Site icon Sanchika

ఆల్ ఈస్ వెల్…

[dropcap]కా[/dropcap]కినాడ జనవరి 3 శుక్రవారం.

“తరాలు మారిన కొద్దీ, మగవాళ్ళతో పోటీపడి, ఈ పోటీ ప్రపంచంలో పరుగెత్తి, పరుగెత్తి స్త్రీ తన సహజత్వాన్ని కోల్పోయి, అలిసిపోతుందేమో, తన స్థానాన్ని నిలబెట్టుకోలేకపోతుందేమో అనిపిస్తోంది గీత గారు” అన్నాను నేను.

“లేదు, లక్ష్మీ గారు, మీ అభిప్రాయం తప్పు. ఎన్ని తరాలు మారినా, ఎప్పటికప్పుడు దేశ, కాల, మాన పరిస్థితులను చక్కగా అర్థం చేసుకుని, ప్రతి తరంలో స్త్రీ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూనే ఉంది. విజయం అనేది స్త్రీ సహజ లక్షణం. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఈ సమాజంలో స్త్రీ యొక్క స్థానం పదిలంగానే ఉంటుంది” కొంచెం ఆవేశంగా చెప్పారు గీతామాధురి గారు.

నా పేరు లక్ష్మి. నేను మెడికల్ కాలేజీలో ఫిజియాలజీ ప్రొఫెసర్‌ని. ఈ మధ్యనే తీరిక సమయంలో రచనలు చేయాలని ఉబలాటం పుట్టింది. గీతా మాధురి గారు నాకన్నా వయసులో చిన్నదయినా, రచయిత్రిగా ఇప్పటికే ఒక స్థానం గలవారు. మా ఊళ్లో సాహితీ వృత్తాలలో పాల్గొనే వ్యక్తి. ఆవిడ పరిచయం తరువాత అప్పుడప్పుడు ఇలా ఆవిడతో వాదనకు దిగి తెలియని విషయాలని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాను నేను.

మా ఆయన భోజనానికి రావడంతో ఆ సంభాషణకు అంతరాయం కలిగింది.ఆ సాయంత్రం ఇద్దరం కాసేపు కబుర్లు చెప్పుకున్నాం. గీతా మాధురిని సాగనంపి భోజనం పెట్టడానికి ఇంట్లోకి దారి తీశాను.

“సాయంత్రం ఫ్లైట్‌కి శ్రీదేవి, శైలజ వస్తున్నారు. రాజమండ్రికి కారు పంపించాలి, రాజేష్‌కు వెళ్లి వాళ్ళను తీసుకు రమ్మని చెప్పండి” అని చెప్పాను భోజనం చేస్తూనే. “అలాగే!” అన్నారు మా ఆయన.

“రేపు, రీయూనియన్‌కి మీరు కూడా వస్తారా?” అని అడిగాను యధాలాపంగా.

“నాకు చాలా పనులు ఉన్నాయి. ఈసారికి నువ్వు వెళ్లి వచ్చేయ్!” అన్నారు మా ఆయన షరా మామూలుగా!

నేను కూడా భోజనం చేసి, సత్యవాణికి ఫోన్ చేశాను.

“రేపు పొద్దున్న ఆరుగంటల కల్లా రెడీగా ఉండు. మేము బయలుదేరి నీ దగ్గరికి వస్తాం. అందరం కలిసి వెళ్దాము”అన్నాను.

“అలాగే అక్కా!” అంది ఆమె. సత్యవాణి నా సొంత చెల్లెలు. నా కన్నా 10 ఏళ్లు చిన్నది. గైనకాలజిస్ట్. ఈ ఊర్లోనే నర్సింగ్ హోమ్ నడుపుతోంది. వాళ్ళ ఆయన కూడా డాక్టరే. వస్తున్న వాళ్ళలో శ్రీదేవి నా పిన్ని కూతురు. ఇంక శైలజ నా కూతురే. తను కూడా గైనకాలజిస్టు. వాళ్ళు హైదరాబాదులో ఉంటారు. అక్కడ తమ ఏరియాలలో తలో నర్సింగ్ హోమ్ నడుపుకొంటున్నారు. 1975 బ్యాచ్‌లో నేను రంగరాయ మెడికల్ కాలేజీలో చదివాను. సత్యవాణి 1985, శ్రీదేవి 1995, శైలజ 2005…. సంవత్సరాలలో ఇదే కాలేజీలో చదివారు.

గ్రాండ్ రీయూనియన్ కోసం అందరం కలుద్దాం అనుకున్నాం. కాలేజీ పేరు చెప్పి అన్ని తరాల వాళ్ళు ఓసారి కలిసినట్టు ఉంటుందిగా. అందరి బ్యాచ్‌ల రీయూనియన్లు ఒకే రోజు, ఒకే రిసార్టులో ఏర్పాటు చేయడం అనేది కేవలం కాకతాళీయం.

2020 జనవరి ఫస్ట్ సాటర్డే అండ్ సండే.అందుకే ఇవాళ వీళ్ళ రాక.

***

ఉదయాన్నే బయలుదేరి నలుగురమూ డ్రైవర్‌తో సహా, రిసార్ట్‌కు చేరుకునేసరికి సుమారుగా ఎనిమిది గంటలయింది. బ్యాచ్‌ల వారీగా రీయూనియన్ పార్టీలు వేరు వేరు హాళ్లలో ఏర్పాటు చేశారు. అందరం రూమ్స్‌కి వెళ్లి, లగేజీ పెట్టి, ఫ్రెష్ అయ్యాము. అప్పుడు ఎవరి హాల్లోకి వాళ్ళు వెళ్ళిపోయాము.

ఒకటవ హాలు 1975 బ్యాచ్….

నేను వెళ్లేసరికి, మా హాల్లో సుమారు 60 మంది ఉన్నారు. ఆడవాళ్లు 20 మంది. ఆడవారు అందరూ ఒక వైపు కూర్చున్నారు. ఇద్దరు మాత్రమే తమ భర్తలతో కలిసి వచ్చారు. మిగతా అబ్బాయిలు కొందరు, వాళ్ళ భార్యలతో, కొంతమంది పిల్లల్ని కూడా తీసుకుని వచ్చారు. కుర్చీలు దూర దూరంగా వేసి ఉన్నాయి. కాసేపట్లో అందరి పరిచయాలు, పలకరింపులు అయ్యాక నేను కుర్చీలో కూర్చుని రిలాక్స్ అవుతున్నాను.

వెల్‌కం డ్రింక్ సర్వ్ చేశారు. దాన్ని కొద్ది కొద్దిగా తాగుతూ, చుట్టూ చూస్తూ ఉన్నాను. పై బడుతున్న వయసును దాచుకోవాలని కొందరు ప్రయత్నిస్తూ ఉంటే, మరికొందరు వయసు అయిపోయింది కదాలే అని వచ్చేసిన వాళ్ళు మరికొందరు. ఆడవాళ్లందరూ చీరలు కట్టుకున్నారు. దాదాపుగా అందరూ జుట్టు బాగా ఊడిపోయిన వాళ్ళమే. హెన్నా వేసిన వాళ్లు బోలెడు మంది. మేము కాలేజీలో చేరిన కొత్తలో, ఎవరెవరు క్లోజ్ గా ఉండే వాళ్ళో, మళ్లీ ఇక్కడ కూడా, వారే గ్రూపులుగా చేరి మాట్లాడుకుంటున్నారు.

రీయూనియన్‌లో నచ్చినా, నచ్చకపోయినా అందరినీ పేరుపేరునా పలకరించాలనే స్పృహ పెద్దగా లేదు. కొందరు అమ్మాయిలయితే, సారీ! మామ్మలు, అతిథుల లాగా కూర్చున్నారు! వీళ్ళేనా వాట్సాప్ లో గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ లు చెప్పుకునేది? ప్రపంచంలో ఉన్న ప్రతి మెసేజ్ నీ ఫార్వర్డ్ చేసేది? ఫోటో పెట్టగానే ‘అద్భుతం’ అంటూ పొగిడేది? చాలా ఆశ్చర్యం అనిపించింది.

ఇంతలో ‘నాడు-నేడు’ అనబడే స్లైడ్ షో స్టార్ట్ అయింది. మొదటి సంవత్సరంలో ఉండగా ఉన్న ఫోటోలు, అప్పట్లో జరిగిన వార్డు పార్టీలవి, ఒకటో రెండో టూర్ ఫోటోలు, ఎవరో జాగ్రత్తగా సేకరించి ఆ ఫొటోలకి ఫొటోలు తీసి,వాటిని, ఇప్పటి ఫోటోలని చూపిస్తున్నారు. అలాగే, అప్పటి కాలేజీ హాస్టల్, ఇప్పటి కాలేజీ హాస్టల్ ఫోటోలు కూడా పెట్టారు. అబ్బో చాలానే మార్పులు వచ్చాయి. ఓసారి హాస్టల్ వైపు కూడా వెళ్లి, చూసి, రావాలి.

ఇదయ్యాక రమణ స్టేజి ఎక్కి పాట పాడటం మొదలు పెట్టాడు. “ఒక వేణువు వినిపించెను అనురాగ గీతికా!” ‘ అమెరికా అమ్మాయి సినిమా పాట. హాయిగా ఉంది.

గోపాల్ అనే మా క్లాస్‌మేట్ పొడుగాటి ప్యాకెట్ పట్టుకొని వచ్చి, గణపతి వెనకాల చేరి మాట్లాడుతున్నాడు. “లేడీస్ ఉన్నార్రా, మెల్లిగా వెళ్లి కార్‌లో పెట్టి వచ్చేయ్. నైట్ చూద్దాం” అంటున్నాడు. మందు తాగినా చాలా రహస్యంగా తాగాలనుకునే తరం వాళ్లది. ఆ తరం వాళ్ళకి అందరిచేత మంచి అనిపించుకోవాలని, చెడు అనిపించుకోకూడదనీ తపన. కాసేపటికే బోర్ కొట్టి రూమ్‌కి వెళ్లి వస్తానని చెప్పి, బయటికి వచ్చాను.

***

ఎదురుగా హాల్ 2 కనబడింది. అంటే 1985 బ్యాచ్ వాళ్లది. సైలెంట్ గా దానిలోకి దూరాను.

హాల్లో ఒక పది, పదిహేను దాకా రౌండ్ టేబుల్స్ ఉన్నాయి. చిన్న చిన్న సమూహాలుగా కూర్చుని ఉన్నారు. ఆడవాళ్లు, మగవాళ్లు ఒకచోటే ఉన్నారు. ఎక్కడుందో మా చెల్లి?! సత్యవాణి కోసం వెతికాను. చాలా హుషారుగా, ఫోటో షూట్లో, బ్యాచ్ బ్యాచ్‌గా ఫొటోస్ తీసుకుంటూ ఉంది. ఆడవాళ్లందరికీ ఒక డ్రెస్ కోడ్ వుంది కాబోలు! ఒకే రకం గులాబీ రంగు పట్టు చీరలు కట్టి, జుట్టు ముడివేసుకుని, నిండుగా నవ్వుతూ రకరకాల పోజులతో ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు.

అంతలో కొత్త సినిమా పాట ఏదో వినిపిస్తోంది.’ రాములో, రాములు….’ అంతే ! ఆడాళ్లంతా స్టేజి ఎక్కి, స్టెప్పులు వేశారు. కింద ఉన్న వాళ్లలో ఒక అమ్మాయి, వింటూనే, పక్కనే ఉన్న మరో అమ్మాయితో, “ఏమే, విజయ్ వాళ్ళు వచ్చారు కదా? ఎక్కడున్నావు?” అని అడిగింది.

“ఇంత దాక ఇక్కడే ఉన్నారు కదా!”.

“అవును,వాళ్ళు స్ట్రాంగ్ రూం లోకి వెళ్లారు లేవే!” అంది. ఇవాళ, ఎవరి ప్రైవసీని వాళ్ళు అనుభవించడం వాళ్ల ఇష్టం. ఇంతలో, అటుగా వచ్చిన చెల్లిని, అడిగాను, “అందరూ పిన్నులు పెట్టుకున్నారు కదా? మరి, ఎందుకు ఎడంచేత్తో అలా పమిట పట్టుకుంటున్నారు?” అని.

“అది హాఫ్ కోట్ స్టెప్, చెప్పినా నీకు అర్థం కాదు” అని నవ్వుతూ అంది. నిజంగానే నాకు అర్థం కాలేదు.

మా బ్యాచ్ వాళ్లు లంచ్‌కి రమ్మని మెసేజ్ పెట్టారు. మెల్లగా బయలుదేరాను. తరువాత రూమ్‌కి వెళ్ళి భుక్తాయాసం తీర్చుకుని, రూమ్‌కి టీ తెప్పించి తాగాను. గోదావరి కాలువలో బోటు షికారు అన్నారు కానీ, నేను వెళ్ళలేదు.

సాయంత్రం ఏడు గంటల సమయంలో, మా వాళ్ళు కల్చరల్ ప్రోగ్రాం, రమ్మని బోలెడు మెసేజ్‌లు పెట్టారు. ఫ్రెష్‍గా లేత రంగు చీర కట్టుకుని బయలుదేరాను.

దారిలో హాల్ త్రీ 1995 బ్యాచ్, మా శ్రీదేవి వాళ్ళది బోర్డు కనబడింది. చూసొద్దామన్న ఉత్సుకత ఆపుకోలేక అందులోకి దూరాను.

***

1995 బ్యాచ్… హాల్ 3:

ఇక్కడ మరో రకం ఎరేంజ్ మెంట్ ఉంది. మధ్యలో డాన్స్ ఫ్లోర్ పెట్టారు. చుట్టూ టేబుల్స్ వేశారు. ఒక మూల టేబుల్ దగ్గర కూర్చున్నాను. అమ్మాయిలు, అబ్బాయిలు దాదాపు సమాన సంఖ్యలోనే వచ్చారు. కాసేపు అమ్మాయిలు, కాసేపు అబ్బాయిలు, డాన్స్ చేశారు. ఆ తర్వాత వాళ్ళు, వీళ్ళు కలిసి చేశారు. ఆ రోజుల్లో క్లోజ్ ఏమో అని నాకు అనుమానం కూడా వచ్చింది. ఎందుకంటే, వాళ్లే మళ్లీ, మళ్లీ ఫ్లోర్ మీదకు వస్తున్నారు.నవ్వులు, చిలిపి కామెంట్లు వినపడుతున్నాయి.

బేరర్ వచ్చి,”మేడమ్! డ్రింక్స్” అంటూ ఒక గ్లాస్ నా ముందు పెట్టాడు. అది చిన్నగా ఉండడం, ఆ ద్రవం నీళ్ళలా ఉండడంతో నాకు అనుమానం వచ్చి, పక్క టేబుల్ వైపు చూశాను. అందరూ అమ్మాయిలే కానీ, దానిని సిప్ చేస్తున్నారు. ఒకమ్మాయి మరో అమ్మాయితో అంటోంది, “ఏమే? మనోళ్ళు ఇంప్రూవ్ అయ్యి టేబుల్ దగ్గర సర్వ్ చేస్తున్నారు” అని.

“లాస్ట్ టైం రీయూనియన్ లో గట్టిగా ఇచ్చాం కదా! అందుకే ఈ సారిలా… రెండు మూడు వెరైటీలు కూడా పెట్టారు” అంది.

దాంతో నాకు అర్థమైంది, అది నేను తాగే డ్రింక్ కాదని. ఈ తరం వాళ్ళకి ఎదుటివాళ్ళ అలవాట్లు ఒప్పుకోవడమే కాకుండా, తమ ఇష్టం సాధించుకునే అలవాటున్నట్టు తెలుస్తోంది.

అక్కడ నుంచి లేచి, బయటకు వచ్చేసాను.

అప్పుడే డిన్నర్‌కు వెళ్లాలని లేదు. పొద్దుట్నుంచీ అందరిని చూడటం వల్ల కూడా, మా శైలజ వాళ్ళ బ్యాచ్ గదిలో ఏం జరుగుతోందో, అని ఉత్కంఠ పెరిగిపోయింది. అటువైపు అడుగులు వేశాను.

***

హాల్ 4, 2005 బ్యాచ్…

ఆ హాల్ వైపు వెళ్ళే సరికి నాకు వెంటనే ఏం కనబడలేదు. అడ్డంగా, ఒక కారిడార్‌లా ఉంది. దాంట్లోనే ఒక చిన్న తలుపు లాగా పెట్టారు. క్లాత్ డెకొరేషన్. సెక్యూరిటీ గార్డులు కూడా ఉన్నారు. తొణకకుండా వెళ్ళాను. నా మెడలో రీయూనియన్ టాగ్ చూసి చెక్ చేయకుండానే తల ఊపి పంపించేశారు. లోపలికి వెళ్ళిన నాకు ఒక్క నిమిషం ఏం కనబడలేదు, అర్థం కూడా కాలేదు. కాసేపటికి కంటికి, ఎరుపు-నీలం రంగుల దీపాలు అలవాటు పడ్డాక, నోరు వెళ్ళబెట్టి వలసి వచ్చింది! హాల్‌ని ఒక బార్ లాగ డిజైన్ చేశారు. ఒక మూలకి కౌంటర్. టేబుల్స్ దూరంగా పెట్టి, నడుమ ప్రదేశాన్ని డాన్స్ కోసం వదిలేశారు. డీ.జే.కూడా ఉన్నాడు, మధ్యమధ్యలో ఎంకరేజ్ చేస్తూ. ఉన్న ఏభై మంది డాన్స్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు, ఒకరినొకరు తగులుతూ, ఊగిపోతున్నారు. ఆడవాళ్ళు ఎవరో మగవాళ్ళు ఎవరో నేను గుర్తు పట్టలేకపోయాను. డ్రెస్ కోడ్ అందరిదీ, టీ షర్టు, పాంటు ఉంది. చీకటిలో వెతుక్కుంటూ, టేబుల్స్ వైపు వెళ్లడానికి నాకు ఒక పావు గంట పట్టింది. కూర్చుని ఆ మందలో నా కూతురు శైలజ ఎక్కడుందో గుర్తుపట్టడానికి ప్రయత్నించాను. నావల్ల కాలేదు.

మధ్యమధ్యలో కొంత మంది బార్ కౌంటర్ వద్దకు వెళ్ళి ఒకటి రెండు షాట్స్ లాగించి, మళ్లీ డాన్స్ లోకి దూరుతున్నారు. డీజే మరో కొత్త పాట మొదలు పెట్టాడు. ఏదో హిందీ లా ఉంది గాని, అర్థం కావడం లేదు. దగ్గరగా ఉన్న అమ్మాయిని, ‘ఇది ఏం పాట?’ అన్నాను.

“లాలీపాప్ ఆంటీ” అంది.

నా వాలకం చూస్తే మరి ఆంటీనే కదా! నేను వెర్రి మొహం వేశాను. ఆ అమ్మాయి కళ్ళెగరేస్తూ, “భోజ్‌పురీ” అంది క్లుప్తంగా.

ఈ తరం అమ్మాయిలకు అబ్బాయిలకంటే మేమే బెటర్ అనే కాన్ఫిడెన్స్ ఉందనిపిస్తోంది చూస్తూ ఉంటే.

నెమ్మదిగా మా హాల్‌కి వెళ్లాను. మా వాళ్ళంతా చుట్టుముట్టి “ఇంత సేపు చేసేవేమిటి?” అంటూ యాగీ చేశారు. అందరం, కుటుంబ పరిస్థితుల గురించి, పిల్లలు ఎవరెవరు ఎక్కడెక్కడ సెటిలయ్యారు? ఎంతమందికి పెళ్ళిళ్ళు అయాయి, ఎంతమందికి మనవలు, అంటూ లెక్కలు వేసుకున్నాం. చూడవలసిన ప్రదేశాలు, దేశాలు గురించి మాట్లాడుకున్నాం. ఈసారి ఇలా కాదు ఏడాదికి మరో రెండు సారి కలుసుకోవాలి. ఏవైనా ట్రిప్స్ వేసుకోవాలి చిన్న చిన్న గ్రూపులుగా అయినా సరే అంటూ కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నాం. ఏమీ తారతమ్యాలు లేకుండా, హమ్మయ్య దొరికిందే చాలు, ఒకప్పటి స్నేహితులతో ఆనందంగా మంచి-చెడు రెండూ చెప్పుకోవచ్చు అన్నట్టుగా ఉంది పరిస్థితి.

బోలెడు కబుర్లు అయాక, భోజనం చేసి రూముకు వచ్చి, నేను పడుకున్నాను. వెంటనే నిద్రపోయాను. మా వాళ్ళు ఎవరెవరు ఎప్పుడు వచ్చి పడుకున్నారో నాకు తెలియదు.

పొద్దున్నే మా అమ్మాయి నిద్ర లేపుతుంటే మెలకువ వచ్చింది. లీలగా, శైలజ గొంతు వినబడుతోంది. “అమ్మా! లేవవే, టైం అవుతోంది.” అని.

నా చెల్లి సత్యవాణి వచ్చి,”మీ అమ్మ అలాగైతే లేవదు. ఉండు,” అని నా చెవి దగ్గర నోరు పెట్టి, “ఏయ్, కంచులక్ష్మీ!” అంది. నేను టక్కున లేచి కూర్చున్నాను.

మా చెల్లి దూరంగా వెళ్లి, ‘నేను చెప్పానా?’ అంది. శైలజ, శ్రీదేవి నవ్వుతూ చూస్తున్నారు. శైలజ నన్ను వెనకేసుకొస్తున్నట్టుగా, “ఏంటి పిన్ని? మరీ అన్యాయం. మా అమ్మని అలా అన్నావ్?” అంది గారంగా.

పాఠం చెప్పేటప్పుడు నా గొంతు ఖంగుమని ఉంటుందని నా స్టూడెంట్స్ పెట్టిన ముద్దుపేరు ‘కంచు లక్ష్మి’. వాణి కన్ను గీటుతూ, ఆ సంగతి చెప్పింది. వాళ్లంతా గ్రూపుగా నవ్వుతున్నారు. చిత్రం! అప్పుడే సుమారుగా తయారైపోయి ఉన్నారు.

“ఏంటబ్బా ఇంత నిద్ర పట్టింది”, అనుకుంటూ ‘మీ సంగతి తర్వాత చెప్తాను’ అని కుడి చేతి చూపుడు వేలుతో బెదిరిస్తూ, నేను బాత్ రూం లోకి పరిగెత్తాను.

నలుగురం మా కారులో దగ్గర్లోనే ఉన్న అంతర్వేదికి వెళ్ళాం. రిసార్ట్ నుంచి అరగంట ప్రయాణం. కొబ్బరి తోటల గుండా చాలా హాయిగా అనిపించింది. స్వామివారి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం మొదలు పెట్టాం.

***

స్వామివారి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం అయ్యాం. నాకు నిన్న ఉన్న హుషారు ఇవాళ లేదు. దానికి కారణం, నేను ఎంజాయ్ చేయలేక పోవడమా? ఈ మిగతా ముగ్గురు ఎక్కువ ఎంజాయ్ చేశారని ఈర్ష్యా? చూసిన స్పష్టాస్పష్టమైన విశేషాలన్నీ నా మీద ఏదో ప్రభావం చూపిస్తున్నట్టు ఉంది, గానీ స్పష్టంగా మటుకు తెలియడం లేదు. కొబ్బరి తోటల మధ్య నుంచి, పిల్లకాలువకు చేరువగా వస్తున్నాం. అక్కడక్కడా ఇళ్లు ఉన్నాయి. ఒక ఇంటి దగ్గర జనం గుమిగూడి ఉన్నారు. “మెల్లగా పోనీయ్ రాజేష్”అన్నాన్నేను.

“డ్రైవర్ కారు ఆపు” అంది సత్య. వాళ్ళు ముగ్గురూ కలిసి, అక్కడికి వెళ్లారు. కాసేపు చూసి, నేను కూడా దిగి అక్కడికి వెళ్లాను. ప్రహరీ లేని ఒక చిన్న ఇల్లు. నాలుగైదు కొబ్బరి చెట్ల వెనకాల ఉంది. ఒక మంచం మీద 20- 25 సంవత్సరాల పిల్ల పురిటి నొప్పులతో ఉంది.

108కి ఫోన్ చేశామని అన్నారు ఎవరో. నేను శైలజ దగ్గరికి వెళ్లి, దాని చెవిలో “రావే, పోదాం” అన్నాను. అది నా వైపు సీరియస్ గా చూసి, “రెండో కాన్పు. హెడ్ ఆన్ పెరీనియం. నువ్వు వెళ్ళి, కార్లో కూర్చో!” అంది.

మాట్లాడకుండా ఓ పక్కగా నిలబడి పోయాను. పరిస్థితులు వాళ్ళ కంట్రోల్ లోకి తీసుకున్నారు. మగవాళ్ళని దూరంగా పంపించేసి చుట్టూ దుప్పటి కట్టేశారు. ఒకరిని దగ్గరలో ఉన్న సబ్ సెంటర్‌కి పంపించారు. ఉత్త చేతులతోనే డెలివరీ కండక్ట్ చేసారు. ఎవరిదో చేతి కట్టుకున్న కాషాయరంగు తాడు ఒకటి తీసి బొడ్డుతాడు గా ముడి వేశారు. సత్యవాణి, చిన్న కత్తెర తన సంచీ లోంచి బయటికి తీసి, జాగ్రత్తగా తన దగ్గరున్న ఫేస్ వైప్‌తో క్లీన్ చేసి, రెండు ముడుల మధ్యనున్న, బొడ్డును కత్తిరించింది. కాసేపటికి మాయ కూడా బయటికి వచ్చేసింది. ఆ సరికి సబ్ సెంటర్ నుంచి ఎ.ఎన్. ఎమ్. వచ్చింది. సంచీలోంచి తీసి, గబగబా రెండు ఇంజక్షన్లు పొడిచారు. తరువాత ఏం చేయాలో ఆమెకు సూచనలు, సలహాలు ఇచ్చారు.

పక్కనే ఉన్న పిల్ల కాలువలోకి మెట్లు ఉన్నాయి. అవి నీళ్లు తెచ్చుకోవడానికి వాడతారు. మెట్ల మీదుగా వెళ్లి ప్రవహిస్తున్న నీళ్లలో, అక్కడ వారు ఇచ్చిన సోపుతో కాళ్లు, చేతులు కడిగేసుకుని వచ్చారు, శైలజ, శ్రీదేవి, సత్యవాణి, నవ్వులు కేరింతల మధ్య.

ఆ కుటుంబం వారి దగ్గర సెలవు తీసుకుని బయలుదేరారు. వాళ్ళని అనుసరించాను నేను. ఉదయం నుంచి నాలో ఉన్న నెగిటివ్ ఫీలింగ్స్ అన్నీ మాయమైపోయాయి. నలిగిన చీరలతో, అలసిన మొహాలతో, మూడు- నాలుగు నీటి బిందువులు ముఖం మీద, కుంకుమ బొట్టు నుదుటిన, తల మీద అక్షతలుతో ఉన్న శ్రీదేవి, శైలజ, సత్యవాణి ల వైపు చూస్తూ ఉండిపోయాను మురిపంగా.

రీయూనియన్ హుషారు ముగిసి నలుగురం కాకినాడ వచ్చేసాం. రాత్రి పడుకునేటప్పుడు, గీతామాధురి గారి మాటలు గుర్తుకొచ్చాయి.

దేశ కాల మాన పరిస్థితులను అర్థం చేసుకుని స్త్రీ తనను తాను నూతనంగా ఆవిష్కరించుకుంటూ ఉంటుంది. నిజమే! తరాల్లో అంతరం ఉన్నా, వేష భాషలు, వ్యవహార శైలిలో తేడాలున్నా, సమాజానికి తమ అవసరం వచ్చినప్పుడు వాళ్లు స్పందించిన తీరు నాకు అంతులేని ఆనందాన్ని ఇచ్చింది.

శభాష్! వనితా! ఈ సమాజంలో నీ స్థానాన్ని ఎవరూ తగ్గించలేరు. ఎప్పటికీ పదిలమే అనుకున్నా… గుండెల మీద చెయ్యి వేసుకుని “ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్” అనుకుంటూ!

Exit mobile version