Site icon Sanchika

అమెరికా ముచ్చట్లు-19

[box type=’note’ fontsize=’16’] తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల శాఖలో ఓఎస్‌డిగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ శ్రీధర్ రావు దేశ్‌పాండే తమ అమెరికా యాత్ర విశేషాలు సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]

ఆస్టిన్‌లో లిండన్ జాన్సన్ స్మారక గ్రంథాలయం

టెక్సాస్ రాజధాని ఆస్టిన్ ప్రయాణం:

[dropcap]అ[/dropcap]మెరికా రాష్ట్రాల రాజధాని నగరాల ప్రత్యేకత గురించి అమెరికా ముచ్చట్లు 13వ భాగంలో ఇప్పటికే వివరించాను. ఆయా రాష్ట్రాల రాజధాని నగరాలు ఆ రాష్ట్రాలలో ఉన్న పెద్ద నగరాలు కావు. ఉదాహరణకు టెక్సాస్ రాష్ట రాజధాని ఆస్టిన్. టెక్సాస్ రాష్ట్రంలో ఉన్న హ్యూస్టన్, డాలస్ లాంటి పెద్ద నగరాలను కాకుండా ఆస్టిన్‌ను రాజధానిగా ఎంపిక చేశారు. కాలిఫోర్నియా రాష్ట్ర రాజధాని నగరం సాక్రోమేంటో. శాన్ ఫ్రాన్సిస్కో లాంటి పెద్ద నగరం ఉండగా ఈ చిన్న పట్టణాన్ని రాజధానిగా ఎంపిక చేశారు. న్యూయార్క్ రాష్ట్ర రాజధాని అల్బాని, న్యూజెర్సీ రాజధాని ట్రెన్టన్, ఇల్లినాయిస్ రాజధాని స్ప్రింగ్ ఫీల్డ్, వాషింగ్టన్ రాష్ట్రం రాజధాని ఓలంపియా.. ఇట్లా ప్రతీ రాష్ట్రం రెండవ లేదా మూడవ స్థాయి నగరాలనే ఆయా రాష్ట్రాల రాజధానులుగా ఎంపిక చేయడం ఆశ్చర్యం కలిగించే అంశం. విశ్లేషిస్తే.. అభివృద్ది వికేంద్రీకరణ జరగాలన్న ఉద్దేశం ఈ ఎంపికలో ఉందని అనిపించింది. మా పిల్లలు ఉండేది టెక్సాస్ రాష్ట్రంలో ఉన్న పెద్ద నగరాల్లో ఒకటైన డాలస్‌లో. టెక్సాస్ రాష్ట్ర రాజధాని ఆస్టిన్ నగరం డాలస్ నుంచి కారులో 4 గంటల ప్రయాణం. మా చెల్లెలు వరుస అయిన వినయ, శేఖర్ దంపతులు ఉండేది ఆస్టిన్ లోనే. అమెరికా వచ్చినప్పుడు ఆస్టిన్ వచ్చి తమ ఆతిథ్యం స్వీకరించాలని వినయ మరీ మరీ కోరింది. వినయకు ‘యాది – మనాది’ వేణు సంస్మరణ సంచిక పుస్తకాలు కూడా ఇవ్వాలని అనుకున్నాను. అందులో వినయ రాసిన ఒక ఆత్మీయ వ్యాసం ఉంది. 2022 జూలై 1 న సాయంత్రం నాలుగు గంటలకు కారులో ఆస్టిన్ బయలుదేరాము. రాత్రి 8 గంటల కల్లా ఆస్టిన్‌లో వినయ వాళ్ళ ఇంటికి చేరుకున్నాము. మా పెద్దమ్మాయి అంజలి నాలుగు గంటలు, మధ్యలో ఒక టీ బ్రేక్, హైవే మీద డ్రైవ్ చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆస్టిన్‌కు చేర్చింది. మేము వెళ్ళేటప్పటికి వినయ మా కోసం డిన్నర్ ఏర్పాట్లు పూర్తి చేసింది. మాకు పడకలు సిద్ధం చేసింది. అమెరికాలో ఇళ్ళు విశాలంగా, సౌకర్యవంతంగా కట్టుకుంటారు. వారిది మూడు బెడ్ రూంల డూప్లెక్స్ ఇల్లు. కింద మాకు, పైన పిల్లలకు పడక ఏర్పాట్లు చేసింది. డిన్నర్ అయినాక అర్ధరాత్రి దాటే వరకు వరకు వినయ, భారతి వొడువని ముచ్చట్లు చెప్పుకున్నారు. వాళ్ళిద్దరు రెండు మూడు ఏళ్ల నుంచి ఫోన్ల ద్వారా, వాట్సాప్‌ల ద్వారా సంభాషించుకుంటున్నారు. అట్లా వాళ్ళిద్దరూ మంచి స్నేహితులుగా మారిపోయారు. ఆ రాత్రి వారి ముచ్చట్లకు అంతు లేకుండా పోయింది. శేఖర్, నేను, పిల్లలం నిద్రకు ఉపక్రమించినా వారు ఏ రాత్రి వరకు మాట్లాడుకున్నారో తెలియదు. ఆ రాత్రి మరుసటి రోజు సందర్శించాల్సిన స్థలాల జాబితా తయారు చేసుకున్నాము. అందులో ముఖ్యమైనవి ఆస్టిన్‌లో ఉన్న స్టేట్ క్యాపిటల్ భవనం, అమెరికా 36వ అధ్యక్షుడు లిండన్ బి జాన్సన్ స్మారక గ్రంథాలయం ఉన్నాయి.

టెక్సాస్ క్యాపిటల్ భవనం సందర్శన:

తెల్లవారి మాకంటే ముందే నిద్ర లేచి టిఫిన్‌ల ఏర్పాట్లు చూడసాగింది వినయ. భారతి, పిల్లలు ఆ పనిలో భాగం పంచుకున్నారు. బ్రేక్‌ఫాస్ట్, స్నానాలు అవి కానిచ్చుకొని 10 గంటలకు నగర పర్యటనకు బయలుదేరాము. వినయ, శేఖర్‌లు ఆఫీసు పని ఉండడంతో వారు ఇంట్లోనే ఉండిపోయారు. గూగుల్ మ్యాప్ సహాయంతో ఆస్టిన్ క్యాపిటల్ బిల్డింగ్ భవనం పరిసరాలకు చేరుకున్నాము.

ఆస్టిన్ లో క్యాపిటల్ బిల్డింగ్
క్యాపిటల్ భవనం ముందు పచ్చదనం

ఆ రోజుల్లో అమెరికా అంతటా తీవ్రమైన ఎండలు దంచి కొడుతున్నాయి. ఆస్టిన్‌లో కూడా విపరీతమైన వేడి వాతావరణం అలుముకొని ఉన్నది. అయితే క్యాపిటల్ బిల్డింగ్ పరిసరాలు నిండైన చెట్లతో, పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉండింది. క్యాపిటల్ భవనం వద్ద జనాలతో కోలాహలంగా ఉండింది. శనివారం కావడంతో సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉన్నది.

రెండవది క్యాపిటల్ బిల్డింగ్ వద్ద రెండు గ్రూపుల ధర్నాలు, ఊరేగింపులు జరుగుతున్నాయి. కాపిటల్ బిల్డింగ్ చూడటం కన్నా ఈ ధర్నాల సంగతి చూడాలని ఆసక్తిగా వారి వద్దకు వెళ్ళాము. వారు ప్రదర్శిస్తున్న పోస్టర్లు చూసాము. ఒక గ్రూపు ఉక్రేయిన్‌పై రష్యా దాడిని వ్యతిరేకిస్తూ నినాదాలు ఇస్తున్నారు. బహుశా వారంతా అమెరికాలో నివసిస్తున్న ఉక్రెయిన్ దేశస్తులు అయి ఉంటారని అనిపించింది.

ఆస్టిన్ క్యాపిటల్ భవనం ముందు ఉక్రెయిన్ వాసుల ధర్నా
ఆస్టిన్ క్యాపిటల్ భవనం ముందు ఉక్రెయిన్ వాసుల ధర్నా

Dont Mess with Ukrane, Kick off Russia From Ukrane, Stop Russia Now, Russia Kills లాంటివి వారి చేతుల్లో కనిపించాయి. ధర్నాలో ఒక 50 మంది ఉంటారేమో! అయితే వారు తమ దేశంపై జరుగుతున్న దాడిని వ్యతిరేకిస్తూ ఆవేశంగా నినాదాలు ఇస్తున్నారు.

ఇక రెండవ గ్రూపు మరి కొంచెం పెద్దది. వారంతా ఆమెరికన్లే. ఉక్రేనియన్లు క్యాపిటల్ బిల్డింగ్ వద్దకు పోవడానికి సాహాసం చేయలేకపోయారు. కానీ స్వదేశస్తులైన వీరు మాత్రం ఊరేగింపుగా నినాదాలు ఇస్తూ క్యాపిటల్ బిల్డింగ్ ఎదురుగా 50 అడుగుల దూరంలో నిల్చొని నినాదాలు ఇస్తున్నారు. అంతకు కొద్ది రోజుల క్రితం అబార్షన్‌లపై అమెరికా సుప్రీం కోర్టు ఒక వివాదాస్పదమైన తీర్పును వెలువరించింది. అమెరికాలో కొన్ని రాష్ట్రాలలో అబార్షన్లు చట్టబద్దం. మరికొన్ని రాష్ట్రాలలో చట్ట విరుద్దం. అమెరికా సుప్రీం కోర్టు అబార్షన్లు చట్ట విరుద్దమైనవిగా పేర్కొంటూ మెజారిటీ తీర్పు వెలువరించింది. ఆ రోజుల్లో ఈ తీర్పుపై అమెరికాలో విస్తృతమైన చర్చ జరుగుతున్నది. బిడ్డను కనాలా వద్దా అనేది స్త్రీల నిర్ణయాధికారానికి సంబందించింది తప్ప నిర్బంధం కాదు. ఒక స్త్రీ తను బిడ్డను కనదలుచుకోలేకపోతే అబార్షన్ ఆమె హక్కు. ఈ హక్కును నిరాకరిస్తూ అమెరికా సుప్రీం కోర్టు మెజారిటీ తీర్పును వెలువరించడం పట్ల ఆమెరికా మహిళలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా లాంటి ప్రజాస్వామిక దేశంలో, వ్యక్తిగత స్వేచ్ఛకు అధిక ప్రాధాన్యతను ఇచ్చే దేశంలో సుప్రీం కోర్టు స్త్రీల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగకరంగా ఉండే ఈ తీర్పును వెలువరించడం పట్ల ఆమెరికా మేధావి వర్గం విమర్శిస్తూ పత్రికల్లో వ్యాసాలు రాస్తూనే ఉన్నారు. విశ్వవిద్యాలయాల్లో చర్చలు, సెమినార్లు నిర్వహిస్తున్నారు. రాష్ట్రాల చట్ట సభల ముందు ధర్నాలకు దిగుతున్నారు. ఆస్టిన్‌లో క్యాపిటల్ భవనం ముందు మాకు ఇటువంటి ఒక దృశ్యం కనబడింది.

క్యాపిటల్ భవనం ముందు అబార్షన్ తీర్పుకు వ్యతిరేకిస్తూ ధర్నా

భారతి కొద్దిసేపు వారికి సంఘీభావంగా క్యాపిటల్ బిల్డింగ్ ముందు వారితో పాటు నిలబడింది. గమ్మత్తైన విషయం ఏమిటంటే క్యాపిటల్ బిల్డింగ్ ముందు వీరు సుప్రీం తీర్పును వ్యతిరేకిస్తూ ధర్నా చేస్తుంటే, వారి ముందే నిలబడి ఒకే ఒక వ్యక్తి అబార్షన్లను వ్యతిరేకిస్తూ బైబిల్ లోని వాక్యాలను, ఎవరైనా వింటున్నారా లేదా అన్న పట్టింపు లేకుండా, చదువుతూ ఉన్నాడు. వారికి దూరంగా పోలీసు బలగాలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా నివారించడానికి సిద్దంగా ఉన్నారు తప్ప ధర్నాకు ఎటువంటి ఆటంకాన్ని కలిగించలేదు.

అబార్షన్ తీర్పుకు వ్యతిరేకంగా ధర్నాలో భారతి

ఆ తర్వాత క్యాపిటల్ బిల్డింగ్ లోనికి ప్రవేశించాము. క్యాపిటల్ భవనం అంటే ఆ రాష్ట్ర చట్ట సభ లాంటిదన్న మాట. అద్భుతమైన యూరోపియన్ భవన నిర్మాణ శైలితో నిర్మించిన ఈ భవనం చూడ ముచ్చటగా ఉన్నది. భవనం మధ్యలో ఒక డోం ఉంటుంది. ఆరో ఏడో అంతస్తుల భవనం అది. అన్నీ అంతస్తుల్లో గోడలపై టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ల వర్ణ చిత్రాలను అమర్చారు.

క్యాపిటల్ బిల్డింగ్ గోడలపై వేలాడ దీసిన గవర్నర్ల వర్ణ చిత్రాలు

అసెంబ్లీ హాలు, కోర్టు హాలు, లైబ్రరీ, రీడింగ్ రూం.. ఇవన్నీ ఆ భవనంలో ఉన్నాయి. మామూలు రోజుల్లో కోర్టు హాల్‌లో కూసోని కోర్టులో వాదనలు కూడా వినవచ్చునట. ఆ రోజు శనివారం సెలవు దినం కావడంతో మేము అవకాశాన్నికోల్పోయాము. ఒక గంట సేపు క్యాపిటల్ బిల్డింగ్‌లో గడిపి బయటకు వచ్చాము. పోయే ముందు ఉన్న నిరసనకారులు లేరు. బైబిల్ పఠనం మాత్రం కొనసాగుతున్నది. బహుశా ఆయన ఆ రోజంతా ఆ కార్యక్రమాన్ని కొనసాగించి ఉంటాడు. క్యాపిటల్ భవనం బయట చెట్ల మధ్య చాలా ఫోటోలు దిగాము. టెక్సాస్ రాష్ట్ర చరిత్రతో ముడివడిన ప్రముఖ వ్యక్తుల విగ్రహాలు కూడా క్యాపిటల్ బిల్డింగ్ ముందు ఉన్న పార్క్‌లో నెలకొల్పినారు. అవన్నీ ఆసక్తిగా చూస్తూ ఫోటోలు తీస్తూ క్యాపిటల్ భావన సందర్శన ముగించాము.

లిండన్ బి జాన్సన్ అధ్యక్ష గ్రంథాలయం:

లంచ్ తర్వాత దగ్గరలోనే ఉన్న లిండన్ జాన్సన్ స్మారక గ్రంథాలయానికి వెళ్ళాము. ఈ గ్రంథాలయం టెక్సాస్ విశ్వవిద్యాలయం కాంపస్ లోనే నిర్మించారు. ఈ గ్రంథాలయం అమెరికా 36వ అధ్యక్షుడిగా పని చేసిన లిండన్ జాన్సన్ పేరు మీద నెలకొల్పినారు. ఆయన టెక్సాస్ రాష్ట్రానికి చెందిన వాడు కాబట్టి ఈ గ్రంథాలయాన్ని టెక్సాస్ రాష్ట్ర రాజధాని నగరం ఆస్టిన్‌లో నెలకొల్పినారు. అమెరికాలో ఇటువంటి అధ్యక్ష గ్రంథాలయాలు 13 ఉన్నట్టు, మరో రెండు నిర్మాణంలో ఉన్నట్టు తెలిసింది. వీటిని Presidential Libraries అంటారు. ఇటువంటి అధ్యక్ష గ్రంథాలయాల్లో మొదటగా ఆమెరికాకు నాలుగు సార్లు అధ్యక్షుడిగా ఎన్నికైన ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ పేరిట ఏర్పాటు అయింది. ఆ తర్వాత న్యూయార్క్ రాష్ట్రంలో హెర్బర్ట్ హూవర్, మిసోరి రాష్ట్రంలో హ్యారీ ట్రూమన్, కాన్సాస్ రాష్ట్రంలో ఐసెన్ హోవర్, ముసాచుసెట్స్ రాష్ట్రం బోస్టన్‌లో జాన్ ఎఫ్ కెన్నెడీ, టెక్సాస్ రాష్ట్రం ఆస్టిన్‌లో లిండన్ జాన్సన్, కాలిఫోర్నియా రాష్ట్రంలో రిచర్డ్ నిక్సన్, మిషిగాన్ రాష్ట్రంలో గెరాల్డ్ ఫోర్డ్, జార్జియా రాష్ట్రం అట్లాంటాలో జిమ్మీ కార్టర్, కాలిఫోర్నియాలో రోనాల్డ్ రీగన్, టెక్సాస్ ఏ & ఎం యూనివర్సిటీలోజార్జ్ బుష్ సీనియర్, అర్కాన్సాస్ రాష్ట్రంలో క్లింటన్, టెక్సాస్ రాష్ట్రం డాలస్‌లో జార్జ్ బుష్ జూనియర్‌ల పేరిట అధ్యక్ష గ్రంథాలయాలు ఏర్పాటు అయినాయి. ఇల్లినాయిస్ రాష్ట్రంలో బరాక్ ఒబామా, న్యూయార్క్ రాష్ట్రంలో డొనాల్డ్ ట్రంప్ పేరిట మరో రెండు అధ్యక్ష గ్రంథాలయాలు నిర్మాణంలో ఉన్నట్టు తెలుస్తున్నది.

లిండన్ జాన్సన్ అధ్యక్ష గ్రంథాలయ భవనం

ఆస్టిన్‌లో నిర్మించిన అధ్యక్ష గ్రంథాలయంలో లిండన్ జాన్సన్, అతని భార్య, అతని సన్నిహుతులకు సంబంధించిన సమస్త సమాచారాన్ని, లక్షలాది పత్రాలను, ఫోటోలను, జ్ఞాపికలు, ఆడియో టేపులను ఈ పది అంతస్తుల భవనంలో భద్రపరచినారు. ఈ అధ్యక్ష గ్రంథాలయాలను అమెరికా National Archives and Records Administration వారు నిర్వహిస్తారు. వీటి నిర్మాణాలకు ప్రభుత్వ సొమ్ము కాకుండా ప్రైవేటు వ్యక్తులు, సంస్థల నుండి విరాళాలు సేకరిస్తారు. లిండన్ జాన్సన్ గ్రంథాలయానికి భూమిని, 15 మిలియన్ డాలర్ల సొమ్ముని టెక్సాస్ యూనివర్సిటీ వారు కేటాయించినారట. 1963-69 మధ్యన గ్రంథాలయ నిర్మాణం పూర్తి చేసి 1971లో సందర్శకులకు అందుబాటులో ఉంచారు. ఈ లైబ్రరీ ప్రారంభోత్సవానికి జాన్సన్‌తో పాటు ఆనాటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ కూడా పాల్గొన్నాడు.

జాన్సన్ గ్రంథాలయం లోపలి దృశ్యం

ఈ గ్రంథాలయాన్ని మొత్తంగా చూడటానికి ఒకరోజు సరిపోదు. అయినా మేము కొన్ని అంతస్తులు మాత్రమే చూడగలిగినాము. ముఖ్యంగా వియత్నాం యుద్ధానికి సంబందించిన పత్రాలు, సమాచారం ఉంచిన అంతస్తుల్లో ఎక్కువ సేపు గడిపాము. వైట్ హౌజ్‌లో అధ్యక్షుడి కార్యాలయాన్ని ఓవల్ ఆఫీసు (Oval Office) అంటారు. బహుశా అది ఓవల్.. కోడి గుడ్డు ఆకారంలో ఉండడం వలన దాన్ని ఓవల్ ఆఫీసు అంటారని అనిపించింది. జాన్సన్ అధ్యక్షుడిగా ఉన్నప్పటి ఓవల్ ఆఫీసు నమూనాను జాన్సన్ అధ్యక్ష గ్రంథాలయంలో ఒక అంతస్తులో ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి ఆస్టిన్ క్యాపిటల్ బిల్డింగ్ దృశ్యం సందర్శకులను ఆకర్షిస్తుంది.

గ్రంథాలయంలో జాన్సన్ ఓవల్ ఆఫీసు నమూనా

వియత్నాం యుద్ధంలో అమెరికా దుర్మార్గమైన పాత్ర ప్రపంచానికి తెలిసిందే. జాన్సన్ హయాంలోనే 1960వ దశకంలో వియత్నాంపై యుద్ధం చేసింది అమెరికా. తూర్పు ఆసియాలో ఉన్న ఒక చిన్న దేశం వియత్నాంపై యుద్ధం కోసం అమెరికా 1,25,000 మంది సైనికులను పంపింది. అయితే వియత్నాం దేశభక్త గెరిల్లా యుద్ధం ముందు అమెరికా సైన్యం తలవంచక తప్పలేదు. ఇంటా బయటా పెరిగిన ఒత్తిడికి ఏమీ సాధించకుండానే వేల మంది సైనికులను కోల్పోయి అమెరికా తన సైన్యాన్ని వెనక్కు రప్పించ్చింది. ఇది అమెరికాకు ఒక పెద్ద ఓటమి. వియత్నాం యుద్ధం జాన్సన్‌కు ఇదొక సవాలుగా ఉండింది. జాన్సన్ అధ్యక్ష కాలంలో 1964లో ‘సివిల్ రైట్స్ ఆక్ట్’ను తీసుకొచ్చిన తర్వాతనే అమెరికాలో నల్ల జాతి వారికి వోటు హక్కు లభించింది. వియత్నాం యుద్ధం విషయంలో జాన్సన్ ప్రపంచ వ్యాప్తంగా చెడ్డ పేరు తెచ్చుకున్నప్పటికీ సివిల్ రైట్స్ ఆక్ట్ ఆయనకు అమెరికా చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని కల్పించింది. ఈ కాలం లోనే పౌర హక్కుల ఉద్యమకారుడు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ చేసిన ఉపన్యాసం I Have a Dream అమెరికాలో పౌర హక్కుల ఉద్యమాన్ని మలుపు తిప్పింది. నల్ల జాతి వారికి వోటు హక్కు వచ్చిన 44 సంవత్సరాలకు, అమెరికాకు స్వాతంత్య్రం వచ్చిన 233 సంవత్సరాలకు ఒక నల్ల జాతి వ్యక్తి బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడు కాగలిగినాడు. అయితే ఇప్పటికీ ఒక మహిళ మాత్రం అధ్యక్షులు కాలేకపోయింది. కమలా హారిస్ అమెరికాకు మొదటి మహిళా ఉపాధ్యక్షురాలు.

జాన్సన్ గ్రంథాలయంలో పుస్తకాల కొనుగోలు:

ఈ గ్రంథాలయం గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒక గమ్మత్తైన ఈ ఫోటో ఉంచారు. ఆ ఫోటోలో జాన్సన్ కొంచెం ముందుకు వంగి నిలబడి ఉంటాడు. ఆ ఫోటో ముందు నిలబడి జాన్సన్‌తో మాట్లాడుతున్నట్టు సందర్శకులు ఫోటోలు దిగుతారు. నేను కూడా ఆ ఫోటో ముందు నిలబడి “ఎందివయా జాన్సన్.. వియత్నాంతో యుద్ధం ఎందుకు చేసావు” అని అడుగుతున్నట్టు పోజిచ్చా. మా పిల్లలు క్లిక్ మనిపించారు.

ఇదేమి యుద్ధం జాన్సన్ గారు

గ్రంథాలయంలో జాన్సన్ మైనపు బొమ్మను కూడా ప్రతిష్ఠించారు. ఈ గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఒక గిఫ్ట్ షాప్ కూడా ఉంది. పుస్తకాలు, జ్ఞాపికలు తదితరాలు చాలా అమ్మకానికి పెట్టారు. నేను ఈ షాప్ లోకి దూరిపోయాను. భారతి పిల్లలు పై అంతస్తుల్లోకి వెళ్లిపోయారు. నేను పుస్తకాలు చూస్తూ ఉండిపోయాను. అక్కడ అమెరికా చరిత్రకు సంబందించి కొన్ని పుస్తకాలు కనిపించాయి.

అధ్యక్ష గ్రంథాలయంలో లిండన్ జాన్సన్ మైనపు బొమ్మ
జాన్సన్ మైనపు బొమ్మ ముందు రచయిత

అవి అమెరికా ప్రథమ అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ రాసిన Rules of Civility & Behaviour, The Bill of Rights, The Declaration of Independence and Short Biographies of its Signers, The US Constitution and Other Key American Writings, Gateway to Freedom. ఇవి రెండు సెట్స్ కొన్నాను. ఒక సెట్ ఇండియా వచ్చాక ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి అందజేశాను.

ఒకరి కోసం ఒకరం వెతుకులాట:

పుస్తకాల షాప్ నుంచి బయటకు రాగానే మా వాళ్ళు ఎవరూ కనిపించలేదు. ఈ లోపున మూత్రశాలకు మెట్లు దిగి కిందకు వెళ్ళాను. అక్కడ Rest Room అని రాసి ఉంది. అక్కడ నిజంగానే రెస్ట్ టీసుకోవడానికి చక్కగా సోఫాలు ఉన్నాయి. ఆ సోఫాలలో నా పుస్తకాల బ్యాగ్‌ను పెట్టి పని అయ్యాక ఒక రెండు నిమిషాల్లో బయటకు వచ్చాను. సోఫాలో పుస్తకాలు మాయం. కంగు తిన్నాను. అమెరికాలో కూడా పుస్తకాల దొంగలు ఉంటారా అనిపించింది. పైకి వెళ్ళి రిసెప్షన్‌లో కంప్లైంట్ చేశాను. వారు ఇవేనా పుస్తకాలు అని తీసి చూపించారు. రెస్ట్ రూంలో ఎవరూ లేకపోయేసరికి సెక్యూరిటీ గార్డ్ వాటిని రెస్ట్ రూం నుంచి తీసుకొచ్చి రిసెప్షన్‌లో జమ చేశాడు. హమ్మయ్య అనుకున్నాను. నా ప్రథమ నిష్ఠూరానికి సిగ్గుపడినాను. అప్పటికే మా వాళ్ళకు దూరమై గంట సమయం గడిచింది. వాళ్ళు నా కోసం గాలిస్తూ ఉన్నారు. ఇంటర్నెట్ లేదు కాబట్టి ఫోన్ కాంటాక్ట్ లేదు. ఆఖరుకు పిల్లలు కనబడినారు. అమ్మను ఒక చోట కూచోబెట్టి, ఎక్కడికి పోవద్దని హెచ్చరించి నా కోసం వెతుక్కుంటూ భవనం అంతా తిరుగుతున్నారు. “ఎక్కడికి పోయినారే” అని వారినే దబాయించే సరికి కంగు తిన్నారు. “నీ కోసం బిల్డింగ్ అంతా వెతుకుతూ తిరుగుతున్నాము. ఇక పోలీస్ కంప్లైంట్ ఇద్దామని అనుకుంటున్నాము.. ఈ లోగా కనిపించావు” అని ఊపిరి పీల్చుకున్నారు. వాళ్ళు పుస్తకాల షాపులో కూడా చూశారట. నేను కనబడలేదట. మొత్తం మీద కలుసుకున్నాము. మళ్ళీ అందరం కలిసి మూడు అంతస్తులు తిరిగాము. సాయంత్రం నాలుగు వరకు తిరిగి అలసిపోయాము. బయట ఎండ వేడిమి చూసి ఎక్కడికి పోవాలని అనిపించక ఇంటికి వచ్చేసాము. రాత్రి వినయ, శేఖర్ లను తీసుకొని ఒక అరేబియన్ రెస్టారెంట్‌లో డిన్నర్‌కు వెళ్ళాము. ఆ రెస్టారెంట్‌లో ఒక మూలన ఆఫ్ఘనిస్తాన్ శరణార్థులు తయారు చేసిన వస్తువులను అమ్మకానికి పెట్టారు. వారిని ప్రోత్సహించడానికి కొన్ని వస్తువులు కొన్నాము. దానితో ఆస్టిన్‌లో మొదటి రోజు పర్యటన ముగిసింది.

ఒయాసిస్ రెస్టారెంట్:

రెండో రోజు అంటే జూలై 3న ఎండకు బయపడి ఎక్కడికీ వెళ్లలేదు. సాయంత్రం ట్రెవిస్ సరస్సు ఒడ్డున కొండపై ఉన్న ఒయాసిస్ రెస్టారెంట్‌కు వెళ్ళి సూర్యాస్తమయాన్ని చూసి అక్కడే డిన్నర్ కానిచ్చి రాత్రి 9 గంటలకు అమెరికా స్వాతంత్య్ర దినం సందర్భంగా ఏర్పాటు చేసిన పటాకుల సంబురాలను చూసి ఇంటికి వచేద్దామని నిర్ణయించుకున్నాము. ఆ రోజు ఆదివారం కావడంతో ఒయాసిస్‌కు జనం పోటెత్తారు. వినయ శేఖర్‌లు ఒక కార్లో, మేము మా కార్లో బయలుదేరాము. అయితే ఒయాసిస్ చేరుకున్న తర్వాత పార్కింగ్‌కి స్థలం దొరకక వినయ వాళ్ళు వెనక్కి వెళ్లిపోయారు. అంజలి పార్కింగ్‌కి స్థలం వెతుకుతూ ఉంది. ఈ లోపు సూర్యాస్తమయ సమయం దగ్గరపడింది.

ఒయాసిస్ రెస్టారెంట్ వద్ద సూర్యాస్తమయం దృశ్యం

జనం కొండ మీద అప్పటికే అనువైన స్థలాలు వెతుక్కొని కెమెరాలతో సిద్ధంగా ఉన్నారు. మేము అష్టకష్టాలు పడి కొంత జాగా సంపాదించాము. 5 నిమిషాలు సూర్యాస్తమయాన్ని చూడగలిగినాము. ఫోటోలు, వీడియోలు తీసుకున్నాము. ఇక్కడి నుంచి ఈ దృశ్యాన్ని చూడటానికి వేలాది మంది రావడం ఆశ్చర్యం కలిగించింది. అర్ధగంట ముందే వచ్చి జాగా దొరికిచ్చుకొని ఈ 5 నిమిషాల దృశ్యం కోసం ఎదురు చూస్తారు. ఆ తర్వాత ఓయాసిస్ డిన్నర్ ఎట్లన్నా చేసేదే.

ఒయాసిస్ రెస్టారెంట్ వద్ద సూర్యాస్తమయం దృశ్యం

ఈ స్థలానికి The Sunset Capital of Texas అని పేరు. వీకెండ్స్‌లో ఈ దృశ్యాన్ని చూడటానికి జనం ఎగబడతారట. ఆ రోజు ఒయాసిస్‌లో చాలా మంది తెలుగు వాళ్ళు కనిపించారు. ఇటువంటి సూర్యాస్తమయాలు మన ఊర్లో ప్రశాంతంగా ఏ హడావుడి లేకుండా ఎన్నిసార్లు చూడలేదు!!. ఇక్కడ సూర్యోదయాలు ఎవరు చూడరు. ఎందుకంటే ఆ సమయానికి నిద్ర లేచే అలవాటు గానీ, సాంప్రదాయం గానీ లేదు. మన పల్లెల్లో కోడి కూత తోనే హడావుడి మొదలవుతుంది. అద్భుతమైన సూర్యోదయాలను, సూర్యాస్తమయాలను మన వాళ్ళు ప్రతి రోజు ప్రశాంతంగా చూస్తూనే ఉంటారు. ఇక్కడ అదొక సంరంభం. ఒక ప్రయాస. ఒక పర్యాటక ఆకర్షణ.

ఆస్టిన్‌లో ఫైర్ వర్క్స్:

ఇక ఆ వేలాది జనంలో ఒయాసిస్‌లో డిన్నర్ ఆలోచన మానుకొని లిబర్టీ హిల్స్‌లో ఏర్పాటు చేసిన ఫైర్ వర్క్స్ చూడటానికి పయనమైనాము.

పోయే ముందు.. ఒయాసిస్‌లో ఏర్పాటు చేసిన చిన్నపిల్లల బొమ్మలు నన్ను ఆకర్షించాయి. వాటిని ఫొటోల్లో బందించాను.

కప్ప దుంకులు
పిల్లల ఆటలు
బావిలో నుంచి నీళ్ళు తోడడం
కంబైన్డ్ స్టడీ

సరిగా రాత్రి 9 గంటలకు ప్రారంభమైన ఫైర్ వర్క్స్ ఒక 15 నిమిషాలు ఆకాశంలో వెలుగులు విరజిమ్మాయి. జూలై 4 అమెరికా స్వాతంత్య్ర దినం. ఈ సందర్భంగా జూలై 3,4 తేదీల్లో రెండు రోజులు అమెరికా అంతటా అన్ని నగరాల్లో అబ్బురపరచే ఈ ఫైర్ వర్క్స్ జరుగుతాయట. ప్రజలు వేలాది మంది పిల్లా పాపలతో వీటిని చూడటానికి వస్తారు. న్యూయార్క్‌లో హడ్సన్ నది ఒడ్డున జరిగిన అద్భుతమైన ఫైర్ వర్క్స్‌ను టివిలో జూలై 4న లైవ్‌లో చూసే అవకాశం లభించింది.

లిబర్టీ హిల్స్ వద్ద ఫైర్ వర్క్స్
లిబర్టీ హిల్స్ వద్ద ఫైర్ వర్క్స్

మూడవ రోజు జూలై 4న సాయంత్రం వరకు ఉండాలని అనుకున్న వాళ్ళం ఎండకు భయపడి పొద్దున్నే డాలస్‌కు బయలుదేరాము. బయలుదేరే ముందు వినయ, శేఖర్ లతో కలిసి వారి ఇంటి ముందు ఫోటోలు దిగాము. వారి ప్రేమ పూర్వక ఆతిథ్యానికి కృతజ్ఞతలు చెప్పి డాలస్‌కు బయలుదేరాము.

ఆతిథ్యం ఇచ్చిన వినయ శేఖర్ లతో అంజలి వెన్నెల

ఇట్లా ఆస్టిన్ పర్యటన సంతృప్తికరంగా ముగిసింది.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version