదా ‘సత్యకామ్’ చిత్రంలో లక్ష్మీకాంత్ ప్యారేలాల్ స్వరకల్పనలో మన్నాడే ఆలపించిన ‘దో దిన్ కీ జిందగీ కైసీ హై జిందగీ’ కావచ్చు.

తమకిష్టమైన కైఫీ గీతాన్ని ఎంచుకోమని ఒకవేళ అభిమానుల్ని అడిగాం అనుకోండి, ఎక్కువమంది ఎంచుకునేది ‘పాకీజా’ చిత్రం నుంచి ‘చల్తే చల్తే యూ హి కోయి మిల్ గయా థా’ అనే నజ్మ్. కవిత్వం ఆకారం దాల్చి, సాటి లేని లత స్వరంలో వెండి తెర మీద మీనాకుమారి సున్నితమైన ప్రదర్శనగా మారింది. పాత ప్రపంచపు ఆకర్షణలో ఇదొక అమూల్యమైన రత్నం. హిందీ సినీ చరిత్రలోని అతి గొప్ప గీతాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. కైఫీ సాహన్ సాటిలేని ప్రావీణ్యం ఈ పాటలో గోచరిస్తుంది.  ఇలాంటి అమూల్యమైన గీతాలెన్నో అందించింది కైఫీ గారి అద్భుతమైన కలం!

‘పర్వానా’ సినిమాలోని ‘సిమటీ సీ షర్మాయి సీ’ అనే పాటయినా, ‘హిందుస్థాన్‍ కీ కసమ్’ చిత్రంలోని ‘హై తేరే సాథ్ మేరీ వఫా’ అనే పాటయినా ఆయన సర్వతోముఖ ప్రజ్ఞకి నిదర్శనాలు.

ఇదే అద్భుతాన్ని ఆయన కూతురు షబానా ఆజ్మీ, రాజ్ కిరణ్ నటించిన ‘అర్థ్’ (1982) సినిమాలో చూడవచ్చు. ‘తుమ్ ఇత్నా ముస్కురా రహా హో’, ‘ఝుకీ ఝుకీ సీ నజర్’, ‘కోయీ యహ్ కైసే బతాయే’ వంటి కైఫీ ఘజళ్ళు ఈ సినిమాని జనరంజకం చేశాయి. ఈ ఘజళ్ళను జగ్‌జీత్ సింగ్ ఆలపించారు. ఈ ఘజళ్ళ వల్ల జగ్‌జీత్ సింగ్‍కి చక్కని పేరు ప్రఖ్యాతులు లభించాయి.

కైఫీ సాహబ్ బప్పీలహరితో పని చేసి, ‘మానా హో తుమ్ బేహద్ హసీ’ (గానం జేసుదాస్), ‘మేరే దిల్ మే తు హీ తు హై’ (గానం జగ్‌జీత్ సింగ్‍, చిత్రా సింగ్) వంటి హిట్ గీతాలు అందించారు. ‘రజియా సుల్తాన్’ చిత్రానికి ‘జల్తా హై బదన్’ అనే గీతం రాశారు. ఖయ్యాం సంగీత దర్శకత్వంలో ఈ పాటని లత ఆలపించారు.

కైఫీ సాహబ్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఇస్మత్ చుగ్తాయ్ కథ ఆధారంగా 1973లో ఎం.ఎస్. సత్యూ తీసిన ‘గరమ్‌ హవా’ చిత్రానికి స్క్రిప్ట్, సంభాషణలు, గీతాలు అందించారు. ఈ సినిమా ఉత్తర భారతదేశంలోని ముస్లింల అగచాట్లను గొప్పగా చిత్రించింది. దేశ విభజనపై తీసిన గొప్ప సినిమాలలో ఇదొకటి. కైఫీ శ్యామ్ బెనెగళ్ ‘మంథన్’ (1976) చిత్రానికి సంభాషణలు రాసి, బెస్ట్ డైలాగ్ రైటర్‍గా జాతీయ అవార్డు పొందారు. 1977లో ఎం.ఎస్. సత్యూ తీసిన ‘కన్నేశ్వర రామ’కి మరోసారి అవార్డు గెల్చుకున్నారు.

1992లో బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం, ఎందరో ఇతర భారతీయుల వలె కైఫీ కూడా క్రుంగిపోయారు. ఎంతో చలించిపోయి, ‘దూస్రా బన్‍వాస్’ అనే కవిత రాశారు.

1995లో సయీద్ మిర్జా తీసిన ‘నసీం’ అనే చిత్రంలో కైఫీ నటించారు. బాబ్రీ మసీదు కూల్చివేత నేపథ్యంగా తీసిన సినిమా అది. అందులో నటించి తన వ్యక్తిగత బాధను ఆ పాత్రలో ప్రతిఫలింపజేశారు కైఫీ.

కైఫీ సినిమాలకు రాసిన గీతాలన్నీ ఆమోదం పొందాయి, వాటిని మార్చవలసిన అవసరమే రాలేదు. గొప్పల కోసం తోచినది రాయలేదు. పైగా విప్లవకవి అని పేరుండడం, రొమాంటిక్ గీతాలు రాయలేరనే తప్పుడు అభిప్రాయం ప్రబలడం వల్ల ఆయన ఎక్కువమందితో పని చేయలేదు. అయినా కొన్ని పాటలు రొమాంటిక్‌గా రాశారనేది వాస్తవం. ‘అర్థ్’ (1982) సినిమాలోని ‘ఝుకీ ఝుకీ సీ నజర్’ గొప్ప రొమాంటిక్ సాంగ్. తన కవిత్వపు బలాన్ని గ్రహించిన గురు దత్, చేతన్ ఆనంద్, కమల్ అమ్రోహీ వంటి వారితోనే ఆయన ఎక్కువగా పని చేశారు.

సినీగీతాలకీ, మామూలు కవిత్వానికి మధ్య ఆయన ఎన్నడూ తేడాలు చూపలేదు. అన్ని కవితలూ ఒకేలా శక్తివంతమైనవి. గొప్ప కవిత్వం రాస్తూ కూడా, అందులో క్రోధం, ఔన్నత్యం వ్యక్తీకరించడం కైఫీ గారికే చెల్లింది.

కైఫీ గారి ఘనతలలో మరొకటి – గాలిబ్ మీద ఎం.ఎస్. సత్యూ తీసిన డాక్యుమెంటరీలో ఉస్తాద్ అమీర్ ఖాన్‌తో ఒక ఘజల్ పాడించడం! అది అరుదైన విషయం!

కైఫీ ఆజ్మీ ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను పొందారు. వాటిల్లో కొన్ని:

  • ఉత్తర ప్రదేశ్ ఉర్దూ అకాడెమీ అవార్డు
  • సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు
  • ఆవారా సజ్దే సంకలనానికి సాహిత్య అకాడమీ అవార్డు
  • మొత్తం సాహితీ కృషికి సాహిత్య అకాడమీ ఫెలోషిప్
  • ఉర్దూ సాహిత్యానికి చేసిన సేవలకు గాను మహారాష్ట్ర రాష్ట్ర ఉర్దూ అకాడమీ స్పెషల్ అవార్డు
  • ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ నుంచి అవధ్ రత్న అవార్డు
  • మహారాష్ట్ర గౌరవ్ అవార్డు
  • ఆఫ్రో-ఆసియన్ రైటర్స్ కమిటీ లోటస్ అవార్డు
  • ‘గరమ్‌ హవా’ చిత్రానికి స్క్రిప్ట్, సంభాషణలకు గాను జాతీయ అవార్డు
  • శ్యామ్ బెనెగళ్ ‘మంథన్’ (1976) చిత్రానికి బెస్ట్ డైలాగ్ రైటర్‍గా జాతీయ అవార్డు

అలనాటి యశఃకాయులలో కైఫీ ఆజ్మీ ఒకరనడంలో సందేహం లేదు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here