[ఇటీవల అమెరికాలో పర్యటించి, ఆ యాత్రానుభూతులను పాఠకులతో పంచుకుంటున్నారు జె. శ్యామల]
కసీనోల కాణాచిలో ‘కా’ షో!
[dropcap]‘లా[/dropcap]స్ వేగస్’ వెళ్తున్నాం అనగానే చాలా మంది చెప్పే మాట.. అక్కడి కసీనోలు చూడండి. విలాసాల సిసలైన చిరునామాలు అవి, గ్యాంబ్లింగ్ ఆడండి, చాలా సరదాగా, హుషారుగా ఉంటుంది – అని.
అయితే మా దీప మాత్రం ‘ఒకటి, రెండు కసీనోలు చూస్తే చాలు.. ఆర్కిటెక్చర్, డిజైనింగ్ తేడాలు తప్ప అన్నీ ఒకటే.. దాని కోసం తిరుగుడు దండగ. నేను ‘ఎంజిఎం గ్రాండ్’లో ‘కా’ షో కు టికెట్లు బుక్ చేశాను. అది చూద్దాం’ అంది.
నేను కూడా ఎంతో ఉత్సాహపడ్డాను. ఎందుకంటే ఇటీవల కాలంలో నేను నాటకాలు చూసిందే లేదు. ఎంతైనా నాటక కళ గొప్పదనాన్ని విస్మరించలేము. దాని స్థానం దానిదే. నటుడి ప్రతిభకు, నాటకాల్లోని రీటేకుల్లేని ప్రత్యక్ష నటనే గీటురాయి. సినిమా రంగానికి కూడా నాటకమే పునాది కదా. గతంలో సినిమా నటులంతా నాటక రంగం నుంచి వచ్చిన వారే.
అందులోనూ విదేశంలో నాటకమంటే ఆసక్తి రెట్టింపు కావడంలో ఆశ్చర్యమేముంది..
సాయంత్రం 7 గంటలకు షో ప్రారంభం. మేం కాస్తంత ముందుగానే బయలుదేరాం. ఎందుకంటే కారు పార్కింగ్‌కు ఇబ్బంది కాకుండా ఉండడానికి, ఎంజిఎం గ్రాండ్‌ను తీరిగ్గా తిలకించడానికి.
లాస్ వేగస్‌లో పేరొందిన అతి పెద్ద హోటల్ అండ్ కసీనోలలో ఎంజిఎం గ్రాండ్ ఒకటి. ఇక్కడ 6,852 గదుల వసతి సదుపాయం ఉంది. ఇండియాలో క్యాసినో అని రాస్తుంటాం కానీ దాన్ని ‘కసీనో’ అనడమే కరెక్ట్ అని దీప చెప్పింది. ఎంజిఎం గ్రాండ్ అతి పెద్ద కసీనో. ఒక ఫ్లోర్ మొత్తం గేమ్ ఫ్లోర్‌గా ఉంది. కోరినవి తిని, తాగేందుకు ఎన్నో షాపులు. ఇక్కడ కామిక్ షోలు, మేజిక్ షోలు కూడా జరుగుతుంటాయి. మన అభిరుచిని బట్టి ఆయా షోను ఎంపిక చేసుకుని టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
గేమ్ ఫ్లోర్‌లో అడుగు పెట్టాం. అదొక చిత్రానుభూతి నిచ్చే ప్రత్యేక ప్రపంచం. రంగు రంగుల లైట్లతో, అలంకరణలతో, జన సందోహంతో కళకళలాడుతోంది. పైగా క్రిస్మస్ టైం కావడం వల్ల విద్యుత్ విలాసాలు, అలంకరణలు మరింత ప్రత్యేకంగా ఏర్పాటు చేశారనుకుంటా. గేమ్ ఆడేందుకు ఎన్నో విభాగాలు. కంప్యూటర్లు, మెషీన్లు.. వాటి ముందు కుర్చీలు. కొన్ని చోట్ల గేమ్ గురించి చెప్పేందుకు మనిషి ఉన్నాడు. మరి కొన్నిచోట్ల ఆడేవారు మాత్రమే ఉన్నారు. ఆ మెషీన్ల ముందు బైఠాయించి, పట్టుదలగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రకరకాల వేషధారణల్లో స్త్రీ, పురుషులు, డ్రింక్ చేస్తూ గ్యాంబ్లింగ్‌లో మునిగిపోయి కనిపించారు. మరికొందరు కేవలం తిని, తాగడంలో ఆనందిస్తున్నారు. మేం అలా తిరుగుతూ, అన్ని వైపులా వీక్షిస్తూ, ఆలోచనల్లో ఉండగానే ‘కా’ థియేటర్ దగ్గర సందర్శకుల క్యూ మొదలైంది. వెళ్లి మేమూ క్యూలో నిలుచున్నాం. అన్నట్లు ఈ షోకు అయిదేళ్ల లోపు పిల్లలను అనుమతించరు. అయిదు నుంచి పద్దెనిమిది ఏళ్ల లోపు వారు పెద్దలతో పాటు రావలసి ఉంటుంది. ‘కా’ షో, సర్కే దు సొలైల్ కళారూప సమర్పణ. ఈ షో దర్శకుడు రాబర్ట్ లెపాజ్. ఇంతలో సమయం కావడంతో థియేటర్ తలుపులు తెరుచుకున్నాయి. షోకు సంబంధించిన వ్యక్తులే ప్రత్యేక వేషాల్లో, ప్రేక్షకులకు వివిధ భాషల్లో స్వాగతం పలుకుతున్నారు. మమ్మల్ని చూడగానే ఇండియన్స్ అని గుర్తించినట్లున్నారు, ‘నమస్కార్’ అంటూ ఆహ్వానం పలికారు. నాకు ఆశ్చర్యం, ఆనందం కలిగాయి.
లోపలికి నడిచాం. చాలా పెద్ద థియేటర్. అందులో 1,950 సీట్లు ఉంటాయని తెలిసింది. ప్రతి సీటుకు స్పీకర్ ఏర్పాటు ఉంది. ఒక్కొక్కరే వచ్చి సీట్లలో కూర్చుంటుండగా స్టేజ్ ముందు శబ్దం చేస్తూ ఫైర్ బాల్స్ వెలుగుతూ అబ్బురపరిచాయి. షో ప్రారంభానికి పది నిముషాలు ఉందనగా థియేటర్ పై అంతస్తు నుంచి వేలాడే తాళ్లను పట్టుకుని చిత్ర, విచిత్ర వేషధారులు కిందకు దిగుతూ, అటూ.. ఇటూ ఊగుతూ విన్యాసాలు చేస్తుంటే భలే తమాషాగా అనిపించింది. అలా, షో లోని పాత్రధారులు స్టేజ్ ముందుకు చేరారు.
ఈ స్టేజ్ చాలా ప్రత్యేకమైంది. రెండు కదిలే, పెద్ద ప్లాట్‌ఫామ్ లతో నిర్మించారు. శాండ్ క్లిఫ్ డెక్ ఒక ప్లాట్‌ఫామ్ అయితే, టటామి డెక్ రెండవది. మొదటి ప్లాట్‌ఫామ్‌ను ఒక క్రేన్ అదుపు చేస్తుంది. 72 అడుగుల పైకి, కిందికి జరుపుతుంది, 360 డిగ్రీల కోణంలో దాన్ని గుండ్రంగా తిప్పుతుంది. 100 డిగ్రీల కోణంలో ప్లాట్‌ఫామ్‌ను వంచుతుంది కూడా. రెండు డెక్‌లు కలిసి, విడివిడిగా కనిపిస్తాయి. రెండూ పైకి, కిందకు, ముందుకు, వెనుకకు కూడా కదలగలవు. ఒక సందర్భంలో వాస్తవమైన బీచ్ మన ముందు నిలిచినట్లనిపిస్తుంది. ఈ థియేటర్, స్టేజ్ రూపకర్త బ్రిటిష్ ఆర్కిటెక్ట్ మార్క్ ఫిషర్. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ స్టేజ్‌కి ‘థీమ్డ్ ఎంటర్‌టైన్మెంట్ అసోసియేషన్’ వారి ప్రతిష్ఠాత్మక ‘థియే అవార్డ్ – 2008’ లభించింది.
2004 నుంచి ‘కా’ షో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. అక్రోబ్యాటిక్ బ్యాటిల్స్, మార్షల్ ఆర్ట్స్, పప్పెట్స్, ఇంటరాక్టివ్ వీడియో ప్రొజెక్షన్స్, పైరో టెక్నిక్స్ ఎన్నెన్నో కలబోసిన ‘కా’ షో చూసి తీరవలసిందే అని చాలా మంది స్నేహితులు చెప్పడంతో మా అమ్మాయి ఈ షోకు టికెట్లు తీసుకుంది.
మదిలో ఆలోచన మెదులుతుండగానే షో మొదలైంది.
విలాసవంతమైన అతిపెద్ద పడవ. అందులోంచి రాజ కుటుంబానికి చెందిన కవలలు (ఒక అమ్మాయి, ఒక అబ్బాయి) దిగడం.. అద్భుత దృశ్యం. వారికి రాజ సభ ఘన స్వాగతం పలికింది. సంతోషాలు.. సందడులు.. నృత్య వేడుకలు.. కవలలు ఫ్లూట్ వాయిస్తున్నారు. వేడుకలు ముగింపు దశలో ఉండగా హఠాత్తుగా ఓ ఆటవిక బృందం బాణాలతో భయంకర దాడి చేసింది. ఆ దాడిలో రాజు, రాణి హతం కాగా, మిగిలిన వారు ప్రాణ భయంతో పరుగులు తీశారు. ఆటవికులు రాజభవనానికి నిప్పంటించారు. ఒక పరిచారిక, విదూషకుడు, రాజ కుటుంబ సేవకులు, కవలలు అక్కడినుంచి బయటపడి, పడవ ఎక్కి తప్పించుకోబోతారు. కానీ పడవ ఎక్కే సమయంలో శత్రువులు వేసిన బాణం తగిలి యువరాజు నీళ్లల్లో పడ్డాడు. అతడిని రక్షించాలని విదూషకుడు వెంటనే నీళ్లలో దూకాడు. అయితే అదే సమయంలో పడవ అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
అంతలో భీకర తుఫాను. పడవ సముద్రంలో మునిగిపోతుండగా, పరిచారిక కూడా మునిగిపోయే తరుణంలో యువరాణి ఆమెను రక్షించింది. కానీ తుఫాను బీభత్సంలో వారు కొట్టుకుపోతుంటారు. మరో సన్నివేశంలో వారికి మెలకువ వచ్చేసరికి సముద్రం ఒడ్డున ఉన్నారు. అంతలో భయంకర మృగాలు తమను సమీపించడం చూసి పరుగులు.. పరుగులు. ఇక అక్కడ యువరాజు, విదూషకుడు ఒక గుహలో దాక్కుని, ఏవో శబ్దాలు రావడంతో, బయటకు రావడం, శత్రువుల చేజిక్కడం జరిగింది.
ఇలా రాజు సంతానమైన కవలలు విధివశాత్తూ విడిపోవడం.. ఆ తర్వాత కథ అనేక మలుపులు తిరిగి.. చెడుపై మంచి విజయం సాధించి, మళ్లీ అందరూ కలుసుకోవటంతో షో ముగుస్తుంది. శత్రువులు తాము తీసుకున్న గోతిలో తామే పడతారు. ఆక్రోబ్యాటిక్ ప్రత్యర్థులతో, భీతిని కలిగించే మృత్యు చక్రం (వీల్ ఆఫ్ డెత్)తో సాగే పోరు ఉత్కంఠతను కలిగిస్తుంది. ఆసియా దేశాల కలబోతగా ఉండే, నటుల వస్త్రధారణ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఆ చిత్రమైన భాష మనకు అర్థం కాక పోయినా, నాటక రసాస్వాదనకు ఎక్కడా అదేమీ అవరోధం కాకపోవడం మరో గొప్ప విషయంగా చెప్పాలి. తొంభై నిముషాల పాటు సాగే ‘కా’ షో ప్రేక్షకులను మరో లోకంలో విహరింప జేస్తుంది. ప్రదర్శన ముగిసి, మా కాళ్లు బయటకు నడిచినా, మనసు, ఆలోచనలు మాత్రం అక్కడినుంచి ఒక పట్టాన కదల్లేదు.
‘ఎన్నో ‘షో’ లు ఉన్నా ‘కా’ షో ను ఎంచుకుని మంచి పని చేశాం’ అనుకున్నాం నేను, మా అమ్మాయి.
(మళ్ళీ కలుద్దాం)