[box type=’note’ fontsize=’16’] ప్రస్తుతకాలంలో అంబేద్కర్ మళ్ళీ జన్మిస్తే ఏం జరుగుతుందో తన అభిప్రాయాలను ఈ వ్యాసంలో వివరిస్తున్నారు శ్రీ దుర్గమ్ భైతి. [/box]
[dropcap]ప్[/dropcap]రపంచములోనే 19వ శతాబ్దపు అత్యంత ప్రతిభావంతులుగా ప్రఖ్యాతి గాంచిన అంబేద్కర్ మన దేశంలో జన్మించడం భారతీయులందరు గర్వించదగిన మహత్తర సంఘటన. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగమును రచించిన అంబేద్కర్ జీవితాంతం బడుగు, బలహీన వర్గాల శ్రేయస్సు కొరకు రాజీ లేని పోరాటం చేసిన భరత జాతి ఆణిముత్యం. కోట్లాది ప్రజల ఇలవేల్పుగా చెరగని ముద్రవేసిన భారతరత్న అంబేద్కర్ మళ్ళీ జన్మిస్తే…
నిజంగా ఎంత బాగుంటుంది! మహానీయులు ఒక్కసారే జన్మిస్తారు. కాని వారు చూపిన మార్గం, వారు చేసిన కృషి మనలో వారిని సజీవంగా నిలిచేలా చేస్తుంది. భౌతికంగా లేకున్నను వారి ఆశయం ఎల్లప్పుడూ అమరత్వాన్ని కలిగి ఉంటుంది. అంబేద్కర్ మళ్ళీ జన్మించిన సందర్భంలో వారు అత్యున్నత పదవి చేపట్టడం జరుగుతుంది. ఆనాడు ప్రజలలో చైతన్యం లేకపోవడంతో వారి మార్గదర్శకాలు చేరలేదు. స్వంత పార్టీ వారు సహకారాన్ని అందించలేదు, ఆశించిన స్థాయిలో ప్రసార మాధ్యమాలు చేయూత నివ్వలేదు. ఇప్పడు ప్రజల్లో అక్షర జ్ఞానం పెరిగింది.
స్త్రీల సమానత్వం కొరకు అంబేద్కర్ పోరాడే అవకాశం ఉండవచ్చు. చట్ట సభల్లో స్త్రీల ప్రాతినిధ్యం పెరిగేలా అఖిలపక్షాలను ఒప్పించి చట్టాన్ని తేవడానికి కృషి చేయవచ్చు. ప్రస్తుత సమాజానికి అనుగుణంగా రాజ్యాంగ సవరణలు చేయవచ్చు. దేశంలో పూర్తిగా అంటరానితనం నిర్మూలనకు కృషి చేయవచ్చును. ప్రజలకు ఉచిత విద్య, ఉచిత వైద్య సదుపాయాలు ప్రభుత్వం కలిగించేలా చట్టం చేయవచ్చు.
స్త్రీలు, బాలికలపై దాడులు చేసేవారికి సత్వరమే శిక్ష పడేలా న్యాయశాస్త్రంను పునఃసమీక్షించవచ్చు. పల్లెటూర్లను, అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడానికి ప్రత్యేక ప్రణాళికలు రచించవచ్చు. రైతుల సంక్షేమమే దేశ సంక్షేమమని వారి కోసం ప్రత్యేక ‘వ్యవసాయ బడ్జెట్’ను ప్రవేశపెట్టవచ్చు. రాజకీయ నాయకులు ప్రజలకు జవాబుదారిగా ఉండడం కోసం ఎప్పుడైనా ప్రజాభిప్రాయ సేకరణ జరిపి వారిని తొలగించే హక్కు ప్రజలకే ఇచ్చే అవకాశం కలిగించవచ్చు.
అందరికి సమాన విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అదేశించవచ్చు. తాము ఎన్నుకున్న నాయకులు పార్టీ మారకుండా కఠిన నియమాలను సృష్టించవచ్చు. అవినీతి రూపుమాపేందుకు నిరంతరం చర్యలు చేపట్టవచ్చు. సామాన్యులు సైతం అత్యున్నత పదవులు పొందేలా నూతన మార్గదర్శకాలు రూపొందించవచ్చు. మొత్తానికి మన దేశాన్ని ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనదిగా తయారు చేయవచ్చు.
కుల, మత, జాతి, ప్రాంతాలకు అతీతంగా ఆరాధ్య నాయకుడిగా ప్రజల మన్ననలు పొందిన అంబేద్కర్ ఆలోచనా సరళి భావితరాలకు అనుసరణీయం. అలాంటి నాయకులు అవనిపై అరుదుగా జన్మిస్తారు. తాను జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు తన దేశం కూడా ఎదుర్కోవద్దనే తపనతో అనుక్షణం, సమస్యలను పరిష్కరించడానికి అంబేద్కర్ చేసిన ప్రయత్నం అద్వితీయమైనది. ఈ భారతావనిపై ఎందరో మహా నాయకులు, మేధావులు, సంఘ సంస్కర్తలు జన్మించారు, భవిష్యత్తులో జన్మించనూ వచ్చు. అంబేద్కర్ లాంటి జాతి ఆణి ముత్యం ఈ నేలమీద మళ్ళీ ప్రకాశిస్తుందని ఆశించడం అసాధారణ విషయం.