Site icon Sanchika

అమెరికా ముచ్చట్లు-23

[box type=’note’ fontsize=’16’] తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల శాఖలో ఓఎస్‌డిగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ శ్రీధర్ రావు దేశ్‌పాండే తమ అమెరికా యాత్ర విశేషాలు సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]

అమెరికాలో హిందూ దేవాలయాల నిర్మాణ చరిత్ర

డాలస్ లో కార్యసిద్ధి హనుమాన్ దేవాలయం:

ఒక రోజు సాయంత్రం డాలస్ ఫ్రిస్కొ లో ఉన్న కార్యసిద్ది హనుమాన్ గుడికి వెళ్ళాను. ఇది మా పిల్లలు ఉండే మెకెని ప్రాంతానికి దగ్గరే. ఈ దేవాలయం టెక్సాస్ రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగిన దేవాలయాలలో ఒకటని పిల్లలు చెప్పారు. దానికి కారణం ఇక్కడకి వచ్చి ఏదైనా మొక్కుకుంటే తప్పక తీరుతుందని అమెరికాలో హిందూ సమాజానికి ఒక విశ్వాసం, నమ్మకం ఏర్పడిపోయింది. అమెరికాలో అన్ని రాష్ట్రాల నుంచి భక్తులు.. ముఖ్యంగా యువతీ యువకులు, వారి తల్లిదండ్రులు ఈ దేవాలయానికి వస్తారట. దేవాలయాన్ని సుమారు రెండు ఎకరాల జాగాలో నిర్మించారు. ఈ దేవాలయం పక్కనే క్రైస్తవుల చర్చ్ కూడా ఉన్నది. మైసూరు గణపతి సచ్చిదానంద స్వామి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈ గుడి నిర్వాహణ జరుగుతున్నది.

కార్యసిద్ధి హనుమాన్ దేవాలయం
తొలినాటి దేవాలయ స్థలం

మామూలుగా అయితే హనుమాన్ దేవాలయానికి శనివారం భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. మేము పోయిన రోజు మంగళవారం అయినా గుడిలో జనం బాగానే ఉన్నారు. దేవాలయానికి అయిదు అంత్రాల గాలి గోపురం నిర్మించారు. లోపల విశాలమైన హాల్‌లో మూల విరాట్ సీతారామ సహిత హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.

దేవాలయం ప్రధాన హాల్

పక్కన దుర్గామాత, శివ, సుబ్రమణ్య, దత్తాత్రేయల చిన్న మందిరాలు కూడా ఉన్నాయి. భక్తులు పారవశ్యంతో ఉన్నారు. ప్రదక్షిణలు చేస్తున్నారు. గుడిలో హనుమాన్ చాలీసా పారాయణం రికార్డు మంద్రంగా సాగుతూ ఉన్నది. పాడింది సచ్చిదానంద స్వామినే. హాలు చుట్టూ గోడలపై సుమారు 50 వరకు ఆంజనేయుడి చరిత్రని తెలిపే పెయింటింగ్స్ పెట్టారు. నేను కొన్నిటి ఫోటోలు తీశాను.

దేవాలయం గోడలపై హనుమాన్ పెయింటింగ్స్
దేవాలయం గోడలపై హనుమాన్ పెయింటింగ్స్
దేవాలయం గోడలపై హనుమాన్ పెయింటింగ్స్
దేవాలయం గోడలపై హనుమాన్ పెయింటింగ్స్

కోరికలు తీర్చే దేవుడు:

దేవాలయంలో నాలుగు స్తంభాలు ఉన్నాయి. ఆరోగ్యం కోసం, గురు కృప కోసం, ఉద్యోగాలు, పెండ్లి, వీసాలు, గ్రీన్ కార్డులు, సిటిజెన్‌షిప్ తదితర కోరికలు తీరడానికి భక్తులు ఈ స్తంభాలకు తోరణాలు కడతారు. కోరికలు తీరిన తర్వాత మొక్కులు చెల్లించుకుంటారు. కోరికలు తీర్చే దేవుడిగా ఈ హనుమాన్‌కు అమెరికాలో మంచి ప్రాచుర్యం ఉన్నది. అందుకే దీన్ని కార్యసిద్ధి హనుమాన్ దేవాలయం అని పిలుస్తారు. రంగారెడ్డి జిల్లాలో చిలుకూరు బాలాజికి వీసాలు ఇప్పించే దేవుడిగా పేరున్నది. అమెరికా ఇతర దేశాలకు పోవాలనుకున్న విద్యార్థులు వీసాల కోసం చిలుకూరు బాలాజినీ సందర్శించుకుంటారు. ఇక్కడ అమెరికాలో యూనివర్సిటీ చదువు అయిపోగానే ఉద్యోగం దొరకాలని, ఆ తర్వాత H1 B వీసా రావాలని, ఆ తర్వాత గ్రీన్ కార్డ్, సిటిజన్‌షిప్ రావాలని ఇక్కడకి వచ్చి తోరణం కడతారు. తల్లిదండ్రులు వారి పిల్లలకు మంచి సంబంధాలు కుదరాలని తోరణాలు కడతారు. ఇండియాలో తల్లిదండ్రుల ఆరోగ్యాల కోసం కూడా పిల్లలు తోరణాలు కడతారట. మా పెద్ద బిడ్డ మేము ఇద్దరం కోరోనా సోకి నిమ్స్‌లో ఉన్నప్పుడు క్షేమంగా ఇంటికి వస్తే 108 ప్రదక్షిణాలు చేస్తానని మొక్కుకుని తోరణం కట్టిందట. మేమైతే కరోనా నుంచి బయటపడ్డాము. దాని మొక్కు ఇంకా చెల్లించాల్సి ఉన్నదట. 108 ప్రక్షిణాలు చేయాలంటే 3 గంటలు పడుతుందట.

దేవాలయ స్తంభం ముందు

 

ద్వజ స్తంభం ముందు
సీతారామ సహిత హనుమాన్

చక్కగా నిండైన బట్టలతో గుడికి రావాలని నిబంధన ఉన్నది. లేనట్లైతే గుడి నుంచి బయటకు పంపివేస్తారు. మా ముందే షార్ట్ వేసుకొని వచ్చిన ఒకతన్ని బయటకు పంపించారు. ఆయన బయటకు పోయి పంచె కట్టుకొని వచ్చాడు. గుడిని రాత్రి 8.30 కు మూసి వేస్తారు. చివరకు ఆంజనేయుడికి హారతి ఇచ్చారు. భక్తులు అందరూ కలిసి పాడారు. చరణాలు గుర్తు లేవు కానీ పల్లవి గుర్తుంది. “కోటి సూర్య తేజ మారుతి, సబ్ మిల్కె దియేంగే హారతి”.

దేవాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఏనుగు బొమ్మ

కొత్త కార్లు కొన్నవారు వాహన పూజ చేయడం కనిపించింది. పూజారులు ఇంగ్లీష్ లోనే మాట్లాడుతున్నారు. అయితే ఆ రోజు హాజరైన జనంలో తెలుగు భాష తప్ప మరొకటి వినపడలేదు. డాలస్‌లో తెలుగు వారి జనాభా చాలా ఎక్కువ. ఎక్కడకి పోయినా తెలుగు మాట్లాడేవారు ఎవరో ఒకరు తారసపడతారు. అయితే గుడి మాత్రం చెత్త చెదారం లేకుండా శుభ్రంగా ఉండడం నాకు నచ్చింది. పూలు, పత్రి, పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు అన్నీ గుడి పూజారులకు ఇచ్చేస్తారు. పుస్తకాలు అమ్ముతున్నారు. అన్నీ సచ్చిదానంద స్వామి వారి ప్రచార సామాగ్రి తప్ప ఆధ్యాత్మిక సాహిత్యం లేదు. ఇవీ డాలస్‌లో కార్యసిద్ధి హనుమాన్ దేవాలయ విశేషాలు.

అమెరికాలో దేవాలయాల నిర్మాణ చరిత్ర :

మేము ఆస్టిన్ వెళ్ళినప్పుడు అక్కడ షిర్డి సాయిబాబా దేవాలయానికి వెళ్ళాము. పక్కనే వేంకటేశ్వర స్వామి దేవాలయం కూడా ఉంది. నా ఆసక్తి ఇక్కడితో ముగియలేదు. టెక్సాస్ రాష్ట్రంలో ఎన్ని దేవాలయాలు ఎక్కడెక్కడ ఇన్నాయో తెలుసుకుందామని గూగులమ్మని ఆశ్రయించాను. డాలస్, హూస్టన్, ఆస్టిన్, శాన్ ఆంటారియో నగరాలు, ఇతర చిన్న పట్టణాలలో దాదాపు 80 వరకు దేవాలయాలు నిర్మించినట్టు తెలిసి ఆశ్చర్యపోయాను. ఒక్క టెక్సాస్ రాష్ట్రంలోనే ఇన్ని దేవాలయాలు ఉంటే అమెరికా అంతటా ఎన్ని ఉన్నాయో తెలుసుకుందామని అనిపించింది. మళ్ళీ గూగులమ్మను ఆశ్రయించాను. అమెరికాలో 50 రాష్ట్రాలలో 900 పైగా హిందూ దేవాలయాలు ఉన్నట్టు గూగులమ్మ తెలియపరచింది. అమెరికాలో హిందూ దేవాలయాల నిర్మాణం ఎప్పుడు ప్రారంభం అయ్యింది.. ఈ చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేశాను.

ఆద్యుడు స్వామీ వివేకానంద :

1890లో చికాగో నగరంలో సర్వ మత సమ్మేళనం (Parliament of World’s Religions) జరిగినప్పుడు హిందూ మత ప్రతినిధిగా స్వామి వివేకానంద చేసిన ప్రసంగం అందరికీ చిరపరిచితమే. ఆయన ఉపన్యాసం ఫలప్రదం అయిన తర్వాత న్యూయార్క్‌లో, శాన్ ఫ్రాన్సీస్కొ నగరాల్లో వేదాంత సొసైటీలను ఏర్పాటు చేసినాడు. వేదాంతా సొసైటీ 1905లో మొదటి హిందూ దేవాలయాన్ని శాన్ ఫ్రాన్సీస్కొ నగరంలో నిర్మించినారు. ఆ తర్వాత 1930, 40 దశకాల్లో బోస్టన్, లాస్ ఏంజిల్స్, పోర్ట్ ల్యాండ్, చికాగో, సెయింట్ లూయిస్, సియాటిల్ నగరాల్లో కూడా వేదాంత సొసైటీలు ఏర్పాటు అయినాయి. ఆనాడు ఈ సొసైటీలలో సభ్యుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ రాబోయే కాలంలో దేవాలయాల నిర్మాణానికి ఈ సొసైటీల ఏర్పాటు దోహదం చేసిందని చెప్పాలి. మొదట మెడిటేషన్, యోగా శిక్షణ ఇవ్వడం జరిగేది. వాటికి భారతీయులే కాక అమెరికన్లు కూడా హాజరు అయ్యేవారు. 1920 లో జరిగిన ఒక హిందూ మత సమ్మేళనానికి హాజరైన పరమహంస యోగానంద అమెరికాలో Self Realization Fellowship పేరుతో అమెరికాలో అనేక యోగా, మెడిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసినాడు. ఆయన ఆత్మ కథ ‘Autobiography of a Yogi’ అమెరికాలో బాగా అమ్ముడుపోయిన పుస్తకం. 1950 నాటికి వీరి సంస్థలు అమెరికాలో హిందూ మత సంస్థల్లో కెల్లా అతి పెద్ద నెట్‌వర్క్ కలిగిన సంస్థగా ఎదిగింది. 1950లో కాలిఫోర్నియా రాష్ట్రంలో ఈ సంస్థ అంతర్జాతీయ కేంద్ర స్థానం ఏర్పాటు చేశారు. 1960, 70 దశకాల్లో ప్రత్యామ్నాయ ఆధ్యాత్మిక భావనలకు అమెరికాలో మంచి ప్రోత్సాహం లభించడంతో అనేక మంది స్వామీజీలు ఇండియా నుంచి అమెరికా వచ్చి తమ తమ ఆధ్యాత్మిక ప్రచార కేంద్రాలను ఏర్పాటు చేయడం ప్రారంభించారు. మహర్షి మహేష్ యోగి, భక్తి వేదాంత స్వామి ప్రభుపాద, స్వామి సచ్చిదానంద, స్వామి ముక్తానంద, రజనీష్ తదితరులు అమెరికాలో ఆశ్రమాలు, దేవాలయాలు నిర్మించడం ప్రారంభించారు. అవి ఈనాటికీ కొనసాగుతున్నాయి. రజనీష్ ఆశ్రమం మాత్రం మూత పడింది. అదనంగా 1965లో వచ్చిన అమెరికా ఇమ్మిగ్రేషన్ & నేషనాలిటి చట్టంలో అనేక సరళతరమైన మార్పుల కారణంగా భారత్ నుంచి అమెరికాకు పెద్ద ఎత్తున వలసలు ప్రారంభమైనాయి. ఈ వలసల కారణంగా భారత సంతతి జనాభా బాగా పెరిగింది. వారి దైవ భక్తికి, ఆధ్యాత్మిక అవసరాలను తీర్చడానికి అమెరికాలో వందల సంఖ్యలో దేవాలయాల నిర్మాణం జరిగిందని భావించాలి. దసరా, దీపావళి, సంక్రాంతి, హోలీ, ఉగాది, గణపతి, దేవీ నవరాత్రి తదితర హిందూ పండుగల నిర్వాహణ, ఇతర సాంస్కృతిక ఉత్సవాల కోసం ఈ దేవాలయాలు భారత సంతతికి బాగా ఉపయోగపడినాయి. దేవాలయాలే కాదు అమెరికాలో వందల సంఖ్యలో మసీదులు, గురుద్వారాలు కూడా ఉన్నాయి. అమెరికాలో మెజారిటీ ప్రజలు క్రైస్తవులు కనుక చర్చీలు యూరప్ వలసవాదుల కాలం నుంచి నిర్మాణం అవుతూనే ఉన్నాయి.

భారత సంతతి సమాజాల చొరవ :

భారత్ నుంచి వలసపోయిన అన్ని రాష్ట్రాల ప్రజలు సంస్థలు, సంఘాలు ఏర్పాటు చేసుకున్నారు. బెంగాలీ, గుజరాతీ, ఒడియా, పంజాబీ, మరాఠీ, తమిళ, కన్నడ, తెలుగు భాషీయుల సమాజాలు అమెరికాలో ఉన్నాయి. వారి పూజాదిక అవసరాలు తీర్చడానికి వైదిక బ్రాహ్మణులు కూడా అమెరికాకు పెద్ద సంఖ్యలో వలస వెళ్ళినారు. 1970 నాటికి అట్లాంటా, బోస్టన్, చికాగో, డెట్రాయిట్, హూస్టన్, లాస్ ఏంజిల్స్, న్యూయార్క్, పిట్స్‌బర్గ్, శాన్ ఫ్రాన్సీస్కొ, వాషింగ్టన్ డి సి తదితర అమెరికా మెట్రో నగరాల్లో దేవాలయాలు నిర్మాణం అయినాయి. పిట్స్‌బర్గ్‌లో నిర్మించిన వేంకటేశ్వర స్వామి దేవాలయం అమెరికాలో ప్రసిద్ధి పొందిన దేవాలయం. 1977 జూన్‌లో ఈ దేవాలయాన్ని ప్రజల కోసం తెరిచారు.

పిట్స్‌బర్గ్ లో వేంకటేశ్వర స్వామి దేవాలయం
అట్లాంటా లో హిందూ దేవాలయం
స్వామీ నారాయణ్ దేవాలాయం, లాస్ ఏంజిల్స్
రాధా మాధవ ధామ్, ఆస్టిన్

1980, 90 దశకాల్లో భారత సంతతి జనాభా ఇంకా పెరిగిపోవడంతో మరిన్ని మెట్రో నగరాల్లో దేవాలయాలు వెలసినాయి. 2022 లెక్కల ప్రకారం అమెరికాలో 50 రాష్ట్రాలలో 904 దేవాలయాలు ఉన్నట్టు లెక్క తేల్చారు. కొత్తవి నిర్మాణం అవుతున్నాయి. పాత వాటిని విస్తరించుకుంటున్నారు. ఫ్రిస్కొలో నేను చూసిన కార్యసిద్ధి హనుమాన్ దేవాలయం ఈ రకంగా విస్తరించిన దేవాలయమే. 21 వ శతాబ్దం ప్రారంభం నాటికి అమెరికాలో హిందూ దేవాలయం లేని నగరం, పట్టణం లేదంటే అతిశయోక్తి కాదు. ఈ దేవాలయాలలో పండుగలు, పెండ్లి కార్యాలు సామూహికంగా జరుపుకోవడానికి పెద్ద కమ్యూనిటి హాల్స్, డైనింగ్ హాల్స్, వంట గదులు పార్కింగ్ స్థలం.. ఇట్లా అన్నీ హంగులు కలిగి ఉన్నాయి. ఫ్రిస్కొ హనుమాన్ దేవాలయంలో కూడా ఇవన్నీ ఉన్నాయి. వేంకటేశ్వర స్వామి, గణపతి, హనుమాన్, షిర్డి సాయిబాబా లకు భక్తులు ఎక్కువ కాబట్టి ఈ దేవుళ్ళకు దేవాలయాలు కూడా ఎక్కువే. బెంగాలీ సమాజాలు కాళీ, దుర్గా మాతా దేవాలయాలు, కన్నడ సమాజాలు రాఘవేంద్ర స్వామి దేవాలయాలు నిర్మించినట్టు తెలుస్తున్నది. స్వామీ నారాయణ ట్రస్ట్ వారు అమెరికా వ్యాప్తంగా సత్య నారాయణ స్వామి దేవాలయాలు అనేకం నిర్మించినట్టు తెలుస్తున్నది.

భారతీయులు అమెరికాలో హాస్పిటల్స్, యూనివర్సిటీలు నెలకొల్పినారా ?

భారత సంతతి వారు అమెరికాలో దేవాలయాలను పెద్ద ఎత్తున నిర్మించడం గురించి తెలుసుకున్నాము. కానీ పెద్ద హాస్పిటళ్ళు, స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు ఏమైనా నిర్మించారా అని ఆసక్తితో వెళ్ళిన ప్రతీ చోటా చూసేవాడిని. మిత్రులను అడిగేవాడిని. గూగుల్‌లో కూడా వెతికాను. వాటికి సంబంధించిన సమాచారం మాత్రం దొరకలేదు. అయితే అమెరికన్ యూనివర్సిటీల్లో వేల సంఖ్యలో భారత విద్యార్థులు చదువుకుంటున్నారు. వందల సంఖ్యలో ప్రొఫెసర్లు, టీచర్లు ఈ స్కూళ్ళలో, కాలేజీల్లో, యూనివర్సిటీల్లో పని చేస్తున్నారు. మన విద్యార్థులే లేకపోతే అమెరికాలో యూనివర్సిటీలు మూత పడతాయి. పెద్ద ఎత్తున విస్తరించిన అమెరికా సర్వీస్ సెక్టార్‌లో పని చేయడానికి వర్క్ ఫోర్స్ ఈ యూనివర్సిటీల నుంచి సరఫరా అవుతారు. వీరిలో భారతీయులతో పాటూ చైనీయులు, ఇతర ఆసియా దేశస్థులు ఎక్కువగా ఉంటారు. అమెరికాలో ఉన్న పెద్ద కార్పొరేట్ కంపనీల సి.ఇ.ఒ.లు భారతీయులే కావడం గమనార్హం. జీవిక కోసం మన వారు చిన్న ప్రీ స్కూళ్ళు, మాంటిస్సోరిలు, డాన్స్ స్కూళ్ళు, మ్యూజిక్ స్కూళ్ళు నడపడం కనిపించింది. భారతీయ డాక్టర్లు చాలా మంది క్లినిక్‌లు నడుపుతున్నారు. లాయర్లు లా ఫర్మ్ లు నడుపుతున్నారు. రెస్టారెంట్‌లు, షాపింగ్ మాల్స్ నిర్వహిస్తున్నారు. కానీ పెద్ద ఎత్తున కార్పొరేట్ స్థాయిలో హాస్పిటల్స్, యూనివర్సిటీలు, కాలేజీలు నడుపుతున్నారా? ఇది పరిశోదించ వలసిన అంశం.

అమెరికాలో భారతీయులు దేన్నీ వదులుకోలేదు :

ఒక విషయం గమనించినదేమిటంటే.. భారతీయులు కులం, మతం సహా తమ సాంస్కృతిక అస్తిత్వాన్ని దేన్నీ వదులుకోలేదు. ఇల్లు కట్టుకుంటున్నప్పుడు వాస్తు చూసుకుంటున్నారు, పెండ్లి సంబంధాలు చూసేటప్పుడు కులం, జాతకాలు చూసుకుంటున్నారు. పిల్లలు వీటిని ధిక్కరించి అమ్మాయిలను, అబ్బాయిలను వెతుక్కున్నప్పడు ఒప్పుకోక తప్పడం లేదు. ఇవి అరుదుగా జరిగే సంఘటనలు. గృహ ప్రవేశాలు సాంప్రదాయబద్దంగా చేసుకుంటారు. సత్యనారాయణ వ్రతాలు చేసుకుంటారు. ఒకటని కాదు వారి జీవితంలో అన్నీ ఉంటాయి.

వచ్చే వారం అమెరికాలో నేను గమనించిన సామాజిక జీవితం గురించి..

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version