అంబేద్కర్ మళ్లీ జన్మిస్తే? – సామల కిరణ్

0
2

[box type=’note’ fontsize=’16’] ప్రస్తుతకాలంలో అంబేద్కర్ మళ్ళీ జన్మిస్తే ఏం జరుగుతుందో తన అభిప్రాయాలను ఈ వ్యాసంలో వివరిస్తున్నారు కరీంనగర్‌లో తెలుగు అధ్యాపకులుగా పని చేస్తున్న శ్రీ సామల కిరణ్.[/box]

[dropcap]”ఎ[/dropcap]వడు జన్మించెనని లోకమెంచు
అట్టి జన్మ జన్మ- తక్కిన జన్మ జన్మకాదు”

అంటాడు ఒక కవి. నిరుపేద కుటుంబంలో 14వ సంతానంగా పుట్టి అవమానాల మధ్య పెరిగి, ప్రపంచవ్యాప్తంగా గౌరవించే స్థాయికి ఎదిగిన అంబేద్కర్ కారణజన్ముడు కాక మరి ఏమవుతాడు? అంబేద్కర్ జీవితం త్యాగమయం, కర్మమయం, తపోమయం. ప్రతి అడుగు ఆదర్శనీయం, అనుసరణీయం. 20వ శతాబ్దపు మహా మేధావి, కరుణా హృదయుడు అంబేద్కర్ మళ్ళీ జన్మిస్తే ఏం ఆలోచించేవాడు? ఏం చెప్పేవాడు? ఏం చేసేవాడు? ఆలోచన, మాట, పని ఒక్కటై త్రికరణశుద్ధిగా చేసే వాళ్లే మహనీయులు కదా! అలాంటి  మహనీయుడు అంబేద్కర్ మళ్ళీ జన్మిస్తే ఎలా ఉంటుందో? అంబేద్కర్ అంతరంగంలోకి తొంగిచూసి తెలుసుకుందాం.

త్రిశరణ సూత్రాలు ఏమవుతున్నాయి?

అంబేద్కర్ సమాజాన్ని జాగృతం చేయడానికి “చదివించు-సమీకరించు-సంఘటించు” అను 3 సూత్రాలు ఇచ్చాడు. ఇందులో ప్రథమ ప్రాధాన్యత విద్య సముపార్జనకే. ప్రతి పౌరునికి విద్య అందుబాటులో ఉన్నప్పుడే సమాజాభివృద్ధి సాధ్యమని ప్రత్యక్ష జీవితం ద్వారా నిరూపించాడు. అంబేద్కర్ మళ్ళీ పుడితే విద్య సరళీకృతంగా మారి, అందరికీ చేరువ అయినందుకు సంతోషిస్తాడు. తన ప్రేరణతో ఉన్నత చదువులు చదివిన ఎంతోమందిని చూసి సంబరపడి పోయేవాడు. విజ్ఞానవంతులై సమాజానికి సేవలు అందిస్తున్న పౌరుల్ని, శాస్త్రవేత్తలని, మేధావులని, సామాజికవేత్తలని చూసి గర్వించేవాడు.

అంబేద్కర్ మళ్ళీ పుడితే ప్రభుత్వ వనరులను వినియోగించుకుంటూ విశ్వవిద్యాలయాలలో తిష్టవేసి ‘దేశాన్ని ముక్కలు చేస్తాం’ అనే దేశ ద్రోహుల మాటలు విని గుండె బరువెక్కిపోయేది. రిజర్వేషన్లు పొంది అభ్యుదయం సాధించాక, మరల మరల-తరతరాలు రిజర్వేషన్ల లబ్దిని పొందుతున్నవారిని చూసి, కింది వారికి అవకాశం ఇవ్వకుండా అణగతొక్కుతున్నవారిని చూసి మథనపడేవారు.

రెండవ సూత్రమైన సమీకరించు సూత్రాన్ని అనుసరించి జీవిత కాలమంతా తనవారిని తన వైపుకి సమీకరించుకోవడంలో అంబేద్కర్ విజయం సాధించాడు. ఆయన మళ్ళీ పుడితే తాను అందించిన ప్రణాళిక ప్రకారం బడుగు జనాలు ఒక్కటై ప్రశ్నించే తత్వం అలవర్చుకున్నందుకు ఆనందపడేవాడు. కులతత్వాన్ని ఎదుర్కొనేందుకు సామాజికంగా వచ్చిన చైతన్యం చూసి సంతోషపడేవాడు. అంబేద్కర్ మళ్ళీ పుడితే?- అంబేద్కర్ వారసులం అని కులం కుళ్ళులో మునిగితేలుతున్న సోదర జాతిని చూసి అసహ్యించుకునేవాడు. ఓట్ల కోసమే సమీకరించు సూత్రాన్ని వాడుకుంటున్న నాయకుల్ని చూసి ఏవగించుకుంటాడు.

మూడవ సూత్రమయిన సంఘటితం చేయటానికి ఆధారం స్వేచ్ఛ, సమానత్వ, సౌభ్రాతృత్వాలు. వీటి ఆధారంగా  5 లక్షల మంది అనుచరులతో దీక్షా భూమిలో బౌద్ధధర్మం స్వీకరించటమే అంబేద్కర్ సంఘటన కార్యానికి తొలి అడుగు. అంబేద్కర్ మళ్ళీ జన్మిస్తే బౌద్ధాన్ని తీసుకొని అహింస మార్గంలో పయనిస్తున్న వారిని చూసి సంతోషపడేవాడు. హిందూ సమాజంలో వస్తున్న మంచి పరిణామాల్ని చూసి ఆనందపడేవారు. అంబేద్కర్ మళ్ళీ పుడితే సంఘటనకు బదులు విఘటన మార్గంలో నడుస్తూ సమాజాన్ని చీల్చుతున్న వారిని చూసి బాధపడేవారు. అహింసకి బదులు మేము గొడ్డు కూర తింటాం, మా జోలికొస్తే కేసులు పెడతాం అంటూ  కులం పేరుతో రెచ్చగొడ్తున్న విద్యావంతుల్ని చూసి తలదించుకునేవాడు.
అంబేద్కర్ మళ్ళీ జన్మిస్తే ఎలా ఆలోచించేవాడో నా కవితా రూపంలో

బుద్ధదేవుడు పుట్టిన నేల
విలువలు దిగజారేనేలా?
నా అడుగు జాడలు
అనుసరిస్తుంది ఏడ?

అహింసని ఆరాధించమంటే
నా పేరు చెప్పుకుంటూ
అడ్డగోలుగా గొడ్డుకూర పండుగలు….
సత్యం పాలించమంటే
నా పేరు చెప్పుకుంటూ
దేశాన్ని ముక్కలు చేసే నినాదాలు….
ఎందుకు? ఎందుకు?
ఓట్ల కోసం….. పదవుల కోసం…….
భావప్రకటన ముసుగు తొడగిన
కొత్త కొత్త రాజకీయాలు అంబేద్కరిజమా??
కులాల పేరుతో సమాజం చీల్చటం అంబేద్కరిజమా??
ఓ భగవాన్ నీ అంతరంగం
నా అంతరంగం ఒక్కటే!
కానీ
నేటి వారసులకి స్వేచ్ఛ అంటే
ఇష్టమొచ్చినట్లు మాట్లాడటమే!?
నేటి వారసులకి సమానత్వం అంటే
కులం కుళ్ళుని రుద్దటమే!?
నేటి వారసులకి సంస్కరణ అంటే
సమాజాన్ని దూషించటమే!?
కళ్ళు మూసి ఆత్మని దర్శించిన ఓ బుద్ధదేవా
మీ ఉన్నత
జీవన విలువలతో
మూయకుండా తెరువకుండా
నిద్రిస్తున్నట్లు నటించే
కుహనావారసుల కళ్ళు తెరిపించవయ్యా…..
సమరసత జ్ఞానం సమాజానికి అందించవయ్యా…

అంబేద్కర్ మళ్ళీ జన్మిస్తే నేటి సంస్కరణవాదులని చూసి ఆశ్చర్యపోయేవాడు. సమాజంలో మార్పు కోరుకునేవారికి మొదట సమాజాన్ని ప్రేమించే గుణం ఉండాలి. అంబేద్కర్ తనకు ఎదురయిన అవమానాలకి ఎవ్వరినీ ద్వేషించలేదు, ఎవరిపైనా కక్ష పెంచుకోలేదు. ఎప్పుడూ విషం కక్కలేదు. సాటి మనుషుల్ని మానవులుగా చూడండి అని పిలుపునిచ్చాడు. కానీ నేడు సంస్కరణ పేరుతో సమాజం మీద ఎంతటి విషం కక్కుతున్నారో కళ్ళారా చూసి అంబేద్కర్ క్షోభ పడేవారు. ఎదుటివాళ్ళని తిట్టని తిట్లు లేకుండా జరుగుతున్న పోరాటాల్ని చూసి ముక్కున వేలేసుకునేవారేమో!

అంబేద్కర్ మళ్ళీ జన్మిస్తే

  • స్త్రీ స్వేచ్ఛ విషయంలో, అందులో ముస్లిం స్త్రీల తరతరాల బానిస బతుకుల ట్రిపుల్ తలాక్ పోయినందుకు సంతోషించేవారు.
  • కశ్మీర్ సమస్యకి శాశ్వత పరిష్కారానికి గుడిబండలా ఉన్న ఆర్టికల్ 370 రద్దయినందుకు ఆనందపడేవారు.
  • అయోధ్య రామ మందిర సమస్య సద్దుమనిగినందుకు సంబురపడేవారు.
  • కుల, మత, వర్గ, ప్రాంత, భాష, పార్టీలకి అతీతంగా ఒక్కటవుతున్న కొన్ని సందర్భాలైనా చూసి సంతోషించేవారు.

అంబేద్కర్ ఏం చెప్పేవాడు?

అంబేద్కర్ హిందూసాంఘిక వ్యవస్థ పునర్నిర్మాణం కోరుకున్నవాడు కాబట్టి. హిందుత్వంలో భాగం అయిన బౌద్ధమతాన్ని తీసుకునేలా చెప్పేవాడు. కులతత్వానికి ఆధారభూతమయిన కొందరి ఆధిపత్య ధోరణుల నుండి  హిందువులు విముక్తం కావాలని పిలుపునిచ్చేవాడు. వివిధ వ్యసనాలకి బానిసలుగా మారిన ప్రజల్ని విడిచిపెట్టండని చెప్పేవాడు. అంతర్గత శత్రువుల పట్ల జాగరూకులుగా ఉండాలని కోరేవాడు. సమానతా సిద్ధాంతాన్ని విస్తృత పరచే బోధలు అందించేవాడు.

అంబేద్కర్ ఏం చేసేవాడు?

  • భారతీయుణ్ణి అనే భావన గుండెలోతుల్లో నుంచి వచ్చేలా భారత్ మాతా కీ జయ్ అనే నినాదానికి కూడా చట్టం చేసేవాడు
  • నా దేవుడే అసలైన దేవుడు, గొప్ప దేవుడు అనే దురభిమానం పోగేట్టేందుకు చర్యలు చేపట్టేవాడు.
  • నా దేవుణ్ణి నమ్ముకుంటేనే మోక్షం, లేకుంటే నరకం అనే బోధనల నుండి సమాజాన్ని రక్షించేవాడు.
  • మత సామ్రాజ్యం విస్తరించాలనే మతబోధనలు చేయకుండా చట్టం చేసేవాడు.
  • స్థలాలు ఆక్రమించండి అని, గుంపులుగా తిరగండి అని, అమ్మాయిలని వలలో వేసుకోండి అనే శిక్షణల్ని నాశనం చేసే వ్యవస్థ తెచ్చేవాడు.
  • దేవుని నమ్మని వారికి భూమిపై స్థానం లేదు, వాళ్ళని చంపేయాలనే బోధనలు పోయేలా చర్యలు చేపట్టేవారు.
  • హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అని తేడా లేకుండా హలాల్ ఉన్నా,  లేకున్నా విందు భోజనాల్లో పాల్గొనేలా చేసేవారు.
  • ప్రార్థన ఆలయాల పైన దద్దరిల్లేటట్లు మైక్‌ల సౌండ్‌లు ఉండకుండా చేసేవాడు.
  • ప్రధాన రహదారులపైనే ఉన్న, అభివృద్ధికి అడ్డంగా ఉండే దేనినైనా తొలగించే చట్టాలు తెచ్చేవాడు.
  • దేశం మీద దండెత్తి వచ్చిన విదేశీయులందరిని, అన్ని మతాల వాళ్ళు శత్రువుగానే చూడాలనే భావాన్ని ప్రచారం చేసేవాడు.
  • దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహాపురుషులు అందరిని తమ దేశనాయకులు అందరు గౌరవించాలని నేర్పేవారు.
  • దేశంలోని అణువణువు, కణకణం ప్రతీది పవిత్రంగా అన్ని మతాల వాళ్ళు ఆరాధించాలని చెప్పేవారు.
  • దేశాన్ని కలిపి ఉంచే ప్రతి పనికి మతాలకు అతీతంగా చేసే నూతన చట్టాల రూప కల్పన చేసేవాడు.
  • వందేమాతరం, జన గణమన గీతాలు అన్ని ప్రార్థన ఆలయాల్లో పాడేలా చర్యలు చేపట్టేవారు.
  • జనవరి 26, ఆగష్టు 15 న అన్ని ప్రార్థనా ఆలయాల్లో జెండా ఆవిష్కరణ చేసే కొత్త చట్టం చేసేవారు.
  • మానవ హక్కుల సంఘాలు అందరి కోసం పని చేసే విధంగా మార్పు చేసేవారు.
  • రాజ్యాంగ ప్రవేశిక అన్ని ప్రార్థన ఆలయాల్లో అంటించి, నేర్పించెట్లు చూసేవారు.

అంబేద్కర్ మళ్ళీ పుడితే- ఊరూరా తన విగ్రహాలు చూసి భయపడేవాడేమో!? నా విగ్రహాలు అయితే పెట్టారు, కాని నా జీవితాన్ని సరిగా అర్ధం చేసుకోలేదెవరు? అని ముక్కున వేలేసుకునేవారేమో అన్పిస్తుంది. అంబేద్కర్ ఉత్సవ విగ్రహం కాదు, కుహనా రాజకీయ నాయకుడు కాదు అంతకంటే కాదు. అంబేద్కర్ ఓ జాతీయ నాయకుడు, ఆయన ఓ ప్రేరణాశ్రోతస్సు, ఆయన ఓ స్ఫూర్తి కణం.  అందుకే అంబేద్కర్‌ని అర్థం చేసుకుందాం. ఆయన అంతరంగాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం… అంబేద్కర్ కొందరివాడు కాదు, ఆయన అందరి వాడు. అందుకే నా అందరివాడు కవితతో ముగిద్దాం….

అంతరాల భారత సౌధానికి
సమరసత సోపానాలు నిర్మింపగ
హిందూజాతికి అభినవస్మృతికర్తవై
అందించిన నీ ఆదర్శం
అనుసరణీయం అంబేడ్కరా…..

అంటరానితనం పేరిట
బడిలో చివరన గుడికి దూరాన
అగ్రవర్ణపెద్దల అవహేళనలు
అవమానాలు నీవు సహించి
హిందుత్వ కలంకమును కడిగివేసిన
సంఘసంస్కర్త నీవయ్యా……

ఉన్నత విద్యలు ఎన్నో చదివి
దేశభక్తిని మెండుగ కలిగి
పోరాటం పునర్మిర్మాణం ఆయుధాలుగా
స్వేచ్చా స్వతంత్ర్యాల సాధనకై
భారతజాతిలో జీవం నింపిన
భారతరత్నవు నీవయ్యా……

దళిత జనోద్ధరణ పేరిట
విచ్చిన్నం తగదని సమైక్యతే లక్ష్యమని
కులరహిత సమాజ నిర్మాణముకై
సమరసత సమానత్వ సాధనకై
జాతి ఏకతకు రాజ్యాంగం అందించిన
సంఘటనా శీలి నీవయ్యా…….

కులం పేరుతో కుట్రలు పన్ని
నీ వారసులమంటూ ఈనాడు
అందరి నిన్ను కొందరికి పరిమితం చేసి
ఆడుతున్నారు కుటిల రాజకీయాలు
నిష్కల్మష నీ జీవిత ఆదర్శాలతో
కళ్ళు తెరిపించవయ్యా మా అంబేడ్కరా…..

నీవు కన్న కలల రూపం
కార్యదీక్షగా కొనసాగిస్తాం
సమరసభారతం మా ధ్యేయం
స్వేచ్ఛసాధన మా లక్ష్యం
అందుకొనుము శ్రద్ధాంజలి అందరి అంబేడ్కరా..
అమరుడవు నీవయ్యా బాబాసాహెబ్ అంబేడ్కరా……

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here