Site icon Sanchika

అమెరికా.. కొన్ని నెమలీకలు!-1

[ఇటీవల అమెరికాలో పర్యటించి, ఆ యాత్రానుభూతులను పాఠకులతో పంచుకుంటున్నారు జె. శ్యామల]

మనోహరం.. మౌంట్ సోలిడాడ్

[dropcap]వృ[/dropcap]క్షాలు, పర్వతాలు, లోయలు, నదులు, సముద్రాలు, గుట్టలు, పుట్టలు, నింగి, నేల.. ఓహ్! ఎంత అద్భుత ప్రకృతి. పక్షులు, జంతువులు.. మళ్లీ వాటిలో భూచరాలు, జలచరాలు.. ఉభయ చరాలు.. కీటకాలు.. ఎన్నెన్నో జీవరాశులు. పగలు, రాత్రి సమయ భేదాలలో వైవిధ్య సౌందర్యంతో అలరారే ప్రకృతిని చూసి తరించాలంటే ఓ జీవితకాలం చాలదు. అందాల లోకంలో ఆగని ప్రయాణం చేస్తూ, ఆనందానుభూతుల్ని సొంతం చేసుకోవాలని ఎంతగా ఉన్నా అనేక పరిమితులతో కూడిన ఈ జీవితం అందుకు అనుమతించదు. అయితే ఇటీవల యు.ఎస్. ప్రయాణంతో నా కోరిక కాసిం(సం)త నెరవేరింది. అదే పనిగా గురుతుకొచ్చే ఆ కొద్ది అనుభవాలను, అనుభూతులను అక్షరీకరించి ‘సంచిక’ ద్వారా మీకు పంచుతున్నాను.

శాండియేగొ (దక్షిణ కాలిఫోర్నియా) వచ్చామంటే పసిఫిక్‌ను పలుకరించకుండా ఎలా? కానీ మా అమ్మాయి దీప తన ఉద్యోగ పని ఒత్తిడిలో ఉంది. “క్రిస్మస్ సెలవుల్లో లాస్ వెగాస్, గ్రాండ్ కెన్యన్ వెళదాం. ఈలోపు వారాంతాల్లో ఊళ్లోవి, దగ్గరి ప్రాంతాల్లో ఉన్నవి చూపిస్తాను” అంటూ వారాంతంలో వెళ్లడానికి శాండియేగొ లోనే ఉన్న సందర్శన స్థలాలను పరిశీలించింది. అందులో నేను కిందటిసారి వచ్చినప్పుడు చూసినవి చాలానే ఉన్నాయి. చివరకు ‘మౌంట్ సోలిడాడ్’ చూద్దామని నిర్ణయించింది. అదే విషయాన్ని ఇంటి యజమానురాలు.. అంతకు మించి గొప్ప స్నేహిత అయిన ‘మార్సెల్లా’తో చెప్పింది. విన్న వెంటనే ఆమె “నా కారులో పోదాం.. నేను తీసుకువెళతాను” అంది. అలా మేం ఓ శనివారం, సాయం సమయం అవుతుండగా ముగ్గురం బయల్దేరాం. మార్సెల్లా చాలా సరదా మనిషి. ఆమె ఎక్కడుంటే అక్కడ గలగలలే. నన్ను చూడగానే నా చీరెను ఎంతగానో మెచ్చుకుంది. మా ఇద్దరి కమ్యూనికేషన్‌కు ఇంగ్లీష్ యాక్సెంట్ కాస్తంత అవరోధం. కొన్నిసార్లు అర్థం కాకపోతే వారధి మా అమ్మాయి ఉండనే ఉంది. మార్సెల్లా డ్రైవింగ్‌లో చాలా నేర్పరి. అందునా అక్కడి ప్రతి అంగుళం ఆమెకు పరిచయమే కావడంతో సునాయాసంగా కబుర్లలోనే కొద్ది సమయంలోనే గమ్యం.. ‘మౌంట్ సోలిడాడ్.. నేషనల్ వెటరన్స్ మెమోరియల్’ చేర్చింది.

ముందుగా, కొండమీది ఎదురుగా ఉన్న తెల్లని ఎత్తైన శిలువ తలెత్తి చూసేలా చేసింది. ఆ తర్వాత నడుస్తూ వివరాలు వింటూ..

మౌంట్ సోలిడాడ్ వద్ద రచయిత్రి, మార్సెల్లా

శాండియేగొ మొత్తానికి మౌంట్ సోలిడాడ్ ఎత్తైన ప్రాంతం. ఇక్కడ త్యాగధనులైన అమెరికన్ సైనిక వీరుల గౌరవార్థం ఏర్పరచిన ఒకే ఒక స్మారక చిహ్నం యిది. గతంలోని విప్లవాత్మక యుద్ధాలు, రెండు ప్రపంచ యుద్ధాలు, ఆ తర్వాత కాలంలో జరిగిన యుద్ధాలలో దేశం కోసం పోరాడి, ప్రాణాలొడ్డిన వారికి నివాళిగా అర్ధచంద్రాకారపు గ్రానైట్ గోడలను నిర్మించి, వాటిపై ఒక్కో శిలాఫలకం మీద ఒక్కో సైనిక వీరుని చిత్రం.. అతడి పేరు, సైన్యంలో నిర్వహించిన పదవి, పదవీ కాలం, అందించిన సేవలు, ఏ యుద్ధంలో అసువులు కోల్పోయింది.. వివరాలు చక్కగా పొందుపరిచి, దేశం కోసం ప్రాణాలర్పించిన సైనిక వీరుల మూర్తులు చిరకాలం అందరికీ గుర్తుండేలా చేశారు. మొదటి ఆరు గ్రానైట్ గోడలపై రెండో ప్రపంచ యుద్ద కాలం నాటి ఆర్మీ, నేవీ, మరీన్ కార్ప్స్, కోస్ట్ గార్డ్, ఎయిర్ ఫోర్స్ లకు చెందిన త్యాగమూర్తుల శిలా ఫలకాలు ఉన్నాయి. మరో అయిదు గ్రానైట్ గోడలకు మిలటరీ లోని అన్ని విభాగాలకు చెందిన వీర సైనికుల శిలాఫలకాలు ఉన్నాయి. అంతేకాకుండా అమెరికా ప్రెసిడెంట్లుగా పనిచేసిన ట్రుమన్, ఐసెన్ హోవర్, ఫోర్డ్, రీగన్ శిలా ఫలకాలు కూడా ఉన్నాయి.

కొండ పైభాగాన నెలకొల్పిన కాంక్రీట్ శిలువ పాతిక అడుగుల పొడవుతో సుదూరాలకు కనిపించేట్లు ఉంది. దాని చుట్టూ గేటు అమర్చినందున ఎవరూ దానిని తాకే వీలు లేదు. మౌంట్ సోలిడాడ్ పైవరకు చక్కని మెట్లున్నాయి. ఆవరణ ముందుభాగంలో పతాక స్తంభానికి కట్టిన పెద్ద అమెరికా జాతీయ పతాకం సమున్నతంగా ఎగురుతూ.. గాలికి రెపరెపలాడుతూ ఆకట్టుకుంటోంది. మామూలుగా అయితే అక్కడికి వచ్చే సందర్శకుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పేందుకు ఓ వ్యక్తి ఉంటారట. కానీ మేం వెళ్లిన సమయంలో ఆ వ్యక్తి కనపడలేదు. వెటరన్స్ డే, మెమోరియల్ డే సందర్భాల్లో ఇక్కడ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిసింది. మౌంట్ సోలిడాడ్ అసోసియేషన్ వారు అంకిత భావంతో, దాతల సహకారంతో దీనిని నిర్వహిస్తున్నారు.

పార్క్ వద్ద దీప, రచయిత్రి, మార్సె ల్లా

మౌంట్ సోలిడాడ్ చుట్టూ నేషనల్ పార్క్‌ను కూడా అభివృద్ధి చేశారు. పచ్చటి ప్రకృతి పర్యాటకులను చక్కగా సేద తీరుస్తోంది. నేషనల్ వెటరన్స్ మెమోరియల్ చూడడానికి ఎటువంటి ప్రవేశ రుసుము లేదు. నిత్యం టూరిస్ట్ బస్సులు వస్తూ ఉంటాయి. స్థానికులు కూడా పిక్నిక్‌కు వస్తుంటారు. మౌంట్ సోలిడాడ్ పైనుంచి సూర్యాస్తమయాన్ని తిలకించడం అపూర్వ అనుభూతినిస్తుంది.

సూర్యాస్తమయ సౌందర్యం

పైనుంచి చూస్తే పడమట పసిఫిక్ మహాసముద్రం, తూర్పున పర్వత శ్రేణులు, ఉత్తరాన తీరప్రాంత నగరం, దక్షిణాన శాండియేగొ డౌన్‌టౌన్ కనువిందు చేస్తాయి. సైకిలింగ్ చేసేవారు, హైకింగ్ చేసేవారు, ప్రకృతిని ఆస్వాదించే వారు, పార్కులోని బెంచీలపై కూర్చుని పుస్తక పఠనం చేసేవారు.. ఇలా వారి వారి అభిరుచులకు అనుగుణంగా ఆనందిస్తుంటారు. నలభై రెండు ఎకరాల మౌంట్ సోలిడాడ్ నేచురల్ పార్క్‌ను ‘లహోయా హైట్స్ పార్క్’ అని కూడా పిలుస్తారు. శాండియేగొకు లాండ్‌మార్క్‌గా పేర్కొనే ‘మౌంట్ సోలిడాడ్’ సందర్శకుల మనసుకు మంచి దోస్త్ అవుతుంది.

నేషనల్ వెటరన్స్ మెమోరియల్‌కు నెలవైన మౌంట్ సోలిడాడ్‌ను అమెరికన్ పౌరుల్లో, అమెరికన్ భావి తరాలలో కొండంతగా దేశభక్తిని పొంగించే కొండగా అభివర్ణించవచ్చు. మాతృదేశం కోసం అసువులు బాసిన.. అమరవీరులు ఎక్కడైనా.. ఎప్పుడైనా.. ఎవరికైనా ఆరాధ్యులే.. అనుకుంటూ సూర్యాస్తమయ సమయం ఆసన్నమైందని, కొద్ది దూరంలోని బీచ్‌కు వెళ్లాం. అక్కడి సిమెంట్ బెంచ్‌పై కూర్చుని క్రమంగా కనుమరుగవుతూ, కనువిందు చేసే సూర్యబింబాన్ని అవలోకించడం అపూర్వానుభూతి. చూస్తుండగానే, చూపులనుండి తప్పించుకున్న సూర్యుడు.. ఆ తర్వాత అక్కడినుంచి కదిలి కారెక్కాం.

లహోయా బీచ్ వద్ద

కొద్ది సేపటికే ‘లహోయా బీచ్’ .. చూడగానే మనసు ‘అహో’ అంది. లహోయా స్పెల్లింగ్ చూసి మనం లజొల్ల అని చదువుతాం. కానీ అది స్పానిష్ అని, దాని లహోయా అనాలని, అలాంటి మరికొన్ని పదాలను కూడా నా కిందటిసారి సందర్శనలోనే చెప్పింది మా అమ్మాయి. పసిఫిక్‌ను చూడగానే నాలో పాత నేస్తాన్ని చూసిన ఆనందానుభూతి. అలా అని నా మాతృభూమి భారత్‌లో సముద్రాలను చూడలేదా అంటే, చూశాను. చీరాల, విశాఖ, చెన్నై, ముంబై, గోవా సముద్ర తీరాలను సందర్శించాను. కానీ పసిఫిక్‌ను చూసినంత విస్తారంగా చూడలేదు. ఎంతసేపు చూసినా తనివి తీరని పసిఫిక్ సౌందర్యం.. కొంతసేపు హోరు హోరుమంటూ పోట్లాడుతూ, అంతలోనే అల్లలల్లరిగా అలలతో ఎగసిపడుతూ, మున్ముందుకు తోసుకు వస్తూ, ఒడ్డున ఉన్న వారి పాదాలను అభిషేకించి మరీ కుశల ప్రశ్నలు వేస్తూ.. ఆత్మీయత గుమ్మరించి.. మెల్లగా వెనుతిరుగుతుంది. అంతలోనే ఏం గురుతుకొస్తుందో ఏమో ఉవ్వెత్తున లేచి ఉరుకులు, పరుగులతో మళ్లీ దరిని చేరుతూ అలరిస్తుంది. అలుపు సొలుపు లేని ఆరాట, పోరాటాల ప్రతీక. ముందుకు నడిచి నీళ్లలో నిలుచున్నా, అల దూసుకు వస్తుంటే.. కాళ్లను ఇసుకలో బలంగా నొక్కిపడుతూ.. ఎదుట కడలి తరంగం.. మదిలో ఆనంద తరంగం. అల కబడ్డీ వీరుడిలా వచ్చి వెళ్తుంటే ఎంత బాగుందో.. అలా ఎంత సేపు ఉన్నానో.. మా దీప ఇక చాలు అంటుంటే కదిలి చీరెకంటిన ఇసుకను దులుపుకుంటూ, మరలి, మరలి చూస్తూ అడుగులు వేస్తూ అలలకు వీడ్కోలు చెప్పి కారెక్కాను. మళ్లీ కొద్ది దూరంలో మరో బీచ్ పాయింట్‌కు వెళ్లాము. చీకటి చుట్టేసిన సమయం.. చల్లగా.. అందునా సముద్రం ఒడ్డున.. ఇక్కడ సముద్రం కాసింత శాంత గంభీరంగా ఉంది. అయినా ఆ నిశ్శబ్దంలో నీటి గలగలలు మనసుకు మంజులనాదంలా సోకాయి.

చందమామ వెలుగుల్లో..

పైకి చూస్తే నయన మనోహరంగా చందమామ.. చల్ల గాలి.. దూరంగా సర్ఫింగ్ ముగించి వెళ్తున్న యువకులు. కొద్దిసేపు అక్కడినుంచి మెట్లు ఎక్కితే కారు పార్క్ చేసిన చోటుకి చేరుకుంటాం. అటు, ఇటు గుబురుగా చెట్లు. ఓ వైపు అక్కడ ఎవరు ఉంచారో కానీ ఓ తెల్లని అస్థిపంజరం బొమ్మ. హాలోవీన్ రోజుల్లో గబుక్కున చూసేవారు భయపడతారన్న చిలిపి ఊహతో అన్ని ప్రదేశాల్లో ఇలాంటివి ఉంచడం అక్కడ మామూలే. నవ్వుకుంటూ ముగ్గురం ముందుకు కదిలి ఇంటిదారి పట్టాం.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version