Site icon Sanchika

అమెరికా ముచ్చట్లు-13

[box type=’note’ fontsize=’16’] తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల శాఖలో ఓఎస్‌డిగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ శ్రీధర్ రావు దేశ్‌పాండే తమ అమెరికా యాత్ర విశేషాలు సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]

అమెరికా సంయుక్త రాష్ట్రాల పరిణామక్రమం

ఇటీవలి కాలంలో భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా, జాతీయ సమైక్యతా దినోత్సవాల సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు భారతదేశం ఈనాటి సమగ్ర రూపానికి రావడానికి మూడు నాలుగు దశాబ్దాల కాలం తీసుకున్నదని చెప్పినారు. భారతదేశం స్వాతంత్ర్యం పొందినప్పటి భౌగోళిక స్థితిగతులు ఇప్పుడు ఉన్నట్టు లేవు. నిజానికి భారత రాష్ట్రాల ఏర్పాటు ప్రక్రియ బ్రిటిష్ కాలం నుంచే మొదలయ్యింది. స్వాతంత్ర్యానంతరం 1947-48 సంవత్సరాలలో 500 పై చిలుకు స్వదేశీ సంస్థానాల విలీనంతో మొదలైన ఈ ప్రక్రియ 1956లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ, గోవా విముక్తి, ఈశాన్య భారతంలో కొత్త రాష్ట్రాల ఏర్పాటు, 2000 సంవత్సరంలో ఛత్తీస్‌ఘర్, ఝార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఏర్పాటు, 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు.. ఈ రకంగా భారత దేశ పునరవ్యవస్థీకరణ కొనసాగింది. ఇంకా విదర్భ, బుందేల్‌ఖండ్, హరితప్రదేశ్, గూర్ఖాల్యాండ్ తదితర రాష్ట్రాల డిమాండ్‌లు దేశం ముందర ఉన్నాయి. ఈ స్థితి ప్రపంచంలో అన్ని దేశాలలో ఉంటుంది. కాల క్రమంలో ఉనికిలో లేని కొత్త దేశాలు ఏర్పడతాయి (సోవియట్ యూనియన్ నుంచి విడిపోయి స్వతంత్ర్య దేశాలు అవతరించాయి). ఇది వరకు దేశాలుగా కొనసాగిన దేశాలు ఏకం కావచ్చు(పశ్చిమ జర్మనీ, తూర్పు జర్మనీ ఏకమై జర్మనీగా మారినాయి). ఈ నేపథ్యంలో అమెరికా ఈ రోజు 50 సంయుక్త రాష్ట్రాలుగా మారిన పరిణామక్రమం దాదాపు 183 సంవత్సరాలు కొనసాగింది. ఈ పరిణామ క్రమాన్ని తెలుసుకోవడం ఆసక్తిదాయకంగా ఉంటుంది.

ఒకప్పుడు ఉత్తర అమెరికా ఖండంలో ఉన్న 13 బ్రిటిష్ వలస ప్రాంతాలు ఏకమై జార్జ్ వాషింగ్టన్ నాయకత్వంలో బ్రిటిష్ వారి ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడి స్వాతంత్ర్యం ప్రకటించుకున్నాయి. ఆ యుద్ధాన్ని అమెరికా విప్లవంగా చరిత్ర పుస్తకాలలో మనం చదువుకుంటున్నాము. 1763-83 మధ్య కాలంలో ఈ పోరాటం జరిగింది. 4 జూలై, 1776న Declaration of Independence జారీ అయ్యింది. అప్పుడు confederation of congress లో 13 రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయి. అవి న్యూ హ్యాంప్ షైర్, ముసాచుసెట్స్, రోడ్ ఐల్యాండ్, కనెక్టికట్, న్యూయార్క్, న్యూజెర్సీ, పెన్సిల్వెనియా, డెలావేర్, మేరీల్యాండ్, వర్జీనియా, ఉత్తర కరోలినా, దక్షిణ కరోలినా, జార్జియా. ఇవన్నీ కూడా అమెరికా తూర్పు ప్రాంతంలో ఉన్న రాష్ట్రాలే. ఆ తర్వాత అమెరికా భూభాగం క్రమమగా పశ్చిమ ప్రాంతాలకు విస్తరిస్తూ పోయింది. 1959లో 49వ రాష్ట్రంగా అలాస్కా, 50వ రాష్టంగా హవాయ్ దీవులు అమెరికా సంయుక్త రాష్ట్రాలలో చేరినాయి. హవాయ్ దీవులు అమెరికా ప్రధాన భూభాగానికి సుమారు 3,200 కిలోమీటర్ల దూరంలో పసిఫిక్ మహా సముద్రంలో ఉన్నాయి. అలాస్కా విస్తీర్ణంలో అన్ని రాష్ట్రాల కంటే పెద్దది. ఇది ఒకప్పుడు రష్యా అదీనంలో ఉన్న ప్రాంతం. 1867లో రష్యా నుంచి ఎకరానికి 2 సెంట్లు చెల్లించి కొనుగోలు చేశారట. అలాస్కా కూడా అమరికా ప్రధాన భూభాగానికి దూరంగా ఉంటుంది. అమెరికాకు ఉత్తరాన కెనడా దేశానికి ఆవల ఉన్న అలాస్కా మంచు ఖండం అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఒక రాష్ట్రంగా చెరడానికి ఒక శతాబ్ది కాలం పట్టింది. అమెరికాలో అతి పెద్ద రాష్ట్రం అలాస్కా అయితే అతి చిన్నఅ రాష్ట్రం రోడ్ ఐల్యాండ్ (Rhode Island).

ఇప్పుడు ఈ రాష్ట్రాల విశేషాలు కొన్ని తెలుసుకుందాము. అలాస్కా విస్తీర్ణంలో అన్నిరాష్ట్రాల కంటే పెద్దది. ఉత్తర దృవానికి దగ్గరగా ఉండే మంచు ఖండం. మంచుతో కప్పబడిన భూములు, టండ్రాలు, పర్వతాలు, సరస్సులు, గ్లేషియర్లతో నిండి ఉంటుంది అలాస్కా. ఇక్కడ చిన్నఅ పెద్ద అన్నీ కలిసి 30 లక్షల సరస్సులు ఉన్నాయట. అమెరికాలో ఎత్తైన 20 పర్వతాలలో 17 అలాస్కాలో ఉన్నాయట. అమెరికాలో 6,194 మీటర్ల అతి ఎత్తైన పర్వతం మౌంట్ మెకేన్లి అలాస్కాలోనే ఉంది.

మౌంట్ మెకేన్లి

అలాస్కా బంగారం గనులకు ప్రసిద్ధి. అలాస్కా తర్వాత విస్తీర్ణంలో రెండవ, మూడవ స్థానంలో ఉన్నవి టెక్సాస్, కాలిఫోర్నియా రాష్ట్రాలు. టెక్సాస్ 1845లో 28వ రాష్ట్రంగా యూ.ఎస్.ఎ.లో చేరింది. టెక్సాస్ రాష్ట్రం చమురు, సహజవాయు ఉత్పత్తికి ప్రసిద్ధి. అమెరికా అంతరిక్ష పరిశోధనలను పర్యవేక్షించే నాసా కేంద్ర కార్య స్థానం టెక్సాస్ రాష్ట్రంలో ఉన్న హ్యూస్టన్ నగరంలోనే ఉన్నది.

నాసా కేంద్ర కార్య స్థానం

అమెరికాలో అత్యధికంగా జనాభా నివసించే రాష్ట్రం కాలిఫోర్నియా. ఈ రాష్ట్రాన్ని గోల్డెన్ స్టేట్‌గా కూడా పిలిస్తారు. 1850లో 31వ రాష్ట్రంగా యు.ఎస్.ఏ.లో భాగం అయ్యింది. కాలిఫోర్నియా రాష్ట్రంలోని అడవులలో ప్రపంచంలో అత్యంత ఎత్తైన పురాతన వృక్షాలు ఇంకా మనుగడ సాగిస్తున్నాయట. అందులో ఒక రెడ్ వుడ్ చెట్టు వయసు 2200 సంవత్సరాలుగా నిర్ధారించారు. హాలీవుడ్ సినిమాలకు, సిలికాన్ వాలీగా ప్రసిద్ది గాంచిన శాన్ ఫ్రాన్సిస్కో నగరం, ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ఉన్నవి కాలిఫోర్నియా రాష్ట్రంలోనే.

స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ పురాతన భవనం
స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ మెయిన్ గేట్
chandelier-drive-tree

మరో ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ ఉన్నది ముసాచుసెట్స్ రాష్ట్రంలో. అమెరికాలో అత్యంత అందమైన బీచ్ లకు ప్రసిద్ధి ఫ్లోరిడా రాష్ట్రం. ఏటా 9 కోట్ల మంది పర్యాటకులు ఈ రాష్ట్రాన్ని సందర్శిస్తారట. ప్రతి రోజు వెయ్యి మంది ఫ్లోరిడా రాష్ట్రంలో నివసించడానికి వస్తారని ఒక అంచనా.

హార్వర్డ్ యూనివర్సిటీ

ఫ్లోరిడా రాష్ట్రంలో వెయ్యికి పైగా చిన్న చిన్న దీవులు, సరస్సులు ఉన్నాయట. ప్రకృతి సౌందర్యంతో అలరారుతున్న ఫ్లోరిడాకు పర్యాటకుల తాకిడి ఎక్కువే. ప్రపంచంలో తయారు అయ్యే ఆరెంజ్ జ్యూస్‌లో సగం ఫ్లోరిడా లోనే ఉత్పత్తి అవుతుందట.

మియామీ బీచ్

అమెరికా సంయుక్త రాష్ట్రాలలో తొలి 13 రాష్ట్రాలలో జార్జియా కూడా ఒకటి. అయితే 1861-77 మధ్యకాలంలో సంభవించిన అమెరికా సివిల్ వార్‌లో దక్షిణ రాష్ట్రాల కాన్ఫెడరేషన్‌కు కేంద్ర స్థానమైన అట్లాంటా నగరం జార్జియా రాష్ట్రంలోనే ఉన్నది. అట్లాంటా నగరాన్ని ఉత్తర రాష్టాల సైన్యాలు కైవసం చేసుకున్న తర్వాత దక్షిణ రాష్ట్రాల ఓటమి ఖాయం అయ్యింది. 1886లో ప్రపంచాన్ని దాసోహం చేసుకున్న కోకాకోలా డ్రింక్ ను కనిపెట్టింది అట్లాంటా నగరంలోనే.

అమెరికాలో అత్యంత ప్రజాదరణ కలిగిన, అమెరికాలో బానిసత్వాన్నిరద్దు చేసిన అధ్యక్షుడు అబ్రాహామ్ లింకన్ పుట్టిన నేల ఇల్లినాయిస్ రాష్ట్రం. లింకన్ తన జీవిత కాలంలో అతి ఎక్కువ కాలం నివసించింది ఈ రాష్ట్రంలోనే. అందుకే ఇల్లినాయిస్ రాష్ట్రాన్ని “The Land of Lincoln” అని పిలుస్తారు. అమెరికాలో సర్వమత సమ్మేళనంలో స్వామి వివేకానంద ప్రసంగించిన నగరం, ప్రపంచ కార్మికులు ఘనంగా జరుపుకునే మే డే కి కారణమైన కార్మికోద్యమం జరిగిన చికాగో నగరం ఉన్నది ఇల్లినాయిస్ రాష్ట్రం లోనే.

స్వామి వివేకానంద స్మారకం, చికాగో
హేమార్కెట్ మార్టిర్స్ మెమోరియల్, చికాగో
హేమార్కెట్ మార్టిర్స్ మెమోరియల్, చికాగో

చికాగో నగరంలో నిర్మించిన శ్రీ వెంకటేశ్వరాలయం భారతీయులకు ఒక ప్రముఖ పర్యాటక స్థలం. ఆధ్యాత్మిక కేంద్రం. మొట్ట మొదటి నల్ల జాతి అధ్యక్షుడిగా ఎన్నికైన బరాక్ ఒబామా అంతకు ముందు ఇల్లినాయిస్ రాష్ట్రం నుండి సెనేటర్‌గా అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నిక అయినాడు.

అమెరికా రాజ్యాంగాన్ని అంగీకరించిన మొదటి రాష్ట్రం డెలావేర్. అమెరికాలో రోడ్ ఐల్యాండ్ తర్వాత అతి చిన్న రాష్ట్రాలలో రెండవది. 1812లో 18వ రాష్ట్రంగా యు.ఎస్.ఏ లో చేరిన లూసియానా రాష్ట్రం అంతకు ముందు ఫ్రెంచి వారి అధీనంలో ఉండేది. అమెరికా మూడవ అధ్యక్షుడైన థామస్ జెఫర్సన్ కాలంలో ఫ్రెంచి వారి నుంచి లూసియానా రాష్ట్రాన్ని కొనుగోలు చేసి కలిపేసుకున్నారట. ఈ రాష్ట్రంలో ఇప్పటికీ ఫ్రెంచి వారి సంస్కృతి కొనసాగుతున్నదట. స్థలాల పేర్లు, భవనాల డిజైన్లు, ఆహార అలవాట్లు.. అన్నిఫ్రెంచి వారి లెక్కనే ఉంటాయట.

ప్రపంచంలోనే అతి పెద్ద నగరాల్లో ఒకటైన న్యూయార్క్ నగరం పేరు మీదనే న్యూయార్క్ రాష్ట్రం ఏర్పాటు అయ్యింది. అమెరికా తూర్పు తీరంలో ఉన్న న్యూయార్క్ నగరం యూరప్ వలస వాదులకు గేట్ వే గా ఉపయోగపడింది. అమెరికా తొలి 13 రాష్ట్రాలలో న్యూయార్క్ రాష్ట్రం కూడా ఒకటి. అమెరికా ఆర్థిక రాజధానిగా న్యూయార్క్ నగరాన్ని పరిగణిస్తారు. అమెరికా వెళ్ళిన ప్రతి ఒక్కరూ న్యూయార్క్ నగరాన్ని సందర్శించకుండా రారు. స్కై స్క్రాపర్స్‌గా పిలువబడే బహుళ అంతస్తుల భవనాలు వేల సంఖ్యలో న్యూయార్క్‌లో ఉన్నాయి. న్యూయార్క్ హార్బర్, ఉగ్రవాదుల దాడిలో కూలిపోయిన వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట భవనాలు (ఇప్పుడు అక్కడ ఒక స్మారక కేంద్రాన్ని నిర్మించారు), ఎంపైర్ స్టేట్ బిల్డింగ్, న్యూయార్క్‌కు దగ్గరలోనే ఉన్న ఎల్లిస్ దీవిలో ఫ్రెంచి వారు బహుకరించిన స్టాచ్యు ఆఫ్ లిబర్టీ, టైమ్ స్క్వేర్, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ చదువుకున్న కొలంబియా యూనివర్సిటీ, న్యూయార్క్ స్ట్రీట్ ఫుడ్,.. ఇంకా అనేక ఆకర్షణలు న్యూయార్క్ నగరంలో ఉన్నాయి.

ఎంపైర్ స్టేట్ బిల్డింగ్, న్యూయార్క్
టైమ్స్ స్వేర్, న్యూయార్క్
స్టాచ్యు ఆఫ్ లిబర్టీ, న్యూయార్క్
కొలంబియా యూనివర్సిటీ
బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం, కొలంబియా యూనివర్సిటీ

ప్రపంచ జలపాతాల్లో రారాజు లాంటి నయాగారా జలపాతం ఉన్నది న్యూయార్క్ రాష్ట్రంలోనే. ఈ రాష్ట్రం యాపిల్‌ను రాష్ట్ర ఫలంగా ఎంచుకున్నది. అందుకే న్యూయార్క్ నగరాన్ని అమెరికన్లు Big Apple గా ప్రేమతో పిలుచుకుంటారు.

నయాగారా జలపాతం

న్యూయార్క్ నగరంలోనే ఐక్య రాజ్య సమితి ప్రధాన కార్యాలయం ఉన్నది. ప్రపంచ దేశాల రాయబార కార్యాలయాలు ఇక్కడే ఉన్నాయి. న్యూయార్క్ పక్కనే ఉన్న నగరం న్యూజెర్సీ. న్యూజెర్సీ నగరం పేరు మీద కూడా ఒక రాష్ట్రం ఏర్పాటు అయ్యింది. ప్రఖ్యాత నల్ల జాతి గాయకుడు పాల్ రాబ్సన్ పుట్టింది పెరిగింది న్యూజెర్సీ రాష్ట్రం లోనే. ఆయన చదువుకున్న ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ న్యూజెర్సీ రాష్ట్రంలోనే ఉన్నది. అమెరికా స్వాతంత్ర్య పోరాటంలో న్యూజెర్సీ రాష్ట్రం కీలక పాత్ర పోషించింది.

ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ

ఈ రాష్ట్రంలో 1776లో ట్రెన్టన్ వద్ద జరిగిన యుధ్ధంలో బ్రిటిష్ సేనల ఓటమి అమెరికా స్వాతంత్ర్యానికి కీలకంగా మారిందని చరిత్రకారులు భావిస్తారు. న్యూయార్క్ న్యూజెర్సీ నగరాలను కలిపె హడ్సన్ నదిపై నిర్మించిన బ్రూక్లిన్ స్టీల్ బ్రిడ్జ్ ఇప్పటికీ ఒక ఇంజనీరింగ్ మార్వెల్‌గా పేరు గాంచింది.

(బ్రూక్లిన్ బ్రిడ్జ్, న్యూయార్క్)

దక్షిణ డకోటా రాష్ట్రం 1889లో 40 వ రాష్ట్రంగా యు.ఎస్.ఏ.లో చేరింది. ఇక్క ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మౌంట్ రష్మోర్ (Mt Rushmore) ఉన్నది ఈ రాష్ట్రంలోనే. దీని ప్రత్యేకత ఏమిటంటే.. అమెరికా నలుగురు అధ్యక్షులు.. వాషింగ్టన్, థామస్ జెఫర్సన్, అబ్రాహామ్ లింకన్, థియోడోర్ రూస్వెల్ట్ ముఖాలను ఈ పర్వతం గోడలపై చెక్కినారు. ఈ బొమ్మల ఎత్తు 465 అడుగులు.

మౌంట్ రష్మోర్

ఉత్తర అమెరికా ఖండంలో 1607లో తొలి బ్రిటిష్ కాలనీ వర్జీనియా రాష్ట్రంలో వెలసింది. దానిని జేమ్స్ టౌన్‌గా పిలిచేవారు. ఈ తొలి అడుగు పడిన తర్వాత అమెరికా తూర్పు ప్రాంతంలో 13 బ్రిటిష్ కాలనీలు తయారు అయినాయి. తమ కాలనీల బ్రిటిష్ పార్లమెంట్ పెత్తనాన్ని, తమ వ్యాపారంపై బ్రిటిష్ చట్టాల ఆంక్షలను అంగీకరించని ఈ రాష్ట్రాలే అమెరికా విప్లవానికి ఊపిరిపోసినాయి. ఈ విప్లవానికి నాయకులను, తొలినాటి అధ్యక్షులను అందజేసిన రాష్ట్రం వర్జీనియా. జార్జ్ వాషింగ్టన్, థామస్ జెఫర్సన్, జేమ్స్ మాడిసన్‌లు వర్జీనియా రాష్ట్రానికి చెందినవారే.

అమెరికాలో అతి ఎత్తైన డ్యాంలు.. కొలరాడో నదిపై నిర్మించిన హూవర్ డ్యాం ఉన్నది నేవేడా, ఆరిజోనా రాష్ట్రాల సరిహద్దులో, కొలంబియా నదిపై నిర్మించిన గ్రాండ్ కూలి డ్యాం ఉన్నది వాషింగ్టన్ రాష్ట్రంలో, ఓవైహి నదిపై నిర్మించిన ఓవైహి డ్యాం ఉన్నది ఓరెగాన్ రాష్ట్రంలో.

అమెరికా రాష్ట్రాల రాజధాని నగరాల పత్యేకత గురించి చెప్పాలి. ఆయా రాష్ట్రాల రాజధాని నగరాలు ఆ రాష్ట్రాలలో ఉన్న పెద్ద నగరాలు కావు. ఉదాహరణకు టెక్సాస్ రాష్ట రాజధాని ఆస్టిన్. టెక్సాస్ రాష్ట్రంలో ఉన్న హ్యూస్టన్, డాలస్ లాంటి పెద్ద నగరాలను కాకుండా ఆస్టిన్‌ను రాజధానిగా ఎంపిక చేశారు. కాలిఫోర్నియా రాష్ట్ర రాజధాని నగరం సాక్రోమేంటో. శాన్ ఫ్రాన్సిస్కో లాంటి పెద్ద నగరం ఉండగా ఈ చిన్న పట్టణాన్ని రాజధానిగా ఎంపిక చేశారు. న్యూయార్ రాష్ట్ర రాజధాని అల్బాని, న్యూజెర్సీ రాజధాని ట్రెన్టన్, ఇల్లినాయిస్ రాజధాని స్ప్రింగ్ ఫీల్డ్, వాషింగ్టన్ రాష్ట్రం రాజధాని ఓలంపియా.. ఇట్లా ప్రతీ రాష్ట్రం రెండవ లేదా మూడవ స్థాయి నగరాలనే ఆయా రాష్ట్రాల రాజధానులుగా ఎంపిక చేయడం ఆశ్చర్యం కలిగించే అంశం. విశ్లేషిస్తే.. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్న ఉద్దేశం ఈ ఎంపికలో ఉందని అనిపించింది. అప్పటికే అన్ని విధాలా అభివృద్ధి చెందిన నగరాలను రాజధానులుగా ఎంపిక చేస్తే అభివృద్ధి కేంద్రీకరణకు దారి తీస్తుంది. రాజధాని చుట్టూ అబివృద్ధికి ప్రభుత్వ పెట్టుబడులు, ప్రైవేటు పెట్టుబడులు రావడానికి అవకాశం ఉన్నది కనుక ఉద్దేశ పూర్వకంగానే చిన్న పట్టణాలను రాష్ట్రాల రాజధానుల ఎంపిక జరిగిందని అనుకోవాలి. రాజధానుల ఎంపిక జరిగినప్పుడు ఈనాడు పెద్ద నగరాలుగా అవతరించిన నగరాలు ఆనాడు పెద్ద నగరాలుగా అభివృద్ధి అయి ఉండక పోవచ్చునని మరికొందరి అభిప్రాయం. ఏది ఏమైనా ఇది ఆసక్తిని రేకెత్తించే అంశం.

ఇకపోతే మరో విశేషం ఏమిటంటే.. అమెరికాలో ప్రతీ రాష్ట్రానికి తనదైన జెండా వేరేగా ఉన్నది. ప్రతీ రాష్ట్రానికి రాష్ట్ర పక్షి, రాష్ట్ర జంతువు, రాష్ట్ర పువ్వు, రాష్ట్ర ఫలం, రాష్ట్ర వృక్షం.. ఇట్లా తమ రాష్ట్ర ప్రత్యేకతలను చాటే ప్రతీకలను ఎంపిక చేసుకున్నారు. ఈ రాష్ట్రాలలో పుట్టిన ఎవరైనా, తల్లిదండ్రులు ఏ దేశస్థులు అయినా, ఏ జాతి వారు అయినా, ఏ మతం వారు అయినా సహజంగా అమెరికా పౌరసత్వాన్ని పొందుతారు. అందుకే భారతీయులు ఇంకా అమెరికా పౌరసత్వాన్ని పొందకపోయినా అక్కడే పిల్లలను కనడానికి ఆసక్తి చూపుతారు. ఇటువంటి సౌలభ్యం మరే దేశంలో లేదు. అమెరికాలో జాతీయ పౌరసత్వం(National Citizenship) తో పాటు రాష్ట్ర పౌరసత్వం (State Citizenship) కూడా ఉండడం మరో ప్రత్యేకత. జాతీయ పౌరసత్వం ఒక వ్యక్తిని అమెరికా పౌరుడిగా గుర్తిస్తుంది. 50 రాష్ట్రాలలో వారు ఎక్కడైనా స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు. రాష్ట్ర పౌరసత్వం మాత్రం ఆ రాష్ట్రానికి సంబందించి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు, విద్య, వైద్యం, పన్నుల చెల్లింపు, చట్ట సభలకు పోటీ చేయడం తదితర ఆ రాష్ట్ర సంబందిత అంశాలకే పరిమితం. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఆ రాష్ట్ర residency certificate. మన ముల్కీ సర్టిఫికేట్ లాంటిదన్నమాట.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version