అమెరికా ముచ్చట్లు-2

0
2

[box type=’note’ fontsize=’16’] తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల శాఖలో ఓఎస్‌డిగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ శ్రీధర్ రావు దేశ్‌పాండే తమ అమెరికా యాత్ర విశేషాలు సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]

అమెరికా పద్ధతులు అన్ని ఉల్టా పుల్టా

[dropcap]కొ[/dropcap]త్తగా భారత్ నుంచి అమెరికా వచ్చే వాళ్ళకు ఇక్కడి పద్ధతులు అలవాటు కావాలంటే కొంత కాలం పడుతుంది. ఎందుకంటే ఇక్కడివన్ని ఉల్టా పుల్టా పద్ధతులు.

బాత్ రూమ్ లోకి వెళ్ళి లైట్ స్విచ్ ఆన్ చేయడానికి మనం కట్కా కిందకు నొక్కుతాము. అది అంతకు ముందే కిందకి నొక్కి ఉంటుంది. స్విచ్ ఆన్ లోనే ఉన్నా లైట్ వెలుగుత లేదంటే బల్బు పాడయిందని అనుమానం వస్తుంది. ఎందుకైనా మంచిదని కట్కా పైకి నొక్కినాను. లైట్ వెలిగింది. ఇంట్లో అన్ని స్విచ్‌లు నొక్కి చూశాను. పైకి నొక్కితేనే లైట్ వెలుగుతుంది. ఇక్కడ లైట్ స్విచ్ ఉల్టా ఉందని అర్థం అయ్యింది. అయినా అలవాటు ప్రకారం ప్రతీసారి కట్కా కిందకి నొక్కి మళ్ళీ పైకి నొక్కడం జరుగుతూనే ఉంటుంది. అలవాటులో పొరపాటు.

మన లాప్‌టాప్ చార్జర్, సెల్ ఫోన్ చార్జర్ ఇక్కడి స్విచ్ బోర్డులకు సరిపోవు. వీరిది అంతర్జాతీయ స్టాండర్డ్‌కు భిన్నం. మనకు ప్రత్యేకమైన యూనివర్సల్ అడాప్టర్ అవసరం అవుతుంది. పిల్లలు ఆర్డర్ పెట్టి ఆడాప్టర్ తెప్పించేవరకు నా లాప్‌టాప్ మూసి వేసుకోవాల్సి వచ్చింది. సెల్ ఫోన్ మాత్రం చార్జ్ చేసుకోగలిగాను. నాది “సి” టైప్ చార్జర్. పిల్లల వద్ద సి టైప్ చార్జర్ ఉండడంతో బతికి పోయాను.

ప్రపంచం అంతా దూరాలను కిలోమీటర్లలో కొలుస్తున్నారు. అమెరికాలో మాత్రం ఇంకా మైళ్లలోనే దూరాలను కొలవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. చిన్న కొలతలను ప్రపంచం మీటర్లలో కొలిస్తే ఇక్కడ అమెరికాలో అడుగుల్లో కొలుస్తారు. ఇక్కడి కార్లలో స్పీడో మీటర్ కూడా వేగాన్ని మైళ్లలోనే కొలుస్తుంది. కిలోమీటర్ల లోకి కన్వర్ట్ చేయాలంటే 2.5 తో గుణించవలసి ఉంటుంది. ప్రపంచం భూమిని హెక్టార్లలో కొలిస్తే అమెరికాలో ఇంకా ఎకరాల్లోనే కొలుస్తున్నారు. ఇదొక ఉల్టా వ్యవవహారం.

డీజిల్, పెట్రోలును మనం లీటర్లలో కొలుస్తాము. ఇక్కడ అమెరికాలో గ్యాలన్లలో కొలుస్తారు. ఒక అమెరికా గ్యాలన్ అంటే 3.78 లీటర్లకు సమానం. మన దగ్గర కార్లకు, వాహనాలకు కుడి వైపు స్టీరింగ్ ఉంటుంది. ఇక్కడ అమెరికాలో ఎడమ వైపు స్టీరింగ్. మన దగ్గర రోడ్డు మీద కీప్ లెఫ్ట్ పద్ధతి. అమెరికాలో కీప్ రైట్ పద్ధతి. మన కార్లు గేర్లతో ఉంటాయి. ఇక్కడ కార్లకు గేర్లు ఉండవు. అలవాటు కొద్ది కార్లో కూచునేటప్పుడు ఎడమ వైపుకు పోతే అక్కడ స్టీరింగ్ మీద మా బిడ్డ దర్శనం ఇస్తుంది. అటు వైపు కూచో నాన్న అని ప్రతీ సారి నా అజ్ఞానాన్ని ఎత్తి చూపుతుంది నవ్వుతూ. ఒకసారి హైదరాబాద్‌లో నా డ్రైవర్‌కు ఈ సంగతి చెపితే అతను నన్ను అడిగిన ప్రశ్నకు బిత్తర పోయాను. “సార్ అక్కడ లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్ అట కదా. కుడికి తిప్పితే ఎడమకు, ఎడమకు తిప్పితే కుడికి పోతదట కదా సార్”. ఈ సంగతి పిల్లలకు చెపితే ఒకటే నవ్వు. వాళ్ళను ఇప్పటికీ ఈ విషయంలో బనాయిస్తూనే ఉంటాను.

మనది బ్రిటిష్ పద్ధతి. ఇంచులు, అడుగులు, ఎకరాలు ఇట్లా.. ఎకరాలు జన సామాన్యంలో ఉన్నాయి. కానీ భారత ప్రభుత్వ అధికారిక పత్రాల్లో హెక్టార్లు రాస్తున్నారు. అయితే బ్రిటిష్ కొలమానాన్ని మనతో పాటు ప్రపంచం ఎప్పుడో వదిలేసింది. మరి యూరప్ నుంచి వలస వచ్చి అమెరికా ఖండాన్ని ఆక్రమించిన బ్రిటిష్, యూరప్ వలసవాదులు మాత్రం తమతో తీసుకు వచ్చిన బ్రిటిష్ కొలమానాన్ని కొనసాగించుకున్నారు. మరికొన్ని పద్ధతులను మార్చుకున్నారు. ఉదాహరణకు ఇంగ్లాండ్‌లో ఇప్పటికీ రోడ్డు మీద కీప్ లెఫ్ట్ పద్దతి, రైట్ హ్యాండ్ డ్రైవ్ అమల్లో ఉన్నది. భారత్ సహా అన్ని బ్రిటిష్ వలస దేశాలలో కూడా ఇదే పద్దతి అమల్లో ఉన్నది. కానీ అమెరికాలో మాత్రం ఈ పద్ధతి ఉల్టా కావడం విచిత్రం. కార్ల కంపనీలు, ఎలెక్ట్రిక్ పరికరాల కంపనీలు అమెరికా అవసరాల కోసం ప్రత్యేకంగా తయారు చేస్తారు.

మన దేశంలో జ్వరం తప్ప ఉష్ణోగ్రతను ఫారన్‌హీట్‌లో కొలవడం మనకు అలవాటు లేదు. మనం ఉష్ణోగ్రతను సెంటీగ్రేడ్ లేదా సెల్సియస్ డిగ్రీలలో మాత్రమే కొలుస్తాము. అప్పుడే బయట ఎండ తీవ్రత ఎంత ఉన్నది, చలి తీవ్రత ఎంత ఉన్నది అంచనా వేయగలం. ఇక్కడ ఉష్ణోగ్రతను ఫారన్‌హీట్ లోనే కొలుస్తారు. ప్రపంచం అంతా సెంటీగ్రేడ్ లోకి మారిపోయింది. ఇక్కడ బ్రిటిష్ కొలమానం అయిన ఫారన్‌హీట్ ఇంకా కొనసాగుతున్నది.

ఇక ఇంజనీరుగా అమెరికాలో నీటి కొలతల లెక్కలు ఎట్లా ఉన్నాయో పరిశీలించాను. నీటి లెక్కల్లో కూడా బ్రిటిష్ కొలమానాలే అమల్లో ఉన్నాయి. నీటి పరిమాణాన్ని భారత్ సహా ప్రపంచ దేశాలు బి.సి.ఎం (బిలియన్ క్యూబిక్ మీటర్లు), ఎం.సి.ఎం (మిలియన్ క్యూబిక్ మీటర్లు) లలో కొలిస్తే అమెరికాలో “acre-feet”లో కొలవడం విచిత్రంగా అనిపించింది. నీటి ప్రవాహాన్ని అందరూ క్యూమేక్స్ (క్యూబిక్ మీటర్/సెకండ్) లో కొలిస్తే ఇక్కడ ఇంకా క్యూసెక్కుల (క్యూబిక్ ఫీట్/సెకండ్) లెక్కలే ఉన్నాయి. (తెలంగాణలో ఎందుకో మరి.. ఎం.సి.ఎం, క్యూమేక్స్..లను అధికారిక నివేదికల్లో రాస్తున్నప్పటికీ టిఎంసి, క్యూసెక్కుల్లో చెపితే తప్ప అవి ఎన్ని నీళ్ళో అంచనాకు రాదు.) నీటి కొలతలకు సంబందించి అమెరికాలో ఇంకా బ్రిటిష్ కొలమానాలే అమల్లో ఉన్నాయి. Acre-feet, క్యూసెక్కులు.. ఇట్లా.

మన దేశంలో ఇల్లు కట్టుకుంటే ముందుగా బైఠక్, తర్వాత లివింగ్ రూమ్, వంట గది, బెడ్ రూమ్‌లు ఉంటాయి. ఇక్కడ ముందు వంట గది, తర్వాత లివింగ్ రూమ్, బెడ్ రూం ఉండడం గమనించాను. మన వాస్తు శాస్త్రానికి, ఇక్కడి నిర్మాణ శైలికి తేడా ఉన్నది. మరి మన వాస్తు శాస్త్రాన్ని నమ్మే భారతీయులు అమెరికాలో ఇల్లు కొనేటప్పుడు రాజీ పడుతున్నారా? ఇక్కడి ఇల్లు చెక్కతో, ఫైబర్ మెటీరీయల్‌తో కడతారు. అగ్ని ప్రమాదం జరిగినదంటే క్షణాల్లో ఇల్లు కాలి బూడిద అవుతుంది. కాబట్టి అగ్ని ప్రమాదాలు జరిగితే ఫైర్ ఇంజన్‌కు వెంటనే మంటలు ఆర్పడానికి వంట గదిని అన్నిటి కన్నా ముందు ఏర్పాటు చేసుకుంటారని నాకు అనిపించింది. ఇప్పుడిప్పుడే అమెరికా రియల్టర్లు భారతీయుల ఇష్టాలకు, వాస్తు నమ్మకాలకు అనుగుణంగా కాలనీల లేఅవుట్, ఇళ్ల ప్లాన్ తయారు చేస్తున్నట్టు, అవి బాగా అమ్ముడుపోతున్నట్టు ఇక్కడి మిత్రులు, బంధువులు చెప్పారు. అంటే తూర్పు, ఉత్తర దిశలో ఫేసింగ్ ఉన్న ప్లాట్లకు గిరాకీ ఉంటుందన్న సంగతిని అమెరికా రియల్టర్లు గమనించేలాగా చేయడంలో మన వాళ్ళు సఫలం అయినారు. కమ్యూనిటి లే అవుట్ లను, ఇళ్లను చూడటానికి వెళ్లేటప్పుడు మన వాళ్ళ చేతుల్లో తప్పని సరిగా ఉండే వస్తువు దిక్కులను చూపించే కంపాస్. ఆ కంపాస్ ఇప్పుడు సెల్ ఫోన్‌లో కూడా ఉంటుందట. కంపాస్ సహాయంతో తూర్పు, ఉత్తర దిశలను తెలుసుకొని ప్లాట్లను ఎంపిక చేసుకుంటారు.

ఇక్కడ పుట్టిన పిల్లలకు జాతకాలు ఎట్లా రాస్తారో మరి! శుభ ముహూర్తాలు ఎట్లా నిర్ణయిస్తారో! మన పంచాంగాలు అన్నీ భారత కాలమాన పరిస్థితులకు అనుగుణంగా రాస్తారు. మనకు వీరికి 12 గంటల తేడా ఉన్నప్పుడు అమెరికాలో భారత పంచాంగం కూడా ఉల్టా పుల్టా అవుతుందా? ఇది ఒక జటిలమైన ప్రశ్న. శాస్త్రం తెలిసిన వారిని అడిగి సందేహ నివృత్తి చేసుకోవాలి.

అమెరికాలో నివసిస్తున్న వారు అందరూ వివిధ దేశాల నుంచి ముఖ్యంగా యూరప్ దేశాల నుంచి వలస వచ్చిన వారే. యూరప్ దేశాలలో ఉన్న తమ ప్రాంతాల, గ్రామాల పేర్లను అమెరికాకు కూడా తీసుకు వచ్చారు. యూరప్‌లో ఉన్న ప్రాంతాలు, పట్టణాలు, గ్రామాలు వేలాదిగా అమెరికాలో కూడా ఉండడం విశేషం. అదే విధంగా అక్కడి పద్ధతులు కూడా అమెరికాకు తరలి వచ్చాయి. పాత వాటిని వదిలి పెట్టలేని ఒక బలమైన సెంటిమెంట్ వల్లనే ఈ ఉల్టా పుల్టా పద్ధతులు అమలు పరుస్తున్నారని అనుకోవాల్సి వస్తున్నది. లేదా తాము మిగతా ప్రపంచం కంటే భిన్నమైన వారమని చెప్పుకునే ఉద్దేశమా? లేకపోతే మరేదైనా కారణం ఉన్నదా తెలియదు.

ముక్తాయింపు: ఇదంతా రాసి పంపుతే నా చిన్నప్పటి దోస్తు అరవింద్ ఏమన్నాడంటే.. “అరే భూగోళం మీద మనం తూర్పు దిక్కున ఉన్నాము. వాడేమో పశ్చిమ దిక్కున ఉన్నాడు. మనకు పగలు అయితే వాడికి రాత్రి. వాడికి మనకు 12 గంటల తేడా. మనం ముందు.. వాడు వెనుక. మనకు తెల్లారిన తర్వాత 12 గంటల తర్వాత గాని వాడికి తెల్లారదు. ఇక్కడనే వాడికి మనకు పరిస్థితి ఉల్టా పుల్టా ఉన్నది. మిగతా జీవన పద్ధతుల్లో కూడా ఉండక ఏం చేస్తుంది?”

“అవురా వారీ నువ్వు చెప్పింది కూడా రైటే” అని నేనన్నాను.

అంతే సంగతులు. చిత్తగించవలెను.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here