అమెరికా ముచ్చట్లు-14

0
2

[box type=’note’ fontsize=’16’] తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల శాఖలో ఓఎస్‌డిగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ శ్రీధర్ రావు దేశ్‌పాండే తమ అమెరికా యాత్ర విశేషాలు సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]

ప్రపంచ  జలపాతాల్లో రారాజు నయాగారా

[dropcap]భూ[/dropcap]గోళం మీద వేలాది జలపాతాలు ఉన్నా వాటిల్లో నయాగారా జలపాతం రారాజు లాంటిది. దానికదే సాటి. మరొక దానితో పోల్చడానికి లేదు. దానితోనే ప్రపంచంలో ఇతర జలపాతాలను పోల్చడం జరుగుతుంది. బొగత జలపాతాన్ని ‘తెలంగాణ నయాగారా’గా పోల్చడం చూస్తూనే ఉన్నాము. 2019లో మొదటిసారి అమెరికా వెళ్ళినప్పుడు తప్పక చూడాలని అనుకున్నవి మూడు ఉన్నాయి. అవి.. మొదటిది హూవర్ డ్యాం, రెండవది నయాగారా జలపాతం, మూడవది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. ఈ మూడు కూడా ఆ పర్యటనలో చూడటం జరిగింది. హూవర్ డ్యాం గురించిన ముచ్చట్లు ఇంతకు ముందే రాసి ఉన్నాను. ఈ వారం నయాగారా జలపాతం గురించిన విశేషాలు తెలుసుకుందాము.

టెక్సాస్ రాష్ట్రం డాలస్ నగరం నుంచి న్యూయార్క్ రాష్ట్రంలో ఉన్న బఫెల్లో పట్టణానికి విమానంలో బయలుదేరాము. డాలస్ నుంచి బఫెల్లో పట్టణం సుమారు నాలుగు గంటల ప్రయాణం. బఫెల్లో పట్టణం నయాగారా జలపాతానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ముందే రిజర్వ్ చేసుకున్న ఒక ఇండియన్ వసతి గృహానికి రాత్రి చేరుకొని ఉదయం భారతీయ ఉపాహారం ముగించుకొని టాక్సీలో నయాగార జలపాతానికి బయలుదేరాము.. నేను, నా సతీమణి భారతి, మా ఇద్దరు బిడ్డలు అంజలి, వెన్నెల. అరగంటలో నయాగారా జలపాతానికి చేరుకున్నాము.

దారి పొడుగునా నయాగారా నది మనకు కనపడుతూనే ఉంటుంది. నయాగారా గురించిన విశేషాలు ఆనాటికే చదివి ఉన్నాను, ఫోటోలు, వీడియోలు చూసి ఉన్నాము కనుక జలపాతం దగ్గరపడుతున్నా కొద్ది మనసులో ఆరాటం పెరుగుతూనే ఉన్నది. ఎట్టకేలకు టికెట్లు తీసుకొని లోపలికి వెళ్ళాము. చక్కగా శుభ్రంగా పెంచిన గార్డెన్స్ మనలను లోనికి ఆహ్వానిస్తాయి. నయాగారా జలపాతం అంటే మూడు జలపాతాల సంగమం. వీటికి వేరు వేరు పేర్లు కూడా ఉన్నాయి.

వరుసగా హార్స్ షూ ఫాల్స్ (Horse Shoe Falls), బ్రైడల్ వీల్ ఫాల్స్ (Bridai viel Falls), అమెరికన్ ఫాల్స్ (American Falls). ఈ మూడు కూడా నయాగార నదిపై సుమారు 10 వేల ఏళ్ల కింద ఏర్పడినవని జియాలజిస్టులు తమ అధ్యయనంలో నిర్ధారించారు. జలపాతాలకు ఎగువన నాయాగారా నది రెండుగా చీలిపోవడంతో నది నీటిలో 90 శాతం నీరు అమెరికా కెనడా దేశాల సరిహద్దుగా ఉన్న హార్స్ షూ జలపాతానికి మళ్ళుతాయి. 10 శాతం నీరు అమెరికా భూభాగంలో ఉన్న మిగతా రెండు జలపాతాలకు ప్రవహిస్తాయి. కెనడా దేశంలో నయాగారా జలపాతం ఒంటారియా ప్రావిన్స్ లో ఉండగా అమెరికా వైపు ఉన్న ఈ మూడు జలపాతాలు న్యూయార్క్ రాష్ట్రంలో భాగంగా ఉన్నాయి.

గుర్రపు నాడా ఆకారంలో ఉంటది కనుక ఈ పెద్ద నయాగారా జలపాతాన్ని హార్స్ షూ జలపాతంగా నామకరణం చేశారు. హార్స్ షూ జలపాతాన్ని కెనడా, అమెరికా రేడు దేశాల నుంచి చూడవచ్చు. మిగతా రెండు అమెరికా భూభాగంలో ఉన్నాయి కనుక వాటిని చూడాలంటే అమెరికా వైపు నుంచే సాధ్యం అవుతుంది. ఈ జలపాతాలను వేరు చేసే భూభాగాలను గోట్ ఐల్యాండ్ (Goat Island), యునా ఐల్యాండ్ (Una Island) అని పిలుస్తారు. ఎరీ సరస్సు (Erie Lake) నుండి బయలు దేరే నయాగారా నది నయాగారా ఫాల్స్ నుంచి కిందకు కెనడాలో ఒంటారియా సరస్సు (Ontaria Lake) లో కలిసిపోతుంది. హార్స్ షూ ఫాల్స్ మూడింటిలో నీటి పరిమాణంలో, ఎత్తులో, వెడల్పులో పెద్దది. గుర్రపు నాడా ఆకారంలో ఉండే హార్స్ షూ ఫాల్స్ వెడల్పు 790 మీటర్లు. 57 మీటర్లు ఎత్తు నుంచి నీరు కిందకు దూకుతాయి. అమెరికన్ ఫాల్స్ వెడల్పు 320 మీటర్లు ఉంటుంది. ఎత్తు 21 మీ నుంచి 30 మీ ఉంటుంది. మూడు జలపాతాలు కలిపి ఆ చివర నుంచి ఈ చివరి వరకు 1039 మీ వెడల్పు ఉంటుంది. హార్స్ షూ జలపాతంలో నుంచి కిందకు దూకే అత్యధిక నీటి పరిమాణం 2,30,000 క్యూసెక్కులు. ఏటా సగటున ప్రవహించే నేటి పరిమాణం 85,000 క్యూసెక్కులు. ఈ నీటి పరిమాణాన్ని చూస్తే ఇది ఎంత పెద్ద జలపాతమో అర్థం అవుతుంది. అందుకే ప్రపంచ జలపాతాల్లో రారాజుగా గుర్తింపు పొందింది.

హార్స్ షూ జలపాతం నుంచి నీరు కిందకు దూకిన తర్వాత వెలువడే నీటి తుంపరల మేఘం చాలా దూరం వరకు ఉంటుంది. సూర్య కిరణాలు పడినప్పుడు ఈ మేఘాల వెనుక ఏర్పడే అద్భుతమైన ఇంద్ర ధనుస్సును చూడటం మరొక గొప్ప అనుభవం. ఈ నీటి తుంపరల మేఘాన్ని మెయిడ్ ఆఫ్ మిస్ట్(Maid of Mist) అని పిలుస్తారు. అమెరికా, కెనడా  ప్రభుత్వాలు నయాగారా జలపాతం కింద నదిలో క్రూజ్ షిప్‌ల ద్వారా పర్యాటకులను జలపాతం దగ్గరకు తీసుకు వెళతారు. నీటి తుంపరల మేఘాల నుంచి క్రూజ్ షిప్‌లు ప్రయాణించి పర్యాటకులకు అద్భుతమైన అనుభవాన్ని మిగులుస్తారు. మన బట్టలు తడిచి పోకుండా ఉండటానికి తల నుంచి కాళ్ళ దాకా కప్పి ఉంచే పాలిథీన్ సూట్ మనకు ఇస్తారు. అయినా తిరిగి వచ్చేటప్పటికి తడిసిపోతాము. నయాగారా జలపాతాన్ని సందర్శించే  పర్యాటకులు ఈ మెయిడ్ ఆఫ్ మిస్ట్ ప్రయాణాన్ని తప్పక చేస్తారు.

కెనడా వైపు నుంచే నయాగారా జలపాతానికి సందర్శించే వారికి ఒక్క హార్స్ షూ జలపాతం దగ్గరకి  మాత్రమే వెళ్లగలుగుతారు. అమెరికా వైపు నుంచే చూసే పర్యాటకులకు మూడు జలపాతాల అందాలను అనుభూతించే  అవకాశం ఉంటుంది. మేము మొదట  క్రూజ్ షిప్‌లో హార్స్ షూ ఫాల్స్ వల్ల ఏర్పడే మిస్ట్ ఆఫ్ మెయిడ్ సందర్శన పూర్తి చేసుకొని తర్వాత ఆమెరికన్  ఫాల్స్ వద్దకు వచ్చాము. ఇక్కడ అమెరికా ప్రభుత్వం వారు చెక్కలతో మెట్లు కట్టారు. ఈ చెక్క మెట్ల ద్వారా నీటి ధార వరకు వెళ్ళి జలపాతం అందాలను దగ్గర నుంచి చూడవచ్చు. ఇక్కడకు వెళ్ళే ముందు జలపాతం నిర్వాహకులు నీటి తుంపరలకు తడవకుండా ఉండటానికి అందరికీ పాలిథీన్ సూట్‌లు అందజేస్తారు. వీటిని తొడుక్కొని నీటి ధార వద్దకు వెళతారు. ఫోటోలు దిగుతారు. తనివి తీరదు కనుక  అక్కడి నుండి కదలడానికి మనసొప్పదు. అయితే ఇంకా హార్స్ షూ జలపాతం చూడవలసి ఉన్నది కనుక అమెరికన్ ఫాల్స్ వద్ద మా సందడి ముగించి బయటకు వచ్చాము.

అప్పటికే మధ్యాహ్నం అయ్యింది కనుక జలపాతం ఆవరణ బయట ఒక ఇండియన్ రెస్టారెంట్ లో లంచ్ చేసి తిరిగి జలపాతానికి వచ్చాము. ఇక నేరుగా హార్స్ షూ జలపాతం వద్దకు వెళ్ళాము. ఎత్తు నుంచి కిందకు దిగే దాకా ఫోటోలు తీస్తూనే ఉన్నాము. కన్ను మలపడానికి వీలులేనంత సౌందర్యాన్ని నింపుకున్న హార్స్ షూ జలపాతం మనలను తన వైపుకు రమ్మని పిలుస్తుంది. సాయంత్రం వరకు నయాగారా జలపాతం పరిసరాల్లో కలియదిరిగి బోలెడన్ని ఫోటోలు దిగి బఫెల్లోకి  రాత్రి 7 గంటలకు తిరిగి వచ్చాము. రాతి 10 గంటలకు న్యూ యార్క్ నగరానికి లగ్జరీ బస్సులో బయలుదేరాము.

నయాగారా జలపాతం పర్యాటకం ద్వారా అమెరికా కెనడా రెండు దేశాలకు మంచి ఆదాయం సమకూరుతున్నది. అయితే పర్యాటకం ద్వారానే కాకుండా జలపాతం నుండి రెండు దేశాలు సుమారు 2.4 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ద్వారా కూడా ఆదాయాన్ని పొందుతున్నాయి. రాత్రి 10 గంటల తర్వాత  పర్యాటకుల సంఖ్య తగ్గిపోయిన తర్వాత అధిక నీటి ప్రవాహాలను విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు తరలిస్తారు. తిరిగి ఉదయం నీటి పరిమాణాన్నిపెంచుతారు. ఈ ప్రక్రియను నియంత్రించడానికి  జలపాతానికి ఎగువన ఒక చిన్న డ్యాంను నిర్మించారు. దీన్ని ఇంటర్నేషనల్ కంట్రోల్ డ్యాం అని పిలుస్తారు.

నీటిని నియంత్రించడం, నీటిని రెండు దేశాల వినియోగం కోసం మళ్లించడం తదితర అంశాలను పర్యవేక్షించడానికి రెండు దేశాల మధ్య ఒక 1950లో ఒక ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందంలో భాగంగా ఇంటర్నేషనల్ నయగారా బోర్డ్ కూడా ఏర్పాటు అయ్యింది. ఈ బోర్డు ద్వారానే అన్నీ వ్యవహారాలు సాగుతాయి. నయాగారా జలపాతం నీటి ఉదృతి కారణంగా జలపాతం కోతకు గురి అవుతున్నది. సంవత్సరానికి 3 అడుగుల కోత ఉంటుందని గమనించారు. ఈ రేటున కోత కొనసాగితే 50 వేల సంవత్సరాలలో నయాగారా జలపాతం కనుమరుగు అవుతుంది. అందుకే ఈ కోతను తగ్గించడానికి రెండు దేశాల ప్రభుత్వాలు ఇంజనీరింగ్ ద్వారా కోత రేటును తగ్గించడానికీ నయగారా జలపాతానికి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఈ ట్రీట్మెంట్ జలపాతం కోత సంవత్సరానికి ఒక అడుగుకు తగ్గిపోయిందని, జలపాతం జీవిత కాలం పెరిగిందని అధ్యయనంలో తేల్చారు.

ఇక జలపాతం చరిత్రలోకి వెళితే.. యూరప్ వలసవాదులు ఉత్తర అమెరికా ఖండానికీ రావడం ప్రారంభం అయిన తర్వాత నయాగారా జలపాతాన్ని తొలిసారి చూసి తన అనుభవాలను రికార్డు చేసింది 1604లో ఫ్రెంచ్ దేశపు శామ్యూల్ ఛాంప్లేయిన్. ఆ తరవాత 1677లో లూయిస్ హెన్నిపిన్ జలపాతం గురించి వివరంగా రాసినాడు. 1762లో బ్రిటిష్ సైనిక అధికారి థామస్ డారీస్ నయగారా జలపాతం ప్రాంతాన్ని సర్వే చేసి మ్యాపింగ్ చేసినాడు. జలపాతం పెయింటింగ్ వేసి దానికి “An East vien of the great cataract of Niagara” అని శీర్షిక పెట్టాడు. ఆ తర్వాత అనేక మంది నయగారాను సందర్శించడం జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత నయగారా జలపాతం ఒక అద్భుత పర్యాటక ప్రాంతంగా సామాన్య జనానికి అందుబాటులోకి వచ్చింది. అప్పటికే వాహనాలు అందుబాటులోకి రావడం, రైల్వే సౌకర్యాలు పెరగడంతో పర్యాటకుల సంఖ్య నానాటికీ పెరుగుతూ వస్తున్నది. అమెరికా వైపు నయగారా సిటీలో, బఫెల్లో పట్టణంలో హోటళ్లు, రెస్టారెంట్ లు వచ్చాయి. కెనడా దిక్కు ఒంటారియా ఒక పెద్ద నగరంగా అభివృద్ది అయ్యింది. నయాగారా అందాలను వీక్షించడానికి ఎత్తైన టవర్లు నిర్మాణం అయినాయి.

కెనడా వైపు skylon Tower నిర్మాణం అయ్యింది. అనేక హోటళ్లు కూడా వ్యూపాయింట్ లను ఏర్పాటు చేశాయి. రెండు దేశాలు హెలికాప్టర్ ద్వారా ఆకాశ మార్గాన జలపాతం అందాలను వీక్షించడానికి ఏర్పాట్లు చేశాయి. జలపాతం చలి కాలంలో గడ్డ కట్టుకు పోతుంది. గడ్డ కట్టినప్పుడు జలపాతం మీద 30 మీటర్ల మందం మంచు నీటి పొర ఏర్పడుతుంది. దీని నుంచి పర్యాటకులు  నడిచి వెళతారు. జలపాతం ప్రవహిస్తున్నప్పుడు, గడ్డ కట్టినప్పుడు కూడా పర్యాటకులు ఇక్కడికి వస్తారు. అయితే చలికాలంలో పర్యాటకుల సంఖ్య తక్కువగా ఉంటుంది. మిగతా కాలాల్లో పర్యాటకులు రోజుకు  దాదాపు 50 వేలకు తగ్గరు. సంవత్సరానికి సగటున 20 మిలియన్ల పర్యాటకులు వస్తారని ఒక అంచనా.

నయాగారా జలపాతం సాహాస కృత్యాలు చేసేవారిని కూడా ఆకర్షించింది. నీటిపై తేలియాడే డబ్బాలలో కూచొని జలపాతం నుంచి కిందకు దూకి బతికి బట్ట కట్టిన వారు ఉన్నారు, చనిపోయిన వారు ఉన్నారు. కెనడా అమెరికా మధ్యన నయాగారా జలపాతం కింద రోప్ పై జయప్రదంగా నడిచిన సాహాసికులు కూడా ఉన్నారు. నయాగారా పేరుతో మార్లిన్ మన్రో, జోసెఫ్ కాటన్ నటించిన సినిమా కూడా వచ్చింది.

బోలెడన్ని డాక్యుమెంటరీలు తయారు అయినాయి. కవులు కవిత్వం రాసినారు, హెచ్ జి వెల్స్ లాంటి రచయితలు నవలలు, కథలు రాసినారు. హెచ్ జి వెల్స్ రాసిన The War in the Air ప్రసిద్ది పొందిన నవల. ఎందరో కళాకారులు నయాగార అందాలను పెయింటింగ్ లు వేసినారు. సంగీతకారులు పాటలు రాసి ఆల్బమ్స్ విడుదల చేశారు.  నయాగారా నుంచి ఆహ్లాదాన్ని, స్పూర్తిని  పొందని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ప్రకృతికి ఉన్నశక్తి అది. జలపాతాల ప్రాంతం(Land of water falls) ఆదిలాబాద్ జిల్లా బోథ్ లో పుట్టి పెరిగిన నాకు నయాగార సందర్శన మరచిపోలేని అరుదైన అనుభవం.

చివరకు.. వీటన్నిటితో పాటు నయాగారా వద్ద నన్ను అమితంగా ఆకర్షించిన అంశాలు రెండు ఉన్నాయి. ఒకటి  శుభ్రత. రోజుకు 50 వేల  మంది సందర్శించే నయాగారా జలపాతం పరిసరాలు ఎంత పరిశుభ్రంగా ఉంటాయో చెప్పలేను. చెత్త చెదారం, ప్లాస్టిక్ సీసాలు, సంచులు మచ్చుకు కూడా కానరావు. అడుగడుగునా చెత్త బుట్టలు ఉంటాయి. చెత్తను పిల్లలు సహా అందరూ వాటిల్లోనే వేస్తారు. నిర్వాహకులు ప్రతీ గంటకు వాటిని ఖాళీ  చేస్తారు. శుభ్రత కోసం వందలాది మంది సిబ్బంది నిరంతరం శ్రమిస్తారు. మూత్రశాలలు కూడా పరిశుభ్రంగా ఉంటాయి. పర్యాటకులు బాధ్యతతో మెలగుతారు. నిర్వాహకులు కూడా అంతే బాధ్యతతో వ్యవహరిస్తారు. మా ఊరి వద్ద పొచ్చెర జలపాతం ఉంది. నయాగారాతో పోలిస్తే చాలా చాలా చిన్నది. రోజూకు 50 నుంచి 100 మంది సందర్శకులు వస్తారు. సెలవు రోజుల్లో, పండుగ రోజుల్లో 200 వరకు వస్తారు. పర్యాటకులు తమ వెంట తెచ్చే చెత్తను ఎక్కడబడితే అక్కడ పడేస్తారు. ప్లాస్టిక్, విస్తార్లు, తిండి పదార్థాలు అక్కడనే వదిలేయడం కనిపించింది. చెత్త బాక్సులు ఉన్నా అందులో వేయరు. ఇది పర్యాటకుల బాధ్యతారాహిత్యం. జలపాతం పరిసరాలు మనవి అన్న స్పృహతో మెలగడం పర్యాటకులకు అవసరం.

ఇక రెండవ అంశం.. జలపాతం అంచులలో చిన్ననీటి పాయలు ఉన్న చోట నీళ్ళలో రాగి నాణాలు కనిపించాయి. అమెరికాలో రాగి నాణాల వినియోగం ఇంకా ఉన్నది. ఆ నాణాలు వేస్తుతున్నది భారతీయులు కాదు. అమెరికన్లు లేదా యూరోపియన్లు కావచ్చు. నీటిలో నాణాలు వేసే ఆచారం భారత్ లోనే కాదు అమెరికా, యూరప్ లో కూడా ఉందని ఆ తర్వాత అధ్యయనంలో తెలిసింది. ముఖ్యంగా ఫౌంటైన్స్ ఉన్న చోట్లలో నీళ్ళలో నాణాలు వేసే సాంప్రదాయం పాతదే అని తెలిసింది. నదిలో నాణాలు వేసే సాంప్రదాయం ఏడు సముద్రాల ఆవల కూడా ఉండడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here