అలనాటి అపురూపాలు-92

0
2

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

సుప్రసిద్ధ సంగీత దర్శకుడు ఎస్.డి. బర్మన్ ముచ్చట్లు:

సినీ సంగీత ప్రియులను సంతోష సాగరాలలో విహారం చేయించిన ఎందరో స్వరకర్తలలో ప్రముఖులు ఎస్.డి. బర్మన్. ఆయన గురించి కొన్ని ముచ్చట్లు తెలుసుకుందాం.

శ్రీ ఎస్.డి. బర్మన్ గురించి ఎక్కువ మందికి తెలియని వాస్తవాలు:

  1. గీతాలను స్వరపరచడమే కాకుండా, సచిన్ ‘కర్తా’ (సినీ సంగీత పరిశ్రమలో ఆయనకున్న ముద్దు పేరు), 14 హిందీ సినిమాలకు, 13 బెంగాలీ సినిమాలకు పాటలు పాడారు.
  2. బర్మన్ గారిది రాజవంశ నేపథ్యం. వారి తండ్రి నబద్వీప్ చంద్రదేవ్ బర్మన్ గారు త్రిపుర రాచకుటుంబానికి చెందినవారు, తల్లి మణిపూర్ రాజవంశీకురాలు.
  3. బెంగాల్ విప్లవ కవి కాజి నజ్రుల్ ఇస్లామ్ వీరి కుటుంబానికి సన్నిహితులు. కోమిల్లా లోని వారి ఇట్లో నజ్రుల్ తరచూ బస చేసేవారు. నజ్రుల్ స్వరపరిచిన నాలుగు గీతాలను బర్మన్ ఆలపించారు.
  4. 1920ల చివర్లో, సచిన్ దేవ్ బర్మన్ – రేడియో గాయకుడిగా – కల్‍కత్తా రేడియో స్టేషన్‍లో పని చేశారు.
  5. బర్మన్ గారి తొలి రికార్డు (ఆల్బమ్స్ లేని కాలంలో) హిందూస్థాన్ రికార్డ్స్ వారి ద్వారా 1932లో విడుదలయింది.
  6. 1934లో జరిగిన బెంగాల్ మ్యూజిక్ కాన్ఫరెన్స్‌లో తను ఆలపించిన ఠుమ్రీకి బర్మన్ గారు స్వర్ణ పతకం గెలుచుకున్నారు. ఈ వేడుకని విశ్వకవి రవీంద్రులు ప్రారంభించారు.
  7. హిందీ చిత్రసీమలో ఆయన తొలి హిట్ పాట – 1947లో విడుదలయిన ‘దో భాయ్’ చిత్రంలో గీతాదత్ పాడిన ‘మేరా సుందర్ సప్నా బీత్ గయా’ అనేది.
  8. బొంబాయిలో నివసించిన మొదటి పదేళ్ళలో, పరిశ్రమలోని భౌతికవాద దృక్పథానికి విసిగిపోయి, కలకత్తా వెళ్ళిపోదామనుకున్నారు. కానీ మనసు మార్చుకుని బొంబాయిలోనే ఉండిపోయారు.
  9. ‘ఆరాధన’ (1969) చిత్రంలో ‘మేరే సపనోంకీ రాణీ’ పాటలో తన కుమారుడు రాహుల్ దేవ్ బర్మన్ చేత మౌత్ ఆర్గాన్ వాయింపజేశారు.
  10. ఆయనకి పేరు తెచ్చిన పాటలలో ఒకటైన – ‘మిలి’ సినిమాలో కిషోర్ కుమార్ పాడిన ‘బడీ సూనీ సూనీ హై’ పాట రిహార్సల్స్ తరువాత ఎస్.డి. బర్మన్ కోమాలోకి వెళ్ళిపోయారు. తర్వాత ఇంక కోలుకోలేదు (ఈ క్రింద మరిన్ని వివరాలు చదవండి).

***

1975లో ఎస్.డి. బర్మన్ గారు హృశీకేశ్ ముఖర్జీ గారి ‘మిలి’ సినిమాకి పాటలు రికార్డు చేస్తున్నారు. ఒకరోజున కిషోర్ కుమార్ పాడిన ‘బడీ సూనీ సూనీ హై’ పాట రిహార్సల్స్ బర్మన్ గారింట్లో జరుగుతున్నాయి. కానీ కాసేపటికే ఎస్.డి.బర్మ్‌న్ గారు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ఈ ఘటన గురించి కిషోర్ కుమార్ స్వయంగా అమీన్ సయానీ రేడియో కార్యక్రమంలో వివరించారు.

ఈ పాట రిహార్సల్స్ జరుగుతున్నప్పుడే సచిన్ దాదా అనారోగ్యానికి గురయ్యారు. “నేను సాధన చేస్తూనే ఉన్నాను, ఆయన కళ్ళు శూన్యంగా మారాయి. ఆయన మౌనంగా, నాకేసి చూస్తూ, పాట వింటూ ఉండిపోయారు” చెప్పారు కిషోర్ కుమార్. రిహార్సల్స్ ముగిసాక, కిషోర్ కుమార్ వెళ్ళిపోయారు. సుమారు 25 నిమిషాల తర్వాత ఎస్.డి. బర్మన్ నేల మీద పడిపోయారు. వెంటనే ఓ వైద్యుడికి కబురు వెళ్ళింది, ఆయన వచ్చి చూసి, ఎస్.డి. బర్మన్‍ను వెంటనే ఆసుపత్రిలో చేర్చాలని చెప్పారు. కానీ దాదా వెళ్ళలేదు.

“రేపు కిషోర్ పాటని రికార్డ్ చేయాలి, ఆసుపత్రికి వెళ్ళను అని ఆయన అన్నారు” అని కిషోర్ చెప్పారు. “రికార్డింగ్ అయిపోయాకా, మీరు నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళండి అని ఆయన అన్నారు” చెప్పారు కిషోర్. అందరూ ఆప్యాయంగా ‘పంచమ్’ అని పిలుచుకునే ఆయన కుమారుడు ఆర్.డి. బర్మన్ వెంటనే కిషోర్ ఇంటికి వెళ్ళి, వచ్చి తమ తండ్రికి ఏదో ఒక సాకు చెప్తే, ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్తామని అన్నారు. “కిషోర్, వచ్చి నాన్నకి అర్థమయ్యేలా చెప్పండి. రికార్డింగ్ తరువాతైనా పెట్టుకోవచ్చు అని పంచమ్ అన్నాడు” గుర్తు చేసుకున్నారు కిషోర్.

సచిన్ దాదా ఇంటికి వచ్చిన కిషోర్ అలసిన ఆయన శరీరానికి వైద్య సహాయం అవసరమని గుర్తించారు. కావాలనే ముతక స్వరంతో మాట్లాడారు. గొంతు బాలేదని నటిస్తే, రికార్డింగ్ కోసం దాదా పట్టుపట్టరని భావించారు. “దాదా, నా గొంతు వినండి, అస్సలు  బాలేదు. రికార్డింగ్ కొద్ది రోజులు వాయిదా వేద్దాం. మీరు ఆసుపత్రికి వెళ్ళి రండి, మీరు తిరిగి వచ్చేసరికి నా గొంతు బాగవుతుంది. అప్పుడు రికార్డ్ చేద్దాం అన్నాను” చెప్పారు కిషోర్. ఎస్.డి. బర్మన్ పర్‍ఫెక్షనిస్ట్. “సరే కిషోర్, పాట బాగా రావాలి. నీ గొంతు బాగయ్యాకే రికార్డు చేద్దాం. ఒక వేళ నేను రికార్డింగ్‌కి రాలేకపోతే, నేను నీ ముందు నిలుచున్నట్టుగానే భావించి పాడాలి. నేను నువ్వెలా పాడాలని అనుకున్నానో అలాగే పాడాలి, అన్నారు సచిన్ దాదా” గుర్తు చేసుకున్నారు కిషోర్.

సచిన్ దాదా ఆసుపత్రికి వెళ్ళారు. అందరూ అనుకున్నట్టే, ఆయన రికార్డింగ్‍కి రాలేకపోయారు. భౌతికంగా ఆయన అక్కడ లేకపోయినా, ఆయన చెప్పినట్టే ఆ పాటని ఆలపించారు కిషోర్. ఆ పాటని టేప్‍లో రికార్డు చేసి తీసుకెళ్ళి పంచమ్ తండ్రికి వినిపించగా, ఆయన కళ్ళ వెంట నీరు కారింది. “పంచమ్, నాకు తెలుసు, కిషోర్ ఇలా చక్కగా పాడుతాడని – అంటూ గొణిగారు” చెప్పారు ఆర్.డి. బర్మన్.

అదీ సంగీతం పట్ల ఆయనకున్న ఆపేక్ష.

***

స్వరకర్త ఎస్.డి. బర్మన్ గారికి ఫుట్‌బాల్ అన్నా, కిళ్ళీ అన్నా, కిషోర్ కుమార్ సాంగత్యం అన్నా బాగా ఇష్టం. కానీ అద్వితీయమైన ఆయన ప్రతిభ – ఇటీవల ముంబయిలో జరిగిన ఓ వర్క్‌షాపులో మళ్ళీ వెలుగులోకి వచ్చింది. స్థానిక మ్యూజిక్ క్లబ్ రివైండ్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో కీర్తనలకు రొమాంటిక్ డ్యూయెట్స్‌గాను, ఫోక్ సాంగ్స్‌ని బాలెడ్‍ల గానూ మార్చడంలోనూ – భారతీయ, లాటిన్ అమెరికన్ స్వరాలను మేళవింపు అద్భుతమైన సంగీతాన్ని సృష్టించడంలోనూ ఆయన ప్రతిభను గుర్తు చేసుకున్నారు.

ముఖ్యంగా బెంగాల్ నుంచి ముంబయికి, అక్కడ్నించి పాకిస్థాన్‌కి చేరిన ‘అల్లా మేఘ్ దే’ అనే ఓ జానపద పాటని సచిన్ దాదా ఉపయోగించిన తీరు గురించి ఆసక్తికరమైన సమాచరం లభించింది.

బెంగాల్ జానపద గాయకుడు, స్వరకర్త అయిన అబ్బాసుద్దీన్ అహ్మద్ ఈ పాటని, స్వరాన్ని 1940లలో ప్రముఖ మ్యూజిక్ కంపెనీ సారెగమా వారి కోసం రికార్డ్ చేశారు. భటియాలీ జానపద సంగీతానికి ప్రతినిధియైన అహ్మద్ – విషాద జానపద గీతాలకు ప్రోత్సాహం కల్పించేందుకు ‘అల్లా మేఘ్ దే’ అనే పాటని పాడారు. అది ఎంతగా ప్రజాదరణ పొందిందంటే – దాదాపు రెండు దశాబ్దాల తరువాత ఆ పాటని ‘గైడ్’ చిత్రం కోసం ఎస్.డి. బర్మన్ ఉపయోగించుకునేందుకు ప్రేరణ పొందేటంతగా! సినిమా కోసం శైలేంద్ర గారితో కొత్తగా రాయించి, ఆ పాటని తానే స్వయంగా అద్భుతంగా జానపద శైలిలో పాడారు ఎస్.డి. బర్మన్.

స్వరకర్తలు లక్ష్మీకాంత్-ప్యారేలాల్ ‘పల్కోంకీ ఛావ్ మే’ (1977) చిత్రంలో ‘అల్లా మేఘ్ దే’ అనే పాటని కిషోర్ కుమార్, ఆశా భోశ్లే చేత పాడించారు. సంగీత దర్శకుడు బప్పీలహరి ‘అమానత్’ (1994) సినిమాలో ఈ పాటని వాడారు. ఇదే బాణీని కొద్దిగా సవరించి ‘దే దే ప్యార్ దే’ అనే డిస్కో పాటగా ఆయన ‘షరాబీ’ (1984) చిత్రంలో ఉపయోగించారు. ‘రామ్‌చంద్ పాకిస్థానీ’ (2008) అనే చిత్రంలో శుభా ముద్గల్, షాఫ్‍కత్ అమానత్ అలీ ఇదే పాటని మరో వెర్షన్‍ని ఆలపించారు.

అయితే వీటన్నింటిలోకి ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయినది బర్మన్ వెర్షన్ మాత్రమే. ఎందుకంటే అది మూల బాణీకి దగ్గరగా ఉంది.

ఎస్.డి.బర్మన్ కుమారుడు ఆర్.డి. బర్మన్‍పై తండ్రి ప్రభావం చాలా ఉంది. తన చివరి చిత్రం వరకు అప్పుడప్పుడు తండ్రి బాణీలను ఉపయోగించుకున్నారు. 1994లో విడుదలయిన ‘1942 ఏ లవ్ స్టోరీ’ చిత్రంలోని ‘కుచ్ న కహో’ పాట వారి తండ్రి గారి భటియాలి పాట ‘రంగీలా రే’ని పోలి ఉంటుంది.

చిన్న పిల్లాడి మనస్తత్వం, ‘గైడ్’ చిత్రంలో ‘పియా తోసే నైనా లాగే రే’ అనే పాటలో బాణీకి తగ్గట్టుగా నర్తించమని నటి వహీదా రెహ్మాన్‍కి నేర్పడం – కిషోర్ కుమార్‌తో కలిసి పచ్చని పొలాల్లోకి విహారానికి వెళ్ళడం – గాయకుడు మన్నా డే రిహార్సల్స్‌ని ఆపేసి – ఫుట్ బాల్ మ్యాచులకి వెళ్ళడం ఇవీ బర్మన్ గారి జీవితంలో కొన్ని సరదా సంఘటనలు.

తనదైన శైలి:

ఓ సర్వస్వతంత్రుడి లక్షణాలను బర్మన్ ప్రదర్శించినప్పటికీ, సంగీతం విషయానికి వచ్చేసరికి ఆయనకది ప్రాణం. సినీ సంగీతం సృజించే పద్ధతినే మార్చారాయన. ఆయనకి బాణీలు ముందు, సాహిత్యం తరువాత. దీనివలన పాటలలో వ్యావహారిక పదాలు జొప్పించగలిగే వీలు కలిగింది. ఉదాహరణ పేయింగ్ గెస్ట్ (1957) సినిమాలోని ‘ఛోడ్ దో ఆంచల్’ పాట, ‘చల్తీ కా నామ్ గాడీ’ (1958) చిత్రంలోని ‘హాల్ కైసా హై’ పాట. ఇలా చిన్న చిన్న సంభాషణలను పాటలలో ప్రవేశబెట్టే శైలిని రివైండ్ మ్యూజిక్ క్లబ్ నిర్వాహకులు ‘staccato style’ అని పేర్కొన్నారు.

ఎస్.డి. బర్మన్ త్రిపుర రాచకుటుంబానికి చెందినవారైనా, చిన్నతనం నుంచే శాస్త్రీయ సంగీతం అభ్యసించారు. అదే సమయంలో కోమిల్లా (ప్రస్తుత బంగ్లాదేశ్) జానపద సంగీతం పట్లా అంతే ఆసక్తి ప్రదర్శించారు.

ఆధునిక వాయిద్య పరికరాలను ఉపయోగించడంలో నిష్ణాతులైన ఎస్.డి.బర్మన్ బాణీలను ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళడానికి ఆర్కెస్ట్రాని ఉపయోగించేవారు.

మూడున్నర గంటల సాధన తర్వాత, బృందంలోని వారందరీ మీఠా పాన్ ఇప్పించేవారు.

మదరాసీలతో వివాదం:

అవి 1949 రోజులు. ఫిల్మిస్థాన్ ఫిల్మ్స్ వారి ‘ఎయిట్ డేస్’ (1946) చిత్రంలో హిందీ సినీ పరిశ్రమలో ప్రవేశించిన స్వరకర్త సచిన్ దేవ్ బర్మన్‌కు గొప్ప హిట్ అదే బ్యానర్ వారు 1949లో నిర్మించిన ‘షబ్నమ్’ చిత్రం ద్వారా లభించింది. ఈ చిత్రంలో కామినీ కౌశల్, దిలీప్ కుమార్, పారో నటించారు. కథకి స్ఫూర్తి ‘సిల్వియా స్కేర్‍లెట్’ (1935) అనే హాలీవుడ్ చిత్రమైనా, ఈ చిత్రం ఘన విజయం సాధించింది.

‘షబ్నమ్’ చిత్రంలోని పాటలు అందరి నోటా నానాయి. ముఖ్యంగా బొంబాయిలోని రెస్టారెంట్లలో ఆ సినిమా పాటలే వినబడేవి. అనేక భాషల పదాలున్న ఒక పాట ముఖ్యంగా జనాలని ఆకట్టుకుంది. శంషాద్ బేగం పాడిన ‘యే దునియా రూప్ కీ చోర్’ అనే పాట అది. సరదాగా, తమాషాగా సాగే ఈ పాటలో- భారతదేశంలోని ప్రలు ప్రాంతాల యువకులు హీరోయిన్ వెంటబడుతూ – తమ ప్రాంతీయ భాషలలో – బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, మద్రాసీ, ఇంకా పంజాబీ భాషాల్లో – పేరడీ పాటలు పాడుతారు. మద్రాసీ పాట మరీ తమాషాగా ఉందని కొందరు, మరీ అతిగా ఉందని మరొకొందరు భావించారు. ఇది మనం చూసే దృష్టికోణాన్ని బట్టి ఉంటుంది.

‘షబ్నమ్’ విడుదలయినప్పుడు ఎస్.డి. బర్మన్ బొంబాయిలో దక్షిణ భారతీయులు ముఖ్యంగా – ఉత్తర భారతీయులు మద్రాసీలని పిలిచే తమిళులు అధికంగా నివసించే Sion అనే ప్రాంతంలో ఉండేవారు. ఒకరోజు బర్మన్ దాదా కింగ్స్ సర్కిల్ స్టేషన్‍కి వెళ్తుండగా కొందరు తమిళులు ఆయన్ని ఆపారట. ‘తమరు ఎస్.డి. బర్మన్ గారే కదా?’ అని అడిగారట. అవును అని చెబుతూ, అభిమానులేమోననుకుని ఆయన ఆటోగ్రాఫ్ చేసేందుకు జేబులోంచి పెన్ను తీయబోయారుట. అంతలో ఒక వ్యక్తి ఒక ఆయన మెడ పట్టుకోగా, మరో వ్యక్తి కుర్తా లాగేసాడట.

“వాళ్ళెంతో కోపంగా ఉన్నారు. ‘మా సంగీతాన్ని హేళన చేస్తారా?’ అంటూ అరిచారు. ‘మా సంగీతం ఎలా ఉంటుందో తెలుసా?’ అన్నారు. నేను వాళ్ళకి క్షమాపణ చెప్పాను. భవిష్యత్తులో నా సంగీతంలో అలాంటి ప్రయోగాలు చేయనని వాళ్ళు నా దగ్గర మాట తీసుకున్నారు” అని స్వయంగా బర్మన్ దాదాయే వెల్లడించారు.

***

ఓ మధుర సంగీత దర్శకుడి జీవితంలోని కొన్ని ముచ్చట్లు ఇవి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here