Site icon Sanchika

అమాయకులు

[dropcap]గా[/dropcap]డి తప్పిన బతుకులు
నోట చప్పటి మెతుకులు
బట్టల నిండా‌ అతుకులు
దారి అంతా గతుకులు

వానాకాలం చదువులు
బొటాబొటీ కొలువులు
గతమంతా గాయాలు
భవిత చూస్తే భయాలు

ఎవరో వస్తారన్న‌ ఆశ
ఏదో చేస్తారన్న అపేక్ష
ఆర్థిక స్థితి హార్దికంగా లేదు
ఎదురుచూపుకి అంతం లేదు

దిగువ తరగతిలో దిగబడిపోయి
లేమి ఊబిలో కూరుకుపోయి
ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అవుతూ
ఎల్లకాలమూ ఈ జీవనమే గడిపేస్తారు

అమాయకులు వీరు ఆశాజీవులు
మబ్బుల వంక చూస్తూ ఉంటారు
ఎప్పటికైనా వాన పడదా అనుకుంటూ
అవి మార్గశిర మేఘాలని
వారి మార్గం వారే చూడాలని
తెలుసుకోలేని అమాయకులు

Exit mobile version