[box type=’note’ fontsize=’16’] తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల శాఖలో ఓఎస్‌డిగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ శ్రీధర్ రావు దేశ్‌పాండే తమ అమెరికా యాత్ర విశేషాలు సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]
అమెరికాలో పేద ప్రజల కల్ప తరువు – డాలర్ ట్రీ
[dropcap]2[/dropcap]022 జూలై 1 న డాలస్ మెకనిలో డాలర్ ట్రీ (Dollar Tree) అనే షాప్‌కు వెళ్లాను. అమెరికాలో, కెనడాలో డాలర్ ట్రీ అనే ఈ గొలుసు దుకాణాలు 15,500 ఉన్నాయట. రెండు దేశాలలో కూడా ఇవి చాలా ప్రజాదరణ పొందినాయి. ఇక్కడ ఏ వస్తువు అయినా ఒక డాలర్‌కే దొరుకుతుంది. అదే ఈ దుకాణాల విశిష్టత.
నేను ఇంజనీరింగ్ చదవడానికి 1981లో హైదరాబాద్ నగరంలో అడుగు వెట్టినప్పుడు మన దగ్గర ‘హర్ ఏక్ మాల్ దో రుపియా’ షాప్‌లు నగరం నలుమూలలా ఉండేవి. అందులో ఏ వస్తువు ఖరీదు అయినా రెండు రూపాయలే. కాలక్రమేణా రూపాయి విలువ దారుణంగా పడిపోతున్న సందర్భంలో రెండు రూపాయలకు రేషన్ బియ్యం తప్ప ఏమి కొనే పరిస్థితి లేకుండా పోయింది. రెండు రూపాయలకు విలువ లేకుండా పోవడం 21వ శతాబ్దం ప్రారంభం నాటికి మన అనుభవంలోకి వచ్చింది. ఆ రోజుల్లో రెండు రూపాయల కరెన్సీ నోటు, రెండు రూపాయల నాణెం కూడా చాలామణిలో ఉండేవి. ఇప్పుడు అవి కనుమరుగు అయినాయి. అయితే అమెరికాలో ‘హర్ ఏక్ మాల్ ఏక్ డాలర్’ దుకాణాలు గత 35 ఏళ్లుగా పని చేస్తున్నాయి. అవి ఈనాటికీ మనుగడలో ఉండడం విశేషం.
ఈ ‘డాలర్ ట్రీ’ ఏమిటని అడిగినప్పుడు మా పిల్లలు చెప్పిన సంగతులు ఆసక్తికరంగానూ, ఆశ్చర్యకరంగానూ తోచి ఈ డాలర్ చెట్టు సంగతి ఏందో చూద్దామని లోపలికి దూరాను. చాలా పెద్ద మాల్ లాగా అనిపించింది. అక్కడ అన్నిరకాల వస్తువులు అందుబాటులో ఉన్నాయి. మా పిల్లలు యూనివర్సిటీ స్టూడెంట్స్‌గా ఉన్నప్పుడు తరచుగా వచ్చి వస్తువులు కొనుగోలు చేసేవారట. ఇప్పుడు కూడా వస్తారట కానీ ఒకసారి వాడి పారేసే సందర్భాలకు అవసరమయ్యే వస్తువులు కొనడానికే వస్తారట. అంటే పుట్టిన రోజులు, ఇతర పండుగలకు ఇంట్లో అలంకరణ చేయడానికి అవసరమయ్యే వస్తువులు కొంటారన్నమాట. వారి నిత్య జీవితావసరాల కోసం మాత్రం వాల్‌మార్ట్ లాంటి పెద్ద రిటెయిల్ మాల్స్‌కి, కాస్కో(Costco) లాంటి హోల్ సేల్ మార్కెట్‌కే వెళతారు. ఇప్పుడు సంపాదిస్తున్నారు కదా.
అయితే ఒకటి మాత్రం నిజం. అమెరికాలో పేదవారు, అల్పాదాయ వర్గాల వారికి ఈ డాలర్ ట్రీ దుకాణాలు చాలా మేలు చేస్తున్నాయని చెప్పవచ్చు. వారు ఇక్కడకి వచ్చి తమకు కావలసిన వస్తువులు కొనుగోలు చేయడం కనిపించింది. నేను ఈ షాపులో ఉన్నప్పుడు కొనుగోలుదారులు ఎవరు అని గమనించాను. ఈ షాపుల్లో ఎక్కువగా కొనుగోలు చేయడానికి వచ్చేది నల్ల జాతి ప్రజలు, మెక్సికన్ అక్రమ వలసదారులు, విద్యార్థులు అని అర్థం అయ్యింది. అమెరికాలో పేదవారు, అల్పాదాయ వర్గాల ప్రజలు అత్యధికులు నల్లజాతి వారే. మెక్సికో, ఇతర లాటిన్ అమెరికా దేశాల నుంచి అక్రమంగా వలస వచ్చి స్థిరపడిన స్పానిష్ భాష మాట్లాడే ప్రజలు కూడా అల్పాదాయ వర్గాల కిందనే లెక్క గట్టవచ్చు. ఈ షాపుల్లో దొరకని వస్తువంటూ లేదు. బట్టలు, తిండి పదార్థాలు, సబ్బులు, మేకప్ సామానులు.. ఇది అది అని కాదు.. ఒక డాలర్ ఖరీదు చేసే అన్నీ వస్తువులు అందుబాటులో ఉన్నాయి.
అమెరికాలో కూడా పెట్రోల్, డీజిల్, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. రష్యా ఉక్రేయిన్ యుద్ధం మొదలైన తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు బాగా పెరిగాయని పిల్లలు చెప్పారు. యుద్ధానికి ముందు ఒక గ్యాలన్ (3,78 లీటర్లు) పెట్రోల్ ధర 4 డాలర్లు ఉండేదట. ఇప్పుడు 5 డాలర్లకు పెరిగింది. 40-45 డాలర్లకే కార్ ట్యాంక్ నింపుకునే వారట. ఇప్పయిదు అది 50-55 డాలర్లకు పెరిగిందని పిల్లలు చెప్పారు. అమెరికాలో ద్రవ్యోల్బణం రేటు గత 40 సంవత్సరాలలో ఎన్నడూ లేనంత ఎక్కువగా ఉన్నదట. ఈ పరిస్థితిలో పేద ప్రజలు తమ ఖర్చును తగ్గించుకునే మార్గాలు వెతుకుతుంటారు. వారికి ఈ డాలర్ ట్రీ గొలుసుకట్టు దుకాణాలు చాలా వరకు మేలు చేసినాయి. ఈ కారణంగానే డాలర్ ట్రీ దుకాణాల్లో వ్యాపారం కూడా బాగా పెరిగిందని ఒక అధ్యయనంలో తేలింది.
గత 35 ఏళ్లుగా ఈ షాపుల్లో ధరలు పెరగలేదట. ఆనాటి నుంచి ప్రతీ వస్తువు ఒక డాలర్‌కే అమ్మేవారు. అయితే 2021 నవంబర్ నెల నుంచి వస్తువుల ధరలను 25 శాతం అంటే 1.25 డాలర్లకు పెంచారట. అయినా కూడా డాలర్ ట్రీ షాపులకు ఉన్న ప్రజాదరణ తగ్గలేదనే చెప్పాలి. త్వరలోనే వారు 3, 5, 10 డాలర్ల వస్తువులను అమ్మే షాపులను కూడా తెరుస్తారట. వీటివల్ల తక్కువ ధరకే మరిన్ని వస్తువులు పేద అల్పాదాయ వర్గాల వినియోగానికి అందుబాటులోకి రానున్నాయి. హర్ ఏక్ మాల్ ఒక డాలర్‌కే ఎట్లా అమ్ముతున్నారు? ఇది లాభసాటి వ్యవహారంగా ఏలా మారింది? అన్నది మరో ఆసక్తికరమైన వ్యాపారపరమైన విశ్లేషణ అవుతుంది. ఆ విశ్లేషణ ఈ వ్యాస రచయిత పరిధిలోని అంశం కాదు.
అమెరికాలో 5 డాలర్లకు, అంతకు తక్కువకు వస్తువులు అమ్మే వేరే కంపనీల గొలుసుకట్టు షాపులు కూడా కనిపించాయి. వాటిని ‘డాలర్ జనరల్ స్టోర్’ అని అంటున్నారు. అవి కూడా మంచి ప్రజాదరణతో వ్యాపారాలు కొనసాగిస్తున్నాయి. అయితే ఈ డాలర్ ట్రీ షాపులు మాత్రం పేద వర్గాలకు, విద్యార్థులకు అల్పాదాయ వర్గాలకు గొప్ప సదుపాయం అని నాకు అనిపించింది. రూపాయి విలువ దారుణంగా పడిపోతున్న ఈ కాలంలో 80వ దశకంలో మన వద్ద ఉండిన ‘హర్ ఏక్ మాల్ దో రుపియా’ దుకాణాలను ఇక ఎన్నటికీ ఊహించలేము. అవి మన జ్ఞాపకాల్లో మాత్రమే ఉంటాయి. 2003లో ‘హర్ ఏక్ మాల్’ శీర్షికతో నల్లగొండ కవి, రచయిత అలీ ఒక కథల సంకలనాన్ని కూడా ప్రచురించాడు. ఆ కథా సంకలనం ఈ సందర్భంగా యాదికి వచ్చింది.
(మళ్ళీ కలుద్దాం)