మరో లోకంలోకి నడిపే ‘ఆల్గోరిథమ్’ కథాసంపుటి

0
2

[డా. చిత్తర్వు మధు రచించిన ‘ఆల్గోరిథమ్’ అనే కథాసంపుటిని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

[dropcap]ప్ర[/dropcap]ముఖ కథా, నవలా రచయిత డా. చిత్తర్వు మధు ఇటీవల 16 కథలతో వెలువరించిన సంపుటి ‘ఆల్గోరిథమ్’. ఇందులో 10 సైన్స్ ఫిక్షన్ కథలు, 3 మెడికల్ ఇతివృత్తం కథలు, 3 చారిత్రక కథలు ఉన్నాయి.

~

సైన్స్ ఫిక్షన్ కథలు:

తేజస్ అనే డాక్టరుకి యాక్సిడెంట్ అవుతుంది. చికిత్స కోసం ఆసుపత్రిలో ఉండగా అతనిలో అనుభూతులు, ఆలోచనలు కలుగుతాయి. జరిగేది కనిపించేది అంతా నిజమేనా, భ్రమా అన్న తికమకకి గురవుతాడు. రోబోటిక్ డాక్టర్ ఉద్యోగం చేసే ముందు తాను ఎవరు? ప్రాణాలు ఉన్న మనిషినా లేక యంత్రాన్నా అని తెలుసుకోవాలనుకుంటాడు. ‘కరెంట్ బొమ్మ’ కథ పాఠకులని విస్తుగొల్పుతుంది.

కాలంలో 200 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి, తన సంస్థానాన్ని, తమ ముత్తాత తండ్రిని చూసి రావాలనుకోవడంతో పాటు ఓ రహస్యాన్ని కూడా తెలుసుకోవాలనుకున్న రాజా విశ్వేశ్వర రావు బహదూర్ చేసిన పొరపాటు ఏమిటో, దాని పర్యవసానం ఏమిటో తెలియాలంటే బటర్‍ఫ్లై ఎఫెక్ట్ నేపథ్యంగా రాసిన ‘సీతాకోకచిలుక’ కథ చదవాలి.

జాంబీ వైరస్ బారిన పడిన మానవజాతి అంతమై, భూమి మీద రోబోల పాలన మొదలైతే ఏం జరుగుతుందో ‘పాండెమిక్ తరువాత’ కథ చెబుతుంది. మానవ జాతికి నమూనాగా సజీవంగా ఉంచిన కొందరిని రోబోలు కొత్త ప్రపంచానికి నడుపుతాయి.

అమితంగా ప్రేమించిన భార్య చనిపోతే, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి, ఆమె రూపంలో, ఆమె స్వరంతోనే ఉన్న ఫిమేల్ రోబోని తెచ్చుకుంటాడు అనురాగ్. భార్యని ఆ బొమ్మలో చూసుకున్నా, అనుభూతులని పంచుకోలేనని గ్రహించిన అనురాగ్, ఆ బొమ్మని కొన్నవాళ్ళకి తిరిగి ఇచ్చేస్తాడు. సృష్టికి ప్రతిసృష్టి చేయలేమని గ్రహిస్తాడు. ‘మనస్విని 002’ కథ ఉద్వేగాన్ని కలిగిస్తుంది.

వృద్ధాప్యాన్ని యవ్వనంగా మార్చుకోడం సాధ్యమవుతుందా? అలా సాధ్యమైన పక్షంలో వ్యక్తి జీవితంలో సంభవించే పరిణామాలేమిటి? పాత బంధాలేమవుతాయి? కొత్త జీవితం ఎక్కడో పరాయి దేశంలో అజ్ఞాతంగా గడపాల్సి వస్తే ఆ వ్యక్తి మానసిన ఉద్వేగాలను ఎలా తట్టుకోగలడు? శరీరానికి మరణం రాకుండా ఎంత కాలం ఆపగలరు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ‘మూడో జన్మ’ కథలో దొరుకుతాయి.

అనంత విశ్వంలో ఏ గమ్యానికైనా అతి తక్కువ ఖర్చుతో చేర్పించే ‘అంతర్ గ్రహ టూరిస్ట్ సర్వీసెస్’ ఆల్ఫా సెంటారీ నక్షత్ర మండలంలోని ఆంధ్రకస్ గ్రహంలో ఉంది. ఆ సంస్థ ఉద్యోగులు ఉద్యోగులు శివ, విష్ణు. వాళ్ళ వద్దకి కస్టమర్‌గా వచ్చిన  పరబ్రహ్మ అత్యవసరంగా భూగ్రహానికి వెళ్ళాలని ఎంత డబ్బయినా ఇస్తానని అంటాడు. సుదూరంలో ఉన్న భూమికి వెళ్ళడం ప్రమాదకరమని చెప్తాడు శివ. విష్ణు కూడా అదే అంటాడు. కానీ భారీ మొత్తం ఆశజూపి వాళ్ళని భూమికి ప్రయాణం కట్టిస్తాడు పరబ్రహ్మ. హైపర్ స్పేస్ ప్రయాణానికి అనువైన స్పేస్ షిప్‌లో వార్ప్ వేగంతో ప్రయాణించి భూమిని చేరుతారు. పరబ్రహ్మని ఆయన అడిగిన గ్రామంలో దించేసి, శివ, విష్ణు వెనక్కి వెళ్ళిపోతారు. ఆయన తన రోబో సాయంతో ఆ గ్రామంలోకి ప్రవేశిస్తాడు. ఎంతటి ప్రళయం సంభవించినా, పునరుద్ధరణ కూడా ఉంటుందని చెప్పే కథ ‘పునరుత్థానం’.

భూవాతావరణంలో సూర్యతాపం రెండు డిగ్రీలు పెరిగితే ఏం జరుగుతుందో, పర్యావరణం ఎంతలా నాశనమవుతుందో ‘రెండు డిగ్రీలు’ కథ చెబుతుంది. అలాంటి స్థితిలో మనుషులలో స్వార్థం ఎంతలా పెరిగిపోతుందీ, స్వీయ మనుగడ ఎంత ముఖ్యమైపోతుందో ఈ కథ చెబుతుంది.

టైం ట్రావెల్‍ని ఉపయోగించుకుని – వర్తమానంలో ఇంకా తయారవని ఒక మందుని, భవిష్యత్తులోకి వెళ్ళి – తీసుకుని వచ్చి తన తండ్రిని కాపాడుకోవాలనుకుంటాడు డా. భరత్. కాని భవిష్యత్తులో తండ్రి కన్నా తానే ముందు చనిపోతానని తెలుసుకుంటాడు ‘ప్రయాణం’ కథలో. మరి అతని ఈ ప్రయాణం విజయవంతమైనట్టేనా? ఎన్నెన్నో ప్రశ్నలను రేకెత్తిస్తుందీ కథ.

వ్యాపారంలో నష్టాల్లో కూరుకుపోయిన రావ్ – క్లబ్‍కి వెళ్ళి కాస్త రిలాక్స్ అవుదామని – తన ఆటోమేటిక్ డ్రైవర్‌లెస్ కారులో బయల్దేరుతాడు. దానికి అన్ని కమాండ్లు ఇచ్చి వెనుక సీట్లో వాలుతాడు. తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ సూచనలు చేసి, ఎమర్జెన్సి మోడ్ ఆన్ చేయించి బయల్దేరుతాడు. దారిలో ఎదురుగా వస్తున్న ట్రక్కుని తప్పించి, యజమానికి కాపాడుకోడానికి కారు సొంత నిర్ణయం తీసుకుని, తక్కువ ప్రమాదం జరిగేలా పరంధామయ్య అనే వృద్ధుడిని ఢీకొడుతుంది. ఆయన అక్కడికక్కడే చనిపోతాడు. ఆయన కొడుకులు కోర్టులో కేసు వేస్తారు. ఆసక్తికరంగా సాగుతుంది ‘ఆల్గోరిథమ్’ కథ.

నగరానికి కాస్త దూరంలో సిమ్యులేటెడ్ సిటీని నిర్మించారు. అది కృత్రిమంగా నిర్మించిన ఓ కొత్త ప్రపంచం. వీడియో గేముల్లో కంప్యూటర్ మాత్రమే చేయగలిగే సాహసాలని ఆ ప్రపంచంలో స్వయంగా చేయవచ్చు. అసాధ్యాలను సాధ్యం చేసే వింతలూ, విశేషాలతో రూపొందించిన ఆ నగరంలోని మహిళా రోబోకి దాసుడవుతాడు వ్యాపారవేత్త కళాధర్. వాళ్ళిద్దరి మనోభావాలతో అల్లిన కథ ‘సిమ్ సిటీ’.

~

మెడికల్ ఇతివృత్తం కథలు:

హైపో’ కథ డయాబిటస్ నేపథ్యంగా రాసిన కథ. డయాబెటిస్ తగ్గాలంటే జీవనశైలి, మద్యపానం, ఆహారం మార్చుకోవాలని తగ రోగులకి ఖచ్చితంగా చెప్తాడు డా. ధీరజ్. సాధారణ వైద్యుల కంటే ఓ అడుగు ముందుకు వేసి, ఓ సాహసం చేసి, తన వద్దకి పేషంట్‍గా వచ్చిన చక్రధరరావ్ గురించి వివరాలు తెల్సుకుని చికిత్స చేస్తాడు.

దేశమంతటా కరోనా వ్యాపించిన తరువాత రోగులకి చికిత్స చేసే క్రమంలో దానిబారిన పడిన వైద్య సిబ్బంది గురించి, వారు చేసిన త్యాగాల గురించి, ఆ సమయంలో క్షీణించిన మానవత్వం గురించి ‘విజేత’ కథ చెబుతుంది.

వృద్ధాశ్రమంలో ఉండే పాండురంగారావు అనే ముసలాయని తమ హాస్పిటల్‍లో చేర్చడం వల్ల ఆయనకు చికిత్స చేసిన వైద్యుడు డా. ఆదిత్యకి పాండురంగారావు గారి కొడుకు అమెరికా నుంచి ఫోన్ చేసి తండ్రి ఆరోగ్యం గురించి ఎన్నో ప్రశ్నలు వేసి, తాను రావాలా వద్దా అని అడుగుతాడు. సమాజంలో వస్తున్న మార్పులకు ఈ కథ అద్దం పడుతుంది. జీవితపు చివరిదశలో కలిగే నిరాశని జయించి ఆరోగ్యకరమైన, తృప్తికరమైన జీవితం గడపవచ్చని ‘సెకండ్ ఇన్నింగ్స్’ కథ చెబుతుంది.

~

చారిత్రక కథలు:

సుజాత’ కథలో జ్ఞానాన్వేషణలో సంచారం చేస్తున్న సిద్ధార్థుడు ఒక గ్రామంలో సుజాతని కలుస్తాడు. తనకి సంతానం కలిగితే తరుదేవుడికి పాయసం నైవేద్యం పెడతానని మొక్కుకున్న సుజాతకి ఆ చెట్టుకింద కూర్చున్న సిద్ధార్థుడు దేవుడిలా కనిపిస్తాడు. తాను తెచ్చిన పాయసాన్ని తినమని ప్రార్థిస్తే, తాను తపసులో ఉన్నాననీ గాలి తప్ప ఏమీ తిననని అంటే, శరీరాన్ని కృశింపజేసుకోవద్దని అంటుందామె. కొన్ని క్షణాల సంశయం తర్వాత ఆమె తెచ్చిన పాయసం మొత్తం తాగేస్తాడు సిద్ధార్థుడు. తాగడం పూర్యయ్యాకా, అతనికి హఠాత్తుగా కొత్త ఆలోచన కలుగుతుంది. వెళ్తున్న మార్గం మార్చుకుని దగ్గరలోని బోధివృక్షం వైపు వెళ్తాడు. అక్కడ అతనికి జ్ఞానోదయం అవుతుంది. బుద్ధుడవుతాడు.

శిల్పి అయిన విశ్వపతి – తక్షశిల నగరంలో బుద్ధుని విగ్రహాలు చెక్కడానికి వెళ్ళినప్పుడు అతనికి ‘ఆనందిని’ పరిచయం అవుతుంది. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడతారు. కొన్నాళ్ళకి విశ్వపతి అక్కడికి వచ్చిన పని పూర్తవుతుంది. తనతో తన ఊరికి వచ్చేయమంటే రానంటుంది ఆనందిని. ఇంటికి తిరిగి వచ్చిన అతనికి జబ్బు చేస్తుంది. అతన్ని పరీక్షించిన వైద్యుడు ఆ జబ్బు నయం కావాలంటే దక్షిణాది శ్రీపర్వతం అనే కొండ మీద ఉన్న మహాచైత్యంలోని గురువు నాగార్జునుడు వైద్యం చేయాలని చెప్తాడు. విశ్వపతి ఎన్నో కష్టాలకోర్చి నాగార్జునుని వద్దకు చేరుతాడు. ఆచార్య నాగార్జునుడు విశ్వపతికి చికిత్స చేసి సన్మార్గంలో పెట్టడంలో ‘సంఘం శరణం గచ్ఛామి’ కథ ముగుస్తుంది.

బౌద్ధం నేపథ్యంగా అల్లిన కథ ‘పద్మగంధిని’. తను ఇష్టపడిన పద్మగంధినిని చేరుకోడానికి ఎన్నో కష్టాలు సహించి, బాధలనోర్చి, చివరికి హిమాలయ ప్రాంతాలలో ఆమెను కనుగొని తన ప్రేమని వెళ్ళడించి బౌద్ధవజ్రయాన భిక్షువుల ఆశీర్వాదంతో ఆమెను వివాహమాడతాడు అభిరామ్.

***

సైన్స్ ఫిక్షన్ 10 కథల్లో మొదటి 9 కథలు; మెడికల్ ఇతివృత్తాలతో రాసిన మూడు కథల్లో మొదటి రెండు సంచిక వెబ్ పత్రికలో ప్రచురితమయ్యాయి.

ఈ కథలన్నీ ఆసక్తిగా చదివిస్తాయి. పాఠకులను మరో లోకంలో తిప్పుతాయి. ఆలోచింపజేస్తాయి. హెచ్చరిస్తాయి. భూమి పట్ల పౌరులుగా ఉమ్మడిగా నిర్వహించాల్సిన బాధ్యతను గుర్తు చేస్తాయి.

“ఈ కథాసంపుటి మిమ్మల్ని భవిష్యత్తులోకీ, భూతకాలంలోకీ ప్రయాణం చేయించి ఆలోచింపజేసి, అలరిస్తుంది” అని చివరి అట్ట మీది వాక్యాలు సత్యదూరం కావు.

***

ఆల్గోరిథమ్ (కథాసంపుటి)
రచన: డా. చిత్తర్వు మధు
ప్రచురణ: అన్వీక్షికీ పబ్లిషర్స్, హైదరాబాద్.
పేజీలు: 205
వెల: ₹ 200.00
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్, హైదరాబాద్. ఫోన్: 9000 413 413
ఇతర ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
ఆన్‍లైన్‍లో:
https://www.amazon.in/ALGORITHM-MADHU-CHITTARVU/dp/B0CLS5Y43S/

 

 

~
‘ఆల్గోరిథమ్’ కథాసంపుటి వెలువరించిన డా. చిత్తర్వు మధు గారి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇక్కడ
https://sanchika.com/special-interview-with-dr-chittarvu-madhu/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here