Site icon Sanchika

అలికిడి

[అనూరాధ బండి గారు రచించిన ‘అలికిడి’ అనే కవితని (Prose Poetry) పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]వె[/dropcap]న్నెల కురవలేదనే బాధలేని సమయమది. చీకటి గురించి బెంగ కూడా లేదప్పటికి. ఇక అప్పుడు ఉన్నది అంతా ఒట్టి నిర్లిప్తత. నడిచే దారంతా యాంత్రికత. నవ్వుల్లో పువ్వులు వాడిన వాసన. అటువంటప్పుడే వినిపించాయి నాలుగు మకరందపు మాటలు. నలుగురు మనుషులు ఒకేసారి పువ్వులు కుమ్మరించినట్లుండే మాటలు. కాసేపు కాసేపుకీ ఆరా తీసుకుని గడవని గడ్డుసమయాన్ని తేలికపరిచేసే మాటలు. నిజం; ఎటు తిరిగి, ఎటు తిరిగీ, ఎన్ని పనులు చేసీ, అలుపంతా కేవలం కొన్ని చిన్న పదాలతో కొట్టివేసే మాటలు.

నిజానికి అవే బ్రతికున్న క్షణాలు. అవే జీవాన్ని తొణికిసలాడించిన దినాలు. అది, ఆ కాలమంతానూ అమృతాన్ని అక్షరాల్లో ఒలికించుకున్నది; సందేశాలకు మార్మిక రెక్కలు తొడిగిన దివ్యత్వపు అమరిక అది.

అలాంటి రోజుల గురించి ఆలోచిస్తాను. ఎలాంటివంటే, మాటలతో చలికాచుకున్న శీతాకాలపు రోజులు. మంటకూడా బావున్న రోజులు. మండిపోయాక కూడా బ్రతికున్నామనుకున్న రోజులు.  ఇక రావు అవి. పుట్టవు అటువంటి పంతపు మాటలు. మరెప్పటికి పుట్టవు ఆ చిలిపి తగవులు. దూరం పెరిగిపోతున్నప్పుడు కారణం తెలియకపోవడమే విషాదం. అయినా, చప్పుడులేని అడుగులు అవి. పాదముద్రలు లేని దూరం అది.

ఇక మళ్ళీ ఆగిపోయిన దగ్గరకొస్తే ఏమీ లేదు. నవ్వుకోవడానికి కాసిని కారణాలను వెతుక్కోవాలి. మాటలకోసం తడబడాలి. తెలీని తత్తరపాటు. ఎవరూ నిజానికి సరీగా తెలీదు. తెలుసుకోవాలంటే సొరంగాలు తవ్వుకోవాలి. ఆపై ప్రేమతో పూడ్చుకోవాలి.

సహనమున్న రోజులు దగ్గరకే పోయి ఆగాలి మళ్ళీ అప్పుడు. అయినా కూడా ఏదీ మిగిలిలేదు. ఆఖరుకి దుఃఖం కూడా. మరి ఇది అంతా కూడా అదే. విరిగి నలిగి మాయమై తిరిగిరాని మరి ఇక పొందలేని సమయపు అలికిడి.

Exit mobile version