Site icon Sanchika

అమెరికా ముచ్చట్లు-18

[box type=’note’ fontsize=’16’] తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల శాఖలో ఓఎస్‌డిగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ శ్రీధర్ రావు దేశ్‌పాండే తమ అమెరికా యాత్ర విశేషాలు సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]

ప్రపంచ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కేంద్రం – సుందర నగరం సియాటిల్

[dropcap]అ[/dropcap]మెరికా ఉత్తర పశ్చిమ రాష్ట్రాలలో వాషింగ్టన్ రాష్ట్రం ఒకటి. ప్రపంచ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి కేంద్రంగా ఉన్న సియాటిల్ నగరం ఈ వాషింగ్టన్ రాష్ట్రంలోనే ఉన్నది. మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి ఐటి దిగ్గజ సంస్థల ప్రధాన కార్యాలయాలు ఉన్నవి సియాటిల్ నగరం లోనే. బోయింగ్ విమానాల తయారీ కేంద్రం ఉన్నది ఇక్కడే. అమెరికాలో రెండవ అతి పెద్ద జల విద్యుత్ కేంద్రం గ్రాండ్ కూలి డ్యాం ఉన్నది కూడా వాషింగ్టన్ రాష్ట్రం లోనే. గ్రాండ్ కూలి డ్యాంను సందర్శించాలన్న కోరికనే నేను వాషింగ్టన్ రాష్ట్రం సందర్శించడానికి ప్రధాన కారణం. 2022 జూన్ 27,28, 29 తేదీల్లో సియాటిల్ నగరం ఉన్నాము. ఆ రోజుల్లో నా ఇంజనీర్ మిత్రుడు కొండపల్లి వేణుగోపాల రావు గారు అమెరికాలో సియాటిల్ నగరం లోనే ఉండడంతో వారి అబ్బాయి భార్గవ ఇంట్లోనే మాకు బస ఏర్పాటు అయ్యింది. వాషింగ్టన్ రాష్ట్రంలో ఈ మూడు రోజుల్లో చూడగలినన్ని ప్రదేశాలకు మమ్ములని తీసుకుపోయాడు వేణు.

స్నోక్వాల్మి(Snoqualmie) జలపాతం:

మొదటి రోజు గ్రాండ్ కూలి డ్యాంని చూడటానికి పోయాము. డ్యాం పర్యటన విశేషాలు ఇప్పటికే 9వ భాగంలో రాసి ఉన్నాను కాబట్టి ఆ విషయాలు మళ్ళీ ప్రస్తావించను. రెండవ రోజు ఉదయం సియాటిల్ నగరానికి 60-70 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్నోక్వాల్మి  (Snoqualmie) జలపాతానికి వెళ్ళాము. వేణు అక్కడిదాకా కారు డ్రైవ్ చేస్తూ తీసుకుపోయాడు. తనకు అమెరికా డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. ఇక దారి చూపించడానికి గూగుల్ మ్యాప్ ఉండనే ఉంది. ఈ జలపాతం స్నోక్వాల్మి నదిపై ఉన్నది.

స్నోక్వాల్మి జలపాతం పార్క్ లో కొండపల్లి వేణుగోపాల రావు గారితో

దగ్గరలోనే అదే పేరుతో ఒక చిన్న పట్టణం కూడా ఉన్నది. దాదాపు 30 మీటర్ల వెడల్పుతో 82 మీటర్ల ఎత్తు నుంచి కిందకు దూకుతున్న నీటి ప్రవాహం చూపరులను కట్టి పడవేస్తుంది. సరిగ్గా జలపాతానికి ఎదురుగ్గా ఒక వ్యూ పాయింట్ కూడా ఉండడంతో జలపాతం సుందర దృశ్యం మన ముందు ఆవిష్కృతమౌతుంది. ఇదే పేరుతో అమెరికా స్థానిక జాతి ప్రజలు ఇక్కడ యుగాలుగా నివసిస్తూ ఉన్నారని జలపాతం వద్ద ఏర్పాటు చేసిన బోర్డుల్లో రాసినారు. National Register of Historic Places వారు 1992లో ఈ జలపాతం ప్రదేశాన్ని స్నోక్వాల్మి జాతి ప్రజల Traditional National Cultural Property గా ప్రకటించినారు.

స్నోక్వాల్మి జలపాతం వద్ద రచయిత, భారతి గారు

జలపాతానికి రెండు జల విద్యుత్ ప్లాంట్‌లు కూడా ఏర్పాటు అయినాయి. కుడి వైపున 13,500 కిలోవాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో మొదటి ప్లాంట్‌ను 1899లో, రెండవ ప్లాంట్‌ను 27,000 వేల కిలోవాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో 1910లో Puget Sound Energy కంపెనీ వారు నిర్మించారు. 1957లో రెండవ ప్లాంట్ సామర్థ్యాన్ని మరింత పెంచారు. జలపాతానికి సుమారు 50 మీటర్ల ఎగువన చిన్న డ్యాంను నిర్మించారు. ఈ డ్యాం వెనుక నిల్వ అయిన నీటిని పెన్ స్టాక్స్ ద్వారా జలపాతం కింద నిర్మించిన జల విద్యుత్ కేంద్రాలకు మళ్లించి విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. విద్యుత్ ఉత్పత్తి తర్వాత ఆ నీరంతా తిరిగి నదిలోకి వెళతాయి. జలపాతం వద్దకు వచ్చే నీటిలో అత్యధిక నీరు ఈ రెండు జల విద్యుత్ ప్లాంట్ లకు మళ్ళిస్తారు. ఎగువ నుంచి నదిలోకి వచ్చే అధిక నీరంతా డ్యాంను దాటుకొని జలపాతం నుంచి కిందకు దూకి నదిలోకి వెళతాయి. 1899లో నిర్మించిన జల విద్యుత్ ప్లాంట్‌ను అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజినీర్స్ (ASCE) వారు 1981లో Civil Engineering Land Mark గా గుర్తించినారు. మేము ఈ జలపాతాన్ని సందర్శించినప్పుడు అదృష్టవశాత్తు జలపాతంలో నీటి ఉధృతి బాగానే ఉంది. జలపాతాలకు నిలయమైన ఆదిలాబాద్ జిల్లాలో పుట్టిన నన్ను జలపాతాలు కట్టి పడవేస్తాయి. అమెరికాలో నేను చూసిన జలపాతాల్లో ఇది రెండవది.

జలపాతం వద్ద వెన్నెలతో

2019లో వచ్చినప్పుడు న్యూయార్క్ రాష్టంలో ఉన్న నయగారా జలపాతాన్ని చూసాము. నయాగారా జలపాతం విశేషాలను 14వ భాగంలో వివరించి ఉన్నాను. స్నోక్వాల్మి జలపాతం పరిసర ప్రాంతాన్ని ప్రభుత్వం అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసింది. ఇక్కడికి ఏటా 15 లక్షల మంది పర్యాటకులు జలపాతాన్ని సందర్శించడానికి వస్తారట. మేము మూడు గంటల పాటు జలపాతం అందాలను, స్నోక్వాల్మి పార్క్ సోయగాలను ఆస్వాదించి తిరిగి ఇంటిదారి పట్టాము.

హీరమ్ ఎం చిట్టెన్డెన్ లాక్స్(Hiram M Chittenden Locks) :

మధ్యాహ్నం లంచ్ తర్వాత మళ్ళీ సియాటిల్ నగర సందర్శనకు బయలుదేరాము. మేము నలుగురం, మాతో పాటు వేణుగోపాలరావు, ఆయన సతీమణి కొండపల్లి నీహారిణి గారు కూడా వచ్చారు. మొదట లేక్ వాషింగ్టన్ షిప్ కెనాల్‌పై 1917లో నిర్మించిన చిట్టెన్డెన్ లాక్స్ చూడటానికి వెళ్ళాము. లాక్స్ వద్ద పడవలను దాటించడానికి జరిగే ప్రక్రియ ఇంజనీర్లుగా మాకు తెలిసిందే. ఆ ప్రక్రియను ప్రత్యక్షంగా చూడటానికి ఒక గంట సమయం పట్టింది. ఒక వంద మీటర్ల వెడల్పుతో ఉన్న ఈ కాలువలో 30 నుంచి 40 పడవలు, చిన్న స్టీమర్లు లేక్ వాషింగ్టన్ లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాయి.

సియాటిల్ చిట్టెన్డెన్ లాక్స్ ఏరియల్ వ్యూ

మొదట వాషింగ్టన్ లేక్‌లో ఉన్న నీటి మట్టానికి సమానంగా కాలువలో కూడా నీటి మట్టాన్ని పెంచే ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ఒక అర  గంటలో రెండింటి నీటి మట్టాలు ఒకే స్థాయికి రాగానే కాలువకు లేక్ వాషింగ్టన్ మధ్యన ఉన్న గేట్లను తెరిచారు. కాలువలో నుంచి పడవలు, స్టీమర్లు వాషింగ్టన్ లేక్ లోకి వెళ్లిపోయినాయి. ఈ లాక్స్ ను కూడా ASCE వారు సివిల్ ఇంజనీరింగ్ ల్యాండ్ మార్క్‌గా గుర్తించినారు.

లాక్స్ లో నుంచి ప్రయాణిస్తున్న మర పడవలు

ఈ చారిత్రాత్మకమైన లాక్స్ వద్ద ఒక అద్భుతమైన బొటానికల్ గార్డెన్‌ను కూడా సియాటిల్ నగర అధికారులు అభివృద్ది చేశారు.

బొటానికల్ గార్డెన్ లో కొండపల్లి నీహారిణి, భారతి గార్లు

మనం ఇండియాలో ఎక్కడా చూడలేని పూల మొక్కలను చూడటం ఒక గొప్ప అనుభవం. వాటి ముందు ఫోటోలు దిగి రావడానికి మరో అర గంట సమయం పట్టింది.

గార్డెన్ లో ఒక పూల మొక్క
గార్డెన్ లో ఒక పూల మొక్క

ఫెర్రీలో బెయిన్ బ్రిడ్జ్ దీవికి ప్రయాణం:

లాక్స్ వద్ద నుంచి సియాటిల్ హార్బర్‌కు వెళ్ళాము. అక్కడ నుంచి ఫెర్రీలో బెయిన్ బ్రిడ్జ్ (Bainbridge) దీవికి వెళ్ళాము. పసిఫిక్ మహా సముద్రంలో ఫెర్రీలో ప్రయాణించడం కోసమే బెయిన్ బ్రిడ్జ్ దీవికి ప్రయాణమైనాము. ఈ ఫెర్రీలోకి మనం కారుతో సహా వెళ్ళవచ్చు. మన కారులోనే దీవిలో షికారు చేసి మళ్ళీ ఫెర్రీలో కారుతో తిరిగి రావచ్చు.

బెయిన్ బ్రిడ్జ్ దీవికి ఫెర్రీ ప్రయాణంలో కనిపిస్తున్న మౌంట్ రైనర్ & సియాటిల్ హార్బర్

అరగంట పాటు సాగిన ఫెర్రీ ప్రయాణాన్నిడెక్ మీద నిలబడి ఎంజాయ్ చేశాము. ఫోటోలు దిగాము. ఫెర్రీ మీద నుంచి సియాటిల్ నగరం ఫోటోలను తీసాము. పసిఫిక్ మహా సముద్రపు చల్లటి గాలులు ఆహ్లాదకరంగా ఉన్నాయి. ఫెర్రీ హార్బర్ నుంచి దూరం అవుతున్నా కొద్దీ సియాటిల్ నగరంలోని ఆకాశ హార్మ్యాలు, స్పేస్ నీడిల్ టవర్, దూరంగా మౌంట్ రైనర్ మంచు పర్వతం కనిపించడం మొదలయ్యింది. వాటిని కెమెరాల్లో బంధించాము.

ఫెర్రీ డెక్ పై నుంచి తీసిన సియాటిల్ నగర దృశ్యం

తిరుగు ప్రయాణానికి చివరి ఫెర్రీ ఒక గంటలోనే ఉండడంతో మాకు బెయిన్ బ్రిడ్జ్ దీవిలో గడపడానికి ఒక గంట సమయం మాత్రమే మిగిలింది. దీనితో దీవిలో ఎక్కువ సేపు గడప లేకపోయాము. దీవి చిన్నదే. అక్కడ ఒక పట్టణం అభివృద్ధి అయి ఉన్నది. ఈ దీవిలో నివసించే ప్రజలు ఉద్యోగాల కోసం, ఇతరత్రా, వ్యాపారాలు, కొనుగోళ్ల కోసం నిత్యం ఫెర్రీలో సియాటిల్ నగరానికి వస్తారు. చివరి ఫెర్రీలో తిరిగి వస్తారు. అక్కడ ఒక ఐస్ క్రీమ్‌లు అమ్మే షాపులో ఎవరికి కావలసిన ఐస్ క్రీమ్‌లు వారు కొనుక్కొని ఫెర్రీలో తిరుగు ప్రయాణానికి బయలుదేరాము.

మరో అరగంట పసిఫిక్ మహా సముద్రంలో ప్రయాణించి సియాటిల్ హార్బర్‌కు చేరుకున్నాము. అప్పటికే చీకటి పడడంతో మిగతా పర్యాటక స్థలాలకు మరుసటి రోజు వెళదామని నిర్ణయించుకొని ఇంటి ముఖం పట్టాము.

భూగర్భ నగర సందర్శన:

సియాటిల్‌లో మూడవ రోజు జూన్ 28న నగరంలో ప్రధాన ఆకర్షణ అయిన భూగర్భ నగర సందర్శనతో ఆరంభించాము. దీని కథ ఆసక్తిదాయకమైనది. సియాటిల్ డౌన్ టౌన్‌లో ఉన్నఈ ప్రాంతాన్ని పయనీర్ స్క్వేర్ (Pioneer Square) అంటారు.

కాలిపోయిన సియాటిల్ భూగర్భ నగరం లోపలి దృశ్యం

సియాటిల్ నగరాన్నిఎమరాల్డ్ సిటీ (Emerald City) అంటారట. తొలుత ఈ నగరాన్ని 1851లో నిర్మించడం మొదలయ్యిందట. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి తక్కువ ఎత్తులో ఉండడంతో తరచూ సముద్రపు అలల తాకిడికి గురి అయి ఇళ్ళు, దుకాణాలు, రెస్టారెంట్‌లు మునిగి పోయేవట. ఇదిలా ఉండగా 1889లో భయంకరమైన అగ్ని ప్రమాదం సంభవించి పయనీర్ స్క్వేర్‌లో భవనాలు చాలా మట్టుకు కాలిపోయి పయనీర్ స్క్వేర్ ప్రాంతం శిథిల పట్టణంగా మారిపోయింది. అంతకు ముందు భవనాలు అన్నీకలపతో నిర్మించినవి కావడంతో అగ్ని ప్రమాదంలో తీవ్రంగా నష్టానికి గురి అయినాయి. కాలిపోయిన నగరాన్ని పునర్నిర్మించడానికి వారు కలపకు బదులుగా ఇటుకలను వాడాలని నిర్ణయించారు. సముద్ర అలల తాకిడి నుంచి నగరాన్నిరక్షించడానికి సముద్ర మట్టానికి ఎత్తున కూడా నిర్మించాలని నిర్ణయించారు. అయితే కాలిపోయిన నగరం పైననే, అవే భవనాలపై కొత్త అంతస్తులను నిర్మించారు. ఇప్పుడు కొత్త నగరం రహదారుల కింద, భవనాల కింద కాలిపోయిన పాత నగరం ఉంటుంది. కింద ఉన్ననగరం లోపలికి పోవడానికి నిచ్చెన దారులు ఏర్పాటు చేశారు.

భూగర్భ నగరం లోపలి నుంచి అద్దాల కిటికీల నుంచి పైన వీధులు

భూగర్భ నగరం సముద్ర మట్టానికి 30 అడుగుల లోతున ఉంటుంది. పైన మామూలు కార్యకలాపాలు సాగుతుండగా కింద భూగర్భ నగరం సంఘ విద్రోహ శక్తులకు, వ్యభిచారానికి, మాదక ద్రవ్యాల వ్యాపారానికి కేంద్రాలుగా మారిపోయింది. 1907లో సియాటిల్ నగరంలో వ్యాపించిన ప్లేగు వ్యాధికి ఈ భూగర్భ నగరమే కేంద్ర స్థానంగా మారడంతో చాలా కాలం భూగర్భ నగరాన్ని మూసి వేశారట. 1950 కాలిపోయిన, కూలిపోయిన భూగర్భ నగరాన్ని పర్యాటక కేంద్రంగా మార్చడానికి టూర్ ఆపరేటర్లు ప్రయత్నాలు చేసి జయప్రదంగా సందర్శకులు భూగర్భ నగరాన్ని వీక్షించడానికి వీలుగా దారులు, లైట్లు  ఏర్పాటు చేశారు. లోపల స్వచ్ఛమైన గాలి సరఫరా కోసం వెంటిలేటర్లు ఏర్పాటు చేశారు. భూగర్భ నగర చరిత్రని, విశేషాలను వివరించడానికి గైడ్ లు కూడా పర్యాటకుల వెంట వస్తారు.

భూగర్భ నగర మ్యూజియం

ఈ భూగర్భ నగర పర్యటన దాదాపు గంటన్నర పాటు కొనసాగుతుంది. మా వెంట ఒక మహిళా గైడ్ చాలా చోట్లలో మమ్ములను నిలిపి విశేషాలను వివరిస్తూ ఉంది. ఆమె అమెరికన్ accent అర్థం కాకపోవడంతో ఆమె చెప్పిన విశేషాలు, ఆమె పేల్చిన జోకులు ఏమిటో పిల్లలను అడిగి తెలుసుకోవలసి వచ్చింది. భూగర్భ నగరం పైన కొన్ని చోట్లలో మందమైన అద్దాల కిటికీలు ఏర్పాటు చేశారు. వాటిపైన నడిచే పాదచారులు కింద ఉన్న మనకు కనిపిస్తూ ఉంటారు. భూగర్భ నగర పర్యటనలో చివరి మజిలీ ఒక మ్యూజియం లాంటిది.

భూగర్భ నగర మ్యూజియం

ఆనాటి ప్రజలు వాడిన అనేక వస్తువులను ప్రదర్శనకు పెట్టారు. జ్ఞాపికలు అమ్మకానికి ఉన్నాయి. భూగర్భ నగరం విశేషాలను వివరిస్తూ రాసిన పుస్తకాలు అమ్మకానికి పెట్టారు. అక్కడ ఒక పుస్తకం, ఒక జ్ఞాపిక కొనుక్కొని బయటకు వచ్చాము. మా గైడ్ అందరికీ చిరునవ్వుతో వీడ్కోలు పలికింది. కాలిపోయిన భూగర్భ నగరం పైననే మరొక కొత్త నగరాన్ని నిర్మించడం ఒక ఇంజనీరింగ్ అద్భుతం అనిపించింది. అదే విధంగా ఆ కాలిపోయిన భూగర్భ నగరాన్ని ఒక పర్యాటక ప్రాంతంగా, ఒక ఆదాయ వనరుగా మార్చడం అబ్బురంగా తోచింది.

సియాటిల్ డౌన్ టౌన్ – గం వాల్ సందర్శన:

సియాటిల్ డౌన్ టౌన్ వీధుల్లో తిరగడం ఒక మరచిపోలేని అనుభవం. మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి ఐటి కంపెనీల ప్రధాన కార్యాలయాలు అన్నీఇక్కడే ఉన్నాయి. ఆకాశాన్ని చుంబించే బహుళ అంతస్తుల భవనాలు, పార్కులు, వేల రకాల మొక్కలతో అమెజాన్ కంపెనీ ఏర్పాటు చేసిన అద్దాల భవనం.. ఇవన్నీ చూస్తూ డౌన్ టౌన్ వీధుల్లో తెగ తిరిగాము. వాటి ముందు ఫోటోలు దిగాము. వీకెండ్ సెలవు దినం కావడంతో అమెజాన్ మొక్కల మ్యూజియం చూడలేకపోయాము.

సియాటిల్ డౌన్ టౌన్ లో ఒక దృశ్యం

చూయింగ్ గం వాల్:

అక్కడి నుంచి దగ్గరలో ఉన్న చూయింగ్ గం వాల్ ఉన్న వీధిని చూడటానికి పోయాము. ఇది ఒక గమ్మత్తైన, ఇరుకు వీధి. 100 మీటర్ల పొడవు ఉన్న చిన్నసందు లాంటి వీధిలో రెండు వైపులా గోడలకు లక్షల సంఖ్యలో రంగురంగుల చూయింగ్ గం ముద్దలను అతికించిన విచిత్ర దృశ్యం కనబడింది. ప్రతీ రోజు వందల మంది ఇక్కడికి వచ్చి చూయింగ్ గం లను అతికించి పోతారట. ఇది ఏమి సెంటిమెంట్? ఎప్పుడు ప్రారంభం అయ్యింది? అనే సంగతులు తెలుసుకోవడానికి ఇంటర్నెట్‌లో గూగులమ్మను ఆశ్రయించవలసి వచ్చింది. అక్కడ లభించిన సమాచారాన్ని బట్టి ఈ గం వాల్ ఉన్న ప్రదేశాన్ని పైక్ ప్లేస్ మార్కెట్ (Pike Place Market) అంటారు.

సియాటిల్ చూయింగ్ గం వాల్

1990 దశకం నుంచి ఈ పైక్ వీధిలో ఉన్న చూయింగ్ గం వాల్ సియాటిల్ లో ఒక పర్యాటక ప్రాంతంగా ప్రాచుర్యాన్ని పొందింది. ఈ ప్రాంతం సంగీత కచేరీలు, కామెడీ షో లు నిర్వహించే ఒక థియేటర్‌కు దగ్గరలో ఉంది. ఈ షో లకు వచ్చే ప్రేక్షకులు చూయింగ్ గం ను ఈ వీధిలో ఉన్న గోడలకు అతికించడం మొదలు పెట్టారట. ముఖ్యంగా యువతీ యువకులు తమ ప్రేమ ఫలించాలని కోరుకుంటూ ఇక్కడ చూయింగ్ గం అతికించడం ఒక సాంప్రదాయంగా మారింది. అనతి కాలంలోనే వేలాది మంది తమ ప్రేమ ఫలించాలని కోరుతూ ఈ వీధికి వచ్చి చూయింగ్ గం అతికించడం ఒక సంరంభంగా మారింది.

చూయింగ్ గం తో నిండి పోయిన గోడ

మొదట్లో పైక్ మార్కెట్ అధికారులు ఈ గం వాల్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేసే వారట. అయితే చూయింగ్ అతికించడానికి ప్రతీ రోజు వందల సంఖ్యలో యువతీ యువకులు వస్తుండడంతో ఇక గోడను శుభ్ర పరిచే కార్యక్రమానికి ముగింపు పలికారు. దానితో గోడ మీద కొన్ని ఇంచుల మందంతో చూయింగ్ గం నిండిపోయింది. 2000 సంవత్సరం నాటికి అమెరికా అంతటా దీనికి ప్రాచుర్యం లభించింది. సియాటిల్ నగరాన్ని సందర్శించే దేశ్, విదేశీ పర్యాటకులు ప్రతీ ఒక్కరూ ఈ గం వాల్ ను తప్పక సందర్శిస్తారు. ఏటా లక్షల సంఖ్యలో పర్యాటకులు ఈ గం వాల్ ను చూడటానికి వస్తారు. వారు కూడా చూయింగ్ గం ను అతికించి పోతారు. కొంత మంది కళాకారులు ఈ వాల్ పై చూయింగ్ గం తో కళా ఖండాలు కూడా సృష్టించారు. ప్రపంచంలో అత్యంత క్రిమిపూరిత పర్యాటక కేంద్రాలలో (Germiest Tourist Attractions) సియాటిల్ చూయింగ్ గం వాల్ 5 వ స్థానాన్ని పొందింది. అందుకే 2015 లో పైక్ మార్కెట్ అధికారులు గోడను శుభ్రం చేశారట. 2,350 పౌండ్ల చూయింగ్ గం ను ఈ గోడ నుంచి తొలగించినారట.

చూయింగ్ గం వాల్ ఉన్న పైక్ వీధి

అయినా కూడా మళ్ళీ చూయింగ్ గం అతికించడం ప్రారంభం అయ్యింది. మేము 2022 జూన్‌లో సందర్శించినప్పుడు గోడల నిండా చూయింగ్ గం తో కనిపించింది. మనం మన సాంస్కృతిక కేంద్రాలు, స్మారకాలు, ప్రాచీన వారసత్వ కట్టడాలపై బొగ్గుతో పేర్లు రాసుకుంటాము కదా. అది భారతీయులుగా మనకున్న పిచ్చి. అట్లే ఎవరి పిచ్చి వారికి ఆనందం అనుకోని మేము కూడా ఇక్కడ కొన్ని ఫోటోలు తీసుకున్నాము. అయితే చూయింగ్ గం అతికించే సాహాసం మాత్రం చేయలేదు. ఇటువంటి విచిత్రమైన, గమ్మత్తైన పర్యాటక కేంద్రం అమెరికాలో మరెక్కడా లేదట. అక్కడి నుండి సియాటిల్ నగరానికి ఐకాన్ గా ఉన్న స్పేస్ నీడిల్ టవర్ చూడటానికి వెళ్ళాము.

స్పేస్ నీడిల్ టవర్:

పారిస్ నగరానికి ఐఫిల్ టవర్, న్యూయార్క్ నగరానికి స్టాచ్యు ఆఫ్ లిబర్టీ, ఢిల్లీ నగరానికి కుతుబ్ మీనార్, ఆగ్రా నగరానికి తాజ్ మహల్, మన హైదరాబాద్ నగరానికి చార్మినార్ ఎట్లా ఐకాన్ లాగా భాసిల్లుతున్నాయో ఈ స్పేస్ నీడిల్ టవర్ కూడా సియాటిల్ నగరానికి ఐకాన్. వీటిని చూడగానే ఆయా నగరాలు గుర్తుకు వస్తాయి. ఐఫిల్ టవర్ లాగానే ఇది కూడా ఒక అద్భుతమైన స్టీల్ నిర్మాణం. 1961 ఏప్రిల్ నెలలో ప్రారంభం అయిన స్పేస్ నీడిల్ నిర్మాణం డిసెంబర్ నెలలో పూర్తి అయ్యింది. అన్నీ పరీక్షలు పూర్తి అయిన తర్వాత 1962 ఏప్రిల్ నెలలో సందర్శకులకు అనుమతించడం ప్రారంభం అయ్యింది. స్పేస్ నీడిల్ ఎత్తు యాంటెనా తో కలుపుకుంటే 605 అడుగులు (184.40 మీటర్లు), స్పేస్ నీడిల్ పై అంతస్తు ఎత్తు 518 అడుగులు (158 మీటర్లు). స్పేస్ నీడిల్ నిర్మాణానికి 8,660 మెట్రిక్ తన్నుల స్టీల్ ను వాడినారట. మొత్తం మూడు లిఫ్ట్‌లు సందర్శకులను స్పేస్ నీడిల్ పై అంతస్తుకు 40 సెకండ్లలో చెరవేస్తాయి.

సియాటిల్ ఐకాన్ స్పేస్ నీడిల్ టవర్

అక్కడి నుండి సియాటిల్ నగరం అందాలను చూడవచ్చు. మౌంట్ రైనర్ మంచు పర్వతం ఇక్కడి నుంచి చాలా అందంగా మెరుస్తూ కనిపిస్తుంది. రాత్రి వేళల్లో లైట్ల వెలుతురులో సియాటిల్ నగర సౌందర్యం వర్ణించనలవి కాదు. స్పేస్ నీడిల్ కార్పొరేషన్ వారు దీని నిర్వాహణ బాధ్యత చూస్తున్నారు. సియాటిల్ నగర సందర్శనకు వచ్చే పర్యాటకులకు ఇది తప్పనిసరి దర్శనీయ స్థలం. స్పేస్ నీడిల్ పైన ఒక గంట సేపు విహరించి సియాటిల్ నగర అందాలను వీక్షించి కిందకు వచ్చాము. కింది అంతస్తులో గిఫ్ట్ షాప్‌లు ఉన్నాయి. స్పేస్ నీడిల్ ను ప్రతిబింబించే ఎన్నెన్నో వస్తువులు ఇక్కడ అమ్మకానికి ఉంటాయి. మేము ఒక అడుగు ఎత్తు ఉన్న స్పేస్ నీడిల్ మోడల్ ను, మాగ్నెట్ జ్ఞాపికలు కొనుక్కున్నాము. అప్పటికే చీకటి పడడంతో ఇంటి దారి పట్టాము.

స్పేస్ నీడిల్ పై నుంచి సూర్యాస్తమయం
స్పేస్ నీడిల్ పై నుంచి సియాటిల్ నగర దృశ్యం

మా విమానం రాత్రి 11.30 ఉండడంతో ఇంటికి వెళ్ళి సామాన్లు సర్దుకొని డిన్నర్ చేసి క్యాబ్‌లో ఎయిర్పోర్టు చేరుకున్నాము. మూడు రోజులు వేణుగోపాల రావు, వారి సతీమణి కొండపల్లి నీహారిణి, వారి కొడుకు భార్గవ, కోడలు వైష్ణవి, వారి ఇద్దరు మనవరాళ్ళు మయురా, కేయూర.. అందరి ఆప్యాయమైన ఆతిథ్యం ఎన్నటికీ మరువలేనిది. మాయురా, కేయూరా మాకు చాలా బాగా మాలిమి అయినారు. ముఖ్యంగా చిన్నది కేయూరా.. పూర్వ జన్మ సంబంధం ఏదో ఉన్నట్టుగా భారతికి అల్లుకుపోయింది. నీహారిణి, భారతి ఒకరి పుస్తకాలు మరొకరు ఇచ్చి పుచ్చుకున్నారు. నేను నీహారిణి గారు రాసిన ఆమె అమెరికా యాత్రా స్మృతి ‘అమెరికాలో ఆరు నెలలు’ పుస్తకాన్ని అడిగి తీసుకున్నాను. నేను కూడా నా అమెరికా యాత్రా స్మృతిని రాయాలని ప్లాన్ చేసుకుంటున్నాను కనుక ఆ పుస్తకం నాకు స్ఫూర్తిని ఇస్తుందని భావించాను. వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పి డాలస్‌కు వయా లాస్ వేగస్ బయలు దేరాము. మరుసటి రోజు తెల్లవారి 8 గంటలకు డాలస్ చేరుకున్నాము.

ఇట్లా.. వాషింగ్టన్ రాష్ట్ర పర్యటన ఫలప్రదంగా జరిగి గొప్ప అనుభూతులను మిగిల్చింది.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version