Site icon Sanchika

అలనాటి అపురూపాలు-94

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

ఆదర్శవాది కైఫీ ఆజ్మీకి నివాళి:

హస్రత్ జైపురీ, షకీల్ బదాయునీ, సాహిర్ లూథియాన్వీ, ఇంకా మజ్రూహ్ సుల్తాన్‌పురిలా హిందీ పాటలలో ఉర్దూని చొప్పించిన వారిలో కైఫీ ఆజ్మీ ఒకరు. ఉర్దూ ఇంకా కొనసాగుతున్న రంగాలలో ‘రెట్రో హిందీ మ్యూజిక్’ ఒకటి. అయితే కైఫీగారిని నిర్వచించే అంశం ఇదొకటే కాదు.

అణచివేత అంటే తొలినాటి నుంచి ఉన్న వ్యతిరేకత కారణంగా, ఆయన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరారు. చెమటోడ్చే శ్రామికుడు తనని తాను ఆయన కవిత్వంలో చూసుకోడమే కాకుండా మత మౌఢ్యం పట్ల నిరసన, స్త్రీల పట్ల గౌరవం కూడా చూశాడు. ఓ దేశభక్తుడిగా ఆయన రాసిన ‘కర్ చలే హమ్ ఫిదా జానో తన్ సాథియోం’ ఈనాటికీ దేశంలో ఏదో ఒక మూల మారుమ్రోగుతూనే ఉంటుంది.

ఆయనలోని సామ్యవాద భావనలు ఆయనను తన సొంత ఊరు, ఉత్తర ప్రదేశ్‌లోని మిజ్వాన్‌కి రప్పించాయి. ఆ ఊర్లో ఆడపిల్లలకు విద్యా, నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టులతో ఆ కుగ్రామాన్ని ఓ నమూనా గ్రామంగా మార్చారు. పక్షవాతంతో ఎడమ చేయి పని చేయకపోయినా, ఈ పనులను స్వయంగా జరిపించారు. కైఫీలో పలాయానవాదం కానీ, రంధ్రాన్వేషణ చేసేది కానీ ఏమీ లేదు. ఆయన ఓ రొమాంటిసిస్ట్… నీతిమాలిన వాళ్ళతో కలిసి ఉన్నా, జీవితం పట్ల అమితమైన ఇష్టం కలవారు. ఆయనకి తన మాంటేబ్లాంక్ పెన్ అన్నా, కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వ కార్డు అన్నా బాగా ఇష్టం. ఆ కార్డుని ఆయన భౌతికకాయంతో పాటుగా ఖననం చేశారు.

కైఫీ – సయ్యద్ అథర్ హుస్సేన్ రిజ్వీ అనే పేరుతో జనవరి 1919లో ఉత్తర ప్రదేశ్ లోని అజామ్‌గర్ లోని మిజ్వాన్ గ్రామంలో జన్మించారు. 11 ఏళ్ళ వయసులో ఆయన ‘ఇత్నా తో జిందగి మే కిసికి ఖలాల్పడే , హన్స్‌నే  సే హో సుకూన్ , నా రోనే సే కల్ పడే’  అనే తొలి ఘజల్ వ్రాసి ఓ ముషాయిరాలో చదివి వినిపించారు. ఆ ఘజల్‌కి గొప్ప ఆదరణ లభించింది. ఈ ఘజల్‍ని సుప్రసిద్ధ గాయని బేగమ్ అఖ్తర్ ఆలపించడంతో దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. షియా కుటుంబంలో జన్మించిన కైఫీకి – కర్బాలాలో ఇమామ్ హుస్సేన్‌ జరిపిన బలిదానం గురించి బాగా తెలుసు. ఈ తొలినాళ్ళ నాటి అణచివేత, అన్యాయాల పట్ల వ్యతిరేకత, 20 ఏళ్ళ కైఫీని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సిపిఐ) సభ్యత్వం తీసుకునేలా ప్రేరేపించింది. కామ్రేడ్ సజ్జద్ జహీర్ ఇచ్చిన పిలుపునందుకుని పార్టీ ప్రచురించే ‘క్వామి జంగ్’ (ప్రజాపోరాటం) అనే ఉర్దూ వార్తాపత్రికలో చేరారు. ప్రోగ్రెసివ్ రైటర్స్ మూవ్‌మెంట్ సభ్యత్వం కలిగి ఉన్న కైఫీ లేబర్ యూనియన్ ఉద్యమంలో కూడా పని చేశారు. బీదల పట్ల ఆయనకున్న సహానుభూతి ఆయన కవిత్వంలో వ్యక్తమయ్యేది. ఆయన తొలి కవితా సంపుటి ‘ఝంకార్’ 1943లో ప్రచురితమయింది. ఔరత్, మకాన్, దేరా, సాంప్, బహురూపిణి – అనేవి ఆయనకి పేరు తెచ్చిన కవితలు. ఇండియన్ పీపుల్ థియేటర్ అసోసియేషన్ (ఐపిటిఎ)‌కి ఆయన అఖిల భారత అధ్యక్షులు. బాల్‌రాజ్ సహానీ వంటి వామపక్షవాదులతో కలిసి ఆయన నాటకాలలో నటించారు.

గీతాలు, సినిమాలు:

ఇస్మత్ చుగ్తాయ్ ప్రోత్సాహంతో కైఫీ తొలిసారిగా 1951లో షహీద లతీఫ్ దర్శకత్వంలో వచ్చిన ‘బుజ్‌దిల్’ సినిమాకి ‘రోతే రోతే గుజర్ గయీ రాత్’ అనే పాటని రాశారు. కైఫీ గారికి ఇల్లు గడవడం అత్యవసం కాబట్టి ఆయనతో పాట రాయించుకోవల్సిందిగా ఇస్మత్ చుగ్తాయ్ తన భర్త లతీఫ్‍ని కోరారు. ఆ తరువాత కైఫీ ‘యాహుదీ కీ బేటీ’ (1956), ‘మిస్ పంజాబ్ మెయిల్’ (1958), ‘ఈద్ కా చాంద్’ (1958) సినిమాలకు పాటలు రాశారు. గురుదత్ తీసిన ‘కాగజ్ కే ఫూల్’ (1959) సినిమాతో కైఫీగారికి మంచి బ్రేక్ వచ్చింది. సంగీత దర్శకులు ఎస్.డి. బర్మన్‍తో కలిసి కైఫీ ‘వక్త్ నే కియా క్యా హసీన్ సితమ్’ వంటి అద్భుతమైన గీతాన్ని అందించారు. నిజానికి ఆ సందర్భంలో సినిమాలో పాట లేదుట. గీతం బాగా నచ్చిన గురుదత్ అందుకు అవసరమైన సన్నివేశాన్ని సృష్టించారుట.

ఆ తరువాత వచ్చిన మరో హిట్ ‘షోలా అవుర్ షబ్నమ్’ (1961) చిత్రం. ఇందులోని ‘జానే క్యా డూండ్తీ రెహ్తీ హైం’, ఇంకా, ‘జీత్ హీ లేంగే బాజ్ హమ్ తుమ్’ పాటలు జనాదరణ పొందాయి. కానీ సినిమా పరాజయం పాలయ్యింది. కైఫీ యత్నాలకు కొద్ది గుర్తింపు మాత్రమే లభించింది.

కొంతమంది ఆయనని దురదృష్టవంతుడనేవారు. ఆయన పని చేసిన సినిమాలు ఆడవనేవారు. అందుకే చేతన్ ఆనంద్ ‘హకీకత్’ సినిమాని నిర్మిస్తున్నప్పుడు, ఆ సినిమాకి కైఫీ పాటలు రాయమని కైఫీని అడిగారు. అప్పుడు కైఫీ గారు “నా గ్రహస్థితి బాగున్నట్టు లేదు” అన్నారుట. బదులుగా చేతన్ “నా సినిమా గురించి జనాలు అలాగే అంటున్నారు. బహుశా రెండు ప్రతికూలతలు కలిస్తే సానుకూలమవుతుందేమో చూద్దాం” అన్నారుట. మదన్ మోహన్ సంగీత దర్శకత్వంలో ‘హకీకత్’ చిత్రం – ‘కర్ చలే హమ్ ఫిదా’ పాట దేశభక్తి గీతాన్ని, ‘మై యే సోచ్‌కర్ ఉస్కే దర్ సె ఉఠా థా’ వంటి విషాద గీతాన్ని అందించింది.

కైఫీ-మదన్‍మోహన్‌ల జోడీ చేతన్ ఆనంద్‍తో కలిసి ‘హస్తే జఖ్మ్’, ‘హిందూస్తాన్‍ కీ కసమ్’ అనే చిత్రాలలో చక్కని పాటలు ఇచ్చింది. కైఫీ ఆజ్మీ రచనలన్నింటిలోనూ ఆయనకి మరింత పేరు తెచ్చింది మాత్రం 1970లో విడుదలైన ‘హీర్ రాంజా’ అని చెప్పాలి. మొత్తం సినిమాలలోని సంభాషణలన్నీ పద్యరూపంలో ఉంటాయి. ఈ సినిమాలో ‘యే దునియా యే మెహ్‍ఫిల్ మేరే కామ్ కా నహీ’ అనే పాట; ‘మిలో నా తుమ్ తో హమ్ ఘబ్‌రాయే’ అనే పాటా బాగా హిట్ అయ్యాయి.

మదన్ మోహన్ సంగీతంలో – ‘నౌనిహల్’ (1967) చిత్రానికి ‘మేరీ ఆవాజ్ సునో ప్యార్ కా రాజ్ సునో’ అనే పాటని కైఫీ రాయగా, రఫీ అద్భుతంగా పాడారు. ఈ పాటని అప్పటి ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ మరణించినప్పుడు – అంతిమయాత్ర ఊరేగింపు వెడుతున్నప్పుడు వినిపించడంతో దానికి శాశ్వతత్వం లభించింది. కోహ్రా, అనుపమ, పర్వానా, బావర్చీ, హస్తే జఖ్మ్, సంకల్ప్ వంటివి (1960-80 ల మధ్య) ఆయనకు పేరు తెచ్చిన సినిమాలు.

కైఫీ సాహబ్  – ఇస్మత్ చుగ్తాయ్ కథ ఆధారంగా 1973లో ఎం.ఎస్. సత్యూ తీసిన ‘గరమ్‌హవా’ చిత్రానికి స్క్రిప్ట్, సంభాషణలు, గీతాలు అందించారు. ఈ సినిమా ముస్లింల అగచాట్లను గొప్పగా చిత్రించింది. దేశ విభజనపై తీసిన గొప్ప సినిమాలలో ఇదొకటి. ఈ సినిమాకి కైఫీ బెస్ట్ డైలాగ్ రైటర్‍గా; బెస్ట్ స్క్రీన్‌ప్లే రైటర్‌గా (షామా జైదీతో సంయుక్తంగా); బెస్ట్ స్టోరీ రైటర్ (ఇస్మత్ చుగ్తాయ్‌తో సంయుక్తంగా) గా ఫిల్మ్‌ఫేర్ అవార్డులు పొందారు.

1995లో సయీద్ మిర్జా తీసిన ‘నసీం’ అనే చిత్రంలో ఒక గొప్ప పాత్రలో కైఫీ నటించారు. బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం జరిగిన మత కలహాలలో బాధింపబడిన కుటుంబం కథ అది. కైఫీ శ్యామ్ బెనెగళ్ ‘మంథన్’ (1976) చిత్రానికి సంభాషణలు రాసి, బెస్ట్ డైలాగ్ రైటర్‍గా జాతీయ అవార్డు పొందారు. 1977లో ఎం.ఎస్. సత్యూ తీసిన ‘కన్నేశ్వర రామ’కి మరోసారి అవార్డు గెల్చుకున్నారు.

కైఫీ ఆజ్మీ కెరీర్‍లో మరో గొప్ప మైలురాయి మహేష్ భట్ తీసిన ‘అర్థ్’ (1982). ఈ సినిమాలోని ఘజళ్ళను జగ్‌జీత్ సింగ్ ఆలపించి, వాటిని జనరంజకం చేశారు. ‘తుమ్ ఇత్నా ముస్కురా రహా హో’, ‘కోయీ యహ్ కైసే బతాయే’ వంటివి కేవలం ఘజళ్ళు కాదు, అవి ఆ సినిమాకి ఆత్మ వంటివి. విడుదల అవని ‘చంద్ గ్రహణ్’ (1997) అని సినిమాకి కైఫీ తన చివరి పాటని రాశారు.

షౌకత్ గారి కైఫీ:

మాజీ నటి స్వర్గీయ షౌకత్ ఆజ్మీ కైఫీ గారిని తొలిసారిగా 1947లో హైదరాబాదులో ఓ ముషాయిరాలో కలిసారు. తాను రాసిన ఫెమినిస్ట్ కవిత ‘ఔరత్’ చదివారు కైఫీ. అందులోని ‘ఉఠ్, మేరీ జాన్! మేరే సాథ్  హీ చల్‌నా హై తుజే’ అనే వాక్యాలు – షౌకత్‌ని మంత్రముగ్ధని చేశాయి. ఆయన ఆలోచన పరాక్రమాన్ని మెచ్చారు. అది – స్త్రీ వంటింటికే పరిమితమవాలనే పితృస్వామ్య భావజాలాన్ని త్రోసిపుచ్చింది. తన కవితలో కైఫీ స్త్రీని తన సహప్రయాణీకురాలిగా, నేస్తంగా పరిగణించారు. ముషాయిరా ముగిసిన తర్వాత ఎందరో యువతులు కైఫీని చుట్టుముట్టి ఆటోగ్రాఫ్‍లు అడిగారు. కానీ షౌకత్ మాత్రం కవి సర్దార్ జాఫ్రి వైపు నడిచారు. చివరిగా ఆమె కైఫీ దగ్గరకి వచ్చినప్పుడు – ఆయన తోచిందేదో రాసి సంతకం చేశారట. వారి మధ్య ప్రేమ ఈ ఘటనతో అంకురించింది.

వారి వివాహమైన తొలి రోజులు గడ్డుగా గడిచాయి. వారు పార్టీ ఇచ్చే స్టైపండ్‍ మీద జీవించారు. మరో మూడు కుటుంబాలతో కల్సి ఒక కమ్యూన్‍ వంటి అపార్ట్‌మెంట్‌లో ఉండేవారు. వారికి కూతురు (షబానా ఆజ్మీ), కొడుకు అహ్మర్ (బాబా ఆజ్మీ) పుట్టారు. ఆర్థిక సమస్యలున్నా, పిల్లలకి తల్లిదండ్రుల ప్రేమ కొరత లేకుండా లభించింది.

ఓ నటిగా తన కెరీర్‍కు కైఫీ ఎంతో సహాయంగా నిలిచారని షౌకత్ చెప్పారు. ఆమెతో పాటు కూర్చుని, ఆమెకు సంకేతాలిస్తూ, రిహార్సల్స్‌లో సంభాషణలు చెప్పించేవారట. జుహు లోని జానకి కుటీర్‍లోని ఆ చిన్న ఇల్లే ఎందరో కళాకారులకు నెలవు అయింది. జోష్ మలిహాబాదీ, ఫైజ్ అహ్మద్ ఫైజ్, ఫిరాక్ గోరఖ్‌పురీ వంటి కవులకు, గాయని బేగమ్ అఖ్తర్‌కు ఆస్థానం అయింది. గొప్ప భారతీయ సంస్కృతికి కొలువు అయింది. తమ బంధానికి గుర్తుగా షౌకత్ ఆజ్మీ ‘యాద్ కీ రెహ్‌గుజర్’ రాశారు. దాన్ని ‘కైఫీ ఔర్ మై’ అనే పేరిట నాటకంగా మలచారు. కైఫీ ఆజ్మీ నాలుగవ వర్ధంతి సందర్భంగా 2006లో దాన్ని ముంబయిలో ప్రదర్శించారు. కైఫీగా జావేద్ అఖ్తర్, షౌకత్‍గా షబానా నటించారు.

‘మెసయ్యా ఆఫ్ మిజ్వాన్’గా పేరుపొందిన కైఫీ 70ల తొలినాళ్ళలో బ్రెయిన్ హెమర్రేజ్‍కి గురయ్యారు. దాంతో ఆయన ఎడమ కాలు, ఎడమ చెయ్యి చచ్చుబడిపోయాయి. అయినప్పటికీ, బాధని పంటి బిగువున భరిస్తూ, తన జన్మస్థలమైన మిజ్వాన్ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపారాయన.

ఆ కుగ్రామంలో మిజ్వాన్ వెల్ఫేర్ సొసైటీని స్థాపించారు. అప్పట్లో ఆ గ్రామానికి పిన్ కోడ్ కూడా లేదు. 1993లో ఆయన గ్రామీణ ప్రాంతాలలోని బాలికలు, స్త్రీల కోసం మిజ్వాన్ వెల్ఫేర్ సొసైటీని (MWS) స్థాపించారు. విద్య, నైపుణ్యాభివృద్ధి కోసం కృషి చేయాలని సంకల్పించారు. MWS నేడు ఆ గ్రామంలో కైఫీ ఆజ్మీ బాలికల ఉన్నత పాఠశాల, కైఫీ ఆజ్మీ యువతుల ఇంటర్ కాలేజీ, కైఫీ ఆజ్మీ కంప్యూటర్ సెంటర్, కైఫీ ఆజ్మీ కుట్టు కేంద్రం వగైరాలను నిర్వహిస్తోంది. కైఫీ గారి సేవలకు గుర్తింపుగా మిజ్వాన్‍కు దారితీసే మార్గాన్ని కైఫీ ఆజ్మీ రోడ్ గానూ, ఆ హైవేని కైఫీ ఆజ్మీ హైవే గాను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం పేరు పెట్టింది. ఢిల్లీ నుంచి అజామ్‌ఘర్ వచ్చే రైలుకి కైఫీయత్ ఎక్స్‌ప్రెస్‌ అని పేరు పెట్టారు. 84 ఏళ్ళ వయసులో 10 మే 2002 నాడు మరణించే వరకు మిజ్వాన్ – ఆయన అభిమాన ప్రాజెక్టుగానే ఉంది.

MWS అధ్యక్షుడిగా తన తండ్రి ఆశయాలను షబానా కొనసాగిస్తున్నారు. మిజ్వాన్ మహిళల చేతి ఎంబ్రాయిడరీ విద్య ‘చికంకారీ’- మనీష్ మల్హోత్ర ఆధ్వరంలో గ్లామర్ ప్రపంచంలో ఉన్నత స్థాయికి చేరింది. ది మిజ్వాన్ ఫ్యాషన్ షో ఇప్పుడు పేరు పొందిన వార్షిక కార్యక్రమం. కైఫీ శత జయంతి సందర్భంగా ఆయన కుమారుడు బాబా ఆజ్మీ ‘మీ రక్సమ్’ అనే సినిమా ప్రీమియర్ షో ప్రదర్శించారు. అందులో కైఫీ గారి గురించి, ఆయన సందేశాల గురించి చూపించారు. ఓ కవిగా కైఫీ గారు గొప్ప వారసత్వాన్ని వదిలి వెళ్ళారు. కానీ ఆయన ఆచరించిన ఆదర్శాలు ఇంకా గొప్పవి. “మీరు మార్పు కోసం పని చేస్తున్నట్లయితే… ఒక్కోసారి ఆ మార్పు మీ జీవితకాలంలో రాకపోవచ్చు… మీరు గతించాకా, కొన్ని సంవత్సరాల తర్వాత ఆ మార్పు రావచ్చు….” అని ఆయన ఒకసారి షబానాతో చెప్పారట. మిజ్వాన్ అందుకు నిదర్శనం.

Exit mobile version