అలనాటి అపురూపాలు-97

0
2

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

హాలీవుడ్ క్లాసిక్ ప్రేమకథలు – వివియన్ లీ, లారెన్స్ ఒలివియర్:

రంగస్థలం మీద, వెండితెర మీద అద్భుత జోడీలుగా పేరుపొందిన ప్రేమజంటలు చాలా ఉన్నాయి. చాలామంది దంపతులయ్యారు కూడా. కొందరు ఆ బంధాన్ని స్వల్పకాలమే నిలుపుకున్నప్పటికీ, వారి మధ్య ప్రేమ చెరగనిది. హాలీవుడ్ క్లాసిక్ ప్రేమ కథలలో అటువంటి కథ వివియన్ లీ, లారెన్స్ ఒలివియర్‍లది.

అప్పుడే పైకొస్తున్న స్టార్లుగా వీరిద్దరూ లండన్‍లో రంగస్థలాన్ని ఎంతగానో ఇష్టపడ్డారు. అప్పట్లో వివియన్‍కి 22 ఏళ్ళు, లారెన్స్‌కి 28 ఏళ్ళు. నాటక ప్రదర్శనల సందర్భంగా వీరిద్దరూ కలుసుకున్నారు. 1936లో ‘The Mask of Virtue’ అనే నాటకంలో అద్భుత నటన ప్రదర్శించిన వివియన్‍ని అభినందించడానికి గ్రీన్‍రూమ్‌కి వెళ్ళారు లారీ అనబడే లారెన్స్. వారిద్దరూ తొలి చూపులోనే ఆకర్షితులయ్యారు. అయితే అప్పటికే వారిద్దరూ వివాహితులు. వివియన్‍కి లీ హోల్‌మన్ అనే న్యాయవాది అయిన భర్త ఉన్నారు, ఆయన ఆమె కంటే 18 ఏళ్లు పెద్ద. వారిద్దరికీ రెండేళ్ళ కూతురు కూడా ఉండేది. లారీ తనకి 23 ఏళ్ళ వయసున్నప్పుడు తోటి నటి జిల్ ఎస్మండ్‌ని పెళ్ళి చేసుకున్నారు. వివియన్‌ని కలిసే సమయానికి ఆయన తండ్రి కాబోతున్నారు. అందుకని వాళ్ళిద్దరూ స్నేహితులుగా ఉండి కుటుంబాలతో సెలవలకి కాప్రి వెళ్ళి సరదాగా గడిపారు. ఆ మరుసటి ఏడాది ‘Fire Over England’ అనే సినిమాలో వీళ్ళిద్దరూ ప్రేమికులుగా నటించారు. సెట్‍లో ఉన్న అందరికీ స్పష్టంగా అర్థమైంది వారిద్దరూ ప్రేమలో ఉన్నారని.

వారి మధ్య కెమిస్ట్రీ ప్రత్యక్షంగా గోచరించేది, అందుకని ఓల్డ్ విక్ థియేటర్ వారు ‘హామ్లెట్’ నాటకంలో వారిని హామ్లెట్, ఒఫిలియాగా నటింపజేశారు. వీరిద్దరూ ప్రేమలో తల మునకలైపోయి, తమని ఎవరు చూస్తున్నా పట్టించుకోలేదు. వీరిద్దరూ త్వరలోనే తమ భాగస్వాములని విడిచి కలిసి ఉండసాగారు. అయితే లీ హోల్‍మన్, జిల్ ఎస్మండ్‌ కోర్టులో కేసులు వేశారు. ఈ జంటలకి విడాకులు మంజూరు కావడానికి మూడేళ్ళు పట్టింది. పిల్లలున్న వివాహితులు వేరే సంబంధాలు పెట్టుకోడానికి సమాజం హర్షించదు కాబట్టి లారీ, వివియన్‍లు తమ బంధాన్ని రహస్యంగా ఉంచారు. కానీ ఇద్దరూ ఒకరినొకరు అమితంగా ప్రేమించుకోడం వల్ల – కలిసే ఉండడం వల్ల – వాళ్ళకి ఇది కష్టంగా ఉండేది. వీరిద్దరినీ జాగ్రత్తగా ఉండమని వారి ఏజంట్లు, ప్రచారకర్తలు హెచ్చరించేవారు.

1938లో లారీ ‘Wuthering Heights’ సినిమా కోసం హాలీవుడ్‍ వెళ్ళారు. వివియన్ ఇంగ్లండ్‍లోనే ఉన్నా, ప్రియుడి ఎడబాటును సహించలేక, త్వరలోనే వెళ్ళి ఆయనని కలిసారు. ఆయనతో ఉండడం కోసమే కాకుండా – ‘గాన్ విత్ ది విండ్’ సినిమాలో నటించారు. ‘ఉదరింగ్ హైట్స్’ కంటే ‘గాన్ విత్ ది విండ్’ బాగా జనాదరణ పొందడంతో, లారీకి కొద్దిగా అసూయ కలిగిందంటారు. ఇద్దరికీ హఠాత్తుగా పేరు ప్రఖ్యాతులు రావడంతో, వారి మధ్య ఉన్న బంధాన్ని దాచి ఉంచడం కష్టమైంది. అదృష్టవశాత్తు, వారిద్దరికి తమ తమ భాగస్వాములతో 1940లో విడాకులు లభించాయి. ఆగస్టు 31న వారిద్దరూ నిరాడంబరంగా జరిగిన వేడుకలో పెళ్ళి చేసుకున్నారు. ఆ పెళ్ళికి దర్శకులు గార్సన్ కానిన్, నటి కేథరిన్ హెప్‍బర్న్ మాత్రమే హాజరయ్యారు. ప్రజలకి కూడా ఈ వివాహం ఆసక్తి కలిగించింది, వివాహం వలన ఈ జంటకి ఆదరణ మరింత పెరిగింది.

వీరిద్దరూ దంపతులు తొలిసారి అమెరికాలో రోమియో, జూలియట్‍ నాటకం ప్రదర్శించారు. అది ఘోరంగా విఫలమైంది. అదే సమయంలో రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభం కావడంతో – ఈ దంపతులు యూరప్ లోని యుద్ధ అవసరాలకు సహాయంగా ఉండకుండా – అమెరికాలో ఉంటున్నారని వీరిపై విమర్శలు వచ్చాయి. దాంతో వాళ్ళిద్దరూ ఇంగ్లండ్‍కి తిరిగి వచ్చారు. లారీ ఫ్లీట్ ఎయిర్ ఆర్మ్‌లో చేరినా, ప్రత్యక్ష యుద్ధానికి పిలుపు రాలేదు. 1943లో లారీకి ‘హెన్రీ ఫైవ్’ చేసే అవకాశం వచ్చింది. అదే సమయంలో సైన్యానికి ఉత్తేజం కలిగించేందుకు వివియన్ ఉత్తర ఆఫ్రికాలో పర్యటించారు. ఈ జోడీ ఒకరికొకరు తరచూ ఉత్తరాలు రాసుకునేవారు, నిరంతరం ప్రేమలో ఉండేవారు. ఆ సమయంలోనే వివియన్ క్షయవ్యాధికి గురయి ఆసుపత్రి పాలయ్యారు. కోలుకుని ఇంటికి వచ్చేసరికి, తాను గర్భవతినన్న శుభవార్త తెలిసింది. కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు, ఆమెకు గర్భస్రావమయింది. తీవ్రంగా క్రుంగిపోయారామె. ఈ క్రుంగుబాటు బైపోలార్ డిసార్డర్‍కి దారితీసింది.

వివియన్ ఇంటికే పరిమితం కాగా, లారీ లండన్ రంగస్థలంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే ప్రయత్నాలలో తీరికలేకుండా ఉన్నారు.

అయినా ప్రతీ వారాంతంలో ఇంటికి చేరి, ఆమెతో సమయం గడిపేవారు. గృహిణిగా తన బాధ్యతలు నిర్వహిస్తున్నా, అతిథులని ఆదరిస్తున్నా, వివియన్ జబ్బు తీవ్రమవుతూనే ఉంది. తిరిగి నటన కొనసాగిద్దామనుకుని, ఆమె 1945లో ‘సీజర్ అండ్ క్లియోపాత్రా’ ద్వారా ఆమె రంగస్థలంపైకి పునఃప్రవేశం చేశారు. కొత్తగా ‘నైట్’ బిరుదు లభించిన లారీ – ఓల్డ్ విక్ థియేటర్‍కి నిధులు సమకూర్చేందుకు గాను – ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‍లలో పర్యటిస్తూ, వివియన్‍ని కూడా తీసుకువెళ్లారు. ఈ పర్యటనలో వారిద్దరూ ఎన్నో సార్లు గొడవపడడం మిగతా సిబ్బంది గమనించారు. ఒక సందర్భంగా వేదిక పైకి రావడానికి వివియన్ తిరస్కరించారు. అందరూ చూస్తుండగానే లారీ ఆమెను చెంపదెబ్బ కొట్టారుట. మనస్తాపం చెందిన వివియన్ తిరిగి ఆయనను కొట్టారుట… అత్యంత అయిష్టంగా రంగస్థలంపైకి వచ్చారుట. ఈ పర్యటన ముగిసేసరికి ఇద్దరూ మానసికంగా బాగా అలిసిపోయారు. తాను వివియన్‍ని ఆస్ట్రేలియాలోనే పోగొట్టుకున్నానని లారీ తర్వాతి రోజుల్లో అన్నారు. తర్వాత లారీ దర్శకత్వం వహించిన ‘ఎ స్ట్రీట్ కార్ నేమ్డ్ డిజైర్’ అనే నాటకంలో వివియన్ నటించారు. వేదికపైన నెలల తరబడి ‘Blanche DuBois’ పాత్ర పోషించడం వల్ల, ఆ నాటకం ఆధారంగా తీసిన సినిమాలో మార్లన్ బ్రాండో సరసన అదే పాత్రలో నటించారు. ఆ పాత్ర వల్ల ఆమెకి చాలా పేరు వచ్చినప్పటికీ, తనని ఆ పాత్ర క్రుంగదీసిందనేవారు.

ఈ సమయానికి వాళ్ళిద్దరి బంధానికి బీటలు పడ్డాయి, కేవలం వృత్తి సంబంధమైన బంధం మాత్రం మిగిలింది. సినిమాల్లోనూ, రంగస్థలం మీదా వారిది శక్తివంతమైన జోడీ అని వారికి తెలుసు.

తరువాతి సంవత్సరాలలో వారిద్దరూ కలిసి ఎన్నో నాటకాలలో నటించారు. కానీ వివియన్ అనారోగ్యం పెరుగుతూనే ఉంది, అదే సమయంలో లారీ ఎన్నో ఇతర సంబంధాలలో చిక్కుకున్నారు. పీటర్ ఫించ్ సరసన ‘ఎలిఫెంట్ వాక్’ చిత్రంలో నటిస్తూండగా మానసిక వ్యాధి తిరగబెట్టడంతో – ఆమె అనారోగ్యం గురించి అందరికీ తెలిసింది. ఆ సమయంలో తన సహనటుడితో శారీరక సంబంధం నెరపుతున్నాననీ వివియన్‍ లారీకి తెలిపినా, వారిద్దరూ కలిసే ఉన్నారు. రంగస్థలంపై కలిసి నటించారు.

1957లో వివియన్ గర్భం దాల్చినా, అది నిలవలేదు. 1958 నాటికి తమ వివాహం విచ్ఛిన్నమైందని ఇద్దరూ భావించారు. అప్పటికే లారీ నటి జోన్ ప్లోరైట్‌తో సంబంధం కలిగి ఉన్నారు. వివియన్ నటుడు జాక్ మెరివాలెతో. ఇవి కేవలం తాత్కాలిక సంబంధాలు కాకుండా, వారిద్దరూ తమ తమ కొత్త భాగస్వాములతో జీవితాంతం కలిసి ఉండే బంధాలయ్యాయి. 1960లో వివియన్, లారీలకు అధికారికంగా విడాకులు మంజూరయ్యాయి.

తదనంతరం:

లారీ 1960లో జోన్ ప్లోరైట్‌ని పెళ్ళి చేసుకుని, ముగ్గురు పిల్లల తండ్రి అయ్యారు. వివియన్, జాక్ వివాహం చేసుకోనప్పటికీ, వివియన్ మరణించేంత వరకూ కలిసి ఉన్నారు. జాక్‍తో కలిసి ఉన్నప్పటికీ, తన మరణానికి ముందుగా – ‘లారీ లేకుండా సుదీర్ఘకాలం బతికే కన్నా, ఆయనతో జీవించే కొద్ది రోజులు జీవితం నాకిష్టం’ అని చెప్పారు. తన మంచం పక్కన బల్ల మీద లారీ ఫోటోని ఉంచుకున్నారు. వివియన్ మరణించినప్పుడు –  ముందుగా వచ్చి చూసినవారిలో లారీ ఒకరు. ఆ సమయంలో ఆయన కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె మరణంతో ఆయన బాగా క్రుంగిపోయారు. ఆరోగ్యం బాలేనప్పటికీ, ఆ తర్వాత వర్క్‌హాలిక్‍లా మారి జీవితమంతా నిరంతరం పని చేస్తూనే ఉన్నారు. పని తగ్గించుకోడానికి అస్సలు ఒప్పుకోలేదు. 1989లో మూత్రపిండాల వ్యాధితో మరణించడానికి ఒక సంవత్సరం ముందు వరకూ కూడా నటిస్తూనే ఉన్నారు. మరణానికి కొద్ది రోజుల ముందు ఆయన వివియన్ నటించిన సినిమా చూశారట, ఆయన కళ్ళ వెంట కన్నీరట. ఆ కళ్ళల్లో ‘ఇదే ఇదే ప్రేమంటే’ అన్న భావన కనిపించిందని ఆయన స్నేహితులు చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here