Site icon Sanchika

అమెరికా ముచ్చట్లు-7

[box type=’note’ fontsize=’16’] తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల శాఖలో ఓఎస్‌డిగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ శ్రీధర్ రావు దేశ్‌పాండే తమ అమెరికా యాత్ర విశేషాలు సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]

అమెరికాలో రైతు బజార్లు

[dropcap]ఇ[/dropcap]ర్వింగ్, మెకని, డెంటన్, ఫ్రిస్కో, ప్రిస్టన్.. తదితర డల్లాస్ నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతీ శనివారం రైతు బజార్లు ఏర్పాటు అవుతాయి. ఇవి ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నడుస్తాయి. అమెరికాలో అన్ని రాష్ట్రాలలో వేలాది రైతు బజార్ లను అమెరికా వ్యవసాయ శాఖ వారు ఏర్పాటు చేసినారు. నేను ఇర్వింగ్‌లో ఏర్పాటు అయిన ఇటువంటి ఒక రైతు బజార్‌ను 2019లో తొలిసారి సందర్శించాను.

ఇర్వింగ్ లో ఏర్పాటు అయిన రైతు బాజార్ , 2019 నాటి ఫోటో
ఇర్వింగ్ లో రైతు బజార్ (2019)

ఇప్పుడు 2022 లో ఫ్రిస్కో ఉన్న రైతు బజార్‌ను సందర్శించాను. మన ఊళ్ళల్లో, మన బస్తీల్లో వారం వారం జరిగే అంగడితో పోలిస్తే చాలా చిన్నదిగా అనిపించింది. ఒక 30, 40 టెంట్లు మాత్రమే ఉన్నాయి.

ఇక్కడ అమెరికాలో 50, 100 ఎకరాల రైతులు కూడా చిన్న సన్నకారు రైతుల కిందనే లెక్క. అమెరికాలో వ్యవసాయం ఒక పరిశ్రమ స్థాయిలో జరుగుతుంది. పెద్ద వ్యవసాయ కమతాలు అంటే 10 వేలు, 20 వేల ఎకరాల్లో కార్పొరేట్ సంస్థల అధీనంలో వ్యవసాయం సాగుతున్నది. పెద్ద పెద్ద ఫుడ్ ప్రొసెసింగ్ ఇండస్ట్రీస్, వాల్‌మార్ట్ లాంటి పెద్ద పెద్ద గొలుసు మార్కెట్లతో వీరికి టై అప్ ఉంటుంది. ఈలాంటి వారాంతపు రైతు బజార్లలో చిన్న రైతులు తమ ఉత్పత్తులను అమ్ముతారు.

మన అంగళ్లు జనంతో సందడిగా ఉంటవి. ఇక్కడ ఆ సందడి లేదు. వాల్‌మార్ట్ లాంటి పెద్ద మాల్స్‌లో మాత్రం జనమే జనం. అంతా కార్పొరేట్ మయం. ఈ రైతు బజార్లు సుడిగాలిలో దీపాల లాంటివి. ఇక్కడ వస్తువులు కొనే వాళ్ళు తమ అవసరాల కోసం కొంటారని నేను అనుకోవడం లేదు. ఇక్కడికి రావటం, వస్తువులు కొనటం ఒక ప్రోత్సాహక చర్యగా అనిపించింది. చిన్న మరియు స్థానిక రైతులను ప్రోత్సహించడం కోసమే ఈ రైతు బజార్లకు వస్తారని నాకు అనిపించింది. అదే ఊరిలో లేదా ఆ చుట్టూ పక్కల ఊళ్ళల్లో పండిస్తారు కనుక కూరగాయలు తాజాగా ఉంటాయి. కార్పొరేట్ మాల్స్ లలో ఉన్నట్లు ఫ్రిజ్ లలో వారాల తరబడి మురిగి ఉండవు. సీజనల్‌గా వచ్చే పండ్లు, ఫలాలు, తేనె, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు ఈ రైతు బజార్ లలో దొరుకుతాయి. చేతి వృత్తుల వారు, ఇతర కళాత్మక వస్తువులు కూడా అమ్ముతారు. వ్యవసాయ ఉత్పత్తులు దాదాపు ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా పండినవే ఈ రైతు బజార్లలో అమ్ముతారని ఇక్కడి జనం నమ్ముతారు. అమెరికా వ్యవసాయ శాఖ కూడా అదే విషయాన్ని ప్రచారం చేస్తున్నది.

ఫ్రిస్కో లో ఏర్పాటు అయిన రైతు బాజార్ , 2022

అమెరికా వ్యవసాయ శాఖ వారు ఈ రైతు బజార్లను బాగానే ప్రోత్సహిస్తున్నారు. అయితే మన రైతు బజార్లలో ప్రజల కొనుగోళ్లతో పోలిస్తే ఇక్కడి రైతు బజార్లలో కొనుగోళ్లు చాలా తక్కువ అనిపించింది. 2021 సంవత్సరంలో ఆగస్టు నెలలో అమెరికా వ్యవసాయ శాఖ ‘జాతీయ రైతు వారోత్సవం’ జరిపినారు. కరోనా వైరస్ వ్యాప్తి భయం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఈ రైతు వారోత్సవాన్ని నిర్వహించింది. అమెరికా వ్యవసాయ శాఖ జారీ చేసిన ఒక కరపత్రంలో రైతు బజార్లను కొనుగోలుదారులు ఎందుకు ఎంపిక చేసుకోవాలో వివరించారు.

  1. ఈ రైతు బజార్లలో రైతులు ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా పండించిన ఉత్పత్తులను మాత్రమే అమ్ముతారు. కృత్రిమ పద్ధతుల్లో పండ్లను పక్వానికి తెచ్చి అమ్మరు. ఉదాహరణకు మన బజార్లలో అమ్మే పండ్లను కార్బైడ్ ద్వారా పక్వానికి తీసుకొస్తారు. ఈ రైతు బజార్లలో ఆ రకమైన ఉత్పత్తులు అమ్మరు. అంటే సహజంగా, స్వచ్ఛంగా పక్వానికి వచ్చే పండ్లు ఫలాలు మాత్రమే ఇక్కడ అమ్మకానికి పెడతారు. స్థానిక రైతులు మాత్రమే ఈ మార్కెట్లలో అమ్ముతారు.
  2. సీజనల్‌గా వచ్చే పండ్లు, ఫలాలు ఇక్కడ అమ్ముతారు. ఎప్పుడో పండిన వాటిని కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టి పెద్ద పెద్ద మాల్స్‌లో లాగా అమ్మే వ్యవహారం ఇక్కడ ఉండదు. కాబట్టి ఫ్రెష్‌గా ఉండే ఉత్పత్తులను కొనడానికి ఇటువంటి రైతు బజార్లలలో మాత్రమే సాధ్యం అవుతుంది.
  3. స్థానిక రైతులకు మీ ప్రోత్సాహం అవసరం. ఇక్కడ ఉత్పత్తులను కొనడం ద్వారా దళారీలు లేకుండా నేరుగా రైతుల వద్దనే కొనుగోలు చేస్తారు. కాబట్టి రైతులు నేరుగా లాభపడతారు. రైతులకు కూడా జీవితం ఉంటుంది. వారికి కూడా కుటుంబాలు ఉంటాయి. వారిని ప్రోత్సహించడం ఒక సామాజిక బాధ్యత అని అమెరికా వ్యవసాయ శాఖ ప్రచారం చేస్తున్నది.
  4. రైతు బజార్లలో కొనుగోలు చేయడమంటే స్థానిక రైతు సమూహాన్ని కాపాడడంతో పాటు ఒక ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ప్రోత్సహించడం అవుతుందని వారు ఈ కరపత్రంలో పేర్కొన్నారు.

ఇట్లా స్థానిక రైతాంగాన్ని ప్రోత్సహించడానికి అమెరికా వ్యవసాయ శాఖ ఈ కరపత్రం జారీ చేసింది.అయితే వారు ఆశించిన ఫలితం వస్తున్నాయో లేదో తెలియదు. నేను చూసిన రైతు బజార్లో పెద్దగా కొనుగోలుదారులు పెద్దగా కనిపించలేదు.

మేము ఫ్రిస్కో రైతు బాజార్లో పెద్ద రకం టమాటాలు, మామిడి పండ్లు, ఆలుగడ్డలు, రత్నపురి గడ్డలు, తేనె, లావెండర్ సబ్బులు కొన్నాము. మా పెద్ద బిడ్డ గీతాంజలి ఫాదర్స్ డే సందర్భంగా నా కోసం ఒక హ్యాండ్ మేడ్ పేపర్ డైరీ కొన్నది. ఇవి కూడా ప్రోత్సాహకర కొనుగోళ్లే అని వేరే చెప్పవలసిన అవసరం లేదు.

ఫ్రిస్కోలో రైతు బాజార్ లో ఒక షాప్ (2022)

ముక్తాయింపు: ఒక దుకాణంలో ఒక పెద్ద మనిషి రకరకాల డిజైన్లలో హ్యాండ్‌మేడ్ సబ్బులు అమ్ముతున్నాడు. మా చిన్న బిడ్డ వెన్నెల నా కోసం ఒక సబ్బు సెలెక్ట్ చేసింది. “ఎవరి కోసం” అని అతడు అడిగాడు. “మా నాన్న కోసం” అని చెప్పింది. “రేపు ఫాదర్స్ డే కదా, ఫ్రీగా మీ నాన్నకు గిఫ్ట్” అని అన్నాడు. ఆయన సౌహార్ధానికి ఎంతగానో సంతోషించాము.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version