అలౌకిక ప్రేమ

9
2

(హిందీలో శ్రీ దేవేంద్ర మెవారీ రచించిన కథను అనువదించి అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్. మూల కథ దేవేంద్ర మెవారీ రచించిన ‘కోఖ్’ అనే కథా సంకలనం లోనిది.)

“సైన్స్ బేస్డ్ కథా? అంటే సైన్స్ ఫిక్షనా?”

“అవును” అని ఆయన చెప్పగానే, అవతలి వైపు నుంచి నవ్వు వినిపించింది.

“సైన్స్ ఫిక్షన్? అదీ బాలీవుడ్ లోనా? జోక్ చేయడం లేదు కదా మధుర్ గారూ?”

ప్రసిద్ధ నిర్మాత, దర్శకుడు మధుర్ మఖీజా ఫోన్‍లో మాట్లాడుతూనే నవ్వాడు. “అవును రజత్ గారూ. మీతో జోక్ చేస్తానా? ఈసారి నేను ఏ రిస్క్ తీసుకోదలచుకోలేదు”

“రిస్కా? ఏం రిస్క్?”

తనని తాను సంబాళించుకుని, “అదేం లేదు. సినిమాలో మీరుంటే ఇంక రిస్క్ ఏముంటుంది? అయినా నా ఈ కొత్త సినిమా సూపర్ హిట్ కావాలని అనుకుంటున్నాను రజత్ గారూ. దేశమంతటా ఈ సినిమా ఆడే థియేటర్లకి జనాలు విపరీతంగా రావాలి.. జనాలు ఒకటి రెండు సార్లు కాదు.. ఈ సినిమాని పదే పదే చూడాలి..”

“బహుశా, మీకేదో గొప్ప థీమ్ దొరికినట్టుంది. లవ్వూ గివ్వూ ఉంటాయిగా?”

“ఉంటాయి రజత్. లవ్ లేకుండా ఏదైనా సినిమా సూపర్ హిట్ అవుతుందా?”

“కానివ్వండి, లవ్ సీన్‍లు పండిస్తాను. ఇంతకీ సినిమా థీమ్ ఏంటి?”

“ఇటువంటి థీమ్‍తో బాలీవుడ్‌లో ఇప్పటిదాక సినిమా రాలేదంటే నమ్మండి”

“గుడ్! ఎక్స్‌ట్రార్డినరీ లవ్వా?”

మధుర్ కాస్త గంభీరంగా చెప్పారు “ఎక్స్‌ట్రార్డినరీ కాదు, ‘ఎక్స్‌ట్రా టెరెస్ట్రియల్ లవ్’. హీరో భూగ్రహవాసి. హీరోయిన్ నక్షత్ర లోకాలలోని అజ్ఞాత గ్రహవాసి. ప్రేమ కథే, అయినా సైన్స్ కోటింగ్ ఇస్తాము. సైన్స్ ఫిక్షన్ సినిమా అయిపోతుంది. తొలిసారిగా గొప్ప ‘అలౌకిక ప్రేమ కథ’ అని జనాలకి చెబ్దాం. ఎం.ఎం. ప్రొడక్షన్స్ వారి కొత్త ధమాకా.”

“సౌండ్స్ ఇంటరెస్టింగ్”

హీరో గారు మంచి మూడ్‍లో ఉండడం గమనించిన మధుర్ – “అయితే స్టోరీ సెషన్ ఎప్పుడు పెట్టుకుందాం? మీరు ఓ అరగంట సమయం ఇవ్వగలరా?” అడిగారు.

“నా షూటింగ్ షెడ్యూల్ చాలా టైట్‌గా ఉంది. మూడు-మూడు షిప్ట్‌లలో పని చేస్తున్నాను. అయినా.. మీకు టైమ్ ఇవ్వాల్సిందే. ఓ పని చేయండి, ఎల్లుండి రాత్రి తొమ్మిదింటికి ‘సన్ అండ్ సాండ్’లో పెట్టుకుందాం. ఆఁ, హీరోయిన్‍గా ఎవరిని అనుకుంటున్నారు? నేనైతే సోనాలీని ప్రిఫర్ చేస్తాను”

“హీరోయిన్‌గా కొత్త అమ్మాయిని పెడుతున్నాను రజత్. మీరు చూస్తూ ఉండిపోతారు. ఈ సబ్జెక్ట్‌కి కొత్త ముఖం కావాలి. అందుకే ఈ అమ్మాయిని నేను దేశవ్యాపంగా పలు పట్టణాలలో పత్రికలలో ప్రకటనలిచ్చి మరీ ఎంపిక చేశాను. ఈ కొత్త అమ్మాయి పేరు మేనక! నిజంగా స్వర్గలోకపు అప్సరస లానే ఉంటుంది. బాలీవుడ్ లోని పెద్ద పెద్ద విశ్వామిత్రుల తపస్సులు భగ్నం చేస్తుంది”

“కానీ మధుర్ గారు, మరీ కొత్త హీరోయిన్ అంటే..”

“మీరు నిశ్చింతగా ఉంటండి. ఇలాంటి ప్రతిభ, ఇంతటి అలౌకిక సౌందర్యం మరే ఇతర హీరోయిన్ లోనూ లేదు. నిజానికీ ఈ కథకి నాకు ఐడియా వచ్చిందే హీరోయిన్ అన్వేషణ వల్ల. రజత్, ఇది కోట్లకి కోట్లు పెట్టే విషయం, ఊరికే అంత డబ్బు పెడతానా?” అంటూ నవ్వి,

“ఎల్లుండి స్టోరీ సెషన్‍కి తీసుకొస్తాను. అప్పుడు మీ అభిప్రాయం చెబుదురు గానీ” అన్నారు మధుర్.

***

స్టోరీ సెషన్‍లో బాలీవుడ్ టాప్ స్టార్ రజత్, మధుర్, కొత్తమ్మాయి మేనక, కథా రచయిత శైలేంద్ర సుమన్ పాల్గొన్నారు. కథని రహస్యంగా ఉంచాలి, వేరేవాళ్ళకి దాని క్లూ కూడా దొరకకూడదు. కాబట్టి సమావేశంలో మరెవ్వరినీ చేర్చలేదు. ఎందుకంటే స్టోరీ లీక్ అవడం సినీ ప్రపంచంలో సర్వసాధారణ విషయం. లీకైన స్టోరీనే అటూ ఇటూ మార్చి కొత్త కథగా మార్చేస్తారు. ఇవన్నీ ఆలోచించే మధుర్ తన సినిమా స్టోరీ సిట్టింగ్‌ని నలుగురికే పరిమితం చేశారు.

రజత్ ‘సన్ అండ్ సాండ్’ కి వచ్చేసరికి రాత్రి పదయ్యింది. వస్తునే, “మొదలుపెట్టండి మధుర్, నేను పదిన్నరికి వెళ్లిపోతాను. ఇంకో అపాయింట్‍మెంట్ ఉంది” అన్నాడు.

అప్పుడే అతని దృష్టి మేనక మీద పడింది. ఆమెలో ఏం ఆకర్షణ ఉందో తెలియలేదు కానీ, అలా చూస్తూ ఉండిపోయాడు. మేనక వైపు చేయి చాచి “నేను రజత్ కుమార్” అన్నాడు.

మేనక చిరునవ్వు నవ్వింది. మెరుపులు మెరిసినట్లయింది. ఆ గది నిండా వెలుగుతున్న దీపాల కాంతిలో ఆమె కళ్ళలో తారలు మెరిసాయి.

మధుర్, రజత్ వైపు చూస్తూ, “నా కొత్త అన్వేషణ ఫలం – ఎలా ఉంది?” అని అడిగారు.

రజత్ మగత నుంచి బయటకొచ్చి “అలౌకికం” అన్నాడు.

కథ వినిపించమంటూ శైలేంద్రకి సైగ చేశారు మధుర్.

శైలేంద్ర కథని సంక్షిప్తంగా వివరించసాగాడు – “బలరామ్ ఓ గ్రామంలో పేద యువకుడు. జనాలు అతన్ని ‘బల్లూ’ అని పిలుస్తారు. ఇంట్లో అమ్మ, చెల్లీ ఉంటారు. స్కూల్‍కి వెళ్ళినప్పుడు తప్ప, మిగిలిన సమయమంతా బల్లూ ఇంటి పనులు చేస్తాడు. రాత్రి పూట వరండాలో నిద్రపోతూ ఎన్నోసార్లు ఆకాశంలో నక్షత్రాలను చూస్తూ, ‘అమ్మా నక్షత్రాలెవరు?’ అని.

.. అమ్మ ప్రేమగా వాడి తల నిమిరి, ‘నాన్నా, ఈ లోకం నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు నక్షత్రాలవుతారు’ అని చెప్పింది.

‘మరి వాళ్ళల్లో ‘నాన్న’ కూడా ఉన్నారా’ అని అడుగుతాడు బల్లూ. అమ్మ ఓ మెరుస్తున్న నక్షత్రాని చూపించే, ‘అదే మీ నాన్న’ అంటుంది. ఆ నక్షత్రం కేసి కళ్లు విప్పార్చుకుని చూస్తాడు బల్లూ.”

“ఊఁ, కంటిన్యూ..” అన్నారు మధుర్.

అయితే రజత్ చేత్తో ఆపమన్నట్టు సైగ చేసి, “చెప్పండి, చెప్పండి” అన్నాడు.

“బల్లూ ఆకాశంలోని అసంఖ్యామైన నక్షత్రాలను చూస్తూ ఉంటాడు..”

“ఒక్క క్షణం..” ఆపాడు రజత్. “నోట్ చేసుకోండి.. ఇక్కడ జోలపాట ఉండాలి, డ్రీమ్ సీక్వెన్స్” అన్నాడు.

శైలేంద్ర కొనసాగించాడు – “గ్రామాధికారి ధూర్తుడు, నికృష్టుడు. వాడు బల్లూ అమ్మనీ, చెల్లెల్నీ చాలా ఇబ్బంది పెడుతూంటాడు. అయితే కొందరు మంచివాళ్ళు బల్లూకి ఎప్పుడూ సాయం చేస్తూంటారు. బల్లూ ప్రతీ క్లాసులో ఫస్ట్ వస్తూంటాడు. ఏదో ఒక రోజున గొప్పవాడవ్వాలని భావిస్తూంటాడు. ‘ఏదో ఒక రోజున నేను కూడా పెద్దవాడవుతాను, విజయం సాధిస్తాను, అప్పుడు గ్రామాధికారికి బుద్ధి చెప్తాను’ అనుకుంటాడు. ఇదిలా ఉంటే, గ్రామాధికారి వీళ్ల భూమిని కాజేయాలని ప్రయత్నిస్తాడు, కానీ చేజిక్కించుకోలేకపోతాడు. బల్లూ గ్రామంలోని యువకులలో కలిసి ‘యువ దళం’ ఏర్పాటు చేస్తాడు, చెడుకు వ్యతిరేకంగా గళం వినిపిస్తాడు. వారి దళం వీధి నాటకాల ద్వారా, ఇతర సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా గ్రామంలో చైతన్యం తేవడానికి కృషి చేస్తుంది..”

“నోట్ చేసుకోండి.. ఇక్కడ డాన్స్.. జానపద నృత్యం ఉండాలి” అన్నాడు రజత్.

“ఏదైనా సాధించాలంటే, గ్రామం విడిచి వెళ్ళాలని బల్లూకి అనిపిస్తుంది. బొంబాయి చాలా పెద్ద నగరం అని విన్నాడు. అక్కడికి వెళ్తే అదృష్టం కలిసొస్తుందని అనుకుంటాడు. ఒక రోజు అమ్మ, చెల్లెలి దగ్గర వీడ్కోలు తీసుకుని బొంబాయి వచ్చేస్తాడు..”

మేనక తన కోమలమైన చేతిని ఎత్తింది. చేతి వేళ్ళకున్న రత్నాల ఉంగరాలు మెరిసాయి. ఏదో చెప్పాలని అనుకున్నట్లుంది, కానీ  పెదవులపై వేలిని ఉంచుకుంది. రజత్ చూశాడు. మధుర్ కూడా ఓరగా చూశారు. మేనక ఒకసారి ఆవలించి, మౌనంగా ఉండిపోయింది.

మధుర్‍కి అర్థమైంది.. ఇప్పటి దాక హీరోయిన్ ఎంట్రీ రాలేదు..

శైలేంద్ర అలర్ట్ అయ్యాడు. పరిస్థితిని అర్థం చేసుకున్న రజత్, “బ్రో! హీరోయిన్..” అన్నాడు.
“సార్, అక్కడికే వస్తున్నా” చెప్పాడు శైలేంద్ర.

మధుర్ నవ్వి, “ఈ ఎంట్రీ చూడండి.. ముందు ముందు ఆమె ఎంత నాటకీయ రీతిలో వస్తుందో” అన్నారు.

శైలేంద్ర వేగంగా చెప్తున్నాడు.

“బొంబాయిలో చాలా కష్టపడతాడు బల్లూ. రకరకాల పనులు చేస్తాడు. స్థానికంగా ఉన్న ఓ నాటక సంస్థ వాళ్ళతో పరిచయం ఏర్పడుతుంది. మొదట్నించి నాటకాలంటే ఇష్టం ఉంది కదా, ఇప్పుడు బాగా శ్రమించి తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తాడు. నాటకాలలో మంచి పేరు తెచ్చుకుంటాడు. ఒకరోజు ఓ నాటకంలో అతని నటన చూసిన ఓ దర్శకుడు తన సినిమాలో నటించేందుకు బల్లూతో ఒప్పందం చేసుకుంటాడు. బల్లూ – ఉరఫ్ – బలరామ్ ఇప్పుడు పెద్ద హీరో అయిపోయాడు. హిట్ సినిమాల హీరో. తర్వాత అమ్మ, చెల్లెలు బొంబాయి వచ్చేస్తారు. చెల్లి పెళ్ళి ఘనంగా చేస్తాడు..” అంటూ ఆపాడు శైలేంద్ర.

“తర్వాత ఏమవుతుంది?” రజత్ అడిగాడు.

“ఒక సినిమా షూటింగ్ కోసం బలరామ్ మహాబలిపురం వెళ్తాడు. ‘షోర్ టెంపుల్’ దగ్గర, సముద్ర తీరంలో – ‘బాస్ రిలీఫ్’ (అర్జున మోక్ష శిల) దగ్గర, మహిషారమర్దిని గుహ సమీపంలో షూటింగ్ జరుగుతూంటుంది.” అని శైలేంద్ర చెప్తూండగా..

“రజత్ గారూ, మేనక గారూ, ఇక్కడి సిచుయేషన్ మీద దృష్టి పెట్టండి. ఆఁ, నువ్వు చెప్పు శైలేంద్ర” అన్నారు మధుర్.

“అది వెన్నెల రాత్రి. బలరామ్ సాగర తీరంలో అమర్చిన ఊయలలో ఒంటరిగా, నెమ్మదిగా ఊగుతుంటాడు. అలలు నెమ్మదిగా వచ్చి తీరాన్ని తాకుతూంటాయి. వాతావరణం ఉత్తేజితంగా ఉంటుంది. అప్పుడే అతని చెవులకి వేయి అందెలల సవ్వడిలా మధురమైన శబ్దం వినవస్తుంది. తీరంలోని ఇసుక వైపు చూస్తాడు. అలా చూస్తూ ఉండిపోతాడు.. అక్కడో అపురూప సౌందర్యవతి దర్శనమిస్తుంది. అప్పరసలా ఆకర్షణీయంగా ఉంటుందామె. మూర్తీభవించిన దివ్యసౌందర్యం ఆమె. తను కూడా ఒక క్షణం బలరామ్ కేసి కన్నార్పకుండా చూస్తుంది, అకస్మాత్తుగా నాట్యం చేయడం మొదలుపెడుతుంది. ఓ దేవకన్యలా నర్తిస్తుంది. బలరామ్ ఆమె మోహపాశంలో చిక్కుకుంటాడు. అబ్బురపడుతూ, సమ్మోహితుడై మెల్లగా ఆమె వైపు అడుగులు వేస్తాడు. ముందుకు వెళ్ళి ఆమెను హత్తుకుంటాడు. జన్మ-జన్మాంతరాలుగా విడదీయబడిన రెండు ఆత్మల కలయిలా అతనికి అనిపిస్తుంది. వెనుక వైపు దూరంగా . ‘షోర్ టెంపుల్’ కనిపిస్తూ ఉంటుంది. త్రుళ్ళుతున్న అలల చప్పుడు.”

“గుడ్. కానీ మరి సైన్స్ ఫిక్షన్ సంగతేంటి?” మేనక వదనంలోని మెరుపుని చూస్తూ, మధుర్‍ని అడిగాడు రజత్.

“ఇక్కడే మొదలవుతుంది సైన్స్ ఫిక్షన్.. నువ్వు చెప్పు శైలేంద్రా” అన్నారు మధుర్ నవ్వుతూ.

“..ఆ అపురూప సౌందర్యవతి ఈ లోకానికి లేదా గ్రహానికి చెందినది కాదు..”

“అంటే?” అడిగాడు రజత్.

“అవును రజత్ గారూ, ఆమె ఈ బ్రహ్మాండంలోని వేరే ఏదో గ్రహం నుంచి వచ్చింది” మధుర్ నవ్వి, చెప్పారు.

రజత్, మేనక ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు.

శైలేంద్ర చెప్తున్నాడు – “ఆ అప్పరస లాంటి అందాల భామ మన భూగ్రహవాసి కాదు. ఏదో అజ్ఞాత లోకం నుంచి వస్తుంది. ‘విను ప్రియా’ అంటూ హఠాత్తుగా బలరామ్ చెవుల్లో మాటలు వినబడతాయి. వేలాది చిరుగంటల మృదువైన సవ్వడి చెవులలో మోగినట్టు అతనికి అనిపిస్తుంది. బలరామ్ విస్తుపోతాడు. అప్పుడామె అతని కళ్ళల్లోకి చూస్తూ – ‘ప్రియా! నేను సాయబాని. మరో లోకం నుండి వచ్చాను. ఇంతకు ముందు కూడా మీ ఈ గ్రహాన్ని అధ్యయనం చేయడానికి వస్తూండేదాన్ని. ఒక విశేష పరిశోధన కోసం నన్ను ఇక్కడికి పంపించారు. నా పరిశోధనాంశం – మీ జాతిలో ప్రేమ, ప్రత్యుత్పత్తి’ అని చెప్తుంది. ప్రేమ అనేది తమ లోకంలోనూ కలుగుతుందనీ, కానీ పునరుత్పత్తి పద్ధతి మనుషుల్లో జరిగేట్టు ఉండదని చెబుతుంది.”

రజత్, మేనక అత్యంత కుతూహలంగా కథ వింటూ శైలేంద్ర కేసి చూస్తారు.

“సాయబా చెబుతోంది – వాళ్ళ లోకంలో అక్కడి ప్రజలు ఇష్టానుసారంగా పిల్లలని కనలేరట. ఈ పని అక్కడి ప్రభుత్వ పర్యవేక్షణలోని ‘శిశు ఉత్పాదన విభాగం’ ద్వారా జరుగుతుందట. భవిష్యత్తులో ఎలాంటి పౌరుల అవసరం ఉంటుందో, అలాంటి పిల్లలనే పుట్టిస్తారట. ఆ పిల్లలు కృత్రిమ గర్భాశయంలో తయారవుతారట. పౌరుల శుక్రకణాలను, అండాలను పరీక్షించి, శుక్రకణ బ్యాంకులోనూ, అండాల బ్యాంకులోను భద్రపరుస్తారట.  అనువంశిక గుణాలను పరిశీలించిన తరువాత, శాస్త్రవేత్త, ఇంజనీర్, కళాకారుడు, సాహితీవేత్త, సంగీతజ్ఞుడు, సైనికుడు, శ్రామికుడు.. ఇలాంటి వాళ్ళని రూపొందిస్తారట.. ఇలా చెప్పి ఆమె ‘ఇదంతా నీకు స్వయంగా చూపిస్తాను బలరామ్, నాతో మా లోకానిరా, వస్తావుగా ప్రియా’ అంటుంది.”

“బలరామ్ ఏమంటాడు?” అడిగాడు రజత్ కథలో లీనమవుతూ.

“బలరామ్ సాయబాతో వెళ్తాడు. ఆమె వెంట ఫ్లయింగ్ సాసర్‌లో (యుఎఫ్‍ఓ) అంతరిక్ష యానం చేస్తాడు. ఆమె లోకానికి, ఆమె గ్రహానికి చేరుతాడు. కానీ.. ఇక్కడ బాలీవుడ్‍లో.. బలరామ్ హఠాత్తుగా అదృశ్యం అవడం పట్ల కలకలం రేగుతుంది. రకరకాల పుకార్లు వినిపిస్తాయి. చాలా సినిమా పత్రికలు, ఇతర పత్రికలు బలరామ్‍ అదృశ్యం అవడం గురించి పలు విధాల పసందైన కథనాలు వండి వడ్డిస్తాయి. మరికొన్ని పత్రికలేమో – ఒక టాప్ స్టార్‍ని రహస్యంగా పెళ్ళి చేసుకుని హనీమూన్‍కి విదేశాలకి వెళ్ళిఉంటాడని రాశాయి. మరికొన్ని పత్రికలు – బలరామ్‌ తమని పెళ్ళి చేసుకుంటాడంటూ భావించిన హీరోయిన్‍లు కోపంలో మాట్లాడినవన్నీ ప్రచురించాయి.”

“తర్వాత ఏమవుతుంది?” రజత్ అడిగాడు.

“బలరామ్ ఆమె వెంట ఆమె గ్రహానికైతే వెళ్ళాడు కానీ, అక్కడ వాళ్ళిద్దరినీ కస్టడీలోకి తీసుకుంటారు. విచారణలో ఎన్నో ప్రశ్నలు వేస్తారు. బలరామ్‍ని తమ గ్రహానికి తీసుకువచ్చినందుకు పూర్తి బాధ్యత తన మీదే వేసుకుంటుంది సాయబా.

అక్కడి న్యాయస్థానంలో సాయబా మీద కేసు నడుస్తుంది. వేరే లోకపు జీవిని ప్రేమించటం, అనుమతి లేకుండా ఈ గ్రహానికి తీసుకురావటం అనే నేరాలను ఆరోపిస్తారు. ఆ లోకంలోని ఓ వ్యక్తి బలరామ్‍కి వ్యతిరేకంగా పెద్ద అలజడి లేవదీస్తాడు. ఊరేగింపులు చేస్తాడు. పైగా ఏదో తెలియని గ్రహం నుంచి వచ్చిన ఈ వ్యక్తికి మరణ దండని విధించాలని డిమాండ్ చేస్తాడు.”

మధుర్ నవ్వుతూ “అతనే మన కథలో విలన్. అతను సాయబాని దక్కించుకోవాలనుకున్నాడు, అందుకే బలరామ్‍ని అంతం చేయించాలని అనుకున్నాడు. ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది” అని అన్నారు.

“అక్కడ జరిపిన వైద్య పరీక్షలలో సాయబా గర్భవతి అని తెలుస్తుంది. ఆ లోకంలో అది క్షమించరాని నేరం. చట్టానికి వ్యతిరేకంగా సొంత నిర్ణయంతో గర్భం దాల్చినందుకు ఆమెని దోషిగా పరిగణిస్తారు. విలన్ కోపోద్రిక్తుడవుతాడు. బలరామ్‌ని వెంటనే శిక్షించాలని కోరుతాడు. ఆమెని కలిసి గర్భవిచ్ఛిత్తి చేయించుకోమని, తనతో కల్సి ఉండమని అడుగుతాడు. సాయబా ఆ ప్రస్తావనని తిరస్కరిస్తుంది. మీ ఇద్దరి అంతూ చూస్తానని చెప్పి విలన్ అక్కడ్నించి వెళ్ళిపోతాడు.

ఈ అపరిచిత జీవి వేరే లోకానికి, వేరే జాతికి చెందినవాడని డిఫెన్స్ న్యాయవాది అంటాడు. అతని వల్ల సాయబా గర్భవతి కాలేదని వాదిస్తాడు. ఆ నేరం ఈ లోకం వాళ్ళే ఎవరో చేసి ఉంటారని అంటాడు. శిక్ష వాళ్ళకే పడాలని అంటాడు.

డి.ఎన్.ఎ. పరీక్ష జరిపిస్తారు. ఆ పరీక్షలో ఓ వింతైన సంగతి బయటపడుతుంది. బలరామ్ లోనూ, ఆ గ్రహవాసులలోనూ ఉండే క్రోమోజోమ్‍ల సంఖ్య సమానమని తెలుస్తుంది. వాళ్ళల్లో కూడా మానవుల్లో ఉండేటట్టే 46 క్రోమోజోమ్‍లు ఉన్నాయి. మానవుల్లోనూ, ఈ గ్రహవాసుల్లోనూ అనువంశిక సమానత్వం ఉంది. కాబట్టి ఈ గ్రహవాసులు మానవుల సంపర్కంతో పిల్లల్ని కనవచ్చు. మరింత లోతుగా పరీక్షలు జరిపితే, ఆమె గర్భంలో ఉన్న శిశువుకి తండ్రి బలరామ్ అనే తేలుతుంది. ఈ వియషం బయటపడగానే ఆ లోకంలో అందరికీ వాళ్ళిద్దరి పట్ల అసహ్యం కలుగుతుంది, ఆక్రోశపు తరంగాలు వ్యాపిస్తాయి. ఆ గ్రహవాసులు బలరామ్ రక్తం తాగాలనుకుంటారు.”

“తర్వాత ఏమవుతుంది?” రజత్ అడిగాడు.

“తర్వాత.. ఆ లోకపు శాస్త్రజ్ఞులు, మానవశాస్త్ర నిపుణులు, ఇతర మేధావులు ఒక బృందంగా ఏర్పడి ఈ విషయంలో జోక్యం చేసుకుంటారు. ఆ లోకపు ప్రాచీన గ్రంథాలు, పౌరాణిక ఆఖ్యానాలు, కుడ్యచిత్రాలు మొదలైనవాటిని లోతుగా పరిశీలించి – తమ లోకానికి తీసుకురాబడ్డ అపరిచిత జీవికీ, తమ గ్రహవాసులకీ ఏదో సంబంధం తప్పకుండా ఉందని తేలుస్తారు. ఆ లోకపు అతి ప్రాచీన కుడ్యచిత్రాల పైన చెక్కిన కొన్ని దృశ్యాల ద్వారా – పూర్వం ఎప్పుడో అంతరిక్షం నుండి తమ గ్రహానికి వేరే జీవులు వచ్చారని వెల్లడిస్తారు. వారి ప్రాచీన గ్రంథాలలో ఆకాశం నుంచి విచిత్ర ప్రయాణాలు చేస్తూ ఇతర జీవులు తమ గ్రహానికి వచ్చిన ఉదంతాలు కనిపించాయి. దాంతో, ఆ బృందం – ఈ లోకానికి తీసుకురాబడ్డ అపరిచిత జీవి పూర్వీకులు, తమ గ్రహవాసులు పూర్వీకులు ఒక్కరేనన్న నిర్ధారణకి వస్తుంది. అక్కడి దేవతలు, ఇక్కడి దేవతలు అత్యంత తెలివైన ప్రాణులై ఉంటారు, బ్రహ్మాండంలో ప్రాణులు బ్రతకగలగిన అన్ని గ్రహాలలోనూ తమ బీజాలు వేసుకుంటూ వెళ్ళి ఉంటారు. అంటే, దానర్థం ఈ అపరిచిత జీవీ, తామూ ఒకే వంశస్థులం కూడా కావచ్చని, అది దేవతల వంశమని అభిప్రాయపడ్తారు ఆ బృందం సభ్యులు. అందువల్ల ఈ అపరిచిత జీవిని చంపకూడదని, తమ వంశస్థుడిగానే భావించి క్షమించి వదిలేయాలని తీర్మానిస్తారు. తమ చట్టాల గురించి తెలియకపోవడం, అజ్ఞానంతో చేసిన తప్పు ఇదని అంటారు. కానీ తమ పౌరులకి తమ చట్టాల గురించి బాగా తెలుసు.. కాబట్టి ‘గర్భధారణ’ అనే నేరం ఎందుకు చేసిందో సాయబాని విచారించాలని అంటారు.”

“ఇప్పుడు చూడండి, కోర్టు సీన్‍లు ఎలా ఉంటాయో” అంటూ, “నువ్వు చెప్పు శైలేంద్ర” అంటారు మధుర్.

“జనాలలో నిండిన కోర్టు హాల్లో సాయబా తన వాదన వినిపిస్తుంది. తానేం చేసినా, తన కోసం, తన లోకం కోసమే చేసానని చెప్తుంది. తనను ప్రేమ, ప్రత్యుత్పత్తి అనే అంశాలపై పరిశోధన కోసం భూగ్రహానికి పంపారు. ఈ విషయానికి సంబంధించి నిగూఢమైన జ్ఞానం సంపాదించడానికి వీలైన అన్ని ప్రయత్నాలు చేసానంటుంది. అందుకే స్వయంగా ప్రేమించి, ప్రత్యుత్పత్తి ప్రక్రియని అవగాహన చేసుకున్నానని అంటుంది. ఇందులో ప్రమాదం ఉందని, తన ప్రాణాలు పోయే అవకాశం ఉందని తెలుసునని చెప్తుంది. కానీ తన లోకానికి అత్యంత ప్రామాణికమైన సమాచారాన్ని అందించడానికి నిశ్చయించుకుని ఈ ప్రమాదాన్ని ఎదుర్కున్నానని చెబుతుంది. తన పరిశోధనని పరీక్షించి – ఈ అంశంలో ఇంతటి సమాచారం – ఇంతకు ముందు ఈ లోకంలో అందుబాటులో ఉందో లేదో తేల్చమని న్యాయస్థానాన్ని కోరుతుంది. కోర్టు ఆ రోజుకి వాదనలను ముగించి వాయిదా పడుతుంది.

ఇదంతా వింటున్న బలరామ్ క్రుంగిపోతాడు. తన మీద కుట్ర జరిగినట్లు భావిస్తాడు. ఆమె ప్రేమ నాటకం ఆడి తనని వాళ్ళ లోకానికి తీసుకువచ్చిందని అనుకుంటాడు. ఆ రాత్రి జైల్లో ఓ విషాద గీతాన్ని పాడతాడు. ఆ పాట విని ఆమె ఏడుస్తుంది.

సాయబా ఎందుకు రోదిస్తుందంటే – తనని బలరామ్ తప్పుగా అర్థం చేసుకున్నాడని! కోర్టులో తన వాదన ఇంకా పూర్తి కాలేదు కదా అనుకుంటుంది..” అంటూ కాసేపు ఆపాడు శైలేంద్ర.

స్వల్ప విరామం తీసుకుని మళ్ళీ చెప్పసాగాడు.

“ఇంకో రోజున కోర్టులో వాదనలు మొదలవుతాయి. ప్రతీ కష్టమైన పనిలోనూ ప్రమాదం ఉందని, తన అధ్యయనంలోనూ ఆ ప్రమాదం ఉందని, తానే స్వయంగా ఇరుకునపడే అవకాశం ఉందని అంటుంది సాయబా. అదే జరిగిందిప్పుడు అంటుంది. మానవుల ప్రేమని అధ్యయనం చేస్తూ చేస్తూ, తానూ స్వయంగా బలరామ్ అనే ఈ మానవుడితో ప్రేమలో పడ్డానని చెప్తుంది. తాను స్వయంగా ప్రేమలో పడిన కారణంగా తన అధ్యయానికి ప్రామాణికత ఏర్పడిందని అంటుంది. ప్రేమ అనే ఈ నిగూఢమైన అనుభూతిలో తెలిసీతెలియక ఇదంతా జరిగిందని, తానేమీ అపరాధం చేయలేదనేది తన భావన అని అంటుంది. అయితే ప్రేమ అంతిమ ఫలితం ఇదేనని తనకి తెలిసిందని చెప్తుంది. ఈ అనుభవం తమ లోకానికి పూర్తిగా కొత్త అనీ, ఇక్కడ అది దుర్లభమని అంటుంది. ప్రేమ నుంచి మాతృత్వం వరకూ సాగిన ఈ అనుభవ యాత్ర తన పరిశోధన ప్రయోజనమని అంటుంది. తాను బలరామ్‍ని ప్రేమించాననీ, ప్రేమిస్తున్నాననీ, తాను చనిపోయేదాకా కూడా ప్రేమిస్తూనే ఉంటానని; అందుకు ఏ శిక్షనైనా భరించేందుకు సిద్ధమని కోర్టులో చెప్తుందామె.

ఆమె నోటివెంట నిజాలు విన్నాకా, బలరామ్‍ అపోహలు దూరమవుతాయి. తన వాదనలో – తానే ఆమెని ప్రేమించానని, కాబట్టి దోషి తానేనని అంటాడు. ఆ శిక్షేదో తనకే పడాలని అంటాడు. ఆమె గర్భంలో పెరుగుతున్న శిశువుని బ్రతకనీయాలనీ, ఆ శిశువు ఈ రెండు లోకాల కలయికకు ప్రతీక అని కోర్టుని ప్రార్థిస్తాడు. బ్రహ్మండంలోని రెండు విభిన్నమైన బుద్ధిజీవుల సమ్మిళిత గుణాల కారణంగా ఈ రెండు లోకాల మేధావుల కన్నా గొప్ప మేధావి కావచ్చు ఆ శిశువు అని అంటాడు. అందుకే ఆ శిశువుని కాపాడాలని చెప్తాడు. ఆమెని శిక్షించే బదులు, ఆమె చేసిన అధ్యయనానికి బహుమతి ఇవ్వాలని అంటాడు. ఆమెని తన లోకానికి తీసుకువెళ్ళాలని ఉందని అంటాడు. అందుకు కోర్టు అనుమతి కోరుతాడు.

ఈ అపరిచిత జీవి బలరా‍మ్‌ని వీలైనంత త్వరగా అతని గ్రహానికి పంపేయాలని కోర్టు తీర్పు ఇస్తుంది. తమ గ్రహ పౌరులని వేరే గ్రహాల వారి వెంట పంపడం కుదరదని చెప్తుంది. ఈ లోకానికి హితం చేకూర్చడం కోసం – ప్రేమ, ప్రత్యుత్పత్తి – అంశాలలో ఆమె జరిపిన పరిశోధన కారణంగా ఆమెని నిర్దోషిగా విడిచిపెట్టాలనీ, కానీ తమ లోకపు చట్టాలని దృష్టిలో ఉంచుకుని ఆ చట్టవిరుద్ధమైన గర్భాన్ని తొలగించాలని కోర్టు ఆదేశిస్తుంది.

ఈ తీర్పు విన్న సాయబా మూర్ఛపోతుంది. బలరామ్‍ని భూగ్రహానికి పంపేసే ముందు అతన్ని ఒకసారి కలిసేందుకు ఆమె కోర్టును కోరుతుంది. ఆమె విన్నపాన్ని మన్నిస్తారు. ఆ మర్నాడు బలరామ్‌ని భూగ్రహానికి పంపేసే ముందు ఆమె అతన్ని కలుస్తుంది. అతన్ని హత్తుకుంటుంది. అతను వెళ్ళిపోతున్నందుకు, శాశ్వతంగా దూరమవుతున్నందుకు బాధ పడతుంది. దుఃఖంతో కాసేపు స్పృహ కోల్పోతుంది. ఆమెను బలరామ్ నుంచి విడదీస్తారు. బలరామ్ వెళ్లిపోతాడు. రోదిస్తున్న ఆమె మాటలు – ‘బలరామ్, నువ్వు లేకుండా నేను బ్రతకలేను. ఆగు బలరామ్’ – అనే మాటలు అతని చెవుల్లో ప్రతిధ్వనిస్తాయి.

బలరామ్‍ని భూలోకంలో దింపేస్తారు. బలరామ్ తిరిగి రావడంతో అన్ని రకాల పుకార్లు ఆగిపోతాయి. అతని సినిమాల షూటింగులు మళ్ళీ మొదలవుతాయి. కానీ అతని మనసెప్పుడూ ఆమె జ్ఞాపకాలలో సంచరిస్తూ ఉంటుంది, ఆమెతో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూనే ఉంటుంది. ఆ లోకం నుంచి ఆమె తనని పిలుస్తోందనీ, రా రమ్మంటోందని అతనికి అనిపిస్తూ ఉంటుంది.”

“మరి బలరామ్ ఏం చేస్తాడు?” గంభీరంగా అడిగింది మేనక.

“ఎలా అయినా ఆమె దగ్గరకి వెళ్ళాలని అనుకుంటాడు బలరామ్” చెప్పారు మధుర్.

“తన ఈ లోకాన్ని విడిచా?”

“కానీ, అతను అక్కడికి ఎలా వెళ్ళగలడు? ఆమెని ఎలా కలవగలడు?” మేనక ఉత్సుకతతో అడిగింది.

జవాబు శైలేంద్ర చెప్పాడు – “తన ఈ లోకాన్ని వీడడం ద్వారా” అని.

శైలేంద్ర కొనసాగించాడు – “ఆమె కలలలో తప్పిపోయి, ఆమెని కలుసుకోవాలన్న ఆత్రుతలో ఉన్న బలరామ్ ఒకరోజు ‘నే వసున్నా ప్రియా, వచ్చేస్తున్నా’ అని చెప్పి, చాలా నిద్రమాత్రలు మింగేస్తాడు. ఈ లోకం నుంచి వీడ్కోలు తీసుకుంటాడు. చనిపోయాక, తాను ఆమె దగ్గరకు వెళ్ళగలనని భావిస్తాడు. ఆమెతో తన ఆత్మ కలయిక! ఇక్కడ ఓ పాట.. సినిమాకి శుభం కార్డు…”

“అయ్యో! వద్దు. ఇది ట్రాజెడీ” హఠాత్తుగా అంది మేనక.

“రెండు రకాల ప్రేక్షకులకి నచ్చుతుంది. ట్రాజెడీ.. కానీ ఆత్మ కలయికతో సుఖాంతం కూడా” మధుర్ అన్నారు.

“ఈ కథ బానే వుంది. కాకపోతే చిన్న చిన్న మలుపులు తీసుకురావాలి. స్క్రీన్ ప్లే లో దృష్టి పెట్టాల్సిందేంటంటే – సినిమా సముద్రతీరంలో హీరోయిన్ మనోహరమైన నాట్యంతో మొదలవ్వాలి. అక్కడే హీరో హీరోయిన్లు కలుస్తారు. తర్వాత ఫ్లాష్‍బ్యాక్‍లో హీరో గత జీవితపు ‘కష్టాలు’ చూపించాలి. ఈ ప్లాష్‍బ్యాక్ లోనే హీరోయిన్ జీవితపు కొన్ని సంఘటనలు, పరిశోధన కోసం భూలోకానికి రావడం వంటివి కూడా చూపించొచ్చు. హీరోయిన్ అద్భుతమైన నర్తకి. దీన్ని మనం పూర్తిగా ఉపయోగించుకోవాలి. డాన్స్, డ్రీమ్ సీక్వెన్స్‌లని పెంచాలి. విలన్ కేరక్టర్‌ని మరి కొంచెం పెంచాలి. ఆ లోకంలో ఒక ‘ఫైట్’ కూడా పెట్టొచ్చు. విలన్ హీరోని వెంటాడుతూ భూమికి రావచ్చు. ఇక్కడ కూడా ‘ఫైట్ సీన్’ ఉంచవచ్చు. దీని వల్ల హీరోయిన్ పట్ల హీరోకున్న విడదీయరాని ప్రేమ బలపడుతుంది.

అలాగే, హీరోకి హీరోయిన్లకీ మధ్య మరికొన్ని సీన్స్ పెట్టాలి, ఫలితంగా వాళ్ళిద్దరూ ‘రెండు శరీరాలు – ఒకే ప్రాణం’ అని ప్రేక్షకులకి అర్థం అవుతుంది. ‘అర్జున మోక్ష శిల’ దగ్గర, విజిపి ఎమ్యూజ్‍మెంట్ పార్కు లోని అందమైన శిల్పాల వద్ద డాన్స్ షూటింగ్ పెట్టుకుందాం. దీని వలన ‘అలౌకిక’ ‘ఫీలింగ్’ పెరుగుతుంది. హీరోయిన్ – హీరో కోసం తన లోకాన్ని, తనవాళ్ళని వదులుకోడానికి సిద్ధమనే విషయాన్ని మనం స్పష్టం చేయాలి. హీరో లేకుండా హీరోయిన్ జీవించలేదన్న సంగతి ప్రేక్షకులకి అర్థమయిపోవాలి.”

ఇవన్నీ చెప్పి, రజత్ – మేనక కేసి చూసి మార్మికంగా నవ్వాడు. ఆమెనే చూస్తూ ఉండిపోయాడు కాసేపు.

***

హీరో, హీరోయిన్, ఇతర ఆర్టిస్టులతో అగ్రిమెంట్లు అయిపోయాయి. సినిమా షూటింగ్‌కి ఏర్పాటు త్వరతగతిన సాగుతున్నాయి. సినిమా ఇన్‍డోర్, అవుట్‌డోర్ షూటింగులను దృష్టిలో ఉంచుకుని షెఢ్యూళ్ళు రూపొందించారు. అనంతరం ఓ రోజు ఓ ప్రసిద్ధ స్టూడియోలో ‘అలౌకిక ప్రేమ’ సినిమా ముహూర్తం షాట్ తీశారు. ఈ సందర్భంగా అక్కడకి వచ్చిన ఇతర హీరోలు, హీరోయిన్‍లు, నిర్మాతలు, దర్శకులు – మధుర్ వెలుగులోకి తెస్తున్న కొత్త హీరోయిన్‍ని చూసి, ఆమె ప్రేక్షకుల మదిని దోచి – బాక్సాఫీస్‍కి గొప్ప హిట్లు ఇవ్వడం ఖాయమని భావించారు. చాలామంది నిర్మాతలు మేనకని తమ రాబోయే సినిమాల్లో హీరోయిన్‍గా పెట్టుకోవాలని తలచారు. కానీ వాళ్ళ ఆశల్ని వమ్ము చేస్తూ – మేనకకి తాను బ్రేక్ ఇస్తున్నాననీ, ఆమెతో తమ కాంట్రాక్ట్ ప్రకారం ఆమె వచ్చే ఐదేళ్ళ వరకూ తన సినిమాలకే పని చేస్తుందని చెప్పారు మధుర్. ఆ నిర్మాతలంతా నిరాశకు లోనయ్యారు.

సినిమా ఇన్‍డోర్ షూటింగ్ – బాలీవుడ్‍లోకెల్లా అత్యంత ఎక్కువ వ్యయంతో, అధిక శ్రమతో రూపొందించిన సెట్‍లో జరిగింది. సినిమాలోని కొన్ని సీన్ల కోసం యానిమేషన్, గ్రాఫిక్స్‌ని పరిపూర్ణంగా వాడుకోవాలని నిశ్చయించారు, ఎందుకంటే ఆ దృశ్యాలు అత్యంత మనోజ్ఞంగా ఉండి, వాస్తవికమైనవిగా అనిపించాలి.

కొన్ని రోజులు ఇన్‍డోర్ షూటింగ్ చేసి, ప్రధాన సన్నివేశాలన్నీ పూర్తి చేశారు. అవుట్‍డోర్ షూటింగ్ కోసం – మధుర్, హీరో హీరోయిన్లు, ఇతర ఆర్టిస్టులు, టెక్నీషియన్లతో మహాబలిపురం వచ్చారు. బీచ్ రిసార్టులో మకాం పెట్టి, మర్నాటి నుంచి ‘బాస్ రిలీఫ్’ నేపథ్యంలో ‘భాగీరథుడి తపస్సు – ఆకాశం నుంచి భూమికి గంగావతరణం’ వంటి ఉద్వేగపు భావవ్యక్తీకరణతో మేనక నృత్యాన్ని చిత్రీకరించారు. మేనక ప్రదర్శించిన ఆ అద్భుతమైన నాట్యంతో యూనిట్ సభ్యులంతా మైమరిచిపోయారు. నాట్యం పూర్తయ్యాకా మధుర్ ‘కట్’ చెప్పడం వినిపించింది.

ఆ రోజు పౌర్ణమి.

పగలంతా షూటింగ్‍తో అలసిన ఆర్టిస్టులూ, టెక్నీషియన్స్ తమ కాటేజీలకి చేరి నిద్రపోయారు. మధుర్ కూడా మర్నాటి షెడ్యూల్ చెక్ చేసుకుని, అందరికీ తగిన సూచనలు చేసి, తాను కూడా నిద్రకి ఉపక్రమించారు.

రజత్ కుమార్‌కి కూడా నిద్ర వస్తోంది. కాటేజ్ వెనుక పెద్ద పెద్ద సరుగుడు చెట్ల వెనుక నుంచి సముద్రపుటలల శబ్దాలు వినిపిస్తున్నాయి. ఆ చీకటి నిశ్శబ్దంలో అలలు తీరాన్ని తాకి సవ్వడి చేస్తున్నాయి.

మరే చప్పుడూ లేదు. ఎవరి మాటలూ లేవు. రజత్ భావుకుడయ్యాడు. పగలంతా మేనకతో చేసిన షూటింగ్‍లో పూర్తిగా లీనమైపోయాడు. ఒక కొత్త ‘టాలెంట్’తో ఈ రకమైన అనుభవం కలగడం అతనికి ఇదే మొదటిసారి. చీకటి పడ్డాకా, విశ్రాంతి కోసం తన కాటేజ్‍కి వచ్చేయగానే అతనిలో ఏదో వింత వ్యాకులత కలుగుతోంది. అతను మేనక గురించే ఆలోచించసాగాడు. ఓ అదృశ్య శక్తి ఏదో తనని ఆమె వైపు లాగుతున్న భావన కలిగింది అతనికి.

కాటేజ్ కిటికీ నుంచీ చాలా సేపు సముద్ర తీరం వైపు చూస్తూండిపోయాడు రజత్. సరుగుడు చెట్ల మధ్య నుంచి వెన్నల తునకలు ఇసుక మీద పడుతున్నాయి. మంద్రంగా వినిపిస్తున్న అలల చప్పుడు రజత్‍ని ఊరుకోనీయలేదు. నెమ్మదిగా కాటేజ్ నుంచి బయటకు వచ్చాడు. చెట్ల దగ్గరికొచ్చి అక్కడున్న ఉయ్యాల బల్ల మీద కూర్చున్నాడు. మెల్లగా ఊగుతూ ఎంతో దూరం వరకూ విస్తరించి ఉన్న సముద్రాన్ని చూస్తూండిపోయాడు. ఆకాశంలో చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. తీరంలో కాస్త దూరంగా వెన్నెల్లో తడిసి ముద్దవుతున్న ‘షోర్ టెంపుల్’ కనిపిస్తోంది. ఏదో స్వప్నలోకపు వాతావరణంలా ఉంది.

అప్పుడు అతనికి సినిమా కథ గుర్తొచ్చింది. ఈ సాగర తీరంలోనే సాయబా, బలరామ్‍లు తొలిసారి కలుసుకోవడం జ్ఞప్తికొచ్చింది. సాయబా, బలరామ్‍ల అలౌకిక ప్రేమ! అతను కళ్ళు మూసుకుని, అలల సంగీతం వింటూ, ఆ దృశ్యాన్ని ఊహిస్తున్నాడు. రేపు ఇక్కడ ఈ ఇసుకలో అదే సన్నివేశాన్ని చిత్రీకరించబోతున్నారు.

అప్పుడే అతని చెవుల్లో కొన్ని క్షణాల పాటు మధురమైన అందెల రవళి వినిపించిది. అతను తీరం వైపు చూశాడు, చూస్తూనే ఉండిపోయాడు.. ఆ అనింద్య సుందరిని, ఆ అప్సరస లాంటి ఆకర్షక యువతిని! నిస్సందేహంగా దివ్య సౌందర్యపు ప్రతిరూపం. ఆమె అతని వైపు కొన్ని క్షణాలపాటు కనురెప్ప వేయకుండా చూసింది, వెంటనే ఉద్విగ్నతతో నాట్యం ఆరంభించింది. ఓ అప్సరసలా దివ్య నృత్యం చేయసాగింది. రజత్ ఆమె మోహపాశంలో బందీ అయ్యాడు. సంభ్రమంగా, సమ్మోహితుడై మెల్లగా ఆమె వైపు అడుగులు వేశాడు. ఆమె దరి చేరి హత్తుకుని, “చెప్పు మేనకా” అన్నాడు.

అతని చెవుల్లో మధురమైన ఘంటికల్లాంటి మాటలు వినవచ్చాయి – “లేదు, నేను మేనకని కాను. సాయబాని రజత్. నేను మీ లోకానికి చెందిన దాన్ని కాదు, బ్రహ్మండంలోని మరో గ్రహానికి చెందినదాన్ని. విను ప్రియా, ఇది వరకు అధ్యయనం కోసం మీ ఈ గ్రహానికి ఎన్నో సార్లు వచ్చాను. ప్రేమ, ప్రత్యుత్పత్తి లోని రహస్యాలను అవగతం చేసుకోసుకోవాలని వచ్చాను. మా గ్రహంలో మా ఇష్టప్రకారం మేం పిల్లలని కనలేము. భవిష్యత్తులో ఎలాంటి పౌరుల అవసరం ఉంటుందో – అలాంటి పిల్లలనే ప్రభుత్వం పర్యవేక్షణలో పుట్టిస్తారు. ఇవన్నీ నీకు చూపిస్తాను రజత్.. నాతో మా లోకానికి వస్తావా? వస్తావుగా ప్రియా..”

మాటల్లో పడి వాళ్ళిద్దరూ నెమ్మదిగా తీరం నుంచి చాలా దూరం వచ్చేశారు. పాల వంటి తెల్లని వెన్నెల కాంతిలో అక్కడ ఓ ఫ్లయింగ్ సాసర్ వంటిది నిలిపి ఉండడం రజత్‍ చూశాడు. మేనక.. కాదు.. సాయబా.. అతన్ని తీసుకుని ఆ వాహనం వైపు నడిచింది. దగ్గరకు వెళ్ళగానే తాను అంతరిక్షయానం.. ఈ బ్రహ్మాండంలోని మరో లోకానికి అంతరిక్షంలో ప్రయాణించబోతున్నట్టు అతనికి అర్థమైంది. అతను సాయబా ప్రేమలో మునిగిపోయాడు, సమ్మోహితుడై ఆమెతో పాటు ఆ వాహనంలోకి ఎక్కాడు. వెన్నెల్లో తడిసిన ఆ వాహనం ఎటువంటి చప్పుడూ చేయకుండా పైకి లేచి, ఆకాశంలోకి ఎగిరి, అదృశ్యం అయిపోయింది.

మర్నాడు ఉదయం హీరో హీరోయిన్ ఇద్దరూ కనబడడం లేదన్న వార్త విని మధుర్ తలపట్టుకున్నారు. ఏ సమాచారమూ లేదు. ఒకటి, రెండు, నాలుగు.. చివరికి వారం రోజులు గడిచిపోయాయి. లక్షల రూపాయల నష్టం వస్తోంది. హీరో హీరోయిన్లు ఇలా మాయమవడం కొత్త విషయం కాదు కానీ, వాళ్ళే ఏ నాలుగయిదు రోజుల తరువాత తిరిగి వచ్చేసేవారు, లేదా ఎక్కడున్నారో తెలియజేసేవారు. కానీ రజత్, మేనక ఏ సూచనా ఇవ్వలేదు. చివరికి మధుర్ పేకప్ చెప్పేసి టీమ్ మొత్తాన్ని బాలీవుడ్‌కి తిరిగి పంపించేశారు. మద్రాసులోని ఓ ప్రసిద్ధ కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ సంస్థతో మాట్లాడేందుకు మధుర్ స్వయంగా బయల్దేరారు. రజత్, మేనకల ‘ఇమేజింగ్’ సృష్టించి సినిమాని పూర్తి చేయాలని ఆయన ఆశ. ఎలా అయినా సినిమా పూర్తవ్వాలి, విడుదలవ్వాలి.

~

హిందీ మూలం: దేవేంద్ర మెవారీ

అనువాదం: కొల్లూరి సోమ శంకర్


మూల రచయిత పరిచయం:

శ్రీ దేవేంద్ర మెవారీ ప్రముఖ హిందీ రచయిత. సైన్స్, సాహిత్యం రెండిటిలోనూ సమానంగా కృషి చేసిన వ్యక్తి. గత 55 ఏళ్ళుగా రాస్తున్నారు.

ఈయన ఉత్తరాఖండ్ లోని నైనిటాల్ జిల్లాలో 1944లో జన్మించారు. వారిది కొండపైన ఉన్న గ్రామం. అప్పుడప్పుడూ జిమ్ కార్బెట్ వీరి గ్రామానికి వస్తూండేవారు, ఎందుకంటే, అక్కడ దట్టమైన అడవుల్లో మనుషుల్ని తినే పులులు ఉండేవి.

మెవారీ గారు ఐదో తరగతి వరకూ తమ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో చదువుకున్నారు. తర్వాత ఇంటర్మీడియట్ వరకు ఓఖల్‍కండలో చదివారు. డిగ్రీ నైనిటాల్ లోని డి.ఎస్.బి. కాలేజ్‍లో చదివారు. బొటానికల్ సైన్స్‌లో ఎం.ఎస్.సి. చేశారు. అనంతరం హిందీ సాహిత్యంలో ఎం.ఎ.; జర్నలిజంలో పి.జి. డిప్లొమా చేశారు.

బాల్యం నుంచి కథలంటే ఆసక్తి ఉన్న మెవారీ తరువాతి కాలంలో రచనా వ్యాసంగం చేపట్టారు. సైన్యు వ్యాసాలు వ్రాసారు. పత్రికలకి, రేడియోకి, టెలివిజన్‍కి రచనలు చేశారు. కొన్ని పత్రికలకు సంపాకత్వం వహించారు. పిల్లల కోసం, పెద్దల కోసం కథలు రాశారు. సైన్సు, స్వీయకథాత్మక రచనలు కలిపి 30 పుస్తకాలు ప్రచురించారు. ‘మేరీ యాదోం కా పహాడ్’, ‘ఛూటా పీఛే పహాడ్’, ‘జీవన్ జైసే పహాడ్’ – వీరి ఆత్మకథాత్మక రచనలు. ‘కథా కహో యాయావార్’, ‘నాటక్-నాటక్ మే విజ్ఞాన్’, ‘విజ్ఞాన్ కీ దునియా’, ‘విజ్ఞాన్ బారహ్‍మాసా’, ‘సౌర్‍మండల్‍ కీ సైర్’, ‘విజ్ఞాన్ వెలా మే’, ‘విజ్ఞాన్‍నామా’, ‘మెరీ ప్రియ్ విజ్ఞాన్ కథాయేఁ’ వంటివి ప్రముఖ సైన్స్ రచనలు.

పిల్లలకు, పెద్దలకు కథలు చదివి వినిపించడమంటే దేవేంద్ర గారికి బాగా ఇష్టం అనేక ఊర్లకు వెళ్ళి పిల్లలకు కథలు వినిపిస్తారు. వీరికి అనేక పురస్కారాలు లభించాయి. 2021 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం, వనమాలి విజ్ఞాన్ కథా సమ్మాన్ పురస్కారం లభించాయి. ఆత్మారామ్ పురస్కారం, విజ్ఞాన్ భూషణ్ సమ్మాన్, జ్ఞాన్ ప్రౌద్యోగికీ సమ్మాన్, విజ్ఞాన్ లోకప్రియకరణ్ రాష్ట్రీయ సమ్మాన్ తదితర పురస్కారాలు ముఖ్యమైనవి. పిల్లల కోసం రచించిన పుస్తకాలకి రెండు సార్లు భారతేందు హరిశ్చంద్ర రాష్ట్రీయ బాల సాహిత్య పరస్కార్ గెల్చుకున్నారు.

వృక్షజాలమన్నా, పశుపక్షాదులన్నా, చందమామ నక్షత్రాలన్నా మెవారీ గారికి ఎంతో ఇష్టం. వీరిని dmewari@yahoo.com లో సంప్రదించవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here