Site icon Sanchika

అమెరికా.. కొన్ని నెమలీకలు!-7

[ఇటీవల అమెరికాలో పర్యటించి, ఆ యాత్రానుభూతులను పాఠకులతో పంచుకుంటున్నారు జె. శ్యామల]

రమ్యమైన రాతి లోకం ‘వేలీ ఆఫ్ ఫైర్’!

[dropcap]ఆ[/dropcap]రోజు ఉదయం పదకొండు గంటల వేళ ‘వేలీ ఆఫ్ ఫైర్ స్టేట్ పార్క్’ కు బయలుదేరాం. ఇది లాస్ వేగస్‌కు ఈశాన్యాన 52 మైళ్ల దూరంలో ఉంది. నెవాడలో ఇది అతి పెద్ద కెన్యన్. అందులోకి మేం అనుభవజ్ఞుల సలహాననుసరించి చూసిన వాటి చుట్టే తిరిగే ఇబ్బంది లేకుండా తూర్పు ప్రవేశ మార్గం నుంచి ప్రవేశించాం. ముందుకు వెళ్తున్నకొద్దీ ఆశ్చర్యపోవడం నా వంతు అయింది.

‘వేలీ ఆఫ్ ఫైర్’ లో రాతి ఆకృతులు

మార్గానికి రెండువైపులా బారులు తీరిన సహజ రాతి భారీ ఆకృతులు.. అసలు వేగస్ లోనే ఎటు చూసినా కొండల సమూహాలు దర్శనమిస్తుంటాయి. అయితే అవన్నీ మామూలు కొండలు. ఈ పార్క్ లోని రాతి వరుసలు భిన్నమైనవి. రాగి రంగు, ఇటుక రంగుతో ఎంతో ప్రకాశవంతంగా ఉన్నాయి. దానికి తోడు సూర్య కాంతినద్దుకుని వింతగా వెలుగులీనుతున్నాయి. అంతలో ‘ఎలిఫెంట్ రాక్’ దర్శనమిచ్చింది. విచిత్రం! కాలక్రమంలో రాయి ఏనుగు తొండం ఆకృతిలో రూపుదిద్దుకోవడం తమాషాగా అనిపించింది.

ఎలిఫెంట్ రాక్

ఆ తర్వాత కళ్ళ ముందు నిలిచిన దృశ్యం, ‘సెవెన్ సిస్టర్స్’.. ఏడు పొడవాటి, ఎర్రని వైవిధ్య రాతి ఆకృతులు. కొన్ని మనుషుల ముఖాల్లా.. ఆ ఆకృతులకు ఏవేవో నిర్వచనాలు మనసులో మెదిలాయి. అక్కడినుంచి ‘విజిటర్స్ సెంటర్’ కు వెళ్లాము.

మనిషి ముఖాకృతిని తలపించే రాళ్లు
తొర్రల రాళ్లు

అక్కడ జువాలజీ, ఎకొలజీ పోర్క్, దాని పరిసర ప్రాంతాల నేపథ్య చరిత్ర వివరించే ప్రదర్శనాకృతులు (ఎగ్జిబిట్లు) ఉన్నాయి. ఈ స్టేట్ పార్క్ విస్తీర్ణం 40,000 ఎకరాలు పైమాటే. దీన్ని 1935లో నెలకొల్పారు. ఇక్కడ ప్రకాశించే అజ్టెక్ శాండ్ స్టోన్ సముదాయాలు మాత్రమే కాదు, గ్రే కలర్, లైమ్ స్టోన్ రాళ్ల సముదాయాలు కూడా ఉన్నాయి. శిలాజాలుగా మారిన వృక్షాలు మరో భౌగోళిక అద్భుతం. ఈ శాండ్ స్టోన్ జురాసిక్ పీరియెడ్‌కు చెందింది. అసలు దక్షిణ నేవడాలో మనిషి ఉనికి 11,000 ఏళ్ల క్రితం మొదలైందని చెప్పవచ్చు. అయితే ఇక్కడ రాళ్ల మీద ఉన్న చిత్రాల ద్వారా ఇక్కడ నివసించిన వారి వృత్తి బుట్టలల్లడం అని తెలుసుకోవచ్చు. ఈ చిత్రాలు 2,500 సంవత్సారాల కిందటివని సంబంధిత పరిశోధకులు నిర్ధారించారు.

రాళ్లపై ప్రాచీనులు గీసిన బొమ్మలు

ఆ తర్వాత ఇక్కడ పుయబ్లో సంస్కృతిని గమనించవచ్చు. 1865 కాలంలో ఇక్కడ పయుట్స్, పుయబ్లో తెగల వారు నివసించారు. అదే సమయంలో మోవాపా వేలీ దక్షిణాన సెయింట్ థామస్ వద్ద స్థిరపడ్డారు. వ్యవసాయం, పశువుల పెంపకం, గనుల తవ్వకం వగైరాలు వారి జీవనాధారంగా ఉండేవి.

1912లో ఈ ప్రాంతంగుండా రహదారి ఏర్పాటు జరిగింది. దాంతో ప్రజలు ఈ దారిలో ప్రయాణించసాగారు. 1920లో ఓ నాటి సూర్యాస్తమయ సమయంలో, ఓ ప్రభుత్వ అధికారి ఈ ప్రాంతంలో ప్రయాణిస్తూ, ఆ వేలీ మొత్తం అగ్ని జ్వాలలాగా ప్రకాశిస్తోందని అభివర్ణించాడు. అప్పటినుండి ఈ ప్రాంతానికి ‘వేలీ ఆఫ్ ఫైర్’ అనే పేరు స్థిరపడింది.

ఇక్కడి పురాతత్వ ప్రకృతి ప్రాధాన్యతను, వినోద కేంద్రంగా ఉండగల తావుగాను గుర్తించి 8,500 ఎకరాల ప్రాంతాన్ని నేవడా స్టేట్ కు అప్పగించారు. 1933లో ఇక్కడ ముందుగా ప్రాథమిక వసతుల కల్పన, క్యాంప్ గ్రౌండ్స్ ఏర్పాటుచేశారు. 1934లో ఈస్టర్ రోజున ‘వేలీ ఆఫ్ ఫైర్’ ( నేవడాలో తొలి స్టేట్ పార్క్) లాంఛనంగా ప్రారంభమైంది. అదంతా చూడడం ముగించేసరికి లంచ్ టైమ్ అయింది. ఆ పక్కనే కూర్చుని భోజనం చేయడానికి వీలుగా రాతి బల్ల, కుర్చీలు ఉన్నాయి. ఎదురుగా వివిధరకాల చెట్లు.. పిచ్చుకల్లాంటి చిన్న పక్షులు అటు, ఇటు తిరుగుతూ, ఎగురుతూ ఆహ్లాదం కలిగిస్తున్నాయి. వాటి రంగు అదొక రకం ఆకుపచ్చగా ఉండి మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తోంది. వాటిని చూస్తూ మా లంచ్ ముగించాం.

ఆ తర్వాత మళ్లీ విహారం మొదలు. ఈ సారి ‘మౌసెస్ ట్యాంక్’ పాయింట్ వచ్చింది. మేం పైకి ఎక్కి అక్కడ రాతి ఆకృతులను, వాటిపై ప్రాచీనులు వేసిన బొమ్మలను చూశాం. ఆ తర్వాత ‘రెయిన్‌బో’ విస్తా.. చూస్తుంటే ఈ రాళ్లకు ఎన్నెన్ని అందాలో.. అనిపించింది.

రెయిన్‌బో విస్తా

ఆపైన ‘ఫైర్ కెన్యన్ పాయింట్’. ఆ తర్వాత ‘వైట్ డోమ్స్’. ఈ ఎర్రని రాళ్ల లోకంలో తెల్లటి డోమ్స్.. భలేగా ఉంది. ఆ తర్వాత ‘అట్లాటిల్ రాక్’ పాయింట్.. పైకి ఎక్కి చూడడానికి లోహపు మెట్ల ఏర్పాటు ఉంది.

అట్లాటిల్ రాక్, అట్లాటిల్ రాక్ పైన ప్రాచీనులు చిత్రించిన బొమ్మలు

అది ఎక్కి పైకి వెళ్లాం. అక్కడ రాతిపై ప్రాచీనులు గీసిన బొమ్మలను దగ్గరనుంచి చూడవచ్చు. అయితే దేన్నీ చేత్తో తాకకూడదు. అవి పదిలంగా పది కాలాలు ఉండాలంటే తాకకుండా ఉండడం మన బాధ్యత. ఫోటోలు తీసుకుని కిందికి దిగాం. ఇక కారెక్కి, సీనిక్ లూప్ లో మెల్లగా వెళుతూ నేత్రపర్వంగా ఉన్న రాతి అందాలకు కళ్ళప్పగించాం. ఎరుపు, గులాబి, జీబ్రా పెయింటెడ్ ఆకృతులు, ఆర్చీలు, ఎన్నెన్నో. కొన్ని రాతి ఆకృతులకు రంథ్రాలు, ఎవరో తొలిచినట్లు మధ్యలో ఆవరణలు.. ఆ ఆకృతులను గమనిస్తుంటే మనిషి పక్షి, జంతువు.. ఇలా ఏవేవో ఆకారాలను తలపిస్తాయి. అదంతా ఇక మన ఊహా శక్తిపై ఆధారపడుతుంది. అవన్నీ చూసి ‘వేలీ ఆఫ్ ఫైర్’ కు వీడ్కోలు పలికాం.

దీని కన్నా ముందర ‘కా’ షో ప్రోగ్రామ్ ఉన్న రోజు, ఉదయం ఖాళీ గానే ఉన్నాం కదా అని ‘రెడ్ రాక్ కెన్యన్’ చూసి వచ్చాం. అయితే ప్రాధాన్యతల దృష్ట్యా ‘వేలీ ఆఫ్ ఫైర్’ గురించి ముందుగా వివరించాను. ఇక ‘రెడ్ రాక్ కెన్యన్’ గురించి.. నేవడాలో ‘నేషనల్ కన్జర్వేషన్ ఏరియా’ గా గుర్తింపు పొందిన తొలి తావు రెడ్ రాక్ కెన్యన్.

రెడ్ రాక్ కెన్యన్

13 మైళ్ల సీనిక్ డ్రైవ్ ఏరియా ఉన్న రెడ్ రాక్ కెన్యన్‌ను 1967లో ప్రారంభించారు. ఇక్కడి కీ స్టోన్ థ్రస్ట్ దాదాపు 65 మిలియన్ సంవత్సరాల క్రితం (మెసోజోయిక్ జియలాజిక్ ఎరా అంతంలో) ఏర్పడింది. అదే కాలంలో డైనోసార్లు అంతరించాయి. ఆ సమయంలో జరిగిన భూగర్భ పొరల విస్తృత కదలికల ఒత్తిడికి లైమ్ స్టోన్ రాతి పొరలు, శాండ్ స్టోన్ రాతి పొరల పైకి చేరాయి. ఇక్కడి రాతి వరుసలను గమనిస్తే ఈ విషయం అర్థమవుతుంది. కీ స్టోన్ లు అన్నీ పగుళ్ల తోను.. విరిగి కనిపిస్తాయి. లూప్ రోడ్ మొదట్లోనే విజిటర్స్ సెంటర్ ఉంది. ఇందులోని ఎగ్జిబిట్లు ఈ కెన్యన్ గురించి వివరిస్తాయి. ఇక్కడ ఒక పుస్తకాలయం కూడా ఉంది. రకరకాల జ్ఞాపికలు మామూలే.

రెడ్ రాక్ కెన్యన్ వద్ద బోర్డ్

వివరాల విషయానికి వస్తే.. 180 మిలియన్ ఏళ్ల కిందట ఈ ప్రాంతమంతా ఇసుక తిన్నెలతో నిండి ఉండేది. భూగర్భ జలాలు, ఇసుక తిన్నెల గుండా ప్రవహించడంతో ఎరుపు రంగును కొంత కోల్పోయి, కాల్షియం కార్బోనేట్ మిగిలింది. ఈ ప్రక్రియ కారణంగా ఇసుక, రాయిగా మారి, కాలం గడిచే కొద్దీ కొండలు, శిఖరాలు, గోడలుగా రూపాంతరం చెందాయి. రాతి గోడలు 3000 అడుగుల ఎత్తులో ఉన్నాయి. ఇక్కడ హైకింగ్, రాక్ క్లైమ్బింగ్ చేస్తుంటారు. గుర్రపు స్వారీ కూడా చేస్తుంటారు. అలాగే ఎంతోమంది పిక్నిక్ లకు వచ్చి సరదాగా గడుపుతుంటారు. ఇక్కడి కొండల్లో అతి ఎత్తైనది లమాడ్రే మౌంటెన్. దీని ఎత్తు 8,154 అడుగులు. ఇక్కడి నీటి, వృక్ష, జంతు వనరులకు ఆకర్షితుడై మనిషి ఈ తావు చేరాడట. ఒకప్పుడు ఇక్కడ ఆరు వేర్వేరు అమెరికన్ సంస్కృతులు ఉండేవని దొరికిన ఆధారాలను బట్టి గుర్తించారు. వారు ఉపయోగించిన కుండల పెంకులు, వారు రాళ్లపై చిత్రించిన బొమ్మలు, కొన్ని రోస్టింగ్ పిట్స్ ఇక్కడ చూడవచ్చు. సినిమాలకు కూడా ఇది ఒక లొకేషన్ గా ఉపయోగపడుతోంది. ఇవీ రెడ్ రాక్ కెన్యన్ విశేషాలు.

అలా రాళ్లల్లో.. ఇసుకల్లో విహారం ముగించి ఇంటి దారి పట్టాం.

ఆ మర్నాడు తిరుగు ప్రయాణంలో ‘జాషువా ట్రీ.. నేషనల్ పార్క్’ చూడాలని అనుకున్నాం. ఉదయానే లేచి, త్వరగా తయారై, బ్రేక్ ఫాస్ట్ ముగించి, లగేజ్ సర్దేసుకుని.. ల్యాన్స్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక నోట్ రాసి టేబుల్‌పై ఉంచి, ఇంటిని పాస్‌వర్డ్‌తో లాక్ చేసి కారెక్కాం. వేగస్‌లో కాలం ఎంత వేగంగా గడిచిపోయిందీ.. అనుకుంటూ ప్రకృతిని పరికించడం మొదలుపెట్టాను. కాలం కరిగింది.. జాషువా ట్రీ నేషనల్ పార్క్ రానే వచ్చింది. ఆ ప్రాంతంలో జాషువా ట్రీ లు అసంఖ్యాకంగా ఉన్నందున దానికి ఆ పేరు వచ్చింది.

జాషువా ట్రీ, జాషువా ట్రీ వద్ద కుమార్తెతో రచయిత్రి

వీటిని స్థానికంగా ‘యుక్కా ట్రీ’ లని అంటారు. ఇవి జిగ్ జాగ్ గా, బ్రిస్టిల్స్ తో ప్రత్యేకంగా ఉంటాయి. వర్ణన కన్నా, ఫొటోలు చూస్తే బాగా తెలుస్తుంది. మొహావే ఎడారి ప్రాంతం ఈ చెట్లకు పుట్టినిల్లు. 1936లో దీన్ని ‘నేషనల్ మాన్యుమెంట్’గా ప్రకటించారు. 1994 లో యు.ఎస్. కాంగ్రెస్, కాలిఫోర్నియా డెజర్ట్ ప్రొటెక్షన్ యాక్ట్.. పాస్ చేసినప్పుడు ఈ ప్రాంతానికి ‘నేషనల్ పార్క్’ హోదా ఇచ్చింది. ఈ పార్క్ విస్తీర్ణం 795, 156 ఎకరాలు. దిగువ కొలరాడో ఎడారి, ఎగువ మొహావె ఎడారికి మధ్య భూభాగంలో నెలకొంది. కాబట్టి రెండు ఏడారుల పర్యావరణ ప్రభావం ఇక్కడ కనిపిస్తుంది.

ప్రాచీన కాలంలో ఇక్కడ ‘పింటో’ తెగ ప్రజలు నివసించేవారు. 1930లో ఇక్కడ, పింటోలు వాడిన రాతి పనిముట్లు దొరికాయి. ఆ తర్వాత కాలంలో సెర్రానొ, కహుయా, కెమెహువేవి తెగలు నివసించారు. నీటి వసతికి దగ్గరగా వారి నివాసాలు ఉండేవి. చెట్లు ఇచ్చే కాయలు, పళ్లు, దుంపలు వీరి ఆహారం. ఔషధాలుగా కూడా చెట్ల పసర్లు వాడేవారు. బుట్టలు, బాణాలు, వగైరాలకు కూడా చెట్లే ఆధారం. ఆ తర్వాత వచ్చిన తెగ ‘మొహావె’. వీరు సంచార జీవులు. పై నాలుగు తెగలకు చెందిన కొద్ది మంది ‘జాషువా ట్రీ’, ప్రాంతంలో నివసించారు. అసంఖ్యాక పక్షులకు ఇక్కడి చెట్లే ఆవాసాలు. ఉభయ చరాలు, పాకే ప్రాణులకు ఈ ప్రాంతం ఆలవాలం. నల్ల తోక ఉండే జాక్ రాబిట్స్, తేళ్లు, రాటిల్ స్నేక్స్, టరంటులా రకం సాలీళ్లు, కయోటీలు, విష రహిత సర్పాలు, పెద్ద కొమ్ముల గొర్రెలు, తొండలు, కంగారూ ఎలుకలు మొదలైనవెన్నో ఉంటాయి. వేర్వేరు పాయింట్లలో రాళ్లను, చెట్లను తిలకించి కొన్ని ఫోటోలు తీసుకున్నాం. ఆ తర్వాత అక్కడే కొద్ది దూరంలో.. పింటో బేసిన్ కు దగ్గరగా ఉన్న ‘చోయా కాక్టస్ గార్డెన్’ కు వెళ్లాం. ఇంతవరకు ఎడారిలో అంత అందమైన పూలు ఏనాడూ నా ఊహకు కూడా అందలేదంటే అతిశయోక్తి కాదు.

చోయా కాక్టస్ గార్డెన్

పది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చోయా కాక్టస్ గార్డెన్ లో ఎన్ని రంగుల పూలో! ఎంత వైవిధ్యభరిత పుష్పాలో! అప్రయత్నంగానే ‘ఎడారిలోన పూలు పూచె ఎంత సందడి..!’ మనసు పాడింది. టెడ్డీ బేర్ చోయా, బ్రిటిల్ బుష్, డెజర్ట్ లావెండర్, బీవర్టెయిల్ కాక్టస్, ట్రిక్సిస్, నేరో లీఫ్ ఫర్గెట్ మీ నాట్.. ఇలా ఎన్నెన్నో పేర్లు. అయితే అన్ని రకాలు, అన్ని కాలాల్లో పుష్పించవు. ఆయా సీజన్ లలో ఆయా రకాలు పూస్తాయి.  విస్తారమైన పూపొదలు. ‘ఎంత అందంగా ఉన్నాయి’ అని దగ్గరికి పోయామో కష్టం కొని తెచ్చుకున్నట్లే. దుస్తులకు తగిలినా వాటిని వదిలించుకోలేం. శరీరానికి పట్టుకుంటే వాటిని తీసేయడం ఎంతో బాధాకరం. అంత నొప్పి కలుగుతుంది. అందుకే దూరంగా ఉండి.. చూసి ఆనందించాలి.

కాక్టస్ గార్డెన్ లో పూలు, చోయా కాక్టస్ గార్డెన్ వద్ద రచయిత్రి

చూసిన కొద్దీ చూడాలనిపించే ఆ పసుపు పచ్చ పూల తావునుంచి చూపు మరల్చుకోవడం కష్టమే అయినా, ఆ అందాలను కళ్ల నిండా, మనసు నిండా నింపుకుని, అక్కడినుంచి కదిలి కారెక్కాం. మళ్లీ ప్రయాణం.. దారి మధ్యలో లంచ్ చేశాం. ఆ తర్వాత మళ్లీ ప్రయాణం.

సంజె వేళ అయ్యే సరికి ప్రకృతి తీరు మారి విపరీతమైన గాలి, చిమ్మ చీకటి.. కష్టతరమైన మార్గం. మనసులో భయం.. భయం. మా అమ్మాయి నేర్పుగా, ఓర్పుగా కారు నడుపుతోంది. ముందు, వెనుక వాహనాల వారు కూడా క్రమశిక్షణ పాటించారు. ఆ విధంగా క్షేమంగా రాత్రికి ఇల్లు చేరాం. ఆ యాత్రానుభూతి మనసులో ఇప్పటికీ తాజాగా ఉండి, తరచు ఆలోచనల్లో తొంగిచూస్తూనే ఉంది.

(అయిపోయింది)

Exit mobile version