అమలిన భావన

1
3

[మాయా ఏంజిలో రచించిన Impeccable Conception అనే కవితని అనువదించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు ప్రసిద్ధ కవయిత్రి హిమజ గారు.]

~

[dropcap]ఈ[/dropcap] మధ్య నేనో కవయిత్రిని కలిసాను

ఎగిరే పక్షులకు రంగులేసేట్టు
పదాలకు గుసగుసలు నేర్పేట్టు
ప్రేమికుల నడుమ సంకోచం లాంటి
స్ఫూర్తినిచ్చే గీతికలాంటి
ఒక కవయిత్రిని నేనీ మధ్య కలిసాను

రాలే పండుటాకు ఆమెను కదిలిస్తుంది
వసివాడి ఎండిపోతున్న గులాబీ
ఆమెతో కవిత రాయించుకుంటుంది
రాత్రింబవళ్ళు బహుమతులు తెచ్చిపెట్టే
అందమైన వచనం రాస్తుందామె

ఎదురైన ప్రతి రెండు మగ కాళ్ళ మధ్య
నిగూఢమైన అర్థాలేవో కనిపిస్తుంటే
పరుగున ఇల్లు చేరుకుని
ఒంటరిగా కూర్చుని
ప్రేమకథలేవో
రాసుకోసాగింది ఆమె!!

~

మూలం: మాయా ఏంజిలో

అనువాదం: హిమజ


‘Maya Angelou’ అమెరికన్ కవయిత్రి, సామాజిక కార్యకర్త, మానవ హక్కులకై పని చేసారు. ఆనాటి అమెరికన్ సమాజం, ఆఫ్రికన్ అమెరికన్ వేశ్యా వాటికల పట్ల చూపిన వివక్ష, నిరసన, ఏహ్య భావాన్ని నిలదీస్తూ, ధిక్కరిస్తూ, బాధితుల పక్షం వహించి Maya Angelou అనేక కవిత్వం వెలువరించారు.

ఏప్రిల్ 4, 1928 న Marguerite Annie Johnson గా జన్మించిన ఆమె, తన సోదరుడు ముద్దుగా పిలిచే ‘మాయ’ అనే పేరుకు ‘ఏంజిలో’ ని జత చేసి ‘మాయా ఏంజిలో’గా ప్రపంచ ప్రసిద్ధ రచయిత్రిగా రూపొందారు.

 

బాల్యంలో తాను అత్యాచారానికి గురైన విషయం, పేదరికం కారణంగా కొంతకాలం సెక్స్ వర్కర్‍గా పని  చేసిన విషయం నిస్సంకోచంగా, నిర్భీతిగా తన రచనల ద్వారా తెలిపిన మాయా ఏంజిలో రచనలు – దార్శనిక ఆత్మకథా శైలిలో ప్రత్యేకంగా నిలుస్తాయి. ఈమె కవిత్వం సంభాషణా సరళిలో ఉండటం విశేషం.

రచయిత్రి, కవయిత్రి, నర్తకి, గాయని, ఉద్యమకారిణి, కథకురాలు, దర్శకురాలు ప్రతిభావంతమైన పాత్ర పోషించిన మాయా 2014లో మరణించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here