[box type=’note’ fontsize=’16’] తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల శాఖలో ఓఎస్‌డిగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ శ్రీధర్ రావు దేశ్‌పాండే తమ అమెరికా యాత్ర విశేషాలు సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]
ప్రపంచ సాగునీటి ఇంజనీర్లకు మార్గ దర్శకుడు ఎల్వుడ్ మీడ్
[dropcap]గ[/dropcap]త రెండు వారాలుగా రాసిన హూవర్ డ్యాం, గ్రాండ్ కూలి డ్యాం గురించి రాసినప్పుడు ఆ రెండు డ్యాంల రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషించిన ఎల్వుడ్ మీడ్ గురించి కూడా ప్రస్తావించాను. ఆయన కృషికి సంబంధించి ఒక ప్రత్యేకమైన వ్యాసం రాయాలని అనుకున్నాను. అమెరికా వ్యవసాయ రంగం అభివృద్దిలో, జల విద్యుత్ ఉత్పత్తికి కీలకంగా మారిన హూవర్ (Hoover) డ్యాం, గ్రాండ్ కూలి (Grand Coulee) డ్యాం, ఓవైహీ (Owyhee) డ్యాం లాంటి తొలితరం డ్యాంల నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించిన లెజెండ్ ఇంజనీర్ ఎల్వుడ్ మీడ్ (Elwood Mead) సేవలను ఈ వ్యాసంలో స్మరించుకుందాము.
ఎల్వుడ్ మీడ్ 1858 జనవరి 16న అమెరికాలో ఇండియానా రాష్ట్రంలో పాట్రియాట్ అనే చిన్న గ్రామలో వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. 78 సంవత్సరాల వయసులో 1936 జనవరి 26న తుది శ్వాస విడిచాడు. 1860 దశకంలో ఒహీయో నదీ తీర ప్రాంతంలోని వ్యవసాయ క్షేత్రాలలో, చుట్టూ ఉన్న అడవులలో ఆడుతూ పాడుతూ పెరిగాడు. హైస్కూలు విద్యను పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో అమెరికాలో రైతుల కడగండ్లను దగ్గరగా చూసే అవకాశం ఆయనకు ఏర్పడింది. పెద్ద పెద్ద భూస్వాముల వద్ద కౌలుదారులుగా ఉన్న రైతుల కష్టాలను గమనించాడు. అందుకే అమెరికా రైతాంగానికి ప్రయోజనం కలిగించే కృషిలో తన జీవితాన్ని వెచ్చించాడు మీడ్. హైస్కూల్ విద్య అనంతరం 1882లో Purdue విశ్వవిద్యాలయం నుంచి బిఎస్సీ (అగ్రికల్చర్) పట్టా అందుకున్నాడు. 1883లో అయోవా స్టేట్ యునివర్సిటీ (Iowa State University) నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో పట్టా అందుకున్నాడు. తిరిగి Purdue విశ్వవిద్యాలయం నుంచే సివిల్ ఇంజనీరింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు. కొద్ది కాలం కొలరాడో వ్యవసాయ కళాశాలలో లెక్కలు, బౌతిక శాస్త్రం బోధించాడు. ఆ తర్వాత అమెరికాలో ఇరిగేషన్ ఇంజనీరింగ్ బోధనకు పాఠ్య ప్రణాళికలు తయారు చేశాడు.
1870వ దశకంలో కొలరాడో రాష్ట్రం నీటి హక్కులకు సంబందించిన చర్చకు కేంద్రంగా ఉండేది. రైతాంగ సమస్యలను చిన్నప్పటి నుంచి గమనించిన మీడ్ ఈ చర్చల్లో చురుకుగా పాల్గొన్నాడు. భవిష్యత్‌లో అమెరికాలో నదీ జలాల వినియోగానికి, వ్యవసాయ విస్తరణకు సాగునీరు, జల విద్యుత్ ప్రాజెక్టుల రూపకల్పనకు సంబందించిన ఆలోచనలకు ఈ చర్చలు దోహదం చేశాయి. 1880వ దశకానికి ఆయన కొలరాడో, వైయోమింగ్ రాష్ట్రాలలో నీటి హక్కుల మేధావిగా, ఇరిగేషన్ ఇంజనీరింగ్ మేధావిగా పేరు గడించాడు. అమెరికాలో కొలరాడో, ఆరిజోనా, నెవేడా, వైయోమింగ్ వంటి కరువు పీడిత ఎడారి ప్రాంతాల్లో వ్యవసాయ విస్తరణ జరగాలంటే నదీ జలాల వినియోగం పెరగాలని, అందుకు పెద్ద జలాశయాల నిర్మాణం అత్యవసరమని ఆయన భావించాడు. ఆయన ఆలోచనలకు ఆనాడే పర్యావరణవాదుల నుంచి వ్యతిరేకత ఎదురయ్యింది. కానీ ఆయన తన ఆలోచనలను విస్తృతంగా ప్రచారం చేయడాన్ని కొనసాగించాడు. 1884 నుంచి తన ఆలోచనలతో ఏకీభావం ఉన్న విలియం కోడి లాంటి న్యాయవాదులతో, ఆక్టివిస్టులతో కలిసి ఈ ప్రచారాన్ని ఉదృతం చేశాడు. అమెరికా పశ్చిమ రాష్ట్రాలలో విలియం కోడి ఆనాటికే నీటి హక్కులపై పని చేస్తున్నన్యాయవాదిగా మంచి గుర్తింపు ఉంది.
ఈ ప్రచారం సాగుతూ ఉండగానే ఆయనకు ఆస్ట్రేలియాలో సాగునీటి ప్రాజెక్టుల ప్రణాళికలను తయారు చేసే అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని అంది పుచ్చుకొని 1907లో మీడ్ ఆస్ట్రేలియా పయనమైనాడు. ఆస్ట్రేలియాలో ప్రభుత్వ అధికారులకు ప్రాజెక్టుల రూపకల్పనలో సహకారాన్ని అందజేసినాడు. పదేళ్ళు ఆస్ట్రేలియాలో పని చేసి సాగునీటి ప్రాజెక్టుల రూపకల్పనలో విశేష అనుభవం గడించి 1917లో మీడ్ అమెరికా తిగిగి వచ్చాడు. ఆస్ట్రేలియాలో తాము చేసిన ప్రయోగాలు అమెరికాలో కూడా ఉపయోగ పడతాయని మీడ్ భావించాడు. కాలిఫోర్నియా రాష్ట శాసన సభ్యులతో విస్తృతంగా చర్చలు చేశాడు. డుర్హంలో 10 వేల ఎకరాల వ్యవసాయ కాలనీ ఏర్పాటు కోసం వారిని ఒప్పించాడు. అందుకు 2,60,000 డాలర్లు ఖర్చు అవుతాయని అంచనా వేశారు. ఇది అమెరికాలో మొట్ట మొదటి వ్యవసాయ కాలనీ. కాలిఫోర్నియా యూనివర్సిటీ వ్యవసాయ శాఖ ఈ వ్యవసాయ కాలనీలో సాంకేతిక సలహాలను అందించింది. ఈ వ్యవసాయ కాలనీ జయప్రదం అయ్యింది. ఈ వ్యవసాయ కాలనీ సఫలతపై మీడ్ ‘Helping Men Own Farms’ శీర్షికతో ఒక డాక్యుమెంట్ రూపొందించాడు. ఆనాడు అమెరికాలో ఉన్న భూనిర్వాహణ చట్టాలు, ఇమ్మిగ్రేషన్ చట్టాల కారణంగా వ్యవసాయ కాలనీల ఏర్పాటుకు సంబందించి మీడ్ ఆలోచనలకు ఇతర రాష్ట్రాల నుంచి పెద్దగా ప్రోత్సాహం అందలేదు.
అమెరికాలో మీడ్ ఆలోచనలకు ప్రోత్సాహం లభించక పోయినా ఆఫ్రికా, ఆసియా దేశాల నుంచి సలహాల కోసం ఆయనకు ఆహ్వానాలు అందినాయి. 1923 నుంచి అంతర్జాతీయ స్థాయిలో ఆయన ఆలోచనలపై చర్చ మొదలయ్యింది. ఈ క్రమంలో మధ్య ఆసియాలో జోర్డాన్ నదీ వ్యాలీలో వ్యవసాయ అభివృద్దికి సంబందించి సలహాలు ఇవ్వడానికి మీడ్ పాలస్తీనా వెళ్ళాడు. 60 ఏళ్ల వయసులో ఓహియో, కొలరాడో, కొలంబియా నదీ జలాల వినియోగానికి ప్రణాళికలు తయారుచేయడానికి, నీటి వినియోగానికి సంబందించి వివిధ రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలు పరిష్కరించడానికి ఆనాటి అమెరికా ఫెడరల్ అధ్యక్షుడు కాల్విన్ కూలిడ్జ్ 1924లో మీడ్‌ను యుఎస్ బ్యూరో ఆఫ్ రిక్లమేషన్ (US Bureau of Reclamation) కమీషనర్‌గా నియమించాడు. ఈ పదవిలో ఆయన 1936 వరకు సేవలు అందించాడు. యు.ఎస్.బి.ఆర్ అమెరికాలో ఆయా రాష్ట్రాల సహకారంతో సాగునీటి ప్రాజెక్టులు, జల విద్యుత్ ప్రాజెక్టుల రూపకల్పన, నిర్మాణం, నిర్వాహణ తదితర వ్యవహారాలు చూసే అత్యున్నత సంస్థ. మన దేశంలో కేంద్ర జల సంఘం (Central Water Commission) లాంటిది. ఆయన హయాంలో యు.ఎస్.బి.ఆర్ అమెరికాలో అనేక ప్రాజెక్టులను రూపకల్పన చేసింది. మీడ్ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఓవైహీ (1928-32), హూవర్ (1931-36), గ్రాండ్ కూలి (1933-44), డ్యాంల నిర్మాణం పూర్తి అయినాయి. రాష్ట్రాల మద్య నీటి పంపిణీ, విద్యుత్ పంపిణీ ఒప్పందాలను కుదుర్చడంలో కీలక పాత్ర పోషించాడు. మీడ్ మార్గ నిర్దేశనలో నిర్మాణం అయిన ఈ మూడు అమెరికా తొలి తరం డ్యాం ల వివరాలు ఈ కింది పట్టికలో పొందు పరచినాను.
అమెరికా తొలి తరం డ్యాంల వివరాలు
క్ర. సం | డ్యాం వివరాలు | ఓవైహి డ్యాం
Owyhee Dam 1928-32 |
హూవర్ డ్యాం
Hoover Dam 1931-36 |
గ్రాండ్ కూలి డ్యాం
Grand Coulee Dam 1933-44 |
1 | నది | ఓవైహి | కొలరాడో | కొలంబియా |
2 | రాష్ట్రం | ఓరెగాన్ | నెవెడా&ఆరిజోనా | వాషింగ్టన్ |
2 | డ్యాం రకం | ఆర్చ్ కాంక్రీట్ డ్యాం | ఆర్చ్ కాంక్రీట్ డ్యాం | కాంక్రీట్ డ్యాం |
3 | నీటి నిల్వ | 52.97 టిఎంసి | 1243 టిఎంసి | 423.78 టిఎంసి |
4 | డ్యాం ఎత్తు | 417 అడుగులు | 726 అడుగులు | 550 అడుగులు |
5 | డ్యాం పొడవు | 833 అడుగులు | 1244 అడుగులు | 5223 అడుగులు |
6 | విద్యుత్ ఉత్పత్తి | 4.30 మె వా | 2080 మె వా | 6809 మె వా |
7 | ఆయకట్టు | 1.05 లక్షల ఎకరాలు | 10 లక్షల ఎకరాలు | 6.71 లక్షల ఎకరాలు |
ఆనాడు ప్రపంచంలో ఇటువంటి ఎత్తైన డ్యాంల నిర్మాణానికి అనుభవం ఎవరికీ లేదు. వీటి నిర్మాణం కోసం యు.ఎస్.బి.ఆర్ అనేక కొత్త ఆవిష్కరణలు చేయవలసి వచ్చింది. వాటి నిర్మాణ అనుభవాలు ప్రపంచానికి కొత్త సాంకేతిక పద్ధతులను, పరికరాలను అందించాయి. ఈ ఆవిష్కరణలకు మార్గ నిర్దేశనం చేసింది కమీషనర్ మీడ్. హూవర్, గ్రాండ్ కూలి డ్యాంలతో పోలిస్తే ఓవైహి డ్యాం చిన్నదే. ఎత్తు 417 అడుగులు. ఈ చిన్న ఆర్చ్ డ్యాం నిర్మాణంలో యు.ఎస్.బి.ఆర్ పొందిన అనుభవం ఎత్తైన హూవర్ (726 అడుగులు), గ్రాండ్ కూలి (550 అడుగులు) డ్యాంల నిర్మాణానికి ఇతోధికంగా తోడ్పడినాయి. ఈ అనుభవాల ఆధారంగా యు.ఎస్.బి.ఆర్ ఇంజనీర్లు కొత్త సాంకేతికతను, కొత్త పరికరాలను తయారుచేసుకున్నారు. ఆనాటికి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన జల విద్యుత్ ప్రాజెక్టులను నిర్మించారు. వీటి నిర్మాణానికి ఆనాటి అమెరికా ఫెడరల్ అధ్యక్షులు కెల్విన్ కూలిడ్జ్(1923-29), హెర్బర్ట్ హూవర్(1929-33), ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్(1933-45) సంపూర్ణంగా సహకరించారు. అమెరికా ఫెడరల్ కాంగ్రెస్ ఆమోదం పొందారు. నిధులు సమకూర్చారు. ఆనాడు ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఉన్నా, పర్యావరణవాదుల నుంచి వ్యతిరేకత ఎదురైనా వారి రాజకీయ సంకల్ప బలం వలన ఆ డ్యాంల నిర్మాణం సాధ్యం అయ్యింది. హూవర్ డ్యాంకు అధ్యక్షుడి పేరు పెట్టారు. గ్రాండ్ కూలి డ్యాం జలాశయానికి ‘రూజ్వెల్ట్ లేక్’గా నామకరణం చేశారు. హూవర్ డ్యాం జలాశయానికి యు.ఎస్.బి.ఆర్ కమీషనర్ ‘ఎల్వుడ్ మీడ్ లేక్’గా నామకరణం చేశారు. ఇది ఆయన సేవలకు దక్కిన అపూర్వ గౌరవం. మీడ్ అమెరికా సాగునీటి ప్రాజెక్టులపై, జలవిద్యుత్ ప్రాజెక్టులపై అనేక పుస్తకాలు కూడా రచించాడు. ఎల్వుడ్ మీడ్ రాసిన ‘Irrigation in the United States’ గ్రంథం ఒక ప్రామాణిక గ్రంథంగా పేరు పొందింది.
మీడ్ అమెరికాలో అమలు చేసిన పద్ధతిలోనే ఆయన సమకాలికుడు, హైదారాబాద్ రాజ్యంలో మంజీరా నదిపై నిజాం సాగర్ డ్యాం నిర్మించిన అలీ నవాజ్ జంగ్ కూడా హైదరాబాద్ రాజ్యంలో ప్రయోగాలు చేశాడు.
మొదట ఆయన గోదావరి, కృష్ణా ఉప నదులపై చిన్నచిన్నడ్యాంలను రూపకల్పన చేసి వాటి నిర్మాణాన్ని పూర్తి చేయించాడు. అప్పర్ మానేరు, పాలేరు, వైరా, పోచారం, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, డిండి, కోయిల్ సాగర్ ప్రాజెక్టుల ద్వారా పొందిన అనుభవంతో ఆయన మంజీర నదిపై నిజాంసాగర్ (1923-33), తుంగభద్ర నదిపై తుంగభద్ర ప్రాజెక్టు(1945-54) లను రూపకల్పన చేసి నిర్మించాడు. అవి ఆనాడు భారతదేశంలోనే కాదు ఆసియాలోనే అతి పెద్ద ప్రాజెక్టులు. పోచంపాడ్, నందికొండ ప్రాజెక్టుల నివేదికలు తయారు చేశాడు. మీడ్ లాగానే అలీ నవాజ్ జంగ్ కూడా హైదరాబాద్ రాజ్యానికి ఆవల అనేక స్వదేశీ సంస్థానాలకు సాంకేతిక సలహాలు అందించాడు. తుంగభద్ర జలాల వినియోగంలో ఆనాడు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలను పరిష్కరించి డ్యాం నిర్మాణానికి మార్గం సుగమం చేశాడు. ఆనాడు దేశంలో యూరోపియన్ ఇంజనీర్లే చీఫ్ ఇంజనీర్లుగా నియమితులయ్యేవారు. దేశంలో చీఫ్ ఇంజనీర్‌గా నియమితుడైన తొలి స్వదేశీ ఇంజనీర్ అలీ నవాజ్ జంగ్ బహాదూర్. తన సమకాలికుడైన ఎల్వుడ్ మీడ్ నుంచి, ఆయన అనుసరించిన పద్ధతుల నుంచి నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహాదూర్ కూడా ప్రేరణ పొంది ఉంటాడు. ఈ ఇద్దరు కూడా ప్రపంచ వ్యాప్తంగా ఇరిగేషన్ ఇంజనీర్లకు ప్రాతః స్మరణీయులు.
(మళ్ళీ కలుద్దాం)