Site icon Sanchika

అమెరికా ముచ్చట్లు-21

[box type=’note’ fontsize=’16’] తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల శాఖలో ఓఎస్‌డిగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ శ్రీధర్ రావు దేశ్‌పాండే తమ అమెరికా యాత్ర విశేషాలు సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]

పర్యాటక కేంద్రం అమెరికా ఫెడరల్ రాజధాని వాషింగ్టన్ డి సి:

గత వారం అమెరికా ఫెడరల్ రాజధాని వాషింగ్టన్ డి సి చరిత్ర పూర్వాపరాలు కొంత వివరంగా రాసి ఉన్నాను. అక్కడ ఉన్న పర్యాటక కేంద్రాల గురించి ప్రస్తావనలు మాత్రమే చేసి ఉన్నాను. వాషింగ్టన్ డి సి ప్రాంతంలో చూడదగిన పర్యాటక ప్రాంతాలు అనేకం ఉన్నాయి. అయితే మాకున్న సమయంలో వాటిలో ప్రధానంగా డౌన్‌టౌన్‌లో నేషనల్ మాల్ పరిసరాల్లో ఉన్న వాషింగ్టన్ మాన్యుమెంట్, రెండవ ప్రపంచ యుద్ధంలో మరణించిన అమెరికా సైనికుల వార్ మెమోరియల్, లింకన్ మెమోరియల్, ఫెడరల్ క్యాపిటల్ భవనం, అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌజ్ లను ఎంపిక చేసుకున్నాము. ఆ తర్వాత సమయం ఉంటే మరికొన్ని చూడాలని అనుకున్నాము. కానీ ఇవి చూసేసరికి చీకటి పడిపోయింది. దానికి తోడు నడకతో అలసట వల్ల మొదటి రోజు పర్యటన ముగించుకున్నాము. మేము చూసిన వీటి గురించిన విశేషాలు వివరించే ప్రయత్నం చేస్తాను.

వాషింగ్టన్ మాన్యుమెంట్:

మేరీల్యాండ్ రాష్ట్రంలో ఉండే బాల్టిమోర్ హోటల్ నుంచి వాషింగ్టన్ డి సి సుమారు 60 కిమీ దూరంలో ఉంటుంది. కారులో ఒక గంట ప్రయాణం. డాలస్‌లో బయలుదేరేటప్పుడే మేము వాషింగ్టన్ డి సి లో వర్షం పడుతుందని వాతావరణ శాఖ ముందస్తు సూచన చేసి ఉన్నది. వాషింగ్టన్ డి సి కి వెళ్ళే రహదారి పొడుగునా ఇరు వైపులా ఎత్తైన చెట్లతో అటవీ ప్రాంతం ఉంది. అటవీ సౌందర్యాన్ని వీక్షిస్తూ ప్రయాణం మొదలయ్యింది. వెదర్ ఫోర్‌కాస్ట్‌లో చెప్పినట్టు ప్రయాణం లోనే వాన ఎదురయ్యింది. ఒక పదిహేను నిమిషాలు వానలోనే ప్రయాణం సాగింది. కారు వేగం మందగించింది. అమెరికా వాతావరణ శాఖ ఇంత ఖచ్చితంగా అంచనా వేయడం అబ్బురం అనిపించింది. వాషింగ్టన్ నగరం చేరేటప్పటికి వర్షం తగ్గింది. వాతావరణలో చల్లదనం వచ్చేసింది. అది మాకు ఈ పర్యటనలో మేలు చేసింది. లేకుంటే ఆ రోజుల్లో అమెరికా అంతటా ఉన్న ఎండ వేడిమి భరించడం సాధ్యం అయ్యేది కాదు. మొదట వాషింగ్టన్ మాన్యుమెంట్ వద్దకే పోయాము. మాన్యుమెంట్‌కి ఒక అర కిలోమీటర్ల దూరంలో కారు ఆగిపోతుంది. అక్కడి నుంచి నడుస్తూ మాన్యుమెంట్ దగ్గరికి పోవాలి. ఉచితంగానే మాన్యుమెంట్‌కి వెళ్ళవచ్చు. మాన్యుమెంట్ దాకా ఇరు వైపులా పచ్చటి లాన్స్ ఉన్నాయి. గేటు వద్ద మాన్యుమెంట్ విశేషాలను వివరిస్తూ ఫోటోలు, బోర్డులు ఉంచారు. అవన్నీ చదివిన తర్వాతనే మాన్యుమెంట్ వద్దకు నడుచుకుంటూ బయలుదేరాము. మేము అక్కడికి చేరేటప్పటికి వందలాది మంది పర్యాటకులతో మాన్యుమెంట్ పరిసరాలు సందడిగా ఉన్నాయి.

వాషింగ్టన్ మాన్యుమెంట్

మాన్యుమెంట్‌ను ఒక ఎత్తైన గడ్డ మీద నిర్మించారు. ఇది కుతుబ్ మీనార్ లాగా ఎత్తైన స్తంభం లాంటి భవనం. కుతుబ్ మీనార్ లోహంతో నిర్మించినదైతే వాషింగ్టన్ మాన్యుమెంట్ రాతితో నిర్మించిన ఒంటి స్తంభం మేడ. నాలుగు వైపుల నుంచి ఒకే తీరుగా కనిపిస్తుంది. 106 ఎకరాల విస్తీర్ణం కలిగిన పరిసరాల్లో ఎత్తు గడ్డ మీద నిర్మించిన ఈ రాతి కట్టడం ఎత్తు 555 అడుగులు. అడుగున 15 అడుగులతో మొదలై తగ్గుతూ తగ్గుతూ చిట్ట చివరన ఒకటిన్నర అడుగులు ఉంటుంది. కట్టడం లోపల బోలుగానే ఉంటుంది. అయితే లోపల ఇనుప మెట్లు, మధ్యలో లిఫ్ట్ ను కూడా తర్వాతి కాలంలో ఏర్పాటు చేశారు. లిఫ్ట్ ఏర్పాటు తర్వాత ఇనుప మెట్ల వాడకాన్ని ఆపివేశారు. 1848లో నిర్మాణం ప్రారంభమైతే 1854లో నిర్మాణం నిధులు సమకూరక, అమెరికా అంతర్యుద్ధం ఆగిపోయింది. 23 ఏండ్ల విరామం తర్వాత తిరిగి 1879లో ప్రారంభమయి 1884 నాటికి పూర్తి అయ్యింది.

 

అమెరికా నేషనల్ పార్క్ సర్వీస్ సంస్థ వారు ఈ మాన్యుమెంట్ నిర్వాహణ వ్యవహారాలు చూస్తారు. ఇంతకు ముందు చెప్పినట్టు ఈ మాన్యుమెంట్‌ను అమెరికా విప్లవ సైన్యానికి కమాండర్‌గా, విప్లవ విజయం తర్వాత అమెరికా ప్రథమ అధ్యక్షుడిగా వ్యవహరించిన జార్జ్ వాషింగ్టన్ గౌరవార్థం ఈ అద్భుత కట్టడాన్ని నిర్మించారు. ఈ కట్టడానికి పాలరాయి, గ్రానైట్, నీలం రంగు నీస్ (gneiss) రాళ్ళను వాడినట్టు అక్కడ బోర్డుల మీద రాసినారు. ఇప్పటికీ ప్రపంచంలో ఇదే రాతితో నిర్మించిన అతి ఎత్తైన కట్టడంగా నిలచి ఉన్నది. తర్వాతి కాలంలో ఎత్తైన కట్టడాల్లో పారిస్‌లో ఈఫిల్ టవర్, దాని తర్వాత కోలోన్ కాథెడ్రల్ వాషింగ్టన్ మాన్యుమెంట్‌ను వెనక్కి నెట్టేసాయి. అయితే ఇవి రాతి కట్టడాలు కాక పోవడం వలన ఎత్తైన రాతి కట్టడాల్లో ఈ మాన్యుమెంట్ తన స్థానాన్ని నిలుపుకున్నదని చెప్పాలి.

మాన్యుమెంట్ పూర్తి చిత్రం

1885 ఫిబ్రవరి 21 ఈ కట్టడాన్ని జాతికి అంకితం చేశారు. 1888 అక్టోబర్‌లో సందర్శకులకు అనుమతించడం మొదలయ్యింది. ఎత్తు గడ్డ మీద నిర్మించినందున మాన్యుమెంట్ చుట్టూ ఉన్న నేషనల్ మాల్‌లో ఉన్న నిర్మాణాలు అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. ఒక దిక్కు నేషనల్ క్యాపిటల్, మరో దిక్కు వార్ మెమోరియల్, దాని ఆవల లింకన్ మెమోరియల్, మరో దిక్కున అనేక పేరు తెలియని ప్రభుత్వ భవనాలు కనిపిస్తూ ఉంటాయి.

మాన్యుమెంట్ గేట్ వద్ద ఏర్పాటు చేసిన బోర్డు

సందర్శకులు రకరకాల కోణాల్లో ఈ ఒంటి స్తంభం మేడను కెమెరాలలో బందించే ప్రయత్నం చేస్తుంటారు. భవనం చుట్టూతా ఎత్తైన స్టీల్ పోల్స్ పై అమెరికా జెండా ఎగురుతూ ఉంటుంది.

మాన్యుమెంట్ చుట్టూ ఏర్పాటు చేసిన అమెరికా జాతీయ జెండాలు
వాషింగ్టన్ మాన్యుమెంట్ లాంగ్ షాట్

2011 వచ్చిన తక్కువ స్థాయి భూకంపం వలన భవనానికి కొంత నష్టం జరిగిందట. భవనానికి మరమ్మతులు చేసే దానికి 2014 వరకు మాన్యుమెంట్‌ను మూసి వేశారట. భవనం వద్ద ఒక అర గంట గడిపి బోలెడన్ని ఫోటోలు తీసుకొన్నాము.

భూకంపం తర్వాత మరమ్మతులు

లిఫ్ట్ వద్ద చాంతాడంత క్యూ ఉండడంతో భవనం పైకి వెళ్ళే ఆలోచన మానుకొని వార్ మెమోరియల్ దిక్కు నడక సాగించాము. మాన్యుమెంట్ పార్కులో నేలకు సమాంతరంగా పెరిగిన ఒక చెట్టు నన్ను ఆకట్టుకున్నది. ఆ చెట్టు ఫోటోను కెమెరాలో బందించాను.

మాన్యుమెంట్ పార్క్ లో నేలకు సమాంతరంగా పెరిగిన చెట్టు

వార్ మెమోరియల్:

వాషింగ్టన్ మాన్యుమెంట్ ఎడమ వైపున రోడ్డు దాటగానే వార్ మెమోరియల్ పరిసరాలు మొదలవుతాయి. రెండవ ప్రపంచ యుద్ధంలో మరణించిన ఆమెరికా సైనికుల జ్ఞాపకార్థం ఈ స్మారకాన్ని నిర్మించారు. కోడి గుడ్డు (oval) ఆకారంలో నిర్మించిన ఒక నీటి కొలనుకు రెండు వైపులా ఆర్చీలు నిర్మించారు. ఒకటి అట్లాంటిక్ అర్చి, రెండవది పసిఫిక్ ఆర్చీ.

వార్ మెమోరియల్ అట్లాంటిక్ ఆర్చీ పూర్తి దృశ్యం
వార్ మెమోరియల్ వద్ద అట్లాంటిక్ ఆర్చీ
వార్ మెమోరియల్ అట్లాంటిక్ ఆర్చీ

ఈ ఆర్చీలకు ఇరు వైపులా 56 స్మారక స్తంభాలు నిర్మించారు. ఇవి 50 రాష్ట్రాలు, అమెరికా అధీనంలో ఉన్న ప్రాంతాలకు ప్రతినిధులుగా ఉన్నాయి. అట్లాంటిక్ ఆర్చీ వైపు అట్లాంటిక్ సముద్రాన్ని ఆనుకొని ఉన్న రాష్ట్రాలు (న్యూయార్క్, న్యూజెర్సీ, మూసాచుసెట్స్, మిషిగాన్, టెక్సాస్.. ఇట్లా), పసిఫిక్ ఆర్చీ వైపు పసిఫిక్ సముద్రాన్ని ఆనుకొని ఉన్న రాష్ట్రాలకు (కాలిఫోర్నియా, వాషింగ్టన్, జార్జియా, కొలరాడో, ఆరిజోనా, నేవేడా.. ఇట్లా) సంబందించిన స్తంభాలను ఏర్పాటు చేశారు.

 

వివిధ రాష్ట్రాలను ప్రతిబింబిస్తూ వార్ మెమోరియల్ పిల్లర్స్

2004 ఏప్రిల్ 29న ఆనాటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ ఈ స్మారకాన్ని జాతికి అంకితం చేశారు. ఈ స్మారకాన్ని కూడా అమెరికా నేషనల్ పార్క్ సర్వీస్ వారే నిర్వహణ చేస్తారు. 2018లో ఈ స్మారకాన్ని 4 కోట్ల 60 లక్షల మంది సందర్శించినట్టు పేర్కొన్నారు.

వార్ మెమోరియల్ శిలా ఫలకం

స్మారకంలో ఉన్న నీటి కొలనులో నిరంతరం ఫౌంటైన్స్ నీటిని విరజిమ్ముతూ సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచుతాయి. నీటి కొలను వద్ద మెట్లపై కూచొని పిల్లల ఆటా పాటలను చూస్తూ గంట సేపు కాలం ఇట్టే గడిచిపోయింది. మేము వచ్చింది టెక్సాస్ రాష్ట్రం నుండి కాబట్టి అట్లాంటిక్ ఆర్చీ పిల్లర్లలో టెక్సాస్ రాష్ట్రం పిల్లర్ వద్ద ప్రత్యేకంగా నిలబడి ఫోటోలు దిగాము.

టెక్సాస్ రాష్ట్రం పిల్లర్

అక్కడి నుండి మధ్యాన్న భోజనానికి ఒక ఇండియన్ రెస్టారెంట్‌కి వెళ్ళాము. దాని పేరు ‘బాంబే క్లబ్’. అమెరికాలో ఉన్న రోజుల్లో బయట పర్యటనల్లో ఇటువంటి రుచికరమైన స్వదేశీ భోజనం ఎక్కడా దొరకలేదు. ఇప్పుడు అటువంటి భోజనం చేయడం మనసుకు సంతృప్తిని ఇచ్చింది. వాషింగ్టన్ డి సి కి వెళ్ళే భారతీయ పర్యాటకులకు ఈ రెస్టారెంట్‌కు వెళ్ళమని నేను సిఫారసు చేస్తున్నాను.

లింకన్ మెమోరియల్:

భోజనం తర్వాత కారులో నేరుగా లింకన్ మెమోరియల్‌కు వెళ్ళాము. మెమోరియల్ ముందు పొడవైన నీటి కొలను ఏర్పాటు చేశారు. ఈ కొలనులో బాతులు తమ పిల్లలతో విహరిస్తూ ఉన్నాయి. వాటిని కెమెరాలో బందిస్తూ ముందుకు సాగాము.

లింకన్ మెమోరియల్ ముందున్న నీటి కొలనులో బాతుల విహారం

లింకన్ మెమోరియల్‌ను కూడా ఎత్తు గడ్డ మీద నిర్మించారు. మెమోరియల్ భవనం లోకి వెళ్ళడానికి రెండు దశలలో 50, 60 మెట్లు ఎక్కాలి. భవనం మరి పెద్దది కాదు. ఒకసారి రెండు వందల మందికి మించి ఇమడలేరు. భవనం మధ్యలో లింకన్ విగ్రహం, హాలుకు రెండు వైపులా గోడలపై లింకన్ ఉపన్యాసాలని రాసిన మార్బుల్ రాతి ఫలకాలను ఏర్పాటు చేశారు. అందులో మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఇచ్చిన ప్రఖ్యాత I Have a Dream ఉపన్యాసంలో కొంత భాగాన్ని కూడా ఉంచారు. ఒక మూలన లింకన్ జ్ఞాపికలను అమ్మే చిన్నఅ షాపు కూడా ఉంది.

వాషింగ్టన్ మాన్యుమెంట్ గుట్టపై నుంచి లింకన్ మెమోరియల్ దృశ్యం
లింకన్ మెమోరియల్ భవనం మరో కోణంలో

అమెరికా ప్రభుత్వం ఈ స్మారకాన్ని జాతీయ స్మారకంగా గుర్తించింది. అమెరికా 16 అధ్యక్షుడిగా పని చేసిన, అమెరికాలో నల్ల జాతి ప్రజల బానిసత్వాన్ని రద్దు చేసిన, అమెరికాలో అంతర్యుద్ధాన్ని జయప్రదంగా ముగించి అమెరికా ఫెడరేషన్ ఐక్యతను నిలబెట్టిన రాజకీయ దురంధరుడు అయిన అబ్రహమ్ లింకన్ స్మారకార్థమే ఈ భవనాన్ని నిర్మించారు. 1914లో మొదలైన నిర్మాణం 1922లో పూర్తి చేశారు. నేషనల్ మాల్‌కు చివరన ఈ స్మారకం ఉంటుంది. 1922లో ఆనాటి అమెరికా అధ్యక్షుడు వారెన్ జి హార్డింగ్ లింకన్ స్మారకాన్ని జాతికి అంకితం చేశాడు. అమెరికా ప్రజలకే కాదు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు కోరుకునే, జాతి వివక్షను నిరసించే అన్ని దేశాల పర్యాటకులకు ఈ స్మారకం స్పూర్తిని ఇస్తుంది.

లింకన్ విగ్రహం ముందు

లింకన్ ఈ భవనంలో ఒక కుర్చీపై కూర్చొని ఉంటాడు. అతని నిశితమైన చూపు ఎదురుగా ఉన్న అమెరికా క్యాపిటల్ భవనం మీద కేంద్రీకృతం అయినట్టు ఉంటుంది. క్యాపిటల్ భవనంలో కూసునే అమెరికా చట్ట సభల సభ్యులకు, కార్యనిర్వాహణాధికారి అయిన అధ్యక్షుడిని తాను నిలబెట్టిన అమెరికా ఫెడరల్ వ్యవస్థను జాగ్రత్తగా కాపాడుతున్నారా లేదా, తాను చేసిన బానిసత్వ రద్దు చట్టాన్ని సరిగ్గా అమలు చేస్తున్నారా లేదా ఒక కంట కనిపెడుతున్నట్టు ఆ నిశితమైన చూపుల్లో కనిపిస్తుంది. గంభీరంగా ఉండే లింకన్ విగ్రహాన్ని ఆ రకంగా రూపకల్పన చేసినారు. లింకన్ విగ్రహం ముందు నిలబడి సందర్శకులు తప్పని సరిగా ఫోటోలు దిగుతారు. మేమూ దిగాము. ఫోటో కోసం 10 నిమిషాలు ఆగవలసి వచ్చింది. ఆ భవనం నుంచి నేషనల్ మాల్‌లో ఉన్న అన్ని భవనాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ స్మారకం 24 గంటలు సందర్శకులకు అందుబాటులో ఉంటుంది. ఏటా 70 లక్షల మంది ఈ స్మారకాన్ని సందర్శిస్తారని అంచనా. లింకన్ స్మారకంలో ఉన్న గిఫ్ట్ షాపులో కొన్ని పుస్తకాలు, మాగ్నెట్స్ కొని బయటకు వస్తుంటే మళ్ళీ వర్షం మొదలయ్యింది. అర గంట పాటు వర్షం తగ్గే వరకు లింకన్ స్మారక భవనంలోనే ఉండిపోయాము.

వర్షం తగ్గిన తర్వాత కార్లో నేషనల్ మాల్‌కు అటు చివరన ఉన్న క్యాపిటల్ భవనం చూడటానికి బయలుదేరాము.

నేషనల్ క్యాపిటల్:

ఇంతకు ముందు వ్యాసంలో చెప్పినట్టు ఈ క్యాపిటల్ భవనంలో కాంగ్రెస్, ప్రతినిధుల సభలు కొలువు దీరుతాయి. ఈ భవనం ఉండే ప్రాంతాన్ని క్యాపిటల్ హిల్ అంటారు. వాషింగ్టన్ నగరానికి ఇది మధ్యలో లేకపోయినా ఇక్కడి నుంచే వీధులకు నంబర్లు ఇస్తారు. అద్భుతమైన ఈ భవన నిర్మాణం 1793 సెప్టెంబర్‌లో ప్రారంభం అయి 1800 సంవత్సరంలో పాక్షికంగా పూర్తి అయ్యింది. అమెరికా కాంగ్రెస్ సమావేశాలు ఈ భవనంలో జరగడం ప్రారంభమయ్యింది. ఐదు అంతస్తుల ఈ భవనం 67,000 చదరపు మీటర్ల ఫ్లోర్ విస్తీర్ణం కలిగి ఉంది. భవనం ఉన్న పరిసరాల విస్తీర్ణం 16.50 ఎకరాలు.

క్యాపిటల్ భవనం
మరమ్మతులు జరుగుతున్నక్యాపిటల్ భవనం
వాషింగ్టన్ మాన్యుమెంట్ గుట్ట మీద నుండి క్యాపిటల్ భవనం దృశ్యం

1814 లో బ్రిటిష్ వారి దాడిలో భవనానికి చాలా నష్టం వాటిల్లింది. 5 ఏండ్లలో మొత్తం మరమ్మతులు పూర్తి చేసి కాంగ్రెస్ సమావేషాలు జరగడానికి భవనాన్ని సిద్దం చేశారు. ఆ తర్వాత అమెరికాలో ఉన్న రెండు సభలు.. కాంగ్రెస్, ప్రతినిధుల సభ సమావేశాలు నిర్వహించడానికి సరిపడే విధంగా విస్తరించారు. భవనం మధ్యలో ఉన్న గుమ్మటాన్ని 1866 అమెరికా అంతర్యుద్ధం ముగిసిన తర్వాత పూర్తి చేశారు. ఈ చారిత్రిక భవనాన్ని చూడటానికి వెళ్ళినప్పుడు ఆ భవనానికి మరమ్మతులు చేస్తున్నారు. సందర్శకులను లోపలి అనుమతించక పోవడం వలన బయట నుంచే భవనాన్ని వీక్షించవలసి వచ్చింది. అది కూడా భవనం వెనుక వైపు నుంచి మాత్రమే చేసే అవకాశం దొరికింది. అక్కడ ఎక్కువ సేపు ఉండే అవకాశం లేకపోవడంతో అక్కడి నుంచి అమెరికా అధ్యక్ష నివాస భవనం వైట్ హౌజ్ చూడటానికి బయలు దేరాము.

వైట్ హౌజ్:

230 సంవత్సరాల క్రితం నిర్మించిన అమెరికా అధ్యక్షుని శాశ్వత నివాస భవనమే వైట్ హౌజ్. తెల్లటి శాండ్ స్టోన్‌తో నిర్మించిన ఈ భవనానికి తెల్లని పెయింట్ వేసినందువలన ఈ భవనానికి వైట్ హజ్ అని పేరు స్థిరపడింది. ప్రస్తుతం వైట్ హౌజ్‌లో ఈనాటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దంపతులు నివసిస్తున్నారు. 1792 అక్టోబర్‌లో ప్రారంభం అయిన వైట్ హౌజ్ నిర్మాణం 1800 నవంబర్‌లో పాక్షికంగా పూర్తి అయ్యింది. వైట్ హౌజ్‌లో అధ్యక్షుడి కార్యాలయాన్ని ఓవల్ ఆఫీసు అంటారు. 1801 అమెరికా మూడవ అధ్యక్షుడు థామస్ జెఫర్సన్ వైట్ హౌజ్‌లో నివసించిన మొదటి అధ్యక్షుడు. 1814లో బ్రిటిష్ వారి దాడిలో వైట్ హౌజ్ కూడా ధ్వంసం అయ్యింది. భవనం లోపల బయట నష్టాలు వాటిల్లినాయి. వైట్ హౌజ్ పునర్నిర్మాణం అయిన తర్వాత 1817లో అధ్యక్షుడు థామస్ మన్రో ఈ భవనంలోకి మారి పరిపాలన సాగించినాడు. అప్పటి నుండి అమెరికా అధ్యక్షులు అందరూ కూడా ఈ భవనంలోనే నివాసం ఉన్నారు.

వైట్ హౌజ్ ముందు అతికించిన ఒక పోస్టర్

వైట్ హౌజ్‌కు 100 మీటర్ల దూరం వరకు సందర్శకులను రానిస్తారు. అక్కడ బ్యారికేడ్లు నిర్మించారు. సాయుధ పోలీసులు పహారా కాస్తుంటారు. అధ్యక్ష భవనం ముందు ప్రతి రోజు ఎవరో ఒకరు ఏదో ఒక అంశం మీద ధర్నాలు నిర్వహిస్తారు. వారిని ఎవరూ అడ్డుకోరు. శాంతియుతంగా ధర్నాలను అనుమతిస్తారు. అధ్యక్ష భవనం ఇంత దగ్గరికి నిరసనకారులను అనుమతించడం ఆశ్చర్యం కలిగించే అంశం. మన దేశంలో ఇది ఊహించలేము. మేము సాయంత్రం వేళ వెళ్ళినాము కనుక ధర్నాల సందడి ఏమీ కనిపించలేదు. అయితే వారు బ్యారికేడ్లకు అతికించి వెళ్ళిన పోస్టర్లు మాత్రం విస్తృతంగా కనిపించాయి.

వైట్ హౌజ్ ముందు ఒక ధర్నా పోస్టర్
వైట్ హౌజ్ ముందు దృశ్యం

ఒక పెద్దాయన అమెరికా సామ్రాజ్యవాదాన్ని, అణ్వస్త్రాలను వ్యతిరేకిస్తూ కనిపించాడు. పోస్టర్లు కనిపించాయి. ఆయన ఎన్నో ఏండ్లుగా అక్కడే మకాం వేసి ఈ నిరసన వ్యక్తం చేస్తున్నాడట.

ఎన్నో ఏండ్లుగా నిరసన వ్యక్తం చేస్తున్న పెద్దాయన

ప్రపంచంలో అత్యధిక సంపద కొద్ది మంది సంపన్నుల వద్ద పొగుపడి ఉందని ఒక పోస్టర్‌లో రాసి ఉన్నది. కొంత మంది ప్రపంచ కుబేరుల జాబితా వారి ఫోటోలు ఉన్నపోస్టర్ కనబడింది. అందులో మన దేశ ముకేష్ అంబానీ, గౌతం ఆదాని కూడా ఉన్నారు. పాలస్తీనా శరణార్థుల శిబిరం కూడా కూడా ఉన్నది. వారు ఒక డబ్బా ఉంచి విరాళాలు సేకరిస్తున్నారు. మా వంతుగా 10 డాలర్ల నోటు ఆ డబ్బాలో వేశాము. వైట్ లోపలకు వెళ్ళే అవకాశం ఎలాగూ ఉండదు కనుక ఒక గంట సేపు వైట్ హౌజ్ పరిసరాల్లో తిరుగుతూ అక్కడ ఏర్పాటు చేసిన విగ్రహాలను పరిశీలిస్తూ చివరకు బయటకు వచ్చాము.

వైట్ హౌజ్ ముందు
వైట్ హౌజ్ ముందు జనం
మెరిసిపోతున్న వైట్ హౌజ్

అప్పటికే రాత్రి 8 దాటింది. అమెరికాలో తొందరగానే డిన్నర్ కానిస్తారు. తొందరగానే రెస్టారెంట్‌లు మూసేస్తారు. అందుకని ఆ రోజు పర్యటన ముగించి డిన్నర్‌కు బయలు దేరాము. ఈసారి పిల్లలు ఒక ఇటాలియన్ రెస్టారెంట్‌కు తీసుకుపోయారు. ఏదో తిన్నామా అంటే తిన్నాము అనిపించి బాల్టిమోర్ రహదారి ఎక్కాము. రాత్రి 10 గంటల కల్లా హోటల్‌కు చేరుకున్నాము. ఆ రోజుకు దం దం అయిపోయి నిద్రకు ఉపక్రమించాము.

రెండవ రోజు పర్యటన వాషింగ్టన్‌కు బదులు బాల్టిమోర్‌లో కొనసాగించాలని అనుకున్నాము.

బాల్టిమోర్ పర్యటన విశేషాలు వచ్చేవారం.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version