Site icon Sanchika

అమెరికా మనుమలు

[శ్రీమతి జొన్నలగడ్డ శేషమ్మ రచించిన ‘అమెరికా మనుమలు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]మా[/dropcap] ఏరియాలో మా ఇంటికి దగ్గరగా ఒక విశాలమైన పార్కు ఉంది. పెద్ద చెట్లు, మహావృక్షాలు, పక్షుల కిలకిలలు; కొన్ని చెట్లకు గుత్తులుగా రంగురంగుల పూలు పూస్తాయి. చిన్న మొక్కలు, తీగలు – కన్నులకు ఆకర్షణీయంగా పువ్వులను ఇస్తాయి. కాలినడకకు మెత్తటి బాట, జాగింగ్‌కు సిమెంట్ బాట కూడా ఉన్నాయి. క్రీడా సామాగ్రి విరివిగా ఉంది. వ్యాయామానికి పరికరాలు ఉన్నాయి. అందుచేత ఉదయం, సాయంత్రం చాలామంది పార్కుకు వస్తూ ఉంటారు. సీనియర్ సిటిజన్ల సంఖ్య బాగా ఎక్కువే. నడక మంచిదని అందరూ గ్రహించారు. కొంతసేపు నడిచి, సేదతీరి, కబుర్లు చెప్పుకొని, వెళ్తూ ఉంటారు. సిబ్బంది పార్కును పరిశుభ్రంగా ఉంచుతారు.

మహిళా మణులంతా ఒకచోట కూర్చుని, దేశ కాలమాన పరిస్థితులు, మనుషులు, పోకడలు, సమాజం రీతి – అన్నీ చర్చిస్తారు. భవానీ గారు ఈమధ్య పది రోజులుగా రావడం లేదు. ఈరోజు ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా కనిపించారు. అందరూ ఆత్మీయంగా ఆమెను పలకరించారు. “విశేషాలు ఏమిటి? చెప్పండి. మీ ముఖం వెలిగిపోతోంది” అని ఆత్రంగా అడిగారు.

“ఆ. వస్తున్నా. మంచి విశేషాలే మరి; ఈమధ్య అమెరికా నుండి అమ్మాయి, పిల్లలు వచ్చారు. మనవరాలు సుధ, ఒకటే హడావిడి. ‘అమ్మమ్మా నువ్వు ఎందుకు అంత dull గా ఉన్నావు? అసలు నీ age ఎంత అంది. పెద్దదాన్ని అయిపోయేనే! ఓపిక బాగా తగ్గిపోతోంది. అలా కూర్చుంటున్నాను’ అన్నాను.

సుధ నా కుర్చీ దగ్గరకు వచ్చి, ‘70 ఏళ్ళు అంటే ముసలివారు కానే కాదు. ప్రస్తుతం అన్ని దేశాల్లోనూ మినిమం 90 ఏళ్ళు జీవిస్తున్నారు. నో, నో, నీ పద్ధతి ఏం బాగోలేదు. లే, get up.’ అని లేవదీసింది. బలవంతంగా నడిపించింది. మా పెరటి తోటలో 15 నిమిషాలు ముందు తన చేయి పట్టుకుని, తర్వాత వదిలేసి, ‘నడు – మరేం ఫరవాలేదు. పడిపోవు – నేను భరోసా’ అంటూ తరిమింది. కొంతసేపటికి స్థిరంగా నిలబడి నడవగలిగాను. చెమటలు పట్టేయి. ‘Good. ఇలా చెమట పట్టాలి అమ్మమ్మా’ అంది.

కొంతసేపు కూర్చున్నాక, ‘లే అమ్మమ్మా, నేను ఎలా నిలబడ్డాను అలా నిలబడు. నేను చేసిన పనులన్నీ నువ్వు చేయాలి’ అంది. చేతులు చాపడం, ఎత్తడం, పక్కకు, కాళ్లు కదిలించి, నిలబడి జాపడం, వంగుండి లేవడం – ఇలా ఎన్నో రకాలుగా శరీరాన్ని లొంగదీసింది. ‘బాగుంది అమ్మమ్మా చక్కగా మాట విన్నావు. అర్థమైంది కదా, ఇలా ప్రతిరోజు, ఉదయం 15 to 20 నిమిషాలు నడవాలి. ఈ వ్యాయామాలన్నీ చేయాలి. అప్పుడు నువ్వు పది రోజుల్లో పరిగెట్ట గలవు, ok నా?’ అంది.

‘అమ్మమ్మా, అమెరికాలో సీనియర్ సిటిజెన్లు ఎంతసేపు నడచి వ్యాయామాలు చేస్తారో తెలుసా, వాళ్లు తమ వంట వండుకుంటారు. కొడుకులు, కోడళ్ళు ఉద్యోగాలకు వెళ్ళిపోతారు. మనవలు చదువులు. వీళ్లకు ఎన్నో బాధ్యతలు; మరి నువ్వు కూడా చలాకీగా ఉండాలి. అత్తయ్యకు సాయం చేయాలి. కబుర్లు చెప్పాలి. పిల్లలకు పాటలు ఆటలు నేర్పాలి. తెలిసిందా – రోజులు నిమిషాల్లాగా గడిచిపోతాయి’ అంది.

ప్రస్తుతం సుధ వాళ్ళ బామ్మ గారి ఊరు వెళ్ళింది. నేను ఇలా హుషారుగా ఉన్నాను – ఇదండీ విశేషం” అంది భవానీ గారు.

అందరూ చప్పట్లు కొట్టారు. “చాలా సంతోషం – భవానీ గారు, మీరు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలి. మీ మనమరాలు సూపర్” అని మెచ్చుకున్నారు.

శాంతమ్మ గారు తన అనుభవాలు చెప్పడం ప్రారంభించారు. “మీరు చాలా అదృష్టవంతులు భవానీ గారు, ఈమధ్య మా మనవలు వంశీ, వేణు వచ్చారు. అమెరికా నుంచే, ఇద్దరూ యువకులు. మనదేశంలో ఇంటర్మీడియట్ అంటాము కదా, అది పూర్తయిందిట.

వచ్చినది మొదలు “ఛీ – నాన్న బలవంతంగా ఇండియా వెళ్ళండి రా, మన ఊరు సముద్ర తీరం. మంచి బీచ్ లు ఉంటాయి. హాయిగా ఎంజాయ్ చేయవచ్చు, బామ్మ గారి దగ్గర, కొన్నాళ్ళు ఉండండి. చాలా ఏళ్లు అయిపోయింది. కరోనా వచ్చాక వెళ్లలేదు కదా. పెద్దవాళ్ళంతా, మీకోసం ఎదురు చూస్తున్నారు అని పంపారు.” అంటూ గోల.

వచ్చినది మొదలు ఇక్కడ ఏమీ బాగోలేదు అని ఒకటే విసుగు. ‘ఇక్కడ ఒక్క కారు కనబడదు. సైకిళ్లు, ఆటోలు, రిక్షాలు, మోటారు సైకిళ్ళు – వీధుల నిండా జనాలు. రోడ్డు మీదే మాటలు, foot pathల నిండా షాపులు. ఎన్ని హోటల్లో. అక్కడే టిఫిన్ సెంటర్లు, కూరగాయలు, అన్నీ అమ్మేస్తున్నారు. రోడ్లన్నీ dirtyగా ఉన్నాయి. ప్లాస్టిక్ సంచులు వాడి పడేస్తున్నారు. అరుపులు, కేకలు. వాహనాలు ఆపేసి కబుర్లు. దేవాలయాలు కూడా ఎక్కువే. ఇంత రష్ భరించడం కష్టం’. ఇలా గొడవ గొడవ. నేను ఎంతో ఆప్యాయంగా వంట చేస్తే వాళ్లకు నచ్చదు. టిఫిన్ నచ్చవు. ఫోన్లో మాట్లాడి ఎవరికో ఆర్డర్ చేసి, ఆ భోజనం, ఆ టిఫిన్ వచ్చాక తింటారు.

‘బామ్మగారు, మీ వంటలు మాకు ఏమీ బాగోవు. ఇడ్లీ, దోస, ఉప్మా పరమ బోరు. వంకాయ కూర అవి మేము తినం’ అని నిర్మొహమాటంగా చెప్పారు వేణు, వంశీ.

ఏదో మమ్మల్ని ఉద్దరించినట్లు, పది రోజులు లెక్కపెట్టుకొని, ముళ్ళ మీద ఉన్నట్లు బాధపడిపోయారు. నిన్న బయలుదేరి వెళ్లారు. తుఫాను వెలసినట్లు ఉంది నాకైతే” అన్నారు శాంతమ్మ గారు.

అందరూ కాసేపు ఆలోచనలో పడ్డారు. “అవును, అందరూ ఒక రకంగా ఉండరు! కొందరు వెళ్లిన దేశంలోనే ఇమిడిపోయి, వేషం, భాష, తిండి, అన్ని అనుకరిస్తారు. ఇండియాకు చెందిన వాళ్ళము అన్న మాటే వాళ్లకు నచ్చదు. I am an American Citizen అంటూ పోజు కొడతారు” అని సోమలత గారు అన్నారు.

సీతమ్మ గారు వాతావరణం తేలికపరచడానికి ప్రయత్నించారు. “ఈ ఎండాకాలంలో మా మనుమలు సోము, శ్యాము వచ్చారు. మా పెద్దబ్బాయి పిల్లలు వాళ్ళు. బామ్మగారు, మీరు మన పల్లెపాలెం రండి. మేమిద్దరం అక్కడికి వస్తాం. నాన్న మమ్మల్ని పల్లెటూరులో కొన్నాళ్ళు ఉండి రమ్మన్నారు. పల్లె జీవితంలో కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి అన్నారు. అంచేత మేము వస్తున్నాం” అన్నారు మనుమలు.

అనుకున్న ప్రకారం రెండు రోజులు ముందుగానే నేను మా వారు పల్లెపాలెం వెళ్ళాం. సోము శ్యాము వచ్చారు. ఎంతో ఆప్యాయంగా పలకరించారు. ఆనందంతో కౌగిలించుకున్నారు. తెల్లవారింది మొదలు, మొక్కల దగ్గరకు వెళ్లి, పువ్వులు కోసి, కూరగాయ మొక్కలు, పాదులు చూసి మురిసి పోయారు. మొక్కలకు నీళ్లు పోయడానికి సరదా పడ్డారు. ‘మేము ఉన్న ఏరియాలో ఎప్పుడూ మంచు కురుస్తుంది. ఇలా మొక్కలు పెరగడం కష్టం’ అన్నారు.

వంట గదిలోకి వచ్చి టిఫిన్ వేస్తూ ఉంటే ‘మేము హెల్ప్ చేస్తాం బామ్మగారు’ అని పనిలో పడ్డారు.

తర్వాత పల్లెల్లోకి వెళ్లారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ఇల్లు చేరారు. “’ఏమర్రా, ఇంతవరకు ఏం చేస్తున్నారు?’ అన్నాను.

‘నాన్న మాకు సర్పంచ్ గారి ఫోన్ నెంబరు ఇచ్చారు. నాన్న కూడా వారితో మాట్లాడారు. మేం పరిచయం చేసుకుని వారి పర్మిషన్‌తో ఓ అనాథాశ్రమానికి వెళ్ళాం. అక్కడ పిల్లలకు ఏం కావాలో చూసేము. వాళ్లతో కబుర్లు చెప్పాం. రేపు మళ్లీ వెళతాము. వాళ్లకు కొన్ని దుప్పట్లు, బట్టలు, మంచాలు, కొనమని నాన్న చెప్పారు. ఓ వారం రోజులు వాళ్లతో గడుపుతాం.

తరువాత సీనియర్ సిటిజన్లు ఉండే ఆశ్రమానికి వెళ్తాం. అక్కడ ఒక వారం రోజులు గడుపుతాం. అక్కడ ఆ పెద్దలతో కబుర్లు చెప్పి, అమెరికా విశేషాలు, ప్రపంచం పోకడలు, వాళ్లకు చెప్పి, వాళ్ళు మాకు ఏం చెప్తారో వింటాము.

ఇవన్నీ మాకు ఎంతో ఉపయోగపడతాయి. మేమిద్దరం మెడిసన్ చదివి డాక్టర్లు కావాలని అనుకుంటున్నాము. ఇలా ‘కమ్యూనిటీ వర్క్’ చేసినందుకు మాకు మంచి మార్కులు కలుస్తాయి. ఆ ఫోటోలు, రిపోర్టు అన్ని చూపిస్తాం అక్కడ’ అన్నాడు సోము.

శ్యాము ‘బామ్మ గారు, ఆ అనాథ బాల బాలికలను చూస్తూ ఉంటే మనసు ఎంతో బాధపడింది’, అని కంటతడి పెట్టాడు.

ఎంత కష్టమో ఆ జీవితం. బాగా చదువుకోండి. మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి. అని వారిని ప్రోత్సహించేను. 15 రోజులు ఇట్టే గడిచిపోయాయి. గలగల తిరిగేరు పిల్లలు. సందడే సందడి. ఈ అనుభవం నేను చిరకాలం గుర్తు ఉంచుకుంటాను” అన్నారు సీతమ్మ గారు.

అక్కడ ఉన్న మహిళలంతా కూడా చాలా ఆనందించారు. “మీరు అదృష్టవంతులు సీతమ్మ గారు” అన్నారు.

వనజమ్మగారు “అవును, అలాంటి పిల్లలు ఎంతో ఆనందాన్ని ఇస్తారు. వాళ్ల గురించి, వార్తల్లో టీవీలో, రేడియోలో చెప్పాలి. పత్రికల్లో వ్రాయాలి. అది అందరికీ ప్రేరణ అవుతుంది” అన్నారు. ఆమె ఒక రిటైర్డ్ టీచరు. “మన పిల్లలు కూడా వాళ్ళని చూసి నేర్చుకోవచ్చు. అలా వెళ్లి అనాథ పిల్లలతో, వృద్ధులతో, కొన్నాళ్లు గడిపి రావచ్చును.” అన్నారు.

అందరూ ఏకీభవించారు ఆమెతో. స్నేహితులతో జల్సా పార్టీలు చేసుకుని డబ్బు ఖర్చు చేసి గోల చేసే కన్నా ఇలాంటి కార్యక్రమాలు మంచివే కదా అనుకున్నారు అందరూ.

సావిత్రి గారు తమ అనుభవాలు ఇలా పంచుకున్నారు. మా మనవడు కృష్ణ గురించి చెప్తాను. వృత్తి రీత్యా డాక్టర్. అమెరికాలో ఓ ప్రసిద్ధ హాస్పిటల్‌లో పనిచేస్తున్నాడు.

మావారు గోపాలరావు గారు ఫిజిక్స్‌లో మంచి అందవేసిన చేయి. వారి పాఠాలకు చాలా విలువనిస్తారు విద్యార్థులు. కెమిస్ట్రీలో కూడా మెలకువలన్నీ చెప్పగలరు. కొన్నేళ్ల క్రితం వరకు మన రాష్ట్రంలో ఇంజనీరింగ్, మెడిసిన్ లాంటి కోర్సులకు ప్రవేశ పరీక్ష ఉండేది కదా. ఆయన కోచింగ్ సెంటర్లలో కూడా పని చేసేవారు.

మా అబ్బాయి రామం, కృష్ణను ముందుగానే మన ఇంటికి పంపేడు. తాతగారు ఆనందంతో వాడిని దగ్గర కూర్చోపెట్టుకొని, మెలకువలన్నీ చెప్పారు. మంచి ర్యాంకుతో పరీక్ష నెగ్గేడు హైదరాబాదులో సీటు వచ్చింది. ఎంబీబీఎస్ పూర్తికాగానే లండన్ వెళ్లి, P.G. F.R.C.S. చేసాడు. తర్వాత అమెరికా వెళ్లాడు. ఈ మధ్యనే వచ్చేడుట ఇండియా, ఏదో కాన్ఫరెన్స్‌లో మాట్లాడేట. విజయవాడలో కూడ ఓ రోజు ఉన్నాడుట. ఇంత దగ్గరలోకి వచ్చి కూడా తాతగారిని చూడడానికి ఇక్కడకు రాలేదు. పైగా, అమెరికా చేరి ‘సారీ తాతయ్య, నేను చాలా బిజీగా ఉండి అక్కడకు రాలేకపోయాను. ఇంకోసారి ఇండియా వచ్చినప్పుడు, మిమ్మల్ని కలుస్తాను’ అని ఫోన్ చేసేడట. రెండు రోజుల బట్టి మావారు ఎంత బాధ పడుతున్నారో, ముఖమంతా చిన్నబోయింది. పోనీలెండి, వాళ్ళకు లేని తీపి మనకెందుకు అని బ్రతిమలాడుతున్నాను” అని కళ్లు తుడుచుకున్నారు సావిత్రి గారు.

“ఊరడిల్లండి సావిత్రి గారు. అమెరికా మనవలు – ఒక్కొక్కరు ఒక రకం” అన్నారు వనజ.

‘చాలా బాగుంది. ఈరోజు ఎన్నో విశేషాలు తెలుసుకున్నాం. కొత్త అనుభవాలు, యువకుల జీవన విధానంలో మార్పులు. తప్పదు మరి’ అనుకొని ఎవరి ఇళ్లకు వారు చేరుకున్నారు.

Exit mobile version