Site icon Sanchika

అమెరికా ముచ్చట్లు-5

[box type=’note’ fontsize=’16’] తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల శాఖలో ఓఎస్‌డిగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ శ్రీధర్ రావు దేశ్‌పాండే తమ అమెరికా యాత్ర విశేషాలు సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]

అద్భుతమైన గ్రాండ్ కాన్యాన్ పర్వత శ్రేణులు

[dropcap]ఆ[/dropcap]రిజోనా రాష్ట్రంలో ఉన్న గ్రాండ్ కాన్యాన్ (Grand Canyon) అని పిలువబడే కొలరాడో నదీ లోయ ప్రాంతంలో కూడా అమెరికా ఫెడరల్ ప్రభుత్వం వాలాపై (Hualapai) జాతికి చెందిన స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ‘వాలాపై నేషన్’ను  (Hualapai Nation) 1883లో ఏర్పాటు చేసింది. అక్కడకి చేరగానే Welcome to Hualapai Nation అని ఆహ్వానం పలుకుతారు. అక్కడ మూడు జెండాలు ఎగరడం కనిపించింది. ఎత్తున అమెరికా ఫెడరల్ జెండా, మధ్యలో వాలాపై నేషన్ జెండా, చివరన ఆరిజోనా రాష్ట్ర  జెండా. 2900 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన వాలాపై నేషన్ ప్రాంతంలో నమోదు చేసుకున్న మొత్తం జనాబా 2300. ప్రస్తుతం ఆ ప్రాంతంలో నివసిస్తున్నవారు సుమారు 1350.

గ్రాండ్ కాన్యాన్ పర్వత శ్రేణులు కొలరాడో నదీ లోయలో 50, 60 లక్షల సంవత్సరాల క్రితం అద్భుతమైన ఎర్రటి రాళ్ళతో నిర్మితమైనవి. 3 వేల అడుగుల లోతున ఈ రాతి కొండల నడుమ కొలరాడో నది ప్రవహిస్తుంది.

గ్రాండ్ కాన్యాన్ లోయ వద్ద.. వెనుక గద్ద రూపంలో సహజ Rock formation

ఇక్కడ  గాజుతో నిర్మించిన ‘స్కై వాక్’ బ్రిడ్జి మీద నుంచి పర్యాటకులు గ్రాండ్ కాన్యాన్ అందాలను వీక్షిస్తారు. ఫోటోలు దిగుతారు. ఫోటోలు అక్కడి ఉద్యోగులు మాత్రమే తీస్తారు. వారంతా వాలాపై జాతికి చెందిన వారే. పర్యాటకం నుంచి వచ్చే ఆదాయం అంతా వాలాపై నేషన్‌కు చెందుతాయి. స్కై వాక్ బ్రిడ్జ్ మీదకు వెళ్ళే ముందు క్యూలైన్ గోడలపై వాలాపై జాతి ప్రజల చరిత్ర, వారి పోరాటాలు, వారు గతంలో ఉపయోగించిన వస్తువులు తదితర సామాగ్రిని, పోస్టర్లను ప్రదర్శనకు పెట్టారు. ఆ సమాచారం అంతటిని ఫోటోలలో బంధించాను. ఆసక్తితో చదివాను.

స్కై వాక్ బ్రిడ్జ్

గ్రాండ్ కాన్యాన్ వద్ద ఏర్పాటు చేసిన దుకాణంలో ‘I am The  Grand Canyon: The Story of the  Havasupai People’ అనే పుస్తకం నా దృష్టిని ఆకర్షించింది. ఆ పుస్తకాన్ని కొని చదివాను. అర్థం అయినది కొంచెం. అర్థం కానిది ఎక్కువ. బంగారం కోసం యూరోపియన్ల దాడులు, వారి చేతుల నుంచి జారిపోయిన భూమిని సాధించికోవడానికి వారి సుదీర్ఘ  పోరాట చరిత్ర ఈ పుస్తకంలో ఉన్నది.

గ్రాండ్ కాన్యాన్ వద్ద వాలాపై జాతి ప్రజలు వదిలేసిన ఊరుని (Deserted Village) సందర్శకుల కోసం కాపాడుతున్నారు. వారి గుడిసెలు, పశువుల కొట్టాలు, వంట పాత్రలు, వ్యవసాయ పనిముట్లు తదితర సామాగ్రి అక్కడ దర్శనమిస్తాయి.

వదిలేసిన గ్రామంలో గుడిసెలు

పర్యాటకులు వాటి ముందు, లోపల ఫోటోలు దిగి తమ జ్ఞాపకాలను భద్రపరచుకుంటారు. స్థానిక వాద్యాలతో వారి పాటలను కొందరు వినిపిస్తూ ఉంటారు. పర్యాటకం వారికి ప్రధాన ఆదాయ వనరు. గ్రాండ్ కాన్యాన్ ప్రకృతి అందాలను, వాలాపై జాతి ప్రజల గ్రామాలను వీక్షించడానికి ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు వస్తారు. పర్యాటకుల కోసం అమెరికా ప్రభుత్వం హెలికాప్టర్‌లను కూడా ఏర్పాటు చేసింది. ఆకాశంలో విహరిస్తూ గ్రాండ్ కాన్యాన్ పర్వత శ్రేణుల అందాలను వీక్షిస్తారు. అమెరికా అంతటా స్థానిక రెడ్ ఇండియన్ జాతుల గ్రామాలన్నీఇటువంటి పర్యాటక ప్రాంతాలుగా మారినాయి.

1970వ దశకంలో హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ హిట్ సినిమా ‘మెకన్నాస్ గోల్డ్’ షూటింగ్ ఇక్కడే జరిగిందని మిత్రుడు, విశ్రాంత చీఫ్ ఇంజనీర్ శ్రీ కొండపల్లి వేణుగోపాలరావు చెప్పాడు. హాలీవుడ్ కవ్ బాయ్ (Cow Boy) సినిమాలు చాలా మటుకు ఇక్కడే చిత్రీకరించారని హాలీవుడ్ చిత్ర సమీక్షకుడు, మిత్రుడు కె పి అశోక్ కుమార్ చెప్పారు.

వాలాపై నేషన్ కోర్టు హాల్

తెలంగాణ ఏర్పాటు అయిన ఏడేండ్ల తర్వాత ఇదంతా గుర్తు చేసుకోవడానికి పూర్వరంగం ఉన్నది. ఉద్యమ కాలంలో ప్రొఫెసర్ జయశంకర్ గారు అనేక సభల్లో చేసిన ప్రసంగాల్లో తరచుగా భాష సాంస్కృతిక పరాయీకరణ గురించి చెప్పేవారు. ఒక జాతి ఆర్థికంగా నష్టపోతే పుంజుకోవచ్చు. కానీ సాంస్కృతికంగా నష్టపోతే జాతి అస్తిత్వం కనుమరుగు అవుతుంది. తెలంగాణ ఏర్పాటు కాకపోతే మన భాష, సంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగు ఆవుతాయి. మన తర్వాతి తరం వారికి ఒకప్పుడు మనుగడలో ఉండిన  తెలంగాణను, మ్యూజియంలలో భద్రపరచిన మన బతుకమ్మను, మన బోనాలను, మన సాంస్కృతిక చిహ్నాలను చూపించుకోవలసిన దుస్థితి వస్తుంది.. అమెరికాలో రెడ్ ఇండియన్స్ లాగా. అట్లా మనం, మన సంస్కృతి మ్యూజియంలో వస్తువులుగా మారవద్దు అనుకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుందాం. ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ రాదు.. ఇట్లా సాగేవి ఆ ప్రసంగాలు. అయితే  ఆ దురవస్థ తెలంగాణకు పట్టకుండా తప్పిపోయింది. సమస్త తెలంగాణ సమాజం ఒక్క తాటిపై నిలబడి కలెబడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది. తెలంగాణ తన బాషా సాంస్కృతిక అస్తిత్వాన్ని సమున్నతంగా నిలబెట్టుకుంటూ పురోగమిస్తున్నది.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version