అమెరికా.. కొన్ని నెమలీకలు!-3

5
2

[ఇటీవల అమెరికాలో పర్యటించి, ఆ యాత్రానుభూతులను పాఠకులతో పంచుకుంటున్నారు జె. శ్యామల]

రైలెక్కి లాస్ ఆన్జిలిస్‌కి..

[dropcap]అ[/dropcap]మెరికాలో రైళ్లు ఎలా ఉంటాయో, రైలు ప్రయాణం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని నా కోరిక. మా అమ్మాయి దీపతో అదే చెప్పాను. ‘అయితే ఎల్.ఎ. (లాస్ ఆన్జిలిస్) కి వెళ్దాం’ అంది. చాలా మంది ‘లాస్ ఏంజిల్స్’ అని రాస్తుంటారు. కానీ అది తప్పని, లాస్ ఆన్జిలిస్ అనటం సరైనదని తెలుసుకున్నాను. వారాంతంలో వెళ్దామని ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసింది. కానీ, మధ్యలో కొంత మేర ట్రాక్ బాగు చేస్తున్నారట, అందుకని మధ్యలో బస్ ప్రయాణం కూడా చేయాల్సి ఉంటుందని చెప్పింది. అయితే ఆ బస్ ఏర్పాటు రైల్వే వారిదే. మనం బస్సుకు వేరుగా డబ్బు చెల్లించనక్కర్లేదు. శాండియేగొ నుంచి ఓషన్ సైడ్ వరకు రైల్లో, అక్కడినుంచి ఇర్వైన్ వరకు బస్సు. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్లీ రైలు.

పసిఫిక్ సర్ఫ్ లైనర్ ట్రెయిన్ ఉదయం శాండియేగొలో 6.23 కు బయలుదేరుతుంది. పొద్దున్నే లేచి తయారై క్యాబ్‌లో డౌన్‌టౌన్ మధ్యలో ఉన్న ‘శాంటా ఫే డిపో’ ( రైల్వే స్టేషన్ పేరు) చేరుకున్నాం. స్టేషన్ వైపు దీర్ఘంగా చూశాను.

శాంటా ఫే డిపో

టైల్స్‌తో కూడిన రెండు పెద్ద డోమ్ లతో రాజసం ఉట్టిపడుతూ ఉంది. దీన్ని 1915లో నిర్మించారట. రైల్వే స్టేషన్ ఎంతో పరిశుభ్రంగా ఉంది. జనం కూడా పెద్దగా లేరు. ఎందుకంటే అక్కడ ఎక్కువగా వాడే ప్రయాణ సాధనాలు కారు, విమానాలే. వెయిటింగ్ హాల్లో చక్కటి చెక్క సోఫాలున్నాయి. రైలు వచ్చేవరకు విశ్రాంతిగా, హాయిగా కూర్చోవచ్చు. దీప నా కోసం ఫోటోలు తీసింది.

కొద్ది సేపటికే అంటే కరెక్ట్ సమయానికే రైలు వచ్చింది. రైలెక్కి చూశాను.. ఆశ్చర్యం.. అది డబుల్ డెక్కర్ రైలు. హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సులు ఎక్కిన అనుభవం ఉంది. కానీ డబుల్ డెక్కర్ రైలు గురించి తెలియదు. కింద సీట్లలో ప్రయాణికులు కూర్చున్నారు. మేం పైకి వెళ్లి కూర్చున్నాం. వికలాంగులకు సీటు రిజర్వేషన్ ఉంది. మిగిలిన సీట్లలో ఎవరైనా, ఎక్కడైనా కూర్చోవచ్చు. నిలబడటం అనేది లేనే లేదు. అక్కడ కూడా రైలు ప్రయాణానికి టికెట్ ఖరీదులో సీనియర్ సిటిజన్‌కు కొంత రాయితీ ఉంది. విదేశీయులైతే టి.సి. వచ్చినప్పుడు సీనియర్ సిటిజన్ అనేందుకు ప్రూఫ్‌గా పాస్‌పోర్ట్ చూపించవలసి ఉంటుంది. టి.సి. వచ్చి టికెట్ చెక్ చేశాక సీటు పైన వారి గుర్తు కోసం ఒక స్లిప్ గుచ్చి వెళతాడు. ప్రయాణికుడు గమ్యంలో దిగగానే ఆ స్లిప్ తొలగిస్తాడు అని, చూస్తూ అర్థం చేసుకున్నాను. కిటికీ అద్దం నుంచి ప్రకృతి అందాలను ఆస్వాదించడం బాగుంది.

రైల్లో రచయిత్రి

ఇంతలో ఓషన్ సైడ్ స్టేషన్ రానే వచ్చింది. రైలు దిగాం. స్టేషన్ వెనుక వైపే బస్సు సిద్ధంగా ఉంది. వెళ్లి ఎక్కేశాం. మరో గంటంబావుకు ఇర్వైన్ వచ్చింది. అక్కడినుంచి మళ్లీ రైలు ప్రయాణం. ఓ గంట లోపే గమ్యం చేరాం. ప్రపంచంలో పేరొందిన అందమైన ముప్ఫై ఏడు రైల్వే స్టేషన్ లలో యూనియన్ స్టేషన్ ఒకటి కావడం విశేషం.

యూనియన్ స్టేషన్..ఎల్. ఏ

దీన్ని, తండ్రీ కొడుకులైన ఆర్కిటెక్ట్ లు జాన్, డోనాల్డ్ పార్కిన్సన్‌లు నిర్మించారని తెలిసింది. స్పానిష్ నిర్మాణ శైలి, చిత్రాలంకార శైలి కలగలిసిన కట్టడం. 1939లో దీని నిర్మాణం పూర్తయింది. పశ్చిమ యు.ఎస్. లో ఇది అతి పెద్ద ప్యాసింజర్ ట్రెయిన్ టెర్మినల్. అప్పట్లోనే దీని నిర్మాణ వ్యయం 11 మిలియన్ డాలర్లు.

కలపగా భ్రమింపజేసే స్టీల్ సీలింగ్.. యూనియన్ స్టేషన్ ఎల్. ఏ.

ఇక్కడి గ్రాండ్ వెయిటింగ్ రూమ్ సీలింగ్ చూడడానికి కలపతో చేసినట్లు ఉంటుంది. కానీ అది స్టీల్ నిర్మితమే అని తెలుసుకున్నాను. గోడలకు ఉన్న వైవిధ్య భరిత చిత్రాలంకారాలు అలా చూస్తూ ఉండి పోవాలనిపించాయి.

లాస్ ఆన్జిలిస్‌కు ఈ స్టేషన్ ఒక ల్యాండ్‌మార్క్. ఇది కేవలం రవాణా హబ్ మాత్రమే కాదు, కల్చరల్ హబ్ కూడా. దీని నిర్మాణ శైలికి ఎవరైనా ఫిదా కావలసిందే. 1950లో ‘యూనియన్ స్టేషన్’ పేరుతో సినిమా తీశారు. దానికి ఈ స్టేషనే బ్యాక్‌డ్రాప్. ఆ తర్వాత ఎన్నో సినిమాలకు ఇదొక లొకేషన్. బ్లేడ్ రన్నర్, నిక్ ఆఫ్ టైమ్, పెరల్ హార్బర్, సిల్వర్ స్ట్రీక్ , క్రై డేంజర్, గార్ ఫీల్డ్, ద మూవీ, అండర్ ద రెయిన్ బో, ద డార్క్ నైట్ రైజెస్.. ఎన్నెన్నో సినిమాలలో యూనియన్ స్టేషన్ ఒక భాగమైంది. టెలివిజన్ షో లలో కూడా ఈ లొకేషన్ చోటు చేసుకుంది. అలా స్టేషన్ అంతా చూసి బయటకు నడిచాం. అక్కడికి పావు మైలు దూరంలోనే అల్ వెరా స్ట్రీట్ లో మెక్సికన్ మార్కెట్ ప్లేస్ ఉందని, అక్కడికి తీసుకు వెళతానని దీప ముందే చెప్పింది. కారణం ఆ ప్రాంతం చూస్తే తనకు హైదరాబాద్ లోని బిర్లా మందిర్ దగ్గరి దుకాణ సముదాయం గుర్తుకొచ్చి, మాతృదేశాన్ని చూసిన అనుభూతి కలిగిందట. అందుకే నాక్కూడా చూపించాలనుకుంది. అయితే మేం వెళ్లేసరికి ఇంకా దుకాణాలు తెరవలేదు.

ఈలోపు అక్కడే ఉన్న ప్రఖ్యాతి చెందిన. ‘అవిలా అడోబి’ చూసి వద్దాం అంది మా అమ్మాయి. అల్ వెరా స్ట్రీట్ మధ్యలో కుడి వైపున ‘అవిలా అడోబి’ ఉంది. లాస్ ఆన్జిలిస్‌లో అత్యంత పురాతన భవనంగా రికార్డులకెక్కింది. సందర్శకులకు ప్రవేశం ఉచితం. అయితే ప్రధాన ద్వారం నుండి కాక ఒక పక్కగా ఉన్న చిన్న ద్వారం నుంచి ప్రవేశం ఏర్పాటు చేశారు. సందులాంటి మార్గంలో నడిచి ముందుకు వెళితే ఎడమ వైపు నుంచి ఇంటి లోపలకు వెళ్ళాలి.

అవిల అడోబి ముందు..

ఈ గృహాన్ని 1818లో నిర్మించారు. మూడువైపులా పెద్ద వసారా ఉంది. మధ్యలో పెద్ద ఖాళీ స్థలం. ద్రాక్ష, బత్తాయి, నిమ్మ చెట్లు, ఇంకేవో పూల చెట్లు ఉన్నాయి. ఖాళీ స్థలంలోనే పాత కాలం నాటి దిట్టమైన కొయ్య బండి ఉంది. ఈ ఇంటి నిర్మాణానికి ముందు ఈ ప్రాంతంలో సినలోవా, మెక్సికోకు చెందిన ప్రజలు ఉండేవారట. అప్పట్లో ఈ గృహాన్ని ఫ్రాన్సిస్కో అవిల అనే ఆయన నిర్మించుకున్నాడు. ఆయన పశువుల వ్యాపారి.. సంపన్నుడు. లాస్ ఆన్జిలిస్ మేయర్‌గా పనిచేశాడు. ఇక ప్రస్తుతం ఇంటి విషయం.. ఎడమవైపు నుంచి లోపలకు వెళితే వరుసగా గదులు. హిస్టారిక్ హౌస్ మ్యూజియంగా ఉన్న ఈ గృహంలో మొత్తం ఏడు గదులు ఉన్నాయి. పెద్ద గది విందు, వినోద వేడుకలకు వాడుకునేవారు. అవిల కోసం ఆఫీస్ రూమ్, లివింగ్ రూమ్, తల్లిదండ్రులకు, పిల్లలకు స్లీపింగ్ క్వార్టర్లు, వంట గది. అయితే ముందున్న కోర్టు యార్డ్ లోనే వంట చేసేవారట. ప్రతి గదిలో, దానికి సంబంధించిన వివరాలు రాసి ఉంచారు. ఫర్నిచర్ ఆసియా, యూరప్, మెక్సికో, న్యూ ఇంగ్లండ్ నుంచి తెప్పించారు. మంచాలు, పెట్టెలు, బీరువాలు, భోజనాల బల్ల, చలి కాచుకునే ఫైర్ ప్లేస్, పింగాణి వస్తువులు, దుస్తులు, ఒకటనేమిటి.. ఎన్నెన్నో ఆనాటి జీవన శైలికి అద్దం పడుతూ ఉన్నాయి. తలుపులు, కిటికీ ఫ్రేములు బోస్టన్ నుంచి తెప్పించినవి. బయట వసారాలలో కూడా వారు వాడిన రకరకాల వస్తువులు బల్లలపై ఉంచారు. నిర్మాణానికి బట్టీలలో కాల్చిన ఇటుకలు కాకుండా సూర్యరశ్మిలో ఎండబెట్టిన ఇటుకలను వాడారట. ఇంటికప్పు దూలాలతో కూడి ఉంది.

అవిలా అడోబి

అసలు ఈ ఇల్లు ఇంతకు రెండు రెట్లు పెద్దదిగా ఉండి అల్ వెరా వీధి మధ్య వరకు విస్తరించి ఉండేదట. ప్రస్తుతం ఏడు గదుల ఇల్లు మాత్రమే మిగిలింది. 1928లో ఈ ఇంటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించగా స్థానికంగా నిరసనలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా క్రిస్టిన్ స్టెర్లింగ్ అనే మహిళ చొరవ తీసుకుని, స్పానిష్ సంస్కృతికి అద్దం పట్టే అలనాటి ఇంటిని పదిలంగా ఉండేలా కృషి చేసింది. ఆమె మరణించే వరకు అందులో నివసించింది కూడా. 1953 లో కాలిఫోర్నియా స్టేట్, లాస్ ఆన్జిలిస్ స్టేట్ హిస్టారిక్ పార్క్‌లో భాగంగా ఈ ఇంటిని కొనుగోలు చేసింది (స్టెర్లింగ్ అందులో నివసించినప్పటికీ ). 1971లో వచ్చిన భూకంపం కారణంగా ఈ గృహం బాగా దెబ్బ తింది. అందువల్ల మరమ్మతులు చేశారు. ఫ్లోరింగ్‌కు ప్లాంక్ లు వేశారు. 1976 నుంచి ‘అవిల అడోబి’ను ప్రజలు సందర్శించేందుకు వీలు కల్పించారు.

అవిలా అడోబి

అవిల అడోబి చూశాక తిరిగి మార్కెట్ ప్లేస్ కు చేరుకున్నాం. అప్పటికి షాపులు తెరిచారు. ఆ వీధి అంతా కింద టైల్స్ ఉన్నాయి. రెండు వైపులా చిన్న చిన్న షాపులు, హోటళ్లు, బట్టల షాపులు ఉన్నాయి. ఆ వీధికి వెనుక వైపు మరో వీధి. రెండు వీధుల మధ్యలో చెట్లు ఉన్నాయి. ఆ వీధిలో కూడా ఇదే మాదిరి షాపులు వగైరా. ఆ షాపుల్లో పూసల దండలు, చెవి పోగులు, కమ్మలు, ఆట వస్తువులు, ఇంట్లో వాడుకునే వస్తువులు, కళాత్మక వస్తువులు, బ్యాగులు, బొమ్మలు, చేత్తో అల్లిన బుట్టలు మొదలైనవి ఎన్నెన్నో ఉన్నాయి. అంతా మెక్సికన్ సంస్కృతిని ప్రతిబింబించే వస్తు సముదాయం. అవన్నీ చూస్తుంటే నాక్కూడా మన దేశంలో పుణ్య క్షేత్రాలలో ఉండే షాపులు గుర్తుకు వచ్చాయి.

మార్కెట్

మేం కూడా కొన్ని బొమ్మలు, చిన్నిచిన్ని వస్తువులు కొన్నాం. ఆపైన అక్కడి హోటల్లోనే పిజ్జా, ఉప్పు చల్లిన కీరా, టొమాటో, ఉల్లి ముక్కలను తిని, కొత్త రకం జ్యూస్ తాగి అక్కడినుంచి బయటకు నడిచి రోడ్డు మీద నడుస్తూ వెళ్లాం. బయటి నుంచి పెద్ద పెద్ద భవనాలను వీక్షించాం. ఆ తర్వాత తిరిగి యూనియన్ స్టేషన్ చేరుకున్నాం. కొద్ది నిరీక్షణ అనంతరం రైలు రావడం.. మేం ఎక్కడం జరిగిపోయాయి. ఇర్వైన్ చేరుకుని, అక్కడ బస్సు ఎక్కి ఓషన్ సైడ్ చేరుకుని, మళ్లీ రైలెక్కి శాండియేగొ చేరి, ఇంకేముంది.. క్యాబ్‌లో ఇంటికి చేరాం.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here